• facebook
  • whatsapp
  • telegram

అభ్యసనం 

 సృష్టిలో ప్రతి జీవికి జన్మతః ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేక శక్తులు, సహజాతాలు ఉంటాయి. ఈ లక్షణాలే జీవికి జీవితాంతం సరిపోవు. కాబట్టి జీవి పరిసరాలతో ప్రతిచర్యలు జరిపి ఇతర లక్షణాలను ఆర్జించుకోవడమే అభ్యసనం.
జీవిలో మార్పు రెండు రకాలుగా జరుగుతుంది.

         1) పెరుగుదల/ పరిపక్వత

         2) అనుభవం

పెరుగుదల వల్ల కలిగే మార్పు అభ్యసనం కాదు. కానీ అనుభవం వల్ల కలిగే ప్రతి మార్పు అభ్యసనం అవుతుంది. పెరుగుదల వల్ల మన శరీర సౌష్ఠవంలో కలిగే మార్పులు అభ్యసన ఫలితాలు కావు. ఈత, టైప్ రైటింగ్ లాంటివి అభ్యసన అనుభవాలు.
 

నిర్వచనాలు

1. హిల్‌గార్డ్: ''వ్యక్తిలో అంతర్గత ప్రవృత్తులకు, సహజమైన పరిణితికి తాత్కాలిక స్థితులతో నిమిత్తం లేకుండా ఏర్పడే దాదాపు స్థిరమైన ప్రవర్తనా మార్పు''.

2. హెర్జన్‌హాన్: ''అభ్యసనం అనేది ప్రవర్తనలో లేదా ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో ఇంచుమించు శాశ్వతమైన మార్పు. కొన్ని జబ్బులు, అలసట, మత్తు పదార్థాల వల్ల తాత్కాలికంగా శరీరంలో జరిగే మార్పుల వల్ల కాదు''.

3. డెస్సికో, క్రాఫర్డ్: ''అభ్యసనం అనేది పునర్బలనం చెందిన ఆచరణ వల్ల ప్రవర్తనారీతిలో ఏర్పడే దాదాపు శాశ్వత మార్పు''.

మర్ఫీ: ''పరిసర అవసరాలను ఎదుర్కొవడానికి వీలుగా వ్యక్తిలో కలిగే ప్రతి ప్రవర్తనా మార్పు''.

బోజ్: ''ప్రేరణ, ప్రతిచర్యల మధ్య దృఢమైన బంధాన్ని ఏర్పరిచే ప్రక్రియే అభ్యసనం''.

కింబ్లే: ''అభ్యసనం అనేది ప్రవర్తనా శక్తి సామర్థ్యంలో సర్వసాధారణమైన దాదాపు శాశ్వత మార్పు. ఇది పునర్బలనంతో కూడిన ఆచరణ వల్ల ఏర్పడుతుంది''.

ఎస్ఏకి మాత్రమే 

గేట్స్: ''అనుభవం, శిక్షణ ద్వారా జీవి ప్రవర్తనలో జరిగే పరివర్తనయే అభ్యసనం''.

కింబల్: ''పునర్బలనం, ఆచరణ ఫలితంగా జీవి ప్రవర్తనలో లేదా ప్రవర్తనా సామర్థ్యంలో ఏర్పడే సాపేక్ష శాశ్వతమైన మార్పు''.
 

అభ్యసనం - లక్షణాలు: 

* అభ్యసనం నిరంతర ప్రక్రియ, సార్వత్రికమైంది.

* గతిశీలమైంది.

* సంచిత స్వభావం గలది.

* గమ్య నిర్దేశకమైంది.

* వైయక్తికమైంది.

* బదలాయింపు జరిగే ప్రక్రియ. ఇది ధనాత్మకంగా లేదా రుణాత్మకంగా ఉండవచ్చు.

* జీవిలో పరిపక్వతను అభ్యసనం అనుసరిస్తుంది.

* అభ్యసనం చర్యాత్మక మానసిక ప్రక్రియ.

* అభ్యసనం ఒక ప్రక్రియ, ఫలితం కాదు.

* జీవిలోని అన్ని దశల్లో ఒకే రకంగా జరగదు.
 

అభ్యసనం కాని అంశాలు:

* జీవికి పుట్టుకతో వచ్చే ఆకలి, దప్పిక లాంటి సహజాతాలు.

* జీవి ప్రమేయం లేకుండా వాటంతటవే జరిగే అసంకల్పిత ప్రతీకార చర్యలు.

* జీవికి వయసుతో పాటు జరిగే పరిపక్వతా మార్పులు.

* ఎలాంటి ఆలోచన లేకుండా జరిగే గుడ్డి అనుకరణ (ఇంప్రింటింగ్).

* అనారోగ్యం, మత్తు పదార్థాల వాడకం, జబ్బు వల్ల కలిగే మార్పులు.
 

అభ్యసనం - సోపానాలు

1. జీవికి అవసరం ఏర్పడటం.

2. అవసరం ప్రేరణను కలిగించడం.

3. ప్రేరణతో ఎదురయ్యే అవరోధాలను అధిగమించడం.

4. చివరకు గమ్యం/ విజయం చేరడం.

అవసరాలు

వ్యక్తి మనుగడ, వికాసానికి సంబంధించిన కృత్య ప్రక్రియలను అవసరాలు అంటారు. పిల్లల్లో అవసరాలు రెండు రకాలు.

1. శారీరక అవసరాలు: ఇవి తీరకపోతే మానవ మనుగడ కష్టమవుతుంది.

ఉదా: గాలి, నీరు, నిద్ర, ఆహారం, ఆట, విశ్రాంతి, గృహం, దుస్తులు, లైంగిక ఉత్సుకత, మాతృక ఉత్సుకత.

2. మానసిక అవసరాలు: వ్యక్తి అభివృద్ధికి దోహదపడే అంశాలు.

ఉదా: భద్రత, ప్రేమ, స్వేచ్ఛ, సాధన, ఆత్మగౌరవం మొదలైనవి.

మానవతావాదానికి చెందిన అబ్రహాం మాస్లో మానవ జీవన విధానాన్ని పరిశీలించి అవసర అనుక్రమణ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇందులో వ్యక్తుల అవసరాలను వాటి తీవ్రతను బట్టి 5 రకాలుగా వర్గీకరించాడు.
 


           

అభ్యసన కారకాలు

అనుభవం లేదా శిక్షణ అనేవి అభ్యాసకుడిలో ప్రవర్తనా మార్పునకు కారణం. దీనిలో ముఖ్యమైనవి 3 అంశాలు

1. వ్యక్తిగత కారకాలు: అభ్యాసకుడి వ్యక్తిగత అంశాలు 2 రకాలు.

ఎ) శారీరక అంశాలు: వయసు, పరిపక్వత, లింగ భేదం, ఆరోగ్యం మొదలైనవి అభ్యసనాన్ని ప్రభావితం చేస్తాయి.

బి) మానసిక అంశాలు: అభ్యాసకుడి మానసిక ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ఇందులో సంసిద్ధత, ప్రేరణ, ప్రజ్ఞ, స్మృతి, అభిరుచి, వైఖరి మొదలైనవి ప్రధానమైనవి.

2. ఉపాధ్యాయ సంబంధిత కారకాలు: బోధించే ఉపాధ్యాయుడి ప్రవర్తన, మూర్తిమత్వం, ఆయన మూర్తిమత్వం ప్రధాన అంశాలు.

3. పరిసర కారక అంశాలు: ఇందులో కుటుంబం, పాఠశాల, సమాజం ప్రధానంగా ప్రభావితం చూపుతాయి.
 

అభ్యసనా సిద్ధాంతాలు 

అభ్యసన ప్రక్రియను వివరించడానికి కింది సిద్ధాంతాలు ఉన్నాయి.
I. ప్రవర్తనావాద/ సంసర్గవాద సిద్ధాంతాలు: (Behaviourism Theories)
1. యత్నదోష అభ్యసన సిద్ధాంతం - థార్న్‌డైక్
2. శాస్త్రీయ నిబంధనా సిద్ధాంతం - పావ్‌లోవ్
3. కార్యసాధక నిబంధనా సిద్ధాంతం - బి.ఎఫ్.స్కిన్నర్

II. నిర్మాణాత్మక సిద్ధాంతాలు: (Constructivism Theories)
1. సాంఘిక, సాంస్కృతిక అభ్యసనం - వైగాట్‌స్కీ
2. సంజ్ఞానాత్మక సిద్ధాంతం - పియాజే

 

III. గెస్టాల్ట్ సిద్ధాంతాలు (Gestalt Theories)
1. అంతర్‌దృష్టి అభ్యసనం - కోహెలర్
2. కోఫ్‌కా అభ్యసన సిద్ధాంతం

 

IV. పరిశీలనాభ్యసనం - ఆల్‌బర్ట్ బండూరా
సాంప్రదాయక నిబంధనం 

 ఉద్దీపనలకు జీవిలోని జ్ఞానేంద్రియాలు ప్రతిస్పందిస్తాయి అనే ప్రధాన ఉద్దేశంతో రష్యా దేశానికి చెందిన ఇవాన్ పావ్‌లోల్ అనే జంతు మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నిబంధిత ప్రతిక్రియా చర్యను సిద్ధాంతీకరించి శరీర ధర్మశాస్త్రం నుంచి మనోవిజ్ఞాన శాస్త్రానికి మళ్లించారు. ఈయన రాసిన గ్రంథాలు
       1. The Work of Digestive Glands
       2. Motivation and Personality

ప్రయోగం: ఆకలిగా ఉన్న కుక్కను పావ్‌లోవ్ ప్రయోగశాలలో కదలకుండా బంధించాడు. దాని నోటిలోని లాలాజల గ్రంథులకు ఒక రబ్బరు గొట్టాన్ని అమర్చి రెండో చివరను కొలజాడీలో ఉంచాడు. ఈ విధంగా కుక్క నోటి నుంచి ఎంత లాలాజలం ఊరుతోందో తెలుసుకున్నాడు. ఈ ప్రయోగాన్ని పావ్‌లోవ్ మూడు దశల్లో నిర్వహించాడు.
* మొదటి దశలో కుక్కకు ఆహారం ఇచ్చినప్పుడు (సహజ ఉద్దీపన) దాని నోటి నుంచి వచ్చిన లాలాజలం మాపనం చేశాడు.
* రెండో దశలో పావ్‌లోవ్ అసహజ ఉద్దీపనగా గంటను మోగించి వెంటనే ఆహారాన్ని అందించి లాలాజలాన్ని మాపనం చేశాడు. ఇలా అనేక పర్యాయాలు చేశాడు.
* మూడో దశలో గంటను మోగించగానే కుక్క లాలాజలం స్రవించింది. అంటే కుక్కకు ఆహారం ఇవ్వకుండానే గంట శబ్దానికి లాలాజలం స్రవించడాన్ని పావ్‌లోవ్ గమనించాడు.

నిబంధనా ప్రక్రియ:
I. ఆహారం                                     లాలాజలం
    (సహజ ఉద్దీపన/ UCS)                              సహజ ప్రతిస్పందన/ UCR
II. గంట              +   ఆహారం         లాలాజలం
    అసహజ ఉద్దీపన  +  సహజ ఉద్దీపన             (సహజ ప్రతిస్పందన/ UCR)
            CS                      UCS
III. గంట                                   లాలాజలం
        అసహజ ఉద్దీపన/ CS                           అసహజ ప్రతిస్పందన CR
       డ్రెవర్ ప్రకారం ఒక ఉద్దీపన లేదా వస్తువు లేదా పరిస్థితికి అంతకుముందు లేనటువంటి స్వభావసిద్ధం కాని ప్రతిస్పందనను వెలికితీయడాన్ని నిబంధనం అన్నారు.

నిబంధన నియమాలు/ సూత్రాలు:
1. పునర్బలన నియమం (Law of Reinforcement)

ఏదైనా ప్రవర్తన బలపడేందుకు లేదా అదే ప్రవర్తన మళ్లీ మళ్లీ ఏర్పడేలా చేసేదే పునర్బలనం. అంటే నిబంధిత ఉద్దీపనకు నిర్నిబంధిత ఉద్దీపనను మళ్లీ మళ్లీ జోడించడం వల్ల నిబంధిత ప్రతిస్పందనను బలపడేలా చేయడం.
ఉదా: గంట మోగించి ఆహారం ఇవ్వడం అనే ప్రక్రియలో ఆహారం అధికసార్లు ఇవ్వడం వల్ల గంట శబ్దానికి లాలాజలం ఊరడం అనే ప్రతిస్పందన ఏర్పడింది.
పిల్లల్లో మంచి అలవాట్లను పెంపొందించడానికి ఈ నియమం ఉపయోగపడుతుంది.

2. విరమణ/ విలుప్తీకరణం (Law of Extinction)
      నిబంధన ఏర్పడిన తర్వాత సహజ ఉద్దీపన లేకుండానే అసహజ ఉద్దీపనను ప్రయోగిస్తే కొన్నిసార్ల తర్వాత నిబంధిత ప్రతిస్పందన ఆగిపోతుంది. దీన్నే విరమణ అంటారు. ఈ ప్రయోగంలో గంట మోగించి ఆహారం ఇవ్వడం మానేస్తే మొదట కుక్క లాలాజలం స్రవించినప్పటికీ కొంత కాలానికి స్రవించకపోవడం.
ఉదా: * పిల్లల్లో అలవాట్లయిన వేళ్లు చీకడం (Thumb sucking) పక్క తడపడం (Bed wetting) లను క్రమంగా తగ్గించడానికి ఉపయోగించవచ్చు.
* పరీక్షల అనంతరం బహుమతులు ఇవ్వడం అలవాటు చేసిన తర్వాత కొంతకాలానికి బహుమతులివ్వడం మానేస్తే పరీక్షలకు విద్యార్థులు సక్రమంగా రాకపోవడం.

 

3. అయత్నసిద్ధ స్వాస్థ్యం: (Law of Spontaneous Recovery)
నిబంధనం ఏర్పడిన తర్వాత దాన్ని పూర్తిగా విరమింపజేయడం జరిగితే కొన్ని రోజులకు మళ్లీ నిబంధిత ఉద్దీపనకు, నిబంధిత ప్రతిస్పందన అప్రయత్నంగా రావడాన్నే అయత్నసిద్ధ స్వాస్థ్యం అంటారు. పావ్‌లోవ్ ప్రయోగంలో విరమణ అనంతరం యాదృచ్ఛికంగా గంట శబ్దం విన్న కుక్క అప్రయత్నంగా లాలాజలం స్రవించడం.
ఉదా: * 2016 నూతన సంవత్సరంలో 5/1/2016 వేయాల్సి వస్తే దాన్ని అప్రయత్నంగా 5/1/2015 అని వేయడం.
* తరగతిలో ఉపాధ్యాయురాలు హాజరు తీసుకునే క్రమంలో పిల్లలు గుడ్ మార్నింగ్ మేడమ్‌గా నిబంధన పడి... ఒకరోజు ఆ తరగతికి వేరొక ఉపాధ్యాయుడు వచ్చి హాజరు పలకమంటే గుడ్ మార్నింగ్ సార్ అని కాకుండా గుడ్ మార్నింగ్ మేడమ్ అని పలకడం.

4. సాధారణీకరణ నియమం (Law of Generalization):
ఒక అసహజ ఉద్దీపనకు అసహజ ప్రతిస్పందన వచ్చేలా నిబంధన జరిగిన తర్వాత అదే అసహజ ఉద్దీపనను పోలిన ఉద్దీపనలకు కూడా అసహజ ప్రతిస్పందన రావడం సామాన్యీకరణం అంటారు. జె.బి.వాట్సన్... ఆల్బర్ట్ అనే 11 నెలల శిశువుకు ఒక తెల్ల ఎలుకను (ఇది అసహజ ఉద్దీపన. ఎందుకంటే ఎలుకకు అందరూ భయపడరు కాబట్టి) చూపి బాలుడు ఆ ఎలుకను తాకే సందర్భంలో పెద్ద గంట శబ్దం (సహజ ఉద్దీపన) చేయడం ద్వారా ఎలుకలంటే భయం కల్పించాడు. తర్వాత ఆల్బర్ట్ తెల్లని వస్తువులు చూస్తే భయపడ్డాడు. అంటే శిశువు సామాన్యీకరణం చేసుకున్నాడు.
ఉదా: * గంట శబ్దానికి లాలాజలం ఇచ్చే కుక్క గంటను పోలిన ఎలక్ట్రిక్ బెల్, బజర్ శబ్దాలకు కూడా లాలాజలం స్రవించడం.
* పోలీసును చూసి భయపడిన దొంగ బస్సులోని కండక్టర్ ఖాకీ దుస్తులను చూసి కూడా భయపడటం.

 

5. విచక్షణ నియమం (Law of Discrimination):
అసహజ ఉద్దీపనకు, ఇతర ఉద్దీపనలకు తేడాను గ్రహించి అసహజ ఉద్దీపనకు మాత్రమే జీవి ప్రతిస్పందించడాన్ని విచక్షణ అంటారు. ఈ నియమాన్ని సక్రమంగా గుర్తించినట్లయితే ఉన్నత క్రమ నిబంధనం ఏర్పడుతుంది.
ఉదా: * కుక్కకు మొదట వలయాకారంలో ఉన్న రింగును చూపి ఆహారం పెట్టడం తర్వాత అండాకారంలో ఉన్న రింగ్‌ను చూపి ఏమీ పెట్టడం లేదు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత కుక్క వలయాకారంలోని రింగును చూసి లాలాజలం స్రవించింది. కానీ అండాకార రింగుకు స్రవించలేదు. అంటే కుక్క రెండు రింగుల మధ్య తేడాను గుర్తించగలిగింది.

* 4వ తరగతిలో గణిత ఉపాధ్యాయుడికి భయపడిన మోహిత్ అనే బాలుడు 5, 6వ తరగతుల్లోని గణిత ఉపాధ్యాయులను చూసి భయాన్ని వ్యక్తం చేయకపోవడం.
 

ఉన్నత క్రమ నిబంధనం (Higher Order Conditioning):
         ప్రయోగంలో మొదటిసారి ఉపయోగించిన అసహజ ఉద్దీపనను, మిగిలిన నిబంధన ప్రయోగాల్లో నిర్నిబంధిత ఉద్దీపనగా ఉపయోగించవచ్చని పావ్‌లోవ్ గుర్తించి రెండో ప్రయోగంలో గంట మోగడాన్నే సహజ ఉద్దీపనగా ఉపయోగించవచ్చని కింది విధంగా నిరూపించాడు.

 


 

* మొదటి క్రమ నిబంధనం చాలా బలంగా ఉంటేనే ఉన్నత క్రమ నిబంధనం ఏర్పడుతుంది.

ఉదా: * పోలీసును చూసి భయపడే దొంగ పోలీసు జీపును చూసి భయపడటం.
* వైద్యుడిని చూసి భయపడిన బాలుడు ఆస్పత్రిని కూడా చూసి భయపడటం.

 

విద్య - అనుప్రయుక్తాలు
   1. ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి రాగానే విద్యార్థులందరూ లేచి నిలబడటం.
   2. పాఠశాల వార్షికోత్సవ సమయంలో సంగీతానికి అనుగుణంగా బాలుడు నాట్యం చేయడం.
   3. సర్కస్‌లో సూచనలకు అనుకూలంగా జంతువులు విన్యాసం చేయడం.
   4. మనుషులకు, వస్తువులకు పేర్లను ఆపాదించడం.
   5. మన పండగలు, సంప్రదాయాలు.

 

కార్యసాధక నిబంధనా సిద్ధాంతం (Operant Conditioning Theory)
   బుర్‌హుస్ ఫ్రెడరిక్ స్కిన్నర్ ఉద్దీపనలు లేకపోయినా జీవి ప్రతిస్పందిస్తూ ఉంటుందనీ... ప్రతిస్పందనలకు తగిన పునర్బలనం లభించినప్పుడు ఆ ప్రతిచర్యలను మళ్లీ మళ్లీ చేయడంతో నూతన అభ్యసనం జరుగుతుందని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. స్కిన్నర్ ఆధునిక పరికరాలతో స్కిన్నర్ పేటిక (Skinner Box)ను తయారుచేసి ప్రయోగం ప్రారంభించాడు. అందుకే దీన్ని పరికరాత్మక అభ్యసనం అని కూడా అంటారు. ఈయన రాసిన గ్రంథాలు
   1. The Concept of the Reflex in the Description of Behaviour
   2. Technology of Teaching
   3. The Behaviour of Organism

ప్రయోగం:
   ఆకలిగా ఉన్న ఎలుకను/ పావురాన్ని తానే తయారుచేసిన స్కిన్నర్ పేటికలో ఉంచి, దానికి కనబడకుండా ఆహారాన్ని ఏర్పాటు చేశాడు. జీవి ఆహారం ఎలాగైనా పొందాలని పేటిక నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో తన శరీరంలోని ఒక భాగం పేటికలోని మీట (స్విచ్)కు తగలడంతో ఆహారం పేటికలోకి వస్తుంది. ఇలా ప్రతిసారి మీట కదిలినప్పుడు ఆహారం లభిస్తుందన్న విషయం గ్రహించి మీటను కదిలించి ఆహారం పొందడం నేర్చుకుంది. ఇందులో మీటను నొక్కడం (ప్రతిస్పందన), ఆహారం పొందడం (ఉద్దీపన) మధ్య సంసర్గం ఏర్పడింది. అందుకే ఈ సంసర్గం R - S నిబంధనంగా, ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యం ఉండటం వల్ల R - Type నిబంధనం అని కూడా అంటారు.
     మీట         మీటను నొక్కడం          ఆహారం        ఆహారం తినడం 
     CS        CR                       UCS         UCR

         (సంసర్గం = CR కు UCSకు మధ్య)
బి.ఎఫ్.స్కిన్నర్ రూపొందించిన కొన్ని సూత్రాలు ప్రవర్తనావాదాన్ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
1. తరగతి గది నిర్వహణకు ప్రతిపాదించిన పునర్బలన నియమాలు
2. కార్యక్రమయుత అభ్యసనం

1. పునర్బలన నియమాలు (Schedules of Reinforcement):
A. నిరంతర పునర్బలనం (Continuous Reinforcement Schedule):

జీవి కృత్యాన్ని నిర్వహించే సందర్భంలో జీవి చూపే సరైన ప్రతిస్పందనకు సరైన బహుమానాన్ని లేదా పునర్బలనాన్ని ఇవ్వడం.
ఉదా: తరగతి గదిలో పాఠం బోధించే సందర్భంలో ఉపాధ్యాయుడు అడిగే ప్రతి ప్రశ్నకు విద్యార్థి సరైన సమాధానమిస్తే వెంటనే పొగడటం/ పునర్బలనం ఇవ్వడం.

 

B. స్థిర కాలవ్యవధి పునర్బలనం (Fixed Interval Reinforcement Schedule): జీవికి కృత్యాన్ని కల్పించి నియమిత కాల వ్యవధిలో పునర్బలనం ఇస్తారు.
ఉదా: పునీత్ అనే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ పనిని ఇచ్చి... అతడికి క్రమం తప్పకుండా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం పునర్బలనం /పొగడ్తను అందించడం.

 

C. స్థిర నిష్పత్తి పునర్బలన నియమం (Fixed Ratio Reinforcement Schedule): జీవికి కృత్యాన్ని కల్పించిన తర్వాత జీవి కృత్యంలో 'నిర్ణీత సంఖ్యలో' ప్రతిస్పందనలు పూర్తిచేసిన తర్వాత పునర్బలనం ఇవ్వడం.
ఉదా: మోహిత్ అనే విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ పనిని కల్పించి ఆ పనిలో విద్యార్థి ప్రతి 4 అంశాలు లేదా ప్రతిస్పందనలు ఇచ్చిన ప్రతిసారి పొగడ్త లేదా పునర్బలనం ఇవ్వడం.

D. చరశీల పునర్బలన నియమం (Variable Reinforcement Schedule):
జీవికి కృత్యానంతరం అస్థిర కాల వ్యవధుల్లో లేదా అస్థిర ప్రతిస్పందనల సంఖ్యకు పునర్బలనాలను కల్పిస్తారు.
ఉదా: * హాసినికి వార్తాపత్రికల్లోని పద వినోద పజిల్స్‌ను పూరించమని ఉపాధ్యాయుడికి వీలైనప్పుడు లేదా బాలిక ప్రతిస్పందనల ఆధారంగా పునర్బలనం ఇవ్వడం.
* ప్రణవ్ 'బ్లాక్ డిజైన్ పరీక్ష' నిర్వహిస్తున్న సందర్భంలో ఉపాధ్యాయుడు వేర్వేరు కాలాల్లో పునర్బలనం ఇవ్వడం.
* అభ్యసనా కార్యక్రమంలో ఉపాధ్యాయులు పై అంశాలను దృష్టిలో ఉంచుకుని అధికంగా పొగడ్త లాంటి ధనాత్మక పునర్బలనాలను ఎక్కువగా ఉపయోగించాలని... దండన లాంటి రుణాత్మక పునర్బలనాలను ఉపయోగించకూడదని స్కిన్నర్ పేర్కొన్నారు.

 

2. కార్యక్రమయుత అభ్యసనం (Programmed Learning):
సాధారణ విద్యా విధానంలో పరిపుష్టి (Feed back), పునర్బలనాలను (Reinforcement) పిల్లలు ప్రతిస్పందనలు ఇచ్చిన వెంటనే అందించాలి. దీని కోసం బోధనా యంత్రాలకు రూపకల్పన చేసి దీని ద్వారా కార్యక్రమయుత అభ్యసనాన్ని రూపొందించారు.

* ఇందులో క్లిష్ట అంశాలను చిన్న చిన్న భాగాలుగా విభజించారు.
వీటినే బోధనా చట్రాలు (Frames) అంటారు.
* ఇందులో జీవి క్రియాత్మకంగా ఉంటూ కింది అంశాలను చూపుతుంది.
     1. స్వీయ బోధన            2. స్వీయ అభ్యసనం
     3. స్వీయ వేగం              4. స్వీయ మూల్యాంకనం       5. స్వీయ పునర్బలనం
* ఈ అభ్యసనంలో Learning by Doing అనే ప్రక్రియ ఉంది. అభ్యాసకుడు తన వేగాన్ని గుర్తించి ముందుకు సాగుతాడు.
ఉదా: కంప్యూటర్, వీడియో గేమ్స్.

Posted Date : 05-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌