• facebook
  • whatsapp
  • telegram

జీవన విధానాలు

డీఎస్సీ సిలబస్ దృష్ట్యా 'జీవన విధానాలు' అనే పాఠం అతి ముఖ్యమైంది. ఇది తొమ్మిది, పది తరగతుల్లో ఉంది. ఈ పాఠ్యాంశంలో పోషణ విధానాలు; కిరణజన్య సంయోగ క్రియ; శ్వాసక్రియ; రవాణా వ్యవస్థలు; మానవ జీర్ణ, విసర్జక వ్యవస్థలు; మొక్కల్లో విసర్జన లాంటి అంశాలను అధ్యయనం చేయాలి.
 

జీవన విధానాలు (జీవన క్రియలు): జీవుల మనుగడకు, వాటి వంశాభివృద్ధికి అవసరమయ్యే క్రియలను 'జీవన క్రియలు' అంటారు.
ఉదా: పోషణ, జీర్ణక్రియ, శ్వాసక్రియ, రవాణా, విసర్జన, ప్రత్యుత్పత్తి మొదలైనవి కొన్ని జీవక్రియలు. వీటిలో ప్రత్యుత్పత్తి అనే జీవక్రియ ఒక జీవజాతి తన వంశాన్ని అభివృద్ధి చేసుకుని, శాశ్వతంగా ఉండటానికి దోహదపడుతుంది.

 

పోషణ పద్ధతులు: జీవులు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, శక్తి ఉత్పన్నమవడానికి ఉపయోగించుకునే కర్బన సహిత రసాయన పదార్థాలను పోషకాలు అంటారు. వీటిలోని కర్బనాన్నే 'మూల కర్బనం' అని అంటారు.
* జీవులు శరీరంలోకి పోషకాలను గ్రహించడాన్ని 'పోషణ' అంటారు.
*  జీవులన్నింటికీ వాటికి కావాల్సిన పోషకాలు ఆహారం ద్వారా లభ్యమవుతాయి.
*  జీవుల్లో ఈ పోషకాల అవసరాలు, మూల కర్బనాన్ని గ్రహించే పద్ధతుల్లో ఉన్న వైవిధ్యం ఆధారంగా పోషణ పద్ధతులను 3 రకాలుగా విభజించారు. అవి: 1)స్వయం పోషణ 2) పర పోషణ 3) మిశ్రమ పోషణ.

 

స్వయం పోషణ
జీవులు తమకు కావాల్సిన పోషకాలను తామే తయారు చేసుకోవడాన్ని 'స్వయం పోషణ' అంటారు. స్వయం పోషణను అవలంబించే జీవులను 'స్వయం పోషకాలు' అంటారు.
*  ఈ జీవులు సరళమైన నిరీంద్రియ లవణాల నుంచి తమకు కావాల్సిన సంక్లిష్ట సేంద్రియ పోషకాలను తయారు చేసుకుంటాయి  (ఖనిజ లవణాలు, నీరు, CO2 ల నుంచి పిండి పదార్థాలు).
*  ఈ తయారీకి శక్తి అవసరమవుతుంది. స్వయం పోషకాలు ఈ శక్తిని గ్రహించే విధానం ఆధారంగా వీటిని 1)కాంతి విశ్లేషక స్వయం పోషకాలు, 2) రసాయన విశ్లేషక స్వయం పోషకాలుగా విభజించారు.

కాంతి విశ్లేషక స్వయం పోషకాలు:

ఇవి సూర్యకాంతిలోని శక్తిని గ్రహించి, దాని ఆధారంగా అనేక సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను/ పోషకాలను ఉత్పత్తి చేసుకుంటాయి.
*  ఈ జీవుల్లో కాంతిని విశ్లేషించి, దానిలోని శక్తిని గ్రహించే ప్రత్యేక వర్ణద్రవ్యాలు ఉంటాయి.
*  శైవలాలు, ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలు, ఆకుపచ్చ, ఊదా, నీలి ఆకుపచ్చ సైనో బ్యాక్టీరియాలు వీటికి ఉదాహరణ.

 

రసాయన విశ్లేషక స్వయం పోషకాలు: ఈ జీవులు నిరీంద్రియ సమ్మేళనాలను (రసాయన పదార్థాలు) ఆక్సీకరణం చేసి, శక్తిని సంపాదిస్తాయి. ఈ శక్తితో వాటికి అవసరమైన పోషకాలను ఉత్పత్తిచేసుకుంటాయి.
*  ఇవి హైడ్రోజన్ సల్ఫైడ్, అమ్మోనియా, నైట్రేట్స్, హైడ్రోజన్, ఇనుము, గంధకం, నత్రజని సమ్మేళనాల లాంటి రసాయన పదార్థాలను ఆక్సీకరణం చేస్తాయి.
గమనిక: పైన పేర్కొన్న రెండు రకాల స్వయం పోషకాలు సంక్లిష్ట సేంద్రియ పోషకాల తయారీకి CO2లోని కర్బనాన్ని ఉపయోగించుకుంటాయి.

 

పరపోషణ
జీవులు వాటికి కావాల్సిన పోషకాలను అవే తయారుచేసుకోలేక ఇతర జీవులపై ఆధారపడటాన్ని 'పరపోషణ' అంటారు. ఈ విధానాన్ని అనుసరించే జీవులను 'పరపోషకాలు' అంటారు.
ఉదా: అన్నిరకాల జంతువులు, శిలీంద్రాలు, అనేక బ్యాక్టీరియాలు.
*  పరపోషక విధానం రెండు రకాలు:
1) పూతికాహార పోషణ 2) జాంతవ భక్షణ.

 

పూతికాహార పోషణ: పూతికాహార పోషణను ప్రదర్శించే జీవులు ఇతర జీవుల్లో ఉండే సంక్లిష్ట సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి, సరళ పదార్థాలుగా మార్చి, వాటిని గ్రహిస్తాయి.
ఉదా: అనేక బ్యాక్టీరియా, శిలీంద్రాలు వాటికి కావాల్సిన పోషకాల కోసం కళేబరాలపై ఆధారపడతాయి. (ఇవి ఎంజైమ్‌ల సహాయంతో- బాహ్య మాధ్యమంలో సంక్లిష్ట పదార్థాలను, సరళ పదార్థాలుగా మారుస్తాయి)

*  కొన్ని అతి తక్కువ శ్రేణి జంతువులు (కొన్ని ప్రోటోజోవన్లు, పరాన్న జీవులు) నీటిలో కరిగిన ఆహార పదార్థాలను తమ శరీర ఉపరితలం ద్వారా పీల్చుకుంటాయి.

వీటిలో ప్రత్యేకమైన జీర్ణావయవాలు ఉండవు. జీర్ణమైన ఆహారపదార్థాలను చిన్న అణువుల రూపంలో తీసుకుంటాయి. ఒకవేళ జీర్ణావయవాలు ఉన్నప్పటికీ, చాలా సరళమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది.
*  జాంతవ భక్షణలో జీవులు ప్రత్యేకమైన ఆహార సేకరణ యంత్రాంగాల ద్వారా రేణువుల రూపంలో ఉండే (ఘన, ద్రవరూప) ఆహారపదార్థాలను తీసుకుని, వాటిని జీర్ణరసాల ద్వారా జీర్ణం చేసుకుంటాయి.
*  ఎక్కువ శాతం జంతువుల్లో ఈ పోషణ కనిపిస్తుంది.

 

ఆహార సేకరణ యంత్రాంగాలు: అమీబాలో మిథ్యాపాదాలు, హైడ్రాలో స్పర్శకాలు ఆహార సేకరణ యంత్రాంగాలుగా పనిచేస్తాయి. ఆహారాన్ని ముక్కలుగా చేయకుండా, మొత్తం ఆహారాన్ని ఒకేసారి మింగేస్తాయి.
*  నత్త 'రాడ్యులా' అనే నాలుకలాంటి నిర్మాణం సహాయంతో ఘన ఆహారాన్ని రేణువుల రూపంలో తీసుకుంటుంది. సింహం, పెద్దపులి లాంటి ఘనరూప ఆహారాన్ని తీసుకునే జంతువులు ముందుగా ఆహారాన్ని చిన్న ముక్కలుగా చేసుకుంటాయి. ఈ జీవుల్లో తగిన ఆహార సేకరణ అవయవాలు అభివృద్ధి చెంది ఉంటాయి.
*  తేలు, సాలీడు లాంటివి జీవులను చంపి, వాటి శరీరంలోకి జీర్ణరసాలను వదిలి, ద్రవరూపంలోకి మార్చి, వాటిని ఆహారంగా తీసుకుంటాయి.
*  సీతాకోక చిలుకలు పొడవైన గొట్టంలా ఉండే తొండం సహాయంతో పుష్పాల్లోని మకరందాన్ని గ్రహిస్తాయి.
*  దోమల్లో శరీరాన్ని గుచ్చి, రక్తాన్ని పీల్చడానికి ప్రత్యేక అవయవాలున్నాయి.  
*  జలగలు రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి.
*  వానపాము కుళ్లిన కర్బన పదార్థాలుండే మట్టిని ఆహారంగా తీసుకుంటుంది.

 

గమనిక: రక్తాన్ని పీల్చేటప్పుడు అది గడ్డకట్టకుండా ఉండేందుకు దోమలు 'హీమోలైసిన్', జలగలు 'హిరుడిన్' అనే రసాయన పదార్థాలను విడుదలచేస్తాయి.

*  మానవ శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా ఉంచే రసాయన పదార్థం - 'హెపారిన్'

*  జంతువులు తీసుకునే ఆహారపదార్థాల స్థితుల ఆధారంగా వాటిలో ఆహార సేకరణ యంత్రాంగాలుంటాయి.
 

ఏకరక భక్షక జీవులు: ఒకే రకమైన ఆహారాన్ని తీసుకునే జీవులను 'ఏకరక భక్షక జీవులు' అంటారు.
ఉదా: గొంగళి పురుగులుగా ఉండే దశలో పట్టుపురుగులు మల్బరీ ఆకులను మాత్రమే తింటాయి.

 

బహుళరక భక్షక జీవులు: ఇవి అనేక రకాల ఆహార పదార్థాలను తీసుకుంటాయి.
ఎ) శాకాహారులు - మొక్కలను ఆహారంగా తీసుకుంటాయి.
బి) మాంసాహారులు - జంతువులను ఆహారంగా తీసుకుంటాయి.
సి) సర్వభక్షకులు - జంతువులు, వృక్షాలు రెండింటినీ ఆహారంగా తీసుకుంటాయి. వీటినే 'మిశ్రమాహారులు' అంటారు.
కొన్ని జీవుల్లో లైంగికత్వం ఆధారంగా ఆహార అలవాట్లలో తేడాలుంటాయి.
ఉదా: దోమలు. మగ దోమలు చెట్ల రసాన్ని పీల్చుకుంటే, ఆడ దోమలు మనిషి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి.

 

గమనిక: మగ దోమల్లో హనువులు, జంభికలు లోపించి ఉండటం వల్ల రక్తాన్ని పీల్చలేవు. జీవుల జీవిత దశలను అనుసరించి ఆహార అలవాట్లు మారుతూ ఉంటాయి.
ఉదా: గొంగళి పురుగు - ఆకులను, సీతాకోకచిలుక - పూలలోని మకరందాన్ని ఆహారంగా తీసుకుంటాయి.
మాంసాహార (కీటకాహార) మొక్కలు: ఇవి కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి.
*  ఇవి స్వయం పోషకాలుగా ఉంటూ, వాటికి అదనంగా కావాల్సిన నత్రజని సంయోగ పదార్థాల కోసం కీటకాలను భక్షిస్తాయి.
*  ఈ మొక్కలన్నీ స్వయం పోషకాలు. కీటకాలను భక్షించకుండా వాటంతట అవి కూడా జీవించగలవు. కానీ, కీటకాలను భక్షించడం వల్ల వీటి పెరుగుదల అధికంగా ఉంటుంది.

*  నత్రజని లోపించిన నేలల్లో పెరిగే మొక్కలివి. ఉదా: డయోనియా (లీనస్ ప్లెట్రాప్); డ్రాసిరా (సన్‌డ్యూప్లాంట్); యుట్రిక్యులేరియా (బ్లాడర్ వర్ట్); నెపంథిస్.

మిశ్రమ పోషణ
మిశ్రమ పోషణ విధానంలో రెండు విభిన్న జీవుల మధ్య సంబంధాలుంటాయి. ఈ పద్ధతిలో పోషక పదార్థాలు రెండు జీవులకు లేదా ఏదో ఒక జీవికి లభ్యం కావడం వల్ల రెండూ లాభం పొందవచ్చు, లేదా ఏదో ఒకటి మాత్రమే లాభం పొందవచ్చు. ఈ పోషణ విధానం రెండు రకాలు. అవి: ఎ) సహజీవనం బి) పరాన్న జీవనం.

 

సహజీవనం: రెండు భిన్న వర్గాల జీవులు కలసి జీవిస్తూ, పోషకాలను పరస్పరం మార్పిడి చేసుకుంటూ రెండూ లాభం పొందే పోషక విధానాన్ని 'సహజీవనం' అంటారు. ఈ విధానంలో ఒక జీవి తన సహజీవికి ఆహారాన్ని/ నివాసాన్ని/ రక్షణను కల్పిస్తుంది.
ఉదా: 1) లెగ్యుమినేసి మొక్కలు వాటి వేరు బుడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా. వీటిలో మొక్క బ్యాక్టీరియాకు నివాసాన్ని, ఆహారాన్ని అందిస్తుంది. బ్యాక్టీరియా వాతావరణంలోని నత్రజనిని నత్రితాల రూపంలో మొక్కకు అందిస్తుంది.
2) లైకెన్లలో (ఒక శైవలం, శిలీంద్రం కలసి ఏర్పడే నిర్మాణాలు) శైవలం ఆహారాన్ని తయారుచేసి, శిలీంద్రానికి అందిస్తుంది. శిలీంద్రం వాతావరణం నుంచి శైవలానికి రక్షణనిస్తుంది.
3) సాధుపీత - సీఎనిమోనుల్లో సీఎనిమోనులు పీతలకు రక్షణ కల్పిస్తాయి. పీతలు సీఎనిమోనులకు చిన్న ముక్కల రూపంలో ఆహారాన్ని సమకూరుస్తాయి.
*  ఈ పోషణ విధానంలో పాల్గొనే రెండు జీవులూ లాభం పొందుతాయి.

 

పరాన్న జీవులు: పరాన్న జీవనంలో ఆహారాన్ని అందించే జీవిని ఆతిథేయ జీవి (Host) అని, ఆతిథేయి నుంచి ఆహారాన్ని గ్రహిస్తూ, దాని శరీరం పైన (బాహ్య పరాన్నజీవి) లేదా లోపల (అంతర పరాన్న జీవి) ఉండే జీవిని 'పరాన్నజీవి' అంటారు. ఈ విధానంలో ఒకజీవి (పరాన్నజీవి) మాత్రమే లాభం పొందుతుంది. పరాన్నజీవుల వల్ల ఆతిథేయి శరీరంలో క్రియల క్రమం తప్పి, రోగాలబారినపడి చివరికి చనిపోవచ్చు.
ఉదా: మానవుడు - ప్లాస్మోడియం పరాన్నజీవి, ఆస్కారిస్ లుంబ్రికాయిడిస్, ఉకరేరియా బ్రాంక్రాఫ్టి మధ్య పరాన్న జీవన పోషణ విధానం ఉంటుంది.

Posted Date : 30-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌