• facebook
  • whatsapp
  • telegram

మూర్తిమత్వం

Personality (మూర్తిమత్వం) అనే పదం Persona అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. లాటిన్ భాషలో పర్సోనా అంటే 'ముసుగు' అని అర్థం. పూర్వం గ్రీకులు ముసుగులు ధరించి నాటకాలు వేసేవారు. కానీ ప్రస్తుతం ఎక్కువమంది మూర్తిమత్వాన్ని సరైన భావనతో ఉపయోగించడం లేదు. వ్యక్తి బాహ్య సౌందర్యాన్నే మూర్తిమత్వంగా భావిస్తున్నారు. వాస్తవానికి మూర్తిమత్వం అంటే శారీరక బాహ్య సౌందర్యం మాత్రమే కాదు. మానసిక, ఉద్వేగ, నైతిక, సాంఘిక అంశాల లాంటి అంతర్గత వికాసాలతో ముడిపడి ఉన్న విస్తృత భావనే మూర్తిమత్వం.
నిర్వచనాలు: ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని స్పష్టంగా నిర్వచించడం కష్టం. కానీ కొంతమంది మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు కింది విధంగా వివరించారు.
(స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు) 

ఆల్‌పోర్ట్: ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల చైతన్యపూరిత నిర్వహణే అతడి మూర్తిమత్వం.

ఆర్.బి. కాటిల్: ఇచ్చిన ఒక సన్నివేశంలో వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడో ప్రాగుక్తీకరించేందుకు దోహదపడేదే అతడి మూర్తిమత్వం.

ఐసెంక్: వ్యక్తిలోని సమగ్ర వాస్తవ ప్రవర్తనా రీతులే అతడి మూర్తిమత్వం.

వాట్సన్: దీర్ఘకాల వాస్తవ పరిశీలన ద్వారా వ్యక్తమయ్యే విశ్వసనీయమైన క్రియాత్మక శక్తుల సముదాయమే మూర్తిమత్వం.

ఇ. ఫారిస్: సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం.

జె.ఎఫ్. బ్రౌన్: మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా.
(ఎస్‌జీటీ అభ్యర్థులకు) 

ఆల్‌పోర్ట్: ఏ మనో శారీరక విధానాలైతే ఒక విశిష్టమైన పద్ధతిలో వ్యక్తిని పరిసరాలకు సర్దుబాటు చేసుకునేలా చేస్తాయో ఆ శక్తుల గతిశీలక నిర్వహణే మూర్తిమత్వం.

ఇ. ఫారిస్: సంస్కృతి యొక్క ఆత్మాశ్రయ పక్షమే మూర్తిమత్వం.

ఇ.డబ్ల్యు. బర్జెస్: వ్యక్తి నివసించే సంఘంలో ఆ వ్యక్తి పాత్రను, హోదాను నిర్ణయించే లక్షణాంశాల సమైక్యమే ఆ వ్యక్తి మూర్తిమత్వం.

జె.ఎఫ్. బ్రౌన్: మూర్తిమత్వం అంటే వ్యక్తి లక్షణాంశాల గుణాత్మక నమూనా.

 

మూర్తిమత్వం లక్షణాలు:
* వ్యక్తి పుట్టుకతో మూర్తిమత్వం ఏర్పడదు. జీవితానుభవాలు, అభ్యసనం ద్వారా వ్యక్తిగతంగా ఇది ఏర్పడుతుంది.
* మూర్తిమత్వం వైయక్తిక భేదాలను చూపుతుంది. కాబట్టి ఏ ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉండరు.
* బాహ్య ప్రవర్తన, లక్షణాల ద్వారా ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని అంచనా వేయవచ్చు.

* మూర్తిమత్వం సరళత నుంచి ఉన్నత స్థానానికి మార్పు చెందుతుంది. శిశువుకు అనువంశికంగా పుట్టుకతో వచ్చిన లక్షణాలు క్రమంగా పరిసర ప్రతిచర్యలతో నిర్మాణం కావడాన్ని దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు.
* ప్రతి వ్యక్తిలోనూ మూర్తిమత్వం స్థిరంగా ఉంటుంది కానీ స్తబ్దుగా ఉండదు. ఎందుకంటే మూర్తిమత్వం గతిశీల (Dynamic) ప్రక్రియ.
* ఒక వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించి అంచనా వేయవచ్చు కానీ కచ్చితంగా మాపనం చేయలేం.
* మూర్తిమత్వం ప్రత్యేకమైంది. ప్రతి వ్యక్తిలోనూ సర్దుబాటు చేసుకునే ప్రత్యేక లక్షణాలు ఉంటాయి.
* వ్యక్తి కొన్ని సందర్భాల్లో కనబరిచే ప్రవర్తనా నమూనాలను గమనించి అతడి మూర్తిమత్వాన్ని గణించకూడదు.
* వ్యక్తి మూర్తిమత్వం అతడిలోని వైఖరులపై ఆధారపడుతుంది.
* అభ్యసనం, అనుభవాలు మూర్తిమత్వ అభివృద్ధికి దోహదపడుతాయి.

 

మూర్తిమత్వ కారకాలు 

వ్యక్తి మూర్తిమత్వ వికాసాన్ని ప్రధానంగా రెండు కారకాలు ప్రభావితం చేస్తాయి.
అవి 1) అనువంశికత   2) పరిసర కారకాలు
1. అనువంశికత: వ్యక్తి మూర్తిమత్వాన్ని మొదట ఆ వంశం నుంచి సంక్రమించే లక్షణాలు ప్రభావితం చేస్తాయి. ఇందులో ఆ వ్యక్తి బాహ్యరూపం, నాడీమండలం, గ్రంథులు, ప్రజ్ఞ, వ్యక్తి అంతర్గత ప్రేరణ, అభిరుచులు, వైఖరులు, సహజ సామర్థ్యాలు, ఉద్వేగాలు ప్రధానమైనవి.

గ్రంథులు: శరీరంలోని గ్రంథులను రెండు రకాలుగా విభజించవచ్చు.
అవి ఎ) నాళ గ్రంథులు బి) వినాళ గ్రంథులు

 

ఎ. నాళ గ్రంథులు (Exocrine glands): ఇవి స్రవించే స్రావకాలను ఎంజైములు అంటారు. ఇవి నేరుగా రక్తంలోకి స్రావితం కావు (కలవవు). కాబట్టి వీటి ప్రభావం వ్యక్తి మూర్తిమత్వంపై అధికంగా ఉండదు.
ఉదా: లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, కాలేయ గ్రంథి, మూత్రపిండాలు, స్వేద గ్రంథులు, జననాంగ గ్రంథులు.

 

బి. వినాళ గ్రంథులు (Endocrine glands): వీటికి నాళాలు ఉండవు. ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోనులు అంటారు. ఇవి నేరుగా రక్తంలోకి విడుదలవుతాయి. మూర్తిమత్వంపై వీటి ప్రభావం ఎక్కువ.


     

2. పరిసరాలు: వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే పరిసర కారకాల్లో మొదటిది కుటుంబం, తర్వాత పాఠశాల, పరిసరాలు ముఖ్యమైనవి. తల్లిదండ్రుల సక్రమ పెంపకం, సక్రమ ఉద్వేగాలతో అవసరాలు తీర్చుకుంటూ పెరిగినవారు స్థిరత్వం గల నిర్మాణాత్మక మూర్తిమత్వాన్ని కలిగి ఉంటారు. తల్లిదండ్రులతో సక్రమంగా పెరగనివారు బాధ్యతారహితంగా, ఈర్ష్యాద్వేషాలతో సమాజానికి కీడు చేసేవారిగా ఉంటారు. పాఠశాలను పరిశీలిస్తే... ఉపాధ్యాయుల నుంచి క్రమశిక్షణ, సహకారం, నిజాయతీ గల స్నేహితుల వల్ల మంచి మూర్తిమత్వం ఏర్పడుతుంది. సమాజపరంగా ఎదురయ్యే దృక్పథాలు, నియమాలు, ఆచార వ్యవహారాలు పిల్లలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. కాబట్టి పిల్లలను వీలైనంత మంచి పరిసరాల్లో పెంచాలి.
 

మూర్తిమత్వ సిద్ధాంతాలు

      వ్యక్తి మూర్తిమత్వాన్ని వివరించడానికి అనేక రకాల సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి
1. రూపక సిద్ధాంతాలు (Types theories)
2. లక్షణాంశ సిద్ధాంతాలు (Trait theories)
3. నిర్మితి సిద్ధాంతాలు (Structure theories)

 

1. రూపక సిద్ధాంతాలు: వ్యక్తి మూర్తిమత్వ నిర్మాణాన్ని వివరించడంలో బాహ్య రూపాన్ని ప్రధానంగా పరిగణనలోకి తీసుకున్న సిద్ధాంతాలివి.

ఈ సిద్ధాంతాలను రూపొందించినవారు
     1. హిప్పోక్రటస్
     2. క్రెష్మర్
     3. షెల్డన్
     4. యూంగ్
     5. స్ప్రాంగర్

 

2. లక్షణాంశ సిద్ధాంతాలు: కొంతమంది రూపానికి బదులు లక్షణాంశాలను పరిగణనలోనికి తీసుకుని మూర్తిమత్వాన్ని వర్ణించారు. ఇది కొంత మెరుగైన పద్ధతి. వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా కనిపించే గుణాన్ని లక్షణం అంటారు. మంచితనం, దౌర్జన్యం, పిసినారితనం, చిరాకు, కోపం, సహనశీలత్వం మొదలైనవి కొన్ని లక్షణాంశాలు. లక్షణాంశ సిద్ధాంతాలను పేర్కొన్నవారిలో ఆల్‌పోర్ట్, రేమండ్ బి.కాటిల్ ముఖ్యులు.
 

3. నిర్మితి సిద్ధాంతాలు: వ్యక్తి సమగ్ర రూపాన్ని, ప్రవర్తనా ప్రాకార్యాలను ఆధారం చేసుకుని మూర్తిమత్వాన్ని వివరించడానికి చేసిన ప్రయత్నమే ఈ సిద్ధాంతాలు. వీటిలో ముఖ్యమైనవి

ఎ. మనోవిశ్లేషణ సిద్ధాంతాలు: ఆస్ట్రియా దేశానికి చెందిన సిగ్మండ్ ఫ్రాయిడ్ రూపొందించిన మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతం ప్రాచుర్యం పొందింది. ఈయన రాసిన గ్రంథం ఇంటర్‌ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్.

బి. మనో సాంఘిక వికాస సిద్ధాంతం: వ్యక్తిలోని అహం సృజనాత్మమైందనీ, ఇది పరిసరాలతో సర్దుబాటు చేసుకుంటూ సృజనాత్మకమైన పరిష్కార మార్గాన్ని కనుక్కుంటూ వ్యక్తి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనేలా చేస్తుందని 'ఎరిక్‌సన్' ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు.

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌