• facebook
  • whatsapp
  • telegram

సాంఘికశాస్త్రం - బోధన సామగ్రి

విద్యార్థులకు జ్ఞానాత్మక, గుణాత్మక విద్యను అందించడానికి ఉపాధ్యాయులు ఉపయోగించే పరికరాలను బోధనోపకరణాలు అంటారు. ఇవి తరగతి బోధనలో సృజనాత్మకత, కల్పనా చాతుర్యం, ప్రేరణను ప్రోత్సహించే విధంగా ఉంటాయి.

సాంఘికశాస్త్ర బోధనలో ఉపకరణాల వినియోగాన్ని మొదటగా ప్రతిపాదించినవారు కొమీనియస్.
సాంఘికశాస్త్ర బోధనలో విద్యార్థులకు బోధనోపకరణాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా చూపించాలి. వీటి అవగాహనతో పరిసరాల్లోని అనేక అంశాలను గమనించడం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందుతుంది.
కోచెన్ 'బోధనోపకరణాలు, జ్ఞానేంద్రియాల మధ్య సంబంధాన్ని వివరించి చూడటం ద్వారా విద్యార్థుల్లో 83 శాతం అభ్యసనం జరుగుతుంది' అని పేర్కొన్నాడు.
విద్యార్థి - పరిసరాలు, అభ్యసన పరిస్థితుల మధ్య జరిగే సంబంధాల ప్రతిఫలమే అభ్యసన అనుభవాలు.

మ్యాపులు/ పటాలు/ మాన చిత్రాలు          

గోళాకారంగా ఉండే భూమిని కాగితం, గుడ్డ లేదా ఏదైనా సమతలంపై స్కేలును అనుసరించి గీసే పటాన్ని మ్యాప్/ పటం/ మాన చిత్రం అని అంటారు. భూమి ఉపరితలాన్ని, ఉపరితలంపై ఉండే వివిధ భౌగోళిక అంశాలను మొత్తంగా లేదా కొంత భాగాన్ని చూపించడానికి మ్యాపులను ఉపయోగిస్తారు. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు ఊత కర్ర సాయంతో పటంలోని అంశాలను బోధిస్తాడు.
* మ్యాప్ అనే పదం 'Mappa (మప్పా)' అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. 'మప్పా' అంటే చదునైంది లేదా సమతలమైంది అని అర్థం.
* గ్లోబుల్లో ఉన్న సమాచారాన్ని సమతలంగా చూపడానికి, సులభంగా అర్థం చేసుకోవడానికి, సంకేతాలు, గుర్తుల ద్వారా తెలుసుకోవడానికి మ్యాపులు ఎంతగానో దోహదపడతాయి.

మ్యాప్ ఆవశ్యకత/ ప్రయోజనాలు

* ఒక ప్రదేశం ఉనికిని తెలుసుకోవడానికి.
ఉదా: భారతదేశం ఉనికి 8o.4' - 37o.6' ఉత్తర అక్షాంశాల మధ్య, 68o.7' - 97o.25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
* ఒక ప్రదేశం ఆకారం తెలుసుకోవడానికి.
ఉదా: దక్షిణ అమెరికా ఖండం 'ఆకు' ఆకారంలో ఉండటం.
* ఒక ప్రదేశం విస్తీర్ణం తెలుసుకోవడానికి.
* ఒక ప్రదేశం విస్తీర్ణాన్ని మరో ప్రాంత విస్తీర్ణంతో పోల్చడానికి.
* రెండు ప్రాంతాల మధ్య దూరాన్ని తెలుసుకోవడానికి.
* ఒక ప్రదేశం మరో ప్రదేశానికి ఏ దిక్కున ఉందో తెలుసుకోవడానికి.
* ఒక ప్రదేశం మరో ప్రదేశం కంటే ఎంత ఎత్తులో ఉందో తెలుసుకోవడానికి.     

పటం - దిక్కులు
          మ్యాపులో పైభాగం ఎల్లప్పుడు ఉత్తర దిక్కును సూచిస్తుంది. ఉత్తర దిక్కుకు వ్యతిరేక దిశ లేదా మ్యాపులో కిందిభాగం దక్షిణ దిక్కును సూచిస్తుంది. మ్యాపులో కుడిచేతి వైపు తూర్పు దిక్కు, ఎడమచేతి వైపు పడమర దిక్కును సూచిస్తుంది. ఈ ప్రధాన దిక్కుల మధ్యభాగాలు కూడా 4 దిశలను సూచిస్తాయి.
         1) ఉత్తరం, తూర్పు మధ్య ఉన్న దిశ        - ఈశాన్యం
         2) ఉత్తరం, పశ్చిమం మధ్య ఉన్న దిశ       - వాయువ్యం
         3) దక్షిణం, తూర్పు మధ్య ఉన్న దిశ        - ఆగ్నేయం
         4) దక్షిణం, పశ్చిమం మధ్య ఉన్న దిశ       - నైరుతి

పటాలు - రకాలు
పటాల్లో చూపించే విషయాలు/ సమాచారం ప్రకారం పటాలను వివిధ రకాలుగా విభజించారు.
ఈ పటాల్లో భూస్వరూపాలు, రాజకీయ విభాగాలు, వాతావరణ స్థితి, అడవులు, జనాభా విస్తరణ మొదలైన అంశాలను సూచిస్తారు.
              
               

ఫ్లాట్ మ్యాపులు
మ్యాపుల ఉపరితలంపై ఎలాంటి హెచ్చు తగ్గులు/ ఎత్తుపల్లాలు లేకుండా సమతలంగా ఉండే పటాన్ని సమతల పటం లేదా ఫ్లాట్ మ్యాపు అంటారు.
భౌగోళిక పటం: కింది అంశాలన్నింటినీ భౌగోళిక పటంలో సూచించవచ్చు.
పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, లోయలు, సరస్సులు, కాల్వలు (సూయజ్‌కాలువ, నాగార్జునసాగర్ డ్యామ్ కుడి, ఎడమ కాల్వలు), ఇతర భౌగోళిక నైసర్గిక అంశాలు.
అలాగే భారతదేశ సముద్ర తీరంలోని ఐరోపా వారి వర్తక స్థావరాలు, భౌగోళిక అన్వేషణ ప్రాధాన్యత ఉండే అంశాలు.
రాజకీయ పటాలు: ఖండాలు, దేశాలు, రాష్ట్రాలు, రాజధానులు, ప్రధాన పట్టణాలు, వాటి మధ్య సరిహద్దులు, రోడ్డుమార్గాలు, రైలుమార్గాలు, వివాదాస్పద ప్రాంతాలు.
ఉదా: రాజకీయ ప్రాధాన్యత ఉండే అనేక ప్రాంతాలు/ అంశాలను రాజకీయపటంలో చూపుతాం.

భౌగోళిక - రాజకీయ పటాలు: భౌతిక, రాజకీయ అంశాలు రెండింటినీ సూచించడానికి భౌగోళిక-రాజకీయ పటాలను ఉపయోగిస్తారు.
ఉదా: భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఉండే పాక్ ఆక్రమిత ప్రాంతం.     

ప్రత్యేక ప్రయోజన పటాలు

ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పటాలను రూపొందించారు.
ఉదా: 1) సమవర్షపాత ప్రాంతాలను చూపే పటాలు
         2) సమోష్ణోగ్రతా ప్రాంతాలను చూపే పటాలు
         3) సమ వాతావరణ పీడనం ఉండే ప్రాంతాలను చూపే పటాలు
         4) సమాన ఎత్తులో ఉండే ప్రాంతాలను చూపే పటాలు
         5) అడవుల విస్తీర్ణాన్ని చూపే పటాలు
         6) జనాభా, పెరుగుదల సూచించే పటాలు.

ఇంకా భూగోళశాస్త్రం, చరిత్ర, పౌరవిజ్ఞానం, అర్థశాస్త్రం మొదలైన అంశాలకు సంబంధించిన ప్రదేశాలు, రాజుల సామ్రాజ్యాలు, ఖనిజాలు, పరిశ్రమల విస్తరణ మొదలైన అంశాలను సులభంగా తెలుసుకోవడానికి ప్రత్యేక మ్యాపులను ఉపయోగిస్తారు.

రిలీఫ్ మ్యాపులు
        * మ్యాపుల్లో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు లాంటి ఎత్తుగా ఉన్న ప్రాంతాలను ఎత్తుగా
        * సమతలంగా ఉండే ప్రాంతాలను సమతలంగా
        * లోయలు, అగాథాలు లాంటి లోతైన ప్రాంతాలను లోతుగా చూపడానికి రిలీఫ్ పటాలను ఉపయోగిస్తారు.
        * నిమ్నోన్నతాలను ఉన్నవి ఉన్నట్లు చూపడానికి రిలీఫ్ పటాన్ని ఉపయోగిస్తారు. (Relief feature means the high and low places on the surface of the earth.)
గమనిక: బోధనోపకరణాల వర్గీకరణ ప్రకారం 'మ్యాపులు' అనేవి 'గ్రాఫిక్స్' ఉపకరణాలకు సంబంధించినవి. రిలీఫ్ పటాలకు త్రిమితీయ ఉపకరణాల లక్షణాలు ఉంటాయి. అందువల్ల రిలీఫ్ పటం అనేది ఒక త్రిమితీయ ఉపకరణం. రిలీఫ్ పటాన్ని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ లేదా చెక్కతో రూపొందిస్తారు.

మ్యాపులు - గుర్తులు, రంగులు: మ్యాపుల్లోని సమాచారాన్ని వేర్వేరు గుర్తులు/ సంజ్ఞలు, రంగుల రూపంలో సూచిస్తారు.

     

                                                   రంగులు
1) సముద్రాలు, మహాసముద్రాలు                           ముదురు నీలం
2) నదులు, చెరువులు, కాల్వలు                            లేత నీలం
3) అడవులు                                             ముదురు ఆకుపచ్చ
4) గడ్డిభూములు, పచ్చిక బయళ్లు                          లేత ఆకుపచ్చ
5) సరిహద్దులు                                           నలుపు
6) వ్యవసాయక్షేత్రాలు, తోట పంటలు                       ఆకుపచ్చ
7) ఎడారులు, నిస్సార భూములు                          పసుపు
8) కొండలు, పర్వతాలు                                   గోధుమ
9) నేల కంటే ఎత్తయిన ప్రదేశాలు                          జేగురు

 

అట్లాస్
మ్యాపులు/ పటాల సంకలనాన్ని 'అట్లాస్' అంటారు.

 

పట నైపుణ్యాలు
1) పటం చదవడం (Map Reading)
2) పటం గీయడం (Map Drawing)
3) పటాల్లో గుర్తించడం (Map Pointing)

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌