• facebook
  • whatsapp
  • telegram

సాంఘిక శాస్త్రం ఆశయాలు, లక్ష్యాలు, విలువలు

   ఉపాధ్యాయుడు విద్యార్థులకు బోధించాలనుకునే విషయం గురించి పూర్తి  అవగాహన కలిగి ఉండటమే కాకుండా అది ఎందుకు బోధిస్తున్నామో, ఎందుకు బోధించాలో విశ్లేషించుకోవాలి. ఆ వివరాలను విద్యార్థులకు కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉంది. ఉద్దేశ రహితమైన బోధన తెరచాపలేని నావ లాంటిది. ప్రతి పనికి ఒక ఉద్దేశం లేదా ఆశయం ఉంటుంది.  ఇది మనం గమ్యం చేరడానికి ఉపకరిస్తుంది.

   ఆశయం లేకుండా ఏ పనీ ప్రారంభించకూడదు. ఒకవేళ ప్రారంభించినా ఆ పని సఫలీకృతం కాదు. అందువల్ల పనిని ఎందుకు చేయాలి? పని చేయడం వల్ల మనకు ఏం లాభం? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చేది ఆశయం.
ఆశయం (Aim): ఒక పనిని చేపట్టబోయే ముందు తీసుకున్న నిర్ణయమే ఆశయం. ప్రతి దేశం ఆ దేశ విద్యావిధానానికి కొన్ని ఆశయాలను ఏర్పరచుకుంటుంది. సాంఘికశాస్త్రం ఈ విద్య ఆశయాలను సాధించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పాఠశాలల్లో సాంఘికశాస్త్ర బోధన ఆశయం విద్యార్థులు తమతమ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడంతోపాటు ప్రజాస్వామ్య సమాజంలో ఉత్తమ పౌరులుగా ఎదగడానికి కావలసిన శిక్షణ పొందడం.

 "సముద్రంలో ప్రయాణించే నావికుడు తన గమ్యస్థానమైన ఒడ్డును (లక్ష్యం) చేరుకోవడానికి ఆకాశంలోని నక్షత్రం (ఆశయం) అనేది తప్పనిసరి. నావికుడు నక్షత్రాన్ని (ఆశయం) ఎన్నడూ చేరకపోయినప్పటికీ, ఒడ్డును (లక్ష్యాన్ని) చేరుకోవడానికి నక్షత్రం అనేది మార్గదర్శకత్వం వహిస్తుంది."     - వెస్లీ
అంటే ఉపాధ్యాయుడికి తాను బోధనాలక్ష్యాన్ని చేరుకోవాలి లేదా సాధించాలనే ఆశయం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆశయం ఉంటేనే లక్ష్యాన్ని సాధించగలం.


"ఆశయం లేదా ఉద్దేశం అనేది మన కళ్లముందు ఎల్లప్పుడూ కనిపిస్తూ మనకి దిశానిర్దేశం చేస్తూ, మనం చేసే ప్రతి పనిని ఎప్పుడూ ప్రభావితం చేస్తూ మనల్ని సరైన మార్గంలో నడుపుతుంది." 
"ఆశయాలు అనేవి చేరడానికి అసాధ్యమైనవిగా, కష్టసాధ్యమైనవిగా కనిపిస్తాయి కానీ నిరుపయోగమైనవి కావు."    - జాన్‌డ్యూయి

లక్ష్యం (Objective): విద్యార్థి ప్రవర్తనలో ఆశించిన మార్పునే లక్ష్యం అంటారు. సాంఘికశాస్త్ర బోధన ద్వారా విద్యార్థుల్లో ఆశించిన ప్రవర్తనా మార్పులను రాబట్టడం జరుగుతుంది. ఈ ప్రవర్తనా మార్పులనే లక్ష్యాలు అంటారు.
* 'విద్యా విధానం విద్యాలక్ష్యాలవైపు పయనిస్తున్నప్పుడు, ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువును లక్ష్యం' అని అంటారు.
* లక్ష్యాలు ఒక ప్రత్యేక అంశానికి సంబంధించినవి. లక్ష్యాలు ఉద్దేశాలు లేదా ఆశయాల్లో ఒక భాగం, ఉద్దేశాల నుంచే ఇవి ఆవిర్భవిస్తాయి.
* బోధన, అభ్యసన గమ్యాన్ని లక్ష్యం సూచిస్తుంది.
* బోధనాలక్ష్యాలు అనేవి బోధనాభ్యసన కార్యక్రమం అనే సముద్రంలో ప్రయాణం చేయడానికి సహాయపడే చుక్కాని లాంటిది. లక్ష్యంలేని బోధన, అభ్యసన నిరుపయోగం అవుతాయి.

 

    
 

విలువలు
ఏమి సాధించాలో తెలియజేసే ఆశయాలకంటే ఎంతవరకు సాధించామో తెలియచెప్పే ఫలితాలు చాలా ముఖ్యమైనవి. ఆశయాల ప్రకారం సాంఘికశాస్త్ర బోధన తర్వాత వచ్చే ఫలితాలే విలువలు. మంచి ఆలోచన, విద్యార్థి ప్రవర్తనలో వచ్చే ఒక మార్పునే విలువ అంటారు.
* ఏ గుణమైతే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకు గౌరవాన్ని, ప్రాధాన్యతను కలిగిస్తుందో దాన్నే విలువ అంటారు.
ఉదా: మల్లెపూల గుణం.... సువాసన వెదజల్లడం
    బంగారం గుణం.... మారకపు, సౌందర్యాత్మక విలువ
   గాంధీజీ గుణం... సత్యాన్ని పలకడం, అహింసా భావనను ఆచరించడం.
* ఉపాధ్యాయుడు పాఠశాల బోధన కార్యక్రమాల రూపకల్పనలో సాంఘిక విలువలను పెంపొందించే విధంగా ప్రయత్నించాలి.

 

విలువలు - నిర్వచనాలు:
* విద్యా లక్ష్యాలే విద్యా విలువలు - కన్నింగ్‌హామ్
* వ్యక్తి లక్ష్యాలే విద్యా విలువలు - జె.ఎస్. బ్రూబేచర్
* ఒక సన్నివేశం, భావం, కృత్యం, యోగ్యత, నమ్మకం,  మంచితనానికి  సంబంధించిన  దృఢమైన నమ్మకమే విలువ  - బాండ్
* ఈ సమాజంలో ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు, నియమాలు, నమ్మకాలే విలువలు - కానే
* ఓటమి ఎరుగని వ్యక్తి కన్నా, విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తే మిన్న - ఐన్‌స్టీన్
* సత్యమే అందం - కీట్స్

 

విలువల లక్షణాలు:
1. అంతర్లీనమైనవి
2. అమూర్తమైనవి 
3. ఆపాందించగలిగేవి 
4. సౌమ్యత కలిగినవి 
5. సాపేక్షపరమైనవి.

విద్యాలక్ష్యాల వర్గీకరణ
         డా.బెంజిమెన్ ఎస్. బ్లూమ్స్ అనే విద్యాతత్త్వవేత Taxonomy of Educational Objectives అనే గ్రంథంలో విద్యాలక్ష్యాలను వర్గీకరించాడు. Taxonomy అంటే వర్గీకరణ అని అర్థం. బ్లూమ్స్ బోధనా రంగాన్ని 3 రకాలుగా విభజించాడు. ఇందులో 3H's గురించి వివరించాడు. దీన్నే బ్లూమ్స్ విద్యాలక్ష్యాల వర్గీకరణ అంటారు.
గమనిక: మూడు రంగాల్లోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి.


వర్గీకరణ - ప్రయోజనాలు: 
* మూల్యాంకనంలో సార్వత్రిక విధానాన్ని నెలకొల్పడానికి అవకాశం ఏర్పడింది.
* విద్యా లక్ష్యాలకు సంబంధించిన అవగాహన స్థాయి పెరిగింది.
* అన్ని విద్యాస్థాయులను మూల్యాంకనం చేయవచ్చు.
* కొన్ని నిర్దిష్ట పదాల అసందిగ్ధతను తొలగించవచ్చు.
* మూడు స్థాయుల్లో ఉన్న అభివృద్ధిని అవగాహన చేసుకోవడం వీలవుతుంది.


స్పష్టీకరణలు: విద్యార్థుల్లో సాంఘికశాస్త్ర బోధన అనంతరం, వారిలో ఆశించిన ప్రవర్తనామార్పు వచ్చిందా? లేదా? అని తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడే వాటిని స్పష్టీకరణలు అంటారు. 
* విద్యార్థి నేర్చుకున్న సామర్థ్యాలను సూచించేవి స్పష్టీకరణలు.
* విద్యార్థి మంచి అభ్యసనం కోసం మనం ఆశించిన స్పందనలను ప్రణాళికలో స్పష్టంగా పేర్కొనడాన్ని స్పష్టీకరణలు అంటారు.
* లక్ష్యసాధన కోసం విద్యార్థి పొందే స్పందనలను ముందుగానే అంచనా వేస్తాం. వాటిని బోధనా ప్రణాళికలో పేర్కొంటాం. వీటినే స్పష్టీకరణలు అంటాం.

 

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌