• facebook
  • whatsapp
  • telegram

జీవుల్లో వైవిధ్యం - వర్గీకరణ

* ఒక ప్రదేశంలో నివసించే జీవజాతుల సముదాయాన్నే జీవవైవిధ్యం అంటారు.
* ఈ జీవజాతుల పోలికలను బట్టి వేర్వేరు సమూహాలుగా ఏర్పాటు చేయడాన్నే వర్గీకరణ అంటారు.
* మొక్కలు, జంతువులను మొదట వర్గీకరించిన శాస్త్రవేత్త అరిస్టాటిల్.
* మొక్కల ఔషధ గుణాలను బట్టి వర్గీకరించిన భారతీయ శాస్త్రవేత్తలు శుశృతుడు, చరకుడు.
* పుష్పాలను బట్టి మొక్కలను వర్గీకరించిన భారతీయ శాస్త్రవేత్త పరాశరుడు. ఆయన రాసిన గ్రంథం వృక్షాయుర్వేద.
* జాతి అనే పదాన్ని మొదటిసారిగా జాన్‌రే ఉపయోగించారు.
* జాతి అంటే దగ్గర పోలికలు ఉండి, ఒకదాంతో ఒకటి స్వేచ్ఛగా సంపర్కం జరుపుకోగల జీవుల సముదాయం.
* వర్గీకరణలో పై నుంచి కిందకు వచ్చే కొద్దీ జీవుల మధ్య పోలికల సంఖ్య పెరుగుతుంది.
* కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ జీవుల మధ్య పోలికల సంఖ్య తగ్గుతుంది.
* పూర్వ వర్గీకరణలో 7 అంతస్తులు ఉండేవి.
1. రాజ్యం
2. వర్గం
3. తరగతి
4. క్రమం
5. కుటుంబం
6. ప్రజాతి
7. జాతి

వర్గీకరణ ఆవశ్యకత
* జీవుల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి తోడ్పడుతుంది.
* జీవరాసుల గురించి అధ్యయనం చేయడానికి దోహదపడుతుంది.
* జీవులు వాటి పూర్వీకుల నుంచి ఏ విధంగా ఏర్పడ్డాయో వివరిస్తుంది.
* జీవుల మధ్య ఉన్న సంబంధం, పరస్పర ఆధారిత్వాన్ని గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.
* జనాభాలోని వివిధ రకాల జీవుల గురించి అధ్యయనం చేసేందుకు వీలు కల్పిస్తుంది.
* ప్రకృతిలో జరిగిన జీవపరిణామం గురించి ఒక అవగాహనకు రావడానికి ఈ వర్గీకరణ తోడ్పడుతుంది.
* జీవుల పరిణామం గురించి మొదటగా పేర్కొన్న గ్రంథం 'జీవుల పుట్టుక' (1859). ఈ గ్రంథ రచయిత చార్లెస్ డార్విన్ (Origin of specices).
* మొదటిసారిగా 1758లో కరోలస్ వాన్ లిన్నేయస్ వర్గీకరణ శతాబ్దాలుగా ఉన్న వర్గీకరణలన్నింటినీ అధిగమించింది. ఈయన జీవికి రెండు పేర్లతో నామకరణం చేశారు. దీన్ని ద్వినామీకరణం అంటారు. ఇందులో మొదటి పదం జాతిని, రెండో పదం ప్రజాతిని తెలియజేస్తాయి.
ఉదా: హోమో సెపియన్స్. హోమో అంటే ప్రజాతి, సెపియన్స్ అంటే జాతి.
* ప్రజాతి సమూహాలను కుటుంబం అని, కుటుంబాలన్నీ కలిసి క్రమం, క్రమాలన్నీ కలిపి తరగతులు, తరగతులన్నీ కలిపి వర్గాలుగా, వర్గాలన్నీ కలిపి రాజ్యాలుగా పేర్కొన్నారు.

* లిన్నేయస్ జీవులను 2 రాజ్యాలుగా గుర్తించారు. అవి:
   అనిమేలియా (జంతువులు), ప్లాంటే (మొక్కలు).
* అంతే కాకుండా లిన్నేయస్ వర్గీకరణ గురించి రెండు గ్రంథాలు రాశారు. వృక్షాలకు సంబంధించి - స్వీసీస్ ప్లాంటారమ్.
జంతువులకు సంబంధించి - సిస్టిమా నాచురే.
* ఈ విధానంలో వర్గీకరణానికి జాతి ప్రాథమిక పరిమాణం.
* మొదట లిన్నేయస్ వర్గీకరణను అడ్డుకుంది థామస్ విట్టేకర్.
* 1969లో లిన్నేయస్ వర్గీకరణకు మరొక 3 రాజ్యాలను కలిపి 5 రాజ్యాలున్న వర్గీకరణను ప్రతిపాదించారు. అవి:
1) మొనీరా          2) ప్రొటిస్టా      3) ఫంగై       4) ప్లాంటే        5) అనిమేలియా
* విట్టేకర్ మొదట జీవుల్లో కేంద్రకం ఉన్నవి లేదా కేంద్రకం లేనివి అనే లక్షణాన్ని గుర్తించారు.
* కేంద్రకాయుత ఏకకణ జీవులను ప్రొటిస్టా రాజ్యంలో పొందుపరిచి, మిగిలిన 3 రాజ్యాల్లోని జీవులను అవి ఆహారాన్ని పొందే విధానంలో భేదాలను బట్టి పొందుపరిచారు.
* ఈయన వర్గీకరణ జీవ వైవిధ్యాన్ని విశదీకరించడంలో విఫలమైంది.

వర్గీకరణ విధానంలో అమరిక
* ప్రస్తుత వర్గీకరణ విధానంలో జీవుల అమరిక 'రంగం' నుంచి ప్రారంభమవుతుంది.
                                                         

16వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు జీవులను శాస్త్రవేత్తలు వర్గీకరించిన విధానం 


విట్టేకర్ వర్గీకరణ (1969, 5 రాజ్యాలు)
1) మొనీరా
* పురాతన, ప్రాచీనమైన ఏకకణ, కేంద్రక పూర్వజీవులు ఉండే రాజ్యం. వీటిలో కేంద్రకం ఉండదు. అందువల్ల వీటిని ప్రోకారియేట్స్ అంటారు.
* ఇవి అతి తక్కువ ఉష్ణోగ్రత, అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో జీవించగలిగే లక్షణాన్ని కలిగి ఉంటాయి.
* ఇవి ద్విదావిచ్ఛితి ద్వారా ప్రత్యుత్పత్తి జరుపుతాయి.
* కశాభం, శైలికలు చలనాంగాలుగా ఉంటాయి.
ఉదా: బ్యాక్టీరియా, అనబీనా
* ఇందులోని బ్యాక్టీరియాను తిరిగి 3 రకాలుగా విభజించారు.

 

మొనీరా 3 సమూహాలుగా ఉంటుంది.
ఆర్కి బ్యాక్టీరియా
* ఇప్పటి వరకు మనుగడ సాగిస్తున్న అతి ప్రాచీన బ్యాక్టీరియా.
* ఇది ఉష్ణమడుగులు/ వేడినీటి బుగ్గల్లో నివసిస్తుంది.

యూబ్యాక్టీరియా
* స్ట్రెప్టోకోకస్, రైజోబియం, ఈ.కోలై దీనికి ఉదాహరణ.

 

సయనోబ్యాక్టీరియా
* ఇది నిజానికి బ్యాక్టీరియా కాదు. వీటి బాహ్య నిర్మాణం శైవలాలను పోలి ఉంటే, అంతర్నిర్మాణం బ్యాక్టీరియాను పోలి ఉంటుంది.
* వీటిని నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు.

 

2) ప్రొటిస్టా
* వీటిలో చాలా వరకు ఏకకణ జీవులను, కొన్నింటిని మాత్రమే బహుకణ జీవులను చేర్చారు.
* వీటిలో కేంద్రకం ఉంటుంది. కాబట్టి ఇవి యుకారియేట్స్.
* పోషణను బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు.
ఎ) స్వయం పోషకాలు: డయాటమ్స్ (సముద్రంలో తేలి ఉండే పచ్చికబయళ్లు).
బి) పర పోషకాలు: ప్రోటోజోవన్స్ (అమీబా, యుగ్లీనా, పారమీషియం).
* చాలా వరకు ప్రత్యుత్పత్తిని 'ద్విదావిచ్ఛిత్తి' ద్వారా, కొన్ని మాత్రమే 'బహుదావిచ్ఛిత్తి' ద్వారా జరుపుకుంటాయి.
*ప్రోటోజోవాలోని యూగ్లీనా పగటిపూట మొక్కల్లా కిరణజన్య సంయోగ క్రియను జరుపుతుంది. రాత్రివేళ జంతువుల్లా పరపోషణను ప్రదర్శిస్తుంది. అందువల్ల దీన్ని డే ప్లాంట్ నైట్ యానిమల్ అని పిలుస్తారు.

3) ఫంగై (శిలీంధ్రాలు)

* వీటిలో కొన్ని ఏకకణ జీవులను, చాలా వరకు బహుకణ జీవులను చేర్చారు.
* సన్నని దారపు పోగుల లాంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి.
* ఇవి సిద్ధ బీజాల సహాయంతో ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి.
* వీటిని పూతికాహారులుగా పిలుస్తారు.
* భూమిపై ఉండే జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేస్తాయి. అందువల్ల వీటిని పారిశుద్ధ్య కార్మికులు అని కూడా అంటారు.
ఉదా: రైజోపస్, మ్యూకార్
* పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ తయారీలో ఉపయోగించే శిలీంధ్రం పెనిసిలియం నోటేటమ్. పెన్సిలిన్‌ను అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కనుక్కున్నారు.
* కంటికి కనిపించే శిలీంధ్రం అడారికస్.
 

4) ప్లాంటే (వృక్ష రాజ్యం)
*  ఆహారం సేకరించే విధానం, ప్రత్యుత్పత్తి, అవయవాలు, ప్రత్యుత్పత్తి జరుపుకునే విధానాన్ని బట్టి మొక్కలను వర్గీకరించారు.
*  ఇవి బహుకణ, నిజకేంద్రక స్వయంపోషక జీవులు.
*  దీన్నే మెటా‌ఫైటా అని కూడా అంటారు.
*  ఇప్పటి వరకు 5,50,000 వృక్ష జాతులను గుర్తించారు.


 

గమనిక: ఆధునిక వర్గీకరణలో థాలోఫైటాను తొలగించారు.

బ్రయోఫైటా:
* తడి, పొడి నేలల్లో; కాలిపోయిన ప్రదేశాల్లో ఇవి జీవించగలవు.
* వాటి శరీరం వెల్‌వెట్ కాగితంలా మెత్తగా ఉంటుంది.
* వాటిని వృక్షరాజ్య ఉభయ చరాలు అని పిలుస్తారు.
ఉదా: రిక్సియా, మార్కాంషియా
* వాటికి నిజమైన వేర్లు, పత్రాలు ఉండవు.

 

టెరిడోఫైటా:
* వీటికి నిజమైన వేర్లు, పత్రాలు ఉంటాయి.
* వీటిని అలంకరణ కోసం నీటిలో, ఉద్యానవనాల్లో పెంచుతారు.
ఉదా: ఫెర్న్

 

వివృత బీజాలు:
* వీటిలో విత్తనాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి.
* వీటిని నగ్న విత్తనాలు కలిగిన మొక్కలు అంటారు.
ఉదా: సైకస్, పైనస్

ఆవృత బీజాలు:

* వీటిలో విత్తనాలు ఫలంలో ఇమిడి ఉంటాయి.
* వృక్షరాజ్యంలో అత్యధికంగా ఈ మొక్క జాతులు ఉన్నాయి.
* మానవుడికి నిజ జీవితంలో ఆహారపు అవసరాలను తీర్చే మొక్కలివి.

ఆవృత బీజాల విత్తనాల్లోని ఫలదళాల ఆధారంగా 2 తరగతులుగా విభజించారు.
ఎ) ఏకదళ బీజాలు: ఒకే ఒక ఫలదళం ఉంటుంది.
ఉదా: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, కొబ్బరి.
బి) ద్విదళ బీజాలు: రెండు ఫలదళాలు కలిగి ఉంటాయి.
ఉదా: మామిడి, చిక్కుడు, చింత.

 

5) అనిమేలియా
* జంతువులన్నింటినీ ఈ రాజ్యంలో చేర్చారు. ఈ రాజ్యాన్ని మెటజోవా అంటారు.
* శరీర నిర్మాణంలోని పోలికలు, వ్యత్యాసాల అనుగుణంగా జంతువుల వర్గీకరణ జరిగింది.
* పుష్ఠ వంశం/ వెన్నెముక ఆధారంగా వీటిని అకశేరుకాలు, సకశేరుకాలు అని రెండు వర్గాలుగా విభజించారు.

 

అకశేరుకాలు
* ఇవి పుష్ణవంశం/ వెన్నెముక లేని జీవులు.
* భూమిపైన 95% విస్తరించి ఉన్నాయి. వీటిని తిరిగి 9 వర్గాలుగా విభజించారు.

పొరిఫెరా
* వీటిని స్పంజికలు అని కూడా అంటారు.
* పొరిఫెరా అంటే 'రంధ్రాలు ఉన్న జీవులు'.
* వీటికి ఆ పేరు పెట్టిన శాస్త్రవేత్త రాబర్ట్ గ్రాంట్.
* చలనాంగాలు లేకపోవడం వల్ల ఇవి చలన రహిత/ స్థాన బద్దజీవులు.
* రంధ్రాలు 'నాళ వ్యవస్థ'గా పనిచేస్తాయి. వీటి ద్వారా O2, ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది.
* శరీరం మొత్తం ఒక బలమైన అస్థి పంజరంతో కప్పి ఉంటుంది.
* స్పష్టమైన కణజాలాలు లేని బహుకణ జీవులు.
* వీటికి పునరుత్పత్తి శక్తి ఎక్కువ.
ఉదా: యూప్లిక్టెల్లా, సైకాస్, స్పాంజిల్లా, యూస్పాంజియా సీలెంటిరేటా/ నిడేరియా
* స్పష్టమైన కణాలున్న మొదటి వర్గం.
* మొదట శరీర కుహరం ఏర్పడిన జీవులు.
* ఇవి ద్విస్తరిత జీవులు.
* ఇవి స్పర్షకాలను కలిగి ఉంటాయి.
ఉదా: హైడ్రా, జెల్లిఫిష్

ప్లాటి హెల్మింథిస్ 
* ఇవి మొదటి త్రిస్తరిత బహుకణ జీవులు.
* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని కలిగి ఉంటాయి.
* ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే శరీర కుడి ఎడమ భాగాలు సమానంగా ఉండటం.
* వీటిలో ప్రత్యేక విసర్జక అవయవాలు జ్వాలాకణాలు.
* వీటి శరీరం బల్లపరుపుగా ఉంటుంది. కాబట్టి వీటిని చదును పురుగులు అంటారు.
* వీటిలో అధిక జీవులు పరాన్న జీవనం గడుపుతాయి.
ఉదా: టీనియాసోలియం/ బద్దె పురుగు - (పంది కండరాళ్లో ఉంటుంది)
పాషియోలా - లివర్‌ప్లూక్ (గొర్రె కాలేయంలో నివసిస్తుంది)
ప్లనేరియా - స్వతంత్రంగా జీవిస్తుంది (దీన్ని డుగిసియా అంటారు).

 

నిమటోడ/నిమాటి హెల్మింథిస్
* వీటిని నిజ పురుగులు, గుండ్రటి పురుగులు, దారపు పురుగులు అని పిలుస్తారు.
* ఇవి కూడా త్రిస్తరిత, ద్విపార్వ్శ సౌష్ఠవం ఉన్న జీవులు.
* వీటిలో కూడా అధిక జీవులు పరాన్న జీవనం గడుపుతాయి.
* వీటి శరీరం 'స్తూపాకారం'గా ఉంటుంది.
* మిథ్యా శరీర కుహరం ఉంటుంది.
ఉదా: వుకరేరియా బ్యాంక్రాఫ్టి (బోధకాలు వ్యాధి)
ఆస్కారిస్ లూంబ్రికాయిడ్స్ (ఏలికపాము - ఆస్కారియాసిస్ వ్యాధి)

అనెలిడా
* అనెలిడా అని పేరు పెట్టింది లామార్క్.
* శరీరం పొడవుగా, స్తూపాకారంగా ఉండి వలయాకార ఖండితాలను కలిగి ఉంటుంది
* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం ఉన్న త్రిస్తరిత జీవులు.
* వీటిలో మొదట బంధిత రక్తప్రసరణ వ్యవస్థ ఏర్పడింది.
* ఈ జీవుల శరీర నిర్మాణం 'ఖండితాలు'గా ఉంటుంది.
* అనులస్ = Rings , ఇడియస్ = Form శరీరం అంటే రింగులు రింగులుగా ఉంటుంది.
* హిమోగ్లోబిన్, క్లోరోక్రురిన్ లాంటి శ్వాస వర్ణకాలు ప్లాస్మాలో ఉంటాయి.
* వానపాములో ఎర్రరక్తకణాలు ఉండవు. దీన్ని రైతు మిత్రుడు అంటారు. వానపాముల పెంపకాన్ని వర్మికల్చర్ అంటారు. దీన్ని రైతు అకశేరుక స్నేహితుడు అంటారు.
* వానపాములో 8 జతల హృదయాలు ఉంటాయి.
ఉదా: వానపాము (పెరిటిమా), జలగ (హిరుడినియా)

ఆర్థ్రోపొడ
* ఆర్థ్రో అంటే - అతుకులు, పొడ అంటే - పాదాలు. అతుకులు/కీళ్లు గల కాళ్లు ఉండటం ఈ వర్గ జీవుల ముఖ్య లక్షణం.
* జంతుజాలంలో 80% ఆర్థ్రోపొడా వర్గానికి చెందినవే. జంతు రాజ్యంలో ఇది అతిపెద్ద వర్గం.
* అన్ని కీటకాలు ఈ వర్గానికి చెందినవే (అతిపెద్ద విభాగం - ఇన్‌సెక్టా).
* 90,000 ప్రజాతి జీవులను కల్గిన అతిపెద్ద వర్గం ఆర్థ్రోపొడ.

* కీటకాల అధ్యయనాన్ని 'ఎంటమాలజీ' అంటారు. వీటి విసర్జక పదార్థం యూరికామ్లం.
* వీటిలో స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ ఉంటుంది.
* ఈ జీవుల్లో మొప్పలు, పుస్తకాకార మొప్పలు, పుస్తకాకార ఊపిరితిత్తులు, వాయు నాళాల లాంటి శ్వాస అవయవాలు ఉంటాయి.
* శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది.
* కీటకాల్లో విసర్జక అవయవాలు మాల్ఫీజియన్ నాళికలు.
* రొయ్య, పీతల్లో విసర్జక అవయవాలు హరితగ్రంథి.
* తేలు విసర్జకావయం శిశోత్పాదకం.
* సజీవ శిలాజం విసర్జకావయం లిమ్యులస్ (రాచపీత).
ఉదా: రొయ్యలు, సీతాకోక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్లు, దోమ, నల్లి, పీతలు, జెర్రి.
* జీవితాంతం విసర్జక పదార్థాలను విసర్జించని జీవి లెపిస్మా (సిల్వర్ ఫిష్).

 

మొలస్కా
* ఇది రెండో అతిపెద్ద వర్గం. మొలస్కా అంటే 'మెత్తని శరీర భాగాలున్న జీవులు'.
* మెత్తని శరీరం, ధ్రుడమైన కర్పరాన్ని కలిగి ఉంటాయి.
* వీటిలో మొదటగా నాలుక ఏర్పడింది.
* శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది.

* ద్విపార్శ్వ సౌష్ఠవం ఉంటుంది.

* ఈ జీవుల్లో శరీర విభజన మొదలవుతుంది.
* స్వేచ్ఛాయుత రక్తప్రసరణ వ్యవస్థ కలిగి ఉంటాయి.
* వీటి రక్తంలో 'రాగి' కలిగిన హిమోసయానిన్ అనే శ్వాస వర్ణకం ఉంటుంది.
* విసర్జన వ్యవస్థ 'వృక్కాల' లాంటి నిర్మాణాలతో జరుగుతుంది.
* ముత్యాలను ఉత్పత్తి చేసే మొలస్కాలను 'ఆయిస్టర్' అంటారు.
* అతిపెద్ద సజీవ అకశేరుక జీవి ఆర్కిట్యూథిస్. ఆక్టోపస్‌ను దెయ్యపు చేప అంటారు.
ఉదా: నత్తలు, ఆల్చిప్పలు, కోమటి సంచులు (Loligo)
* ఆల్చిప్పల కర్పరం CaCO3 తో నిర్మితమవుతుంది.


ఇఖైనోడర్మేటా
* గ్రీకు భాషలో 'ఇఖైనో' అంటే 'ముళ్లు, 'డెర్మా' అంటే 'చర్మం' అని అర్థం.
* ముళ్ల లాంటి చర్మం ఉన్న జీవులను ఇఖైనోడర్మేటా అంటారు.
* ఇవి సముద్ర జీవులు, త్రిస్తరిత అనుపార్శ్వ సౌష్ఠవం ఉన్న జీవులు.
* వాటికి శరీరపు కదలికకు, చలనం కోసం 'జల విసర్జన వ్యవస్థ'ను ఉపయోగించుకుంటాయి. పారవ్యవస్థ 'నాళికా పాదాలు' కలిగి ఉంటుంది.
* CaCO3 తో ఉండే అస్థిపంజరాన్ని కలిగి ఉంటాయి.

ఉదా: సముద్ర నక్షత్రం, సీఅర్చిన్‌లు
* పంచభాగ వ్యాసార్థాన్ని కలిగి ఉంటాయి.
* ఇవి ఆత్మత్యాగాన్ని, పునరుత్పత్తిని ప్రదర్శిస్తాయి. తెగిపోయిన శరీర భాగాలు తిరిగి పునరుత్పత్తి అవుతాయి.
ఉదా: స్టార్‌ఫిష్

 

ప్రోటోకార్డేటా
* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం ఉండే త్రిస్తరిత జీవులు.
* నిజ శరీర కుహరం ఉండే జీవులు.
* ఇవి పుష్ఠవంశాన్ని కలిగి ఉంటాయి.
* పుష్ఠవంశం నాడీ కణజాలాల నుంచి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. శరీరం వెనుక భాగంలో తల నుంచి చివరి వరకు వ్యాపించి ఉంటుంది.
ఉదా: హెర్డ్మెనియా, ఆంఫియాక్సస్
*వర్గం హెమికార్డేటాను పూర్వం కార్డేటా వర్గంలో ఒక ఉపవర్గంగా పరిగణించేవారు. ఇప్పుడు ఈ జీవులను అకశేరుకాల్లో ఒక ప్రత్యేక వర్గంలో చేర్చారు. ఈ వర్గం క్రిములు/పురుగులు లాంటి సముద్ర జీవులను కలిగి ఉంటుంది.
ఉదా: బెలనోగ్లాసస్ (ఎకార్న్ వార్మ్)

సకశేరుకాలు (కార్డేటా)
* వెన్నెముకను కలిగిన జీవులను సకశేరుకాలు అంటారు.
* ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవం, నిజ శరీర కుహరం ఉండే త్రిస్తరిత జీవులు.
* పుష్ఠవంశంను కలిగి ఉంటాయి.
* నిజ శరీర కుహరం ఉంటుంది.
వీటిని 5 వర్గాలుగా విభజించారు.
  1) చేపలు
  2) ఉభయచరాలు
  3) సరీసృపాలు
  4) పక్షులు
  5) క్షీరదాలు


చేపలు
* వీటి అధ్యయనాన్ని ఇక్తియాలజీ అంటారు.
* ఇవి శీతల రక్త జీవులు. వీటి శరీర ఉష్ణోగ్రత వాతావరణానికి అనుకూలంగా మార్పు చెందుతుంది.
* వీటిలో మొప్పల సహాయంతో జల శ్వాసక్రియ జరుగుతుంది.
* వీటికి పొలుసులు ఉంటాయి. సకశేరుకాల్లో అతి పెద్ద వర్గం.

* పార్శ్వవాజాలు చలనాంగాలుగా, పుచ్చవాజం దిక్సూచిగా పని చేస్తుంది.
* చేపలు అండోత్పాదకాలు, కానీ సొరచేప లాంటి కొన్ని చేపలు శిశోత్పాదకాలు.
* వీటి గుండెలో 2 గదులు ఉంటాయి.
* ఏకవలయ రక్త ప్రసరణ విధానాన్ని కలిగి ఉంటాయి.
* చేపలు డాల్ఫిన్, తిమింగలాన్ని పోలి ఉన్నప్పటికీ ఇవి పిల్లల్ని పెట్టే క్షీరదాలు.
* నీటిగుర్రం (హిప్పోకాంపస్) కూడా నీటిలో కనిపించే ఒక చేప లాంటి జీవి. వీటిలో మగజీవిలో సంతానోత్పత్తి ఉంటుంది. నీటి గుర్రాలను చైనీయులు వైద్యంలో ఉపయోగిస్తున్నారు. కానీ వాటి ఆవాసంలోని మార్పులు, ఎక్కువగా వేటాడటం వల్ల అవి అంతరించి పోతున్నాయి.
ఉదా: కట్ల (మంచినీటి చేప), లేబియో (మంచినీటి చేప), హిప్పోకాంపస్ (సముద్ర గుర్రం), ఎక్సోసీటస్ (ఎగిరే చేప), ఎఖినస్ (అంటుబిళ్ల చేప)


ఉభయ చరాలు
* వీటి అధ్యయనాన్ని అంఫీబియాలజీ అంటారు.
* ఇవి నీటిలో, భూమి మీద జీవించగలవు. ఇవి శీతల రక్త జంతువులు.
* వీటిలో మూడు గదుల హృదయం ఉంటుంది. రెండు కర్ణికలు, ఒక జఠరిక.
* మిశ్రమ రక్తం శరీరమంతటా ప్రవహిస్తుంది.
* వీటిలో మూడు రకాల శ్వాస అవయవాలు ఉంటాయి.

* లార్వా దశలో మొప్పలు, ప్రౌఢ దశలో చర్మం, ఊపిరితిత్తులు ఉంటాయి.

* గ్రీష్మకాల, శీతాకాల సుప్తావస్థలు చూపుతాయి.
* మగ కప్పలో ఒక జత స్వరకోశాలు, ఒక జత ఆంప్లక్సరీ మెత్తలు ఉంటాయి.
* మొదటి చతుష్పాదులు (ఒక జత పూర్వాంగాలు, ఒక జత చర్మాంగాలు)

 

సరీసృపాలు
* వీటి అధ్యయనాన్ని హెర్పటాలజీ అంటారు.
* ఇవి కూడా శీతల రక్త జంతువులు.
* వీటి చర్మం పొడిగా, పొలుసులతో ఉంటుంది.
* గుండెలో 3 గదులు ఉంటాయి.
* మొసళ్లలో మాత్రం 4 గదులు ఉంటాయి.
* సంపూర్ణంగా భూమి మీదకు చేరిన మొదటి జీవులు సరీసృపాలు.
ఉదా: పాములు, బల్లులు, తాబేలు, మొసలి.

పక్షులు 

* వీటి అధ్యయనాన్ని ఆర్నిథాలజీ అంటారు.
* శరీరం మొత్తం ఈకలతో నిండి ఉంటుంది. కాళ్లకి గోర్లు ఉంటాయి.
* ఇవి ఉష్ణరక్త జీవులు. గుండెలో 4 గదులు ఉంటాయి.
* భారతదేశ పక్షిశాస్త్ర పితామహుడు సలీంఅలీ.
* అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్.
* వైద్య రంగంలో ఉపయోగపడుతున్న రెండో పెద్ద పక్షి ఈము (ఆస్ట్రేలియా).

 

భారత్‌లో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న పక్షులు
బట్టమేకల పిట్ట, కలివి కోడి, రాబందు, పిచ్చుకలు
* ఎక్కువకాలం జీవించే పక్షి చిలుక.
* నోటి ద్వారా పాలను అందిస్తూ, ఏక భార్యత్వాన్ని ప్రదర్శించేది పావురం. దీనికి ముందు కాళ్లు రెక్కలుగా మారి
ఉంటాయి.
* ఎముకలు గాలితో నిండి బోలుగా ఉంటాయి. వీటిని వాతులాస్థులు అంటారు.
* అతి చిన్న పక్షి హమ్మింగ్‌బర్డ్.
* కోడి, బాతు, నెమలి, పెంగ్విన్, ఉష్ణపక్షి, బట్ట మేకల పిట్ట, ఈము ఎగరలేని పక్షులు.

క్షీరదాలు
* వీటి అధ్యయనం మమ్మాలజీ అంటారు.
* వీటి శరీరం రోమాలతో కప్పి ఉంటుంది. వెలుపలి చెవి, ఉదర వితానం, క్షీర గ్రంథులు కలిగి ఉండటం ఎనిమిది పిల్లల్ని కనడం క్షీరదాల ముఖ్య లక్షణాలు.
* అతి పెద్ద క్షీరదం నీలి తిమింగలం, ఏనుగు.
* కంగారు పూర్తిగా ఎదగని పిల్లలను కంటుంది.
* వీటిని స్థిరోష్ణ జీవులు/ఉష్ణరక్త జంతువులు అంటారు.
* అండోత్పాదక క్షీరదాలకు ఉదాహరణ ఎకిడ్నా, ప్లాటిపస్.
* ఆడ, మగ ఎకిడ్నాలు రెండూ పిల్లలకు పాలు ఇస్తాయి.
* ఈ లక్షణాన్ని 'గైనకో మాస్టిజమ్' అంటారు.
* ఎగిరే క్షీరదం గబ్బిలం.
* క్షీరదాలను నేలపై నివసించే క్షీరదాలు, సముద్రపు క్షీరదాలు, ఎగిరే క్షీరదాలు అని 3 రకాలుగా పేర్కొనవచ్చు.

నేలపై నివసించే క్షీరదాలు
ఎ) మార్సు పియల్స్: పిల్లలను సంరక్షించుకోవడానికి ఒక సంచి లాంటి నిర్మాణం ఉదర భాగంలో ఉంటుంది.
ఉదా: కంగారూ.
బి) ప్రైమేట్స్: అభివృద్ధి చెందిన చేతులు/కాళ్లు కలిగి ఉంటాయి. వేళ్లకు గోర్లు ఉంటాయి. తెలివైన జీవులు, సంఘజీవులు, కుటుంబం, స్నేహితులతో బంధం ఏర్పర్చుకుంటాయి.
ఉదా: మానవుడు, కోతి.
సి) రోడెంట్స్: బలమైన దవడలు ఉండి ఆహారం తీసుకునేటప్పుడు కుంతకాలను ఉలిగా ఉపయోగించుకుంటాయి. కఠిన ఆహార పదార్థాలను సులువుగా తింటాయి.
ఉదా: ఎలుకలు

 

సముద్రపు క్షీరదాలు
* ఇవి సముద్రంలో ఉండి పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి.
* వీటికి రోమాలు ఉంటాయి. వీటి చర్మం చేపల చర్మంలా ఉంటుంది. ఉదా: డాల్ఫిన్, తిమింగలం

 

ఎగిరే క్షీరదాలు
* ప్రతిధ్వనులను ఉపయోగించి గమ్యాన్ని నిర్దేశించుకుంటాయి. ఇవి నిశాచరులు. చెట్టు తొర్రలు, గుహల్లో నివాసాలను ఏర్పర్చుకుంటాయి.
ఉదా: గబ్బిలం

నామీకరణ విధానం
* 18వ శతాబ్దంలో 'కరోలస్ వాన్ లిన్నేయస్' ద్వినామీకరణ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలో ప్రతి జీవికి రెండు పేర్లు ఉంటాయి.
* మొదటి పేరు ప్రజాతిని, రెండో పేరు జాతిని తెలియజేస్తాయి.
ఉదా: మాంజిఫెరా   ఇండికా
                              
         ప్రజాతి               జాతి

శాస్త్రీయ నామాన్ని ఆంగ్లంలో రాసేటప్పుడు పాటించాల్సిన సూచనలు
  1. ప్రజాతి పేరును పెద్ద అక్షరంతో రాయాలి.
  2. జాతి పేరును చిన్న అక్షరంతో రాయాలి.
  3. ముద్రించేటప్పుడు శాస్త్రీయనామం 'ఇటాలిక్స్‌'లో ఉండాలి.
  4. చేతితో రాసినట్లయితే జాతి, ప్రజాతి పేర్ల కింద గీత ఉండాలి.

   
రచయిత: కనుముక్కల నాగేంద్ర

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌