• facebook
  • whatsapp
  • telegram

స్వతంత్ర భారతదేశం (1947 - 1977)

* 1950, జనవరి 26న మనం వైరుధ్యాలతో కూడిన జీవనంలోకి ప్రవేశించబోతున్నాం. రాజకీయాల్లో సమానత్వం ఉంటుంది. కానీ సామాజిక, ఆర్థిక అంశాల్లో అసమానత్వం ఉంటుంది. అని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ పేర్కొన్నారు.
* రెండు శతాబ్దాలపాటు విదేశీ శక్తులు పాలించిన భారత ప్రజలకు ఏకకాలంలో అనేక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగం కృషి చేసింది. అవి:
    ఎ) ప్రజాస్వామ్య వ్యవస్థ నెలకొల్పడం.
    బి) దేశాన్ని ఐక్యం చేసి ఒకే రాజకీయ విధానాన్ని రూపొందించడం.
    సి) పెద్ద ఎత్తున సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురావడం.

 

స్వాతంత్య్రానంతరం దేశ నాయకత్వం ముందు నెలకొన్న సవాళ్లు
 

* దేశ ఐక్యత, సమగ్రతను కాపాడడం.
* సామాజిక, ఆర్థిక మార్పులు తీసుకురావడం.
* ప్రజాస్వామిక వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడడం.
* అభివృద్ధి లక్ష్యాలు, దేశ ఐక్యత, సమగ్రత సాధించడం కోసం ప్రజాస్వామ్యాన్ని పణంగా పెట్టకుండా చూడటం.

 

మొదటి సార్వత్రిక ఎన్నికలు:
* మొదటి సార్వత్రిక ఎన్నికలు భారత ప్రజాస్వామ్యానికి ఎంతో కీలకమైనవి.
* బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామిక పంథా అనుసరించడానికి భారతదేశం కట్టుబడి ఉండడాన్ని ఇవి సూచించాయి.
* భారతదేశంలో ఆర్టికల్ 326 ప్రకారం వయోజనులందరికీ ఒకేసారి ఓటు హక్కు కల్పించారు.
* స్విట్జర్లాండ్‌లో మహిళలకు ఓటుహక్కు 1971లో గానీ లభించలేదు.
* మన దేశంలో 1951 - 52లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల నాటికి ఎక్కువ మంది ప్రజలు నిరక్ష్యరాస్యులు.
* దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళల్ని వారి తండ్రి లేదా భర్త ద్వారా గుర్తించేవారు.
* రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం భారత ఎన్నికల సంఘం ఏర్పడింది.
* ఓటర్ల జాబితా తయారీ, దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత.
* నిరక్షరాస్యత సమస్య అధిగమించడానికి ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలు, అభ్యర్థులను సూచించేలా రోజువారీ జీవితం నుంచి కొన్ని గుర్తులను ఉపయోగించడం అనే వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది.
* మొదటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి అభ్యర్థికీ వారు ఎంచుకున్న గుర్తు అంటించిన వేరు వేరు బ్యాలెట్ పెట్టెలను కేటాయించారు.
* ఓటరు తాను ఎంచుకున్న అభ్యర్థి బ్యాలెట్ పెట్టెలో తన ఓటును వేస్తే సరిపోతుంది.
* 1958లో మార్గరెట్ డబ్ల్యు. ఫిషర్, జోన్.వి. బొండ్యురాంట్ రాసిన 'ప్రజాస్వామిక ఎన్నికల్లో భారతీయ అనుభవం' అనే పుస్తకంలో మొదటి సార్వత్రిక ఎన్నికల విశేషాలను కింది విధంగా పేర్కొన్నారు.
* పరదా వ్యవస్థను కచ్చితంగా పాటించే జిల్లాల్లో, మహిళా అధికారులతో ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
* అజ్మీర్‌లో ఒక రాజపుత్ మహిళ పూర్తిగా కప్పిన రథంలో పోలింగ్ కేంద్రానికి వచ్చింది.
* ఆమె శరీరమంతా వెల్వెట్ వస్త్రంతో చుట్టి ఉంది.
* ''సిరాచుక్క" గుర్తు వేయించుకోవడానికి చాచిన ఎడమ చూపుడు వేలు తప్ప, ఆమె శరీరంలోని మరో భాగాన్ని కనిపించనీయలేదు.
* కొన్ని గ్రామాలు మొత్తంగా కలిపి ఓటు వేశాయి.
* అసోం నుంచి వచ్చిన నివేదిక ప్రకారం ఒక గిరిజన గ్రామ ప్రజలు ఓటింగ్ జరిగే ముందురోజే ప్రయాణం చేసి పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
* వీరు ఆ రాత్రంతా పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ గడిపి, సూర్యోదయం అనంతరం పోలింగ్ కేంద్రాలకు క్రమశిక్షణతో వెళ్లి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
* పెప్సు గ్రామ ప్రజలు ఎవరికి ఓటెయ్యాలో నిర్ణయించుకునే సమస్యకు పరిష్కారంగా ఆ అభ్యర్థుల యువ ప్రతినిధులకు కుస్తీ పోటీలు పెట్టి అందులో గెలిచిన అభ్యర్థికి ఓటు వేస్తామన్న అంగీకారానికి వచ్చారు.
* ఓట్ల లెక్కింపు కోసం బ్యాలెట్ పెట్టెలను తెరిచినప్పుడు తమ విశ్వాసాన్ని ప్రకటించే ఉత్తరాలు, ఆహారం, బట్టలు ఇవ్వాలని వేడుకునే విన్నపాలు ఉన్నాయి.

 

రాజకీయ వ్యవస్థలో ఏకపార్టీ ఆధిపత్యం
 

స్వతంత్ర భారతదేశంలో 1952, 1957, 1962లో జరిగిన మొదటి మూడు సార్వత్రిక ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ విజయాలు సాధించింది.
* జవహర్‌లాల్ నెహ్రూ భారతదేశానికి మొదటి ప్రధాని అయ్యారు.
* ఇతర పార్టీల్లో ఏ ఒక్కదానికీ 11 శాతానికి మించి ఓట్లు రాలేదు.
* మొత్తం పోలైన ఓట్లలో 45 శాతంతో కాంగ్రెస్, 70 శాతానికి పైగా స్థానాలు గెలుచుకుంది.
* కాంగ్రెస్ పార్టీ అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
* దీంతో కొంతమంది పరిశీలకులు పేర్కొన్నట్లు ''కాంగ్రెస్ వ్యవస్థ" ఏర్పడింది.
* అన్ని సందర్భాల్లో పాలక పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు, ఇతర పార్టీలకు మధ్య ఉన్న సంబంధాల ప్రత్యేక స్వభావాన్ని బట్టి ఈ కాలాన్ని గుర్తిస్తారు.
* కాంగ్రెస్‌లో ఎప్పుడూ అంతర్గతంగా చిన్నచిన్న బృందాలు (Groups) ఉండేవి.
* ఈ బృందాలు నాయకుల మధ్య పోటీ కారణంగా ఏర్పడ్డాయి.
* రాజ్యాంగ చట్రం బలం, స్వాతంత్య్ర ఉద్యమం వేసిన ప్రజాస్వామిక పునాదుల కారణంగా భారతదేశ రాజకీయాలు బహుళ పార్టీ ప్రజాస్వామ్యంగా ఎదగ గలిగాయి.
* ఇండోనేషియా, పాకిస్థాన్, చైనా, నైజీరియా వంటి వలస పాలిత దేశాల్లో అధికారంలో ఉన్న పార్టీలు పక్షపాతంతో వ్యవహరించి, బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ప్రతిపక్షాలను అణచివేశాయి.
* కానీ భారతదేశ అనుభవం దీనికి పూర్తిగా భిన్నమైంది.

 

రాష్ట్రాల పునఃవ్యవస్థీకరణ
 

* బ్రిటిష్ కాలంలో దేశం కలకత్తా, మద్రాస్, బాంబే ప్రెసిడెన్సీలుగా, సెంట్రల్ ప్రావిన్స్, బీదర్ వంటి అనేక పెద్ద రాష్ట్రాలుగా విభజించి ఉండేది.
* దేశంలో అధిక భాగం అనేక సంస్థానాల కింద ఉండేది.
* ఈ రాష్ట్రాల్లో అనేక భాషలు మాట్లాడే ప్రజలు కలిసి జీవిస్తున్నారు
ఉదా: మద్రాస్ ప్రెసిడెన్సీలో తమిళం, మళయాళం, కన్నడ, తెలుగు, గోండి, ఒడియా భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు.
* ఒకే భాషను మాట్లాడుతూ పక్కపక్క ప్రాంతాల్లో ఉంటున్న ప్రజలంతా తమను ప్రత్యేక రాష్ట్రంగా సంఘటిత పరచాలని కోరారు.
* ఈ సమయంలో కింద పేర్కొన్న ఉద్యమాలు ప్రారంభమయ్యాయి.
ఎ) సంయుక్త కర్ణాటక ఉద్యమం
బి) సంయుక్త మహారాష్ట్ర ఉద్యమం
సి) మహా గుజరాత్ ఉద్యమం
డి) ట్రావెన్‌కూర్ - కొచ్చిన్ సంస్థానాల విలీనం
ఇ) సిక్కులు ప్రారంభించిన ప్రత్యేక పంజాబ్ ఉద్యమం
* ఈ కోరికలను అంగీకరించడం వల్ల దేశ ఐక్యతను పెంచవచ్చా? లేదా? అనే సందేహం వచ్చింది.
* మతం ఆధారంగా దేశ విభజన జరగడంతో నాయకుల మనసులో భారతదేశ భద్రత, సుస్థిరత పట్ల అనుమానాలు, భయాలు కలిగాయి.
* భాషా ప్రాతిపదికన రాష్ట్రాలను పునర్వ్యవస్థీకరిస్తే దేశం ముక్కలవ్వడానికి దారి తీస్తుందని భయపడ్డారు.
* కాంగ్రెస్ పార్టీ భాషా ప్రాతిపదికన సంఘటితమై ఉన్నప్పటికీ, దాని ఆధారంగా దేశాన్ని పునఃసంఘటితం చేస్తామని మాట ఇచ్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అందుకు వెంటనే చర్యలు తీసుకోలేదు.
* తెలుగు మాట్లాడే ప్రజలు మిగతావారి కంటే తీవ్రస్థాయిలో ఉద్యమాన్ని చేపట్టారు.
* భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు అనుగుణంగా కాంగ్రెస్ చేసిన తీర్మానాన్ని అమలు చెయ్యాలని వాళ్లు పట్టుపట్టారు.
* బ్రిటిష్ పాలనలో కూడా ''ఆంధ్ర మహాసభ" క్రియాశీలకంగా ఉండి మద్రాస్ ప్రెసిడెన్సీలోని తెలుగు మాట్లాడే ప్రజలను ఏకతాటికి తీసుకువచ్చే ప్రయత్నాలు చేసింది.
* విన్నపాలు, దరఖాస్తులు, వీధుల్లో కవాతులు, నిరాహార దీక్షలు వంటి పద్ధతులు దీనికోసం ఉపయోగించారు.
* ఈ కోరికను కాంగ్రెస్ వ్యతిరేకించడంతో తెలుగు మాట్లాడే ప్రాంతాల్లో మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకోలేకపోయింది.
* భాషా ప్రాతిపదిక ఉద్యమాన్ని బలపరచిన పార్టీలు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నాయి.
* భాషా ప్రాతిపదిక రాష్ట్రాలకు జవహర్‌లాల్ నెహ్రూ వ్యతిరేకం కాకున్నా ఇది అందుకు తగిన సమయం కాదని భావించారు

 

రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం - 1956:
 

* ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేసిన పొట్టి శ్రీరాములు 58 రోజుల తర్వాత 1952లో మరణించారు.
* దీని ఫలితంగా ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు.
* 1953 ఆగస్టులో ''రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ" సంఘాన్ని (S.R.C) ఏర్పాటు చేశారు.

 

 ఈ S.R.C. లో సభ్యులు ముగ్గురు. వారు:
 

1. ఫజుల్ అలీ
2. కె.ఎమ్. ఫణిక్కర్
3. హృదయనాథ్ కుంజ్రు
* ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా 1956లో పార్లమెంటు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని ఆమోదించింది.
* ఈ చట్టం ఆధారంగా మన దేశంలో 14 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలు ఏర్పడ్డాయి.
* భాషా ప్రాతిపదిక రాష్ట్రాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు గోండి, సంథావి, ఒరావన్ వంటి గిరిజన భాషలను పరిగణనలోకి తీసుకోలేదు.
* ఆధిపత్య లేదా శక్తిమంత ప్రజానీకం మాట్లాడే తమిళం, తెలుగు వంటి భాషలు మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు.
* భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం ప్రజల అభీష్టం ఎలా నెగ్గిందో, ఒక సమస్యను రాజకీయాలు ఎలా పరిష్కరించాయో తెలియజేస్తుంది.
* నాయకులు భయపడినట్లుగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ దేశాన్ని బలహీనపరచలేదు. ఇది భారతదేశం బలపడడానికే దోహదపడింది.

 

సామాజిక, ఆర్థిక మార్పు:
 

* రాజ్యాంగ సభ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, హోదా, అవకాశాల్లో సమానత్వాన్ని కోరుకుంది.
* కొత్త రాజ్యాంగాన్ని ఆవిష్కరించిన నెల రోజులకు ''ప్రణాళికా సంఘాన్ని" ఏర్పాటు చేశారు.
* జవహర్‌లాల్ నెహ్రూ ప్రణాళికా రచనను మంచి ఆర్థిక విధానమే కాకుండా, మంచి రాజకీయాలుగా కూడా భావించారు.
* ప్రణాళికాబద్ధ అభివృద్ధి ద్వారా కులం, మతం, ప్రాంతం వంటి విభజన ధోరణులు తగ్గి భారతదేశం బలమైన, ఆధునిక దేశంగా ఎదుగుతుందని నెహ్రూ ఆశించారు.
* 1950లో ఏర్పాటు చేసిన ''ప్రణాళికా సంఘాన్ని" 2015లో నరేంద్రమోదీ ప్రభుత్వం ''నీతిఆయోగ్‌"గా పునర్వ్యవస్థీకరించింది.
* మొదటి పంచవర్ష ప్రణాళిక వ్యవసాయం మీద కేంద్రీకరించి, 'ఆహార ఉత్పత్తిని' పెంచడానికి, రవాణా, ప్రసార రంగాల అభివృద్ధికి, సామాజిక సేవల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది.
* వ్యవసాయ రంగంలో మార్పును నెహ్రూ గ్రామీణ రంగ రాజకీయ, సామాజిక, ఆర్థిక మార్పుగా పరిగణించారు.
* ఇందులో మూడు ప్రధాన అంశాలున్నాయి. అవి:
1. జమీందారీ వ్యవస్థ రద్దు.
2. కౌలు విధానాల సంస్కరణ.
3. భూ పరిమితి విధానాలు.
* వీటన్నింటి ప్రధాన ఉద్దేశం దున్నేవాడికే భూమి చెందేలా చేసి, మరింత ఉత్పత్తి సాధించడానికి ప్రోత్సహించడం.
* సహకార సంఘాల ద్వారా ఆర్థికంగా, లాభసాటి పరిమాణాన్ని చేరుకోవడమే కాకుండా, విత్తనాలు, ఎరువులు, రసాయనాలు వంటి విలువైన ఉత్పాదకాలను అందించాలి.
* స్థానిక ప్రభుత్వాలు భూ సంస్కరణలు అమలయ్యేలా చేసి, గ్రామ ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా సహకార సంఘాలు నడిచేలా చూస్తాయి.
* భారతదేశమంతటా భూ సంస్కరణలను మనస్ఫూర్తిగా అమలుపరచలేదు.
* జమీందారీ వ్యవస్థను రద్దు చేశారు.
* కానీ భూమిలేని వాళ్లకి భూ పంపిణీ జరగలేదు.
* గ్రామీణ ప్రాంతాల్లో ధనికులు, శక్తిమంతులు అధిక భూ భాగాలపై నియంత్రణ కొనసాగిస్తూనే ఉన్నారు.
* దళితులు ఇప్పటికీ భూమిహీనులుగానే ఉన్నారు.
* కానీ వెట్టిచాకిరీ నిర్మూలన, అంటరానితనం నిషేధం వల్ల ప్రయోజనం పొందారు.
* మొదటి పంచవర్ష ప్రణాళికలో పెద్ద ఆనకట్టలు కట్టి, విద్యుత్తు ఉత్పత్తి, సాగునీటి కల్పనల ద్వారా వ్యవసాయాన్ని వృద్ధి చేయడంపై దృష్టిసారించారు.
* రెండో పంచవర్ష ప్రణాళిక నుంచి పరిశ్రమలకు ప్రాధాన్యం పెరిగింది.
* 1956లో భారతదేశ ఆర్థిక రాజ్యాంగంగా పేరొందిన 'పారిశ్రామిక తీర్మానాన్ని' వెలువరించారు.

 

విదేశీ విధానం - యుద్ధాలు
 

* రెండో ప్రపంచ యుద్ధానంతరం అమెరికా - రష్యాల మధ్య ''ప్రచ్ఛన్న యుద్ధం" ప్రారంభమైంది.
* ప్రపంచమంతటా రష్యా నాయకత్వంలో (USSR) కమ్యూనిస్టు కూటమి, అమెరికా నాయకత్వంలో పెట్టుబడిదారీ దేశాల కూటములు ఏర్పడ్డాయి.
* జవహర్‌లాల్ నెహ్రూ ఈ రెండు కూటముల్లో ఏ శిబిరంలో చేరకుండా రెండిటికీ సమదూరంలో ఉంటూ విదేశాంగ విధానంలో స్వతంత్రంగా వ్యవహరించారు.
* అదే సమయంలో స్వాతంత్య్రం పొంది అదే విధానాన్ని కొనసాగించాలనుకుంటున్న ఇండోనేషియా, ఈజిప్టు, యుగోస్లావియా వంటి దేశాలతో నెహ్రూ చేతులు కలిపారు.
* వీరంతా కలిసి అలీన విధానాన్ని రూపొందించారు.
* 1955లో ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగిన సమావేశానికి ఆసియా, ఆఫ్రికా ఖండాలకు చెందిన దేశాలు హాజరయ్యాయి.

 

అలీన విధాన రూపకర్తలు
 

1. జవహర్‌లాల్ నెహ్రూ - భారత ప్రధాని.
2. డాక్టర్ సుకర్నో - ఇండోనేషియా అధ్యక్షుడు.
3. మార్షల్ టిటో - యుగోస్లావియా అధ్యక్షుడు.
4. కమాలుద్దీన్ నాజర్ - ఈజిప్టు అధ్యక్షుడు.
* 1961లో యుగోస్లావియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో అలీన విధాన మొదటి సమావేశం జరిగింది.
* పొరుగుదేశాలకు సంబంధించి ఒకరి ఆంతరంగిక వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదన్న పంచశీల సూత్రాలను నెహ్రూ రూపొందించారు.
* 1954, జూన్ 28న భారత్ - చైనాల ప్రధానులైన జవహర్‌లాల్ నెహ్రూ, చౌ - ఎన్‌లై మధ్య 'పంచశీల' ఒప్పందం కుదిరింది.
* 1948లో కశ్మీర్ విషయమై భారత్ - పాకిస్థాన్‌ల మధ్య తొలిసారి యుద్ధం జరిగింది.
* 1962లో భారత్ - చైనాల మధ్య యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో భారత్ పెద్ద ఎత్తున ప్రాణ, ధన నష్టాన్ని చూడాల్సి వచ్చింది.

 

నెహ్రూ తర్వాత:
 

* 1964లో నెహ్రూ మరణించిన తర్వాత ప్రజాస్వామ్యం మనగలుగుతుందా? ప్రజాస్వామిక సూత్రం
దెబ్బతింటుందా? అనే అనుమానాలు వచ్చాయి.
* అనంతరం ప్రభుత్వాధినేతగా లాల్‌బహదూర్‌శాస్త్రి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు.
* భారతదేశ లక్ష్యాలు, మౌలిక విలువలకు సవాలుగా నిలిచిన అనేక అంశాలతో లాల్‌బహదూర్ శాస్త్రి తలపడాల్సి వచ్చింది.
* దక్షిణాదిన తమిళనాడులో డీఎంకే పార్టీ చేపట్టిన ''హిందీ వ్యతిరేక" ఉద్యమం దేశ ఐక్యత, సమగ్రతకే ముప్పుగా నిలిచింది.
* 1965లో పాకిస్థాన్‌తో యుద్ధం మొదలైంది.
* 1966లో శాస్త్రి ''తాష్కెంట్‌"లో అకాల మరణం పొందారు.
* 1966లో భారత ప్రధానిగా ఇందిరాగాంధీ అధికారాన్ని చేపట్టారు.
* 1966లో మన దేశంలో వ్యవసాయోత్పత్తుల పెంపు లక్ష్యంగా ''హరిత విప్లవం" (Green Revolution) ప్రారంభమైంది.

 

హిందీ వ్యతిరేక ఉద్యమం:
 

* 1963లో భారత ప్రభుత్వం అధికార భాషా చట్టాన్ని చేసింది.
* దీంతో డీఎంకే పార్టీ తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా ''హిందీ"కి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టింది.
* ఇందులో భాగంగా సమ్మెలు, ధర్నాలు, హర్తాళ్లు నిర్వహించారు.
* దిష్టిబొమ్మలు, హిందీ పుస్తకాలు, చివరికి రాజ్యాంగంలోని పేజీలను కూడా తగలబెట్టారు.
* కాంగ్రెస్ పార్టీ హిందీ అనుకూల, హిందీ వ్యతిరేక శిబిరాలుగా విడిపోయింది.
* అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి హిందీ వ్యతిరేక శిబిరంలోని ఉద్వేగాలను శాంతపరచడానికి అనేక మినహాయింపులను ప్రకటించారు.

 

అవి:
 

* ప్రతి రాష్ట్రం తన సొంత భాష కలిగి ఉండే హక్కు ఉంది.
* అది ప్రాంతీయ భాష లేదా ఆంగ్లం కావచ్చు.
* పత్ర వ్యవహారాలు ఆంగ్ల అనువాదంతో ప్రాంతీయ భాషల్లో ఉండవచ్చు.
* కేంద్రం, రాష్ట్రాల మధ్య వ్యవహార భాషగా ఆంగ్లం కొనసాగుతుంది.
* సివిల్ సర్వీస్ పరీక్షలు కేవలం హిందీలోనే కాకుండా, ఆంగ్లంలోనూ నిర్వహిస్తారు.
* తమ దృక్పథం కంటే దేశ ఐక్యత ఎంతో ముఖ్యమని జవహర్‌లాల్ నెహ్రూ, లాల్ బహదూర్‌శాస్త్రి స్పష్టంగా గుర్తించారు.

 

హరిత విప్లవం:
 

* అభివృద్ధి వ్యూహానికి సంబంధించిన చర్చ కేవలం ఆర్థిక పరమైనదే కాదు. దీనికి రాజకీయ కోణాలూ ఉన్నాయి.
* నెహ్రూ, కాంగ్రెస్‌లోని వామపక్షం వైపు మొగ్గుచూపే బృందం వ్యవసాయంలో ప్రభుత్వ నియంత్రిత వ్యవస్థాగత విధానాన్ని ఎంచుకున్నారు.
* కాంగ్రెస్‌లోని మితవాదం వైపు మొగ్గుచూపే బృందం వ్యవసాయంలో ప్రభుత్వ నియంత్రణను వ్యతిరేకించింది.
* 1964 - 1967లో భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విభిన్నమైన వ్యూహాన్ని ఎంచుకుంది.
* రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఆహార ఉత్పత్తిని పెంచడానికి ప్రయత్నించారు.

 

ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ ఉద్యమాల ప్రాబల్యం:
 

* భారతదేశ ఎన్నికల్లో 1967 ఎన్నికలు చాలా కీలకమైనవి. చరిత్రాత్మకమైనవి.
* ఎన్నికలను ప్రజలు చాలా ముఖ్యంగా పరిగణిస్తున్నారని, వాటికి తమదైన ఉనికి ఉందని ఈ ఎన్నికలు రుజువు చేశాయి.
* 1967 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంతకు ముందెన్నడూ పొందని ఫలితాలను చవి చూసింది.
* స్వాతంత్య్రం తర్వాత కాంగ్రెస్ అంత తక్కువ ఆధిక్యంతో (284 స్థానాలు) ఎప్పుడూ ఎన్నికవ్వలేదు.
* కాంగ్రెస్ పార్టీ బిహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, పశ్చిమ్ బంగ, ఒడిశా, మద్రాస్, కేరళ, శాసనసభల్లో ఓటమి పాలైంది.
* దేశంలో ప్రజాస్వామ్యం వేళ్లూనుకుందని ఇది సూచిస్తుంది.
* పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థ వైపుకి దేశం పయనిస్తోంది.
* కాంగ్రెస్ పార్టీ తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఘోర పరాజయం పాలైంది.
* తమిళనాడులో డీఎంకే పార్టీ ఘన విజయం సాధించింది.
* డీఎంకే పార్టీకి సినిమా రంగంతో బలమైన సంబంధాలు ఉన్నాయి.
* ప్రజాదరణ ఉన్న సినిమా హీరో ఎం.జీ రామచంద్రన్. ఈయన్ని అందరూ ఎంజీఆర్ అనేవారు.
* ఎంజీఆర్ అభిమాన సంఘాలను డీఎంకే పార్టీ వినియోగించుకుంది.
* ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప విజయాలు పొందినప్పటికీ, దాని ప్రతినిధులు ప్రతిపక్షాలకు
ఫిరాయించారు.
* దీని ఫలితంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాలు పడిపోయి, ''సంయుక్త విధాయక దళ్" (S.V.D.) ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

 

S.V.D. (సంయుక్త విధాయక దళ్) ప్రభుత్వంలో ఉన్న శాసన సభ్యులు
1. జనసంఘ్ పార్టీకి చెందినవారు.
2. సోషలిస్టు పార్టీకి చెందినవారు.
3. స్వతంత్ర పార్టీ సభ్యులు.
4. కాంగ్రెస్ ఫిరాయింపు దారులు.
5. స్థానిక పార్టీల శాసనసభ్యులు ఏర్పాటు చేసిన సంకీర్ణం.
 భారత రాజకీయ చరిత్రలో ఈ కొత్త ప్రభుత్వాలు మైలురాయిగా నిలిచాయి.
 మధ్యస్థాయి కులాలు భూ సంస్కరణలతో ప్రయోజనం పొంది, ఆర్థికంగా లాభపడ్డాయి.
 మొదటిసారిగా రాజకీయ అధికారాన్ని పొందాయి.
ఈ కులాలు
 హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో - జాట్, యాదవ
 బిహార్‌లో - కుర్మి, కొయిరి, యాదవ
 మధ్యప్రదేశ్‌లో - లోథ్, యాదవ
 ఆంధ్రప్రదేశ్‌లో - రెడ్డి, కమ్మ
 కర్ణాటకలో - ఒక్కళిగా
 తమిళనాడులో - వెల్లల కులం

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌