• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక భారతదేశ చరిత్ర - ఆంగ్ల వ్యతిరేక తిరుగుబాట్లు

          ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన ఆర్థిక, సాంఘిక సంస్కరణలు వివిధ వర్గాలను అసంతృప్తికి గురిచేశాయి. ఫలితంగా దేశంలో అనేక చోట్ల గిరిజన, రైతాంగ, సిపాయిల తిరుగుబాట్లు జరిగాయి. వీటిలో ముఖ్యమైంది 1857 సిపాయిల తిరుగుబాటు. దేశ చరిత్ర గతిని మార్చేసిన ఈ తిరుగుబాటుకు కారణాలు, ఫలితాలను వివిధ పోటీ పరీక్షల అభ్యర్థులు అధ్యయనం చేయాలి.
          వ్యాపారం నిమిత్తం భారతదేశానికి వచ్చిన ఆంగ్లేయులు క్రమంగా దేశ రాజకీయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుని దేశాన్ని ఆక్రమించుకున్నారు. మన దేశాన్ని వలస రాజ్యంగా మార్చి ఆర్థిక దోపిడీకి పాల్పడ్డారు. కుటిల రాజకీయ సిద్ధాంతాలు, పద్ధతులను అవలంబించారు. ఆంగ్లేయులు ప్రవేశపెట్టిన రెవెన్యూ విధానాలు, సాంఘిక సంస్కరణలు భారత సమాజాన్ని, వివిధ వర్గాలను అసంతృప్తికి గురి చేశాయి. ఫలితంగా అధికారాన్ని కోల్పోయిన రాజులు, సామంతులు, దోపిడీకి గురైన భూస్వాములు, జమీందార్లు, ప్రాధాన్యం కోల్పోయిన కులీన వర్గాలు, అధిక శిస్తు భారంతో కుంగిపోయిన రైతాంగం, గిరిజనులు, అసమానత, జాతి వివక్షత, తక్కువ జీతాలు లాంటి అసౌకర్యాలకు గురవుతున్న సిపాయిలు మొదలైనవారు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు చేశారు.
* 1763 - 1800 మధ్య ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సన్యాసి ముఠాల తిరుగుబాట్లు జరిగాయి.
* 1783లో బిష్ణుపూర్, ఒరిస్సా పాలకులు తిరుగుబాట్లు చేశారు.
* 1799 దళ్ భమ్, 1800 - 1805 మధ్య కేరళ వర్మ తిరుగుబాట్లు జరిగాయి.
* 1798 - 1802 మధ్య కట్ట బొమ్మన్ తిరుగుబాటు జరిగింది.
* 1824లో కిట్టూరు, 1844లో గడ్కారీ తిరుగుబాట్లు చోటు చేసుకున్నాయి.
* బెంగాల్‌లోని ముస్లింలు షరియతుల్లా నాయకత్వంలో ఫెరైజీ ఉద్యమాన్ని నడిపారు.
* 1830 - 1857 మధ్య బిహార్, బెంగాల్‌లోని ముస్లింలు వహాబీ ఉద్యమం చేశారు.
 

గిరిజన, రైతాంగ తిరుగుబాట్లు
* ఆంగ్లేయులు అటవీ భూములను ఆక్రమించుకుని ఆదివాసీలు, గిరిజనులపై అనేక నిర్బంధాలను, అధిక పన్నులను విధించడం ప్రారంభించారు.
* 1864లో అటవీ శాఖను ఏర్పాటు చేశారు. అటవీ ఉత్పత్తులను వాడుకోవడానికి గిరిజనుల నుంచి 'పుల్లరి' అనే పన్నును వసూలు చేసేవారు. ఫలితంగా ఆదివాసీలు, గిరిజనులు తమ స్వాతంత్య్రాన్ని పరిరక్షించుకోవడానికి దేశవ్యాప్తంగా అనేక తిరుగుబాట్లు చేశారు.
* మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ప్రాంతంలోని భిల్లులు, బీహార్, బెంగాల్‌లోని సంతాలులు, కోలులు, ఒరిస్సాలోని కోలులు, రాజస్థాన్‌లోని మేర్‌లు అనేక తిరుగుబాట్లు చేశారు.
* 1817 - 31 మధ్య భిల్లులు సేవారాం నాయకత్వంలో పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేశారు.
1831 - 32 మధ్య కోవ్‌లు చిరో తెగకు చెందిన పితాంబర్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
* 1846 - 48 మధ్య గోండులు సామ్ బిసాయ్ నాయకత్వంలో, 1855 - 56 మధ్య సంతాలులు సిధు, కన్హూల నాయకత్వంలో, 1822లో రమోసే తెగవారు చిత్తూర్‌సింగ్ నాయకత్వంలో తిరుగుబాట్లు చేశారు.
* ఈశాన్య భారతదేశంలోని గిరిజన తిరుగుబాట్లకు నాయకత్వం వహించిన ఊట్‌రోట్ సింగ్‌ను ఆంగ్లేయులు ఉరితీశారు.
1822లో సతారా పరిసర ప్రాంతాల్లో పశ్చిమ కనుమల్లోని రమోసే తెగవారు చిత్తూరు సింగ్ నాయకత్వంలో తిరుగుబాటు చేశారు.
* గోండుల తిరుగుబాటు మొదటి హార్డింగ్ కాలంలో, సంతాలుల తిరుగుబాటు లార్డ్ డల్హౌసీ కాలంలో చోటు చేసుకున్నాయి.
* ఆంగ్లేయుల విధానాలను వ్యతిరేకిస్తూ జమీందారులు కూడా తిరుగుబాటు చేశారు.
* ఆంధ్ర ప్రాంతంలో (ఉత్తర సర్కారుల్లో) తలెత్తిన గంజాం, పర్లాకిమిడి తిరుగుబాట్లను అణచడానికి ఆంగ్ల ప్రభుత్వం రస్సెల్ దళాన్ని ఏర్పాటు చేసింది.
* 1879లో గోదావరి జిల్లాల్లో రంపా విప్లవం జరిగింది. పులికంటి సాంబయ్య, చంద్రయ్య, తమ్మన్న దొర, అంబుల్‌రెడ్డి లాంటివారు ఈ తిరుగుబాటుకు నాయకత్వం వహించారు.
* 1922 - 24 మధ్య అల్లూరి సీతారామరాజు నాయకత్వంలో రంపా పితూరీ విప్లవం జరిగింది.
* 1879 నాటి రంపా విప్లవాన్ని అణచడానికి ఆంగ్ల ప్రభుత్వం సల్లీవన్ నాయకత్వంలో సైన్యాన్ని పంపింది.
 

సిపాయిల తిరుగుబాట్లు
బ్రిటిష్ సైన్యంలో పనిచేసే భారతీయులను సిపాయిలుగా పిలిచేవారు.
* బ్రిటిష్ సైనికులతో సమానంగా పనిచేసినప్పటికీ సిపాయిలకు వారితో సమాన వేతనం, పదోన్నతులు లభించేవి కాదు.
* వివక్ష విధానం, పదోన్నతులు లేకపోవడం, తక్కువ జీతాలు ఇవ్వడం లాంటి వాటికి వ్యతిరేకంగా సిపాయిలు అనేకసార్లు తిరుగుబాట్లు చేశారు.
* 1764లో బెంగాల్ సిపాయిలు, 1780లో విశాఖపట్నంలోని సిపాయిలు తిరుగుబాటు చేశారు.
* 1806లో వెల్లూరు సిపాయిల తిరుగుబాటు జరిగింది. అప్పటి సైన్యాధికారి జాన్ క్రేడర్.
* 1824లో బారక్‌పూర్ సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఈ తిరుగుబాటు కారణంగా 47వ దేశీయ పటాలాన్ని రద్దు చేశారు.
* ఆంగ్లేయులకు సిపాయిల నుంచి ఎదురైన అతిపెద్ద తిరుగుబాటు 1857 సిపాయిల తిరుగుబాటు.
 

1857 సిపాయిల తిరుగుబాటు
* 1857 సిపాయిల తిరుగుబాటుకు లార్డ్ డల్హౌసీ విధానాలు ప్రధాన కారణం.
* డల్హౌసీ రాజ్య సంక్రమణ విధానాన్ని ప్రవేశపెట్టి (1848) సతారా, జైపూర్, సంబల్‌పూర్, భగత్, ఉదయ్‌పూర్, నాగ్‌పుర్, ఝాన్సీ లాంటి రాజ్యాలను ఆక్రమించాడు. దుష్పరిపాలన నెపంతో 1856లో డల్హౌసీ అయోధ్యను ఆక్రమించాడు.
పీష్వా రెండో బాజీరావు దత్త పుత్రుడైన నానాసాహెబ్ (దోండూపంత్) 8 లక్షల భరణాన్ని రద్దు చేశాడు.
* ఆంగ్లేయుల మత మార్పిడి విధానాలు కూడా తిరుగుబాటుకు కారణమయ్యాయి.
* 'భారతదేశపు ఒక చివరి నుంచి మరో చివరి వరకు క్రైస్తవ పతాకం ఎగరవేయడానికి దేవుడు హిందూస్థాన్ రాజ్య విస్తరణను ఇంగ్లాండ్‌కు అప్పగించాడు' అని కంపెనీ డైరక్టర్స్ అధ్యక్షుడైన మాజెల్స్ ప్రకటించాడు.
* 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టాన్ని చేశారు.
* 1850లో వారసత్వ చట్టం ద్వారా మతం మార్చుకున్న భారతీయులకు తండ్రి ఆస్తిలో వాటా వస్తుందని పేర్కొనడం భారతీయులు సహించలేకపోయారు.
* భారతదేశంలో రైల్వే, తంతి - తపాలా లాంటి ఆధునిక వ్యవస్థలను ప్రవేశపెట్టడాన్ని సనాతనులైన భారతీయులు వ్యతిరేకించారు.
* 1856లో లార్డ్ కానింగ్ 'సామాన్య సేవానియుక్త చట్టాన్ని' ప్రవేశపెట్టి సిపాయిలు మతపరమైన చిహ్నాలను వాడకూడదని ఆదేశించాడు.
* 'ఇండియా ఖర్చుతో భారతీయ సిపాయిలే భారతదేశాన్ని ఆంగ్లేయుల బానిసత్వంలో అణచి ఉంచుతారు' అని 1853లో కారల్‌మార్క్స్ పేర్కొన్నాడు. అప్పటి సైన్యంలో సిపాయిలు 2 లక్షల 32 వేల మంది ఉండగా, బ్రిటిష్ సైనికులు కేవలం 45 వేల మంది మాత్రమే ఉన్నారు.
*సిపాయిల తిరుగుబాటుకు తక్షణ కారణం ఆవు, పంది కొవ్వును పూసిన తూటాలు.
* 1856లో లార్డ్ కానింగ్ పాత బ్రౌన్‌బేస్ తుపాకుల స్థానంలో ఎన్‌ఫీల్డ్ రైఫిల్స్‌ను ప్రవేశపెట్టాడు. ఎన్‌ఫీల్డ్ తుపాకులు ఇంగ్లండ్‌లోని వూద్‌వూచ్ ఆయుధాగారంలో తయారయ్యేవి.
* 1857, జనవరి 23న డమ్‌డమ్‌లోని (కలకత్తా) సిపాయిలు కొత్త తుపాకుల విషయంపై ఆందోళన చేశారు.
* 1857, ఫిబ్రవరి 26న బెర్హాంపూర్‌లోని 19వ పదాతిదళం నూతన తుపాకులను ఉపయోగించడానికి నిరాకరించింది.
* 1857, మార్చి 29న బరాక్‌పూర్‌లోని 34వ పటాలానికి చెందిన మంగళ్‌పాండే తన పై అధికారి అయిన కెప్టెన్ బాగ్‌ను కాల్చి చంపాడు. ప్రభుత్వం వెంటనే 19, 34 దళాలను రద్దు చేసింది.
* వాస్తవంగా సిపాయిల తిరుగుబాటు 1857, మే 10న మీరట్‌లో ప్రారంభమైంది.
* మీరట్‌లోని 3వ అశ్వికదళం తమ పైఅధికారి కల్నల్ స్మిత్‌పై తిరుగుబాటు చేసింది.
* సిపాయిలు ఢిల్లీకి వెళ్లి రెండో బహదూర్‌షా జాఫర్‌ను తిరుగుబాటుకు నాయకుడిగా చేశారు.
* ఢిల్లీలో తిరుగుబాటులకు నాయకత్వం వహించినవాడు - భక్తఖాన్.
 

తిరుగుబాటు ప్రాంతం - నాయకత్వం వహించినవారు
       బీహార్ - కున్వర్‌సింగ్
       లక్నో - మౌల్వీ అహ్మదుల్లా
       బరేలీ - ఖాన్ బహదూర్ ఖాన్
    కాన్పూర్ - నానాసాహెబ్, తాంతియాతోపే
       అయోధ్య - బేగం హజరత్ మహల్
       ఝాన్సీ, గ్వాలియర్ - ఝాన్సీ లక్ష్మీబాయ్
       హైదరాబాద్ - తుర్రేబాజ్ ఖాన్
* రెండో బహదూర్‌షా జాఫర్ సిపాయిల తిరుగుబాటుకు నాయకుడిగా ఉంటూనే రహస్యంగా ఆంగ్లేయుల వద్దకు రాయబారిగా అమానుల్లా అనే ప్రతినిధిని పంపి రాజీ ప్రయత్నాలు చేశాడు.
* తిరుగుబాటు కాలంలో ఢిల్లీలో నికల్సన్, లక్నోలో లారెన్స్, నీల్ అనే ఆంగ్ల సైనికాధికారులు మరణించారు.
* రెండో బహదూర్‌షా జాఫర్‌ను బంధించిన బ్రిటిష్ సేనాధిపతి కెప్టెన్ హడ్సన్. కాన్పూర్‌లో బ్రిటిష్ సైన్యాధికారి వీలర్.
నానా సాహెబ్ రాజకీయ సలహాదారుడైన అజీముల్లా మోసం చేసి కాన్పూర్ రక్షణ దళాన్ని అంతమొందించాడు.
* 'మాతృదేశ స్వాతంత్య్రం కోసం కుట్రపన్ని యుద్ధం చేసే మనిషి దేశభక్తుడైనట్లయితే మౌల్వీ అహ్మదుల్లా (లక్నో) నిజంగా దేశభక్తుడే' అని కల్నల్ మావెసన్ పేర్కొన్నాడు.
* ఝాన్సీ లక్ష్మీబాయ్ అసలు పేరు మణికర్ణిక (మనూబాయ్).
* ఝాన్సీ లక్ష్మీబాయ్ ఝాన్సీ పాలకుడైన గంగాధరరావును వివాహం చేసుకుని దామోదరరావు అనే బాలుడిని దత్తత తీసుకుంది.
* తిరుగుబాటు కాలంలో దిబైన్‌బాగ్ హత్యాకాండ జరిగింది. ఝాన్సీ కోటలో అనేక మంది ఆంగ్లేయులు ఈ సంఘటనలో మరణించారు (దీనికి ఝాన్సీ కారకురాలని ఆంగ్లేయులు ఆరోపించారు).
* 1858, జూన్ 18న లక్ష్మీబాయ్‌ని బ్రిటిష్ సైన్యాధిపతి సర్ హ్యూరోస్ తిరుగుబాటులో అంతమొందించాడు.
* 'తిరుగుబాటు దారుల్లో ఏకైక పురుషుడు ఝాన్సీ లక్ష్మీబాయ్' అని సర్ హ్యూరోస్ పేర్కొన్నాడు.
* ఝాన్సీ లక్ష్మీబాయ్ 'ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క్‌'గా పేరుపొందింది.
* 'మా స్వహస్తాలతో మేము మా స్వతంత్య్ర పాలనను సమాధికానివ్వం' అని లక్ష్మీబాయ్ తన అనుచరులతో ప్రమాణం చేయించింది.
* 1857 తిరుగుబాటు విఫలం అయ్యేందుకు అనేక కారణాలున్నాయి. తిరుగుబాటు దేశవ్యాప్తంగా ఒకేసారి జరగకపోవడం, అన్ని ప్రాంతాలకు విస్తరించకపోవడం, సమర్థులైన నాయకులు లేకపోవడం, ఉమ్మడి లక్ష్యం లేకపోవడం, స్వదేశీ పాలకులు ఆంగ్లేయులకు సహకరించడం, ఆధునిక ఆయుధ సంపత్తి, రవాణా సాధనాలు ఆంగ్లేయుల చేతిలో ఉండటం లాంటి అనేక కారణాల వల్ల తిరుగుబాటు విఫలమైంది.
* 'సంస్థానాదీశులు తుపాను అలల తీవ్రతని తగ్గించే అడ్డు గోడలుగా ఉపయోగపడ్డారు. లేకపోతే ఆ తుపాను మనల్ని మూకుమ్ముడిగా ఊడ్చి పారేసి ఉండేది' అని లార్డ్ కానింగ్ పేర్కొన్నాడు.
* 'క్రమశిక్షణను చిన్నాభిన్నం చేసి, తమ పై అధికారులను హత్యచేసి, తిరగబడే సిపాయిలు తమను నడిపించగల నాయకుడిని ఎలా ఎంచుకోగలరు' అని కారల్‌మార్క్స్ పేర్కొన్నాడు.
* 1857 సిపాయిల తిరుగుబాటును వినాయక్ దామోదర్ సావర్కర్ 'ప్రథమ భారత స్వాతంత్య్ర సమరం' అని పేర్కొన్నారు.
1909లో వి.డి. సావర్కర్ 'ది ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్' అనే పుస్తకాన్ని రచించారు.
* నెహ్రూ తన 'ది డిస్కవరీ ఆఫ్ ఇండియా' అనే పుస్తకంలో 'సిపాయిల తిరుగుబాటును కేవలం భూస్వాముల తిరుగుబాటు' అని రాశారు.
* 'నాగరిక, అనాగరిక జాతుల మధ్య జరిగిన తిరుగుబాటు' అని టి.ఆర్. హోమ్స్ అనే ఆంగ్లేయుడు పేర్కొన్నాడు.
* 'హిందువులు, ముస్లింలు కలిసి పన్నిన కుట్ర' అని సర్ జేమ్స్ ఔట్రామ్ పేర్కొన్నాడు.
* బెంజిమన్ డిస్రేలీ సిపాయిల తిరుగుబాటును 'జాతీయ తిరుగుబాటు'గా వ్యాఖ్యానించాడు.
* '1857 తిరుగుబాటు సిపాయిల పితూరీ కాదని, గొప్ప జాతీయ విప్లవం' అని కె.ఎం. ఫణిక్కర్ పేర్కొన్నాడు.
* కె.ఎం. మున్షీ, ఆర్.సి. మజుందార్, ఎస్.ఎన్. సేన్ లాంటి వారు ఈ తిరుగుబాటును జాతీయ సమరానికి ప్రథమ సోపానంగా పేర్కొన్నారు.
* భారత గవర్నర్ జనరల్ పదవిని వైశ్రాయ్/ రాజప్రతినిధిగా మార్చి లార్డ్ కానింగ్‌ను ఈ పదవిలో తొలిసారిగా నియమించారు.
ఇంగ్లండ్ పార్లమెంటులో మంత్రిగా ఉన్న సభ్యుడిని 'భారత రాజ్య కార్యదర్శి' పదవిలో నియమించారు. (1858 చట్టం ద్వారా 'భారత రాజ్య కార్యదర్శి' పదవిని ఏర్పాటుచేశారు).
* దేశీయ, విదేశీ సైనికుల నిష్పత్తిని మార్చారు. బెంగాల్‌లో 2 : 1గా, మద్రాస్, బొంబయి ప్రెసిడెన్సీల్లో 3 : 1గా నిర్ణయించారు.
* రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేశారు. దత్తతను అంగీకరించారు.
* రెండో బహదూర్‌షా 1861లో రంగూన్ జైల్లో మరణించడంతో మొగల్ వంశం అంతరించిపోయింది.
1857 సిపాయిల తిరుగుబాటు ఢిల్లీలోని మొగల్ సంస్కృతిని నాశనం చేసిందని, అది తిరిగి కోలుకోలేదని' సి.ఎఫ్. ఆండ్రూస్ పేర్కొన్నాడు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌