• facebook
  • whatsapp
  • telegram

గణిత శాస్త్ర బోధన విలువలు, ఉద్దేశాలు, లక్ష్యాలు

* నియత వ్యవస్థలో బోధనా కార్యక్రమంలో ముఖ్యంగా ఎదురయ్యే ప్రశ్నలు మూడు.
అవి: 1) ఏం బోధించాలి?
     2) ఎలా బోధించాలి?
     3) ఎందుకు బోధించాలి?
* ఏం బోధించాలి అనేది బోధించాల్సిన విషయాన్ని, ఎలా బోధించాలి అనేది బోధనా పద్ధతులను, ఎందుకు బోధించాలి అనేది బోధించిన విషయానికి చెందిన విలువలను, ఉద్దేశాలను, లక్ష్యాలను సూచిస్తుంది.
 

గణిత బోధన విలువలు:
* గణితశాస్త్ర బోధనకు ఉండే గ్రాహ్యశక్తులనే గణిత బోధన విలువలు అంటారు.
 

 గణిత విలువల వర్గీకరణ:
* గణితశాస్త్ర విలువలను వివిధ గణిత శాస్త్రజ్ఞులు విశాల దృక్పథంతో వివిధ రకాలుగా వర్గీకరించారు.
 

1. యంగ్ ప్రకారం విద్యా విలువలు:
i) గణిత ప్రయోజన విలువ
ii) ఒక చింతనా సరళిగా గణితం
iii) గణితం ఇతర విధులు

2. బ్రెస్లిచ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు:
i) అవగాహనలు
ii) నైపుణ్యాలు
iii) సమస్యలు - పద్ధతులు
iv) అభినందనలు
v) దృక్పథాలు
vi) అలవాట్లు
 

3. బ్లాక్ హార్‌స్ట్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు:
i) దృక్పథాలు
ii) భావనలు
iii) సమాచారం
 

4. స్కార్లింగ్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు:
i) దృక్పథాలు
ii) భావనలు
iii) సామర్థ్యాలు
iv) సమాచారం
 

5. మున్నిక్ వర్గీకరణ ప్రకారం విద్యా విలువలు:

i) ప్రయోజన విలువ
ii) సాంస్కృతిక విలువ
iii) సిద్ధపరిచే విలువ
iv) క్రమశిక్షణ విలువ
 

గణితశాస్త్ర బోధనా విలువలు:
1) ప్రయోజన విలువ
2) సిద్ధపరిచే విలువ
3) సాంస్కృతిక విలువ
4) క్రమశిక్షణ విలువ
5) కళాత్మక విలువ
6) మనోరంజక విలువ
7) అంతర్జాతీయ విలువ
8) సామాజిక విలువ
9) నైతిక విలువ
10) సమాచార విలువ
 

ప్రయోజన విలువ:
* సమాజంలో ఏ స్థాయికి చెందిన వ్యక్తికైనా, ఏ వృత్తికైనా, ఉద్యోగానికైనా గణితశాస్త్రం అవసరం.
* గణితానికి 'పొట్టపోషించుకునే విలువ' ఉంది.
* సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం.
* ఒక దేశాభివృద్ధి ఆ దేశ ప్రజల గణితజ్ఞానంపైనే ఆధారపడి ఉంటుంది.
* దేశాభివృద్ధిని సాధించగల గణిత సేవలు మరపురానివని నెపోలియన్ అన్నారు.
 

సిద్ధపరిచే విలువ:
* దీనికి మరొకపేరు సన్నాహపరిచే విలువ.
* ప్రాథమిక పాఠశాలలో బోధించే గణితం ప్రాథమికోన్నత పాఠశాల గణితానికి పునాదిగా ఉంటుంది.
 

సాంస్కృతిక విలువ:
* ఆధునిక నాగరికతకు గణితం అద్దం లాంటిదని బేకన్ అభిప్రాయపడ్డారు.
* స్మిత్ అభిప్రాయ ప్రకారం సాంస్కృతిక విలువ అంటే 'ఆధునిక మానవుడి కార్యకలాపాలైన వాణిజ్యం, పరిశ్రమలు, ప్రభుత్వ యంత్రాంగం లాంటి వాటన్నింటినీ గణితశాస్త్ర తర్కం ప్రకారం ప్రదర్శించడం'.
 

క్రమశిక్షణ విలువ:
* గణిత అధ్యయనం ఒక క్రమపద్ధతిని పెంపొందిస్తుంది.
* గణిత అధ్యయనంలో సమస్యాసాధనకు సరైన పద్ధతులను ఎంపిక చేయడం.
* సందర్భాన్ని అర్థం చేసుకొని, విశ్లేషణ చేయగలిగే సామర్థ్యం విద్యార్థుల్లో పెంపొందించడం.
* గణన, పరిమాణాత్మకం చేయడం, అంచనావేయడం, సమస్యా పరిష్కారం.
* హేతువాదంలో మానవుడి మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని 'లాక్' అన్నారు.
 

కళాత్మక విలువ:
* జ్యామితి బలీయమైంది. కళతో కలిస్తే దానికెదురులేదు - యూరిపిడిస్
* సంఖ్యలతో వ్యవహరిస్తుందని తెలియకుండా జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసమే సంగీతం - లైబ్నిజ్
* సంగీత వాయిద్యాల్లో శృతికి, గణితానికి మధ్య ఉండే సంబంధాన్ని మొదట కనుక్కున్న గణిత శాస్త్రజ్ఞుడు - పైథాగరస్
* పద్యరచనలో ఉపయోగించే యతిప్రాస నియమాల గణవిభజన, గణంలోని అక్షరాల కూర్పు గణిత నియమాలు పాటించాలి.
 

మనోరంజక విలువ:
* పజిల్స్, రీడిల్స్ సాధించడం.
* గణిత అమరికలు, నిర్మాణాలు, పరిసరాల్లో అమరికలు పరిశోధించడం.
* వ్యక్తుల రోజువారీ కార్యక్రమాల నుంచి ఉపశమింపజేసి వినోదాన్ని అందించడానికి గణితం ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

అంతర్జాతీయ విలువ:
* హిందూ - అరబిక్ సంఖ్యామానాన్ని ఉపయోగించడం; ప్రాథమిక పరిక్రియలైన సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారాలకు గుర్తులను వాడటం గణితంలో ఏకత్వానికి సాక్ష్యాలు.
* నిజ జీవితంలో, వివిధ శాస్త్రాల సాంకేతిక అభివృద్ధిలో గణితం కీలకమైంది.
 

సామాజిక విలువ:
* ఏ సమాజం లేదా దేశం గణితానికి ప్రాధాన్యం ఇస్తుందో ఆ దేశం అభివృద్ధి చెంది పురోభివృద్ధిని సాధిస్తుంది.
1. వ్యాపారం
2. స్టాక్ ఎక్స్ఛేంజ్
3. ఎగుమతులు - దిగుమతులు
4. ప్రసార సాధనాలు
5. శాస్త్ర సాంకేతిక పరిశోధనలు
6. గణితాభివృద్ధి సమాజ అభివృద్ధికి కారణం
* విజ్ఞాన శాస్త్రం, ప్రత్యేకంగా గణిత శాస్త్రంలో సాధించిన ప్రగతి ఒక జాతి ప్రగతిని ప్రతిఫలింపజేస్తుంది. - సి.జె. కేసర్
 

నైతిక విలువలు:
* గణిత అధ్యయనం ద్వారా విద్యార్థుల్లో నైతిక విలువలు అభివృద్ధి చెందుతాయి.
1. సార్వత్రిక సత్యం కోసం పాటుపడటం.
2. కచ్చితత్వం కోసం పాటుపడటం.
3. అంగీకరించిన నియమాలకు, సూత్రాలకు బద్ధుడై ఉండటం.
4. నిష్పక్షపాతం
5. నిజాయతీ
6. పట్టుదల
7. ఓర్పు
8. త్రికరణశుద్ధి
9. నిరాడంబరత
10. ఆలోచనలు, పనుల్లో హేతువాదం
 

సమాచార విలువ:
* సమాచార విలువను 'వృత్తాంత విలువ' అని కూడా అంటారు.
* జీవితంలో వివిధ సందర్భాల్లో చాలా విషయాలను గణిత పరిభాషలో చెబుతారు.
1. బంగారం ధర
2. ప్రజల సరాసరి జీవన సూచిక
3. రాష్ట్రంలో/దేశంలో సగటు వర్షపాతం
4. సెన్సెక్స్
5. విదేశీమారక ద్రవ్యం
6. పారిశ్రామిక వ్యవసాయ ఉత్పత్తులు
7. వాతావరణ వివరాలు
8. జనాభా లెక్కలు
9. భూ వివరాల సేకరణ (భూ విస్తీర్ణం)
10. పెంపుడు జంతువులు (పశుసంపద)
 

గణిత శాస్త్ర బోధన ఉద్దేశాలు
* గణిత బోధనా ఉద్దేశాలు 2 రకాలు.
1. సాధారణ ఉద్దేశాలు (General aims)
2. నిర్దిష్ట ఉద్దేశాలు (Specific aims)
 

సాధనా కాలాన్ని బట్టీ ఉద్దేశాలు 2 రకాలు
1. తక్షణ ఉద్దేశాలు (Immediate aims)
2. దూరస్థ ఉద్దేశాలు (Long term aims)
* గణిత బోధనోద్దేశాలు గణిత ఉపాధ్యాయుడు గణిత బోధనను ఎందుకు చేయాలో తెలసుకోవడానికి సహకరిస్తాయి.
 

1. ప్రయోజనోద్దేశం:
* విద్యార్థులు గణితాన్ని ప్రయోజనకరంగా ఉపయోగించినట్లయితే ఉన్నత దశకు చేరుకుంటారు.
* విద్యార్థులు వాస్తవాలను సంఖ్యల రూపంలో క్లుప్తంగా ఉపయోగించడంలో తమ ప్రతిభను చూపేలా గణిత విద్య ఉండాలి.
 

2. ఉదర పోషణోద్దేశం:
* ప్రతివ్యక్తి ఏ విద్యను నేర్చుకున్నప్పటికీ అది ప్రథమంగా ఉదరపోషణార్థమై ఉంటుంది. తదుపరి అది అతడి జీవన విధానాన్ని అభివృద్ధి పరిచేలా ఉంటుంది.
* వస్తువులను, దుస్తులను కొలవడం; డబ్బు, వస్తు సముదాయాన్ని లెక్కించడం అనేది గణితంతోనే సాధ్యమవుతుంది.
 

3. క్రమశిక్షణోద్దేశం:
* క్రమశిక్షణ అనేది శాంతియుత జీవనానికి చాలా ముఖ్యమైంది.
* క్రమశిక్షణ వల్ల విద్యార్థి తన పనులను స్వయంగా, సకాలంలో పూర్తి చేస్తాడు.
 

4. వృత్తిసంబంధమైన ఉద్దేశం:
* ఒకరిపై ఆధారపడకుండా స్వయంగా ఏదో ఒక వృత్తిని చేపట్టి రాణించాలంటే గణిత వినియోగం అవసరం.
* పాఠశాల స్థాయిలో విద్యార్థుల భావి జీవితానికి అవసరమైన అంశాలన్నింటినీ విద్యా ప్రణాళికలో కూర్చి పొందుపరిచారు.
 

5. జ్ఞానోద్దేశం:
* గణిత అభ్యసన ప్రక్రియ వల్ల తార్కిక ఆలోచన, విశ్లేషణా వివేచన, క్రమశిక్షణ లాంటివి అలవడుతాయి.
 

6. శీలోద్దేశం:
* గణిత అభ్యసనం వల్ల మంచి లక్షణాలైన క్రమశిక్షణ, నిర్మాణాత్మకత, క్రమసరళి అలవడుతుంది.
 

7. సాంస్కృతికోద్దేశం:
* గణితం సంస్కృతికి అద్దం లాంటిది - బేకన్
 

8. సన్నాహోద్దేశం:
* ఏ రంగానికైనా, ఏ కళకైనా, ప్రవృత్తికైనా విద్యార్థులను గణిత అభ్యసనం ద్వారా సమర్థంగా సన్నద్దులను చేయవచ్చు. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించే వీలు కల్పిస్తుంది.
 

ఉన్నస్థాయిలోని గణిత బోధనా ఉద్దేశాలు:

1) విద్యార్థుల్లో తర్కవివేచనా, విశ్లేషణా శక్తిని పెంపొందించడం.
2) గణిత శాస్త్ర బోధన ద్వారా రసానుభూతి, సౌందర్యానుభూతి, జ్ఞానానుభూతి, వ్యక్తిగత వికాసాలను కలగజేయడం.
3) విద్యార్థులను ఉత్పాదక (Productive), సృజనాత్మక (Creative), నిర్మాణాత్మక (Constructive) జీవితం గడపడానికి సిద్ధం చేయడం.
 

గణితశాస్త్ర బోధనా లక్ష్యాలు:
* ఒక ప్రత్యేక గణిత కోర్సును అధ్యయనం చేయడం వల్ల విద్యార్థుల్లో అభిలషించాల్సిన మార్పులే గణిత బోధనా లక్ష్యాలు.
* విద్యార్థుల ప్రవర్తన, పరివర్తనలను వివరించేవే గణిత బోధనా లక్ష్యాలు.
* ప్రతి యూనిట్‌కు, పాఠానికి లక్ష్యాలు మారతాయి.
* బోధనా లక్ష్యాలను రూపొందించడంలో కొన్ని నియమాలు పాటించాలని చెప్పిన విద్యావేత్త ఫ్రస్ట్.
 

బోధనా లక్ష్యాలను రూపొందించడంలో నియమాలు:
* బోధనా లక్ష్యాలను సంపూర్ణ వాక్యాలుగా రాయాలి.
* లక్ష్యాలు కచ్చితంగా, సృష్టంగా ఉండాలి.
* లక్ష్యాలు సాధించేవిగా, పరిశీలించేవిగా, కొలవదగినవిగా ఉండాలి.
 

బోధనా లక్ష్యాల ఉపయోగం:
* బోధన - అభ్యసన కార్యక్రమాలు రూపకల్పనకు, నిర్వహణకు
* ఆశించిన మార్పులు విద్యార్థుల్లో వచ్చిందీ, లేనిదీ పరీక్షించడానికి
* కార్యక్రమయుత అభ్యసనాన్ని తయారు చేయడానికి
* బోధనా లక్ష్యాలను స్పష్టీకరణలుగా విపులీకరించడానికి
 

స్పష్టీకరణ:
* విద్యార్థి అభ్యసనానుభవంతో పరస్పరం చర్య పొందే ముందు అతడి ప్రవర్తనలో వచ్చే కావాల్సిన మార్పే స్పష్టీకరణ.
* ప్రతి లక్ష్యానికి కొన్ని స్పష్టీకరణలు ఉంటాయి.
* ఇవి లక్ష్య సాధనకు సోపానాలు.
* లక్ష్యాల పరిధిని పరిమితం చేస్తాయి.
* వివిధ లక్ష్యాల మధ్య ఉండే తేడాలు తెలుసుకోవడానికి సహాయపడతాయి.
* పరీక్షాంశాలను తయారు చేయడంలో ఉపయోగపడతాయి.
1986లో డాక్టర్ బి.ఎస్. బ్లూమ్స్ టాక్సానమీ (Taxonomy) అనే పదం ఆధారంగా బోధనా లక్ష్యాలను శాస్త్రీయంగా 3 రకాలుగా వర్గీకరించారు.
1. జ్ఞానాత్మక రంగం
2. భావావేశ రంగం
3. మానసిక చలనాత్మక రంగం
 

జ్ఞానాత్మక రంగం
* ఈ రంగంలో లక్ష్యాలను వర్గీకరించినవారు బి.ఎస్. బ్లూమ్స్.
దీనిలోని లక్ష్యాలు:
1. జ్ఞానం
2. అవగాహన
3. వినియోగం
4. విశ్లేషణ
5. సంశ్లేషణ
6. మూల్యాంకనం
 

భావావేశ రంగం
* ఈ రంగంలో లక్ష్యాలను సూచించినవారు బి.ఎస్. బ్లూమ్స్, క్రాత్‌వోల్, మాసియా.
* ఈ రంగం వ్యక్తి పోకడలు, అభిరుచులు, దృక్పథాలు, విలువలకు సంబంధించింది.
దీనిలోని లక్ష్యాలు:
1. గ్రహించడం
2. ప్రతిస్పందించడం
3. విలువకట్టడం
4. వ్యవస్థీకరించడం
5. శీలస్థాపన (లాక్షణీకరణం)

మానసిక చలనాత్మక రంగం
* ఈ రంగంలో లక్ష్యాలను వర్గీకరించినవారు ఆర్.హెచ్. దవే, ఎలజబెత్ సింప్సన్.
దీనిలోని లక్ష్యాలు:
1. అనుకరణ
2. హస్తలాఘవం
3. సునిశితత్వం
4. ఉచ్చారణ
5. సహజత్వం
 

సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ - జ్ఞానాత్మక రంగం
* బ్లూమ్స్ విద్యార్థులైన ఎల్.డబ్ల్యూ.అండర్‌సన్, డి.ఆర్.క్రాత్‌వోల్ 2001లో ప్రచురించిన A Taxonomy for learning Teaching Assessing; A revision of Blooms Taxonomy of Educational Objectiviesలో సవరించిన బ్లూమ్ వర్గీకరణను పొందుపరిచారు.

* జ్ఞానాత్మక రంగంలోని అత్యున్నత స్థాయి లక్ష్యం మూల్యాంకనం.
* భావావేశ రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం శీలస్థాపన.
* మానసిక చలనాత్మక రంగంలో అత్యున్నత స్థాయి లక్ష్యం సహజీకరణం.
* సవరించిన వర్గీకరణలో అత్యున్నత స్థాయి లక్ష్యం సృష్టించడం/ఉత్పత్తి చేయడం.
 

గణిత బోధనా లక్ష్యాలు - స్పష్టీకరణలు
I. జ్ఞానాత్మక రంగం
జ్ఞానం:
* విద్యార్థి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు లాంటి వాటి యదార్థాల జ్ఞానాన్ని సముపార్జించుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
¤ విద్యార్థి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు లాంటి వాటి యదార్థాల జ్ఞానాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటాడు.
* విద్యార్థి గణిత పాఠ్య విషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు లాంటి వాటి యదార్థాల జ్ఞానాన్ని ఆయా సందర్భాల్లో గుర్తిస్తాడు.
 

అవగాహన:
* విద్యార్థి గణిత పాఠ్యవిషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నియమాలు లాంటి వాటి యదార్థాల జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* సొంత ఉదాహరణలు ఇస్తాడు.
* దోషాలను గుర్తించి, సరిచేస్తాడు.
* ప్రమాణానుగుణంగా వర్గీకరిస్తాడు.
* శాబ్దిక ప్రవచనాలను సాంకేతిక ప్రవచనాలుగా, సాంకేతిక ప్రవచనాలను శాబ్దిక ప్రవచనాలుగా అనువదిస్తాడు.
* దత్తాంశాల్లోని సన్నిహిత సంబంధాలను గుర్తిస్తాడు.
* ఫలితాలను అంచనావేస్తాడు.
* ఫలితాలను సరి చూస్తాడు.
* కావాల్సిన గుర్తును, సంఖ్యను, సూత్రాన్ని గణిత ప్రక్రియల్లో ప్రతిక్షేపిస్తాడు.
* విద్యార్థి సూత్రాలను సూచిస్తాడు.
 

వినియోగం:
* విద్యార్థి గణిత పాఠ్యవిషయానికి చెందిన పదాలు, భావనలు, ప్రక్రియలు, సిద్ధాంతాలు, సూత్రాలు, గుర్తులు, ధర్మాలు, నిమమాలు లాంటి వాటి యదార్థాల జ్ఞానాన్ని, అవగాహనను, నూతన పరిస్థితుల్లో, నిత్యజీవితంలో వినియోగిస్తాడు.
 

స్పష్టీకరణలు:
* విశ్లేషణ చేస్తాడు.
* సమస్యలోని దత్తాంశం, సారాంశాన్ని కనుక్కుంటాడు.
* పరస్పర సంబంధాలను స్థాపిస్తాడు.
* ఫలితాలు తెలియజేస్తాడు.
* ఏం జరుగుతుందో సూచిస్తాడు (ప్రాగుగ్తీకరించడం).
* నూతన పద్ధతులను సూచిస్తాడు.
* తగిన పద్ధతులను ఎంపిక చేస్తాడు.
* నూతన దత్తాంశాలను ప్రతిపాదిస్తాడు.
* అనుమితులను రాబడతాడు.
* దత్త వివరాల నుంచి సమాచారాన్ని ఊహిస్తాడు.
 

II. భావావేశ రంగం
1. అభిరుచి/అనురక్తి/ఆసక్తి/ (Interset):
లక్ష్యం:
విద్యార్థి గణితం పట్ల అభిలషణీయమైన ఆసక్తులను పెంపొందించుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి గణిత శాస్త్ర క్లబ్ వ్యాసక్తుల్లో చురుకుగా పాల్గొంటాడు.
* విద్యార్థి మాగజైన్‌లకు గణిత శాస్త్ర సంబంధమైన వ్యాసాలను, పజిల్స్‌ను సమకూరుస్తాడు.
* విద్యార్థి గణిత పత్రికలు, పుస్తకాలను అదనంగా చదువుతాడు.
* విద్యార్థి తీరిక సమయంలో గణిత సంబంధమైన వ్యాసక్తులతో మునిగి ఉంటాడు.
* విద్యార్థి స్క్రాప్ బుక్‌ను తయారు చేసుకుంటాడు.


శాస్త్రీయ వైఖరి (Scientific Attitude):
లక్ష్యం:
విద్యార్థి గణిత శాస్త్ర పఠనం ద్వారా శాస్త్రీయ వైఖరిని వృద్ధి చేసుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి శాస్త్రీయంగా అన్ని అంశాలను పరిశీలించనిదే లేదా పరీక్షించనిదే ఒక నిర్ణయానికి రాడు.
* విద్యార్థి తాను చేసిన తప్పును ఒప్పుకుంటాడు.
* విద్యార్థి కొత్త భావనలను, అంశాలను గ్రహించే విశాల మనస్తత్వాన్ని కలిగి ఉంటాడు.
 

అనుకూల వైఖరి (Positive Attitude):
లక్ష్యం:
విద్యార్థి గణితాభ్యసనం పట్ల అనుకూల వైఖరిని పెంపొందించుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి గణిత జ్ఞానాన్ని పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఇష్టపడతాడు.
* విద్యార్థి ఉత్తమ గణిత ఉపాధ్యాయులను, విద్యార్థులను కలుసుకోవడానికి ఇష్టపడతాడు.
 

అభినందన, ప్రశంసనీయత (Appreciation):
లక్ష్యం: విద్యార్థి వివిధ జ్ఞాన క్షేత్రాలు, జీవితంలో గణితశాస్త్ర సేవలను అభినందిస్తాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి గణిత శాస్త్ర జ్ఞానానికి శాస్త్రజ్ఞులు అందించిన సేవలను అభినందిస్తాడు.
* విద్యార్థి ప్రకృతిలో సౌష్ఠవ క్రమాలను పరిశీలించడం ద్వారా ఆనందాన్ని పొందుతాడు.
 

ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, పట్టుదల లక్షణాలు:
లక్ష్యం:
విద్యార్థి ఏకాగ్రత, ఆత్మ విశ్వాసం, పట్టుదల, కచ్చితత్వం లాంటి లక్షణాలను వృద్ధి చేసుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి తనకు ఎదురయ్యే అపజయాలకు అధైర్యపడడు.
* విద్యార్థి సమస్యను సాధించడంలో ఎదురయ్యే అడ్డంకులకు అధైర్యపడడు.
* విద్యార్థి కచ్చితత్వానికి పాటుపడతాడు.
 

III. మానసిక చలనాత్మక రంగం
చిత్రలేఖన నైపుణ్యం:
లక్ష్యం:
విద్యార్థి పటాలు, రేఖాచిత్రాలను గీయడంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* ఇచ్చిన కొలతలను బట్టి విద్యార్థి పటాలు, రేఖాచిత్రాలను గీస్తాడు.
* విద్యార్థి కచ్చితమైన స్వేచ్ఛా చిత్రాలను తగినంత వేగంగా, పరిశుభ్రంగా గీస్తాడు.
* విద్యార్థి పటాల్లోని దోషాలను సరిచేస్తాడు.
* విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు.
 

హస్తనిపుణత నైపుణ్యాలు:
లక్ష్యం:
విద్యార్థి పటాలు, రేఖాచిత్రాలను గీయడంలో నైపుణ్యాన్ని వృద్ధి చేసుకుంటాడు.
 

స్పష్టీకరణలు:
* విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు.
* విద్యార్థి కచ్చితంగా మాపనం చేస్తాడు.
* విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడు.
* విద్యార్థి పరికరాలను సరిగా ఉపయోగిస్తాడు.


పట్టికలను చదివే నైపుణ్యం
స్పష్టీకరణలు:

* విద్యార్థి సరైన పట్టికను ఎంపిక చేసుకుంటాడు.
* విద్యార్థి రీడింగ్‌ను సరిచూసుకుంటాడు.
 

గణిత నైపుణ్యం
స్పష్టీకరణలు:

* విద్యార్థి మౌఖిక గణనలను త్వరగా, తప్పులు లేకుండా చేస్తాడు.
* విద్యార్థి లిఖిత గణనలను త్వరగా, కచ్చితంగా, పరిశుభ్రంగా చేస్తాడు.
* విద్యార్థి సమస్యలను సాధించడంలో క్రమబద్ధంగా ఉంటాడు.
 

బ్లూమ్స్ వర్గీకరణ - గుణదోష పరీక్ష:
* నిర్దిష్ట లక్ష్యాల మొత్తానికి, అంతిమ లక్ష్యానికి ఎల్లవేళలా సమతౌల్యం సాధ్యం కాదని భావించినవారు మోర్స్ మాక్స్‌వింగో.
* విద్యార్థులు పాల్గొనే అంశాలకు, వారిలో ప్రవర్తనా మార్పును తీసుకొచ్చే అంశాలకు మాత్రమే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. కానీ పాఠ్యాంశానికి, లక్ష్య సాధనకు కాదని జాక్సన్ అభిప్రాయపడ్డారు.
* ఉపాధ్యాయులు చాలా వరకు లక్ష్యాలను మొక్కుబడిగా రాయడం, సాధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఉపాధ్యాయులు మనఃపూర్వకంగా ప్రయత్నం చేయడం లేదని భయాందోళలను వ్యక్తం చేసినవారు సాకెట్.
* వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదని ఆర్న్‌వెల్ తెలిపాడు.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - I

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌