• facebook
  • whatsapp
  • telegram

ప్రజ్ఞ (Intelligence) 

వ్యక్తిలోని సాధారణ మానసిక గుణాన్నే 'ప్రజ్ఞ' అనవచ్చు. వాస్తవంగా అన్ని దైనందిన కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించగలగడాన్ని 'ప్రజ్ఞ' అంటారు.
 

లక్షణాలు:
* ప్రతి వ్యక్తి ప్రజ్ఞను అతడి అనువంశికత ప్రభావితం చేస్తుంది.
* శిశువు పుట్టిన నాటికే ప్రజ్ఞ ఏర్పడి ఉంటుంది. ఇది శిశువులో వయసుతోపాటు కొంత కాలానుగుణ అభివృద్ధిని చూపుతుంది. అయితే ఒకసారి ఏర్పడిన ప్రజ్ఞను మార్చలేం.
* ప్రజ్ఞ అమూర్తమైంది. ఒక వ్యక్తిని చూసిన వెంటనే అతడిలోని ప్రజ్ఞను అంచనా వేయలేం.
* వ్యక్తిలో అంతర్గతంగా ఉండే ఈ ప్రజ్ఞ సాధారణ ప్రవర్తనా రూపంగా వ్యక్తపరచడం జరుగుతుంది.
* ప్రజ్ఞ వ్యక్తులందరిలో ఒకే విధంగా ఉండకుండా, వైయక్తిక భేదాలను చూపుతుంది.
* వ్యక్తి కొత్త పరిస్థితులను సమర్థంగా సర్దుబాటు చేసుకోవడానికి ప్రజ్ఞ ఉపయోగపడుతుంది.
* సాధారణ పరిస్థితుల్లో ప్రజ్ఞ కౌమార దశ వరకు జరుగుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది.
* ప్రజ్ఞకు స్త్రీ, పురుష; జాతి, కుల భేదాలు లేవు.
* ప్రజ్ఞను మాపనం చేయవచ్చు. దీన్ని నిర్దిష్టంగా కొలవగలం.

ప్రజ్ఞ - నిర్వచనాలు
కొంతమంది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు ప్రజ్ఞకు రకరకాల నిర్వచనాలను ఇచ్చారు. అవి:

 

ఎస్‌జీటీ సిలబస్‌ను అనుసరించి 

టర్మన్: ''ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞ అతడు అమూర్త చింతన చేయగలిగే సామర్థ్యానుపాతంలో ఉంటుంది".
విలియం జేమ్స్: ''వ్యక్తి కొత్త పరిస్థితులకు సఫలవంతంగా సర్దుబాటు చేసుకోగలిగే సామర్థ్యం".
బినే: ''వ్యక్తి ఒక కచ్చితమైన దిశగా సాగి నిర్వచించడం. మనం కోరుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అవసరమైన రూపాంతరాలను చేసుకోగలిగే సామర్థ్యం, స్వీయ విమర్శ చేసుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".
వెష్లర్: ''వ్యక్తి పరిసరాలతో ప్రయోజనాత్మకంగా ప్రవర్తించగలిగే, వివేకవంతంగా ఆలోచించగలిగే, ప్రభావవంతంగా వ్యవహరించగలిగే సమష్టి లేదా మొత్తం సామర్థ్యమే ప్రజ్ఞ".
జీన్ పియాజే: ''వ్యక్తి తన పరిసరాలకు అనుగుణంగా మారగల సామర్థ్యమే ప్రజ్ఞ".

 

స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ప్రకారం 

బినే: ''లక్ష్యసాధన వైపు తన ప్రవర్తనను మార్చుకోగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".
స్టెర్న్: ''చేతన స్థితిలో వ్యక్తి నూతన పరిస్థితులకు సర్దుబాటు కాబడే సాధారణ సామర్థ్యమే ప్రజ్ఞ".
జీన్ పియాజే: ''భౌతిక, సామాజిక పరిసరాలకు అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ".
ఫ్రీమన్: ''కొత్త పరిస్థితులకు, కొత్త సమస్యల సాధనకు, కొత్త విషయాలు నేర్చుకోవడానికి వ్యక్తి ప్రవర్తనలో చూడగలిగే సామర్థ్యమే ప్రజ్ఞ".

స్పియ‌ర్‌మ‌న్‌: ''పరస్పర సంబంధాలను రాబట్టే వ్యక్తి అంతర్గత శక్తియే ప్రజ్ఞ".
టెర్మన్: ''అమూర్త ఆలోచనా సామర్థ్యమే ప్రజ్ఞ".
వెర్నన్: ''మొత్తంగా ఆలోచించే సామర్థ్యం లేదా మానసిక శక్తియే ప్రజ్ఞ".
వెష్లర్: ''ప్రయోజనాన్ని పొందేందుకు, హేతుబద్దతను కలిగి పరిసరాలతో సర్దుబాటు పెంపొందించుకునే సామర్థ్యమే ప్రజ్ఞ".

 

ప్రజ్ఞ కాని అంశాలు 

జ్ఞానం: ప్రజ్ఞకు, జ్ఞానానికి దగ్గర సంబంధం ఉంది. ఒక వ్యక్తిలో ప్రజ్ఞ అధికంగా ఉంటే అతడు ఎక్కువ జ్ఞానం పొందగలడు. అంతేకానీ జ్ఞానం సహాయంతో ప్రజ్ఞను మెరుగుపరచుకోలేడు. కాబట్టి ''ప్రజ్ఞ అనేది ఒక నిర్దిష్ట గమ్యం అయితే జ్ఞానం అనేది ఆ గమ్యాన్ని చేరడానికి సహకరించే మార్గం లాంటిది" అని రాస్ అనే శాస్త్రవేత్త అభిప్రాయపడ్డాడు.
నైపుణ్యం: ఒక పనిని మళ్లీ మళ్లీ చేయడం ద్వారా ఏర్పడే అనాలోచిత కౌశలమే నైపుణ్యం. ఇది ప్రజ్ఞ కాదు.
స్మృతి: నేర్చుకున్న విషయాన్ని అదేవిధంగా వ్యక్త పరచడమే స్మృతి. అధిక ప్రజ్ఞ ఉన్నవారికి స్మృతి సామర్థ్యం ఎక్కువగా ఉంటుందనేది సాధారణ పరిశీలన ద్వారా వ్యక్తమైన భావన.
సృజనాత్మకత: ఒక పనిని విభిన్న రీతుల్లో చేయడమే సృజనాత్మకత. సాధారణంగా ప్రజ్ఞ వ్యక్తికి పుట్టుకతో ఏర్పడితే, పరిసర సంబంధంతో ఏర్పడేదే సృజనాత్మకత. సృజనాత్మకత ఉన్న ప్రతి వ్యక్తిలోనూ కచ్చితంగా ప్రజ్ఞ ఉంటుంది. కానీ ప్రజ్ఞ ఉన్న వారందరిలోనూ సృజనాత్మకత ఉంటుందని చెప్పలేం.

       ''ప్రజ్ఞ ఉన్న వారందరిలోనూ సమైక్య ఆలోచన ఉంటుంది. కాబట్టి వీరు సాధనా పరీక్షల్లో మంచి ప్రతిభను చూపుతారు. అదేవిధంగా సృజనాత్మక ఉన్నవారిలో విభిన్న ఆలోచన ఉంటుంది. అందుకే వీరు పోటీ పరీక్షల్లో బాగా రాణిస్తారు" అని 'గిల్‌ఫర్డ్' పేర్కొన్నారు.
 

ప్రజ్ఞ సిద్ధాంతాలు
ప్రజ్ఞ స్వభావాన్ని వివరించడానికి విశ్వవ్యాప్తంగా అనేకమంది మనోవిజ్ఞానవేత్తల విశిష్ట కృషి ఫలితంగా పలు సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ముఖ్యమైనవి.

 

1. ఏకకారక సిద్ధాంతం: (Uni-Factor Theory)
బినే రూపొందించిన ఈ సిద్ధాంతాన్ని టెర్మన్, స్టెర్న్, ఎబ్బింగ్‌హాస్‌ బలపరిచారు. ఈ సిద్ధాంతం ప్రకారం ప్రజ్ఞ ఒకే ఒక కారకం వల్ల ఏర్పడుతుంది. ఈ ఒక్క కారకమే వ్యక్తి అనేక చర్యలను ప్రభావితం చేస్తుంది. ఒక రంగంలో మంచి ప్రావీణ్యం ఉంటే అన్ని రంగాల్లో కూడా అంతే ప్రావీణ్యాన్ని చూపుతారని వీరి భావన. కానీ ఒక రంగంలో మంచి నైపుణ్యం ఉన్నంత మాత్రాన మిగిలిన అన్ని విషయాల్లో అలానే ఉండాలని లేదు కదా.
ఉదా: * తరగతి గదిలో విద్యార్థికి తెలుగు భాషలో మంచి మార్కులు వస్తే ఇతర అన్ని సబ్జెక్టుల్లో కూడా మంచి మార్కులే రావాలి.
* ఒక క్రీడలో మంచి ప్రతిభను చూపగలిగిన క్రీడాకారుడు అన్ని క్రీడాంశాల్లో అదే ప్రతిభ చూపాలి.
పై ఉదాహరణలు పరిశీలిస్తే సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. కాబట్టి ఈ సిద్ధాంతం ఆమోదయోగ్యంగా లేదు. అందుకే ఇది కేవలం సంప్రదాయ సిద్ధాంతంగా మిగిలిపోయింది.

2. ద్వికారక సిద్ధాంతం: (Two Factor Theory)
ప్రజ్ఞ అనేది ఒక కారకంతో కాకుండా రెండు కారకాల ద్వారా ఏర్పడుతుందని 'కార్ల్ స్పియ‌ర్‌మ‌న్‌' Abilities of Man అనే గ్రంథంలో ప్రచురించాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞ అనేది ప్రతి వ్యక్తిలోనూ పుట్టుకతో వచ్చే సాధారణ కారకం (General Factor), పరిసరాలతో ప్రతి చర్య ద్వారా వచ్చే ప్రత్యేక కారకం/ నిర్దిష్ట కారకాల (Specific Factor) కలయికతో ఏర్పడుతుంది. ఈ ప్రజ్ఞ కారకాల గణనలో ఈయన ''కారక విశ్లేషణ పద్ధతి"ని ఉపయోగించాడు. 'స్పియ‌ర్‌మ‌న్‌' 'G' కారకం పుట్టుకతో అనువంశికత ద్వారా ఏర్పడి స్థిరంగా ఉంటుందని, 'S' కారకం పరిసర ప్రభావంతో ఏర్పడుతుందని... వీటి కలయికే ప్రజ్ఞ అని వివరించాడు.

 

3. బహుకారక సిద్ధాంతం (Multi Factor Theory)
అమెరికాకు చెందిన ఇ.ఎల్. థార్న్‌డైక్ అనే శాస్త్రవేత్త ఈ సిద్ధాంతాన్ని రూపొందించాడు. ఇది ప్రజ్ఞ స్వభావాన్ని తెలియజేస్తుంది. ఒక వ్యక్తిలో అనేక నిర్దిష్ట సామర్థ్యాలను కలిపి ప్రజ్ఞ అంటారని ఇతడి అభిప్రాయం. అందుకే ఈ సిద్ధాంతాన్ని బహుకారక సిద్ధాంతం అని అంటారు. అంతే కాకుండా వ్యక్తి ఒక రంగంలో చూపే ప్రతిభను బట్టి మిగిలిన రంగాల్లో అతడి ప్రతిభను అంచనా వేయలేం. వ్యక్తికి ఒక రంగంలోని సామర్థ్యం వేరొక రంగంలో అదే స్థాయిలో ఉండదు.
ఉదా: ఒక వ్యక్తిలో భౌతిక శాస్త్రంలోని ప్రావీణ్యం ద్వారా అతడిలోని సంగీతం, భాష, గణిత ప్రావీణ్యాన్ని తెలుసుకోలేం కదా. పై విషయాలను సమగ్రపరిచి Measurement of Intelligence అనే గ్రంథాన్ని థార్న్‌డైక్ రూపొందించారు.

4. సామూహిక కారక సిద్ధాంతం (Group - Factor Theory)
     ఈ సిద్ధాంతాన్ని లూయీ థర్‌స్టన్, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు (Primary Mental Abilities) అనే గ్రంథంలో రూపొందించాడు. దీన్ని ప్రాథమిక మానసిక శక్తుల సిద్ధాంతం అని కూడా అంటారు. ఈయన సిద్ధాంతం ప్రకారం ఏడు ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ప్రజ్ఞకు మూలకారణంగా ఉంటాయి.
ఈ సామర్థ్యాలు వాటికవే స్వతంత్రంగా ఉంటాయి. వీటిన్నింటినీ సమష్టిగా కలిపితే అవి వ్యక్తి సామర్థ్యాన్ని లేదా ప్రజ్ఞను నిర్ధారిస్తాయి.

 

5. స్వరూప నమూనా సిద్ధాంతం (Structural of Intelligence)
     అమెరికాకు చెందిన 'గిల్‌ఫర్డ్' ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ప్రకారం ప్రజ్ఞ మూడు ప్రజ్ఞా విశేష అంశాల కలయిక. ప్రజ్ఞను అర్థం చేసుకోవడానికి వ్యక్తి మూడు విశేషకాలను పరిగణనలోకి తీసుకోవాలి. ప్రతి విశేషక అంశంలోనూ కొన్ని కారకాలు ఉంటాయని భావించి వాటిని గిల్ ఘనరూపంలో అమర్చాడు.

 

విశేషకాలు
     1) విషయాలు (contents)
     2) ఉత్పన్నాలు (products)
     3) ప్రచాలకాలు (operations)

బహుళ ప్రజ్ఞ (Multiple Intelligence)

    అమెరికాకు చెందిన హోవార్డ్ గార్డినర్ హార్వర్డ్ విశ్వవిద్యాలయ విద్యావిభాగ ఆచార్యులు, మనో విజ్ఞాన శాస్త్రంలో ఆచార్యులుగా పనిచేశారు. 1983లో The Frames of Mind: The Theory of Multiple Intelligence అనే గ్రంథాన్ని ప్రచురించారు.
    ప్రజ్ఞలోని వివిధ కారకాలను పరిశీలించి ప్రతి వ్యక్తిలోనూ పరిస్థితులకు అనుకూలంగా ప్రతిస్పందించే 8 రకాల ప్రజ్ఞలు ఉంటాయని వివరించారు. అవి:
1. భాషా ప్రజ్ఞ: భాషా ప్రజ్ఞ ఉన్నవారు పదాలతో సంభాషణను రక్తికట్టించే విధంగా మాట్లాడతారు, రాయడంలో చాతుర్యాన్ని ప్రదర్శిస్తారు. వీరు ఇతరులను ఒప్పించడంలో నేర్పరులు. వీరినే పదనేర్పరులు (Word Smart) అంటారు.
2. తార్కిక గణితశాస్త్ర ప్రజ్ఞ: వీరు సంఖ్యలను ఉపయోగించడంలో, కొత్త సమస్యలను విశ్లేషణ చేయడంలో ప్రతిభను కనబరుస్తారు. వీరిని సంఖ్యానేర్పరులు (Number Smart) అంటారు.
3. ప్రాదేశిక ప్రజ్ఞ: సమాజంలోని సమస్యలు, పరిస్థితులను గుర్తించి పరిస్థితులకు అనుగుణంగా మారి ఆ అంశాలను కాగితాలపై సృష్టిస్తారు. ఇంజినీర్‌లు, చిత్రనేర్పరుల్లో ఈ ప్రాదేశిక ప్రజ్ఞ ఉంటుంది.
4. శారీరక గతి సంవేదనా ప్రజ్ఞ: సాంఘిక ప్రపంచంలో సర్దుబాటులో భాగంగా భావ వ్యక్తీకరణకు తమ శరీరాన్ని నేర్పుగా ఉపయోగించగలిగేవారే సాంఘిక నేర్పరులు (Body Smart).

5. సంగీత సంబంధ ప్రజ్ఞ: వీరు పద్యాలు, పాటలు రాసి తమంతటతాముగా పాడగల సామర్థ్యాన్ని కూడా ప్రదర్శిస్తారు. సంగీతంలో మంచి ప్రావీణ్యం ఉన్న సంగీత నేర్పరులు (Music Smart).
6. పరస్పర వ్యక్తిత్వ ప్రజ్ఞ: పరిసరాల్లోని వ్యక్తులతో సక్రమంగా మెలిగే వ్యక్తి. మంచి సాంఘిక సంబంధాలున్న సాంఘిక నేర్పరులు (Social Smart).
7. వ్యక్తంతర్గత ప్రజ్ఞ: వ్యక్తి తనలోని భావాలను, సామర్థ్యాలను, లక్ష్యాలను తెలుసుకుని దానికి తగినట్లుగా జీవించగలిగే నేర్పరితనాన్నే స్వయం నేర్పరితనం (Self Smart) అంటారు.
8. సహజ ప్రజ్ఞ: వీరు ప్రకృతి ప్రేమికులు, ఎక్కువగా ప్రశాంతతను కోరుకుని జంతువులు, మొక్కలను ప్రేమించే స్వభావం ఉన్న ప్రకృతి నేర్పరులు (Nature Smart) గా ఉంటారు.
        వ్యక్తిలో పైన పేర్కొన్న ఎనిమిది ప్రజ్ఞలే కాకుండా ఆధ్యాత్మిక ప్రజ్ఞ, అస్థిత్వ ప్రజ్ఞ, నైతిక ప్రజ్ఞ అనే మరో మూడు ప్రజ్ఞలను కూడా గార్డినర్ పేర్కొన్నాడు.

ఉద్వేగాత్మక ప్రజ్ఞ (Emotional Intelligence) 

        Emotion అనే పదం 'Emovere' అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. జన్మించిన శిశువులో మొదట ఏర్పడే ఉద్వేగం 'ఉత్తేజం' (Excitement). కొంతకాలానికి ఇది అనుకూల, ప్రతికూల ఉద్వేగాలుగా మారుతుంది.


      
          ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పదం ఈ మధ్యకాలంలో వాడుకలోకి వచ్చింది. వెయిన్ లియోన్ పెయిన్ 1885లో ఈ పదాన్ని మొదట ఉపయోగించారు. ఆ తర్వాత 1990లో జాన్‌మేయర్, పీటర్‌సలోవె ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనే పేరుతో వ్యాసాలను ప్రచురించారు. చివరగా 1995లో గోల్‌మన్ Emotional Intelligence: Why it can matter more then IQ అనే గ్రంథం ద్వారా శాస్త్రీయంగా ఉద్వేగాత్మక ప్రజ్ఞను నిర్వచించారు.

       గోల్‌మన్ ప్రకారం వ్యక్తిలోని ఉద్వేగాత్మక ప్రజ్ఞలో 25 నైపుణ్యాలతో కూడిన అయిదు విశేషకాలు ఉంటాయి. అవి:
    1) స్వయం పరిచయం
    2) స్వీయ నిర్వహణ
    3) స్వీయ ప్రేరణ
    4) సాంఘిక పరిచయం
    5) సంబంధాల నిర్వహణ
    ఈ నైపుణ్యాలు జన్మతహా వచ్చినవికావు. ఇవి వ్యక్తిగత సాధన, ప్రతిచర్యల ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి. వ్యక్తి సాధనా స్థాయికి సంబంధించి ఉద్వేగాత్మక ప్రజ్ఞపై గోల్‌మన్ అనేక ప్రయోగాలు చేసి ఒక వ్యక్తి సాధించిన సఫలతలో 80% ఉద్వేగాత్మక ప్రజ్ఞ అయితే కేవలం 20% మాత్రమే అతడి సాధారణ ప్రజ్ఞ అని పేర్కొన్నాడు.

 

ఉద్వేగాత్మక లబ్ధి (Emotional Quetient)
    EQ అనేది వ్యక్తిలోని ఉద్వేగాత్మక ప్రజ్ఞను తెలిపే ప్రమాణం. వ్యక్తి బాహ్య ఒత్తిడికి గురికాకుండా తన విధులను తాను సంతృప్తిగా నిర్వహించడాన్ని తెలిపే ప్రమాణం. వ్యక్తిలో సాధారణ ప్రజ్ఞను IQ ఎలా తెలుపుతుందో, వ్యక్తి ఉద్వేగ వికాసాన్ని EQ అలా వివరిస్తుంది. కానీ ప్రస్తుతం EQను శాస్త్రీయంగా అధ్యయనం చేయడానికి ఎలాంటి ప్రమాణాలు లేవు.

 

ప్రజ్ఞ - రకాలు
    Measurement of Intelligence అనే గ్రంథంలో ప్రజ్ఞ మూడు రకాలుగా ఉంటుందని థార్న్‌డైక్ వివరించాడు.

1) అమూర్త ప్రజ్ఞ (Abstract Intelligence): అంకెలు, సంఖ్యలు, పదాలు, వాక్యాలు, మాటలు, భావాలను సక్రమంగా ఉపయోగించే నేర్పరితనమే అమూర్త ప్రజ్ఞ.
ఉదా: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌లు, కవులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తల్లోని ప్రజ్ఞ.
2) మూర్తప్రజ్ఞ/ యాంత్రిక ప్రజ్ఞ (Mechanical Intelligence): యంత్ర పరికరాలను నేర్పుగా, చక్కగా ఉపయోగించగలిగే సామర్థ్యమే మూర్తప్రజ్ఞ.
ఉదా: శ్రామికులు, నిరక్షరాస్యులు అధికంగా ఉపయోగించుకుంటారు.
3) సాంఘిక/ సామాజిక ప్రజ్ఞ (Social Intelligence): సమాజంలోని మనుషులతో చక్కగా మంచి సంబంధంతో కలివిడిగా ఉండే స్వభావం సాంఘిక ప్రజ్ఞ అవుతుంది.
ఉదా: వ్యాపారస్తులు, సినీనటులు, రాజకీయ నాయకుల్లోని ప్రజ్ఞ.
* ఈ ప్రజ్ఞను మనం కొలవలేం. (కొద్దిగా అంచనా వేయవచ్చు)

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌