• facebook
  • whatsapp
  • telegram

లోక్‌సభ - రాజ్యసభ - సభాధ్యక్షులు

* స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి ఏ పార్టీ తరపున లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికైనా ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి, తటస్థ వ్యక్తిగా వ్యవహరించడం సంప్రదాయం.
* ఈ సత్సంప్రదాయాన్ని పాటించిన ఘనత నీలం సంజీవరెడ్డికే దక్కుతుంది. ఆయన తర్వాత మరెవరూ దీన్ని పాటించలేదు.
* పార్లమెంటు ముఖ్యవిధి శాసన నిర్మాణం.
* శాసన నిర్మాణంతోపాటు, పాలక వర్గంపై అజమాయిషీ లాంటి మరికొన్ని విధులు కూడా పార్లమెంటు నిర్వహిస్తుంది.
* పార్లమెంటు ఉభయసభలు ఒక ప్రత్యేక ప్రక్రియ (శాసన నిర్మాణ ప్రక్రియ) ద్వారా సభా సమావేశాల్లో అనేక విధాలుగా చర్చించి శాసనాలను తయారుచేస్తాయి.
* సభా సమావేశాల్లో అనేక రకాల తీర్మానాలు ప్రశ్నలు మొదలైన వాటి ద్వారా పాలక వర్గంపై అజమాయిషీ చేస్తూ పాలకవర్గం నియంతృత్వ పోకడలను నివారిస్తుంది.
* పార్లమెంటు ఉభయ సభలు తమ విధులను 'సభా సమావేశాల' ద్వారా నిర్వహిస్తాయి.
* సభా సమావేశాల నిర్వహణకు, సభా సమావేశాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి సభాధ్యక్షులు ఉంటారు.
* లోక్‌సభ అధ్యక్షుడిని 'స్పీకర్' అంటారు.
* రాజ్యసభకు ఉపరాష్ట్రపతి అధ్యక్షత వహిస్తారు. రాజ్యసభ అధ్యక్షుడిని ఛైర్మన్ అని వ్యవహరిస్తారు.

 

లోక్‌సభ స్పీకర్
    భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం, శాసనసభ కార్యకలాపాల నిర్వహణకు సర్ ఫ్రెడరిక్‌వైట్‌ను అధ్యక్షుడిగా 1921లో గవర్నర్ జనరల్ నియమించారు.
* 1947 వరకు సభాధ్యక్షుడు అని వ్యవహరించేవారు.
* 1950 భారత రాజ్యాంగ చట్టం ప్రకారం ఈ పదవికి 'స్పీకర్' అని నామకరణం చేశారు.
* మొదటి లోక్‌సభ స్పీకర్ జి.వి. మౌలాంకర్.
* రాజ్యాంగ నిబంధన 93 ప్రకారం లోక్‌సభ కార్యక్రమాల నిర్వహణకు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులను  ఏర్పాటు చేశారు.
* లోక్‌సభ ఎన్నికల అనంతరం మొదటి సమావేశంలోనే సభ్యుల్లో ఒకరిని స్పీకర్‌గా వేరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.
* లోక్‌సభ గడువు ఉన్నంత వరకు (అయిదేళ్లు) అతడు పదవిలో కొనసాగుతాడు. గడువుకు ముందే లోక్‌సభ రద్దయితే కొత్త స్పీకర్ ఎన్నికయ్యేంతవరకు అతడు పదవిలో కొనసాగుతాడు.
* నిబంధన 94 ప్రకారం స్పీకర్‌ను ముందుగా పదవి నుంచి తొలగించాలంటే 14 రోజుల వ్యవధితో ఒక నోటీసు ఇచ్చి, లోక్‌సభలో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.
* మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువమంది తీర్మానాన్ని ఆమోదిస్తే స్పీకర్‌ను పదవి నుంచి తొలగిస్తారు.
* తీర్మానాన్ని సభలో చర్చించినప్పుడు అతడు సభాధ్యక్షుడిగా ఉండకూడదు.
స్పీకర్ పదవి చాలా గౌరవప్రదమైంది.
ఇంతవరకు ఎవరినీ అభిశంసన తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా పదవి నుంచి తొలగించలేదు.
* 1954లో జి.వి. మావలంకర్‌పై, 1966లో సర్దార్ హుకుంసింగ్‌పై అభిశంసన తీర్మానాలను ప్రవేశపెట్టారు. కానీ తర్వాత ఉపసంహరించుకున్నారు.
* వేతనం: స్పీకర్‌కు నెలకు రూ.1,40,000 గౌరవ వేతనంతోపాటు ఉచిత ప్రయాణ సౌకర్యాలు, టెలిఫోన్, వైద్య సదుపాయాలు, ఉచిత నివాస గృహం మొదలైన సౌకర్యాలు కల్పిస్తారు.
* స్పీకర్ వేతనాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు ప్రత్యేక సచివాలయం, సిబ్బంది ఉంటారు.
* Rules of Procedure and Conduct of Business in Parliment Act 1950 - 51 - 19 శీర్షికలో స్పీకర్ అధికారాలు, విధులను వివరించారు.

 

సభా కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి:
* లోక్‌సభ సమావేశాలకు అధ్యక్షత వహించి సభా కార్యక్రమాలు సక్రమంగా నిర్వహించడం.
* సభా నాయకుడిని (ప్రధాని) సంప్రదించి, సభ్యుల ప్రసంగాలకు సమయాన్ని కేటాయించడం.
* సమావేశాల్లో వివిధ తీర్మానాలకు, వాటిపై చర్చకు, బిల్లుల పరిశీలనకు కార్యక్రమాన్ని నిర్ణయించి, అమలు చేయడం.
* సభా నియమాలకు సరైన అర్థ వివరణ చేయడం స్పీకర్ బాధ్యత. స్పీకర్ వివరణ నిర్వివాదమైందని సభ్యులు ఆమోదించాలి.
* సభా కార్యక్రమాలు క్రమశిక్షణతో జరిగేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది. క్రమశిక్షణకు భంగం కలిగించే పరిస్థితులను నివారించాలి.
* సభా కార్యక్రమాల నిర్వహణలో గందరగోళ పరిస్థితి ఏర్పడితే కార్యక్రమాలను తాత్కాలికంగా, దీర్ఘకాలికంగా, నిరవధికంగా వాయిదా వేయొచ్చు (ఎడ్జర్న్ చేయడం Sign die).
* హద్దుమీరి క్రమశిక్షణను అతిక్రమించిన సభ్యులను అదుపు చేయాలి. అదుపు చేయడం సాధ్యం కాకపోతే సార్జెంట్ ఇన్ ఆర్మ్ సహాయంతో సభ్యులను బహిష్కరించడం, సస్పెండ్ చేయడం లాంటి చర్యలు తీసుకోవచ్చు.
* సభలో కనీస సభ్యుల హాజరు 'కోరం' లేకపోతే సభను వాయిదా వేయొచ్చు.
* బిల్లుల, తీర్మానాలపై అవసరమైతే ఓటింగ్ జరిపించి ఫలితాలను సభకు తెలపాలి.
* ఓటింగులో స్పీకర్ పాల్గొనరాదు. ఏదైనా అంశంపై సమానమైన ఓట్లు వస్తే స్పీకర్ నిర్ణాయక ఓటు (కాస్టింగ్ ఓటు) వేసి సందిగ్ధ పరిస్థితిని నివారించవచ్చు.
* సభా కార్యక్రమాల్లో సభ్యులందరూ పాల్గొని, మాట్లాడే అవకాశాన్ని నిష్పక్షపాతంగా అందరికీ సమానంగా కల్పించాలి.
* రాజ్యసభ ఆమోదంతో వచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతికి పంపడం.

 

స్పీకర్‌కు ఉన్న పర్యవేక్షణ అధికారాలు:
* వివిధ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటు చేసి, వాటి పనిని పర్యవేక్షించడం.
* సభా వ్యవహారాల కమిటీ, సభా నియమాల కమిటీలకు స్పీకర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
* సభా సంఘాలు సకాలంలో నివేదికలు సమర్పించేలా చూడాల్సిన బాధ్యత స్పీకర్‌ది.
* సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రుల నుంచి సరైన సమాధానాలు రాబట్టాలి. సరైన సమాధానం ఇవ్వని మంత్రిని మందలించవచ్చు.
* సభా హక్కులకు భంగం కలిగించే సభ్యుల, ఇతరులపై తగిన చర్యలు తీసుకునే అధికారం స్పీకర్‌కు ఉంది.
* స్పీకర్ అనుమతి లేనిదే సభ్యులపై ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకోరాదు.
* సభా కార్యక్రమాలను, సభ్యుల ప్రసంగాలను రికార్డు చేయించడం. సభా మర్యాదకు, సంప్రదాయాలకు విరుద్ధమైన వాటిని రికార్డుల నుంచి తొలగించడం మొదలైనవి కూడా స్పీకర్ విధులు.
* స్పీకర్‌కు విధి నిర్వహణలో సహాయపడటానికి లోక్‌సభ సచివాలయం ఉంటుంది. సచివాలయ సిబ్బంది కార్యకలాపాలపై స్పీకర్‌కే నియంత్రణ ఉంటుంది.
* 'ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం' నెపంతో ఏదైనా సమాచారాన్ని సభకు లేదా కమిటీలకు  అందించకపోతే సరైన సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించవచ్చు. బోఫోర్స్, ఫేర్‌ఫాక్స్ విషయాలను దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు.
* లోక్‌సభ సభ్యులు ఎవరైనా రాజీనామా చేస్తే ఆమోదించడం, సభ్యులకు గృహవసతి మొదలైన సౌకర్యాలు సమకూర్చడం స్పీకర్ విధి.
* పార్టీ ఫిరాయింపుల వల్ల లేదా ఏ ఇతర కారణాల వల్ల సభ్యుల అనర్హతలను నిర్ణయించేది స్పీకర్. ఆయన నిర్ణయం తిరుగులేనిది.
* లోక్‌సభకు - రాజ్యసభకు - మంత్రిమండలికి - రాష్ట్రపతికి మధ్య సంధానకర్తగా స్పీకర్ వ్యవహరిస్తారు.
* ఏదైనా బిల్లు విషయంలో ఉభయ సభల మధ్య వివాదం ఏర్పడి ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఏదైనా బిల్లు ఆర్థిక బిల్లా - సాధారణ బిల్లా అని నిర్ణయించే అధికారం స్పీకర్‌కు మాత్రమే ఉంటుంది.
* అఖిల భారత స్పీకర్ల మహాసభకు లోక్‌సభ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు
* బ్రిటన్‌లో ఒకసారి స్పీకర్‌గా ఎన్నికైతే ఇష్టమైనంత కాలం కొనసాగవచ్చు. మన దేశంలో అధికార పార్టీని కాదన్నవారు స్పీకర్‌గా కొనసాగలేరు.
* అధికార పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే ప్రయత్నం చేయడం వల్ల జి.వి. మౌలాంకర్ సర్దార్ హుకుంసింగ్‌లపై అభిశంసన తీర్మానానికి ప్రయత్నించి, దాన్ని ఉపసంహరించుకున్నారు.
* స్పీకర్ ఒక న్యాయస్థానంలో న్యాయనిర్ణేత కాకపోయినా సభా కార్యక్రమాల నిర్వహణ సందర్భాల్లో తీర్మానాలను అనుమతించడం, తోసిపుచ్చడం, సభానియమాలకు అర్థం చెప్పడం లాంటి విషయాల్లో, అతడి నిర్ణయాలు న్యాయనిర్ణయాలతో సమానమైనవి. వాటికి తిరుగులేదు.
* మన దేశంలో అధికార హోదాలో లోక్‌సభ స్పీకర్‌ది 7వ స్థానం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి హోదాతో సమాన గౌరవం ఉంటుంది.
* స్పీకర్ లేని సమయంలో సభకు అధ్యక్షత వహించడానికి డిప్యూటీ స్పీకర్‌గా ఒకరిని ఎన్నుకుంటారు.

 

ఇప్పటి వరకు స్పీకర్లుగా పని చేసిన వ్యక్తులు...
* ఒకటో లోకసభ స్పీకర్ - జి.వి.మౌలాంకర్, అనంతశయన అయ్యంగార్
* రెండో లోక్‌సభ స్పీకర్ - అనంతశయన అయ్యంగార్
* మూడో లోక్‌సభ స్పీకర్ - సర్దార్ హుకుంసింగ్
* నాలుగో లోక్‌సభ స్పీకర్ - నీలం సంజీవరెడ్డి (రాష్ట్రపతిగా పోటీచేయడానికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో గురుదయాళ్‌సింగ్ స్పీకర్ పదవిని చేపట్టారు).
* అయిదో లోక్‌సభ - గురుదయాళ్‌సింగ్ ధిల్లాన్, బలిరామ్‌భగత్.
ఆరో లోక్‌సభ - నీలం సంజీవరెడ్డి (రాష్ట్రపతి పదవికి పోటీ చేయగా కె.ఎస్. హెగ్డే స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు).
* ఏడో లోక్‌సభ స్పీకర్ - బలరాం జక్కర్
* ఎనిమిదో లోక్‌సభ - బలరాం జక్కర్
* తొమ్మిదో లోక్‌సభ - రబీ రే
* పదో లోక్‌సభ - శివరాజ్ పాటిల్
* పదకొండో లోక్‌సభ స్పీకర్ - పి.ఎ. సంగ్మా
* పన్నెండో లోక్‌సభ స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి
* పదమూడో లోక్‌సభ స్పీకర్ - జి.ఎం.సి. బాలయోగి, మనోహర్ గజానన్ జోషి
* పద్నాలుగో లోక్‌సభ స్పీకర్ - సోమనాథ్ ఛటర్జీ
* పదిహేనో లోక్‌సభ స్పీకర్ - మీరాకుమార్ (మొదటి దళిత మహిళా స్పీకర్)
* పదహారో (ప్రస్తుత) లోక్‌సభ స్పీకర్ - సుమిత్రా మహాజన్

 

రాజ్యసభ అధ్యక్షుడు
        లోక్‌సభలో 'స్పీకర్' నిర్వహించే విధులను రాజ్యసభలో 'ఛైర్మన్' హోదాలో ఉపరాష్ట్రపతి నిర్వహిస్తారు. పదవిరీత్యా ఉపరాష్ట్రపతికి రాజ్యసభ ఛైర్మన్ హోదాలో నెలకు రూ.1,40,000 వేతనం, ఇతర సౌకర్యాలు ఉంటాయి. రాజ్యసభ ఛైర్మన్ సభలో సభ్యుడు కాదు. కాబట్టి తీర్మానాలపై ఓటు వేసే అధికారం ఉండదు. కానీ బిల్లుల ఆమోదంపై సమాన ఓట్లు వచ్చినప్పుడు 'కాస్టింగ్ ఓటు' వేసి, ఆమోదింపజేయడమో, తిరస్కరించడమో చేయొచ్చు. రాజ్యసభ ఆమోదించిన బిల్లును లోక్‌సభకు పంపడం, రాజ్యసభ సమావేశాల నిర్వహణకు ప్యానల్ స్పీకర్లను ప్రకటించడం, సభానియమాల ఉల్లంఘన విషయాలు పరిశీలించడం, రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ను నియమించడం మొదలైనవి రాజ్యసభ ఛైర్మన్ విధులు. రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ వర్మ.

Posted Date : 16-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌