• facebook
  • whatsapp
  • telegram

అతిపెద్ద బ్యాంకులో అత్యుత్తమ శిక్షణ

‣ 8500 అప్రెంటిసెస్ ఖాళీలతో ఎస్‌బీఐ ప్రకటన విడుదల

కోర్సు పూర్తి కాగానే నిజమైన వృత్తి నైపుణ్యాన్ని సాధించాలంటే అప్రెంటిస్‌షిప్ చేయాలి. దీని వల్ల అభ్యర్థులు సంస్థల్లోని వాస్తవ పని వాతావరణానికి అలవాటు పడటంతోపాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోగలుగుతారు. అప్రెంటిస్‌షిప్ చేసిన వారికి ఉద్యోగాల ఎంపికలోనూ ప్రాధాన్యం లభిస్తుంది. ఇప్పుడు యువతకు దేశంలోనే అతిపెద్ద బ్యాంకులో అలాంటి అప్రెంటిస్ శిక్షణ పొందే అవకాశం వచ్చింది. మొత్తం 8500 ఖాళీలతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పూర్తి చేసినవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకింగ్ వ్యవస్థలోని అత్యుత్తమ ఉద్యోగ నైపుణ్యాలను అందిపుచ్చుకోవచ్చు. ఇది శాశ్వత ఉద్యోగం కాదు. పరిమిత కాల శిక్షణ మాత్రమే.

తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1,080 ఖాళీలు (ఏపీ - 620, తెలంగాణ - 460) ఉన్నాయి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష ప్రిపేరేషన్.. బ్యాంకులు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పలు రకాల పోస్టులకు నిర్వహించే పరీక్షలకూ ఉపయోగపడుతుంది.  

ఎంపిక ఎలా?
ఈ అప్రెంటిస్‌షిప్‌న‌కు అభ్యర్థుల ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటిది ఆన్‌లైన్ రాత పరీక్ష. రెండోది ప్రాంతీయ భాషలో రాతపరీక్ష. ఆన్‌లైన్‌ రాత పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఇస్తారు. జనరల్/ ఫినాన్షియల్ అవేర్‌నెస్‌ నుంచి 25, జనరల్ ఇంగ్లిష్ నుంచి 25, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ నుంచి 25, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి 1/4 మార్కులు కోత విధిస్తారు. పరీక్ష సమయం ఒక గంట (60 నిమిషాలు). ఒక్కో విభాగానికి 15 నిమిషాల చొప్పున కేటాయించారు. పరీక్ష పత్రం ఇంగ్లిష్, హిందీల్లో ఉంటుంది. మొదటి దశ రాత పరీక్షలో ఎంపికైనవారు  తాము ఎంచుకున్న  స్థానిక భాష (లోకల్ లాంగ్వేజి) సామర్థ్య పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక వేళ అభ్యర్థులు పదో తరగతి లేదా పన్నెండో తరగతిలో స్థానిక భాషను ఒక సబ్జెక్టుగా చదివి ఉంటే లోకల్ లాంగ్వేజి టెస్ట్ రాయాల్సిన అవసరం లేదు. ఇతరులు మాత్రం తప్పనిసరిగా అర్హత సాధించాలి. ఈ పరీక్షలో మార్కులకు వెయిటేజీ ఉండదు. ఇందులో ముఖ్యంగా అభ్యర్థికి ప్రాంతీయ భాషలో రాయడం, చదవడం, మాట్లాడటం, భాషను అర్థం చేసుకోవడం వచ్చా? లేదా? అని పరీక్షిస్తారు. మొదటి దశలో అర్హత సాధించి, ఇందులో అవసరమైన మెరిట్ సాధించకపోతే అభ్యర్థులు అవకాశం కోల్పోతారు. ఈ రెండు దశల్లో ఎంపికైన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి అప్రెంటిస్‌షిప్‌న‌కు ఎంపిక చేస్తారు.

మూడేళ్ల పాటు శిక్షణ
ఇది శాశ్వత ఉద్యోగం కాదు. ఎంపికైతే మూడేళ్ల పాటు మాత్రమే అభ్యర్థులు అప్రెంటిస్ శిక్షణ పొందుతారు. వీరికి మొదటి సంవత్సరం రూ.15,000, రెండో సంవత్సరం రూ.16,500, మూడో సంవత్సరం రూ.19,000 వేతనంగా ఇస్తారు. ఇతర అలవెన్సులు ఏమీ ఉండవు. దీనికి గతంలో అప్రెంటిస్‌షిప్‌గా శిక్షణ తీసుకున్న‌, ఉద్యోగ అనుభవం ఉన్నవారు అనర్హులు.

దరఖాస్తు విధానం
దరఖాస్తుదారుల వయసు అక్టోబరు 31, 2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే నవంబరు 01, 1992 సంవత్సరానికి ముందు, అక్టోబరు 31, 2000 తర్వాత జన్మించి ఉండకూడదు.  ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుంగా జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ రూ.300 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ వారికి ఎలాంటి రుసుం లేదు. దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు 10, 2020. ఆన్‌లైన్ పరీక్ష జనవరి, 2021లో జరుగుతుంది. తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

తెలంగాణలో జిల్లాల వారీగా ఖాళీలు

జిల్లా ఖాళీలు
అదిలాబాద్ 10
భద్రాద్రి కొత్తగూడెం 21
జగిత్యాల 09
జనగాం 10
జయశంకర్ భూపాలపల్లి 12
జోగులాంబ గద్వాల్ 09
కామారెడ్డి 16
కరీంనగర్ 14
ఖమ్మం 24
కొమరంభీం అసిఫాబాద్ 07
మహబూబాబాద్ 12
మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ 33
మల్కాజ్‌గిరి 05
మంచిర్యాల 08
మెదక్ 14
నాగ‌ర్‌క‌ర్నూల్‌ 15
నల్గొండ 22
నిర్మల్ 11
నిజామాబాద్ 39
పెద్దపల్లి 10
రంగారెడ్డి 22
సంగారెడ్డి 20
సిద్దిపేట 17
సిరిసిల్ల 06
సూర్యాపేట 28
వికారాబాద్ 23
వనపర్తి 12
వరంగల్ 04
వరంగల్ రూరల్ 11
యాదాద్రి భువనగిరి 16
మొత్తం 460


 

ఏపీలో..

జిల్లా ఖాళీలు
శ్రీకాకుళం 33
విజయనగరం 29
విశాఖపట్నం 44
తూర్పు గోదావరి 62
పశ్చిమ గోదావరి 75
కృష్ణ 53
గుంటూరు 75
ప్రకాశం 47
నెల్లూరు 37
చిత్తూరు 43
వైఎస్ఆర్ కడప 51
అనంతపురం 28
కర్నూలు 43
మొత్తం 620

పరీక్షా కేంద్రాలు
ఏపీలో చీరాల, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.

ప్రిపరేషన్ విధానం

నాలుగు విభాగాల్లో జరిగే ఈ పరీక్షలో ప్రశ్నలు క్లర్కులకు నిర్వహించే పరీక్ష స్థాయిలో ఉండవచ్చు. అభ్యర్థులు క్లర్కు పరీక్షల పాత ప్రశ్న పత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవచ్చు. తగిన ప్రిపరేషన్ ప్రణాళికను రూపొందించుకోవచ్చు. 

జనరల్/ ఫినాన్షియ‌ల్ అవేర్‌నెస్‌: దీనిలో కరెంట్అఫైర్స్, బ్యాంకింగ్ ట‌ర్మినాలజీ, స్టాండర్డ్ జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌ నుంచి ప్రశ్నలుంటాయి. బ్యాంకింగ్, ఆర్థిక సంబంధాలపై ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. గత 5, 6 నెలలకు సంబంధించిన తాజా పరిణామాలపై అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవ‌ల‌ప్‌మెంట్ బ్యాంకు మొద‌లైన‌ అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, బ్యాంకింగ్ వ్య‌వస్థ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, స్టాక్ మార్కెట్, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలను గమనించి అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్, ఆర్థిక వ్యవస్థల నేపథ్యాన్ని అనుసరించి ముఖ్యమైన దినోత్సవాల వివరాలనూ తెలుసుకోవాలి. 

ఇంగ్లిష్ లాంగ్వేజ్: ఈ విభాగంలో అభ్యర్థి సాధారణ ఆంగ్లభాష నాలెడ్జ్ ను పరిశీలిస్తారు.  సెంటెన్స్ కాంప్లీషన్, పారా జంబుల్డ్, కరెక్షన్ఆఫ్సెంటెన్సెస్, క్లోజ్డ్ టెస్ట్, ఫిల్ఇన్‌ ది బ్లాంక్స్ తదితరాలపై ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు రీడింగ్ కాంప్రహెన్షన్, సిననిమ్స్, యాంటనిమ్స్ నుంచీ ప్రశ్నలు ఇస్తారు. గ్రామర్‌పై కొంత సాధారణ పట్టు సాధిస్తే ఈ ప్రశ్నలకు జవాబులను తేలిగ్గా గుర్తించవచ్చు. 

రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్: ఇందులో అభ్యర్థుల తార్కిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు.  లాజికల్ రీజనింగ్, ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ర్యాంకింగ్, డైరెక్షన్, ఆల్ఫాబెట్ టెస్ట్, డేటా సఫిషియన్సీ, కోడెడ్ ఇన్-ఇక్వాలిటీస్, పజిల్స్ తదితర విభాగాల నుంచి ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఆ విభాగాల ప్రశ్నలను అభ్యర్థులు వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. స్టేట్‌మెంట్ సంబంధ‌ ప్రశ్నల్లో ఆప్షన్లు అన్నీ సరైనవే అనిపించేలా ఉంటాయి. జాగ్రత్తగా పరిశీలించాలి. ఇంగ్లిష్ ప‌రిజ్ఞానం పెంచుకుంటే ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను సులభంగా గుర్తించవచ్చు.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్; ఈ విభాగంలో సిప్లిఫికేషన్, నంబర్ సిరీస్, డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ ప్రిటేషన్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్, కాలం-పని, కాలం-దూరం, భాగస్వామ్యం, లాభనష్టాలు  తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.  అరిథ్ మెటిక్ టాపిక్ లపై పట్టు సాధిస్తే వేగంగా జవాబులను గుర్తించడానికి వీలవుతుంది.  ముఖ్యంగా పర్సంటేజెస్, యావరేజ్, రేషియో-ప్రపోర్షన్లపై మంచి అవగాహన వుండాలి. కాలుక్యులేష‌న్స్ వేగంగా చేయగలగాలి. ఈ విభాగానికి ప్రాక్టీస్ బాగా అవసరం.

వేగం, కచ్చితత్వం ముఖ్యం
బ్యాంకు పరీక్షల్లో వేగం, కచ్చితత్వం, నిలకడతనం విజయానికి సోపానాలు. పరీక్షల్లో సక్సెస్ సాధించడానికి నిర్ణీత సమయంలో ఎక్కువ ప్రశ్నలు పరిష్కరించడం అవసరం.  కాబట్టి, ప్రశ్నలను వేగంగా సాధించగలిగే సామర్థాన్ని సంపాదించుకోవాలి. ఇది ప్రాక్టీస్ వల్ల సాధ్యమవుతుంది. వేగంతోపాటు కచ్చితత్వానికీ ప్రాధాన్యమివ్వాలి. ఈ నిలకడతనాన్ని కొనసాగించాలి. పోటీపరీక్షల్లో తక్కువ సమయంలో ఎక్కువ ప్రశ్నలను సరిగ్గా సాధించడం ద్వారానే అభ్యర్థి మెరిట్ నిర్ణయమవుతుంది.  నిరంతర ప్రాక్టీస్ వల్ల పెన్ను ఉపయోగించకుండా కొన్ని ప్రశ్నలకు జవాబులను సాధించే సామర్థ్యం అలవడుతుంది. అభ్యర్థులు ఆ నైపుణ్యాన్ని పొందడానికి కృషి చేయాలి. ప్రాక్టీస్ వల్ల వేగంగా ప్రశ్నలను సాధించే వివిధ పద్ధతులూ తెలుస్తాయి. ఇవన్నీ పరీక్షలో విజయం సాధించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని ఏ మేరకు అలవరచుకున్నారో  అంచనా వేసుకోవాలంటే మోడల్ పేపర్లను సాధన చేయాలి.  నమూనా ప్రశ్నపత్రాలనూ వాస్తవ పరీక్ష రాసినట్లు పరిమిత సమయంలో ఆన్ లైన్ లో రాయాలి.  పరీక్షకు కేటాయించిన నిర్ణీత సమయంలో 90% ప్రశ్నలను 95% కచ్చితత్వంతో సాధించగలిగే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. ఇది అసాధ్యం కాదు. అభ్యాసంతో తప్పకుండా సాధించవచ్చు.

వెబ్‌సైట్స్‌: https://nsdcindia.org/apprenticeship, https://apprenticeshipindia.org,  http://bfsissc.com, https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers 

Posted Date : 21-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌