• facebook
  • whatsapp
  • telegram

పెడగోజీ 1 నుంచి 14 పాఠాలు

1. అభ్యసనం - అభ్యాసకుడితో దాని సంబంధం

* బోధనా ప్రక్రియ ఉపాధ్యాయుడిపరంగానూ, అభ్యసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగానూ జరగాలి.
* బోధనాభ్యసన ప్రక్రియ ఏకకాలంలో నిర్వహించగల ప్రక్రియ.
* విద్య ద్విధ్రువ ప్రక్రియ.
* ఉపాధ్యాయుడు  విద్యార్థి
* విద్యను ద్విధ్రువ ప్రక్రియగా పేర్కొన్నవారు - జాన్ ఆడమ్స్.
* విద్య ద్విధ్రువ ప్రక్రియ అనే భావనలో విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య ఉన్న సంబంధాన్ని సంక్షిప్తంగా వ్యక్తీకరించగా ఇందులో ఇంకా చేర్చాల్సిన అంశాలు మిగిలే ఉన్నాయి. ఇందులో ముఖ్యమైంది బోధనాంశం.
* విద్యావేత్తల మార్గదర్శనాన్ని, సూచనలను ఆధారం చేసుకుని ఉపాధ్యాయుడు కొన్ని బోధనా లక్ష్యాలను రచించుకుంటాడు. వాటినే విద్యార్థి కల్పించుకుంటాడు. కాబట్టి బోధన అనేది యాదృచ్ఛికంగా జరిగే పనికాదు.
జాన్ డ్యూయీ ప్రకారం విద్య త్రిధ్రువ ప్రక్రియ. అంటే సాంఘికం, సమాజం కూడా అభ్యసన ప్రక్రియలో భాగంగా ఉంటాయి.
* ఇందులో ఉపాధ్యాయుడు, విద్యార్థి, సమాజం కూడా కలసి ఉంటాయి. కాబట్టి ఇది సమగ్రమైన ప్రక్రియ.
         

* పూర్వ కాలంలో బోధన కేవలం ఉపాధ్యాయ కేంద్రంగా జరిగేది. కాబట్టి దండన అమల్లో ఉండి, విద్యార్థి ఆలోచనలకు తావు ఉండేది కాదు.
* ప్రస్తుతం విద్యావిధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. విద్య పూర్తిగా విద్యార్థి కేంద్రంగా మారిపోయింది. కాబట్టి ఉపాధ్యాయుడు విద్యార్థిని అర్థం చేసుకోవడమే అత్యంత ప్రధానం.


2. వివిధ సందర్భాల్లో అభ్యాసకులు 

  అభ్యాసకులకు సాంఘిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాల కల్పన
* జాన్ డ్యూయీ పాఠశాలను ఒక చిన్న మోతాదుల సమాజం (Miniature Society) గా 'Democracy and Education' అనే గ్రంథంలో పేర్కొన్నారు.
* పాఠశాలలో అనేక రకాలైన సామాజిక సంప్రదాయాలు జరుగుతాయి.
ఉదా: ఉపాధ్యాయుడు రాగానే విద్యార్థులు లేచి నిలబడటం.
          జాతీయ పండగలు జరపడం.
* పాఠశాల చర్యాత్మక సిద్ధాంతానికి అనుకూలంగా ఉండాలని ఈ సిద్ధాంత రూపశిల్పి అయిన 'వైగోటోస్కీ' (రష్యా) తెలిపారు.
* లియోస్టెల్, కాఫోర్డ్ ప్రకారం చర్యాత్మక సిద్ధాంతం ఒక చర్య వల్ల కలిగే వ్యక్తిగత అనుభవాల ఫలితంగా ఏ ప్రక్రియ ద్వారా జ్ఞానం ఆర్జించబడుతుందో తెలుపుతుంది.

* గణిత బోధనలో 'వైగోటోస్కీ' లాంటి నిర్మితివాదుల సాంఘిక, సాంస్కృతిక అంశాల ప్రభావాన్ని గురించి తొలిసారిగా తెలిపిన శాస్త్రవేత్త - 'కోబ్'.
* అభ్యసనంలో నాడీ సంబంధాలు, ప్రవర్తన గురించి తెలిపినవారు - ప్రవర్తనావాదులు.
* ఈ సంబంధాన్ని మరింత విస్తృతం చేసినవారు - జర్మన్ సమగ్రాకృతివాదులు.
* మానవ అభ్యసనాన్ని మానవీయ కోణం నుంచి పరిశీలించిన వ్యక్తి ఆల్బర్ట్ బండూరా (సాంఘిక అభ్యసన సిద్ధాంతంలో)
* వైగోట్‌స్కీ సమాజంలోని వ్యక్తులు శిశువుతో పరస్పర ప్రతిచర్యలు జరపడం వల్ల మాత్రమే భాష ఏర్పడుతుందని, తద్వారా జ్ఞానం విస్తృతమవుతుందని పేర్కొన్నారు.

 

సామాజిక - రాజకీయ - సాంస్కృతిక పరిస్థితుల కల్పనకు సూచనలు:
     1) తరగతిని గ్రూపులుగా విడగొట్టడం
     2) పనులను గ్రూపులకు అప్పగించడం
     3) వృత్తి నిపుణతతో విద్యార్థులకు సంబంధాన్ని ఏర్పరచడం
     4) సాంస్కృతిక వనరులను పూర్తిగా వినియోగించుకోవడం
     5) మాక్ పార్లమెంటు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలను పాఠశాలలో నిర్వహించడం.

 

3. ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య (CWSN) 

     ప్రత్యేక అవసరాలు గల పిల్లల అవసరాలను అనుసరించి అందించే విద్యను ప్రత్యేక విద్య అంటారు. ఈ పిల్లలకు సాధారణ విద్యనందించడం ద్వారా వీరి అవసరాలను తీర్చలేం. కాబట్టి ఈ పిల్లల సామర్థ్యాలను గుర్తించి వాటిని తగిన శిక్షణ ద్వారా గరిష్ఠంగా అభివృద్ధిపరచడమే ప్రత్యేక విద్య లక్ష్యం.
ఉదా: దృష్టిలోపం గల వారికి బ్రెయిలీ లిపి ద్వారా విద్యనందించడం.
ప్రత్యేక విద్య పరిధి: ప్రత్యేక అవసరాలుగల పిల్లలను గుర్తించడం, వర్గీకరణం, వారి విద్యా అవసరాలను అంచనా వేయడం, మార్గదర్శకత్వం, పరిశోధన, ప్రత్యేక బోధనోపకరణాలు, ప్రత్యేక బోధనాపద్ధతులు ఉపయోగించడం లాంటివి చేపట్టడం.
కొఠారి కమిషన్: ప్రత్యేక విద్య అనేది కేవలం మానవత్వపు పునాదుల మీదనే కాకుండా దాని ప్రయోజనం ఆధారంగా రూపొందించడం జరగాలి.
ప్రత్యేక అవసరాలు గల పిల్లల వర్గీకరణ:
ప్రత్యేక అవసరాలు గల పిల్లలను డన్ (Dunn) అనే శాస్త్రవేత్త 12 రకాలుగా వర్గీకరించారు.
      1) ప్రతిభావంతులైన పిల్లలు
      2) విద్య నేర్వగల/ బోధించగల బుద్ధిమాంద్యులు
      3) తర్ఫీదు పొందగల బుద్ధిమాంద్యులు

      4) మానసిక/ సాంఘిక సమయోజనం లోపించినవారు
      5) భావోద్రేకం లోపించినవారు
      6) భాషణ లోపం గలవారు
      7) బధిరులు
      8) కొద్దిపాటి వినికిడి లోపం ఉన్నవారు
      9) దృష్టి లోపం ఉన్నవారు
      10) కొద్దిపాటి దృష్టిలోపం ఉన్నవారు
      11) అంగవైకల్యం ఉన్నవారు
      12) దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు
      పై వర్గాల్లో ఏవైనా రెండు లేదా అంతకంటే ఎక్కువ వర్గాలకు చెందిన వారిని బహుళ వైకల్యం గల వారిగా పేర్కొనవచ్చు. సాధారణంగా బుద్ధిమాంద్యం గల పిల్లలు ఎక్కువగా బహుళ వైకల్యం గలవారిగా ఉంటారు.

 

I. మానసిక వైకల్యం/ బుద్ధిమాంద్యులు (Mentally Retarded)
ప్రతి ఒక్కరిలో వయసుతో పాటు మానసికంగా వికాసం అభివృద్ధి చెందుతుంది. ఇలా కాకుండా శారీరక వికాసంతో పాటు మానసిక వికాసం అభివృద్ధి చెందక మందగించడమే మానసిక వైకల్యం అవుతుంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ మెంటల్ డెఫిషియెన్సీ ప్రకారం 70 పాయింట్ల ఐక్యూ కంటే తక్కువ గలవారు మానసిక వైకల్యం గలవారు. వీరిని 4 రకాలుగా వర్గీకరించవచ్చు.

      1) స్వల్ప బుద్ధిమాంద్యులు (ప్రజ్ఞ 50 నుంచి 70 మధ్య గలవారు)
      2) మిత బుద్ధిమాంద్యులు (30 నుంచి 50)
      3) తీవ్ర బుద్ధిమాంద్యులు (20 - 39)
           వీరిని సంరక్షకుల అవసరం గల మానసిక వికలాంగులు అంటారు.
      4) సంపూర్ణ బుద్ధిమాంద్యులు (20 కంటే తక్కువ)

 

ఎ) మానసిక వైకల్యానికి కారణాలు:
      1) జన్యుపరమైన లోపాలు
      2) మేనరిక వివాహాలు
      3) తల్లి ఎక్కువ వయసులో పిల్లలకు జన్మనివ్వడం
      4) పౌష్టికాహార లోపం
      5) అపరిపక్వ జననం


బి) బుద్ధిమాంద్యులు - విద్యా ప్రణాళిక:
      వీరికి బోధించే విద్య వారి వ్యక్తిగత, సాంఘిక, వృత్తిపర అభివృద్ధి కోసం ఉద్దేశించింది. దీన్ని కిర్క్, జాన్సన్ ప్రతిపాదించారు.
1. సమైక్య విధానం: స్వల్ప బుద్ధిమాంద్యం ఉన్నవారిని, ఇతర విద్యార్థులతోపాటు కలిపి సాధారణ పాఠశాలల్లో విద్యనభ్యసింపజేయడం.

2. ప్రత్యేక పాఠశాలలు: తీవ్ర, తర్ఫీదు ఇవ్వగల బుద్ధిమాంద్యులకు అవసరమైన ప్రత్యేక నైపుణ్యాల శిక్షణను, ప్రత్యేకంగా వారికోసం ఉద్దేశించిన పాఠశాలల్లో అందజేయడం.
3. ఆశ్రమ పాఠశాలలు: పాఠశాలలు, రవాణా సౌకర్యం లేని ప్రాంతాల్లో తీవ్ర బుద్ధిమాంద్యుల కోసం నెలకొల్పినవి.
4. గృహ శిక్షణ: చిన్న పిల్లల శిక్షణకు పాఠశాల అందుబాటులో లేని పరిస్థితిలో లేదా పాఠశాలకు తీసుకురాలేని పరిస్థితిలో వారి ఇంటివద్దే గృహ శిక్షణ పద్ధతిని ఉపయోగించవచ్చు.

 

సి. బుద్ధిమాంద్యుల ప్రవర్తనను అభివృద్ధిపరిచే పద్ధతులు:
1) ఆకృతీకరణ: బుద్ధిమాంద్యుల ప్రవర్తన ఒక నిర్దేశిత లక్ష్యాన్ని చేరే వరకు క్రమపద్ధతిలో పురోగమిస్తూ విజయవంతం అయిన వాటికి ప్రోత్సాహకాలను ఇస్తూ ముందుకు సాగే విధానం.
2) క్రమేణ అస్తిత్వం: నిర్దేశిత కార్యాన్ని విద్యార్థి చేసే వరకు సహాయాన్ని అందించి ఆ తర్వాత అతడి పురోగమనాన్ని బట్టి సహాయాన్ని తగ్గించడం.
3) సాధారణీకరణం: ఒక పరిస్థితిలో నేర్చుకున్న ప్రవర్తనను భవిష్యత్‌లో అవసరమైన నూతన పరిస్థితికి కూడా ఉపయోగించుకోవడం.
4) గొలుసు విధానం: ఆశించిన ప్రవర్తనను పొందడానికి చేపట్టాల్సిన కార్యాన్ని చిన్న చిన్న భాగాలుగా చేసి ఈ గొలుసు విధానాన్ని 2 రకాలుగా నిర్వహిస్తారు.

i) ఆరోహణ గొలుసు విధానం: ప్రతిస్పందనలను మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు కలుపుతూ బోధించడం.
* బుద్ధిమాంద్యులకు ఈ పద్ధతిని అధికంగా ఉపయోగిస్తారు.
ii) అవరోహణ గొలుసు విధానం: ప్రతిస్పందనలను చివరి మెట్టు నుంచి మొదటి మెట్టు వరకు వెనక్కి బోధించే విధానం.
5. ప్రమేయ కార్యక్రమాలు: బుద్ధిమాంద్యులకు మానసిక వికాసం కలిగించడానికి ఏర్పాటు చేసే కార్యక్రమాలనే ప్రమేయ కార్యక్రమాలంటారు.

 

II. దృష్టి వైకల్యం గల పిల్లలు
చూడగలిగే సామర్థ్యం లేకపోడమే అంధత్వం. ప్రపంచంలోనే మొదటిసారిగా 1784లో ప్యారిస్ నగరంలో 'సర్ వాలెంటిన్ హ్యూ' అనే వ్యక్తి అంధుల పాఠశాలను స్థాపించారు. అంగవైకల్యం ఉన్న వ్యక్తుల చట్టం (Persons with Disabilities Act - 1995) కింది లక్షణాలున్న వారిని అంధులుగా పేర్కొంది.
1) పూర్తిగా దృష్టి లోపం ఉండటం
2) దృష్టి స్పష్టత గరిష్ఠ సవరణల తర్వాత 20/ 200 లేదా 6/ 60 కంటే తక్కువ ఉండటం
3) దృష్టి క్షేత్ర కోణం 20 లేదా అంతకంటే తక్కువ ఉండటం
4) క్షీణదృష్టి ఉండటం.
* దృష్టి స్పష్టత 6/60 అంటే సాధారణ దృష్టి గల వ్యక్తి 60 మీటర్ల నుంచి చూడగలిగేదాన్ని దృష్టి లోపం గల వ్యక్తి 6 మీటర్ల దూరం నుంచి మాత్రమే చూడగలగడం.
* సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన రెండు కళ్లతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180º పరిధిలో చూస్తాడు. ఇదే దృష్టి క్షేత్రం దృష్టి కేంద్రం 20º పరిధికి మాత్రమే పరిమితమైతే ఆ స్థితిని అంధత్వంగా చెప్పవచ్చు.

 

దృష్టి వైకల్యం గల వారికి విద్యా ప్రణాళిక:
1) వీరికి ప్రత్యేక తరగతులు, సహపాఠ్యప్రణాళిక కార్యక్రమాలను నిర్వహించాలి.
2) నల్లబల్లపై రాసిన విషయాన్ని ఉపాధ్యాయుడు గట్టిగా చదవాలి.
3) నల్లబల్లపై అక్షరాలు పెద్దగా, స్పష్టంగా రాయాలి.
4) దృష్టి సంబంధ కృత్యాలు తక్కువగా ఉండాలి. సాధారణ పిల్లలతో పాటు పాక్షిక దృష్టి ఉన్న పిల్లల సాయం తీసుకుని కార్యక్రమాలను, కృత్యాలను ఏర్పాటు చేయాలి.
5) తరగతిలో వీరిని ముందు వరుసలో కూర్చోబెట్టాలి.

 

అంధులకు ప్రత్యేక విద్యా సూత్రాలు:
1) మూర్తత్వం: మూర్త అనుభవాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
2) స్వీయ కృత్యాలు: విద్యాభ్యాసంలో స్వీయ కృత్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రోత్సహించాలి.
3) ఏకీకృత బోధన: బాహ్య ఘటనలు, వస్తువుల మధ్య ఉండే సంబంధాన్ని ఏకీకృతం చేస్తూ అర్థమయ్యేలా బోధించాలి.
ఉదా: బల్లపై ఉన్న పుస్తకాన్ని తాకించి అర్థమయ్యేలా చేయడం.

4) విహార యాత్రలు: విహార యాత్రలు, మ్యూజియంలను దర్శింపజేయాలి. రేడియోల ద్వారా నూతన అనుభవాన్ని పెంపొందించాలి.
5) బ్రెయిలీ లిపి ద్వారా అభ్యసన కృత్యాలు కల్పించాలి. ఫ్రాన్స్ దేశానికి చెందిన లూయీ బ్రెయిల్ అంధుల కోసం ప్రత్యేకమైన ఆరు చుక్కల లిపిని రూపొందించారు.

 

III. శ్రవణ వైకల్యం గల పిల్లలు
       వికలాంగ వ్యక్తుల చట్టం (PWD Act 1995) ప్రకారం బాగా వినబడుతున్న చెవిలో 60 d BHL లేదా అంతకంటే ఎక్కువ లోపం ఉంటే వారిని వినికిడి లోపం గల వారిగా గుర్తిస్తారు. మన చెవులు కేవలం 50 నుంచి 70 డెసిబుల్స్ శబ్దాలను ఎలాంటి హాని లేకుంటే వినగలుగుతాయి. 90 నుంచి 120 డెసిబుల్స్ ఉన్న శబ్దాలు చెవులకు హాని చేస్తాయి.
విద్యా ప్రణాళిక:
1) విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఉపాధ్యాయుడు మౌఖిక, సంజ్ఞ, సమగ్ర సమాచార పద్ధతులను వాడాలి. అంటే తన పెదవుల కదలిక, ముఖ కవళికలు, శరీర భాషను పిల్లలు చూసి ఉపాధ్యాయుడి భావనలను అర్థం చేసుకునేలా ఉండాలి.
2) మెరుపులు, రంగులు ఉండే దృశ్యోపకరణాలు వాడాలి.

 

IV. చలన వైకల్యం గల పిల్లలు:
వ్యక్తిలో చలనశక్తి సంబంధిత సామర్థ్యం లేకపోవడాన్ని చలన వైకల్యం అంటారు.
చలన వైకల్య కారణాలు:
      1) జన్యుపరంగా సంక్రమించే 'వారసత్వ' సమస్యలు.
      2) పుట్టుకతోనే కొందరిలో వేళ్లు కలిసిపోవడం, ఎముకల లోపం, వంకర కాళ్లు మొదలైనవి.
      3) ఆహార లోపం వల్ల కూడా చలన సమస్యలు రావచ్చు.
మస్తిష్క పక్షవాతం సాధారణంగా నాలుగు రకాలుగా ఉంటుంది:
1. ఎథెటోసిస్: వీరు చలనాంగాలైన కాళ్లు, చేతులు, భుజాలు, నోరు ఇతర శరీర భాగాల్లో అసంకల్పిత కదలికల వల్ల సరిగ్గా నడవలేరు. వస్తువులను పట్టుకోలేరు. స్పష్టంగా మాట్లాడలేరు.
2. అటాక్సియా: వీరు సమావస్థ శక్తిని కోల్పోవడం వల్ల వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండి, ప్రాదేశిక సంబంధాలు తక్కువగా ఉంటాయి.
3. స్పాస్టిసిటీ: కండరాల్లో అసంకల్పిత ప్రతీకార చర్య ఉండటం వల్ల వీరి కండరాల కదలిక వారు నిర్ధేసించే విధంగా ఉండక, చేయిని ఒకవైపు చాపాలంటే అది మరోవైపు పోతుంది.
4. అనమ్యత: కండరాలు బిగుసుకోవడం వల్ల అవయవాలను సరిగ్గా కదల్చలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అటాక్సియా, స్పాస్టిసిటీ, అనమ్యత వల్ల మానసిక క్షయీకరణ, దృష్టి, శ్రవణ, వాక్కు లోపాలు కలగవచ్చు.

 

V. ప్రతిభావంతులు:
ఉన్నత మేధాశక్తి, విశిష్ట సామర్థ్యాలు ఉండే పిల్లలను ప్రతిభావంతులు అంటారు. గిఫ్టెడ్ అనే విధాన్ని మొదట 1869లో ఫ్రాన్సిస్ గాల్టన్ ఉపయోగించారు.
టెర్మన్: "ప్రజ్ఞా లబ్ధి 140 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవాళ్లు ప్రతిభావంతులు".

 

లక్షణాలు:
* పరిసరానుగుణ్యత
* అధిక చురుకుదనం
* అపారమైన స్మృతి
* సమస్య పరిష్కారంలో సహజత్వం
* తార్కిక కల్పనం, సమస్యా పరిష్కార శక్తి
* భావాలను త్వరగా గుర్తించడం
* ఉద్వేగంలో స్థిరత్వం కలిగి ఉండటం
* మంచి సాంఘిక సంబంధాలు కలిగి ఉండటం
* విద్యాపరంగా మంచి మార్కులు, పఠనాంశ ఆసక్తి, ప్రావీణ్యం చూపడం
* భిన్న అభిరుచులు, మంచి సర్దుబాటు చూపడం.

 

1. విద్యా ప్రణాళిక:
ఎంపిక: (Selection) ప్రత్యేకించిన విద్యా కార్యక్రమాలను అమలు చేయడానికి ముందు ప్రతిభావంతులను వివిధ మార్గాల ద్వారా ఎన్నుకోవాలి.

* ఉపాధ్యాయుల అభిప్రాయాలు
* కింది తరగతుల్లో వచ్చిన మార్కులు
* వారిలోని ప్రజ్ఞాలబ్ధి/ప్రతిభా లబ్ధి

 

2. పృథఃకరణం (Seggregation):
ప్రతిభావంతుల్లోని శక్తి సామర్థ్యాలను వెలికి తీయడానికి కింది కార్యక్రమాలను ఏర్పాటు చేయాలి.
* ప్రత్యేక తరగతి గతి ఏర్పాటు
* వారి అభిరుచుల ఆధారంగా ప్రత్యేక శిక్షణ ఇవ్వడం
* ప్రత్యేకమైన పాఠశాలల ఏర్పాటు.
ఉదా: జవహార్ నవోదయ విద్యాలయ
* ఎన్‌సీఈఆర్‌టీ నిర్వహించే టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్

 

3. త్వరణం (Acceleration):
త్వరణం: ప్రతిభావంతులు వారి సామర్థ్యానికి తగిన అభ్యాసనం కొనసాగించడానికి కింది పద్ధతులను కొనసాగించాలి.
* తక్కువ వయసులో బడిలో చేర్చడం
* డబుల్ ప్రమోషన్ ఇవ్వడం
* ప్రత్యేక కోర్సుల రూపకల్పన
* కొన్ని తరగతులను వదిలి వేయడం.

 

4. సంవృద్ధిమత్వం: పాఠశాలల్లో ప్రత్యేకమైన విద్యానుభువాల కల్పన.
* క్షేత్ర పర్యటనలు
* కంప్యూటర్ శిక్షణ
* హాబీ క్లబ్‌లు
* స్కూల్ మేగజైన్ పోటీలు
* రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలకు పంపడం.

 

5. బహుళరూప ప్రత్యేక విద్యాప్రణాళిక (Diversified Special Curriculum):
     పాఠ్యాంశాలతోపాటు పాఠ్యేతర కార్యక్రమాల్లో పాల్గొనేలా చేయడం.
ఉదా: ఇంటర్నెట్.

 

VI. అభ్యసనా వైకల్యం
      పిల్లల్లో వినడం, మాట్లాడటం, చదవడం, రాయడం లాంటి సామర్థ్యాల్లో వెనుకబాటుతనం చూపడమే అభ్యసనా వైకల్యం. ఈ వైకల్యాన్ని మన దేశంలో ప్రత్యేక వర్గాల కిందకు ఇంకా చేర్చలేదు. అభ్యాసన వైకల్యం అనే పదాన్ని 1963లో డాక్టర్ శామ్యూల్ కిర్క్ అనే మనో విజ్ఞానవేత్త ఉపయోగించారు.

అభ్యసన వైకల్యం - లక్షణాలు:
1) ఏకాగ్రత లోపం, అతి నిదానం
2) అక్షరాలను తిప్పిరాయడం, వాక్యాలను, పదాలను తిరగేసి చదవడం
3) ఆకారాలను, పరిమాణాలను, రంగుల భేదాలను గుర్తించలేకపోవడం
4) నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడటం
5) సమాచారం మెదడులో నిక్షిప్తమై ఉన్నప్పటికీ జ్ఞప్తికి తెచ్చుకోవడంలో ఇబ్బందిపడటం.

 

అభ్యసన వైకల్యం - రకాలు:
1. ఎ) డిస్‌లెక్సియా: ఇది గ్రీకు భాషా పదం. దీనర్థం పదాలను సరిగా ఉపయోగించలేకపోవడం. పాఠశాల విద్యార్థుల్లో ఇది 10% ఉంటుంది. ఈ సమస్య ఉన్న పిల్లలు చదవడంలోనూ, చదివింది అర్థం చేసుకోవడంలోనూ ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఐన్‌స్టీన్, ఎడిసన్ లాంటి ప్రముఖులు ఈ సమస్యతో బాధపడినవారే.
బి) అలెక్సియా: ముద్రిత భాషను చదవడం, రాయడంలో ఉండే పూర్తి అశక్తత.
2. ఎ) డిస్‌ఫేసియా: ఇతరులు వ్యక్తపరిచిన పదాలను అర్థం చేసుకోవడంలోనూ, తిరిగి వాటిని వ్యక్తపరచడంలోనూ సామర్థ్యం లేకపోవడం.
బి) అఫేసియా: ఇంగితాలను గ్రహించడంలోనూ, సక్రమంగా వాడటంలోనూ ఉండే పూర్తి అశక్తత.
3. ఎ) డిస్‌గ్రాఫియా: ఇది రాత సమస్య. ఈ వైకల్యం ఉన్నవారు రాయడంలో ఇబ్బంది పడతారు.
బి) అగ్రాఫియా: రాయడంలో పూర్తి అశక్తత.

4. ఎ) డిస్‌కాల్కులియా: ఇది గణితపర వైకల్యం. ఈ వైకల్యం ఉన్నవారు సంఖ్యలను వ్యక్తపరచడంలో, రాయడంలో, చతుర్విధ ప్రక్రియలు చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ఉదా: 21ని 12గా రాయడం
         308 అనే సంఖ్యను 38గా చదవడం.

 

అభ్యసన వైకల్యం - కారణాలు:
     అభ్యసన వైకల్యం అనేది మెదడు పనితీరులో లోపం వల్ల జరిగే ప్రక్రియ. ఇది ఒక స్థితే కాని వ్యాధి కాదు. ఈ పరిస్థితికి మూడు కారణాలు ఉన్నాయి.
1) ఆంగిక కారణాలు: మెదడు, వెన్నుపాము నిర్మాణం, వాటి పనితీరులో లోపం; శరీరంలో కొన్ని రకాల గ్రంథుల విషమ పరిస్థితి వల్ల సంక్రమించే హార్మోనుల ప్రభావం వల్ల కూడా అభ్యసన వైకల్యం ఏర్పడుతుంది.
2) జన్యుపరమైన కారణాలు: తల్లిదండ్రులు, పూర్వీకుల్లో ఎవరికైనా అభ్యసన వైకల్యం ఉన్నట్లయితే వారి పిల్లలో 20 శాతం మందికి ఈ సమస్యలు ఉండవచ్చని వైద్యుల అంచనా.
3) పరిసరాలు: గర్భిణుల మానసిక స్థితి, వారు తీసుకునే ఆహారం, మందులు, మత్తుపదార్థాలు, ధూమపానం వల్ల ఈ పరిస్థితి రావచ్చు.

 

అభ్యసన వైకల్యం గల వారికి విద్యా ప్రణాళిక:
* విద్యార్థులు వైయక్తిక భేదాలకు అనుకూలమైన కార్యక్రమాలు అమలు చేయాలి.
* తోటి విద్యార్థులతో పోల్చకుండా, అభినందనలు పంచాలి.
* నిరంతరం మార్గదర్శకత్వం కల్పించాలి.
* సాంఘిక నైపుణ్యాలు పెంపొందించేందుకు ఎన్‌సీసీ, ఎన్ఎస్ఎస్, ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
* పాఠ్యబోధనా సమయంలో వీరిపట్ల అధిక సహనాన్ని కలిగి ఉండాలి.

 

బహుళ ఇంద్రియ శిక్షణా పద్ధతి
      అభ్యసన వైకల్యం గలవారికి వీలైనన్ని ఎక్కువ ఇంద్రియాలు ఉపయోగించి బోధనాభ్యసన కృత్యాలు జరపాలి. ఇందులో భాగంగా ఉన్న అనేక అంశాల్లో VAKT పద్ధతి ముఖ్యమైంది. ఇందులో
V (Visual) దృష్టికి చెందింది
A (Auditory) వినికిడికి చెందింది
K (Kinaesthetic) ఇంద్రియనాడులకు చెందింది.
T (Tactile) స్పర్శకు చెందింది.
      ఈ నాలుగు అంశాలను తగిన విధంగా ఉపయోగించడం ద్వారా శిక్షణను కల్పించడమే బహుళ ఇంద్రియ పద్ధతి (VAKT) అంటారు.

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌