• facebook
  • whatsapp
  • telegram

కార్యసాధక నిబంధనం

బ్యూరస్‌ ఫెడరిక్‌ స్కిన్నర్‌ అనే అమెరికా శాస్త్రవేత్త  ఎలుకలు, పావురాలు, మనుషులపై చేసిన ప్రయోగాలన్నీ మంచి ఫలితాలు అందించాయి. ఈ అనుభవాల ఫలితంగా ఏర్పడిందే కార్యక్రమయుత అభ్యసన సిద్ధాంతం. దీనికి విద్యావిధానంలో అధిక ప్రాధాన్యం లభించింది.

ఈయన రచించిన గ్రంథాలు:

1. Techonlogy of Teaching
2. The Behaviour of Organism
3. Beyond Freedom and Dignity

స్కిన్నర్‌ ప్రయోగ పరిశోధనలో రెండు రకాల ప్రవర్తనలను గుర్తించారు

1. నిర్గమాలు (Elicited)

ఒక జీవిలో ఒక ప్రత్యేకమైన ఉద్దీపన ద్వారా రాబట్టిన ప్రతిస్పందన ఇది. ఉదా: పావ్‌లోవ్‌ ప్రయోగం, థార్న్‌డైక్‌ ప్రయోగాల్లో ఒక ప్రత్యేక ఉద్దీపన ద్వారా రాబట్టిన ప్రతిస్పందన.


2. ఉద్గమాలు (Emitted)

ఈ ప్రవర్తన ఫలితాన్ని బట్టి జీవి తనకు తానుగా విడుదలవుతుంది.

ఉదా: స్కిన్నర్‌ ప్రయోగ ప్రారంభంలో ఉద్దీపన ప్రభావం లేకుండా బయటకు వదిలిన ప్రతిస్పందనలు

ప్రయోగం: స్కిన్నర్‌ ఆకలిగా ఉన్న ఎలుక/పావురాన్ని తను ప్రత్యేకంగా తయారుచేసిన అధునాతన స్కిన్నర్‌ పేటికలో (Skinner Box) ఉంచాడు.

ఎలుక/పావురం ఆహారాన్ని పొందాలంటే పేటికలో అమర్చిన మీటను (Lever) నొక్కవలసి ఉంటుంది. ఆ సందర్భంలో పేటికలో కనిపించకుండా అమర్చిన ఆహారం జీవి ముందుకు వెళ్తుంది.

స్కిన్నర్‌ బాక్స్‌లోని ఎలుక/పావురం మొదట నిష్క్రియాత్మకంగా ఏ పనిచేయకుండా ఉండి, కొంతసేపటి తర్వాత క్రియాత్మకంగా మారి, అటూ ఇటూ తిరుగుతూ యాదృచ్ఛికంగా మీటను నొక్కింది. ఫలితంగా తన ముందు పడిన ఆహారాన్ని తిని ఆకలి తీర్చుకుంది. మళ్లీ, మళ్లీ ఇదే పని చేయటం ద్వారా ఆహారం (ఫలితం) పొందింది. ఇందులో ఆహారానికి, మీటకు మధ్య నిబంధనం ఏర్పడింది. దీన్నే కార్యసాధక నిబంధనంగా పేర్కొంటారు. ఆహారం పొందిన తర్వాత మళ్లీ మళ్లీ మీటను నొక్కడం పునర్బలనం (Reinforcement) అవుతుంది. అంటే ఆహారం పొందటం అనే ప్రతిచర్య (Response) తర్వాత మీటను నొక్కడం అనే చర్య బలపడింది. అందువల్లనే ఈ సిద్ధాంతాన్ని ప్రతిస్పందన ఆధారిత (R-type) సిద్ధాంతం అంటారు.

పునర్బలనం - నియమాలు 

(Schedules of Reinforcement)


A) నిరంతర పునర్బలనం (Continuous Reinforcement Schedule)

ఒక కృత్యం నిర్వహించే సందర్భంలో అభ్యాసకుడు చూపే సరైన ప్రతి ప్రతిస్పందనకూ సరైన బహుమతి లేదా ప్రోత్సాహాన్ని ఇవ్వడం.

B) స్థిరకాల/ స్థిరాంతర వ్యవధి పునర్బలనం (Fixed Interval Reinforcement Schedule)

ఇందులో అభ్యాసకుడికి కృత్యాన్ని కల్పించి, నియమిత కాల వ్యవధిలో పునర్బలనం ఇవ్వడం.

C) స్థిర నిష్పత్తి పునర్బలనం (Fixed Ratio Reinforcement Schedule)

విద్యార్థికి కృత్యాన్ని కల్పించిన తర్వాత జీవి కృత్యంలో నిర్ణీత సంఖ్యలో ప్రతిస్పందనలను పూర్తిచేసిన తర్వాత పునర్బలనం ఇవ్వడం. ఈ పునర్బలనంలో కాలం కంటే పనికి ప్రాధాన్యం ఉంటుంది.

D) చరశీలతా పునర్బలనం (Variable Reinforcement Schedule)

అభ్యాసకుడికి కృత్యానంతరం అస్థిర కాలవ్యవధుల్లో, అస్థిర రకాలుగా పునర్బలనాలను కల్పించడం.


 

శాస్త్రీయ నిబంధనం కార్యసాధక నిబంధనం
ఉద్దీపన  ప్రతిస్పందన → నిబంధనం ప్రతిస్పందన   ఉద్దీపన → నిబంధనం
1. ఉద్దీపన ఆధారంగా జరిగే నిబంధనం 1. ప్రతిస్పందన ఆధారంగా జరిగే నిబంధనం
2. S-type నిబంధనం 2. R-type నిబంధనం
3. అభ్యసించే వారి పాత్ర నిష్క్రియాత్మకంగా ఉంటుంది 3. అభ్యసించే వారి పాత్ర క్రియాత్మకంగా ఉంటుంది
4. ఉద్దీపనకూ, ప్రతిస్పందనకు మధ్య బంధం ఏర్పడుతుంది. 4. ప్రతిస్పందన, ప్రతిఫలం మధ్య బంధం ఏర్పడుతుంది.
5. ఫలితం వచ్చినా రాకపోయినా పునర్బలనం ఇస్తారు. 5. ఫలితం వస్తేనే పునర్బలనం ఇస్తారు
6. జీవికి ఉద్దీపన ద్వారా ప్రతిస్పందన కలిగిస్తారు. ప్రతిస్పందనలను నిర్గమాలు (Elicited) అంటారు. 6. జీవికి ఉద్దీపన కల్పించకపోయినా బయటికి వదిలిన ప్రతిస్పందనలు (నిరుద్దీపనా ప్రతిస్పందనలు) ఉంటాయి వీటినే ఉద్గమాలు (Emitted) అంటారు
7. గంటకు, ఆహారానికి మధ్య సంసర్గం జరుగుతుంది (CS + UCS) 7. మీటను నొక్కడం, ఆహారం పొందడం మధ్య సంసర్గం జరుగుతుంది (CR + UCS)
8. ఇది నియత విద్యకు చెందిన అభ్యసనం 8. ఇది అనియత విద్యకు చెందిన అభ్యసనం
9. ఉపాధ్యాయ కేంద్రీకృత విధానంతో పోల్చవచ్చు 9. శిశు కేంద్రీకృత విద్యావిధానంతో పోల్చవచ్చు
10. థార్న్‌డైక్‌ సామీప్యతా నియమానికి సంబంధించింది 10. థార్న్‌డైక్‌ ఫలిత నియమానికి సంబంధించింది
11. ప్రవర్తన అంతర్గతమైంది 11. ప్రవర్తన బహిర్గతమైంది
12. బహిర్గత ప్రేరణ ఉంటుంది. 12. అంతర్గత ప్రేరణ ఉంటుంది


కార్యక్రమయుత అభ్యసనం 

(Programmed Learning)


కార్యసాధక నిబంధనం ద్వారా రూపొందిన కార్యక్రమయుత అభ్యసనం విద్యావిధానంలో ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఈ అభ్యసనాన్ని బోధనాయంత్రం అంటారు.

* 1926లో అమెరికాలోని ఓహియో (Ohio) విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్‌ఎల్‌ ప్రెస్సీ అనే శాస్త్రవేత్త బోధనా యంత్రాలను రూపొందించగా, దాన్ని బి.ఎఫ్‌ స్కిన్నర్‌ అభివృద్ధి చేశారు.

* ఈ అభ్యసనంలో విషయాంశాలను చిన్నచిన్న భాగాలుగా (Frames) విభజిస్తారు. ఇందులో విద్యార్థి స్వయంగా జవాబు సూచించే మీటను నొక్కితే అది సరైన జవాబు అయితే దానికి గణనలు లభిస్తాయి. ఇందులో విద్యార్థి స్వీయ అభ్యసనాన్ని పొందుతాడు. ఇది స్వీయ అభ్యసనానికి దారితీస్తుంది.

* తర్వాత విద్యార్థి తప్పులు లేకుండా సరిదిద్దుకోగలుగుతాడు. అభ్యాసకుడు తన వేగాన్ని గుర్తించి ముందుకు సాగుతాడు

* ఈ అభ్యసనంలో ‘Learning by doing’ అనే ప్రక్రియ ఉంటుంది.


మాదిరి ప్రశ్నలు


1. పాఠశాలకు శుభ్రంగా తయారై వచ్చిన అర్జున్, కార్తీక్‌ అనే విద్యార్థులను మీనాక్షి టీచర్‌ పొగిడారు. ఆ విద్యార్థులు ఈ పొగడ్తకు సంతోషపడి ప్రతిరోజూ శుభ్రంగా తయారై పాఠశాలకు రావడం అనేది ఏ అభ్యసనా సిద్ధాంత ఫలితం? 

1) శాస్త్రీయ నిబంధనం         2) కార్యసాధన నిబంధనం

3) యత్నదోష అభ్యసనం     4) అంతర్‌ దృష్టి లేదా గెస్టాల్ట్‌ అభ్యసనం

జ: కార్యసాధన నిబంధనం


2. ఒకటో తరగతిలో ప్రవేశం పొందిన చైతన్య, తేజస్విని అనే విద్యార్థులు తెలుగు అక్షరాలను నేర్చుకోవటానికి మొదట పలకలో అమర్చిన అక్షరమాల చట్రాన్ని ఇచ్చి, అందులోని అక్షరాలను స్వీయగుణంతో అభ్యసించడానికి ఉపాధ్యాయుడు అవకాశం కల్పించాడు. ఉపాధ్యాయుడు కింది ఏ అభ్యసనాన్ని అనుసరిస్తున్నట్లు భావించాలి?

1) బండూరా అభ్యసన సిద్ధాంతం                2) కోఫ్కా అభ్యసన సిద్ధాంతం

3) బి.ఎఫ్‌.స్కిన్నర్‌ అభ్యసన సిద్ధాంతం        4) థార్న్‌డైక్‌ అభ్యసన సిద్ధాంతం

జ: బి.ఎఫ్‌.స్కిన్నర్‌ అభ్యసన సిద్ధాంతం


3. కింది ప్రవచనాల్లో ఏది సత్యం? 

1) S-type నిబంధనం కంటే R-type నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది

2) R-type నిబంధనం కంటే  S-type నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది

3) S-type, R-type నిబంధనలు రెండింటిలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది

4) S-type, R-type నిబంధనలు రెండింటిలో జీవి నిష్క్రియాత్మకంగా ఉంటుంది

జ: S-type నిబంధనం కంటే R-type నిబంధనంలో జీవి క్రియాత్మకంగా ఉంటుంది


4. పాఠశాలలో ఉపాధ్యాయుడు ఇచ్చిన ఇంటిపనిని (Homework) పూర్తి చేసిన నితిన్, నిఖితలకు వాళ్ల నాన్న స్వీట్లను బహుమతిగా ఇచ్చాడు. దాని ఆధారంగా  ఈ పిల్లలు రోజూ పాఠశాల నుంచి ఇంటికి రాగానే హోమ్‌వర్క్‌ చేయడం అనేది దేనికి సంబంధించిన అంశం? 

1) సాంఘిక, సాంస్కృతిక అభ్యసనం            2)  సాంఘిక అభ్యసనం  

3) శాస్త్రీయ నిబంధనం                4) కార్యక్రమయుత అభ్యసనం

జ: కార్యక్రమయుత అభ్యసనం


5.  'Technology of Teaching’ గ్రంథకర్త ఎవరు?

1) నోమ్‌ఛోమ్‌స్కీ    2)  జీన్‌ పీయాజే    3) బి.ఎఫ్‌. స్కిన్నర్‌     4) ఎస్‌.ఎల్‌. ప్రెస్సీ

జ: బి.ఎఫ్‌. స్కిన్నర్‌


6. రోడ్డుదాటలేని శ్రావ్య అనే ఒకటో తరగతి బాలికను సాత్విక్, జనని అనే 5వ తరగతి పిల్లలు రోడ్డు దాటించడాన్ని గమనించిన ఉపాధ్యాయుడు తరగతిలో వారిని మెచ్చుకొన్నాడు. ఆ పొగడ్తతో పేరుపొందిన ఆ పిల్లలు అలాంటి పనులు చేయటం అలవాటు చేసుకోవడాన్ని ఏ అభ్యసనా సిద్ధాంతం ఆధారంగా వివరించవచ్చు?

1) యత్నదోష అభ్యసనం  2) శాస్త్రీయ నిబంధనం

3) అంతర్‌ దృష్టి అభ్యసనం  4) కార్యక్రమయుత నిబంధనం

జ: కార్యక్రమయుత నిబంధనం


7. కార్యక్రమయుత అభ్యసనంలో..

1)  స్వీయ అభ్యసనం జరుగుతుంది       2)  పర్యవేక్షితాభ్యసనం జరుగుతుంది

3) నిర్బంధ అభ్యసనం జరుగుతుంది      4) యాదృచ్ఛిక అభ్యసనం జరుగుతుంది

జ: స్వీయ అభ్యసనం జరుగుతుంది


8. కార్తీక్, కిరణ్మయి అనే విద్యార్థులు ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తున్నారు. సమాధానం ఇస్తున్న ప్రతిసారీ పునర్బలనాన్ని పొందితే ఇక్కడ జరిగే పునర్బలనం ఏది?

1) చరశీల పునర్బలనం      2) స్థిరకాల వ్యవధి పునర్బలనం

3) స్థిరనిష్పత్తి పునర్బలనం  4) నిరంతర పునర్బలనం

జ: నిరంతర పునర్బలనం


9. తేజేష్, దీపిక అనే విద్యార్థులు తరగతిలో తాము చూపిన నిష్పాదనకు ఉపాధ్యాయుడి నుంచి వారానికి మూడుసార్లు చాక్లెట్లు పొందుతున్నారు. ఇక్కడ కల్పించిన పునర్బలన నియమం?

1) స్థిరనిష్పత్తి పునర్బలనం          2)  స్థిరకాల వ్యవధి పునర్బలనం

3) చరశీల పునర్బలనం              4) నిరంతర పునర్బలనం

జ: స్థిరకాల వ్యవధి పునర్బలనం

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌