• facebook
  • twitter
  • whatsapp
  • telegram

చాటువులు

వ్యాసరూప సమాధాన ప్రశ్నలు

1. చాటువు గురించి వివరించండి. 
జ: చాటువు అంటే ప్రియమైన మాట. ఇది అచ్చమైన సంస్కృత శబ్దం. మనలో కొందరు ఈ చాటువును చదర, చాప అనే ధోరణిలో ముచ్చటగా ఉచ్చరిస్తూ ఉంటారు. దీన్ని బట్టి ఈ చాటువు అనే శబ్దం తెలుగు భాషలో ఎంతగా జీర్ణమైపోయిందో తెలుస్తుంది. చాటు పద్యం అంటే కవి సరదాగా చెప్పిన పద్యం. చాటువుల్లో చమత్కారాలు, హాస్యాలు మాత్రమే కాదు జీవిత వాస్తవాలు కూడా ఉంటాయి. చాటువు అనేది సాహిత్యంలో ప్రత్యేకించి ఒక ప్రక్రియ కాకపోయినప్పటికీ కావ్యాల కంటే భిన్నమైంది.
   ఈ చాటువులు ఒక భోగి లేదా లోభి చేత సత్కరించబడినప్పుడు, అందమైన దృశ్యం కనిపించినప్పుడు లేదా హృదయం  గాయపడినప్పుడు, అయిష్టత తొంగిచూసినప్పుడు, హాస్యం లాస్యం చేసినప్పుడు ఇలా అనేక సందర్భాల్లో, చిత్రమైన చిత్తవృత్తుల్లో, ఛందోరూపంలో జుమ్మని చిమ్ముకొని కవితా రూపంగా వస్తాయి.
   మన ఆంధ్ర సాహిత్యంలో ఒక వైపు గంగానదీ సమానమైన మహాకావ్యాలు వెలువడినట్లే మరో వైపు సెలయేళ్ల లాంటి చాటు పద్యాలు కూడా గలగల ప్రవహించాయి. నైషధం లాంటి మహాకావ్యాలు రాసిన శ్రీనాథుడు కూడా ‘చిన్న చిన్న రాళ్లు చిల్లర దేవుళ్లు’ లాంటి చిట్టి పొట్టి చాటువులు రాశాడు. తాటాకు మడతల్లో, పెద్దల నాలుకల్లో ఒదిగి ఉన్న ఈ చాటువులను వెలుగులోకి తెచ్చినవారు కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రి.
   కొన్ని చాటుపద్యాలు జానపద గేయాల్లా కవి పేరు తెలియకుండానే ఉండిపోయాయి. ‘చేత వెన్నముద్ద చెంగల్వ పూదండ’  అనే చాటుపద్యం గురించి అందరికీ తెలుసు. కానీ ఈ చాటుపద్య కర్త ఎవరో ఎవరికీ తెలియదు. సామెతల్లా ఉపయోగించే కొన్ని చాటుపద్యాలు కూడా ఉన్నాయి.
   ‘వాసన లేని పువ్వు - బుధ వర్గం’ లేని గృహంబు అనే చాటుపద్యానికి కర్త ఎవరో తెలియదు. అయినప్పటికీ ఈ చాటుపద్యాలు చదువుకున్న వారి నిత్య జీవితంలో బాగా అల్లుకుపోయాయి. చాటుపద్యాలు చెప్పిన ప్రాచీన కవుల్లో వేములవాడ భీమకవి, శ్రీనాథుడు, తెనాలి రామకృష్ణుడు, అడిదం సూరకవి లాంటివారు ముఖ్యులు. భీమకవి చాటువుల ద్వారానే ఇంతకాలం బతికి ఉన్నారు.

2. చాటుపద్యాల్లో ప్రజా జీవనాన్ని వివరించండి.
జ: చాటుపద్యాల్లో ప్రజా జీవనాన్ని అధికంగా చిత్రించినవారు శ్రీనాథుడు. ఈయన ప్రౌఢదేవరాయలను దర్శించడానికి కర్ణాట రాజ్యానికి వెళ్లాడు. అక్కడ శ్రీనాథుడికి రాజ దర్శనం చాలా ఆలస్యంగా లభించింది. అప్పుడు శ్రీనాథుడు కర్ణాట రాజ్యలక్ష్మిని ఇలా ప్రార్థించాడు.
   ‘ఓ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! నేను కుళ్లాయి ధరించాను. చీరను తలపాగలా చుట్టుకున్నాను. కుర్పాసమును వేసుకున్నాను. వెల్లుల్లి, తెలగపిండిని  వితంతువు వడ్డించగా తిన్నాను. మజ్జిగ లేక గంజి తాగాను. పదార్థాల రుచులు బాగాలేవని నిందించాను’ అని ఆ రోజుల్లోని కర్ణాట దేశీయుల వేషంతో పాటు ఆనాటి భోజన విశేషాలను కూడా శ్రీనాథుడు తన చాటుపద్యంలో తెలిపాడు.
   శ్రీనాథుడు పలనాడు వెళ్లినప్పుడు అక్కడ జొన్న కలి, జొన్న గంజి, జొన్న అన్నం, జొన్న పిసరు తప్ప సన్నన్నం సున్నా అని అక్కడి విశేషాలు సృష్టంగా చెప్పాడు. పలనాటికి రంభ వెళ్లినా ఏకులే వడుకుతుందని, మన్మథుడు వెళ్లినా జొన్న కూడే తినక తప్పదని శ్రీనాథుడు ఆనాటి జన జీవనాన్ని చమత్కారంగా చాటువుల్లో చిత్రించాడు.
   శ్రీనాథుడు సామాన్య గ్రామ పురోహితుడి ఇంటి స్థితిని ఒక చాటుపద్యంలో ఈవిధంగా చెప్పాడు. పురోహితులకు దోసెడు కొంప, ఆ కొంపలో పశువుల త్రొక్కిడి ఉంటుంది. ఆ ఇంటిలో మంచం, దూడ గొద్ది, పాసిపోయిన అన్నం, చిన్నపిల్లల శౌచం, విస్తరాకులు, మాసిన కుండలు ఉంటాయని ఏకరువు పెట్టాడు.
   మసర రాజ్యంలో మనుషులు ఎలా ఉంటారో శ్రీనాథుడు తన చాటువుల్లో వర్ణించాడు. పడమటి సీమ వ్యాపారుల వస్త్రాలు, మసి బుర్రలు, కలములు, చింత అంబుళులు, చెమట పట్టిన నీర్కావి వస్త్రాలను, భయంకరమైన వారి గడ్డాలను శ్రీనాథుడు ఒక పట్టికలా ఇచ్చాడు. అంతేకాకుండా వస్తూ చూస్తిమి రోస్తిమి అంటూ అప్పటి ప్రజల యాసను కూడా తమాషాగా అనుకరించాడు.
   ఆనాటి దక్షిణ దేశీయుల భోజన పదార్థాల గురించి శ్రీనాథుడికి కలిగిన అయిష్టతను ఒక చాటువులో ఈవిధంగా ఇలా చెప్పాడు.

సంక్షిప్త సమాధాన ప్రశ్నలు 

1. వేములవాడ భీమకవి గురించి తెలపండి.
జ: 
చాటుపద్యాలు చెప్పిన ప్రాచీనాంధ్ర కవుల్లో వేములవాడ భీమకవి గుణనీయుడు. ఈయన తన చాటుపద్యాల ద్వారా ఇంతకాలం బతికి ఉన్నాడు. భీమకవి పేరు మీదుగా చెలామణిలో ఉన్న చాటువుల్లో ఒక్కో చాటువు ఒక్కో చారిత్రక వృత్తాంతాన్ని తెలుపుతుంది. దాగి ఉన్న సత్యాన్ని వెల్లడిస్తుంది.
   వేములవాడ భీమకవి తిట్టు కవులైన మేధావి భట్టు, కవి మల్లుడు, కవి భానుడు, బడబాగ్ని భట్టుల కంటే తాను భయంకరమైన కోపం గలవాడినని చెప్పాడు. తనకు శాపం ఇవ్వగల, శాపాన్ని మళ్లించ గల శక్తి ఉందని అన్నాడు. తాను ఎండిన చెట్టుకు చిగుళ్లు పుట్టేలా చేయగలనని, ఆ చెట్టును చంపగలనని భీమకవి ఒక చాటుపద్యంలో చెప్పాడు. భీమకవి ఇతర చాటువుల్లో పేర్కొన్న సాగి పోతరాజు, సాహిణి మారుడు, మైలమ భీముడు, కళింగ గంగు లాంటి వారిని, పైన పేర్కొన్న తిట్టు కవుల గురించి చారిత్రకులు పరిశోధించాలి. 

2. ఖడ్గ తిక్కనకు సంబంధించిన చాటు వృత్తాంతాన్ని తెలపండి. 
జ: ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన నిలిచి కాటమరాజును ఎదిరించిన మహావీరుడు. ఈయన యుద్ధరంగంలో భయంకరంగా పోరాడి, తన సేనలు చెల్లాచెదురై పారిపోగా యుద్ధం మాని ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పుడు ఖడ్గ తిక్కన భార్య నులకమంచం అడ్డుపెట్టి పసుపుముద్ద పెట్టాను అని చెప్పిందట.
   ఖడ్గ తిక్కన భోజనానికి కూర్చుంటే అతడి తల్లి విరిగిన పాలు పోసిందట. అదేమిటని తిక్కన తల్లిని అడిగాడట. ‘యుద్ధంలో శత్రువులను చంపకుండా ఓడిపోయి వచ్చిన పిరికివాడిలాగే గడ్డి మేయడానికి వెళ్లిన పశువులు కూడా తిరిగి వచ్చాయి. వాటి పాలు విరిగిపోయాయి’ అని ఆమె కొడుకును ఎత్తిపొడిచింది. అప్పుడు ఖడ్గ తిక్కన సిగ్గుపడి వెంటనే యుద్ధానికి వెళ్లి శత్రువులను ఎదిరించి వీరమరణం పొందాడట.

3. అడిదం సూరకవి చాటుపద్యాన్ని వివరించండి.
జ: అడిదం సూరకవి విజయనగరంలో పూసపాటి విజయ రామరాజు దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు. ఒకసారి విజయ రామరాజు సూరకవిపై కోపం వచ్చి ఆస్థాన పదవి నుంచి తొలిగించాడు. తర్వాత విజయ రామరాజు బాదుల్లాఖాన్‌తో యుద్ధానికి వెళ్లి ఓడిపోయి తిరిగివచ్చాడు. ఆ సందర్భంలో అడిదం సూరకవి ఒక చాటుపద్యాన్ని ఈవిధంగా చెప్పాడు. ‘ముల్లు యొక్క వాడి మెత్తని అరిటాకు మీదనే కానీ మంటపై చెల్లదు. అలాగే విజయ రామరాజు తీక్షణత్వం, వాడి బీదవారి మీదనే కానీ బాదుల్లాఖాన్‌ మీద పనిచేయవు’ అని చెప్పాడట.
   అలాగే ఒకసారి విజయ రామరాజు బాదుల్లాఖాన్‌ను తరిమేసిన సందర్భంలో అడిదం సూరకవి విజయ రామరాజును పొగుడుతూ ‘దిల్లీ లోపల, గోలకొండ పురి నిండన్‌ నీ ప్రశంసల్‌’ అని చాటువు చెప్పాడట.

ఏక వాక్య సమాధాన ప్రశ్నలు 

1. ‘ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు - ప్రయోగములు’ అనే పరిశోధనా గ్రంథకర్త ఎవరు?
జ: ‘ఆధునికాంధ్ర కవిత్వం - సంప్రదాయములు - ప్రయోగములు’ అనే పరిశోధనా గ్రంథకర్త సి.నారాయణరెడ్డి. 


2. చాటువులను వెలుగులోకి తెచ్చినవారు ఎవరు? 
జ: చాటువులను కీ.శే.వేటూరి ప్రభాకర శాస్త్రి వెలుగులోకి తెచ్చారు. 


3. ఖడ్గ తిక్కన ఎవరి తరపున యుద్ధం చేశాడు? 
జ: ఖడ్గ తిక్కన మనుమసిద్ధి పక్షాన యుద్ధం చేశాడు. 


4. శ్రీనాథుడు ఏ విజయనగర రాజును దర్శించాడు? 
జ: శ్రీనాథుడు ప్రౌఢ దేవరాయలు అనే కన్నడ రాజును దర్శించాడు. 


5. విద్వదౌషదంగా పేరు గాంచిన గ్రంథమేది? 
జ: విద్వదౌషదంగా పేరు గాంచిన గ్రంథం ‘నైషధం’.


6. పూసపాటి విజయ రామరాజు ఆస్థాన కవి ఎవరు? 
జ: పూసపాటి విజయ రామరాజు ఆస్థానకవి పేరు అడిదం సూరకవి.


7. చాటువు అంటే ఏమిటి? 
జ: చాటువు అంటే ప్రియమైన మాట.

రచయిత: ఎం.మహేశ్వర నాయుడు

Posted Date : 16-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

Previous Papers

More

Model Papers

More