• facebook
  • whatsapp
  • telegram

బ్యాక్టీరియా

* కొన్ని బ్యాక్టీరియాలు కశాభాలను చలనాంగాలుగా కలిగి ఉంటాయి. ఇవి ఫ్లాజెల్లిన్‌ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటాయి.

* చిన్న కేశాల లాంటి నిర్మాణం బ్యాక్టీరియాపై బాహ్యపెరుగుదలగా కనిపిస్తుంది. వీటిని పిలై అంటారు. ఇది పిలిన్‌ అనే ప్రోటీన్‌తో నిర్మితమై ఉంటుంది. ఈ పిలై బ్యాక్టీరియాల సంయుగ్మంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

* బ్యాక్టీరియాలను అభిరంజనం చేసే విధానాన్ని గ్రామ్‌ అభిరంజన విధానం అంటారు.

* గ్రామ్‌ అభిరంజన విధానంలో ఉపయోగించే అభిరంజనం పేరు క్రిస్టల్‌ వయొలెట్‌. కనిపించే వర్ణం ఆధారంగా బ్యాక్టీరియాని గ్రామ్‌ పాజిటివ్, గ్రామ్‌ నెగెటివ్‌గా విభజించారు.

శక్తి ఉత్పాదన..

* బ్యాక్టీరియా శక్తి ఉత్పాదన కోసం వాయు, అవాయు శ్వాసక్రియ పద్ధతులను అనుసరిస్తాయి.

* బ్యాక్టీరియాను సాధారణంగా స్వయం పోషితాలు, పరషోషితాలుగా పేర్కొంటారు.

* స్వయం పోషక బ్యాక్టీరియా కిరణజన్య సంయోగక్రియ వర్ణక పదార్థాలైన బ్యాక్టీరియో క్లోరోఫిల్, బ్యాక్టీరియో ఫియోఫైటిన్‌లను కలిగి ఉంటాయి. వీటి కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్‌ వెలువడదు. దీన్ని ఆక్సిజన్‌ ఉత్పాదనరహిత కిరణజన్య సంయోగక్రియ అంటారు.

* పరపోషిత బ్యాక్టీరియాలు పూతికాహార పోషణ లేదా పరాన్నజీవనాన్ని ప్రదర్శిస్తాయి.

ప్రత్యుత్పత్తి..

* బ్యాక్టీరియాలో సిద్ధబీజాల ఏర్పాటు, ద్విధావిచ్ఛిత్తి పద్ధతుల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది.

* బ్యాక్టీరియాలో లైంగిక ప్రత్యుత్పత్తి సాధారణంగా మూడు విధాలుగా జరుగుతుంది. అవి:

i. జన్యుపరివర్తనం      ii. సంయుగ్మం    iii. జన్యువహనం.

సయనో బ్యాక్టీరియా

* బ్యాక్టీరియాను పోలి ఉండే శైవల జాతులు నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. వీటిని సయనో బ్యాక్టీరియా అంటారు. వీటిలో మొక్కల్లో జరిగినట్లే కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది. 

ఉదా: నాస్టాక్, అనబీనా, సైటోనిమా, రివ్యులేరియా.


బ్యాక్టీరియా వల్ల కలిగే ప్రయోజనాలు

బ్యాక్టీరియా వల్ల మనిషికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

* వీటిని యాంటీబయాటిక్స్‌ (సూక్ష్మ జీవనాశకాలు) తయారీలో విరివిగా ఉపయోగిస్తారు. ఉదా: గ్రామిసిడిన్‌ అనే యాంటీబయాటిక్‌ను బేసిల్లస్‌ బ్రెనిస్‌ అనే నత్తలో పెరిగే బ్యాక్టీరియా జాతి నుంచి తయారు చేసారు. 

* అత్యధిక సూక్ష జీవనాశకాలను ఉత్పత్తి చేసే బ్యాక్టీరియం ప్రజాతి స్ట్రెప్టోమైసిస్‌. 

* వైద్యరంగంలో విరివిగా ఉపయోగిస్తోన్న సూక్షజీవనాశకాల్లో సుమారు 2/3 వ వంతు బ్యాక్టీరియా నుంచే లభిస్తున్నాయి.

* పూతికాహార భక్షణ ద్వారా బ్యాక్టీరియా చనిపోయిన జంతు, వృక్ష కళేబరాలను విచ్ఛిన్నం చేస్తాయి. అవి వాటిని కర్బన (సేంద్రియ) అకర్బన పదార్థాలుగా మార్చి తిరిగి మృత్తికలోకి చేరుస్తున్నాయి. ఈ విధంగా ఇవి జీవభౌమ్య రసాయన వలయాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

రైజోబియం అనే బ్యాక్టీరియా వేరుశెనగ, బఠాణీ, చిక్కుడు లాంటి లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన ఆవృతబీజ మొక్కల్లోని వేరు భాగాల్లో నివసిస్తాయి. అవి అక్కడ వేరుబుడిపెలు ఏర్పర్చి, వాటికి కావాల్సిన నత్రజని స్థాపన చేస్తాయి. ఈ బ్యాక్టీరియాను జీవ ఎరువుగా పేర్కొంటారు. జీవ ఎరువులుగా ఉపయోగపడుతున్న ఇతర బ్యాక్టీరియాలు - రోడోస్పైరిల్లం, అజోస్పైరిల్లం.

* లాక్టోబాసిల్లస్‌ ప్రభావం వల్ల పాలలో ఉండే చక్కెర లాక్టోజ్‌గా విచ్ఛిన్నమై లాక్టిక్‌ ఆమ్లంగా రూపాంతరం చెందుతుంది. దీనివల్ల పాల నుంచి పెరుగు లభిస్తుంది.

* పారిశ్రామికంగా బ్యాక్టీరియాలను కిణ్వన ప్రక్రియకి గురిచేసి అనేక ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. ఉదా: లాక్టిక్‌ ఆమ్లం, ఎసిటిక్‌ ఆమ్లం లాంటి కర్బన ఆమ్లాలు; బి-కాంప్లెక్స్‌ లాంటి విటమిన్లు; గ్లుటామిక్‌ ఆమ్లం లాంటి అమైనో ఆమ్లాలు; ఆల్కహాల్‌.

ఎశ్చరీషియా కొలై లాంటి బ్యాక్టీరియాను జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ లాంటి అధునాతన జీవశాస్త్ర పరిశోధనల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు.

బాసిల్లస్‌ తూరెంజియెన్సిస్, సూడోమోనాస్‌ లాంటి బ్యాక్టీరియాలను జీవ క్రిమిసంహారకాలుగా ఉపయోగిస్తారు. వీటి వాడకం వల్ల పర్యావరణం కాలుష్యాన్ని నిరోధించొచ్చు.

రుమినోకోకస్‌ బ్యాక్టీరియా శాకాహార జీవులైన పశువుల జీర్ణాశయంలో సెల్యులోజ్‌ జీర్ణక్రియకు సహకరిస్తాయి.

* మానవుల్లో ఎశ్చరీషియాకొలై జీర్ణక్రియలో సాయపడుతుంది.

* బ్యాక్టీరియా జీవపరిహారాత్మక చర్య (బయోరెమిడియేషన్‌) ద్వారా మలినాలను విచ్ఛిన్నం చేస్తాయి.

బ్యాక్టీరియా వల్ల కలిగే దుష్ప్రభావాలు

* మొక్కలు, జంతువుల్లోనే కాకుండా మానవుల్లో కూడా బ్యాక్టీరియా వల్ల అనేక వ్యాధులు కలుగుతున్నాయి. 

ఉదా: 1. జాంథోమోనాస్‌ సిట్రి అనే బ్యాక్టీరియా వల్ల నిమ్మజాతి మొక్కల్లో సిట్రస్‌ కేంకర్‌ వ్యాధి వస్తుంది.

2. ఆంథ్రాక్స్‌ బాసిల్లై వల్ల గొర్రెల్లో ఆంథ్రాక్స్‌ వ్యాధి కలుగుతుంది.

3. మానవులకు వచ్చే కలరా వ్యాధికి కారణం విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా.

* డీనైట్రిఫికేషన్‌ చర్యలు, బ్యాక్టీరియా వల్ల నేల తన సారాన్ని కోల్పోతుంది. బాసిల్లస్‌ సిరియస్, పారాకోకస్‌ డీనైట్రిఫి·కెన్స్‌ లాంటివి డీనైట్రిఫికేషన్‌ బ్యాక్టీరియాకి ఉదాహరణ.

కొన్ని రకాల స్ట్రెప్టోకోకస్, మైక్రోకోకస్‌ జాతులు ఆహారాన్ని పాడుచేసి, హానికర ప్రభావాన్ని చూపుతాయి.

* సాల్మొనెల్లా టైఫి (టైఫాయిడ్‌ను కలిగిస్తుంది), విబ్రియో కలరా, షైజిల్లా డిసెంట్రియే (అతిసారం కలిగిస్తుంది) లాంటి బ్యాక్టీరియాలు నీటిని కలుషితం చేస్తాయి.

కేంద్రక పూర్వజీవులు...

బ్యాక్టీరియాల్లో నిర్దిష్టమైన కేంద్రకం ఉండదు. జన్యుపదార్థం చుట్టూ కేంద్రకత్వచ నిర్మాణం ఉండదు. ఇవి కేంద్రక పూర్వజీవులు. జన్యుపదార్థం నగ్నంగా ఉంటుంది. దీన్ని న్యూక్లియోబ్‌ లేదా జీనోఫోర్‌గా పిలుస్తారు. జన్యుపదార్థంగా వృత్తాకార ద్వికుండలి నిర్మాణంలో DNA  ఉంటుంది.

* బ్యాక్టీరియాల్లో కేంద్రక DNA తో పాటు కేంద్రకేతర లేదా కేంద్రకబాహ్య DNA  కూడా వ్యవస్థితమై ఉంటాయి. దీన్నే ప్లాస్మిడ్‌ అంటారు. ఇవి సూక్ష్మమైన, వృత్తాకార ద్విపోచయుత DNA అణువులు. ప్లాస్మిడ్‌ అనే పదాన్ని జోషువా లెడెర్‌బర్గ్‌ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ప్లాస్మిడ్‌లు ఫలన సామర్థ్యానికి, సూక్ష్మజీవ నాశకాల నిరోధకత్వానికి సంబంధించిన జన్యువులను కలిగి ఉంటాయి.

* బ్యాక్టీరియాలో 70s రకానికి చెందిన రైబోసోమ్‌లు ఉంటాయి. ఇవి 50s, 30s ఉపప్రమాణాలతో నిర్మితమై ఉంటాయి. ఇవి r-RNA ప్రోటీన్లతో జీవ సంశ్లేషణకు ఉపకరిస్తాయి.

మారిది ప్రశ్నలు

1. మానవుడిలో బ్యాక్టీరియా వల్ల సంభవించే వ్యాధులు ఏవి?

i) న్యుమోనియా     ii)  కలరా      iii) ప్లేగు     iv)  డిఫ్తీరియా

1) i, ii         2) i, iii       3)  i, ii, iii      4) పైవన్నీ

జ : పైవన్నీ

2. ‘నియోమైసిన్‌’ అనే సూక్షజీవ నాశకం కింది ఏ బ్యాక్టీరియా ప్రజాతి నుంచి ఉత్పత్తి అవుతుంది?

1) స్టెఫైలోకోకస్‌      2) బాసిల్లస్‌      3) స్ట్రెప్టోమైసిస్‌     4) ఎశ్చరీషియా

జ : స్ట్రెప్టోమైసిస్‌

3. యాంటీబయాటిక్‌ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

1) వాండర్‌మాన్‌     2)  వాక్స్‌మాన్‌        3) రాబర్ట్‌కోష్‌     4)  అలెగ్జాండర్‌ ఫ్లెమింగ్‌

జ : రాబర్ట్‌కోష్‌ 

4. మొట్టమొదటిసారి కనుక్కున్న యాంటీబయాటిక్‌గా కింది దేన్ని పేర్కొంటారు?

1) స్ట్రెప్టోమైసిస్‌       2)  పెన్సిలిన్‌       3) అజిత్రోమైసిన్‌     4) నియోమైసిన్‌

జ :   స్ట్రెప్టోమైసిస్‌  

5. కిందివాటిలో సజీవ శిలాజంగా (లివింగ్‌ ఫాజిల్‌) ఏ బ్యాక్టీరియాని పేర్కొంటారు?

1) ఆర్కీబ్యాక్టీరియా     2)  యాక్టినోమైసిటిస్‌    3) మైకోప్లాస్మా       4) బాసిల్లస్‌ బ్యాక్టీరియా

జ :  ఆర్కీబ్యాక్టీరియా

6. కింది అంశాలను జతపరచండి.

i) కోకస్‌               a) సర్పిలాకారం

ii) బాసిల్లస్‌         b) కామా ఆకారం

iii) విబ్రియో       c) దండాకారం

iv)  స్పైరిల్లమ్‌    d) గుండ్రటి ఆకారం

1) i-a, ii-b, iii-c, iv-d            2) i-d, ii-c, iii-b, iv-a

3) i-c, ii-a, iii-b, iv-d          4) i-c, ii-d, iii-a, iv-b

జ :  i-d, ii-c, iii-b, iv-a

7. బ్యాక్టీరియా కింది ఏ రాజ్యానికి చెందుతాయి?

1) ప్రొటిస్టా     2) ఫంగై     3) మొనీరా      4) అనిమేలియా

జ : మొనీరా

8. బ్యాక్టీరియాలో ఏ రకానికి చెందిన రైబోసోములు ఉంటాయి?

1) 60S      2) 80S      3) 90S      4) 70S

జ : 70S

9. బ్యాక్టీరియా న్యూక్లియాయిడ్‌ ఎన్ని దీవితి అణువులతో నిర్మితమై ఉంటుంది?

1) 4        2) 3       3)  2      4) 1

జ : 4 (1)

10. కింది అంశాలను జతపరచండి.

బ్యాక్టీరియా పేరు                  కలిగే వ్యాధి

i) మైకోబ్యాక్టీరియా లెప్రె            a) టైఫాయిడ్‌

ii) పాస్టురెల్లా పెస్టిస్‌                   b) గాంగరిన్‌

iii)  క్లాస్ట్రీడియంపెర్‌ఫ్రిన్జెన్స్‌      c) ప్లేగు

iv) సాల్మొనెల్లా టైఫోసా              d) లెప్రసీ  (కుష్టి)

1) i-c, ii-d, iii-b, iv-a      2) i-d, ii-c, iii-a, iv-b

3) i-d, ii-b, iii-a, iv-cs     4) i-d, ii-c, iii-b, iv-a

జ : i-d, ii-c, iii-b, iv-a

11. స్వేచ్ఛగా నత్రజని స్థాపన చేస్తూ, మృత్తిక సారాన్ని పెంచే బ్యాక్టీరియా కింది వాటిలో ఏవి?

i) అజటోబాక్టర్‌        ii  క్లాస్ట్రీడియం    iii రైజోబియం

1) i, ii    2) ii, iii    3) i, iii    4) i, ii, iii

జ : i, ii  

12. జంతువుల్లో బ్యాక్టీరియా వల్ల కింది ఏ వ్యాధులు కలుగుతాయి?

i) ఆంథ్రాక్స్‌     ii)  బ్లాక్‌లెగ్‌ వ్యాధి    iii) క్రౌన్‌గాల్‌

1) i, ii    2) ii, iii   3) i, iii    4) i, ii, iii


జ :  i, iii

Posted Date : 22-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌