• facebook
  • whatsapp
  • telegram

హైకోర్ట్ - రాష్ట్ర న్యాయ వ్యవస్థ

* భారతదేశంలో తొలి మహిళా హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీలాసేథ్ - హిమాచల్‌ప్రదేశ్.
*  హైకోర్ట్‌లో ఒక్కరోజు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసింది - బి.పి.ఝా.
*  హైకోర్ట్ తొలి న్యాయమూర్తిగా పనిచేసిన మహిళ - అన్నా చాంది (కేరళ).
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ తొలి ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు.
*  ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేసిన తొలి మహిళా జస్టిస్ న్యాయమూర్తి  - అమరేశ్వరి.
*  భారత రాజ్యాంగంలోని 214 నిబంధన ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక ఉన్నత న్యాయస్థానం ఉంటుంది. దాన్నే హైకోర్ట్ అంటారు
*  మన దేశంలో హైకోర్ట్ చట్టాన్ని 1861లో లార్డ్ కానింగ్ ప్రవేశపెట్టారు. దాని ప్రకారం తొలి హైకోర్ట్‌ను 1862 జులైలో కలకత్తాలో ప్రారంభించారు. 1862, అక్టోబరు 26న బొంబాయి, మద్రాసులో హైకోర్ట్‌లను ప్రారంభించారు.
*  రాజ్యాంగంలోని VI భాగంలో ఉన్న 214 నిబంధన నుంచి 237 నిబంధన వరకు, హైకోర్ట్ నిర్మాణం, అధికారాలు, అధికార పరిధి మొదలైనవి వివరించారు.
*  పార్లమెంట్ ఒక చట్టం ద్వారా ఒక రాష్ట్రానికి లేదా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కలిపి ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేయవచ్చని 1956లో 7వ రాజ్యాంగ సవరణ ద్వారా నిర్ణయించారు. (ఆర్టికల్ 231) ఈశాన్య రాష్ట్రాలైన అసోం, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరాం, నాగాలాండ్ ఈ నాలుగింటికి కలిపి గౌహతిలో ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* 2013లో ఏర్పడిన మణిపూర్, మేఘాలయ, త్రిపుర హైకోర్ట్‌లతో కలిపి ప్రస్తుతం దేశంలో 24 హైకోర్ట్‌లున్నాయి. 1966లో కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీలో హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు.
* ఆంధ్ర రాష్ట్రంలో హైకోర్ట్‌ను 1953లో ఒక ప్రధాన న్యాయమూర్తి, 11 మంది ఇతర న్యాయమూర్తులతో గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రస్తుతం ఒక ప్రధాన న్యాయమూర్తి, 34 మంది ఇతర న్యాయమూర్తులతో హైదరాబాద్‌లో పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్ర - తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్ట్ 10 సంవత్సరాలు హైదరాబాద్‌లో ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం నూతన హైకోర్ట్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు.
* రాజ్యాంగ నిబంధన 216 ప్రకారం హైకోర్ట్‌లో ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులుంటారు. న్యాయమూర్తుల సంఖ్య రాష్ట్ర అవసరాలను బట్టి ఉంటుంది. ఎక్కువ మంది న్యాయమూర్తులు అలహాబాద్ హైకోర్టులో ఉన్నారు. ఉత్తర్ ప్రదేశ్ (1 + 57). అతి తక్కువ మంది న్యాయమూర్తులున్న హైకోర్ట్‌లు మేఘాలయ, మణిపూర్, త్రిపుర (1 + 2).
* నిబంధన 217 ప్రకారం హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి, ఇతర న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమిస్తారు. హైకోర్ట్ న్యాయమూర్తిగా ఎంపిక కావాలంటే భారత పౌరుడై ఉండాలి, కేంద్ర, రాష్ట్ర న్యాయ సర్వీసుల్లో 10 సంవత్సరాలు న్యాయాధికారిగా, ఏదైనా హైకోర్టులో న్యాయవాదిగా కనీసం పదేళ్ల అనుభవం ఉండాలి.
* హైకోర్ట్ న్యాయమూర్తులు 62 సంవత్సరాలు వచ్చేంతవరకు పదవిలో కొనసాగవచ్చు. వయో పరిమితిని 65 సంవత్సరాలకు పెంచేందుకు ఉద్దేశించిన 114వ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందలేదు.
* రాజ్యాంగం 3వ షెడ్యూల్‌లో హైకోర్ట్ న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం గురించి వివరించారు. 219 నిబంధన ప్రకారం గవర్నర్ లేదా అతడి ప్రతినిధి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు.
* హైకోర్ట్ న్యాయమూర్తుల వేతనాలను నిబంధన 221 ప్రకారం పార్లమెంట్ నిర్ణయిస్తుంది. వేతనాలను రాష్ట్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* రాజ్యాంగ నిబంధన 222 ప్రకారం హైకోర్ట్ న్యాయమూర్తులను ఒక కోర్ట్ నుంచి వేరొక కోర్ట్‌కు బదిలీచేయవచ్చు.
* ఏదైనా హైకోర్ట్ న్యాయమూర్తులు తాత్కాలికంగా విధులను నిర్వర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నిబంధన 223 ప్రకారం తాత్కాలిక న్యాయమూర్తులను రాష్ట్రపతి నియమించవచ్చు. వీరు 65 సంవత్సరాల వయోపరిమితి నిండిన తర్వాత పదవిలో కొనసాగడానికి వీలులేదు.
* ఏదైనా హైకోర్ట్‌లో పనిభారం ఎక్కువగా ఉన్నప్పుడు నిబంధన 224 ప్రకారం రాష్ట్రపతి అదనపు తాత్కాలిక న్యాయమూర్తులను నియమించవచ్చు. వీరి పదవీ కాలం 2 సంవత్సరాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్  ప్రధాన న్యాయమూర్తి టి. బి. రాధాకృష్ణన్.
* అవినీతి, అధికార దుర్వినియోగం, అసమర్థత, ఆరోపణలున్న న్యాయమూర్తులను సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించవచ్చు.

 

అభిశంసన ఎదుర్కొన్న హైకోర్ట్ న్యాయమూర్తులు

* 2010లో కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి షమిత్ ముఖర్జీని పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా తొలగించారు.
* 2011, ఆగస్టు 18న రాజ్యసభ కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సౌమిత్ర సేన్‌పై అభిశంసన తీర్మానాన్ని ఆమోదించింది. లోక్‌సభలో చర్చకు రాకముందే సెప్టెంబరు 1న ఆయన రాజీనామా చేశారు.
* తమిళనాడు హైకోర్ట్ న్యాయమూర్తి పి.డి. దినకరన్‌పై 2009లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆరోపణలు నిజమని కమిటీ నిర్ధారించడంతో 2011, జులై 29న ఆయన రాజీనామా చేశారు.
* 2016 - 17లో దళితుడైన సుంకు రామకృష్ణను హింసించారనే ఆరోపణతో ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తి సి.వి. నాగార్జున రెడ్డిపై అభిశంసనకు ప్రయత్నించి విరమించుకున్నారు.
* సుప్రీంకోర్ట్ సమన్లు ధిక్కరించినందుకు కలకత్తా హైకోర్ట్ న్యాయమూర్తి సి.ఎస్. కర్ణన్‌పై నిషేధాన్ని విధించారు.

 

ఇతర అంశాలు

* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తుల మాదిరిగా హైకోర్ట్ న్యాయమూర్తులు కూడా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి కొన్ని రక్షణలను కల్పించారు. అభిశంసన తీర్మాన చర్చ సమయంలో తప్ప వీరి ప్రవర్తనపై చర్చించకూడదు. పదవీ విరమణ తర్వాత సుప్రీంకోర్ట్‌లో, పనిచేసిన హైకోర్ట్‌లో కాకుండా ఇతర హైకోర్ట్‌లలో వాదించవచ్చు.
* పదవీకాలంలో జీతభత్యాలు తగ్గించకూడదు.
* హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీంకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని, ఆ రాష్ట్ర గవర్నర్‌ను సంప్రదిస్తారు. ఇతర న్యాయమూర్తుల నియామక సమయంలో హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిని సంప్రదిస్తారు.
* ప్రధాన న్యాయమూర్తికి నెలకు రూ.2,50,000 ఇతర న్యాయమూర్తులకు రూ.2,25,000 చెల్లిస్తారు.

 

అధికారాలు - విధులు

* ప్రాథమిక హక్కులకు సంబంధించిన అన్ని వివాదాలు హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి. ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల వివాదాలు, హిందూ వివాహం, విడాకులు, ఆస్తికి సంబంధించిన వివాదాలు కూడా హైకోర్ట్ పరిధిలోకి వస్తాయి.
* జిల్లా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులపై వచ్చిన అప్పీళ్లను హైకోర్ట్ విచారిస్తుంది. సివిల్ వివాదాల్లో ఆస్తి విలువ ఎక్కువ ఉంటే హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.
* దిగువ స్థాయి కోర్ట్ ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా జిల్లా కోర్ట్ తీర్పు ఇచ్చినప్పుడు, హైకోర్ట్‌లో రెండో అప్పీలు చేసుకోవచ్చు. రెండో అప్పీలు విషయంలో కేవలం చట్టానికి సంబంధించిన అంశాలనే పరిశీలిస్తారు.
క్రిమినల్ కేసుల విషయంలో (7 సంవత్సరాలకు మించి శిక్ష పడినట్లయితే) సెషన్స్ కోర్ట్ తీర్పుపై హైకోర్ట్‌కు అప్పీలు చేసుకోవచ్చు.

లోక్ అదాలత్ (ప్రజా న్యాయస్థానం)

     కొన్ని కారణాల వల్ల న్యాయస్థానాల్లో కేసుల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంతో సత్వర పరిష్కారానికి, శాశ్వత ప్రాతిపదికన లోక్ అదాలత్‌లకు వీలుకల్పించే లీగల్ సర్వీసెస్ ఆర్బిట్రేషన్ చట్టాన్ని 2002లో రూపొందించారు. సులభంగా పరిష్కరించదగిన కొన్ని రకాల కేసులను పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడానికి చట్టబద్ధమైన ప్రతిపత్తిని కల్పిస్తూ 'లోక్ అదాలత్' పేరుతో ప్రజా న్యాయస్థానాల వ్యవస్థను ఏర్పాటుచేశారు.
* ఈ వ్యవస్థ పేదలకు ఉచితంగా న్యాయం అందించడానికి కూడా కృషిచేస్తుంది. మన రాష్ట్రంలో సుమారు 70 లోక్ అదాలత్‌లు పనిచేస్తున్నాయి.
సాధారణ న్యాయస్థానాల్లో పనిచేస్తున్న న్యాయ మూర్తులు లోక్ అదాలత్‌లో న్యాయమూర్తులుగా వ్యవహరిస్తారు. ప్రజలకు సత్వరమే, సంతృప్తికరమైన న్యాయాన్ని అందించడమే వీటి ముఖ్య ఉద్దేశం.
* మోటారు వాహనాల వివాదాలు, ఇన్సూరెన్స్ క్లైమ్‌లు మొదలైన విషయాల్లో లోక్ అదాలత్ తీర్పుతో సంతృప్తి చెందనివారు సాధారణ న్యాయస్థానాలకు వెళ్లవచ్చు.
* వినియోగదారుల ఫోరాలు 1986లో వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టాన్ని చేశాయి. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ఈ ఫోరంలను ఏర్పాటు చేశారు.
* ఇవి మూడు స్థాయుల్లో పనిచేస్తాయి. 20 లక్షల రూపాయల విలువ ఉన్న కేసులు జిల్లా స్థాయిలో జిల్లా ఫోరంల పరిధిలోకి వస్తాయి. 20 లక్షలు దాటిన, కోటి రూపాయల్లోపు రాష్ట్ర ఫోరంల పరిధిలోకి వస్తాయి. కోటి రూపాయల విలువ దాటిన కేసులను జాతీయ స్థాయుల్లో ఉన్న ఫోరాలు పరిష్కరిస్తాయి.
* వినియోగదారులు రూ.100 ఫీజు చెల్లించి ఫిర్యాదు చేయవచ్చు. సాధారణ న్యాయస్థానాల మాదిరిగా న్యాయ ప్రక్రియలు ఉంటాయి.
* 1987లో కుటుంబంలో ఏర్పడిన వివాదాల పరిష్కారానికి దేశంలోనే తొలిసారిగా అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కుటుంబ కోర్టులను ఏర్పాటు చేశారు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌