• facebook
  • whatsapp
  • telegram

నిత్యజీవితంలో రసాయనశాస్త్రం పాత్ర  

మన నిత్య జీవితంలో రసాయనశాస్త్రం చాలా ముఖ్యమైంది. మన శరీరంలో దాదాపు 40 వరకు రసాయన మూలకాలున్నాయి. తినే ఆహార పదార్ధాలు, ధరించే దుస్తులు, గృహనిర్మాణానికి అవసరమయ్యే పదార్ధాలు మొదలైనవన్నీ రసాయనశాస్త్రంతో ముడిపడినవే. సిమెంట్, గాజు, సబ్బులు లాంటి పదార్ధాల తయారీ, వాటి అనువర్తనాల గురించి తెలుసుకుందాం.

సిమెంట్ (Cement)

        కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ మిశ్రమాన్ని సిమెంట్ అంటారు. ఇది ఒక నలుపు బూడిద రంగున్న పొడి పదార్థం. దీన్ని 1924లో జోసెఫ్ ఎస్పిడిన్ అనే తాపీమేస్త్రి కనుక్కున్నాడు. దీన్నే పోర్ట్‌లాండ్ సిమెంట్ అని కూడా పిలుస్తారు.సిమెంట్ తయారీకి వాడే సున్నపురాయిని పోర్ట్‌లాండ్ ప్రాంతంలో కనుక్కోవడం వల్ల ఆ పేరు వచ్చింది.
* సిమెంట్ తయారీలో సున్నపురాయి (60 - 70%), సిలికా (20 - 25%), అల్యూమినియం, ఫెర్రిక్ ఆక్సైడ్‌లను ముడిపదార్థాలుగా ఉపయోగిస్తారు. ఈ ముడి పదార్థాలకు బంకమట్టి, నీటిని సమపాళ్లలో కలిపి 1700°C - 1900°C ఉష్ణోగ్రత వరకు వేడి చేస్తే సిమెంట్ ఏర్పడుతుంది. మొదట ఏర్పడే బూడిదరంగు గట్టి సిమెంట్‌ను క్లింకర్ సిమెంట్ అంటారు. దీన్నే చల్లబరచి పొడిగా చేసి, 2-5% జిప్సంను కలిపి సిమెంట్‌గా ఉపయోగిస్తారు.
* సిమెంట్, ఇసుక, నీరు ఉన్న మిశ్రమాన్ని మోర్టార్ అంటారు. దీన్నే గోడలు నిర్మించడానికి ఇటుకల మధ్య ఉపయోగిస్తారు.
* ఒక భాగం తడిసున్నం, మూడు భాగాల ఇసుక, నీరు బాగా కలిపిన మిశ్రమాన్ని లైమ్ మోర్టార్ అంటారు.
* ఇసుక, కంకర, సిమెంట్, నీటి మిశ్రమాన్ని కాంక్రీట్ అంటారు. ఇది మోర్టార్ కంటే గట్టిగా ఉంటుంది. దీన్ని ఫ్లోరింగ్, రోడ్లు వేయడానికి ఉపయోగిస్తారు.
* తడి సిమెంట్, ఇసుక, కంకర మిశ్రమాన్ని దగ్గరగా అమర్చిన ఇనుప చువ్వల మధ్య నింపితే దాన్ని రీ ఇన్‌ఫోర్స్‌డ్ కాంక్రీట్ సిమెంట్ అంటారు. దీన్నే "RCC" అని పిలుస్తారు. ఇది అతి గట్టి పదార్థం. దీన్ని పిల్లర్‌లు, బ్రిడ్జ్‌లు నిర్మించడానికి ఉపయోగిస్తారు.
* సున్నపురాయి, బంకమన్నును కలిపి వేడిచేస్తే 'హైడ్రాలిక్ మోర్టార్' ఏర్పడుతుంది. దీన్ని బ్లీచింగ్ కారకంగా, యాంటీసెప్టిక్‌గా ఉపయోగిస్తారు.

గాజు (Glass)

          సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మిశ్రమాన్ని గాజు అంటారు. ఇది ఒక పారదర్శక అస్పటిక పదార్థం. దీని రసాయన ఫార్ములా Na2SiO3 + CaSiO3.
* గాజు తయారీలో ముడిపదార్థాలుగా సోడా యాష్, సున్నపురాయి, ఇసుక, గాజు ముక్కలను ఉపయోగిస్తారు. ఈ మిశ్రమాన్ని 1000°C - 1400°C ఉష్ణోగ్రత వరకు కొలిమిలో వేడి చేస్తే, ద్రవ గాజు ఏర్పడుతుంది.
* ద్రవగాజును త్వరగా చల్లబరిస్తే అది పెళుసుగా తయారవుతుంది. కాబట్టి ప్రత్యేక పద్ధతిలో నెమ్మదిగా చల్లబరుస్తారు. దీన్నే 'మందశీతలీకరణం' లేదా 'అనిలింగ్' అంటారు. అందుకే గాజు ఒక 'సూపర్ కూల్డ్ లిక్విడ్' (Super Cooled Liquid)
* కొన్ని లోహాలు, లోహ ఆక్సైడ్‌లను గాజులో మలినాలుగా కలిపి, గాజును వివిధ రంగుల్లో తయారు చేస్తారు. ఉదాహరణకు క్రోమిక్ ఆక్సైడ్‌ను మలినంగా కలిపితే, ఆ గాజుకు ఆకుపచ్చ వర్ణం వస్తుంది.
* గాజుపై వివిధ రకాల చిత్రాలు వేయడానికి హైడ్రోఫ్లోరిక్ (HF) ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. ఈ ప్రక్రియను 'ఎచ్చింగ్' అంటారు.
* గాజును వేడి చేసి, మెత్తబరిచి దానిలోకి గాలిని పంపి, వివిధ ఆకృతుల్లో గాజు వస్తువులను తయారు చేసే సాంకేతిక నైపుణ్యాన్ని 'గ్లాస్ బ్లోయింగ్' అంటారు.

గాజులోని రకాలు

a) సోడా గ్లాస్: ఇది సాధారణంగా ఉపయోగించే గాజు. సోడా యాష్, సున్నపురాయి, ఇసుకల మిశ్రమాన్ని బాగా వేడిచేసి, చల్లారిస్తే సోడా గాజు ఏర్పడుతుంది. దీన్నే మెత్తని గాజు అని కూడా అంటారు. ఇది త్వరగా కరుగుతుంది. దీన్ని కిటికీ అద్దాలు, గాజు సీసాల తయారీలో ఉపయోగిస్తారు.
b) పైరెక్స్ గ్లాస్ (Pyrex Glass): జింక్, బేరియం లవణాలను కలిపి తయారు చేస్తారు. దీనికి ఉష్ణనిరోధక శక్తి ఉంది. దీన్ని ప్రయోగశాలలోని గాజు పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
c) ఫ్లింట్ గ్లాస్ (Flint Glass): ఇది అతి పారదర్శకమైన గాజు. దీన్ని ఆప్టికల్స్, ఎలక్ట్రిక్ బల్బ్‌ల తయారీలో ఉపయోగిస్తారు.
d) బోరోసిలికేట్ గ్లాస్ (Borosilicate Glass): ఈ గాజులో అదనంగా బోరాన్ ట్రై ఆక్సైడ్ అనే రసాయన పదార్థం ఉంటుంది.ఇది అత్యధిక,అత్యల్ప ఉష్ణోగ్రతలను,రసాయన ప్రభావాన్ని తట్టుకోగలదు. అందుకే దీన్ని వంట సామగ్రి, ప్రయోగశాల పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.
e) ఆప్టికల్ గ్లాస్ (Optical Glass): ఈ గాజులో అదనంగా బోరిక్ ఆక్సైడ్, సిలికా ఉంటాయి. దీన్ని కటకాలు, పట్టకాలు, టెలిస్కోప్, మైక్రోస్కోప్ పరికరాల్లో ఉపయోగిస్తారు.
f) పొటాష్ గ్లాస్ (Potash Glass): దీన్నే గట్టి గాజు అని కూడా పిలుస్తారు. కాస్టిక్ పొటాష్, సున్నపురాయి, సిలికాను కలిపి వేడి చేయడం వల్ల ఇది ఏర్పడుతుంది. దీనికి వివిధ రసాయనాల ప్రభావాన్ని తట్టుకోగల శక్తి ఉంటుంది. అందుకే కోనికల్ ఫ్లాస్క్, బీకరు మొదలైన రసాయన పరికరాల తయారీలో ఉపయోగిస్తారు.

 

సబ్బు (Soap)

      ఫాటీ ఆమ్లాల (కొవ్వు ఆమ్లాలు) సోడియం లేదా పొటాషియం లవణాన్నే సబ్బు అంటారు.
* పొడవైన కార్బన్ గొలుసును కలిగి ఉండి, దాదాపు 15 నుంచి 17 కార్బన్‌లు ఉన్న ఫాటీ ఆమ్లాలను సబ్బుల తయారీలో ఉపయోగిస్తారు. సాధారణంగా లారిక్ ఆమ్లం, స్టియరిక్ ఆమ్లం, ఓలియిక్ ఆమ్లం, లినోలిక్ ఆమ్లాలను వినియోగిస్తారు.
* ఫాటీ ఆమ్లాల మిశ్రమాన్ని సాధారణంగా సోడియం హైడ్రాక్సైడ్ (NaOH), పొటాషియం హైడ్రాక్సైడ్ (KOH), మెగ్నీషియం హైడ్రాక్సైడ్ (Mg (OH)2) కాల్షియం హైడ్రాక్సైడ్ (Ca (OH)2), ట్రై ఇథనాల్ ఎమీన్ లాంటి క్షారాలతో తటస్థీకరిస్తారు.
* ఫాటీ ఆమ్లాలను క్షారాలతో తటస్థీకరణం చెందిస్తే సబ్బు, గ్లిజరాల్ ఏర్పడతాయి. ఈ చర్యనే 'సఫోనిఫికేషన్' అంటారు.
    ∴   ఫాటీ ఆమ్లాలు + క్షారం 
  సబ్బు + గ్లిజరాల్
* ఫాటీ ఆమ్లాల లవణాన్ని బట్టి వాటి ఉపయోగం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఫాటీ ఆమ్లాల పొటాషియం లవణం సబ్బును శరీర శుభ్రతకు ఉపయోగిస్తారు. ఫాటీ ఆమ్లాల సోడియం లవణం సబ్బును దుస్తులు శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు.ఫాటీ ఆమ్లాల ట్రై ఇథనాల్ అమ్మోనియం లవణం సబ్బును డ్రైక్లీనింగ్‌లో వాడతారు.
* శరీర శుభ్రతకు వాడే సబ్బులో 7 - 10% వరకు స్వేచ్ఛా ఫాటీ ఆమ్లాలు ఉంటాయి. దుర్వాసనను తొలగించే సబ్బులు, సూక్ష్మక్రిమినాశక సబ్బుల్లో 3, 4, 5 ట్రైబ్రోమో సాలిసిలేనిలైడ్ అనే రసాయనిక పదార్థం ఉంటుంది.గడ్డం చేసుకోవడానికి ఉపయోగించే సబ్బులో పొటాషియం లవణంతోపాటు, ఎక్కువ మోతాదులో స్టియరిక్ ఆమ్లం ఉంటుంది. ఫలితంగా అధిక నురుగు ఏర్పడుతుంది. పారదర్శక సబ్బులో కొంత గ్లిజరాల్ ఉంటుంది.
* సబ్బు నాణ్యతను అందులోని ఫాటీ ఆమ్లాల శాతాన్ని బట్టి నిర్ణయిస్తారు. దీన్నే TFM (Total Fatty Matter) విలువ అంటారు.

 డిటర్జెంట్ (Detergent) 

        రసాయనికంగా ఆల్కైల్ లేదా ఆరైల్ బెంజీన్ సల్ఫోనేట్ సోడియం లవణాలను లేదా ఫాటీ ఆల్కహాల్ సల్ఫేట్ లవణాలను 'డిటర్జెంట్‌లు' అంటారు. వీటినే కల్మశహారులు అంటారు. ఉదాహరణ: 501, XXX, వీల్, విమ్‌బార్ మొదలైనవి.
* సబ్బుల కంటే డిటర్జెంట్‌లు మెరుగైనవి. ఎందుకంటే సబ్బులు కేవలం మృదుజలంలో మాత్రమే కరిగి, నురుగును ఇస్తాయి. కానీ డిటర్జెంట్‌లు మృదు, కఠిన జలాల్లో నురుగును ఇవ్వగలవు.
* సబ్బులు కఠిన జలంలో నురుగును ఏర్పరచలేవు. అవి నీటిలో కరగని తెల్లని ఫాటీ ఆమ్లాల కాల్షియం,మెగ్నీషియం లవణాల అవక్షేపాలను ఏర్పరుస్తాయి.అందుకే శుభ్రపరిచే గుణాన్ని కోల్పోతాయి.
* డిటర్జెంట్‌లు కఠినజలంలో కూడా నురుగును ఏర్పరచగలవు. ఎందుకంటే ఇవి నీటిలో అవక్షేపాలను ఏర్పరచవు. సల్ఫోనిక్  ఆమ్లాలు, కాల్షియం, మెగ్నీషియం  లవణాలను ఏర్పరుస్తాయి. ఇవి  నీటిలో కరుగుతాయి. అందుకే శుభ్రపరిచే గుణాన్ని కలిగి ఉంటాయి.

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌