• facebook
  • whatsapp
  • telegram

మూలకాలు 

              సజాతి పరమాణువుల కలయికవల్ల ఏర్పడిన అణువు లున్న పదార్థాన్ని మూలకం అంటారు. ఉదాహరణకు H2, N2, O2, O3, S8, P4 లాంటివి. మూలకం అనే పదాన్ని రాబర్ట్ బాయిల్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారు. మూలకం రూపాంతరాన్ని కూడా మూలకంగానే తీసుకుంటారు. ఉదాహరణకు డైమండ్, గ్రాఫైటు మూలకాలే. ఆక్సిజన్, ఓజోన్‌లు కూడా మూలకాలే. ఆవర్తన పట్టికలో ఈ మూలకాలు క్రమపద్ధతిలో అమరి ఉంటాయి. 
              అన్నిటికంటే తేలికైన మూలకం హైడ్రోజన్. ప్రకృతిలో లభించే అన్నిటికంటే భారయుతమైన మూలకం యురేనియం. యురేనియం తర్వాత లభించే మూలకాలను 'ట్రాన్స్‌యురేనిక్' మూలకాలు అంటారు. ఇవి ప్రకృతిలో లభించవు. మానవుడే మొదట కృత్రిమంగా టెక్నీషియం అనే మూలకం తయారుచేశాడు. మానవుడు కృత్రిమంగా తయారుచేసిన రెండో మూలకం 'ప్రోమీథీయం'. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే లోహం పాదరసం. గది ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితిలో ఉండే అలోహం బ్రోమిన్. ప్రకృతిలో 11 మూలకాలు మనకు వాయుస్థితిలో లభిస్తాయి. వీటిలో జడవాయువులు ఆరు. అవి - హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, గ్జీనాన్, రేడాన్‌లు. ఇవికాకుండా 5 వాయుమూలకాలు ఉన్నాయి. అవి - హైడ్రోజన్, ఫ్లోరిన్, ఆక్సిజన్, క్లోరిన్, నైట్రోజన్‌లు. ప్రతి మూలకానికి కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి.

హైడ్రోజన్
              హైడ్రోజన్ అంటే నీటిని ఏర్పరచేది అని అర్థం. దీన్ని హెన్రీకేవిండిష్ అనే శాస్త్రవేత్త కనుక్కున్నాడు. విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం ఇదే. అంతేకాకుండా సూర్యుడు, నక్షత్రాలలో ఈ హైడ్రోజన్ సంలీనం చెంది కొన్ని లక్షల డిగ్రీల ఉష్ణం విడుదలయ్యేందుకు, వాటి స్వయం ప్రకాశకత్వానికి కారణం అవుతుంది. మనకు లభించే మూలకాలన్నింటిలో ఎలక్ట్రాన్‌లు, ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌లు అనే మూడు ప్రాథమిక కణాలుంటాయి. కానీ హైడ్రోజన్ పరమాణువులో న్యూట్రాన్ ఉండదు. మూలకాలన్నింటిలోను న్యూట్రాన్ ఉండనిది హైడ్రోజన్ మాత్రమే. మనకు తెలిసిన వాయువులన్నింటిలోకి అతి తక్కువ అణుభారం హైడ్రోజన్‌కు ఉంది. అందువల్ల వాయువులన్నింటిలో అత్యధిక వ్యాపనరేటును హైడ్రోజన్ కలిగి ఉంటుంది.

 

హీలియం 
              ఇది జడవాయువుల్లో మొదటిది. అన్నింటికంటే తేలికైన జడవాయువు ఇదే. దీనిని వాతావరణ బెలూన్‌లలో నింపేందుకు వాడతారు. సూర్యగోళంలో ఏర్పడే జడవాయువు హీలియం. వాతావరణ బెలూన్‌లలో నింపే హైడ్రోజన్ వాయువుకు అధిక పీడనానికి మండిపోయే స్వభావంఉంటుంది. అందువల్ల దాని స్థానంలో బెలూన్‌లలో హీలియాన్ని నింపుతారు.

 

లిథియం 
              ఇది అన్నిటికంటే తేలికైన లోహం. లోహాలన్నింటిలోకి మృదువైంది సీజియం, కఠినమైంది టంగ్‌స్టన్.
అందువల్ల టంగ్‌స్టన్‌ను విద్యుత్ బల్బుల్లో ఫిలమెంటుగా ఉపయోగిస్తారు. విద్యుత్ బల్బులను ఫ్లింట్‌గాజుతో తయారుచేసి వాటిలో నైట్రోజన్ వాయువును నింపుతారు. లోహాలన్నింటిలో రేకులుగా సాగే స్వభావం అత్యధికంగా బంగారానికి ఉంటుంది. లోహాలన్నింటిలో అత్యధిక విద్యుద్వాహకత వెండికి ఉంటుంది.

 

కార్బన్ 
     మూలకాలన్నింటిలోకి అత్యధిక సమ్మేళనాలను కార్బన్ ఏర్పరుస్తుంది. అందుకే కార్బన్‌ను 'మూలకరాజం' అంటారు. మూలక పరమాణువులు ఒకదానికొకటి కలిసి గొలుసుల్లాంటి సమ్మేళనాలను ఏర్పరిచే స్వభావాన్ని 'కాటనేషన్' అంటారు. మూలకాలన్నింటిలోను అత్యధిక కాటనేషన్ స్వభావం కార్బన్‌కు ఉంది. ఇక మూలకాలన్నింటి కాఠిన్యం విషయానికొస్తే అత్యధిక కఠినత్వం కార్బన్‌కు మాత్రమే ఉంది. కార్బన్ తన రూపాంతరమైన వజ్రం రూపంలో ప్రకృతిలో లభించే పదార్థ´లన్నింటిలోకి కఠినమైంది.

 

నైట్రోజన్ 
     ఇది గాలిలో అత్యధికంగా ఉండే వాయువు. గాలిలో 78.32 శాతం నైట్రోజన్ ఉంటుంది. మొక్కల పెరుగుదలకు ముఖ్యంగా అవసరమైన మూలకం. దీనిని విద్యుత్ బల్బుల్లో జడవాతావరణం కోసం నింపుతారు. గాలిలో ఐదు భాగాల్లో నాలుగు భాగాలు నైట్రోజన్ ఉంటుంది. కళేబరాలు కుళ్లినప్పుడు వాటినుంచి నైట్రోజన్ వాయువు వెలువడి గాలిలో కలిసిపోతుంది.

 

ఆక్సిజన్
        ఆక్సిజన్ అంటే ఆమ్లాన్ని ఏర్పరచేది అని అర్థం. దీనిని షీతే, ప్రీస్ట్లే అనే శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. భూమి పొరల్లో అత్యధికంగా లభించేది ఆక్సిజన్ మాత్రమే. ఇది మొక్కలు, జంతువులు శ్వాసించడానికి అవసరం. కిరణజన్య సంయోగక్రియలో మొక్కలు ఆక్సిజన్‌ను వెలువరిస్తాయి. ఇంధనాలు మండటానికి ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ వాయువు దహన సహకారి. స్వయంగా మండదు. కాని పదార్థాలు మండటానికి సహకరిస్తుంది. గాలిలో 1/5 వంతు ఆక్సిజన్ ఉంటుంది. దీనిని ఆక్సీహైడ్రోజన్ జ్వాల తయారీలో వాడతారు. ఈ జ్వాల 2300oC నది ఉష్ణాన్ని ఇస్తుంది. రోగులు, పర్వాతారోహకులు, సముద్రలోతుల్లోకి వెళ్లే నావికులు శ్వాస కోసం ఆక్సిజన్‌ను ఉపయోగిస్తారు.

 

ఫ్లోరిన్ 
       దీనిని సూపర్ హాలోజన్ అని పిలుస్తారు. మూలకాలన్నింటిలోకి అత్యధిక రుణవిద్యుదాత్మకత కలిగింది ఫ్లోరిన్ మాత్రమే. దంతాల్లో పింగాణీ ఏర్పడటానికి ఇది అవసరం. అలోహాలు అన్నింటిలోకి ఇది అత్యధిక చర్యాశీలతా కలిగి ఉంటాయి. నీటిలో ఫ్లోరిన్ గాఢత 3 pmm కంటే అధికమైనప్పుడు ఫ్లోరోసిస్ అనే వ్యాధి వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎముకలు బలహీనమై, దంతాలపై పసుపు చారలు ఏర్పడతాయి. అందువల్ల నీటి నుంచి ఫ్లోరిక్‌ను తొలగించడం అవసరం. నీటి నుంచి ఫ్లోరిన్‌ను తొలగించే అతిచవకైన పద్ధతిని నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (నాగపూర్) కనుక్కుంది. ఈ పద్ధతిని మొదట నల్గొండలో ప్రయోగాత్మకంగా వాడారు. అందువల్ల దీనికి నల్గొండ విధానం అని పేరు పెట్టారు.
నల్గొండ విధానంలో నీటికి బ్లీచింగ్ పౌడరు, సున్నం, పటిక కలిపి కలియబెడతారు. ఫ్లోరిన్ అవక్షేపం రూపంలో పాత్ర అడుగుభాగంలో చేరుకుంటుంది.

 

నియాన్
          ఈ వాయువును ఎర్రని విద్యుత్ అలంకరణ దీపాల్లో నింపుతారు. విమానాలు, రైల్వే సిగ్నల్ లైటు కోసం ఎర్రని కాంతిని ఉపయోగిస్తారు. నియాన్ వాయువు నింపిన బల్బులు ఎర్రని కాంతిని ఇస్తాయి. ఎర్రటి కాంతికి మాత్రమే పొగమంచు ద్వారా ప్రయాణించే స్వభావం ఉంటుంది. అందుకే డేంజర్ సిగ్నల్స్‌కు ఎర్రని కాంతిని వాడతారు.

 

సోడియం 
          ఈ లోహాన్ని కిరోసిన్‌లో నిల్వచేస్తారు. చల్లని నీటితో చర్యనొందినప్పుడు హైడ్రోజన్ వాయువును వెలువరిస్తుంది. 
          2Na2 + 2H2O  2NaOH + H2 సోడియంలోహం నీటితో చర్యనొందినప్పుడు ఏర్పడే ద్రావణం క్షారస్వభావం కలిగి ఉంటుంది. సోడియం లోహాన్ని కృత్రిమ రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు. ద్రవ సోడియాన్ని అణు రియాక్టర్లలో శీతలీకరణిగా ఉపయోగిస్తారు.

మెగ్నీషియం 
          మొక్కల్లోని ఆకుల్లో ఉండే హరిత రేణువుల్లో మెగ్నీషియం లోహం ఉంటుంది. దీనివల్ల ఆకులు పచ్చరంగును కలిగి ఉంటాయి. మానవశరీరంలోని రక్తంలో హీమోగ్లోబిన్ ఐరన్‌లోహాన్ని కలిగి ఉంటుంది. అందుకే రక్తం ఎర్రగా ఉంటుంది. మన శరీరంలో రక్తహీనత వల్ల వచ్చే జబ్బును 'ఎనీమియా' అంటారు. విటమిన్ B - 12లో కోబాల్ట్ ఉంటుంది.

 

అల్యూమినియం
            ఇది ఆవర్తన పట్టికలో 3వ గ్రూప్, 3వ పీరియడ్‌లో ఉండే మూలకం. దీనిని సిల్వర్ పెయింట్ తయారీలో ఉపయోగిస్తారు. సిల్వర్ పెయింట్‌లో సిల్వర్ శాతం సున్నా. అయితే అల్యూమినియం పొడిని లిన్‌సీడ్ ఆయిల్‌తో కలిపినప్పుడు సిల్వర్ పెయింట్ తయారవుతుంది. భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం అల్యూమినియం. అల్యూమినియం ముఖ్య ఖనిజం బాక్సైట్. దీని ఫార్ములా Al2O32H2O. ఈ బాక్సైట్ రెండు రకాలుగా ఉంటుంది. ఎర్రబాక్సైట్, తెల్లబాక్సైట్, ఎర్రబాక్సైట్‌లో ఐరన్ ఆక్సైడ్ (Fe2O3) మలినాలు, తెల్లబాక్సైట్‌లో సిలికా (SiO2) మలినాలు ఉంటాయి. అల్యూమినియం పొడి, అమ్మోనియం నైట్రేట్‌ల మిశ్రమాన్ని అమ్మోనాల్ అంటారు. దీనిని పేలుడు పదార్థంగా ఉపయోగిస్తారు.

 

సిలికాన్ 
            ఈ మూలకాన్ని ట్రాన్సిస్టర్లలో అర్ధలోహంగా ఉపయోగిస్తారు. కంప్యూటర్ యుగంలో ఈ మూలక ప్రాధాన్యం ఎక్కువ. ఎందుకంటే కంప్యూటర్ చిప్స్ లేదా మైక్రోప్రోసెసర్ల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా సోలార్ సెల్స్ తయారీకి కూడా ఈ మూలకాన్ని ఉపయోగిస్తారు. 
            సిలికాన్ మూలకం అయితే సిలికా మాత్రం సమ్మేళనం. సిలికా అనేది సిలికాన్, ఆక్సిజన్ల సమ్మేళనం. దీని ఫార్ములా SiO2. సిలికాజల్ అనే పదార్థం తేమను త్వరగా గ్రహిస్తుంది. అందువల్ల మందుసీసాల్లో తేమను గ్రహించడానికి చిన్న ప్యాకెట్ రూపంలో సిలికాజెల్‌ను ఉపయోగిస్తారు.

 

పాస్ఫరస్ 
            దీనిలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల పాస్ఫరస్, రెండోది ఎర్ర పాస్ఫరస్. తెల్ల పాస్ఫరస్‌కు పాస్ఫరస్ రూపాలన్నింటి కంటే అధిక చర్యశీలత ఉంది. నీటిలో నిల్వ చేసే అలోహం తెల్లపాస్ఫరస్. దీన్ని గాలిలోకి తీయగానే ఆక్సిజన్‌తో మండిపోయి పాస్ఫరస్ పెంటాక్సైడ్‌ను ఏర్పరుస్తుంది. ఎర్రపాస్ఫరస్‌ను అగ్గిపెట్టెల పరిశ్రమలో, ఎలుకల మందుగా ఉపయోగిస్తారు. 
            అగ్గిపుల్ల తలలో పొటాషియం క్లోరేట్, యాంటిమొని సల్ఫైడ్, జిగురు ఉంటుంది. అగ్గిపెట్టె గీసే ప్రదేశంలో ఎర్రపాస్ఫరస్, యాంటిమొనిసల్ఫైడ్, మెత్తని గాజు ముక్కల పొడి ఉంటాయి. అగ్గిపుల్ల గీసినప్పుడు వేడికి పొటాషియం క్లోరేట్ వియోగం చెంది O2 వాయువు వెలువడుతుంది. అందుకే అగ్గిపుల్ల వేగంగా కాంతితో మండుతుంది.

 

సల్ఫర్ 
            సల్ఫర్ ప్రకృతిలో అనేక రూపాల్లో దొరుకుతుంది. దీని రూపాలన్నింటిలోకి స్థిరమైంది రాంబిక సల్ఫర్. దీనిలో S8 అణువులు ఉంటాయి. ఈ అణువులు కిరీటం లేదా పడవ ఆకారంలో ఉంటాయి. సల్ఫర్‌ను ముఖ్యంగా రబ్బరు వల్కనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. రబ్బరుకు సల్ఫర్ కలిపి 100 నుంచి 150oC నది వరకు వేడి చేసినప్పుడు వల్కనైజ్డ్ రబ్బరు ఏర్పడుతుంది. ఇది చాలా గట్టిగా ఉండి, ఎక్కువకాలం మన్నుతుంది. ఉల్లిపాయలను కోసినప్పుడు ఘాటైన వాసన వచ్చి కంటి నుంచి నీరు వస్తుంది. దీనికి కారణం ఉల్లిపాయలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు. పొటాషియం నైట్రేట్, సల్ఫర్, చార్‌కోల్ పొడి మిశ్రమాన్ని గన్‌పౌడర్ అంటారు.

క్లోరిన్
           ఈ వాయువుకు పసుపు ఆకుపచ్చ రంగు ఉంటుంది. మనకు లభించే మూలకాలన్నింటిలో అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీని దీనికి ఉంటుంది. మూలకాల్లో క్లోరిన్ ప్రత్యేకత ఏమిటంటే దానికి నీటిలోని రోగాలను కలిగించే బ్యాక్టీరియా సూక్ష్మక్రిములను చంపే స్వభావం ఉంటుంది. క్లోరిన్ వాయువు సున్నంతో చర్య జరిపితే బ్లీచింగ్ పౌడర్ వస్తుంది. క్లోరిన్ ఘాటైన ప్రమాదకరమైన వాయువు కానీ బ్లీచింగ్ పౌడర్ అలాంటిది కాదు. బ్లీచింగ్ పౌడర్‌ను నీటిలో కరిగిస్తే వెంటనే క్లోరిన్ వాయువు విడుదలవుతుంది. 
           CaOCl + H2 Ca(OH)2 + Cl2 నేటికాలంలో నీటిని బ్యాక్టీరియా రహితం చేయడానికి ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా క్లోరిన్ చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది. 
           యుద్ధాల్లో మూడు వాయువులను ఉపయోగిస్తారు. అవి 1) ఫాస్‌జీన్ 2) బాష్పవాయువు 3) మస్టర్డ్ గ్యాస్. 
           ఈ మూడు వాయువుల తయారీలో క్లోరిన్‌ను ఉపయోగిస్తారు. బాష్పవాయువు గురించి మనకు తెలుసు. దీనిని ఏడిపించే వాయువు అని కూడా అంటారు. దీని ఫార్ములా CCl3NO2. క్లోరోఫాం తీసుకుని దానికి నైట్రిక్ ఆమ్లం కలిపితే బాష్పవాయువు వస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో మస్టర్డ్ గ్యాస్ అనే విషవాయువును ఉపయోగించారు. ఇథిలీన్ వాయువుతో క్లోరిన్ వాయువు చర్య జరిపితే ఈ మస్టర్ గ్యాస్ తయారవుతుంది.

 

ఆర్గాన్ 
           భూమి చుట్టూ ఉన్న వాతావరణంలో అత్యధికంగా ఆర్గాన్ అనే జడవాయువు ఉంటుంది. ఇది రసాయనిక చర్యల్లో పాల్గొనదు. అందుకే దీన్ని మందకొడి వాయువు అంటారు.

            ఫ్లోరోసెంట్ బల్బుల్లో ఆర్గాన్ వాయువు, పాదరస బాష్పం నింపుతారు. ఆర్గాన్ అంటే లాటిన్ భాషలో బద్ధకం అని అర్థం. మరొక జడవాయువు 'క్రిప్ట్టాన్'ను బొగ్గుగనుల్లో పనిచేసే శ్రామికులు వాడే శిరస్త్రాణాల్లో ఉండే బల్బుల్లో నింపుతారు. గ్జీనాన్, రేడాన్ అనే జడవాయువులను టి.వి. పిక్చర్ ట్యూబుల్లో నింపుతారు.
 

పొటాషియం 
           ఇది మొక్కల పెరుగుదలకు కావలసిన క్షారలోహం. ఫొటోఎలక్ట్రిక్ ఘటాల్లో, అధిక ఉష్ణోగ్రతలను కొలిచే థర్మామీటర్లలో దీనిని ఉపయోగిస్తారు.

 

కాల్షియం 
         మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లవణం కాల్షియం. ఎముకలు, దంతాలు దృఢంగా ఉండటానికి ఇది ఎంతో అవసరం. ఎముకల్లో పాస్ఫరస్ తో కలిసి కాల్షియం పాస్ఫైట్ రూపంలో ఉంటుంది. కాల్షీం పాస్ఫేటు ఫార్ములా Ca3(PO)2.
   

        పదార్థం               -            రసాయన నామం          -         ఉపయోగం 
    * సున్నపురాయి        -        కాల్షియం కార్బొనేట్             -         సిమెంటు తయారీ
    * పొడిసున్నం           -       కాల్షియం ఆక్సైడ్                  -         నిర్జలీకరణి, క్రిమి సంహారిణి 
    * తడిసున్నం           -       కాల్షియం హైడ్రాక్సైడ్           -         ఇళ్లకు వెల్లవేయడం
    * దాహక సోడా          -       సోడియం హైడ్రాక్సైడ్           -         కాగితం, కృత్రిమ సిల్కు తయారీ 
    * బట్టల సోడా          -      సోడియం కార్బోనేట్                -         గాజు, సబ్బుల పరిశ్రమ
    * బేకింగ్ సోడా         -       సోడియం బైకార్బోనేట్            -         రొట్టెల పరిశ్రమ
    * జిప్సం                 -       కాల్షియం సల్ఫేట్                   -         సిమెంటు తయారీ
    * హైపో                   -       సోడియం థయోసల్ఫేట్         -         ఫొటోగ్రఫీలో స్థిరీకరణి
   * మార్ష్ వాయువు     -                  మీథేన్                         -         ఇంధనం

 

దుస్తులపై మరకలను తొలగించే రసాయనాలు

మరక రకం             -                 ఉపయోగించే రసాయనం
* రక్తం                      -          పిండి, బొరాక్స్ పౌడరు, అమ్మోనియా ద్రవం
* సిరా                      -          హైపో, క్లోరిన్, నీరు, టార్టారిక్ ఆమ్లం, సోడియం మెటా బైసల్ఫేట్, సోడియం సల్ఫేట్
* కాఫీ, టీ                 -          ఉప్పు, నిమ్మరసం, బోరాక్స్, క్లోరిన్ నీరు, సల్ఫర్ డై ఆక్సైడ్
* తుప్పు                  -          నిమ్మరసం, ఆగ్జాలిక్ ఆమ్లం
* గ్రీజ్, నూనె          -          బెంజీన్, పెట్రోల్, కార్బన్ టెట్రాక్లోరైడ్
* తారు                   -          బెంజీన్, కిరోసిన్, పెట్రోల్, కార్బన్ టెట్రాక్లోరైడ్

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌