• facebook
  • whatsapp
  • telegram

బ్లూమ్స్ వర్గీకరణ

          విద్య ముఖ్య ఉద్దేశం విద్యార్థుల్లో మూర్తిమత్వాన్ని అభివృద్ధి చేయడమే. విద్యార్థుల్లో వాస్తవంగా ఆశించిన మార్పులు తెచ్చేందుకు, విద్య లక్ష్యాలను పరిశీలించేందుకు అమెరికాలో 1948లో బోస్టన్ పట్టణంలో మానసిక శాస్త్ర వేత్తల సదస్సు జరిగింది. ఇదే బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణకు దారితీసింది.

(ఈ సదస్సులో విద్యా లక్ష్యాలను గురించి సుదీర్ఘ పరిశోధన, వాటి వర్గీకరణ చేపట్టారు).
        విద్యా లక్ష్యాలను స్థూలంగా 3 రంగాలుగా వర్గీకరించారు.
1.  జ్ఞానాత్మక రంగం (Cognitive Domain Head)
2. భావావేశ రంగం (Affective Domain)
3. మానసిక చలనాత్మక రంగం (Psychomotor Domain Head)
        బెంజిమన్ ఎస్. బ్లూమ్స్ - జ్ఞాన రంగంలో; డేవిడ్ ఆర్ క్రాత్‌హాల్- భావావేశ రంగంలో; ఎలిజబెత్ సింప్సన్, ఆర్.హెచ్.దావే, హౌరో - మానసిక చలనాత్మక రంగంలో విశేష కృషి చేశారు.ప్రపంచమంతా వీటి ప్రాముఖ్యాన్ని గుర్తించింది. మన రాష్ట్రంలో 1971లో జి.ఒ.నెం.1781ని ప్రభుత్వం జారీచేసి (7-10 తరగతులు మినహా) నాన్ డిటెన్షన్ పాలసీని ప్రవేశపెట్టింది.

ఉపాధ్యాయులను ఉత్తీర్ణత, విద్యార్థులను మార్కుల సాధన వైపు నుంచి విద్యా లక్ష్యాల సాధన వైపు మళ్లించడమే ప్రభుత్వ ఉద్దేశం.
      విద్యలో పై మూడు రంగాలు పరస్పర సంబంధమైనవి. గాంధీ ప్రకారం విద్య పరమావధి శారీరక (Hands), మానసిక (Head) , ఆధ్యాత్మిక (Heart) రంగాలను అభివృద్ధి చేయడమే. దీనినే (H3) గా చెప్పవచ్చు. విద్యార్థిలో ఆలోచించే మస్తిష్కం, స్పందించే హృదయం, నిష్పాదన చేసే కర్మేంద్రియాలు విద్యా లక్ష్యాల సాధనకు కేంద్రాలు.
      సాధారణ బోధనా లక్ష్యాలు 7. (జ్ఞానం, అవగాహన, వినియోగం, అభిరుచి, వైఖరి, ప్రశంస, నైపుణ్యాలు) అయినా వీటిలో విద్యార్థి ఒక లక్ష్యంలో మొదట ఏమి సాధిస్తాడు. ఆ లక్ష్యం కింద సాధించాల్సిన అత్యున్నత ప్రవర్తనా మార్పు ఏమిటి? అనే వివరణ వీటిలో స్పష్టంగా లేదు. బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ ద్వారా మనం దీనిని తెలుసుకోవచ్చు.
       

వర్గీకరణ లక్షణాలు, ప్రయోజనాలు:
         మూడు రంగాల్లో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు ఆధిక్యత శ్రేణిలో ఉన్నాయి. ఉదా: విద్యార్థి అవగాహన లక్ష్యాన్ని సాధించాడంటే జ్ఞాన రంగంలో రెండో దశను చేరుకున్నట్లుగా చెప్పవచ్చు. ఫలితంగా విద్యా స్థాయులను మూల్యాంకనం చేయవచ్చు. (H3)  మూడు స్థాయుల్లో ఉన్న అభివృద్ధిని అవగాహన చేసుకోవచ్చు. మూల్యాంకనంలో సార్వత్రిక విధానాన్ని నెలకొల్పవచ్చు.

 

జ్ఞాన రంగం:
* ఈ రంగం మెదడుకు, ఆలోచనలకు, ప్రవర్తనలకు సంబంధించింది.
* ఇందులో మొత్తం 6 లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు అమర్చినవి.
* వీటి ద్వారా విద్యార్థి పొందేవి తెలుసుకోవడం, ఆలోచించగలగడం, సమస్యను పరిష్కరించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం, మానసిక అభివృద్ధిని సాధించడం.

 

1. జ్ఞానం:
          ఇది జ్ఞాన రంగంలో మొదటిది, సులువైనది. విద్యార్థి నేర్చుకున్న విషయాలను ఉన్నది ఉన్నట్లు చెప్పగలగడమే జ్ఞానం. ఇవి పదాలు, పేర్లు, తేదీలు, ప్రదేశాలు, వ్యక్తులు, విధానాలు, పద్ధతులు, వర్గీకరణలు లాంటివిగా ఉంటాయి.
ఎ) నిర్దిష్ట విషయాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: గర్జించే నలభైలు, పునరుజ్జీవనం, అంతర్జాతీయ అవగాహన.
బి) వివిధ శాస్త్రీయ పదాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: ఐసోహైట్, ఐసోబాల్, డెమోక్రసీ, బడ్జెట్.
సి) నిర్దిష్ట సత్యాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: సమాజానికి కుటుంబం పునాది,
దక్కన్ పీఠభూమి తూర్పునకు వాలి ఉంది.
దేశంలో అత్యున్నత బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్,
మన దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చింది.
డి) నిర్దిష్ట విధానాలు, పద్ధతులకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: రైత్వారీ విధానం, ఎగుమతి-దిగుమతి విధానం. సామ్యవాద విధానాం.
ఇ) నిర్దిష్ట సంకేతాలకు సంబంధించిన జ్ఞానం.


ఎఫ్) వివిధ వరుస క్రమాలు, నూతన ధోరణులకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: వివిధ ప్రణాళికల కాలం వరుస క్రమం, మొఘలాయి వంశస్తుల వరుస క్రమం, వివిధ రాష్ట్రపతుల వరుస క్రమం.
జి) వర్గీకరణల జ్ఞానం.
ఉదా: పంటల వర్గీకరణ, మ్యాపుల వర్గీకరణ, పన్నుల వర్గీకరణ.
హెచ్) కొన్ని లక్షణాంశాల జ్ఞానం.
ఉదా: అభివృద్ధి చెందిన దేశాల లక్షణాలు, ప్రజాస్వామ్యనికి ఉండాల్సిన లక్షణాలు.
ఐ) సిద్ధాంతాలు, నిర్మాణాలకు సంబంధించిన జ్ఞానం.
ఉదా: క్షీణోపాంత ప్రయోజన సిద్ధాంతం, సామ్యవాద సిద్ధాంతం, ధరల సిద్ధాంతం, వీటి గురించిన విషయాలు గుర్తుంచుకోగలగడం జ్ఞానం.

 

2. అవగాహన:
        ఇది జ్ఞాన రంగంలో రెండో లక్ష్యం. ఇందులో పోలికలు తెలపడం, వివరించడం, తర్జుమా చేయడం, వ్యాఖ్యానించడం లాంటివి విద్యార్థి సాధిస్తాడు. విద్యార్థిలో ఆశించిన ప్రవర్తనా మార్పు ఈ దశ నుంచే మొదలవుతుంది.
ఈ లక్ష్యాన్ని తిరిగి మూడు భాగాలుగా విభజించవచ్చు.

 

I. అనువదించడం:
ఎ) ఒక స్థాయి అమూర్త భావనను (మూర్త) వేరొక స్థాయికి మార్చడం.
ఉదా: నిరపేక్ష పేదరికం - ఈ భావనను కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని ప్రజలు అని అనువదించుకోవడం. వసుధైక కుటుంబం - ప్రపంచ మానవులంతా కలిసి మెలిసి జీవించడం.
బి) ఒక సంకేతాన్ని మరొక పదం లేదా సంఖ్యగా అనువదించడం.


సి) శాబ్దికం నుంచి వేరొక దానికి అనువదించడం.
ఉదా: Railway Annoucement  ను అర్థం చేసుకోవడం, House is adjourned లాంటివి అర్థం చేసుకోవడం.

 

II. వ్యాఖ్యానించడం:
             వివిధ విషయాలను విద్యార్థి తనదైన శైలిలో వివరించడం.
ఉదా: ముంబయి దాడి తర్వాత భారత్, పాక్ దేశాల మధ్య సంబంధాల్లో చోటుచేసుకుంటున్న మార్పులను విద్యార్థి తన సొంత మాటల్లో వివరించి చెప్పడమే ఈ లక్ష్యం. దీన్నే మనం చూస్తున్న విషయాలను గురించి విద్యార్థి మాట్లాడగలగడంగా చెప్పుకోవచ్చు.
ఉదా: నేటి విద్యార్థులపై మీడియా ప్రభావం.

 

III. ఎక్ట్స్రాపొలేషన్:
          వివిధ ముగింపులను ఊహించగలగడం, ఆలోచనల్లో వైవిధ్యాన్ని, నూతనత్వాన్ని ప్రదర్శించడం; భవిష్యత్తును ఊహించడం ఈ లక్ష్యంగా చెప్పవచ్చు.
ఉదా: పెరిగిపోతున్న పర్యావరణ కాలుష్యం మానవ జీవనాన్ని ఎలా ప్రభావితం చేయవచ్చు. దేశ జనాభాను నియంత్రించకపోతే మనదేశ భవిష్యత్తు ఎలా ఉండవచ్చు.

 

3. వినియోగం: 
       విద్యార్థి సాంఘిక అధ్యయనాల ద్వారా పొందిన జ్ఞానాన్ని అవసరమైనప్పుడు నిజ జీవితంలో ఉపయోగించుకోగలగడమే ఈ లక్ష్యం.
ఉదా: నీటిని పొదుపుగా వాడటం (వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి అనే జ్ఞానం పొందిన తర్వాత), దేశ పటాలను ఆధారం చేసుకుని హిమా లయాలు చేరగలిగాడు (దిక్కులు, దిశలు తెలుసుకొన్న తర్వాత), తన కుటుంబ బడ్జెట్‌ను తయారుచేయడం (బడ్జెట్ ఎలా తయారుచేస్తారు - జ్ఞానం).


4. విశ్లేషణ:
        ఇచ్చిన భావాన్ని విద్యార్థి తనకు అర్థవంతంగా, సంబంధసహిత భాగాలుగా విశ్లేషణ చేయడం. ఒక స్థూలమైన విషయాన్ని అనేక సూక్ష్మ అంశాలుగా విడగొట్టి వాటి మధ్య ఉన్న తార్కిక సంబంధం - వ్యవస్థీకృత విధానం గురించి విద్యార్థులు తెలుసుకోగలరు.
ఉదా: మన దేశంలో రైలు మార్గాలు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో అభివృద్ధి చెందినంతగా ఈశాన్య రాష్ట్రాల్లో కాలేదు. ఈ అంశాన్ని పరిశీలించండి.
* ఆర్థికాభివృద్ధిని పారిశ్రామిక, సేవారంగాల ద్వారా సాధించినంత వేగంగా వ్యవసాయ రంగం ద్వారా సాధించలేం. ఎందుకో విశ్లేషించండి.
* హరిత విప్లవం ఆహార పంటల విషయంలో విజయం సాధించినంతగా, ఆహారేతర పంటల విషయంలో సాధ్యపడలేదు. కారణాలు విశ్లేషించి చెప్పండి.

 

5. సంశ్లేషణ:

         ఇది అయిదో లక్ష్యం. సంక్లిష్టమైంది. విడి భాగాలను కలిపి అంశాన్ని చూడగలగడం. వివిధ దత్తాంశాల ఆధారంగా నూతన విషయాలను కనుక్కోవడం; కొత్త భాష్యాలు చెప్పడం ఈ లక్ష్యం. వ్యాసాలు రాయడం; సిద్ధాంత వ్యాసాలను వ్యవస్థీకరించడం, క్రమబద్ధమైన భాషణ ఇవ్వడం, నూతన పద్ధతులు, పరిష్కారాలు కనుక్కోగలగడం. అంటే విద్యార్థి తన ముందు ఉన్న సమాచారాన్నంతా క్రోడీకరించుకుని ఒక కొత్త అంశాన్ని ధ్రువీకరించగలగడమే ఈ లక్ష్యం.
* సముద్ర సామీప్యత, జనాభా, పరిశ్రమలు, సముద్ర మట్టం నుంచి ఎత్తు మొదలైన అంశాల ఆధారంగా ఒక ప్రదేశం అభివృద్ధిని గురించి చెప్పగలగడం.
* తలసరి ఆదాయం, జననరేటు, మరణరేటు, శిశుమరణాలు, అక్షరాస్యత, ఆయుఃప్రమాణం పరిశీలించి దేశం మానవాభివృద్ధి సూచికలో ఎలా ఉందో చెప్పగలగడం.
* వ్యవసాయ, పరిశ్రమ, సేవల రంగాల వాటాలను పరిశీలించిన తర్వాత జాతీయాదాయ కూర్పు ఎలా ఉందో విద్యార్థి చెప్పగలగడం.

 

6. మూల్యాంకనం:
          ఇది చివరి లక్ష్యం. జ్ఞాన రంగంలో అత్యున్నత లక్ష్యంగా దీన్ని చెప్పవచ్చు. విద్యార్థి ఈ రంగంలో అయిదు లక్ష్యాలను సాధించి, దీనిలోకి వచ్చాక దేనిపైనైనా సరైన నిర్ణయం తీసుకునేలా తీర్చి దిద్దడమే మూల్యాంకన లక్ష్యం. విద్యార్థిలో నిర్ణయాలను చేయగలిగే శక్తిని పెంపొందించడమే ఈ లక్ష్యం ప్రధాన ఉద్దేశం.

మంచి చెడులు, ఉత్తమ, అథమ మధ్య ఉన్న తేడాలను గుర్తించగలగడమే మూల్యాంకనం.
ఉదా:
* మితిమీరిన కులతత్వం సమాజంలో ఎంతవరకు సమంజసం?
* పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందా?
¤* మితిమీరిన కంప్యూటర్ల వినియోగం ఎంతవరకు సమంజసం?
* ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులతోపాటు బాధ్యతలను కూడా గుర్తుంచుకోవడం అవసరమా?
(సూచన: విద్యార్థి ఒక అంశంలోని వివరణలు (కారణాలు) తెలుసుకోగలగడం విశ్లేషణ; ఆ వివరాల నుంచి ఒక కొత్త అంశం రూపొందించగలిగితే అది సంశ్లేషణ; కనుక్కున్న లేదా గతంలోని అంశాల్లో మంచేదో, చెడేదో సరిగ్గా చూసి నిర్ణయించుకోగలగడం మూల్యాంకనం.)

భావావేశ రంగం:
       డేవిడ్ ఆర్.క్రాత్‌హాల్ ఈ రంగాన్ని అభివృద్ధి చేశారు. దీనిలో అభిరుచులు, విలువలు, వైఖరులు, దృక్పథాలు, అభినందన మొదలైన లక్ష్యాలను వివరించారు. ఇది విద్యార్థి హృదయానికి సంబంధించిన రంగం. ఈ రంగంలో అయిదు దశలు ఉన్నాయి. అవి:
1. గ్రహించడం 
2. ప్రతిస్పందన 
3. విలువ కట్టడం 
4. వ్యవస్థాపన 
5. శీలస్థాపన.

 

1. గ్రహించడం (Receiving): 
        ఉపాధ్యాయుడు అందిస్తున్న ఉద్దీపనల ద్వారా ప్రస్తుత విషయాన్ని గ్రహించేందుకు విద్యార్థి సంసిద్ధుడు కావడమే దీని లక్ష్యం.

సాంఘిక అధ్యయనానికి సంబంధించిన సమాచారం లభించే వివిధ ప్రదేశాలను తెలుసుకోవడం; ఆయా విషాయలు తారసపడినప్పుడు వాటిని గుర్తించడం ఈ లక్ష్యానికి చెందిని విద్యార్థి ప్రవర్తనలు.
ఉదా: పర్యావరణ కాలుష్యం వల్ల ఎదురయ్యే సమస్యలను అర్థం చేసుకోవడం.
        చారిత్రాక కట్టడాలు అనే పాఠ్యాంశం అభ్యసించిన విద్యార్థి చార్మినార్‌ను చూడటం తటస్తిచినప్పుడు అది ఒక చారిత్రక కట్టడం అని గుర్తిస్తాడు.
        విషయాన్ని తెలుసుకోవడం;  గ్రహించడానికి ఇష్టపడటం, ఎన్నిక చేసిన లేదా సంసిద్ధత పొందడం ఈ దశలోని సోపానాలు. ఇక్కడ విద్యార్థి తనకు తానుగా విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించడు. ఆ సంఘటన ఎదురైనప్పుడే విషయాన్ని గుర్తిస్తాడు.

 

2. ప్రతిస్పందించడం (Responding):
       ఇది గ్రహించడం కంటే ఉన్నతమైంది. ఈ దశలో విద్యార్థి సాంఘిక శాస్త్ర విషయాల గురించి చదువుతాడు. ప్రాజెక్టు పనుల్లో, పాఠ్యేతర (co-curricular) అంశాల్లో ఆసక్తి కలిగి ఉంటాడు. ఈ లక్ష్యాన్నే మనం అభిరుచి అనవచ్చు. ఈ దశలోనే ఆసక్తులు ఏర్పడతాయి. విద్యార్థిలోని అంతర్గత ప్రేరణల ద్వారా (అభిరుచులు, ఆసక్తులు) స్వయంగా తెలుసుకోగలిగేటట్లు చేయడమే దీని లక్ష్యం.
ఉదా:
* వివిధ రకాల నాగరికతల గురించి తెలుసు కోవాలనే ఆసక్తి.
* ప్రాచీన కట్టడాలను చూడాలనే ఆసక్తి.
* ద్రవ్యం అనే పాఠ్యాంశం అభ్యసించిన తర్వాత వివిధ రకాల కరెన్సీ నోట్లను సేకరించాలనే ఆసక్తి కలగడం.
* క్షేత్ర పర్యటన; రచనలు చేయడం; వివిధ రకాల కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం.

 

దశలు:
        ప్రతిస్పందించడం; ప్రతిస్పందించడానికి ఇష్టపడటం; ఆ ఇష్టాన్ని సంతృప్తి పరచుకోవడంతో ఈ దశ పూర్తవుతుంది.

 

3. విలువ కట్టడం(Valuing): 
          ఇది మూడో దశ. దీనినే ప్రశంస అనే లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఒక భావనలోని మంచి లక్షణాన్ని గుర్తింపచేయడమే ఈ లక్ష్యం. విద్యార్థిలో ఏర్పడిన భావాలు, విలువలు అంతర్లీనత చెంది ఆయా భావాలకు, విలువలకు కట్టుబడి ఉంటాయి. శాస్త్రీయ వైఖరులు పెంపొందుతాయి. మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండటం; ఇతరులు చెప్పిన విషయాలను పరిశీలించి తగిన అభిప్రాయాలను (స్వీయ ఆలోచనలు) ఏర్పరచుకుంటారు. అభినందించే గుణం అభివృద్ధి చెందుతుంది.
ఉదా:  
* మానవ జీవనానికి, పర్యావరణానికి అవినాభావ సంబంధం ఉందని గుర్తించడం
* ఆర్థికాభివృద్ధిలో సేవారంగానికి విశేష ప్రాముఖ్యం ఉందని తెలుపడం.
* మన దేశ సంస్కృతి గొప్పది, అన్ని విధానాల కంటే ప్రజాస్వామ్యం ఉత్తమ ప్రభుత్వ విధానమని  గుర్తించడం. గాంధీ గొప్ప త్యాగశీలి అని తెలుసుకోవడం.

 

దశలు:
        విలువలను అంగీకరించడం; వాటికి ప్రాధాన్యం ఇవ్వడం; విలువలకు అంకితం కావడం ఈ దశలో జరుగుతుంది.

 

4. వ్యవస్థాపన (Organization):
       విద్యార్థిలో విలువలు అభివృద్ధి చెందే దశ. విలువల మధ్య సంబంధాలు ఏర్పడి వాటి పోలికలు, సంశ్లేషణ జరుగుతుంది. విలువల వ్యవస్థ పెంపొందుతుంది. సమాజంలో మానవ సంబంధాలను మెరుగుపరుచు కోవడానికి ఎలాంటి విలువలు తనలో ఉండాలో విద్యార్థులు గుర్తించగలుగుతారు. జీవితతత్వం ఈ దశలో అభివృద్ధి చెందుతుంది.
ఉదా:
* అహింసా విధానమే మన స్వాతంత్య్ర పోరాటాన్ని శాంతి మార్గంలో నడిపించింది. ఇక్కడ వ్యవస్థాపన, అహింస వల్ల శాంతి సాధించ వచ్చని విద్యార్థి గుర్తిస్తాడు.
* ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది అంటే దాని వెనుక పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం ఎంతో ఉంది. అంటే మన దేశాన్ని రక్షించుకోవాలంటే ప్రాణ త్యాగం చేసేందుకు కూడా మనం సిద్ధపడాలని విద్యార్థి గుర్తించడం.
* దేశ నాయకులంతా సమష్టి కృషితో స్వాతంత్య్రాన్ని సాధించారు. అంటే సమష్టి కృషి ఉండాలంటే సహకారం చాలా అవసరం.

 

దశలు:
     విలువను అంతర్లీనం చేసుకోవడం. విలువల వ్యవస్థను వ్యవస్థీకరించడం. విలువల సమ్మేళనంతో శీలస్థాపనకు సిద్ధపడటం ఈ దశలో జరుగుతుంది.

5. శీలస్థాపనం (Characterisation):
        విలువలు ప్రవర్తనల్లో చేరిపోవడమే ఈ దశ. ఈ స్థాయిలో కొన్ని ప్రత్యేక అభిప్రాయాలు, నమ్మకాలు, వైఖరులతో కూడిన ప్రవర్తన ఏర్పడుతుంది. తాను గుర్తించిన, అంతర్లీనం చేసుకున్న విలువలను విద్యార్థి తన ప్రవర్తనలో నిలపడం, తెచ్చుకోవడం, పెంపొందించుకోవడం, బాహ్యంగా చూపడం శీలస్థాపనగా చెప్పవచ్చు. ఈ లక్ష్యాన్నే 'వైఖరులు' అనవచ్చు.
        ఈ దశలో వైవిధ్యం కలిగిన వివిధ కృత్యాలను నేర్చుకుంటారు. ఒక నిర్దిష్ట ప్రవర్తన, వైయక్తిక, సాంఘిక, భావోద్వేగ సర్దుబాటును పెంపొందించుకుంటారు.
       ఏ విలువలు తనలో ఉంటే సమాజంలో ఉత్తమ జీవనం గడపగలను, సామాజిక నడవడిక, సర్దుబాటు, మూర్తిమత్వ వికాసం జరుగుతుందని విద్యార్థి అనుకుంటాడో వాటిని తన ప్రవర్తనలో మలుచుకోవడమే శీలస్థాపన.
ఉదా:
* పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడం
* రోజురోజుకు తరిగిపోతున్న వనరులను పొదుపుగా వాడటం.
* బ్యాంకులో రూ. 100 బదులు 500 నోటు ఇస్తే నిజాయతీగా ఎక్కువ సొమ్మును తిరిగి  ఇచ్చివేయడం.
* లౌకికత్వం కలిగి ఉండి అన్ని మతాల వారితో కలిసిమెలిసి ఉండటం.
* ప్రభుత్వపరమైన, సామాజిక కార్యక్రమాల్లో తన వంతు సహకారం అందించడం.
* చర్చలో పాల్గొన్నప్పుడు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం.

దశలు:
       విలువల సమన్వయంతో శీలస్థాపన చేయడం, సాధారణీకరణ సమితిని పెంపొందించుకోవడం, తర్వాత శీలస్థాపన.

 

మానసిక చలనాత్మక రంగం (Psycho Motor Domain): 
         విద్యార్థి కర్మేంద్రియాలకు(Hands) పని కల్పించడమే ఈ రంగం ప్రధాన ఉద్దేశం. ఇది మానసిక - కండరాల చలనంగా చెప్పవచ్చు. ఎలిజిబెత్ ఇంప్సన్, హీరో, దావే అనే విద్యావేత్తలు ఈ రంగాన్ని అభివృద్ధి చేశారు. కండరాల - నరాల సమన్వయాన్ని వాటి సరళత నుంచి క్లిష్టత దిశగా 5 లక్ష్యాల్లో చూపారు.

 

1. అనుకరణ(Imitation): 
          విద్యార్థి ఈ కృత్యాన్ని సాధించాలి అనే అంతర్గత ప్రేరణతో ఇది మొదలవుతుంది. విద్యార్థులు ఇతరులు చేసే పనిని అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. నైపుణ్యానికి ఇది ప్రాతిపదిక. దీనిదే అత్యున్నత పాత్ర.విద్యార్థి ఒక కృత్యాన్ని చేస్తున్నప్పుడు ప్రారంభ దశలో ఇతరులు చేసే పనిని అనుకరిస్తాడు. కాబట్టి విద్యార్థికి తాను చేసే కృత్యం మీద ఎలాంటి నియంత్రణ ఉండదు. నిష్పాదన (performance)  అసంపూర్ణంగా, అపరి పక్వంగా, ఎదుటివారు చేస్తున్నది పూర్తిగా అనుకరించలేకపోతే(follow) కృత్యాలు అసంపూర్ణంగా ఉంటాయి.
         అనుకరణ జ్ఞానేంద్రియాల ద్వారా జరుగుతుంది. చూడటం, వినడం, వాసన, రుచి, స్పర్శ.ఉదా: భారతదేశ భౌగోళిక పటంలో ఆకుపచ్చరంగు చూసి మైదానాలు అని చదవటం. ట్రేస్ గీయడం, కార్టూన్ గీయడం, Sketch మొదలైనవి. మిమిక్రీ (శబ్దాలను అనుకరించడం) Roll-play; నమూనా పార్లమెంట్ (పార్లమెంట్ రీతులను అనుకరించడం).

 

2. హస్తలాఘవం (Manipulation):
         విద్యార్థి సరైన పద్ధ´తిలో తన చేతులను కదుపుతూ (ఉపయోగిస్తూ) ఒక కృత్యాన్ని చేయడమే హస్తలాఘవం. మార్గదర్శక సూత్రాలను అనుసరించి సరైన మార్గాన్ని ఎన్నుకుని కృత్యాన్ని నిర్వహించడమే ఈ లక్ష్యం. ఇతరులు చేస్తున్న కృత్యాన్ని అనుసరించకుండా, ఇచ్చిన సూచనలకు అనుగుణంగా (Directions) విద్యార్థి కృత్యాలను (Perform)నిష్పాదన చేయగల శక్తిని ఈ దశలో పొందుతాడు.
ఉదా:
* దిశలను అనుసరించడం Directions follow అవడం.
* కృత్యాలను సాధన చేయడం(Practice) Map ప్రదేశాలను మళ్లీ మళ్లీ గుర్తించడం.
* పరికరాలను జాగ్రత్తగా ఉపయోగించడం - వర్షమాపని, ఉష్ణమాపని లాంటిద్యార్థులకు చూపడం (చేతులను కదుపుతూ).
* స్థానికంగా దొరికే వస్తువులతో పరికరాలు, నమూనాలు తయారు చేయడం.
ఉపాధ్యాయుడు తన చేతులను అడ్డు పెడుతు (కాంతికి) గ్రాహకాలు ఎలా ఏర్పడతాయో విద్యార్థులకు చూపడం (చేతులను కదుపుతూ).

 

3. సునిశితత్వం (precision):  
        హస్తలాఘవంలో కృత్యాన్ని సాధన చేయడం ద్వారా వేగంగా, పరిపక్వతతో విద్యార్థి దాన్ని చేయగలుగుతాడు. ఆ విధంగా తాను చేస్తున్న పనిమీద తన అవసరాలకు అనుగుణంగా కృత్యాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని పొందగలడు.
చేస్తున్న కృత్యంలో పొరపాట్లు జరగకుండా మెలకువతో సాధించడమే సునిశితత్వం. కృత్యంలో ప్రతిదశ మీద అవగాహనతో సరైన సమయంలో కచ్చితమైన నిర్ణయం తీసుకోగలుగుతాడు.
ఉదా:
* ప్రయోగాలు, పరిశీలనలు చేసేటప్పుడు కచ్చితంగా రీడింగులు తీసుకుంటాడు.
* మ్యాపులో దూరాలు కొలిచేటప్పుడు స్కేలును ఉపయోగించడం.
* జాతీయ జెండా నమూనా తయారు చేసేటప్పుడు ఆశోక చక్రంలో 24 గీతలు సమాన దూరంలో ఉండేలా కోణమానిని ఉపయోగించడం.
* గ్లోబ్ నమూనా తయారుచేసేటప్పుడు ఇది పీఠాన్ని కచ్చితంగా 231/2 º వంగి ఉండేట్లు జాగ్రత్త పడటం.

 

4. సమన్వయం (Articulation):
       వేర్వేరు పనులను సమన్వయ పరచడమే ఈ లక్ష్యం. పనిని వేగంగా, సకాలంలో, కచ్చితంగా పూర్తిచేసేందుకు చేయాల్సిన కృత్యాలను దశల వారీగా వరుస క్రమంలో ఏర్పరచుకుని నిర్వర్తించగలగడమే ఈ లక్ష్యం.
ఉదా:
* కృత్యాలను వేగంగా, సకాలంలో, కచ్చితంగా తన అధీనంలో చేయగల నైపుణ్యం.
* అప్పగించిన ప్రాజెక్ట్ పనిని దశల వారీగా, వేగంగా, సకాలంలో కచ్చితంగా, శుభ్రంగా చేయడం.
* గ్రాఫ్ గీసేందుకు ముందుగా ఈ దత్తాంశాన్ని సిద్ధపరుచుకోవడం.
* మ్యాప్ గీసేటప్పుడు అందులో ఏమేం గుర్తించాలో ముందుగానే అంచనా వేసుకోవడం.

సహజీకరణం (Naturalisation):
        ఒక కృత్యాన్ని ఆలోచనతో పనిలేకుండా యాంత్రికంగా చేసేయగలగడం సహజీకరణం. ఇదే మనోచలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం. ఒక పనిని అప్రయత్నంగా, అతి సహజంగా, ఎలాంటి తడబాటు లేకుండా చేయగలగడమే సహజీకరణం.
* దేశ పటాలను సులభంగా, సహజంగా గీయడం.
* పటంలో ప్రదేశాలను కచ్చితమైన స్థానంలో గుర్తించగలగడం.
* ఈ సహజీకరణ లక్ష్యం సాధించిన విద్యార్థి మానసిక శక్తిని ఉపయోగించకుండానే కృత్యాన్ని చేయగలగడం. ఇది సాధన ద్వారా సమకూరుతుంది.
¤* ఉపాధ్యాయుడు సుదీర్ఘ బోధనానుభవంతో తరగతి గదిలో సునాయాసంగా పాఠ్యాంశాన్ని బోధించగలగడమే ఈ లక్ష్యంగా చెప్పవచ్చు.

 

బోధనా - ప్రవర్తనా లక్ష్యాలు:
        బోధన అనంతరం విద్యార్థిలో మనం ఆశించిన ప్రవర్తనా మార్పును బోధన లక్ష్యం సూచిస్తుంది. అభ్యసించిన తర్వాత వాస్తవంగా విద్యార్థి ప్రవర్తన ఏ విధంగా మారిందనేది ప్రవర్తనా లక్ష్యం తెలుపుతుంది. ఈ మార్పు అనుకూలం లేదా వ్యతిరేకంగా ఉండవచ్చు. బ్లూమ్స్ బోధనా లక్ష్యాలను ప్రవర్తనా లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు.
ఉదా:
     జీబ్రా క్రాసింగ్ అంటే ఏమిటో విద్యార్థి అభ్యసించిన తర్వాత అదంటే ఏమిటి? ఎలా ఉంటుంది అనేది గీసి చూపించాడు. అంటే ఇక్కడ బోధనా లక్ష్యం నెరవేరింది.
పాఠశాల ముగిసిన తర్వాత ఆ విద్యార్థి తన ఇంటికి వెళ్లేటప్పుడు రోడ్డును జీబ్రా క్రాసింగ్ వద్ద కాకుండా తన ఇష్టమొచ్చిన చోట దాటాడు. అంటే ఇక్కడ అభ్యసన జరిగింది కాని ప్రవర్తనా లక్ష్యాన్ని సాధించలేదు. దీన్ని బట్టి బోధనాభ్యసన ఉపయోగపడలేదని చెప్పవచ్చు.

 

సమీక్ష (Conclusion):
1. బ్లూమ్స్, విద్యా లక్ష్యాల వర్గీకరణ వల్ల బోధనాభ్యసన ప్రక్రియ (Teaching learning process)శాస్త్రీయంగా మారింది.
2. కరికుల్యం రూప కల్పనలో మార్గదర్శకాలు వచ్చాయి.
3. మూల్యాంకనంలో సవరణాత్మక చర్యలు వచ్చాయి. (అంటే ఆశించిన మార్పు రానట్లయితే తిరిగి బోధన చేపట్టడం (Remedial Teaching).
4. ప్రవర్తనా లక్ష్యాలు విద్యార్థుల్లో సామాజిక నడవడికను పెంపొందిస్తాయి.

 

పరిమితులు  (Limitations):
1. విద్యార్థిలో మానసిక శక్తుల ప్రకారం విద్యా లక్ష్యాలు లేవు.
2. జ్ఞాన రంగంపై జరిగినంత అధ్యయనం, భావావేశ రంగంపై జరగలేదు.
3. ఏవి బోధనా లక్ష్యాలు, ఏవి ప్రవర్తనా లక్ష్యాలు అనేది వర్గీకరించడంలో ఉపాధ్యాయుడికి అనేక  సందేహాలు తలెత్తుతాయి.
4. ఎందుకంటే విద్యార్థి ప్రవర్తన ఈ విధంగానే ఉండాలి అని ఈ లక్ష్యాలు నిర్దేశించడం వల్ల  ఉపాధ్యాయుడి చొరవ తగ్గుతుంది.
5. అన్ని ప్రవర్తనా లక్ష్యాలు పరిశీలించడానికి సరైన మూల్యాంకన సాధనాలు లేవు.
బ్లూమ్స్ విద్యా లక్ష్యాల వర్గీకరణ, బోధన అభ్యసనకు ఒక మార్గదర్శకాన్ని అందించిందనడంలో సందేహం లేదు. వీటిమీద తదుపరి పరిశీలనలు జరిపి విద్యా బోధనకు మరింత మెరుగులు దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌