• facebook
  • whatsapp
  • telegram

వైరస్‌ల వల్ల వచ్చే వ్యాధులు  

     మానవుడిలో వైరస్‌ల వల్ల తట్టు, ఆటలమ్మ, పోలియో, గవదబిళ్లలు, మెదడువాపు, హెపటైటిస్, ఫ్లూ లాంటి వ్యాధులు వస్తాయి. వైరస్‌లు మానవుడికి తుంపరలు లేదా వాహకాల ద్వారా సంక్రమించి వ్యాధులను కలిగిస్తాయి.

 పోలియో 

  ఈ వ్యాధి పోలియో వైరస్ వల్ల వస్తుంది. ఇది సాధారణంగా అయిదు సంవత్సరాల లోపు పిల్లలకు ఎక్కువగా వస్తుంది.  పోలియో వైరస్‌లు సాధారణంగా కలుషిత నీరు, ఆహారం వల్ల వ్యాపిస్తాయి. వైరస్‌ల ప్రభావం నాడీ మండలంపైన ఉంటుంది. వీటి ప్రభావానికి లోనైన కండరాలు సరిగా పనిచేయవు. అవయవాల కండరాల సైజులో తగ్గుదల ఉంటుంది. జ్వరం, వాంతులు, కండరాల నొప్పులు, ఆకలి లేకపోవడం, కాళ్లు, చేతుల కండరాలు పనిచేయకపోవడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధిలో ఎక్కువగా ఒకటి లేదా రెండు కాళ్లు బలహీనమవుతాయి. పోలియోను శిశుపక్షవాతం అని కూడా అంటారు. ఒకసారి సోకిన తర్వాత ఈ వ్యాధి పూర్తిగా నయం కాదు. ఇది రాకుండా పోలియో వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రస్తుతం నోటి ద్వారా చుక్కల రూపంలో పోలియో వ్యాక్సిన్‌ను ఇస్తున్నారు. దీన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఆల్బర్ట్ సాబిన్ కాబట్టి దీన్ని సాబిన్ (Sabin) వ్యాక్సిన్ అంటారు.

జలుబు (Common cold)

     రినోవైరస్‌లు (Rhino viruses) , కొరోనా వైరస్‌లు (Corona Viruses) సాధారణంగా జలుబును కలిగిస్తాయి. వాతావరణంలో ఉండే ఈ వైరస్‌లు దేహంలోకి ప్రవేశించినప్పుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్లు, చేతి రుమాలు లాంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది. కళ్లు ఎరుపెక్కడం, తుమ్ములు, దగ్గు, ముక్కు నుంచి నీరు కారడం, శ్వాసపీల్చుకోవడం కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. జలుబు సోకిన వ్యక్తికి మంచి ఆహారం, పండ్లరసాలు ఇవ్వాలి. రోగి వీపు, రొమ్ముపై యూకలిప్టస్ నూనెను రాయాలి. ఆవిరి పట్టాలి.
 

ఫ్లూ జ్వరం

  ఈ వ్యాధి ఇన్‌ఫ్లుయెంజా (influenza) అనే వైరస్ వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని ఇన్‌ఫ్లుయెంజా అని కూడా అంటారు. వ్యాధిసోకినవారు దగ్గడం, తుమ్మడం ద్వారా ఈ వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. జలుబు, గొంతునొప్పి, కళ్లమంట, జ్వరం, తలనొప్పి, ఒళ్లునొప్పులు మొదలైనవి ఈ వ్యాధి లక్షణాలు. వ్యాధి సోకిన వ్యక్తి నుంచి మరొకరికి వ్యాపించకుండా రోగిని వేరొక గదిలో ఉంచాలి. ప్రత్యేక చికిత్సను అందించాలి. ఇటీవల భారతదేశంతోపాటు ప్రపంచంలోని అనేక దేశాలను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధి H1N1 ఇన్‌ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల వస్తుంది.

మీజిల్స్ (Measles)

       ఈ వ్యాధిని రూబియోలా (Rubeola) అని కూడా అంటారు. ప్రాంతాన్ని బట్టి ఈ వ్యాధిని తట్టు, దద్దు, వేపపూత, అమ్మవారు లాంటి అనేక పేర్లతో పిలుస్తారు. పారామిక్సో వైరస్ (Paramyxovirus) వల్ల మీజిల్స్ వైరస్ వస్తుంది. ఇది అంటు వ్యాధి. దగ్గు, జ్వరం, జలుబు, కళ్లు ఎరుపెక్కి నీరు కారడం మొదలైనవి ఈ వ్యాధి ప్రారంభ లక్షణాలు. దీని తర్వాత 3-7 రోజులకు ముఖంపై ఎర్రటి పూత ప్రారంభమై క్రమంగా శరీరమంతా వ్యాపిస్తుంది. ఈ పూత 4-7 రోజుల వరకు ఉండి క్రమంగా తగ్గుతుంది. వ్యాధిగ్రస్తుల శరీరంపై పూత కనిపించక ముందే రోగి నుంచి దగ్గు, తుమ్ముల వల్ల వైరస్ ఇతరులకు వ్యాపిస్తుంది. మూడు సంవత్సరాల్లోపు పిల్లల్లో తరచుగా కనిపించినప్పటికీ ఏడాది వయసు నిండని వారిలో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ. వ్యాధి తగ్గిన తర్వాత కూడా కొంతమంది పిల్లల్లో న్యుమోనియా, బుద్ధిమాంద్యం, ఫిట్స్ రావడం లాంటి లక్షణాలు కలుగుతాయి. శరీరంపై దద్దుర్లు లేదా పూత ప్రారంభమయినప్పటి నుంచి రోగిని వేరుగా ప్రత్యేక గదిలో ఉంచడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చు. ఈ వ్యాధి రాకుండా M.M.R అనే టీకాను ఇస్తారు.
 

చికెన్ పాక్స్ (Chicken Pox)

     దీన్ని ఆటలమ్మ అని కూడా అంటారు. పదేళ్లలోపు పిల్లల్లో సాధారణంగా కనిపించే అంటువ్యాధి ఇది. వ్యాధి ప్రారంభ దశలో అలసట, తలనొప్పి, ఆకలి తగ్గడం, జ్వరం, ఒళ్లునొప్పులు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. దీని తర్వాత శరీరంపై ముత్యం లాంటి పొక్కులు వస్తాయి. ఇవి ఛాతీపై ప్రారంభమై ముఖం, తల, నోరు, చెవులు, కాళ్లు చేతులకు వ్యాపిస్తాయి. వెరిసెల్లా జోస్టర్ (Vericella Zoster) అనే వైరస్ వల్ల చికెన్ పాక్స్ వస్తుంది. వ్యాధి గ్రస్తులు తుమ్మడం, దగ్గడం వల్ల

వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి. వీరికి అతి దగ్గరగా కలిసి నివసించడం వల్ల ఒకరి చర్మం మరొకరికి అంటుకుని కూడా వ్యాధి వ్యాపించవచ్చు. రోగిని ప్రత్యేక గదిలో ఉంచడం, వారి దుస్తులను నీటిలో మరగబెట్టి ఉతికి ఎండలో ఆరవేయడం లాంటి చర్యల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని నివారించవచ్చు. చికెన్ పాక్స్ రాకుండా టీకాను ఇవ్వొచ్చు.
 

గవద బిళ్లలు (Mumps)

    మిక్సోవైరస్ పరొటైడిస్ అనే వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ వైరస్‌లో RNA జన్యుపదార్థంగా ఉంటుంది. గవదబిళ్లల్లో చెవికి ముందు ఉండే లాలాజల గ్రంథి అయిన పెరోటిడ్ గ్రంథి వాచి నొప్పిగా ఉంటుంది. జ్వరం, తలనొప్పి, చెవినొప్పి, ఆహారం మింగడంలో కష్టంగా ఉండటం ఈ వ్యాధి లక్షణాలు. రోగి తుమ్మడం, దగ్గడం ద్వారా వైరస్‌లు ఇతరులకు వ్యాపిస్తాయి M.M.R టీకాను ఇవ్వడం ద్వారా దీన్ని రాకుండా నివారించవచ్చు.
 

మెదడువాపు

     ఈవ్యాధిని ఎన్‌సెఫలైటిస్ (Encephalitis) అని అంటారు. ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దీనిలో అనేక రకాలను గుర్తించారు. భారతదేశంలో జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల మెదడువాపు వస్తుంది. ఈ వైరస్‌లు పక్షులు, పందులు, ఎలుకల్లాంటి వాటిలో ఉంటాయి. ఈ జీవులు వైరస్‌లకు ఆశ్రయంగా పనిచేస్తాయి. వీటినుంచి క్యూలెక్స్ దోమకాటు ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తాయి. తలనొప్పి, జ్వరం, మెదడు సక్రమంగా పనిచేయక ఒకవైపు పక్షవాతం కలగడం, ఫిట్స్ రావడం లాంటివి ఈ వ్యాధి లక్షణాలు. ఆశ్రయ జీవులు మన చుట్టుపక్కల లేకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది వ్యాప్తిచెందకుండా చూడొచ్చు. టీకాను ఇవ్వడం ద్వారా ఈ వ్యాధి రాకుండా నివారించొచ్చు.

కామెర్లు (Jaundice)

        ఈ వ్యాధి వల్ల చర్మం, కంటిలోని తెల్లగుడ్డు పసుపు పచ్చగా మారుతుంది. మూత్రం పసుపు రంగులో వస్తుంది. కాబట్టి దీన్ని పచ్చకామెర్లు అంటారు. కామెర్ల వ్యాధి రావడానికి అనేక కారణాలున్నాయి. కాలేయంలో అధిక సంఖ్యలో ఎర్ర రక్తకణాలు నాశనమవడం వల్ల బైలిరూబిన్ వర్ణ ద్రవ్యం ఎక్కువవడం, పిత్తాశయంలో రాళ్లు ఏర్పడటం, పైత్యరసం స్రవించడంలో ఆటంకం లాంటి వాటివల్ల కామెర్లు రావొచ్చు. వీటివల్ల రక్తంలో బైలిరూబిన్ ఎక్కువై శరీరం, కళ్లు పసుపు పచ్చగా మారతాయి. హెపటైటిస్ అనే వైరస్ సోకడం వల్ల హైపటైటిస్ అనే వ్యాధి కలిగి కామెర్లు వచ్చే అవకాశం ఉంది. హైపటైటిస్ వైరస్‌లలోA,B,C,D,E,F అనే రకాలు ఉన్నాయి. వైరస్‌ను బట్టి హైపటైటిస్ వ్యాధి కూడా A,B,C,D,E,F రకాలుగా ఉంటుంది. కలుషితమైన సిరంజీలు వాడటం, కలుషిత రక్తమార్పిడి వల్ల ఈ వ్యాధి సోకుతుంది. కాలేయ కణాలు సరిగా పనిచేయకపోవడం, కొన్ని విష పదార్థాలు, రసాయనాల వల్లకూడా కామెర్లు రావడానికి అవకాశం ఉంది. సాధారణ కారణాలవల్ల వచ్చే కామెర్ల వ్యాధికి కారణాన్ని బట్టి చికిత్స చేయాలి. వైరస్ వల్ల వ్యాధి వస్తే పూర్తిగా వైద్యుడి పర్యవేక్షణలో చికిత్స జరగాలి. ప్రస్తుతం హెపటైటిస్ A,B వ్యాధులకు టీకాలు ఇస్తున్నారు. వ్యాధి సోకిన వ్యక్తికి విశ్రాంతినివ్వడం, పండ్ల రసం, గ్లూకోజ్ ఎక్కువగా ఇవ్వడం లాంటివి చేయాలి.                                              
 

ప్రోటోజోవా జీవుల వల్ల వచ్చే వ్యాధులు

మానవుడిలో ప్రోటోజోవా జీవుల వల్ల అమీబియాసిస్, మలేరియా లాంటి వ్యాధులు వస్తాయి. ఇవి కలుషితమైన నీరు, ఆహారం లేదా వాహకాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి.

అమీబియాసిస్ (జిగట విరేచనాలు) 

      ఈ వ్యాధి ఎంటమీబా హిస్టోలైటిక (Enatamoeba Histolytica) అనే ప్రోటోజోవా పరాన్నజీవి వల్ల వస్తుంది. ఈ జీవి కోశీయ దశలో కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడిలోకి ప్రవేశిస్తుంది. పేగులో కోశీయదశ నుంచి వెలువడిన జీవులు పేగు గోడపై దాడిచేసి పుండ్లను ఏర్పరుస్తాయి. దీనివల్ల రక్తం, జిగట పదార్థాలతో కూడిన విరోచనాలవుతాయి. మలం దుర్వాసనతో ఉంటుంది. ఈ వ్యాధినే అమీబిక్ డీసెంటరి అనికూడా పిలుస్తారు. సరైన ఔషధాలతో అమీబియాసిస్‌ను పూర్తిగా నయం చేయొచ్చు. ఆహారం, నీటిపై మూతలను ఉంచడం; వంట, భోజనానికి ముందు చేతులను శుభ్రపరచుకోవడం; కూరగాయలను, పండ్లను కడగడం లాంటి చర్యల ద్వారా వ్యాధి రాకుండా చూడొచ్చు.
 

మలేరియా

     మలేరియా అనే పదానికి ఇటాలియన్ భాషలో చెడుగాలి అని అర్థం. పూర్వకాలంలో ఈ వ్యాధి చెడుగాలి వల్ల వస్తుందని భావించారు. మలేరియా పరాన్నజీవిని మొదట కనిపెట్టింది చార్లెస్ లావిరన్ (Charles laveran). దోమలు మలేరియాను వ్యాపింపజేస్తాయని భావించింది పాట్రిక్ మాన్‌సన్. మలేరియా జీవిత చక్రాన్ని కనుక్కున్నది సర్ రోనాల్డ్ రాస్. ఈ పరిశీలన సికింద్రాబాద్‌లో జరగడం విశేషం. మలేరియాను కలిగించే పరాన్నజీవి ప్లాస్మోడియంలో నాలుగు రకాల జాతులున్నాయి.
అవి: 1.ప్లాస్మోడియం వైవాక్స్ (Plasmodium Vivax) 2. ప్లాస్మోడియంఓవెల్ (Plasmodium Ovale)

3. ప్లాస్మోడియం మలేరియే (Plasmodium Malariae) 4. ప్లాస్మోడియం ఫాల్సిఫారమ్ (Plasmodium Falciparum).
   ప్లాస్మోడియం పరాన్నజీవి రెండు ఆతిథేయిల్లో తన జీవిత చక్రాన్ని పూర్తిచేసుకుంటుంది. అవి: దోమ, మానవుడు. వీటిలో ఆడ ఎనాఫిలస్ దోమ ప్రధాన ఆతిథేయి. మానవుడు ద్వితీయ లేదా మాధ్యమిక ఆతిథేయి. మానవుడిలో ప్లాస్మోడియం అలైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతుడిని ఆడ ఎనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు ప్లాస్మోడియం స్పోరోజాయిట్‌లు (Sporozoit) రూపంలో ప్రవేశిస్తాయి. రక్తం నుంచి ఇవి కాలేయ కణాలను చేరి వాటిని ఆహారంగా గ్రహిస్తూ పెరిగి షైజాంట్ దశగా (Schizont) తర్వాత అలైంగిక విభజన ద్వారా మీరోజాయిట్లుగా మారతాయి. వీటిలో కొన్ని మళ్లీ కాలేయ కణాలపై మరికొన్ని ఎర్ర రక్తకణాలపై దాడిచేస్తాయి. ఈ వలయాన్ని ఎర్రరక్త కణాల పూర్వ వలయం (ప్రీ - ఎరిత్రోసైటిక్ వలయం) అంటారు.
       ఎర్రరక్త కణాలను చేరిన మీరోజాయిట్లు కణంలోని హిమోగ్లోబిన్‌ను ఆహారంగా తీసుకుంటూ పెరిగి తిరిగి మీరోజాయిట్ (Merozoite) లను ఏర్పరుస్తాయి. రక్తకణం పగలడం ద్వారా ఇవి రక్తంలోకి విడుదలవుతాయి. ఈ దశలో రోగికి మలేరియా లక్షణమైన చలి, జ్వరాలు వస్తాయి. రక్తకణంలో జరిగే విభజన తర్వాత మీరోజాయిట్‌లు స్థూల సంయోగ బీజ మాతృకలు, సూక్ష్మ సంయోగ బీజమాతృకలను ఏర్పరుస్తాయి. ఈ దశలన్నీ ఎర్ర రక్తకణాల్లో జరుగుతాయి కాబట్టి దీన్ని రక్తకణ జీవిత చక్రం (Erythocytic cycle) అంటారు. సంయోగబీజ మాతృకలు తర్వాత పరిధీయ రక్తనాళాలను చేరతాయి. దీని తర్వాత జరిగే అభివృద్ధి దోమలో జరుగుతుంది.
  మలేరియాతో బాధపడుతున్న వ్యక్తిని దోమకుట్టినప్పుడు సంయోగ బీజమాతృకలు దోమ జీర్ణాశయాన్ని చేరతాయి.

వీటిలో సూక్ష్మసంయోగ మాతృకల నుంచి పురుష సంయోగ బీజకణాలు (సూక్ష్మ సంయోగబీజాలు), స్థూల సంయోగ బీజ మాతృకణం నుంచి స్త్రీ సంయోగబీజకణం (స్థూల సంయోగబీజం) ఏర్పడతాయి. ఈ రెండు సంయోగ బీజకణాలు సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఇది తిరిగి విభజన చెంది స్పోరోజాయిట్లను ఏర్పరుస్తుంది. ఇవి లాలాజల గ్రంథులను చేరి దోమకాటు ద్వారా ఆరోగ్యవంతుడిలో ప్రవేశించడంతో తిరిగి ప్లాస్మోడియం జీవిత చక్రం ప్రారంభమవుతుంది.
     మలేరియా వ్యాధి ప్రారంభంలో చలి, జ్వరం వస్తాయి. జ్వరం ఎక్కువగా ఉంటుంది. ఈ దశలో రోగికి తలనొప్పి, ఒళ్లునొప్పులు ఉంటాయి. దీని తర్వాత దశలో రోగికి అధికంగా చెమటలు వచ్చి జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు మళ్లీ, మళ్లీ కనిపిస్తాయి. పిల్లల్లో మలేరియా పరాన్నజీవి మెదడుకు రక్తం అందజేసే రక్తకేశనాళికలకు అడ్డుపడి రక్తప్రవాహాన్ని అడ్డగిస్తుంది. మలేరియా జ్వరానికి చాలాకాలం వరకు క్వినైన్ అనే ఔషధంతో చికిత్స చేసేవారు. ప్రస్తుతం ఈ వ్యాధికి క్లోరోక్విన్, ప్రిమాక్విన్ అనే ఔషధాలను వాడుతున్నారు. మన చుట్టుపక్కల ప్రదేశాల్లో దోమలు అభివృద్ధి చెందకుండా చూడటం, దోమలు కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చు.
      పై వ్యాధులే కాకుండా చిన్నపిల్లల్లో ఎక్కువగా గజ్జి, ఆస్కారియాసిస్ (Ascariosis) అనే వ్యాధులు వస్తాయి. వీటిలో గజ్జి అనేది ఒక చిన్న కీటకం (మైట్) వల్ల వస్తుంది. ఇవి చేతివేళ్ల లాంటి భాగాల్లోని చర్మంలో నివసిస్తూ దురదను కలిగిస్తాయి. ఆస్కారియాసిస్ అనే వ్యాధి నిమాటిహెల్మింథిస్ పరాన్నజీవి అయిన ఆస్కారిస్ లుంబ్రికాయిడ్స్ (Ascaris Lumbricoides) వల్ల వస్తుంది. దీన్ని ఏలికపాము అంటారు. ఏలికపాము గుడ్లు కలుషితమైన నీరు, ఆహారం ద్వారా మానవుడి పేగుల్లోకి చేరతాయి. ఇక్కడ గుడ్ల నుంచి ఏలికపాములు బయటకు వస్తాయి. పేగుల్లో అధికసంఖ్యలో ఇవి ఉండటం వల్ల ఆహార కదలికలకు అడ్డుపడటం, కడుపునొప్పి, మలబద్దకం లాంటి లక్షణాలు కలుగుతాయి. ఏలికపాములు చిన్నపేగుల్లోని జీర్ణమైన ఆహారాన్ని తీసుకోవడంవల్ల పిల్లల్లో పోషకాహార లోపం ఏర్పడుతుంది. పరిశుభ్రంగా ఉండటం; ఆహారం, నీరు కలుషితం కాకుండా చూడటం ద్వారా ఈ వ్యాధి రాకుండా చూడొచ్చు.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌