• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర కార్య‌నిర్వాహ‌క శాఖ‌

     మన దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉన్న ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంతో  కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాల నిర్మాణం, అధికారాలను రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం కేంద్రంలో పార్లమెంటరీ విధానాన్ని ఏర్పాటు చేసి, రాష్ట్రాల్లో కూడా అదే విధానాన్ని అమలుచేశారు. కేంద్రంలో రాజ్యాధికారి అయిన రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా, ప్రభుత్వాధికారం ఉన్న ప్రధాని, మంత్రిమండలి వాస్తవ అధికారాలు వినియోగించుకుంటున్నారు.
రాష్ట్రాల్లో రాజ్యాధికారి అయిన గవర్నర్‌కు నామమాత్రపు అధికారాలు ఉంటాయి. వాస్తవ అధికారాలు ముఖ్యమంత్రి, మంత్రిమండలికి ఉంటాయి.
* రాజ్యాంగంలో 6వ భాగంలో రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, శాసనసభ నిర్మాణం, అధికారాలు మొదలైన వాటిని వివరించారు (జమ్మూకశ్మీర్ మినహాయించి).
* ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని నిబంధన 153 సూచిస్తుంది. కానీ 1956లో జరిగిన 7వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఒక వ్యక్తిని రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా నియమించవచ్చు.
* ప్రపంచంలో సమాఖ్య విధానాన్ని అనుసరిస్తోన్న ఎక్కువ దేశాల్లో రాష్ట్ర గవర్నర్లను ప్రజలు ఎన్నుకుంటారు.
ఉదా: యూఎస్ఏ. మన దేశంలో గవర్నర్లను నిబంధన 155 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. కెనడాలో కూడా నామినేషన్ పద్ధతినే అనుసరిస్తున్నారు.
* మన దేశంలో రాష్ట్రాలపై కేంద్రం అజమాయిషీ ఉండాలనీ, గవర్నర్‌ను కూడా ప్రజలే ఎన్నుకుంటే రెండు అధికార కేంద్రాలు (ముఖ్యమంత్రి, గవర్నర్) ఏర్పడతాయనే కొన్ని కారణాల వల్ల గవర్నర్‌ను రాష్ట్రపతి నియమించే పద్ధతిని అనుసరిస్తున్నారు.
* నిబంధన 156 ప్రకారం గవర్నర్ పదవీ కాలం 5 సంవత్సరాలు. రాష్ట్రపతి విశ్వాసమున్నంత వరకూ పదవిలో కొనసాగుతారు. రాష్ట్రపతి గవర్నర్‌ను తొలగించినప్పుడు ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించకూడదని 1983లో సూర్యనారాయణ Vs భారత ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
* గవర్నర్ వేతనాలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం గవర్నర్ నెల వేతనం రూ.3,50,000. ఇతర సౌకర్యాలుంటాయి. గవర్నర్‌కు అధికార నివాసముంటుంది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అధికార నివాసం హైదరాబాద్‌లో ఉంది. చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌లో వేసవి విడిది గృహం కూడా ఉంది.
* ఒక వ్యక్తి రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా ఉంటే ఏ రాష్ట్రం ఎంత వేతనం చెల్లించాలనేది రాష్ట్రపతి నిర్ణయిస్తారు. గవర్నర్ వేతనాన్ని రాష్ట్ర సంఘటిత నిధి నుంచి, పింఛన్‌ను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* గవర్నర్‌గా నియమించడానికి నిబంధన 157 ప్రకారం భారత పౌరుడై ఉండాలి. 35 సంవత్సరాలు నిండి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో సభ్యుడై ఉండకూడదు. ఉంటే నియమించిన తర్వాత రాజీనామా చేయాలి.
* సంప్రదాయం ప్రకారం క్రియాశీల రాజకీయాల్లో పాల్గొంటున్న వ్యక్తిని గవర్నర్‌గా నియమించకూడదు. ఒక రాష్ట్ర గవర్నర్‌ను నియమించేటప్పుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం, రాష్ట్రేతరుడిని గవర్నర్‌గా నియమించడం మంచి సంప్రదాయం.
* రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా పాటించాలి. నియమించే అధికారిని (రాష్ట్రపతి) సంతృప్తి పర్చాలి. దాంతో కొన్ని పరిస్థితుల్లో గవర్నర్ విధి నిర్వహణ క్లిష్టతరమవుతుంది.
* గవర్నర్ పదవి గౌరవప్రదమైంది. గవర్నర్‌ను రాజ్యపాల్ అని కూడా అంటారు. ఈయన రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య కార్యనిర్వాహణాధికారి. గవర్నర్ తన అధికారాలను వినియోగించుకున్నప్పుడు ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహాను పాటించాలి. కాబట్టి గవర్నర్ నామమాత్రపు అధికారి మాత్రమే.
* 'గవర్నర్ పదవి బంగారు పంజరంలో చిలుక లాంటిది' అని సరోజిని నాయుడు వ్యాఖ్యానించారు.

అధికారాలు విధులు
కార్య నిర్వాహణాధికారాలు:

     గవర్నర్ రాష్ట్రంలో పరిపాలన నిర్వహణకు కేంద్రంలో రాష్ట్రపతిలా కొంతమంది ఉన్నతాధికారులను నియమిస్తారు.
* నిబంధన 164 ప్రకారం రాష్ట్ర విధాన సభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమించి అతడి సలహాతో మంత్రిమండలిని నియమిస్తారు.
* చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్ లాంటి కొన్ని రాష్ట్రాల్లో గిరిజన సంక్షేమ శాఖా మంత్రులను నియమించే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంటుంది.
* నిబంధన 165 ప్రకారం రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌ను, నిబంధన 233 ప్రకారం జిల్లా కోర్ట్ న్యామూర్తులను, నిబంధన 233 (I), 243 (Y) ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నిబంధన 243 (K), 243 (2A), ప్రకారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు.
* రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు గవర్నర్ ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు. వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. పై నియామకాలన్నీ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకే చేయాలి.

శాసన నిర్మాణాధికారాలు
రాష్ట్రపతి కేంద్ర పార్లమెంట్‌లో సభ్యుడు కాకపోయినా, అంతర్భాగం. అలాగే గవర్నర్ రాష్ట్ర శాసనసభలో సభ్యుడు కాకపోయినా శాసన నిర్మాణ శాఖలో అంతర్భాగం.

* రాష్ట్ర విధానసభ, విధాన పరిషత్ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదంతో శాసనాలు అవుతాయి (నిబంధన 200).
* గవర్నర్ తిరస్కరిస్తే ఆ బిల్లులు రద్దవుతాయి. దీన్నే 'నిరపేక్ష వీటో' అంటారు. ఉభయ సభలు ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా పునఃపరిశీలనకు పంపవచ్చు. Suspensive veto అంటారు. బిల్లు తిరిగి యథాతథంగా వస్తే తప్పనిసరిగా ఆమోదించాలి. ఆమోదించకుండా, తిరస్కరించకుండా, పునఃపరిశీలనకు పంపకుండా బిల్లును తన వద్దే ఉంచుకునే 'Pocket Veto' అధికారం గవర్నర్‌కు లేదు.
* నిబంధన 201 ప్రకారం గవర్నర్ తన వద్దకు వచ్చిన బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు. రాష్ట్రపతి ఆ బిల్లును ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు లేదా పునః పరిశీలనకు రాష్ట్ర శాసనసభకు పంపవచ్చు. బిల్లు యథాతథంగా తిరిగి వస్తే తప్పనిసరిగా ఆమోదించాలని లేదు. కానీ 'Pocket Veto' వినియోగించి రాష్ట్రపతి తన వద్ద ఉంచుకోవచ్చు. నిబంధన 143 ప్రకారం ఆ బిల్లుపై సుప్రీంకోర్టు  సలహా కోరవచ్చు.
* రాష్ట్ర గవర్నర్ నిబంధన 331 ప్రకారం రాష్ట్ర విధానసభకు ఒక ఆంగ్లో ఇండియన్‌ను, నిబంధన 171 ప్రకారం విధానసభకు (ఉంటే) 1/6వ వంతు సభ్యులను నియమిస్తారు. నిబంధన 332 ప్రకారం గవర్నర్ విధానసభలో కొన్ని స్థానాలను షెడ్యూల్డ్ కులాలకు, షెడ్యూల్డ్ తెగలకు కేటాయిస్తారు.
* నిబంధన 174 ప్రకారం రాష్ట్ర గవర్నర్ శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయడం, వాయిదా వేయడం చేయవచ్చు.
* నిబంధన 175 ప్రకారం శాసనసభను ఉద్దేశించి ప్రసంగించవచ్చు.
* నిబంధన 176 ప్రకారం గవర్నర్ శాసనసభకు ప్రత్యేక సందేశాలు పంపవచ్చు.
* నిబంధన 213 ప్రకారం శాసనసభ సమావేశంలో లేనప్పుడు 'ఆర్డినెన్స్‌లు' జారీ చేయవచ్చు.
* విధానసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు ఒకేసారి ఖాళీ ఏర్పడితే సభా కార్యక్రమాల నిర్వహణకు నిబంధన 180 ప్రకారం గవర్నర్ ఒక వ్యక్తిని నియమించవచ్చు.
* పార్లమెంట్ ఉభయ సభలకు ఏదైనా బిల్లు విషయంలో భేదం ఏర్పడితే, అలాంటి పరిస్థితిని అధిగమించడానికి రాష్ట్రపతి నిబంధన 108 ప్రకారం ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయవచ్చు. కానీ రాష్ట్ర గవర్నర్‌కు ఆ అధికారం లేదు.

ఆర్థిక అధికారాలు
రాజ్యాంగ నిబంధన 202 ప్రకారం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే బాధ్యత గవర్నర్‌ది.

* నిబంధన 199 ప్రకారం ఆర్థిక బిల్లును విధానసభలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ పూర్వానుమతి ఉండాలి.
* నిబంధన 203 ప్రకారం గవర్నర్ అనుమతి లేనిదే ఏ విధమైన కేటాయింపులూ చేయకూడదు.
* బడ్జెట్ సమావేశాల ఆరంభంలో గవర్నర్ శాసనసభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

 

న్యాయాధికారాలు
నిబంధన 161 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు వర్తించే విషయాల్లో న్యాయస్థానాలు విధించిన శిక్షలను తగ్గించవచ్చు, మార్చవచ్చు లేదా రద్దుచేయవచ్చు. మరణశిక్షను రద్దుచేసి క్షమాభిక్ష పెట్టే అధికారం గవర్నర్‌కు లేదు కానీ వాయిదా వేయవచ్చు.

* రాష్ట్రపతి సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలకు కూడా క్షమాబిక్ష పెట్టవచ్చు. రాష్ట్రంలో గవర్నర్‌కు అలాంటి అధికారాలు ఉండవు. ఎందుకంటే రాష్ట్రాలకు సైన్యం ఉండదు.
* నిబంధన 217 ప్రకారం రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను నియమించేటప్పుడు గవర్నర్‌ను సంప్రదించాలి.
* రాష్ట్రపతికి ఉన్న సైనిక, రాయబార, అత్యవసర అధికారాలు గవర్నర్‌కు ఉండవు.

విచక్షణాధికారాలు
రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి, మంత్రిమండలి సలహా మేరకు తన అధికారాలను వినియోగించుకోవాలి. కింద పేర్కొన్న కొన్ని సందర్భాల్లో ముఖ్యమంత్రి, మంత్రి మండలి సలహా లేకుండా తనకు తానే నిర్ణయాలు చేయవచ్చు. వాటినే 'విచక్షణాధికారాలు' అంటారు. అందులో రాజ్యాంగబద్ధమైనవి:

* రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లును గవర్నర్ ఆమోదించకుండా రాష్ట్రపతి ఆమోదానికి పంపవచ్చు.
* రాష్ట్రంలో ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడంలో విఫలమై, రాజ్యాంగ సంక్షోభం ఏర్పడిందని భావించినప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించమని (నిబంధన 356) రాష్ట్రపతికి నివేదిక పంపవచ్చు.
* నిబంధన 371 ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో (నాగాలాండ్, అసోం, మణిపూర్ మొదలైనవి) గవర్నర్‌కు స్వయం నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంది.
* నాగాలాండ్ గవర్నర్‌కు శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి.
* మహారాష్ట్రలో వెనుకబడిన విదర్భ లాంటి ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రత్యేక బోర్డులను  ఏర్పాటు చేసే అధికారం ఆ రాష్ట్ర గవర్నర్‌కు ఉంది.
* గవర్నర్ కొన్ని సందర్భోచితమైన విచక్షణాధికారాలను వినియోగిస్తారు. కొన్ని సందర్భాల్లో అవి వివాదాస్పదం అవుతున్నాయి.
* రాష్ట్రంలో పరిపాలన నిర్వహిస్తోన్న ముఖ్యమంత్రిని, విధానసభలో మెజారిటీ కోల్పోయారనే కారణంగా రద్దుచేసి, వేరే వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి విధానసభలో మెజారిటీ నిరూపించుకోమని కోరవచ్చు.
ఉదా: 1984లో ఎన్.టి. రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి నాదెండ్ల భాస్కరరావును ముఖ్యమంత్రిగా నియమించి, మెజారిటీ నిరూపించుకోమని కోరారు అప్పటి గవర్నర్ రామ్‌లాల్. ఈ చర్య వివాదాస్పదం కావడంతో ఆయన్ను గవర్నర్ పదవి నుంచి 'రీకాల్' చేశారు.
* 1994లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు (పార్టీలో చీలిక కారణంగా) విధాన సభ రద్దుకు సిఫారసు చేస్తే గవర్నర్ కృష్ణకాంత్ తిరస్కరించి, ముఖ్యమంత్రిని మెజారిటీ నిరూపించుకోమని కోరారు.
* విధాన సభలో ఏ పార్టీకీ మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రి నియామకం, మెజారిటీ నిరూపించుకోమని ఆదేశించడం లాంటి గవర్నర్ అధికారాలు వివాదాస్పదం అవుతున్నాయి.
ఉదా: ఇటీవల కర్ణాటకలో జరిగిన సంఘటన. విధానసభలో అత్యధిక స్థానాలున్న పార్టీ నాయకుడు యడ్యూరప్పను గవర్నర్ ముఖ్యమంత్రిగా నియమించి 15 రోజుల్లోపు మెజారిటీని నిరూపించుకోమని కోరారు. ప్రతిపక్షాలు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే, మెజారిటీ నిరూపించుకోవడానికి అంత సమయం అవసరం లేదని కోర్టు ఆ వ్యవధిని రెండు రోజులకు తగ్గించింది.
* నిబంధన 356 ప్రకారం రాష్ట్రపతి పాలన విధించమని, రాష్ట్రపతికి గవర్నర్లు సిఫారసు చేయడం ఇంతవరకు 124 సార్లు (వివిధ రాష్ట్రాల్లో) జరిగింది. 1951లో మొదటిసారిగా పంజాబ్‌లో, 124వ సారి ఇటీవల ఉత్తరాఖండ్‌లో గవర్నర్‌లు రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేశారు. గవర్నర్‌లు ఈ అధికారాలు వినియోగించుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో వివాదాస్పదం అవుతున్నాయి.
* గవర్నర్ సిఫారసు మేరకు రాష్ట్రపతి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే, ఆ కాలంలో రాష్ట్రపతి తరపున రాష్ట్ర పాలనా బాధ్యతలను గవర్నర్ నిర్వర్తిస్తారు.
* గవర్నర్ పదవీకాలం అయిదు సంవత్సరాలు పూర్తికాక ముందే అతడిని తొలగించడానికి మహాభియోగ, అభిశంసన తీర్మానాలేవీ లేవు. పదవీకాలం ముగియక ముందు రాష్ట్రపతి గవర్నర్‌ను 'రీకాల్' చేయవచ్చు. రాష్ట్రపతి చేసిన ఆ చర్యను న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదు.
* అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ జేపీ రాజ్‌ఖోవాను 2016, సెప్టెంబరు 12న రాష్ట్రపతి 'రీకాల్' చేశారు.

* భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ సరోజినీనాయుడు (ఉత్తర్‌ ప్రదేశ్).

* దేశంలో ఎక్కువ కాలం గవర్నర్‌గా పనిచేసింది బి.సి. అలెగ్జాండర్. 1988 - 90 వరకు తమిళనాడుకు, 1993 - 2002 వరకు మహారాష్ట్రకు ఈయన గవర్నర్‌గా పనిచేశారు.
* ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ తొలి గవర్నర్ సి.ఎం. త్రివేది.
* ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా గవర్నర్ శారదా ముఖర్జీ. రెండో మహిళా గవర్నర్ కుముద్‌బెన్ జోషి.
* మన రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి, కె.రోశయ్య తమిళనాడు గవర్నర్లుగా పనిచేశారు.

Posted Date : 14-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌