• facebook
  • whatsapp
  • telegram

జంతువుల్లో ఆర్థిక ప్రాముఖ్యత

మానవుడు జంతువులను రకరకాలుగా ఉపయోగించేవాడు.


పశుపోషణ (Animal Husbandry)
   పాలు, మాంసం, ఇతర ఉపయోగకరమైన పదార్థాల కోసం పశువులకు ఆహారాన్ని అందజేసి వాటికి వసతిని, రక్షణను కల్పించడమే పశుపోషణ.
* జంతువుల పెంపకంలో ప్రధాన ఉద్దేశం ఆహార ఉత్పత్తి.

* మన దేశంలో వ్యవసాయంలో పశుపోషణ అంతర్భాగమైంది.

ఆదిమానవుడు వివిధ జంతువులను మచ్చిక చేసుకున్న కాలాలు

పాల ఉత్పత్తి

* ఆవులను, గేదెలను పెంచుతూ వాటి నుంచి పాలు, పాల పదార్థాలను ఉత్పత్తి చేసే కేంద్రాన్ని 'డెయిరీ ఫామ్' అంటారు.
* ప్రపంచంలో అత్యధికంగా పాలు ఇచ్చే ఆవు జాతి హోలోస్టీన్ (డెన్మార్క్).
* ప్రపంచంలో అత్యధికంగా పాలు ఇచ్చే రెండో ఆవు జాతి జెర్సి (ఇంగ్లండ్).
* ప్రపంచంలో అత్యధికంగా పాలు ఇచ్చే గేదె జాతి ముర్రా (హరియాణా).
* తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా పాలు ఇచ్చేది ఒంగోలు జాతి ఆవులు.
* ప్రపంచంలోనే వ్యవసాయంలో ప్రసిద్ధిగాంచిన ఎద్దు ఒంగోలు గిత్త.
* భారతదేశం నుంచి ఒంగోలు ఆవులను, గిత్తలను ఎక్కువగా బ్రెజిల్‌కు ఎగుమతి చేస్తున్నారు.
* మనదేశంలో మొత్తం ఉత్పత్తి అయ్యే 60% పాలలో జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడి, ఇతర ఉత్పత్తులను తయారు చేసేందుకు ఉపయోగిస్తున్నారు.
* పాలను సంపూర్ణ ఆహారం అంటారు. పాలలో అన్నిరకాల పోషక పదార్థాలకి అధికంగా విటమిన్ A, D, Eలు ఉంటాయి. పాలలో 80 - 90% నీరు ఉంటుంది.
* పాల ఉత్పత్తిలో గణనీయమైన ప్రగతిని సాధించడాన్ని శ్వేత విప్లవం లేదా ఆపరేషన్ ఫ్లడ్ అంటారు.
* భారతదేశ 'శ్వేతవిప్లవ' పితామహుడు వర్గీస్ కురియన్.

జున్ను పాలు

      పశువులు ఈనినప్పటి నుంచి 72 గంటల వరకు ఇచ్చే పాలను జున్నుపాలు అంటారు. జున్ను పాలలో 'కోలోస్ట్రమ్' అనే పదార్థం ఉండటం వల్ల అవి పసుపు రంగులో ఉంటాయి.
* దేశీయ జాతులు రోజుకు 2 - 5 లీటర్ల పాలు ఇస్తాయి. అయితే ముర్రా జాతి గేదెలు రోజుకు 8 లీటర్ల కంటే ఎక్కువ పాలనిస్తాయి.

 

పాశ్చరైజేషన్
    పాలలోని రోగకారక జీవులను నాశనం చేయడాన్ని పాశ్చరైజేషన్ అంటారు. ఈ పద్థతిలో పాలను 62ºC వద్ద 30 నిమిషాల పాటు వేడి చేస్తారు. తర్వాత పాలను 10ºC కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద చల్లారుస్తారు.
* భారత ప్రభుత్వం 2011లో నిర్వహించిన ఆర్థిక గణాంకాల సర్వే ప్రకారం మన రాష్ట్రంలో రోజుకు 40 నుంచి 60 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి.
* పాల ఉత్పత్తిని పెంచడానికి డెయిరీ రైతులు పశువులకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఇంజెక్షన్‌ను ఇస్తున్నారు. ఈ పాలు తాగడం వల్ల శరీరంలోకి ఈస్ట్రోజన్ హార్మోన్లు చేరి ఆడపిల్లలు తొందరగా యవ్వన దశకు చేరుకుంటారు.

బయోగ్యాస్
* బయోగ్యాస్ ఉత్పత్తి పశుపోషణలో ఒక అదనపు ఆదాయ వనరు.
* మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, కర్నూలు జిల్లాల్లో మేకలు, గొర్రెల పెంపకం ఎక్కువ.

* ఎద్దు మాంసాన్ని బీఫ్ అని, పంది మాంసాన్ని ఫోర్క్ అని, గొర్రె మాంసాన్ని మటన్ అని అంటారు.

* ఎద్దుల్లో ఒంగోలు జాతి ఎద్దులు చాలా బలమైనవి. అవి గోమర్ల నుంచి సంక్రమించే విషజ్వరాన్ని, అధిక ఉష్ణోగ్రతను తట్టుకునే శక్తిని కలిగి ఉంటాయి.
* ఆవు పాల కంటే గేదె పాలలో వెన్నశాతం ఎక్కువ. వెన్న, నెయ్యి, జున్ను లాంటి పదార్థాలను తయారు చేసేందుకు గేదెపాలు ఉత్తమం.
* ఒడిశాలోని చిల్కా సరస్సు ప్రాంతంలో దేశీయ పశుజాతి చిల్కా గేదెలను పెంచుతారు. ఇవి ముర్రా జాతితో సంకరణం కాకుండా జాగ్రత్త పడతారు. ఈ గేదెలు రాత్రి సమయంలో మాత్రమే చిల్కా సరస్సులో మేత మేస్తాయి. వీటికి ఎలాంటి అదనపు ఆహారం ఇవ్వకుండా పాలను పిండుతారు. ఈ పాలు ఉప్పగా ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో ఉంచకపోయినా కూడా పాలు దాదాపు వారం రోజుల పాటు పాడవ్వకుండా ఉంటాయి.
* భారత దేశంలో పశుపోషణ సంస్కృతి సంప్రదాయాల్లో భాగం.
    

ముర్రా జాతి 
* ఇది భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గేదె జాతి.
* ఈ జాతి గేదెలు పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో జన్మించాయి.
* ఇవి రోజుకు 8 లీటర్లకు పైగా పాలు ఇస్తాయి.
* ఆవు పాల కంటే గేదె పాలలో వెన్న శాతం ఎక్కువ.

 

ఒంగోలు జాతి
* ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన పశుజాతి.
* పెద్ద మూపురం, గంగడోలు కలిగి ఉంటాయి.
* అధిక ఉష్ణోగ్రతలను, గోమర్ల ద్వారా వచ్చే విషజ్వరాలను తట్టుకోగలవు.
* ఇవి ఒంగోలు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో కనిపిస్తాయి.

 

హరియాణా జాతి
* ఇవి హరియాణా రాష్ట్రంలో ఎక్కువగా కనిపిస్తాయి.
* రవాణాకు, వేగంగా పొలం దున్నేందుకు ఉపయోగపడతాయి. మంచి పని సామర్థ్యం కలిగి ఉంటాయి.

 

జెర్సి
* ఇంగ్లిష్ ఛానల్‌లోని జెర్సి ద్వీపాలు(ఇంగ్లాండ్)లో ఇవి జన్మించాయి.
* మన దేశ వాతావరణానికి బాగా సరిపోయే సంకరజాతి పశువు. గౌణ వర్ణంలో ఉంటాయి.

హోల్‌స్టీన్ జాతి
* ఈ జాతి పశువులు డెన్మార్క్‌లో జన్మించాయి.
* ఇది ప్రపంచంలో ఎక్కువ పాలనిచ్చే ఆవు.
* హోల్‌స్టీన్, జెర్సీ జాతి ఆవులు ఒక రోజుకు 25 లీటర్ల పాలు ఇస్తున్నాయి.
* మనదేశంలో పాల ఉత్పత్తిలో ఆవులు ప్రధాన పాత్ర వహిస్తున్నాయి.

 

మేకలు, గొర్రెలు
* గొర్రెలు మాంసానికి, వాటి వెంట్రుకలతో ఉన్ని, కంబళ్లు తయారు చేసేందుకు ఉపయోగపడతాయి.
* మెరినో జాతి గొర్రె నుంచి సంవత్సరానికి 5 నుంచి 18 కిలోల నాణ్యమైన ఉన్నిని తయారు చేస్తారు.
* తెలుగు రాష్ట్రాల గొర్రెల్లో ముఖ్యమైనవి నెల్లూరు జాతి, దక్కన్ జాతి గొర్రెలు.

 నెల్లూరు జాతి గొర్రెలు

                  దక్కన్ జాతి గొర్రెలు

* ఇవి నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎక్కువగా ఉంటాయి.

* ఇవి అనంతపురం, కర్నూలు, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో ఉంటాయి.

* ఇవి పొడవుగా ఉంటాయి.

* ఇవి నల్లగా లేదా గోధుమ రంగులో ఉంటాయి.

* వీటి మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, రుచికరంగా ఉంటుంది.

* వీటి మాంసంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, రుచికరంగా ఉంటుంది.

* ఇవి తక్కువ ఉన్నిని కలిగి ఉంటాయి.

*ఇవి కంబళ్లకు పనికొచ్చే ఉన్నిని ఇస్తాయి. తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో జీవిస్తాయి.

కోళ్ల పరిశ్రమ (Poultry)
* అధిక సంఖ్యలో కోళ్లను ఉత్పత్తి చేసి పెంచడాన్ని కోళ్ల పరిశ్రమ అంటారు. 
* ప్రపంచవ్యాప్తంగా 50 మిలియన్ల కోళ్లను గుడ్లు, మాంసం కోసం పెంచుతున్నారు.
* కోడిగుడ్ల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలో 4వ స్థానాన్ని, మాంసం ఉత్పత్తిలో 5వ స్థానాన్ని ఆక్రమించింది.
* మన దేశంలో సంవత్సరానికి 41.06 మిలియన్ల గుడ్లు ఉత్పత్తి అవుతున్నాయి. 1000 మిలియన్ కిలోల మాంసం ఉత్పత్తి అవుతోంది
కోళ్ల పెంపక కేంద్రాలు రెండు రకాలు. అవి బాయిలర్ కోళ్లు, లేయర్స్ కోళ్లు.

                బాయిలర్ కోళ్లు

                           లేయర్స్ కోళ్లు

* వీటిని మాంసం కోసం పెంచుతారు.

* వీటిని గుడ్ల కోసం పెంచుతారు.

* దేశీయరకాలు పూర్తిగా పెరగడానికి 5 నుంచి 6 నెలలు పడుతుంది.

* సాధారణంగా లేయర్ కోళ్లు వాటి జీవిత కాలంలో 300 - 350 వరకు గుడ్లను పెడతాయి. కానీ 21 - 72 వారాలపాటు తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి

* బాయిలర్‌లు పెరగడానికి 6 నుంచి 8 వారాలు పడుతుంది.

* నాటు కోళ్లు సంవత్సరానికి 50 - 60 గుడ్లు పెడతాయి.

* న్యూ హాంప్‌షైర్, ప్లేమౌత్, రోడ్ - ఐలాండ్, రెడ్ వైట్ లెగ్ హార్న్, అనోకా కోళ్లు మాంసానిచ్చే విదేశీ రకాలు.

* గుడ్లు పెట్టడంలో సమర్థతమైనవి. ఆసీల్, కడక్‌నాథ్, చిత్తగాంగ్, లాంగ్‌షాన్, బ్రూసాఈ కోళ్లన్నీ స్వచ్ఛమైన దేశీయ రకాలు.

ఆసీల్ (బెరస కోడి)

* ఇది దేశీయ కోడి. దీన్ని కోడి పందేల కోసం పెంచుతారు.
* వీటిలో పోరాడే తత్వం, అధికశక్తి, ధీరత్వం ఉంటాయి.
* జనవరి, ఏప్రిల్‌లో గుడ్లను ఎక్కువగా పొదగడానికి ఉపయోగిస్తారు. ఈ సమయంలో ఉండే 37 - 38ºC ఉష్ణోగ్రత గుడ్లను పొదగడానికి అనుకూలంగా ఉంటుంది.
* బాయిలర్స్ 10 వారాలు పెరిగి 1.53 కిలోల మాంసాన్ని ఇస్తాయి.
* గుడ్లను పొదిగి కోడి పిల్లలను తయారుచేసే యంత్రాన్ని 'హేచరీ' అంటారు.
* కృత్రిమంగా గుడ్లను పొదిగించడానికి 'ఇంక్యుబేటర్స్‌'ను ఉపయోగిస్తారు.
* NECC (National Egg Coordination Committee)
'మీరు ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు ఒక గుడ్డు తినాలి'. ఇది జాతీయ గుడ్డు సమన్వయ కమిటీ నినాదం.
అన్ని పోషక విలువలతో చౌకగా, సులభంగా లభించే ఏకైక ఆహార పదార్థం గుడ్డు.

ఈమూ పెంపకం
* ఇది ఆస్ట్రేలియాలో పుట్టిన ఎగరలేని పక్షి.
* ఉష్ణపక్షి తర్వాత ఇది అతిపెద్ద పక్షి.
* ఇది 50 కిలోల బరువు ఉండి, గంటకు 40 మైళ్ల వేగంతో పరిగెడుతుంది.
* ఆదిలాబాద్, మెదక్, నల్గొండ జిల్లాల్లో ఈ పక్షుల పెంపకం ఎక్కువ.
* వీటి మాంసం, గుడ్లు, చర్మం, నూనె, ఈకలు ఖరీదైనవి.

తేనెటీగల పరిశ్రమ

* తేనె ఉత్పత్తి కోసం తేనెటీగలను పెంచడాన్ని తేనెటీగల పరిశ్రమ (ఎపీకల్చర్) అంటారు. 
* తేనె ఉత్పత్తి కోసమే కాకుండా, పంటల పరాగ సంపర్కంలో కూడా ఈ పరిశ్రమ ఎంతగానో తోడ్పడుతుంది.
* 4000 సంవత్సరాలకు పూర్వమే ఈజిప్టు దేశస్థులకు తేనెటీగల వలసలు, పెంపకం గురించి తెలుసు.
* క్రీ.పూ. 3000 - 2000 కాలంలో రాసిన రుగ్వేదంలో తేనెటీగలు, తేనె ప్రస్తావన ఉంది.
* 19వ శతాబ్దంలో శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా తేనెటీగల పెంపకం వాణిజ్య పరిశ్రమగా మారింది. భారతదేశంలో అయిదు రకాల తేనెటీగల జాతులను గుర్తించారు. అవి ఎపిస్ డార్సెటా, ఎపిస్ ఇండికా, ఎపిస్ ప్లోరా, ఎపిస్ మెలిపోనా, ఎపిస్ ప్రిగోనా.
* ఎపిస్ సెరినా అనే దేశీయ తేనెటీగ ఒక సంవత్సరంలో 3 - 10 కిలోల తేనెను ఉత్పత్తి చేస్తుంది.
* ఎపిస్ మెల్లిఫెరా అనే యూరోపియన్ తేనెటీగ ఏడాదికి ఉత్పత్తి చేసే తేనె పరిమాణం 25 - 30 కిలోలు.
* తేనె పట్టులో 3 రకాల ఈగలు ఉంటాయి. అవి రాణి ఈగలు, మగ ఈగలు/డ్రోన్లు, కూలీ ఈగలు.

రాణి ఈగలు
* వీటి సంఖ్య = 1
* ఇది 800 - 1200 గుడ్లు పెడుతుంది.
* జీవిత కాలం 2 - 3 సంవత్సరాలు

మగ ఈగలు/డ్రోన్లు

* ఇవి వందల సంఖ్యలో ఉంటాయి.
* ఇవి ఏ పనిచేయక సోమరులుగా ఉండి, కేవలం సంపర్కంలో మాత్రమే పాల్గొంటాయి.
* సంపర్క సమయంలో వీటి ఉదరకోశం పగలటం వల్ల ఇవి మరణిస్తాయి.
* వీటి జీవితకాలం 57 రోజులు.

 

కూలీ ఈగలు
* ఇవి వేల సంఖ్యలో ఉంటాయి.
* ఇవి వంద్య ఆడ ఈగలు
* ఇవి మొదటి '3' వారాలు తేనెపట్టు లోపల పనిచేసి, మైనాన్ని స్రవించడం, తేనెటీగల పిల్లలను పోషించడం వీటి
విధి. 3 వారాల తర్వాత తేనె పట్టు వెలుపల పనిచేసి మకరందాన్ని, పరాగ రేణువులను సేకరిస్తాయి.
* వీటి జీవిత కాలం 5 - 6 వారాలు.
* తేనెటీగల పెంపకం ద్వారా ఏర్పడే ప్రధాన ఉత్పత్తులు తేనెటీగల మైనం, తేనె విషం.
* తేనెటీగల విషాన్ని హోమియో వైద్యంలో 'ఎపిస్ టింక్చర్' తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. దీన్ని కీళ్ల వ్యాధి నివారణకు వినియోగిస్తారు.
* మైనంతో అలంకరణ సామగ్రి, గోళ్ల, చెప్పుల పాలిష్ లాంటివి తయారు చేస్తారు.
* తేనె పట్టుపై ఎక్కువగా దాడి చేసేవి మైనపు పురుగులు, కందిరీగలు, తుమ్మెదలు, తూనీగలు.
* హానిబాడ్జర్, ఎలుగుబంటి తేనె పట్టు నుంచి తేనెను తింటాయి.

మకరందపు వనరులు

* తేనెటీగలకు మకరందం, పరాగ రేణువులు ఉన్న మొక్కలంటే చాలా ఇష్టం. కాబట్టి వీటిని 'తేనె వృక్షజాలాలు' అంటారు.

మత్స్య సంవర్థనం (చేపల పెంపకం)
* భారతదేశంలో దాదాపుగా 7500 కి.మీ.ల సముద్రతీరం ఉంది. సముద్రతీరం లోపల దాదాపు 0.48 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో చేపల పెంపకానికి అనువైన జలవనరులు ఉన్నాయి.
* అధిక మొత్తంలో జంతు ప్రొటీన్లు ఉండే ముఖ్యమైన ఆహారం చేపలు. వీటి పిల్లలను/ గుడ్లను విత్తనాలు అంటారు.
* సముద్రం చేపల ఉత్పత్తికి మూలస్థానం. ఇందులో ప్రధానంగా సార్‌డైన్స్, బాంబేడక్, మ్యూకరిల్స్, కాట్ ఫిష్, నత్తలు, పీతలు, టునా లాంటి సముద్రజాతులు ఉన్నాయి.

* వీటితోపాటుగా 'సముద్రపు కలుపు' సముద్రంలో ముఖ్యమైన జీవ వనరు. ఈ కలుపు మొక్కలు చేపలకు ప్రధాన ఆహార వనరు. వీటిని పశువుల దాణాగా, కోళ్లకు ఆహారంగా, ఎరువుగా ఉపయోగిస్తారు. కొన్ని రకాల సముద్రపు కలుపు మొక్కలను ఆహారంగా కూడా ఉపయోగిస్తారు.
* అగార్ అనే సముద్రపు కలుపును పరిశ్రమల్లో 'పైకోకొల్లాయిడ్‌'గా ఉపయోగిస్తారు.
 * వివిధ రకాల చేపల జాతులను కలిపి ఒకే ప్రదేశంలో పెంచడాన్ని 'సమ్మిళిత చేపల పెంపకం' అంటారు.
* నది నీరు - సముద్రపు నీరు కలిసే నదీ ముఖ ప్రదేశాలైన ఎశ్చుయరీస్‌లో కూడా చేపలు పెరుగుతాయి.
* నదీ ముఖద్వారాలు నదీ వ్యవస్థలో భాగం. ఇందులో మంచినీటి, ఉప్పునీటి జాతులు రెండూ కలసి ఉంటాయి. ఈ జాతులకు లవణీయతా వ్యత్యాసాన్ని తట్టుకునే శక్తి ఉంటుంది.
* రైతులు ఈ మధ్య వరి పంటలో కూడా చేపలను పెంచుతున్నారు. దీని వల్ల వరిలో కాండం తొలుచే పురుగు వంటి వ్యాధులను అరికట్టవచ్చు.
* కొర్రమీను, జెల్ల, బొచ్చెలు, మోసు, తాటాకు చేపలు మొదలైనవి మంచినీటి చేపల జాతులు.
* చేపలను నిల్వ చేసి ఎగుమతి చేసేందుకు ఎండబెట్టడం, ఉప్పులో ఊరబెట్టడం, పొగబెట్టడం లాంటి సాధారణ పద్ధతులు ఉపయోగిస్తారు.
* సమ్మిళిత చేపల పెంపకంలో కుంటలో 5 నుంచి 6 రకాల చేపల జాతులను కలిపి పెంచుతారు. ఈ జాతుల చేపల మధ్య ఆహారపు అలవాట్లు వేర్వేరుగా ఉండటం వల్ల పోటీ ఉండదు.
* జెల్ల చేపలు ఉపరితల ఆహారాన్ని సేకరిస్తాయి.
* మోసు చేపలు కుంట మధ్య ప్రాంతంలోని ఆహారాన్ని సేకరిస్తాయి.
* బురద మట్ట చేపలు అడుగు భాగంలోని ఆహారాన్ని సేకరిస్తాయి.

పట్టు పురుగుల పెంపకం

* మల్బరీ చెట్లను పెంచడం, గుడ్లను సేకరించడం, గొంగళి పురుగులను పెంచడం కకూన్లను ఉత్పత్తి చేసి చివరకు పట్టు దారాలను ఉత్పత్తి చేయడాన్ని 'పట్టు సంవర్థన' అంటారు. 

* క్రీ.పూ. 2700లో చైనాలో, చైనా రాణి మల్బరీ చెట్టు కింద 'టీ' తాగుతున్నప్పుడు ఆమె కప్పులో 'పట్టు పురుగు కకూన్' పడటం ఆమె దాన్ని తీసే ప్రయత్నంలో దారాలు లాంటి పదార్థం బయటకు వచ్చింది. అప్పుడు ఆమె దాని చరిత్రను అధ్యయనం చేయమని చెప్పడంతో పట్టు పురుగుల పెంపకం ప్రారంభమైందని ప్రచారంలో ఉంది.
* పురావస్తు శాస్త్ర పరిశోధనల ప్రకారం పట్టు పరిశ్రమ క్రీ.పూ. 5000 - 3000 సంవత్సరం నాటి నుంచి ప్రారంభమైనట్లు ఆధారాలు ఉన్నాయి.
* పట్టుపురుగు (బాంబిక్స్‌మోరి) సీతాకోకచిలుక లాగానే ఉంటుంది.
* ఆడపురుగు ఒకేసారి 500 గుడ్లను పెట్టి మరణిస్తుంది.
* మల్బరీ ఆకులతో పేర్చిన మెత్తటి చాపల మీద ఈ గుడ్లను ఉంచి పొదిగిస్తారు.
* పట్టు చిలకలను కూడా అమ్మే కేంద్రాలు ఉన్నాయి. వీటిని 'గ్రైనేజస్' అంటారు.
* పట్టుగుడ్ల నుంచి బయటకి వచ్చిన పురుగులను గొంగళి పురుగులు అంటారు. ఇవి 30 - 35 రోజులపాటు పగలు, రాత్రీ మల్బరీ ఆకులను తింటాయి.
* తర్వాత తినడం మానేసి 'చంద్రిక'లో ఏదైనా ఒక చోట నిశ్చలంగా ఉండి, నోటిద్వారా దారంలాంటి పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ దారం పురుగు చుట్టూ అల్లుకొని చివరకు పురుగు మొత్తం మూసుకుపోయేలా గూడు అల్లుకుంటుంది. దీన్నే పట్టుకాయ/ కకూన్ అంటారు.
* 2 - 3 వారాల తర్వాత అవి పట్టు చిలుకలుగా మారి కకూన్ నుంచి బయటకు వచ్చి ఎగిరిపోతాయి.
* కాబట్టి కకూన్ ఏర్పడిన 2 - 3 రోజులకే వాటిని 10 - 15 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడికించి డింభకాలను చంపడాన్ని స్టిప్పింగ్ అంటారు.

* కకూన్‌లను మార్కెట్‌కు తరలిస్తారు.

* పట్టుకాయ నుంచి పట్టు దారాన్ని తియ్యడాన్ని రీలింగ్ అంటారు.
* రీలింగ్ ద్వారా తీసిన దారాల్లో 3 - 8 దారాలను కలిపి చుట్టి పట్టు నూలు తయారు చేస్తారు.
* తెలుగు రాష్ట్రాల్లో పట్టు వస్త్రాలకు ధర్మవరం, పోచంపల్లి ప్రసిద్ధి చెందాయి. పోచంపల్లి పట్టును 'టై అండ్ డై'/ 'జమదాని' పట్టు అని కూడా పిలుస్తారు.
* ఒక కకూన్ నుంచి 1000 - 3000 అడుగుల పొడవైన దారం లభిస్తుంది.
* పట్టు పరిశ్రమలో పని చేసేవాళ్లు చర్మ, శ్వాససంబంధ వ్యాధులతో బాధపడుతుంటారు.
* మల్బరీతో పాటు టస్సార్ పట్టును కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉత్పత్తి చేస్తారు. కొన్నిరకాల పట్టు పురుగులు తెర్మినేలియా (ఓక్) చెట్లపైన పెరుగుతాయి. వాటి గుడ్ల నుంచి టస్సార్ పట్టును ఉత్పత్తి చేస్తారు.


రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌