• facebook
  • whatsapp
  • telegram

శాతవాహనులు - 1

శాతవాహనుల పరిపాలనా విధానం

రాజు

* శాతవాహనుల కాలంలో చక్రవర్తే సర్వాధికారి.

* ధర్మశాస్త్రాలను అనుసరించి, ప్రజాసంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించేవారు. 

* రాచరికం వంశపారంపర్యంగా ఉండేది. 

* రాజు కుమారుడిని కుమర లేదా యువరాజు అనేవారు. 

* రాజే సర్వసైన్యాధ్యక్షుడు. అన్ని అధికారాలు అతడి చేతిలోనే ఉన్నప్పటికీ నిరంకుశ పాలన సాగించలేదు. 

* యుక్తవయసు నుంచే అన్ని విద్యలు నేర్చుకునేవారు.


పాలకవర్గం

* రాజుకు సలహాలు ఇవ్వడానికి మంత్రిమండలి ఉండేది.

* రాజు కుటుంబానికి చెందిన రాజకుమారులు పలు ప్రాంతాలకు అధిపతులుగా ఉండేవారు. 

* తమ పేర్లతో నాణేలు విడుదల చేసే అధికారం పొందారు. 

* రథిక, భోజక లాంటి జాతులకు చెందిన నాయకులు శాతవాహన సామ్రాజ్యాభివృద్ధికి తోడ్పడ్డారు. 

* వీరి కాలంలో మహాభోజ స్థాయి మహారథి కంటే ఎక్కువ. 

* పశ్చిమ దక్కన్‌లో మహాభోజుడు, దక్షిణ, ఉత్తర కర్ణాటక ప్రాంతాల్లో మహారథికులు ఉండేవారు. వీరి భార్యలు తమ పేర్లకు ముందు భర్త పేరును చేర్చుకునేవారు.

* శాతవాహన పాలనలో మహాసేనాధిపతి, మహాతలవరి అనే పాలకవర్గం ఉండేవి. వీరు కొంత భూభాగానికి గవర్నర్లుగా పనిచేస్తూ పౌర, సైనిక బాధ్యతలు నిర్వహించేవారు. 

* మంత్రివర్గంతో పాటు భాండాగారిక, హెరణిక, ప్రతిహార, లేఖక, నిబంధకార లాంటి ఉద్యోగులు ఉండేవారు. వీరికి జీతాలు చెల్లించేవారు.


రాష్ట్రపాలన

* శాతవాహనులు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని ఆహారాలుగా (రాష్ట్రాలు) విభజించారు. 

* ప్రతి ఆహారంలో ఒక ప్రధాన నగరం (నిగమం), అనేక గ్రామాలు ఉండేవి. 

* రాజ్యాన్ని సామంత రాజ్యాలుగా విభజించి వాటి పాలనకు మహారథి, మహాభోజ అనే అధికారులను నియమించేవారు.

* సామంత రాజ్యాలను జనపదాలు అని పిలిచేవారు. ఈ జనపదాలనే ఆహారాలుగా విభజించారు. 

శాతవాహనుల కాలంలోని గోవర్థనాహార, మమలాహార, సోపారాహార, కోడూరాహార అనే పేర్లున్న ఆహారాలు శాసనాల్లో కనిపిస్తాయి. 

* ఆహారానికి అధిపతిగా అమాత్యుడు (మంత్రి) ఉండేవాడు. 

* అమాత్యులకు వంశపారంపర్య హక్కులు లేవు. వీరిని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చేవారు. 

* సాధారణంగా రాజబంధువులనే అమాత్యులుగా నియమించేవారు.

* వీరి రాజ్యంలో రాజు, మహాబలుడు, సేనాధిపతి అనే మూడంచెల స్థాయుల్లో పరిపాలనా వ్యవస్థ ఉండేది.


గ్రామపాలన

* ప్రతి ఆహారం కొన్ని గ్రామాల సముదాయం.

* పాలనలో చిట్టచివరి పాలనాంశం గ్రామం. 

* గ్రామాధిపతిని గ్రామణి అంటారు. ఇతడికి గ్రామసభలు సలహాలిచ్చేవి. 

భట్టిప్రోలు శాసనంలోని నిగమసభ ప్రస్తావనను బట్టి నగరాల్లో పౌరసభలు పాలన నిర్వహణలో సహాయపడేవని తెలుస్తోంది. 

* ఈ నిగమసభలు పైఠాన్, ధాన్యకటకం, బరుకచ్చ, కళ్యాణి, సోపార లాంటి నగరాల్లో ఉండేవి. 

* ఇందులోని సభ్యులను గహపతులు అనేవారు. 

* ఆంధ్రదేశంలో 30 రక్షణ దుర్గాలున్నట్లు మెగస్తనీస్‌ ఇండికాలో పేర్కొన్నాడు.

* స్థానిక పాలనలో మహాలేఖక, మహాఆర్యక (మత కార్యకలాపాలు) భాండాగారిక (కోశాధికారి), నిబంధాకార (పత్రాలు నమోదు చేసే అధికారి), ప్రతిహార, దూతక (రాజు ఆదేశాలను తీసుకువెళ్లేవారు) లాంటి ఉద్యోగులు తోడ్పడేవారు. 

* గ్రామీణ పాలన గౌల్మికుల చేతిలో ఉండేది. వీరు సైనికాధికారులు. 

* వీరి అధీనంలో 9 రథాలు, 9 ఏనుగులు, 25 గుర్రాలతోపాటు 45 మంది సైనికులు ఉండేవారు.

* వీరు గ్రామంలో శాంతిభద్రతలు నిర్వహించేవారని ఆర్‌.ఎస్‌.శర్మ అభిప్రాయపడ్డారు.


ఆదాయ - వ్యయాలు

* ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం భూమిశిస్తు. 

* రాజుకు ‘రాజకంబేట’ (రాజు భూమి) అనే కొంత పొలం ఉండేది. దీని ఆదాయం రాజుకు చెందుతుంది. 

పండిన పంటలో 1/6 వంతును శిస్తుగా వసూలు చేసేవారు. 

* పంటలో రాజు భాగాన్ని భోగ అంటారు. 

* నాసిక్‌ శాసనాన్ని బట్టి రాజు కొంత భూమికి మాత్రమే అధిపతి.

* రాజు భూమిని దానం చేయాల్సి వచ్చినప్పుడు కొని, దానం చేసేవాడు. 

* భూమిశిస్తుతో పాటు రహదారి సుంకాలు, వృత్తి పన్నులు ఉండేవి.

* పన్నులు ధన, ధాన్య రూపంలో వసూలు చేసేవారు.

* సైన్యపోషణ, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగుల జీతాలు, తదితరాల కోసం ఆదాయాన్ని ఎక్కువగా ఖర్చు చేసేవారు. 

* బ్రాహ్మణులకు, బౌద్ధులకు భూదానాలు చేశారు. 


సైనిక పాలన

* శాతవాహనులు పటిష్ఠవంతమైన సైన్యాన్ని పోషించారు. 

* హాథిగుంఫా శాసనంలో చతురంగ బలాల ప్రస్తావన ఉంది. 

* రాజే సర్వసైన్యాధ్యక్షుడు అయినప్పటికీ మహాసేనాధిపతి ఉండేవాడు. యుద్ధ సమయాల్లో రాజు ముందుండి సైన్యాన్ని నడిపేవాడు.

* శాసనాల్లో కటకవారం (సైన్య శిబిరం), స్కంధవారం (తాత్కాలిక శిబిరం) అనే పదాలు కనిపిస్తాయి. 

* యుద్ధ సమయాల్లో సాధారణ ప్రజలను హింసించేవారు కాదు. కానీ కొన్ని సందర్భాల్లో విజేతలు క్రూరంగా వ్యవహరించారు. ఉదా. కళింగ ఖారవేలుడు పిథుండ నగరాన్ని గాడిదలతో దున్నించి ధ్వంసం చేశాడు. 

* గౌతమీపుత్ర శాతకర్ణిని క్షహారాటవంశం నిరవశేషకర (క్షహరాట వంశాన్ని నిర్మూలించినవాడు) అని చరిత్రకారులు వర్ణించారు.


సాంఘిక పరిస్థితులు

* శాతవాహనుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. వీరు వర్ణాశ్రమ ధర్మాలను పాటించేవారు. 

* ప్రజలు తమ వృత్తులను బట్టి కులాలు, ఉపకులాలుగా విడిపోయారు. 

* శకులను క్షత్రియులుగా హిందూ సమాజంలో కలుపుకోవడంతో శకులకు, శాతవాహనులకు మధ్య వివాహ సంబంధాలు సాధ్యమయ్యాయి.

* జైన, బౌద్ధ మతాల ప్రభావం కారణంగా వర్ణాశ్రమ ధర్మాలు సులభతరమయ్యాయి.

* వ్యాపారులు, చేతి వృత్తుల వారు బౌద్ధ మత వ్యాప్తి కోసం ధన సహాయం చేశారు. 

* రాజులు తమ పేర్లకు ముందు తమ తల్లి పేరును (గౌతమీపుత్ర, వాశిష్టీపుత్ర) పెట్టుకోవడం నాటి సమాజంలో తల్లికి ఉన్న స్థానాన్ని సూచిస్తోంది.

* శాతవాహన రాజులు స్వయంగా మత సంబంధమైన దానాలు చేశారు. వీరిలో కొందరు రాజప్రతినిధులుగా వ్యవహరించారు. 

* సమాజంలో బహుభార్యత్వం ఉండేది. స్త్రీలకు ఉన్నత స్థానం కల్పించారు. 

* అమరావతి శిల్పాన్ని బట్టి స్త్రీ, పురుషులు ఇరువురూ అలంకరించుకునేవారని తెలుస్తోంది.

* కనీస వస్త్రధారణ చేసేవారు. సుఖనాగరిక జీవితం గడిపేవారు. 

* వితంతు వివాహాలు లేవు. సంగీతం, నృత్యం ప్రధాన వినోదాలు.

* ఈ యుగం నాటి స్త్రీలు తమ భర్త పదవుల పేర్లను తమ పేర్లతో కలిపి పెట్టుకునేవారు. 

* మహాసేనాధిపత్ని, మహాభోజకి, మహారథిణి లాంటి పేర్లు శాసనాల్లో కనిపిస్తాయి. 

* నగర జీవనం విలాసంగా, గ్రామ జీవనం నిరాడంబరంగా ఉండేది. 

* వివాహ వ్యవస్థకు ప్రాధాన్యం ఎక్కువ. సతీసహగమన ఆచారం ఉండేది. 

* స్త్రీకి సంబంధించిన వివిధ ఆచారాలు గాథాసప్తశతిలో ఉన్నాయి. 

* వేశ్య వృత్తి గౌరవప్రధానమైనదిగా భావించేవారు. ఆ కాలంనాటి వేశ్యలు పలు కళల్లో నిపుణులని వాత్స్యాయనుడు కామసూత్రాల్లో వివరించాడు. 

* వీరి కాలంలో సంస్కృతం అధికార భాష. 

* యజ్ఞయాగాదుల కారణంగా బ్రాహ్మణుల ప్రాధాన్యం పెరిగింది.


మాదిరి ప్రశ్నలు


1. ఆంధ్రదేశంలో 30 రక్షణ దుర్గాలున్నట్లు తెలుపుతున్న గ్రంథం ఏది?

1) అర్థశాస్త్రం      2) అష్టాధ్యాయి     3) ఇండికా   4) పైవేవీకావు

జ: అర్థశాస్త్రం


2. రెండో పులోమావి ఎవరి కుమారుడు?

1) యజ్ఞశ్రీ శాతకర్ణి      2)గౌతమీపుత్ర శాతకర్ణి    3)  రెండో శాతకర్ణి    4) శ్రీముఖుడు

జ: గౌతమీపుత్ర శాతకర్ణి


3. శాతవాహన రాజుల్లో ‘దక్షిణాపథేశ్వరుడు’ అనే బిరుదాంకితుడు ఎవరు?

1) గౌతమీపుత్ర శాతకర్ణి     2) శివశ్రీ శాతకర్ణి      3) మొదటి శాతకర్ణి     4) రెండో పులోమావి

జ: మొదటి శాతకర్ణి
 


4. కవివత్సలుడు అనే బిరుదు ఉన్న శాతవాహన రాజు?

1)  హాలుడు     2) రెండో శాతకర్ణి     3) గౌతమీపుత్ర శాతకర్ణి     4)  శ్రీముఖుడు

జ: హాలుడు


5. నహపాణుడిని ఓడించిన శాతవాహన రాజు?

1) రెండో శాతకర్ణి    2) మొదటి శాతకర్ణి      3) గౌతమీపుత్ర శాతకర్ణి      4)  శ్రీముఖుడు

జ: గౌతమీపుత్ర శాతకర్ణి


6. శాతవాహన కాలంలో గ్రామాధ్యక్షుడిని ఏమని పిలిచేవారు?

1)  గ్రామణి      2)  నిగమపాలక     3) మహాభోజ     4)  భూపతి

జ: గ్రామణి  


7. ధాన్యకటక మహస్తూపానికి శిలాప్రాకారాన్ని నిర్మించినవారెవరు?

1) శ్రీముఖుడు     2) నాగార్జునుడు     3) రెండో పులోమావి    4) గౌతమీపుత్ర శాతకర్ణి       

జ: నాగార్జునుడు

Posted Date : 20-04-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌