• facebook
  • whatsapp
  • telegram

ప్రకటనలు - వాదనలు

సూచనలు (ప్ర.1 - 9): కింది ప్రశ్నల్లో ఒక ప్రకటన, దానికి అనుబంధంగా రెండు వాదనలు ఉన్నాయి. వాదనల్లో బలమైన, బలహీనమైన వాటిని గుర్తించి, ఇచ్చిన ఆప్షన్స్‌లో సరైనదాన్ని ఎంచుకోండి.

ఎ) వాదన I మాత్రమే బలమైంది.

బి) వాదన II మాత్రమే బలమైంది.

సి) వాదనలు I, II రెండూ బలమైనవే.

డి) వాదనలు I, II రెండూ బలమైనవి కావు.

ఇ) వాదన I లేదా వాదన II లో ఏదో ఒకటి మాత్రమే బలమైంది.


1. ప్రకటన: భారతదేశంలో నిరక్షరాస్యుల ఓటు హక్కును తొలగించాలి.

వాదనలు: I. అవును, వారు త్వరగా ప్రలోభాలకులోనై తప్పు దారిలో డబ్బుకు ఆశపడి ఓటు వేస్తారు.

                II. కాదు, ఓటు వేయడం రాజ్యాంగబద్ధమైన జన్మహక్కు.

సాధన: 18 ఏళ్లు దాటిన ప్రతి వ్యక్తికి ఓటువేసే హక్కు ఉంటుంది. దాన్ని తొలగించడం అసాధ్యం. కాబట్టి వాదన II బలమైంది.

సమాధానం: బి



2. ప్రకటన: భారతదేశంలో రాజకీయ పార్టీలను నిర్మూలించాలి.

వాదన I: అవును, ఇది రాజకీయ నాయకులకు మంచి గుణపాఠం అవుతుంది.

వాదన II: లేదు, అలా చేస్తే ప్రజాస్వామ్యం అంతం అవుతుంది.

సాధన: వాదన I ఊహాజనితం. ఇది బలమైంది కాదు. కానీ వాదన II బలమైంది. భారత్‌ ప్రజాస్వామ్య దేశం. ఒకవేళ రాజకీయ పార్టీలన్నింటినీ నిర్మూలిస్తే ప్రభుత్వాన్ని నడిపేవారు ఉండరు. ఎవరి ఇష్టారాజ్యం వారిదైపోతుంది. ప్రజాస్వామ్యం పూర్తిగా అంతం అవుతుంది. 

సమాధానం: బి



3. ప్రకటన: భారతదేశానికి సైనిక బలం అవసరం లేదు.

వాదన I: కాదు, ప్రపంచంలోని మిగిలిన దేశాలు అహింసా మార్గానికి అనుగుణంగా లేవు.

వాదన II: అవును, అనేకమంది భారతీయులు అహింసా సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు.

సాధన: వాదన I, II రెండూ బలహీనమైనవే.

ప్రతి దేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడానికి రక్షణ వనరులను ఏర్పాటు చేసుకుంటుంది. రక్షణ వ్యవస్థ లేకపోతే పరాయి దేశాలు దాడి చేసి, ఆక్రమించుకుంటాయి. మిగతా దేశాలు అహింసా మార్గాన్ని అనుసరించినా, లేకపోయినా; మనం అహింసా సిద్ధాంతాన్ని నమ్ముకున్నా దేశానికి రక్షణ వ్యవస్థ తప్పనిసరి. 

సమాధానం: డి



4. ప్రకటన: విజ్ఞానశాస్త్రాన్ని విద్యాలయాలు, కళాశాలల్లో నిర్బంధ అంశంగా చేర్చాలి.

వాదన I: అవును, ఎందుకంటే ఇది శాస్త్రీయ యుగం. విద్యార్థులు తప్పనిసరిగా దీని గురించి తెలుసుకోవాలి. 

వాదన II: లేదు, ఎందుకంటే అది దృగ్గోచరం. యాంత్రికంగా సాగిపోతుంది.

సాధన: టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత యుగంలో విజ్ఞానశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం ఆవశ్యకం. వాదన II బలహీనమైంది.

సమాధానం: ఎ


5. ప్రకటన: చలనచిత్రాల ప్రసారాలను నిలిపివేయాలి.

వాదన I: అవును, చలనచిత్రాలను వీక్షించడం వల్ల యువత చెడు ప్రభావాలకు గురవుతుంది.

వాదన II: లేదు, సాధారణ ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు ఇదొక్కటే మార్గం.

సాధన: వాదన I బలహీనమైంది. చలనచిత్రాలను చూడటం వల్ల మనం అనేక విషయాలను నేర్చుకోవచ్చు. నైతిక విలువలు తెలుస్తాయి. వీటిలోని హాస్యభరిత, సరదా సన్నివేశాలను చూసి ఆనందించొచ్చు. ఆ చతురతను సాధారణ జీవనశైలికి జత చేసి ఇతరులను కూడా నవ్వించవచ్చు. కాబట్టి వాదన I బలమైంది కాదు. సాధారణ ప్రజలను, పిల్లలను అనేక మార్గాల ద్వారా చైతన్యవంతులను చేయొచ్చు. కాబట్టి వాదన II కూడా బలమైంది కాదు. 

సమాధానం: డి


6. ప్రవచనం: భారతదేశంలో విలాసవంతమైన వసతి గృహాలను నిషేధించాలి.

వాదన I: అవును, ఇలాంటి ప్రదేశాల్లోనే అంతర్జాతీయ నేరస్తులు వారి కార్యకలాపాలు సాగిస్తారు.

వాదన II: కాదు, సంపన్నులైన విదేశీ పర్యాటకులు నివసించడానికి స్థలం ఉండదు.

సాధన: దేశ ప్రామాణికతకు విలాసవంతమైన వసతి గృహాలు ఒక చిహ్నం. వీటిలో సంపన్నులైన విదేశీ పర్యాటకులు నివసిస్తారు. వాదన I బలమైంది కాదు. ఎందుకంటే అంతర్జాతీయ నేర కార్యకలాపాలను నిలిపివేయడానికి వసతి గృహాలపై నిషేధం ఒక్కటే మార్గం కాదు. 

సమాధానం: బి

7. ప్రవచనం: కత్తి కంటే కలం మిన్న!

వాదనలు: I. అవును, ప్రజల ఆలోచనలను రచనలు ప్రభావితం చేస్తాయి. 

                II. కాదు, భౌతిక శక్తిని ఉపయోగిస్తే సమస్తాన్ని జయించవచ్చు.

సాధన: వాదన I బలమైంది. ఎందుకంటే ఒక పనిని పూర్తి చేయాలంటే శారీరక దృఢత్వం తప్పనిసరి. అయితే ప్రభావవంతమైన రచనలు వ్యక్తి ఆలోచనా సరళిని మలచి, వారి వివేచనాత్మక పనిని ఇష్టానుసారంగా తీర్చిదిద్దగలవు. 

సమాధానం: ఎ



8. ప్రవచనం: ఉన్నత చదువులకు అయ్యే ఖర్చును ఎవరు భరిస్తారో, వారికే దాన్ని పరిమితం చేయాలి.

వాదనలు: I. అవును, ఉన్నత విద్య అనేది చాలా ఖర్చుతో కూడుకుంది. దాన్ని ఉచితంగా ఇవ్వకూడదు.

               II. కాదు, సూక్ష్మబుద్ధి కలిగి, డబ్బు కట్టలేని అనేకమంది విద్యార్థులు ఉన్నారు. వారికి ఉన్నత విద్యను అందించాలి.

సాధన: వాదన II బలమైంది. ఎందుకంటే దేశం అన్ని విధాలా పురోగతి సాధించాలంటే విద్యార్థులు, ప్రతిభావంతులు, తెలివైనవాళ్లు అవసరం. ఉన్నత విద్యను అభ్యసించిన విద్యార్థులకు విషయ పరిజ్ఞానం ఎక్కువగా ఉంటుంది. తద్వారా వారు దేశాభివృద్ధిలో ముందుంటారు.

సమాధానం: బి



9. ప్రవచనం: విద్యార్థులు రాజకీయాల్లో పాల్గొనాలి.

వాదన: I. అవును, అది వారిలో నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుంది.

        II. కాదు, వాళ్లు చక్కగా చదువుకుని మంచి ఉపాధి పొందడం ద్వారా జీవితంలో స్థిరపడాలి.

సాధన: వాదనలు I, II బలమైనవి. ఎందుకంటే కేవలం రాజకీయాల్లో నిమగ్నమై ఉంటే, భవిష్యత్తులో నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవచ్చు. కానీ, వారు చదువుకు దూరం అవుతారు. వాదనలు వేటికవే బలమైనవి.

సమాధానం: సి




సూచనలు (ప్ర.10 - 11): కింది ప్రశ్నల్లో ఒక ప్రవచనంతోపాటు  I, II, III అనే మూడు వాదనలు ఉన్నాయి. వాటిలో బలమైన, బలహీనమైన వాదనలను నిర్ణయించి, సరైన సమాధానాన్ని ఎంచుకోండి.

10. ప్రకటన: భారతదేశంలో విద్యను పూర్తి చేసి, విదేశాల్లో ఉద్యోగం కోసం ప్రయత్నించే వృత్తి నిపుణులపై సంపూర్ణ నిషేధం విధించాలి.

వాదనలు: I. అవును, భారతదేశంలో ప్రస్తుతం ఉన్న సాంకేతిక అభివృద్ధి రేటును కాపాడేందుకు ఇదొక్కటే మార్గం.

                II. కాదు, విదేశాల్లో స్థిరపడ్డ భారతీయులు చాలా పెద్ద మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని పంపిస్తారు. ఇది విదేశీ మారక నిల్వల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది.

                III. కాదు, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయులు పొందిన ప్రాయోగిక జ్ఞానం భారత ఆర్థిక అభివృద్ధికి సహాయం చేస్తుంది.

ఎ) ఏదీ బలమైంది కాదు      బి) అన్నీ బలమైనవి.

సి) I, II మాత్రమే బలమైనవి     డి) III మాత్రమే బలమైంది.

సాధన: ఏ వాదనా దత్త ప్రవచనాన్ని సమర్థించలేదు, వ్యతిరేకించలేదు. 

సమాధానం: ఎ


 

11. ప్రవచనం: పాఠశాలల్లో మతం గురించి బోధించాలి.

వాదనలు: I. కాదు, మనది లౌకిక రాజ్యం.

                II. అవును, మతం గురించి ఆలోచించడం వల్ల విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందుతాయి.

                III. కాదు, 21వ శతాబ్దంలో యువతరం తమ పాత్రను పోషించాలని కోరుకున్నప్పుడు మనం ఇలాంటివి బోధించకూడదు.

ఎ) అన్నీ బలమైనవి.     బి) ఏదీ బలమైంది కాదు.

సి) I మాత్రమే బలమైంది.     డి) II మాత్రమే బలమైంది.

సాధన: మనది లౌకిక రాజ్యం. అయితే దాని అర్థం మతాన్ని, మతపరమైన విలువలను అనుసరించకూడదని కాదు. నిజానికి మతం వల్ల నైతిక విలువలు పెంపొందుతాయి. మతాన్ని బోధించడం వల్ల విద్యార్థుల సమర్థతకు, 21వ శతాబ్దం సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎలాంటి అడ్డంకి ఉండదు.

సమాధానం: డి

Posted Date : 21-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌