• facebook
  • whatsapp
  • telegram

మెయిన్స్‌లో మెరిసేదెలా? 

సివిల్స్‌ అభ్యర్థులకు మెలకువలు

 

 

సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ప్రతి దశా ముఖ్యమైనదే. ఇటీవల విడుదలైన ప్రిలిమినరీ-2020 ఫలితాల్లో 10,564 మంది అభ్యర్థులు నెగ్గారు; తర్వాతి దశ అయిన మెయిన్‌ పరీక్షకు అర్హత సాధించారు. వచ్చే ఏడాది జనవరి మొదటి వారంలో జరగబోతున్న  మెయిన్స్‌లో అత్యధిక మార్కుల సాధనకు ఏ ప్రణాళిక అనుసరించాలి? ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత పొందని  అభ్యర్థులు ఏ వ్యూహం పాటిస్తే మేలు? 

 

సివిల్స్‌ మెయిన్స్‌కు ఇంకా దాదాపు 45 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. తగిన సన్నద్ధత ప్రణాళికను రూపొందించుకునేముందు ఈ పరీక్ష ముఖ్య లక్షణాలను గమనంలోకి తీసుకోవాల్సివుంటుంది. 
మెయిన్‌ పరీక్ష మార్కుల వెయిటేజి.. సివిల్స్‌ పరీక్ష మొత్తంలో దాదాపు 87 శాతం (1750/2025 ). అభ్యర్థి విజయాన్ని నిర్ణయించేవి ఈ మార్కులే. ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు చాలా తక్కువ (275/2025). 
మెయిన్స్‌ సిలబస్‌ చాలా విస్తృతం. జనరల్‌స్టడీస్‌లోని ప్రతి పేపరూ, జనరల్‌ ఎస్సే.. చాలావరకూ పరస్పర సంబంధం లేని విభిన్న సబ్జెక్టులతో ఉంటాయి. 
ఆప్షనల్‌ సబ్జెక్టు పేపర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో కాకుండా ఆనర్స్‌ స్థాయిలో ఉంటుంది. అందువల్ల దీనికి లోతైన అధ్యయనం అవసరమవుతుంది.
జనరల్‌ ఎస్సేకు నిర్దిష్ట సిలబస్‌ ఉండదు. విస్తారమైన పఠన పరిజ్ఞానం, పరిణతీ ఉన్న అభ్యర్థులు దీన్ని బాగా రాయగలుగుతారు.
ఈ దశలో పోటీ చాలా ఎక్కువ. ప్రిలిమినరీకి దరఖాస్తు చేసినవారిలో సగం మందే ఆ పరీక్ష రాస్తారు. వారిలో 10 శాతం మంది మాత్రమే అసలైన (‘సీరియస్‌’) అభ్యర్థులు. ఈ మెయిన్‌ పరీక్షలో ప్రతి ఒక్కరూ సీరియస్‌ అభ్యర్థే!    

 

స్కోరుకు ఆరు సూత్రాలు
1. వచ్చే 45 రోజులకు టైమ్‌ టేబుల్‌ వేసుకోవాలి. ప్రతిరోజూ రెండు విభిన్న సబ్జెక్టుల పఠనం పూర్తిచేసుకోవాలి.
2. జవాబులు రాయటం సాధన చేయాలి. మొదట్లో ప్రశ్న తర్వాత ప్రశ్న రాయటం; తర్వాత ఒకే టాపిక్‌లోని ఎక్కువ ప్రశ్నలను నిర్దిష్ట సమయంలో రాయటం అభ్యసించాలి. ఇలా చేశాక.. పూర్తి పేపర్లను రాయటం సాధన చేయాలి. 
3. ఎక్కువ పాయింట్లకు ఎక్కువ మార్కులు వస్తాయి అందుకే సాధ్యమైనన్ని ఎక్కువ పాయింట్లు రాయటానికి ప్రయత్నించాలి.
4. ఎలా రాయాలి.. పాయింట్ల వారీగానా? పూర్తి వాక్యాలుగానా?.. ఏ రకమైన ప్రెజెంటేషన్‌కు మెరుగైన మార్కులు వస్తాయో ఎవరూ ఊహంచలేరు. పాయింట్లతో పూర్తి వాక్యాలు రాయటం ఉత్తమం.
5. పరీక్షలో రాదగ్గ ఏరియాలను జాబితాగా రాసుకోవాలి. వాటిపై అన్ని కోణాల నుంచీ అవగాహన పెంచుకోవాలి. ప్రశ్నలన్నీ నేరుగా ఉండవు. అందుకని అన్ని కోణాల్లో.. సమగ్రంగా అధ్యయనం చేస్తేనే ప్రశ్నలకు తగిన జవాబులు ఇవ్వటం సాధ్యమవుతుంది.
6. ఎథిక్స్, జనరల్‌ ఎస్సేలపై దృష్టి పెడితే ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.   

 

ప్రిలిమ్స్‌ నెగ్గనివారు ఏం చేయాలి?

ఎందుకు ఉత్తీర్ణత సాధించలేదో అవగాహన చేసుకోవడం ముఖ్యం. ప్రిలిమ్స్‌లో అర్హత పొందలేకపోవడానికి చాలా కారణాలుంటాయి. వాటిలో కొన్ని-
మార్చిలో అమలు చేసిన లాక్‌డౌన్‌ మూలంగా సన్నద్ధత గాడి తప్పింది.
పరీక్ష ఈ ఏడాది జరుగుతుందో లేదో అనే అనిశ్చితి వల్ల కూడా పరీక్షకు సరిగా తయారు కాలేదు.
కరోనా భయం మితిమీరిన ఒత్తిడిని కల్గించింది.
లాక్‌డౌన్‌ కారణంగా ఆఫ్‌లైన్‌ సహకారం లేకుండా పోయింది.   
పరీక్ష వాయిదా వల్ల పరీక్షపై ఉండాల్సిన ఏకాగ్రత తగ్గిపోయింది. 
చాలామంది సీరియస్‌ అభ్యర్థులు కూడా పై అంశాల్లో ఏదో ఒకటి వర్తించి, ప్రిలిమినరీ సరిగా రాయలేకపోయారు. అందువల్ల ఈ వైఫల్యానికి తమను తాము నిందించుకోకుండా సన్నద్ధత కొనసాగించటమే సరైన మార్గం.  వీరు ప్రిలిమ్స్‌కు అర్హత సాధించకపోయినా.. ప్రస్తుతం మెయిన్‌ పరీక్షకు సిద్ధం కావటమే వ్యూహాత్మకంగా సముచితం. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రిలిమ్స్‌కు తయారు కావొచ్చు!  

 

అర్హత పేపర్లయిన మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్, ఇంగ్లిష్‌.. ఎంత ముఖ్యమైనవి?
ఈ పేపర్లు ఒక్కోటి 300 మార్కులకు ఉంటాయి. ప్రతి అభ్యర్థీ వీటిలో కనీస మార్కులు (సాధారణంగా 25 శాతం) తెచ్చుకోవాల్సివుంటుంది. ఇంగ్లిష్‌ మాధ్యమం వారికి ఇంగ్లిష్‌ పేపర్‌తో ఇబ్బంది ఉండదు. కానీ మోడర్న్‌ ఇండియన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌కు సాధన అవసరం. చాలామంది తెలుగు గానీ, హిందీ గానీ తీసుకుంటారు. అయితే ఎక్కువమంది తమ టెన్త్‌ తర్వాత వీటిని పట్టించుకునివుండరు. అందుకే రోజు విడిచి రోజు కనీసం అరగంట గానీ, రోజూ 15 నిమిషాలు గానీ ఈ పేపర్‌ను రాయటం సాధన చేయాలి. ఇంట్లో రోజూ ఆ భాష మాట్లాడుతుండవచ్చు. కానీ రాయటం పూర్తిగా వేరే విషయమని గుర్తుపెట్టుకోవాలి. ఇది పట్టించుకోకుండా నేరుగా పరీక్షకు వెళ్తే నష్టం తథ్యం. అందుకే రాత సాధన చాలా ముఖ్యం. 

 

ఎస్సే పేపర్‌ రాయటానికి ఎలా ప్రణాళిక ఉండాలి? 
గత కొద్ది సంవత్సరాలుగా ఇది స్కోరింగ్‌ పేపర్‌. రెండు సెక్షన్ల నుంచి రెండు వ్యాసాలు రాయాల్సివుంటుంది. మొదటి సెక్షన్లో నైరూప్య (ఆబ్‌స్ట్రాక్ట్‌) అంశాలు, రెండోది సాధారణంగా వర్తమాన అంశాలకు సంబంధించి ఉంటుంది. మొదట రెండు సెక్షన్లలోని టాపిక్స్‌ అన్నిటినీ చూడాలి. ఎక్కువ సమాచారం రాయగలిగిన అంశాలను గుర్తించాలి. మొదట వర్తమాన అంశాల విభాగంలోని టాపిక్‌ను రాయటం మొదలుపెట్టాలి. తర్వాత ఆబ్‌స్ట్రాక్ట్‌ అంశం. మొదటి టాపిక్‌ రాయటానికి ఎక్కువ సమయం పడుతుంది. పరీక్ష మొత్తంలో స్కోరింగ్‌ అంశాల్లో వ్యాసం ఉందని మర్చిపోకూడదు. గత సంవత్సరాల పేపర్లను పరీక్షా పరిస్థితులు పాటిస్తూ సాధన చేస్తుండాలి.

 

విస్తృత పరిధి ఉన్న జనరల్‌స్టడీస్‌-1ను ఎలా పూర్తి చేయాలి?
 ఈ పేపర్లోని అంశాలు- భారతీయ వారసత్వం-సంస్కృతి, చరిత్ర, ప్రపంచ భౌగోళిక వ్యవస్థ, సమాజం. సాధారణంగా ఈ పేపర్లో స్కోరు చేయటం కష్టం. పైగా చరిత్ర భాగం అధ్యయనానికి దీర్ఘకాలం పడుతుంది. అంత కష్టపడినా మార్కులపరంగా పెద్ద ప్రయోజనం ఉండదు. దీనిలో భౌగోళిక వ్యవస్థ స్కోరింగ్‌ సబ్జెక్టు. అందుకే దానికి ఎక్కువ సమయం కేటాయించటం మేలు. తర్వాతి ప్రాధాన్య క్రమం..సొసైటీ, ఆపై హిస్టరీ. బాగా కృషి చేయాల్సిందే కానీ.. ఈ పేపర్‌ సన్నద్ధతకు నిర్దేశించుకున్న సమయానికి మించకుండా జాగ్రత్తపడాలి. 

 

జనరల్‌ స్టడీస్‌-2 తేలిగ్గానే కనిపిస్తోంది. దీనికి తక్కువ సమయం పెట్టుకోవచ్చా?
పాలిటీ సెక్షన్‌ కోర్‌- కరంట్‌ అఫైర్స్‌ సమ్మేళనం. మిగతావాటితో పోలిస్తే.. సమాధానం రాయటం సులువు.  అంతర్జాతీయ సంబంధాలు చదివి, సామాజిక న్యాయం అంశాలు చూడాలి. రాసే వాదనలకు తగిన గణాంకాల ఆధారాలు చూపాలి. ముఖ్యంగా సామాజిక న్యాయం అంశాల్లో! 

 

జనరల్‌ స్టడీస్‌-3లో నాలుగు ఏరియాలున్నాయి. వీటిని చదవటం ఎలా?
దీనిలో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎకనమిక్‌ డెవలప్‌మెంట్, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్‌ ఉన్నాయి. ఈ పేపర్లో ఇండియన్‌ ఎకానమీకి ప్రాముఖ్యం ఉంటుందని ఆశించవచ్చు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో ఫ్యాక్ట్స్‌పై దృష్టిపెట్టాలి. తర్వాత ఎకానమీ చదవాలి. ఆపై ఎన్విరాన్‌మెంట్, చివరకు ఇంటర్నల్‌ సెక్యూరిటీకి సిద్ధమవ్వాలి.

 

జనరల్‌స్టడీస్‌-4లో అంశాలు మరీ ‘జనరల్‌’గా కనిపిస్తున్నాయి. ఏమీ తయారవకుండానే రాయగలననిపిస్తోంది. దీనికి ప్రత్యేకంగా సన్నద్ధమవ్వాలా?
2019 పరీక్షలో మార్కులను ఇటీవల విడుదల చేశారు. దాన్నిబట్టి ఇది బాగా స్కోరింగ్‌ పేపర్‌. గత ఏడాది నుంచి ఈ సిలబస్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్‌ల పరంగా మారింది. మొదట థియరీ చదివి, తర్వాత కేస్‌ స్టడీలను సాధన చేయాలి. 

 

ఆప్షనల్‌ పేపర్ల సంగతేమిటి?
గత కొద్ది సంవత్సరాలుగా విజయాన్నీ, వైఫల్యాన్నీ నిర్ణయించేదిగా ఆప్షనల్స్‌ ఉంటున్నాయి. ఈ పాటికి అభ్యర్థులు ఆప్షనల్స్‌ పఠనం పూర్తిచేసి పునశ్చరణ కూడా ముగించేసివుంటారు. బాగా రివిజన్‌ చేయటం, ఏ చాప్టర్‌నూ వదలకుండా ఉండటం ముఖ్యం. ప్రశ్నలు ప్రతి చాప్టర్‌ నుంచీ వస్తాయి.  

Posted Date : 06-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

Previous Papers

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

Model Papers

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌