• facebook
  • whatsapp
  • telegram

మన విశ్వం 

       అనేక నక్షత్రాల సముదాయాన్ని 'గెలాక్సీ' అంటారు. పాలపుంత గెలాక్సీకి చెందిన అనేక నక్షత్రాలలో సూర్యుడు ఒకటి. అలాంటి గెలాక్సీలు విశ్వంలో వేల సంఖ్యలో ఉన్నాయి. కొన్ని నక్షత్రాలు సూర్యుడి వలె వాటి చుట్టూ తిరుగుతూ ఉండే గ్రహాల సముదాయాన్ని కలిగి ఉంటాయి. గ్రహాలకు వాటి చుట్టూ తిరిగే ఉప గ్రహాలు ఉన్నాయి. వీటన్నింటినీ మన విశ్వకుటుంబం అంటారు.
మనకు అత్యంత దగ్గరగా ఉన్న నక్షత్రమైన సూర్యుడు 1.5 × 1011 మీటర్ల దూరంలో ఉన్నాడు. ఈ దూరానికి ఖగోళ ప్రమాణం ఆస్ట్రనోమికల్ యూనిట్ (Astronomical Unit).
కాంతి సంవత్సరం (Light Year): కాంతి ఒక సంవత్సర కాలంలో శూన్యంలో ప్రయాణించే దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటారు. ఒక కాంతి సంవత్సరం 9.3 × 1015 మీటర్లు (లేదా) 6.33 × 104 ఖగోళ ప్రమాణాలకు సమానం.
సౌర కుటుంబం (Solar System ): సూర్యుడు, సౌరకుటుంబంలోని గ్రహాలు, ఉప గ్రహాలు, ఆస్టరాయిడ్స్ అనే గ్రహ శకలాలు, తోకచుక్కలను కలిపి సౌరకుటుంబం అంటారు.
గ్రహాలు, వాటి పరిమాణాలు: గ్రహాలు స్వయం ప్రకాశాలు కావు. ఇవి నక్షత్రాల చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతాయి. గ్రహాలు తిరిగే మార్గాన్ని 'కక్ష్య' అంటారు. గ్రహాల చుట్టూ తిరిగే గోళాలను ఉపగ్రహాలు అంటారు.

ప్రాణులు ఎక్కడెక్కడ...
      భూమిపై తప్ప మిగతా గ్రహాలపై ప్రాణులుండటానికి కావాల్సిన వాతావరణ పరిస్థితులు లేవు. బుధగ్రహం సూర్యుడికి అతి సమీపంలో ఉండటంవల్ల దానిమీద పగటి భాగం అతి వేడిగా, రాత్రి అతి చల్లగా ఉంటుంది.
* శుక్రగ్రహం అతి దట్టమైన మేఘాలతో ఉండటంవల్ల సూర్యకాంతి దాని తలాన్ని చేరలేదు.
* శనిగ్రహం కిలోమీటర్ల మందమున్న మంచు పొరలతో నిండి ఉండటం వల్ల అతి చల్లగా ఉంటుంది. కాబట్టి వీటిపై ప్రాణులుండటానికి అవకాశంలేదు.
* కుజగ్రహం మాత్రం ఆక్సిజన్, నీటి ఆవిరితో కూడిన వాతావరణాన్ని కలిగి ఉంది. కానీ దాని ఉష్ణోగ్రత 250C - 400C మధ్య ఉంటుంది. అయినప్పటికీ ఈ గ్రహం మీద రాళ్ల మధ్య జీవం ఉండటానికి అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.

 

గ్రహాలు - చలనాలు
      ప్రతీ గ్రహానికి రెండు రకాల చలనాలు ఉంటాయి. అవి... పరిభ్రమణం (Revolution), ఆత్మభ్రమణం (లేదా)
భ్రమణం (Rotation).
పరిభ్రమణం: గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరగడాన్ని పరిభ్రమణం అంటారు. భూమి సూర్యుడి చుట్టూ పరిభ్రమించడానికి 365  1/4 రోజులు పడుతుంది. ఈ విధంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమించడంవల్ల భూమిపై రుతువులు ఏర్పడుతున్నాయి.

ఆత్మభ్రమణం (లేదా) భ్రమణం: గ్రహాలు దాని గుండా పోయే అక్షం చుట్టూ భ్రమించడం ఆత్మభ్రమణం (లేదా) భ్రమణం అంటారు. భూమి తన చుట్టు తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. భూమి ఈ ఆత్మభ్రమణం వల్ల రాత్రి, పగలు ఏర్పడతాయి.
 ఉపగ్రహాలు: చంద్రుడు భూమికి సహజ ఉపగ్రహం. బృహస్పతి గ్రహానికి 16 ఉపగ్రహాలతోపాటు చిన్నచిన్న కణాలతో కూడిన ఉంగరం ఆకారంలో ఉండే వలయం ఉన్నాయి. శనిగ్రహం అందమైన వలయాలతోపాటు 21 ఉపగ్రహాలను కలిగి ఉంటుంది.

నక్షత్రాలు
    నక్షత్రాలు సూర్యుడి మాదిరిగా స్వయం ప్రకాశకాలుగా ఉండటం వల్ల ఉష్ణాన్ని, కాంతిని విడుదల చేస్తాయి. నక్షత్రం లోపల ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ డిగ్రీలు ఉంటుంది. కాబట్టి నక్షత్రాల్లో పదార్థం వాయు స్థితిలో ఉంటుంది.

నక్షత్రాలు హైడ్రోజన్, హీలియం వాయువులను చాలా ఎక్కువ పరిమాణంలో, మిగిలిన వాయువులను చాలా తక్కువ పరిమాణంలో కలిగి ఉంటాయి. కేంద్రక మేళనం అనే కేంద్రక చర్యలు జరగడంవల్ల నక్షత్రాలు కాంతిని, శక్తిని విడుదల చేస్తాయి.
నక్షత్ర మండలాలు (Constellations): కొన్ని నక్షత్రాల సముదాయాన్ని నక్షత్ర మండలాలు అంటారు. ఇప్పటి వరకు 88 నక్షత్ర మండలాలను గుర్తించారు. అంతరిక్షంలో ఉండే ధూళి, మేఘాలను నీహారికలు అంటారు.
నక్షత్రాల మధ్య గురుత్వాకర్షణ వల్ల అవి గుంపులు గుంపులుగా ఏర్పడతాయి. ఒక్కో నక్షత్ర గుంపును నక్షత్ర వీధి, నక్షత్ర పుంజం, నక్షత్ర ద్వీపం, గెలాక్సీ, తారాగణం మొదలైన పేర్లతో పిలుస్తారు.
పాలపుంత (లేదా) ఆకాశగంగ నక్షత్ర వీధిలో 15000 కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. దీనిలో 24 నక్షత్ర వీధుల సముదాయాలు ఉన్నాయి.
భూమికి సమీపంలో ఉన్న నక్షత్రవీధిని మెఘాలినిక్ మేఘం అంటారు. భూమికి, మెఘాలినిక్ మేఘానికి మధ్య దూరం 1,55,000 కాంతి సంవత్సరాలు.
సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్న నక్షత్రం 'ప్రాక్సిమా సెంటావ్‌రీ'. అతి ప్రకాశవంతమైన నక్షత్రం 'సిరియస్'.

 

ధ్రువ నక్షత్రం
     ధ్రువ నక్షత్రాన్ని ఆంగ్లంలో 'పొలారిస్ అంటారు. ఇది భూమి ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉంది.

ధ్రువ నక్షత్ర స్థానాన్ని సప్తర్షి మండలం సహాయంతో తెలుసుకోవచ్చు. సప్తర్షి మండలాన్ని ఇంగ్లిష్‌లో గ్రేట్‌బే
అంటారు. ఇది నాగలి (లేదా) గాలి పటం ఆకారంలో ఉంటుంది.
మాతృక నక్షత్ర వీధులు: విశ్వం వ్యాకోచ పదార్థం మొదట విస్పోటనం చెందినప్పుడు బిలియన్ల వాయు
పదార్థాల దీవులు అంతరిక్షంలో ఏర్పడ్డాయి. వీటిని మాతృక నక్షత్ర వీధులు అంటారు.
ఇప్పటి వరకు కనుక్కున్న పెద్ద నక్షత్రం 'ఎప్సిలాన్ ఎరిగా'. శాస్త్రజ్ఞులు ఇప్పటి వరకు 88 నక్షత్ర రాశులను
అధ్యయనం చేశారు. అతిపెద్ద నక్షత్ర రాశి హైడ్రా. దీనిలో 78 నక్షత్రాలు ఉంటాయి.
 కాస్మిక్ సంవత్సరం: పాలపుంతలోని నక్షత్రాలు పాలపుంత కేంద్రం చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి పట్టే కాలాన్ని కాస్మిక్ సంవత్సరం అంటారు.
కాస్మిక్ సంవత్సరం = 225  × 106 సంవత్సరాలు

పార్‌సెక్: ఇది దూరం ప్రమాణాలన్నింటిలో పెద్దది. ఇది 3.26 కాంతి సంవత్సరాలకు సమానం.
రాశుల గుర్తులు, రాశి చక్రాలు: ఒక సంవత్సర కాలంలో నక్షత్రాల మధ్య గమించే సూర్యుడి గమన మార్గాన్ని ఎక్లిఫ్టిక్ అంటారు. ఆ గమన మార్గానికి దగ్గరగా ఉండే పట్టి (లేదా) బెల్ట్ లాంటి భాగాన్ని రాశి చక్రం అంటారు. ఈ రాశి చక్రంలోని 12 నక్షత్ర మండలాలకు 12 పేర్లు పెట్టారు. వీటినే రాశి గుర్తులు అంటారు.

ఉల్కలు (Meteors): అంతరిక్షం నుంచి పడిపోతున్న రాళ్లు, ఖనిజాలను ఉల్కలు అంటారు. ఇవి భూ వాతావరణంలోకి ప్రవేశించగానే ఘర్షణ వల్ల బాగా వేడెక్కి మండుతూ, వెలుగుతూ ఉంటాయి. వాటిలో కొన్ని భూమికి చేరుతాయి. ఈ విధంగా భూమిపై పడే ఉల్కను ఉల్కాపాతం అంటారు.
 

తోకచుక్కలు (Comets )
        తోకచుక్కలో మూడు భాగాలు ఉంటాయి. అవి కేంద్రం, తల (లేదా) కోమా, తోక. వాటి గురించి సంక్షిప్తంగా..
కేంద్రం: తోకచుక్క తలలో వెలుగుతూ కనిపించే భాగాన్ని కేంద్రం అంటారు. ఇది మురికి, మంచుగడ్డతో ఉంటుంది. ఇందులో అమ్మోనియా, మీథేన్,  CO2 ఉంటాయి
తల (లేదా) కోమా: ఇది కేంద్రం చుట్టూ కనిపించే వాయు, ధూళి గోళం. సూర్యరశ్మిలో కేంద్రం కొంత కరగడంవల్ల కోమా ఏర్పడుతుంది. తోకచుక్క బృహస్పతి కక్ష్య వరకు చేరినప్పుడు కోమా కనిపిస్తుంది.
తోక: తోక పొడవు 20 నుంచి 30 మిలియన్ కిలోమీటర్ల వరకు ఉండొచ్చు.
హేలీ తోకచుక్క: హేలీ అనే ఖగోళ శాస్త్రజ్ఞుడు తోకచుక్కను కనుక్కుని దానికి హేలీ తోకచుక్క అని పేరు పెట్టాడు. ఇది 76 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడికి దగ్గరగా వచ్చి, మనకు కనిపిస్తుంది. ఇది 1986 లో కనిపించింది. మళ్లీ ఇది 2062 లో కనిపిస్తుంది.

షూ మేకర్ లేవీ - 9 తోకచుక్క: షూ మేకర్, లేవీ అనే ఇద్దరు ఖగోళ శాస్త్రజ్ఞులు మరో తోకచుక్కను గుర్తించారు. దానికి షూ మేకర్ లేవీ - 9 అని పేరు పెట్టారు. అది జులై 1994 లో సౌరకుటుంబంలోనే పెద్ద గ్రహమైన బృహస్పతిని ఢీకొట్టింది.


                                           రాశులు

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌