• facebook
  • whatsapp
  • telegram

పోషణ   

        శక్తి విడుదలకు, శరీర పెరుగుదలకు, నిర్మాణానికి అవసరమైన రసాయన పదార్థాలను పోషక పదార్థాలు లేదా పోషకాలు అంటారు. వీటిని సేకరించడం లేదా తీసుకోవడాన్ని పోషణ అంటారు. పోషకాలు రెండు రకాలు అవి:
1) స్థూల పోషకాలు
2) సూక్ష్మ పోషకాలు.
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు లాంటివి మన శరీరానికి ఎక్కువ మొత్తంలో అవసరం కాబట్టి వీటిని స్థూల పోషకాలు అంటారు. విటమిన్లు, ఖనిజ లవణాలు మన శరీరానికి తక్కువ మొత్తంలో కావాలి కాబట్టి వీటిని సూక్ష్మ పోషకాలు అంటారు.

 

కార్బోహైడ్రేట్లు: ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో నిర్మితమవుతాయి. గ్లూకోజ్, ఫ్రక్టోజ్, గాలక్టోజ్, రైబోజ్ లాంటి వాటిలో ఒకే చక్కెర పరమాణువు ఉంటుంది. కాబట్టి వీటిని సరళ చక్కెరలు అంటారు. చెరకులోని చక్కెర అయిన గ్లూకోజ్, పాలలోని చక్కెర అయిన లాక్టోజ్, జంతువులలోని పిండి పదార్థమైన గ్లైకోజెన్, మొక్కల్లోని పిండి పదార్థం, వృక్ష కణాల్లోని సెల్యులోజ్ లాంటివి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లకు ఉదాహరణ. వీటిలో రెండు నుంచి అనేక వందల చక్కెర అణువులు ఉంటాయి. ఆహారం ద్వారా మనం తీసుకున్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు ఆహారనాళంలో ఎంజైమ్‌లతో జలవిశ్లేషణం చెంది సరళ చక్కెరలుగా విడిపోతాయి. ఈ సరళ చక్కెరలను మన శరీరం శోషించుకుంటుంది. ధాన్యాలు, బంగాళదుంప లాంటి వాటి ద్వారా మనం అధిక పరిమాణంలో రోజూ స్టార్చ్‌ను ఆహారంగా తీసుకుంటాం.
ఇది విడగొట్టబడి చక్కెరగా మారుతుంది. సెల్యులోజ్ కార్బోహైడ్రేట్‌ను మనం జీర్ణం చేసుకోలేం. కానీ ఇది ఆహారంలో ఉండటం వల్ల ఆహారానికి బరువు వస్తుంది. దీనివల్ల మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలి పూర్తిగా జీర్ణమై శోషితమవుతుంది. ఆహారంలో సెల్యులోజ్ లేకపోతే మలబద్ధకం ఏర్పడుతుంది. కార్బోహైడ్రేట్లు లేదా గ్లూకోజ్ మనకు శక్తినివ్వడానికి అవసరం. శరీరంలో గ్లూకోజ్ అవసరం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు గ్లైకోజన్‌గా మారి నిల్వ అవుతుంది. ఇతర సమ్మేళనాలు ఏర్పడటానికి వినియోగపడుతుంది. గ్లూకోజ్‌ను నేరుగా తీసుకున్నప్పుడు వెంటనే శరీరంలో శోషణం చెంది శక్తిని విడుదల చేస్తుంది. కాబట్టి క్రీడాకారులు తక్షణ శక్తికోసం గ్లూకోజ్‌ను తీసుకుంటారు.
 

ప్రొటీన్లు: ప్రొటీన్లు అమైనో ఆమ్లాలనే వాటితో నిర్మితమయ్యాయి. మనం తీసుకునే ప్రొటీన్లు ఆహారనాళంలో ఎంజైమ్‌ల సహాయంతో విడిపోయి అమైనో ఆమ్లాలుగా మారిపోతాయి. అమైనో ఆమ్లాలు పేగు గోడల నుంచి శోషణం చెందుతాయి. అవసరమైన విధానాన్నిబట్టి అమైనో ఆమ్లాలు రెండురకాలు:
1) ఆవశ్యక అమైనో ఆమ్లాలు
2) అనావశ్యక అమైనో ఆమ్లాలు.
ఆవశ్యక అమైనో ఆమ్లాలను మన శరీరం సంశ్లేషణ చేసుకోలేదు. కాబట్టి వీటిని ఆహారం ద్వారా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇవి లేకపోతే శరీరం పెరుగుదల, అభివృద్ధి సక్రమంగా జరగదు. ఐసోలూసిన్, లూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైల్ ఎలనైన్, థ్రియోనైన్, ట్రిఫ్టోఫాన్, వాలైన్ లాంటివి ఆవశ్యక అమైనో ఆమ్లాలకు ఉదాహరణ. అనావశ్యక అమైనో ఆమ్లాలు మన శరీరంలో సంశ్లేషణవుతాయి. వీటిని మనం ఆహారంగా తీసుకోవాల్సిన అవసరం లేదు.

ఎలనైన్, ఆర్జినైన్, గ్లైసిన్, సీరైన్, సిస్టైన్, ఆప్పర్టేట్, ఆస్పర్జిన్, గ్లుటమేట్, గ్లుటమైన్, టైరోసిన్, ప్రోలైన్ అనేవి అనావశ్యక అమైనో ఆమ్లాలు. ఆర్జినైన్, హిస్టడీన్ అమైనో ఆమ్లాలు పాక్షికంగా పెద్ద వారిలో సంశ్లేషణ చెందుతాయి. కాబట్టి వీటిని పాక్షిక ఆవశ్యక అమైనో ఆమ్లాలంటారు.
        మనం ఆహారంగా తీసుకున్న ప్రొటీన్లు జీర్ణనాళంలో అమైనో ఆమ్లాలుగా మారి శోషితమవుతాయి. ఈ అమైనో ఆమ్లాలు తిరిగి ప్రొటీన్ల సంశ్లేషణకు ఉపయోగపడతాయి. శరీర నిర్మాణానికి, కణజాలాల పునరుద్ధరణకు, రసాయనిక సమన్వయానికి ప్రొటీన్లు ఉపయోగపడతాయి. ప్రొటీన్లు అత్యవసర సమయంలో శక్తి విడుదలకు కూడా ఉపయోగపడతాయి. పప్పుదినుసులు, చిక్కుడుజాతి గింజలు, పాలు, మాంసం, గుడ్లు లాంటి వాటినుంచి ప్రొటీన్లు లభిస్తాయి. వీటిలో జంతువుల నుంచి వచ్చే ఆహార పదార్థాలైన పాలు, మాంసం, గుడ్లలో ఆవశ్యక అమైనో ఆమ్లాలు అధికంగా ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయంగా పరిపూర్ణ ప్రొటీన్లు అంటారు. మొక్కల నుంచి వచ్చే ఆహార పదార్థాలైన పప్పుదినుసుల్లో ఆవశ్యక అమైనో ఆమ్లాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని జీవశాస్త్రీయంగా అసంపూర్ణ ప్రొటీన్లు అంటారు.

 

కొవ్వులు : కొవ్వులు ఫ్యాటీ ఆమ్లాలు, గ్లిజరాల్‌తో ఏర్పడతాయి. కొవ్వులను ఆహారంగా తీసుకున్నప్పుడు అవి శరీరంలో ఫాటీ ఆమ్లాలు, గ్లిజరాల్‌గా జల విశ్లేషణం చెందుతాయి. ఫ్యాటీ ఆమ్లాలను రెండు రకాలుగా విభజించారు:
1) సంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు
2) అసంతృప్త ఫ్యాటీ ఆమ్లాలు.

కొవ్వులు మనకు వృక్ష, జంతు సంబంధ ఆహార పదార్థాల నుంచి లభిస్తాయి. వృక్ష సంబంధ కొవ్వులు ఎక్కువగా నూనెల రూపంలో ఉంటాయి. కుసుమ, పొద్దుతిరుగుడు, వేరుశనగ, కొబ్బరి, పామ్ మొక్క మొదలైన వాటినుంచి వచ్చే నూనె వీటికి ఉదాహరణ. నెయ్యి, వెన్న, జున్ను, గుడ్లు లాంటి వాటినుంచి జంతు సంబంధ కొవ్వును పొందుతాం. ఫ్యాటీ ఆమ్లాల్లో లినోలిక్ (Linoleic) లినోలెనిక్ (Linolenic) ఫ్యాటీ ఆమ్లాలు మనుషులకు ఆవశ్యకమైన ఫ్యాటీ ఆమ్లాలు.
        వృక్ష సంబంధ కొవ్వుల్లో ఎక్కువగా అసంతృప్త కొవ్వు ఆమ్లాలు, జంతు సంబంధ కొవ్వుల్లో సంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. సంతృప్త కొవ్వు ఆమ్లాలను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం ఆరోగ్యకరం కాదు. ఇవి ధమనుల్లో చేరి రక్త ప్రసారానికి ఆటంకం కలిగిస్తాయి. కొవ్వులు మనకు ముఖ్యంగా శక్తి కోసం ఉపయోగపడతాయి. వీటినుంచి వచ్చే శక్తి సాధారణంగా కార్బోహైడ్రేట్ల కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. మన శరీరంలో చర్మం కింద నిల్వ ఉన్న కొవ్వు శరీరం నుంచి ఉష్ణోగ్రత బయటకు పోకుండా కాపాడుతుంది.

 

ఖనిజ లవణాలు: మన శరీరంలో యాభైకిపైగా ఖనిజ లవణాలు ఉంటాయి. పెరుగుదల, కణాల మరమ్మతు, ద్రవాభిసరణకు అవసరమవుతాయి. సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, క్లోరిన్, ఫాస్ఫరస్ లాంటివి మన శరీరంలో ఉండే స్థూల మూలకాలు. మాంగనీస్, మాలిబ్డినం, రాగి, జింక్, ఫ్లోరిన్, అయోడిన్, ఇనుము లాంటివి సూక్ష్మ మూలకాలు.
        సోడియం కణ బాహ్య ద్రవాల్లో ఉండే ముఖ్యమైన కేటయాన్. శరీరంలో ద్రవాభిసరణ క్రమతకు, నాడీకణాల ప్రేరణకు సోడియం అవసరం. కణ జీవపదార్థంలో ముఖ్యమైన కేటయాన్ పొటాషియం. ఇది కణంలో ద్రవాభిసరణ తులస్థితిని క్రమపరుస్తుంది. మన శరీరంలో ముఖ్యమైన ఆనయాన్ క్లోరిన్.

కాల్షియం ఎముకలు, దంతాలు ఏర్పడటానికి, రక్తం గడ్డకట్టడానికి, కండర సంకోచానికి అవసరం. పాలు, పాల సంబంధ పదార్థాలనుంచి, ఆకు కూరలనుంచి కాల్షియం లభ్యమవుతుంది. రక్తంలోని హిమోగ్లోబిన్‌లో, ఎలక్ట్రాన్ రవాణా, శ్వాసక్రియలో ఉపయోగపడే ప్రొటీన్లలో ఐరన్ భాగంగా ఉంటుంది. దీని లోపంవల్ల రక్తహీనత వస్తుంది. కాలేయం, మాంసం, ఆకుకూరలు, ఎండిన పండ్ల నుంచి ఐరన్ లభిస్తుంది.
        శరీరంలో థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాక్సిన్ హార్మోను ఉత్పత్తికి అయోడిన్ అవసరమవుతుంది. దీని లోపంవల్ల గాయిటర్ వ్యాధి వస్తుంది. సముద్రపు చేపలు, పాలు, కాయగూరలనుంచి అయోడిన్ లభిస్తుంది. ఎముకలు సక్రమంగా ఏర్పడేందుకు, దంతాలపైన ఉండే ఎనామిల్ ఏర్పడేందుకు ఫ్లోరిన్ అవసరం. మనకు అవసరమైన ఫ్లోరిన్ తాగే నీటినుంచి లభిస్తుంది. తాగే నీటిలో ఫ్లోరిన్ ఎక్కువైతే ఫ్లోరోసిస్ వ్యాధి కలుగుతుంది.
        శరీరానికి అవసరమైన పోషక పదార్థాలు అన్నీ తగినంత పరిమాణంలో ఉన్న ఆహారాన్ని సంతులిత ఆహారం అంటారు. దీనిలో తగినంత పరిమాణంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. పిల్లల్లో శక్తిజనకాలైన కార్బోహైడ్రేట్లు, కొవ్వులు తగినంత మోతాదులో లేకపోతే పోషకాహారలోపం సంభవిస్తుంది. ఆహారంలో ప్రొటీన్ల లోపం వల్ల పిల్లల్లో క్వాషియార్కర్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లల్లో పెరుగుదల మందగిస్తుంది, శరీర భాగాల్లో నీరు చేరి ఉబ్బుతాయి, కండరాల అభివృద్ధి ఉండదు. ప్రొటీన్లు, కేలరీల లోపం వల్ల మెరాస్‌మస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధితో బాధపడే పిల్లల్లో కాళ్లు, చేతులు సన్నగా పుల్లల్లా ఉంటాయి. కండరాలు తక్కువగా అభివృద్ధి చెంది, చర్మం పొడిగా వేలాడుతూ ముడతలతో ఉంటుంది.

విటమిన్లు: విటమిన్ల గురించి ఆలోచన 18వ శతాబ్దంలో ప్రారంభమైంది. అప్పట్లో నావికులు కాలేయాన్ని ఆహారంగా తీసుకోవడంవల్ల రేచీకటి, నిమ్మజాతి ఫలాలు తీసుకోవడం వల్ల స్కర్వి వ్యాధి, కాడ్ చేప నూనెను తీసుకోవడం వల్ల రికెట్స్ వ్యాధి నయమవుతున్నాయని గమనించారు. హాప్కిన్స్ అనే శాస్త్రవేత్త పాలలో పెరుగుదలకు అవసరమైన పదార్థం ఉందని కనుక్కుని దీన్ని అదనపు కారకం అని పేర్కొన్నారు. ఫంక్ అనే శాస్త్రవేత్త తవుడులో బెరిబెరి వ్యాధిని నిరోధించే పదార్థం ఉందని కనుక్కుని దాన్ని వైటమిన్ అని పిలిచారు.
        విటమిన్లు సూక్ష్మ పోషకాలు, వీటిని మన శరీరం సొంతంగా తయారుచేసుకోలేదు. పేగులో ఉన్న బ్యాక్టీరియంలు కొన్ని విటమిన్లను సంశ్లేషిస్తాయి. విటమిన్లు శక్తిని ఉత్పత్తి చెయ్యవు. ఇవి ఎంజైమ్‌లను చైతన్యపరుస్తాయి. విటమిన్ల లోపం వల్ల ఎంజైమ్‌లు సరిగా పనిచేయక అనేక వ్యాధులు కలుగుతాయి. సూక్ష్మజీవ నాశకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల పేగుల్లోని సూక్ష్మజీవులు చనిపోయి విటమిన్ల లోపం వస్తుంది. విటమిన్లలో A, B, C, D, E, K అనే రకాలు ఉంటాయి. వీటిలో B, C లు నీటిలో కరుగుతాయి. A, D, E, K లు కొవ్వులో కరుగుతాయి.

 

విటమిన్ A: దీని రసాయనిక నామం రెటినాల్. కన్ను ఆరోగ్యంగా ఉండటానికి ఈ విటమిన్ అవసరం. కంటిలోని రెటీనాలో ఉండే దండకణాలలోని రొడాప్సిన్ అనే వర్ణకం తయారీకి, శంకు కణాల్లో ఉండే ఐడాప్సిన్ అనే వర్ణకం తయారీకి ఇది అవసరం. కాలేయం, చేప మాంసం, షార్క్ చేప నూనె, గుడ్లు, వెన్న లాంటి పదార్థాల నుంచి ఈ విటమిన్ లభిస్తుంది. క్యారట్, టొమాటో, గుమ్మడి, బొప్పాయి, ఆకుకూరలు, మామిడి లాంటి వృక్షసంబంధ పదార్థాల నుంచి ఈ విటమిన్ కెరాటిన్ అనే రూపంలో లభ్యమవుతుంది. మన శరీరంలో కెరాటిన్ విటమిన్-A గా మారిపోతుంది. ఈ విటమిన్ లోపం వల్ల రేచీకటి, చర్మం గరుకుగా మారడం లాంటవి కలుగుతాయి.

కంటిలోని అశ్రు గ్రంథులు కన్నీటిని ఉత్పత్తి చెయ్యకపోవడం వల్ల పొడికళ్లు లేదా జీరాఫ్తాల్మియా అనే వ్యాధి వస్తుంది. విటమిన్-A లోపం వల్ల కంటిలోని శుక్ల పటలం పగిలిపోయి శాశ్వత అంధత్వం కలుగుతుంది. దీన్ని పోషకాహార అంధత్వం అంటారు.
 

విటమిన్ B: విటమిన్ B1, B2, B3, B6, B12, ఫోలిక్ ఆమ్లం, పాంటోథెనిక్ ఆమ్లం, బయోటిన్ లాంటివి వీటిలోని రకాలు. వీటిన్నింటిని కలిపి బి-కాంప్లెక్స్ విటమిన్లు అంటారు.
 

విటమిన్ B1:  దీన్ని రసాయనికంగా థయమిన్ అని పిలుస్తారు. ఈ విటమిన్ లోపం వల్ల బెరిబెరి అనే వ్యాధి కలుగుతుంది. వాంతులు, వణుకు, మూర్చ, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండటం లాంటివి బెరిబెరి వ్యాధి లక్షణాలు. కార్బోహైడ్రేట్ల జీవక్రియలో ఉపయోగపడే ఎంజైమ్‌లకు ఈ విటమిన్ అవసరం. వరి, గోధుమ లాంటి ధాన్యాలు, వేరుశనగ, పాలు, మాంసం, చేపలు, గుడ్లు లాంటి వాటి ద్వారా ఇది లభిస్తుంది. అతిగా బియ్యాన్ని మిల్లు ఆడించడం, వండేటప్పుడు గంజి బయటకు పారబోయడం వల్ల థయామిన్ నష్టపోతాం.
 

విటమిన్ B2:  దీని రసాయనిక నామం రైబోఫ్లావిన్. దీని లోపం వల్ల నోటిపూత లేదా గ్లాసైటిస్ వస్తుంది. గ్లాసైటిస్ వ్యాధిలో నాలుక పొక్కులతో, ఎర్రగా ఉంటుంది. నోటిమూలలో పగలడం, కళ్ల నుంచి నీరుకారడం, వెలుతురు చూడలేకపోవడం, చర్మం పొలుసులుగా తయారుకావడం లాంటవి రైబోఫ్లావిన్ లోపం వల్ల కలిగే లక్షణాలు. పాలు, గుడ్లు, కాలేయం, మాంసం, ఆకుకూరలు లాంటి వాటి ద్వారా లభిస్తుంది. కణంలో జరిగే ఆక్సీకరణ, క్షయకరణ చర్యలకు ఈ విటమిన్ ఉపయోగపడుతుంది.
 

విటమిన్ B3: దీని రసాయనిక నామం నియాసిన్ లేదా నికోటినిక్ ఆమ్లం. దీని లోపంవల్ల పెల్లగ్రా అనే చర్మ వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిలో చర్మంపై ఎండ పడితే రంగును పొంది పొలుసుల్లా తయారవుతుంది, పగులుతుంది. నియాసిన్ లోపంవల్ల అతిసారం, మానసిక వైకల్యం లాంటివి కూడా కలుగుతాయి. మాంసం, కాలేయం, చేప మాంసం, పప్పుదినుసులు, వేరుశనగ లాంటి వాటి ద్వారా ఈ విటమిన్ లభిస్తుంది. నియాసిన్ శరీరంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, కొవ్వుల జీవక్రియకు ఉపయోగపడుతుంది.
 

విటమిన్ B6: దీని రసాయనిక నామం పైరిడాక్సిన్. ఈ విటమిన్ లోపంవల్ల ఎక్కువ కోపం, రక్తహీనత, వికారం, వాంతులు లాంటి లక్షణాలు కలుగుతాయి. పిల్లల్లో మూర్చ లేదా ఫిట్స్ వస్తాయి. పాలు, కాలేయం, మాంసం, గుడ్లు, చేపలు, కాయగూరలు, పప్పుల నుంచి ఇది అభిస్తుంది. మన శరీరంలో జరిగే అమైనో ఆమ్లాల జీవక్రియకు ఇది అవసరం.
 

విటమిన్ B12: దీని రసాయనిక నామం సయనకోబాలమిన్. దీని లోపంవల్ల హానికర రక్తహీనత సంభవిస్తుంది. ఈ విటమిన్ మన శరీరంలోని కాలేయంలో నిల్వ ఉంటుంది. మన పేగుల్లో ఉండే బ్యాక్టీరియా ఈ విటమిన్‌ను తయారుచేస్తుంది. ప్రొటీన్ల సంశ్లేషణ, కేంద్రకామ్లాల జీవక్రియలో ఈ విటమిన్ ఉపయోగపడుతుంది.
 

ఫోలిక్ ఆమ్లం: దీని లోపంవల్ల రక్తహీనత, అతిసారం, తెల్లరక్త కణాల సంఖ్య క్షీణించడం లాంటివి కలుగుతాయి. ఎముక మజ్జలో ఎర్ర రక్తకణాలు ఏర్పడటానికి, కేంద్రకామ్లాల సంశ్లేషణకు ఈ విటమిన్ అవసరం. పాలు, పండ్లు, గుడ్లు, కాలేయం, తృణధాన్యాలు, ఆకుకూరలు లాంటి వాటినుంచి ఈ విటమిన్ లభిస్తుంది. ఆహార పదార్థాలు ఎక్కువగా ఉడికించడంవల్ల ఈ విటమిన్ నశిస్తుంది.
 

పాంటోథెనిక్ ఆమ్లం: దీని లోపంవల్ల అరికాళ్లలో మంటల లాంటి లక్షణం కలుగుతుంది. మాంసం, గుడ్డు, ఈస్ట్, కాలేయం, చిలగడదుంపలు, కాయగూరలు, వేరుశనగ లాంటి వాటి నుంచి ఈ విటమిన్ లభిస్తుంది.
 

బయోటిన్: దీని లోపంవల్ల కండరాల నొప్పులు, అలసట, నాడీమండల వ్యాధులు, మానసిక రుగ్మత లాంటివి కలుగుతాయి. కాలేయం, పప్పుదినుసులు, కాయగూరలు లాంటి వాటినుంచి ఈ విటమిన్ లభిస్తుంది. ప్రొటీన్ల జీవక్రియకు బయోటిన్ అవసరం.
 

విటమిన్-సి: దీని రసాయనిక నామం ఆస్కార్బిక్ ఆమ్లం. దీని లోపంవల్ల స్కర్వి అనే వ్యాధి వస్తుంది. దంతాల చిగుళ్ల నుంచి, కీళ్ల దగ్గర, చర్మం కింద రక్తం కారడం లాంటివి స్కర్వి వ్యాధి లక్షణాలు. కణాల్లో జరిగే ఆక్సీకరణ చర్యలకు, కణజాలాల మరమ్మతుకు, గాయాలు మానడానికి, విరిగిన ఎముకలు అతుక్కోవడానికి సి విటమిన్ అవసరం. డెంటైన్, రక్తనాళాలు, మృదులాస్థి లాంటివి ఏర్పడేందుకు ఇది సహాయపడుతుంది. శరీరం ఇనుము శోషణం చేసుకోవడానికి, నిల్వ చేసుకోవడానికి విటమిన్-సి అత్యవసరం. నిమ్మజాతి ఫలాలైన నిమ్మ, నారింజ, బత్తాయి లాంటి వాటిలో, తాజాపండ్లు, టొమాటో, ఆకుకూరలు, మొలకెత్తుతున్న పప్పుధాన్యాల్లో సి విటమిన్ లభిస్తుంది. ఉసిరిలో అత్యధికంగా ఉంటుంది. వేడిచేస్తే విటమిన్ సి నశిస్తుంది. 
విటమిన్-డి: దీని రసాయనిక నామం కాల్సిఫెరాల్. దీని లోపంవల్ల పిల్లల్లో రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. ఎముకలు సక్రమంగా పెరగకపోవడం, పిల్లల్లో దొడ్డికాళ్లు (Bow legs) ఏర్పడటం, నిలబడ్డప్పుడు మోకాళ్లు ఒకదాంతో ఒకటి తాకడం, దంతాలు ఆలస్యంగా రావడం లాంటివి రికెట్స్ వ్యాధిలో కనిపిస్తుంది. పెద్దవారిలో విటమిన్ డి లోపం వల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతాయి.

కాల్షియం, ఫాస్ఫరస్‌లను పేగు శోషణంచేసుకుని ఎముకల్లో నిల్వ చేయడానికి, ఎముకలు ఏర్పడటానికి ఇది అవసరం. సూర్యరశ్మి సోకడంవల్ల శరీరంలోని ఒక రకమైన కొలెస్ట్రాల్ విటమిన్ డి గా మారుతుంది. కాలేయం, వెన్న, గుడ్డు, కాడ్‌చేప కాలేయ నూనె లాంటి జంతు సంబంధ పదార్థాల నుంచి ఈ విటమిన్ లభిస్తుంది.
 

విటమిన్-ఇ: దీని రసాయనిక నామం టోకోఫెరాల్. దీని లోపంవల్ల ఎర్రరక్తకణాల జీవితకాలం తగ్గడం, గర్భస్రావం, పురుషుల్లో వంధ్యత్వం లాంటివి కలుగుతాయి. ప్రత్యుత్పత్తి అవయవాలు సాధారణంగా పనిచేయడానికి ఈ విటమిన్ అవసరం. కాయగూరలు, పండ్లు, మాంసం, మొలకెత్తే గింజలు, పొద్దు తిరుగుడు, పత్తి గింజల నూనె లాంటి వాటిలో ఈ విటమిన్ ఉంటుంది.
 

విటమిన్-కె: దీని రసాయనిక నామం ఫిల్లోక్వినోన్. ఈ విటమిన్ లోపంవల్ల రక్తం తొందరగా గడ్డకట్టక గాయాల నుంచి ఎక్కువగా స్రవిస్తుంది. ఆకుపచ్చని ఆకుకూరలు, ఆవుపాలు లాంటి వాటిద్వారా ఈ విటమిన్ లభ్యమవుతుంది. మనుషుల పేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు కూడా ఈ విటమిన్‌ను సంశ్లేషిస్తాయి.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌