• facebook
  • whatsapp
  • telegram

సుస్థిర అభివృద్ధి 

1. 'పర్యావరణాన్ని ఒక్క మానవజాతి మాత్రమే కలుషితం చేస్తోంది. జీవావరణ వ్యవస్థలో మానవజాతి ఒక్కటే సిగ్గుపడాల్సిన జాతి లేదా సిగ్గుపడటానికి కారణం కలిగి ఉంటుంది' అని పేర్కొన్నది?
జ: మార్క్‌ట్వెయిన్

 

2. 'భూగోళంపై లభించే వనరులు జీవకోటి అవసరాలు తీర్చడానికి సరిపోతాయి కానీ ఏ ఒక్కరి దోపిడీకి సరిపోవు' అని పేర్కొన్నది ఎవరు?
జ: మహాత్మాగాంధీ

 

3. 'సహజ వనరులు అనంతంగా లభిస్తాయనే సంప్రదాయవాదం వీడి నేటి మానవుడు భూగోళాన్ని పరిమిత వ్యవస్థగా భావించాలి' అని అభిప్రాయపడింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

4. పర్యావరణం - ఆర్థిక వ్యవస్థల అనుబంధం దృష్ట్యా కిందివాటిలో సరైంది?
ఎ) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాలకు అవసరమైన ఉత్పాదితాలను అందిస్తుంది.
బి) పర్యావరణం ఆర్థిక కార్యకలాపాల వల్ల ఏర్పడే వ్యర్థాలను విలీనం చేసుకుంటుంది.
సి) ఎ, బి                                         
డి) పైవేవీ కాదు
జ: సి (ఎ, బి)

 

5. కిందివాటిలో పర్యావరణ విధి ఏమిటి?
ఎ) సహజ వనరులను అందించడం            బి) సౌలభ్యాలను అందించడం
సి) వ్యర్థాలను విలీనం చేసుకోవడం             డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

6. సైమన్ కుజ్నెట్స్ పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ మధ్య సంబంధాన్ని కింది ఏ అంశాల ద్వారా వివరించాడు?
1. ఆర్థికాభివృద్ధి                 2. పర్యావరణం నాణ్యతా స్థాయి
3. పేదరికం స్థాయి             4. ఆదాయ వ్యత్యాసాల స్థాయి                
5. జనసాంద్రత
జ: 1, 2, 3, 4, 5

 

7. తిరగబడిన 'U' ఆకార రేఖ (Inverted 'U' shaped curve) ద్వారా తలసరి ఆదాయంలో పెరుగుదల, పర్యావరణ క్షయం మధ్య సంబంధాన్ని సూచించింది ఎవరు?
జ: సైమన్ కుజ్నెట్స్

 

8. నిలకడ గల ఆర్థికాభివృద్ధి (Sustainable development) భావన అంటే...?
  ఎ) పర్యావరణం ప్రజల జీవన ప్రమాణాలకు బహిర్గతంగా తోడ్పడటం.
  బి) నేటి ప్రజలు అనుభవిస్తున్న జీవన ప్రమాణాల స్థాయిని ఏ మాత్రం తగ్గకుండా భావితరాలకు అందించడం.
  సి) సహజ వనరులు, మానవ నిర్మిత వనరులతో కూడిన మూలధనం భావితరాలకు అందుబాటులో ఉండటం.
  డి) పైవన్నీ
జ: డి (పైవన్నీ)

 

9. పర్యావరణ పరిరక్షణ ద్వారా నిలకడ గల ఆర్థికాభివృద్ధి సాధించాలంటే వేటికి ప్రాధాన్యం ఇవ్వాలి?
1. వనరుల వాడకం తగ్గించడం (Reduce)
2. వ్యర్థాల నుంచి సాధ్యమైనంత ప్రయోజనం రాబట్టడం (Recover)
3. ప్రయోజనం కోల్పోకుండా తిరిగి ఉపయోగించగల వస్తువుల తయారీ (Recycle)
4. పునఃఉపయోగం, సాధ్యమైనన్నిసార్లు తిరిగి ఉపయోగించడం (Reuse)
జ: 1, 2, 3, 4

 

10. నిలకడ గల ఆర్థికాభివృద్ధి లక్ష్యాలు ఏవి?
1. వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల        2. అభివృద్ధి కొనసాగింపు
3. క్షీణత నియంత్రణ                              4. జీవవైవిధ్య రక్షణ
జ: 1, 2, 3, 4

 

11. హెచ్. డాలీ (1990 లో) కొనసాగించగలిగిన ఆర్థికాభివృద్ధికి తెలియజేసిన నియమాలు ఏవి?
1. పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటుకు (Regeneration rate) మించి ఉపయోగించరాదు.
2. పునరుద్ధరించడానికి వీల్లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేటులో ఉపయోగించకూడదు.
3. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి విసర్జించరాదు.
జ: 1, 2, 3

 

12. ఉష్ణగతిక శాస్త్రం (Thermo Dynamics) మొదటి సూత్రం ఏమని తెలుపుతుంది?
జ: ఇంధనం (శక్తి) పరిమితి స్థిరంగా ఉంటుంది. దాన్ని సృష్టించడం లేదా విధ్వంసం చేయడం సాధ్యం కాదు.

 

13. ఆర్థిక కార్యకలాపాల పరిమాణం పెరిగేకొద్దీ నియమరహితం పెరిగి, ప్రయోజనకరమైన పదార్థాల లభ్యత తగ్గడం ద్వారా నాగరికతలు క్షీణించేలా 'ఎంట్రోపి' సూత్రం (ఉష్ణగతికశాస్త్రం రెండో సూత్రం) శపించిందని పేర్కొన్నది ఎవరు?
జ: జార్జెస్ క్యూ - రోజన్

 

14. గ్రీకు దేశంలో ప్రకృతి వనరులను పునరుద్ధరించగల శక్తి కలిగి, పర్యావరణ సమతూకాన్ని నెలకొల్పే దేవతగా ఎవరిని విశ్వసిస్తారు?
జ: గైయా

 

15. కాలుష్యం ద్వారా కలిగే పర్యావరణ హానిని 'సామాజిక వ్యయం (Social Cost)' అన్నది ఎవరు?
జ: ఎ.సి. పిగూ

 

16. 1914 లోనే 'హరించుకుపోయే వనరుల అభిలషణీయ వినియోగరేటు' అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
జ: ఎల్. గ్రే

 

17. పర్యావరణంపై బ్రండ్‌ట్లాండ్ అధ్యక్షతన 'ప్రపంచ సంఘం (World Commission on Environment and Development)' ఎప్పుడు ఏర్పాటైంది?
జ: 1987

 

18. బ్రండ్‌ట్లాండ్ సంఘం (Brundtland Commission) సమర్పించిన నివేదిక పేరేంటి?
జ: మన ఉమ్మడి భవిష్యత్ (Our Common Future)

 

19. 'భావితరాల ప్రజలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యంతో రాజీపడకుండా, వర్ధమాన తరం తన అభివృద్ధి అవసరాలను తీర్చుకోగలగడమే నిలకడ గల అభివృద్ధి (Sustainable development)' అని నిర్వచించింది?
జ: బ్రండ్‌ట్లాండ్ కమిషన్

 

20. 'ఒక నిర్ణీత కాలంలో ప్రకృతి పర్యావరణ ఆస్తులతోసహా ముత్తాతల నాటి నుంచి లభించిన మొత్తం ఆస్తులను యథాస్థితిలో ఉంచగలిగేదే నిలకడ గల అభివృద్ధి' అని నిర్వచించింది ఎవరు?
జ: జె.టి. విన్‌పెన్ని

 

21. కిందివాటిలో నిలకడ గల అభివృద్ధిలోని అంతర్గత అంశాల్లో లేనిది ఏది?
    ఎ) ఆర్థికాంశాలు                         బి) సాంఘిక అంశాలు
    సి) పర్యావరణ అంశాలు              డి) రాజకీయ అంశాలు
జ: డి (రాజకీయ అంశాలు)

 

22. ఆర్థిక వ్యవస్థలో ఉండే మూలధనాన్ని ఎన్ని రకాలుగా వర్గీకరించవచ్చు?
    1. భౌతిక మూలధనం (KM)       2. మానవ మూలధనం (KH)        3. ప్రకృతి వనరులు (KN)
జ: 1, 2, 3

 

23. కాలక్రమేణా జాతీయ మూలధన నిల్వ తరగకుండా ఉండే నేపథ్యంలో నిలకడ గల అభివృద్ధి సాధ్యమవుతుందనే 'స్థిర మూలధన నిల్వ నియమాన్ని (Constant Capital Stock Rule)' ప్రతిపాదించింది ఎవరు?
జ: పియర్స్

 

24. ఏ నియమాన్ని అతిబలహీన నిలకడ వృద్ధి లేదా సోలో నిలకడ వృద్ధి స్థితి అంటారు?
జ: రెండో నిలకడ గల వృద్ధి నియమం

 

25. బలమైన నిలకడ గల వృద్ధి నియమం ఏది?
జ: నాలుగో నిలకడ గల వృద్ధి నియమం

 

26. బలమైన నిలకడ గల వృద్ధి సాధించడానికి...
జ: ప్రకృతి మూలధనం నిల్వ స్థిరంగా ఉండాలి

 

27. 'జరిగేలా చూడటం (Making it happen)' అనే పరిశోధనా వ్యాసంలో నిలకడ గల అభివృద్ధి కోసం ప్రతిపాదనలు రూపొందించింది ఎవరు?
జ: రాల్ఫ్ రూక్‌వుడ్

 

28. రాల్ఫ్ రూక్‌వుడ్ ప్రతిపాదనలకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది?
ఎ) ప్రకృతి వనరుల దుర్వినియోగాన్ని విడనాడి వాటి పరిమితమైన స్థితిని గౌరవించాలి
బి) పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.
సి) నిలకడ గల అభివృద్ధి నియమాలకు అనుగుణంగా పట్టణ ప్రాంతాల అభివృద్ధికి దీర్ఘకాల ఉద్దేశాలను రూపొందించాలి.
డి) పర్యావరణ సహాయనిధిని ఏర్పాటు చేయాలి.
జ: బి (పర్యావరణానికి హానిచేసే అత్యున్నత ఆచరణలను కనుక్కుని వాటిని ప్రతికృతి (Replication) చేయాలి.)

 

29. అపసరణ నియమం (Law of Divergence) ప్రకారం....
జ: ఒక నిర్దిష్ట ప్రాంతంలో జీవవైవిధ్యం ఎంత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతం అంత ఎక్కువగా సంరక్షించబడుతుంది.

 

30. కాలుష్యం స్థాయిని సాంఘికంగా అభిలషణీయ స్థాయికి నియంత్రించడానికి, కాలుష్యం వల్ల సంఘానికి ఏర్పడుతున్న హానికి సమానంగా పన్నుల విధానాన్ని రూపొందించాలని 'కాలుష్య పన్ను'ను ప్రతిపాదించింది ఎవరు?
జ: పిగూ

 

31. సామాన్యుల దుర్ఘటన (Tragedy of Commons) భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: విలియం ఫోస్టర్ లాయిడ్

 

32. ఎన్విరాన్‌మెంట్ (పర్యావరణం) అనే ఆంగ్ల పదం 'ఎన్విరానర్' అనే ఏ భాషా పదం నుంచి వచ్చింది?
జ:  ఫ్రెంచి        

 

33. ఎన్విరాన్ అనే పదానికి అర్థం...?
జ: చుట్టూ ఉన్న

 

34. 'భూమి అనేది ఒక రోదసి నావలాంటిది. ఇందులో ప్రాణాధారమైన వనరులు పరిమితంగా ఉంటాయి. మానవ జాతి వీటి వినియోగాన్ని బాగా పెంచుకోవడానికి బదులుగా, వీలైనంతవరకు తగ్గించుకుంటే మంచిది' అని హెచ్చరించింది ఎవరు?
జ: కెన్నెత్ బౌల్డింగ్

 

35. 'ఆవరణ వ్యవస్థ (Eco System)' అనే పదాన్ని మొదట ప్రతిపాదించింది?
జ: ఎ.జి. టాన్‌స్లే

 

36. జీవవైవిధ్యం (Bio-Diversity) అనే పదాన్ని తొలిసారి ప్రతిపాదించింది ఎవరు?
జ: వాల్టర్ రోసెన్

 

37. 'సుస్థిరత్వం (Sustainability)' భావనను ప్రవేశపెట్టింది ఎవరు?
జ: ఐరోపా అటవీ అధికారులు
38. కింది అంశాలను జతపరచండి.   
1. ది సైలెంట్ స్ప్రింగ్                          a) రాచెల్ కార్సన్ (1962)
2. ది కాస్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్              b) మిషాన్ (1967)
3. లిమిట్స్ టు గ్రోత్                             c) మెడోస్ (1973)
4. అవర్ కామన్ ఫ్యూచర్                      d) బ్రండ్‌ట్లాండ్ (1987)
జ: 1-a, 2-b, 3-c, 4-d

 

39. కింది ఏ సంవత్సరంలో 'ధరిత్రీ సదస్సు' జరిగింది? 
    ఎ) 1990       బి) 1991       సి) 1992      డి) 1993
జ: సి (1992)

 

40. అమెరికా 'సుస్థిరమైన అభివృద్ధి కోసం విద్యా దశకం'గా ఏ కాలాన్ని ప్రకటించింది?
జ: 2005 - 15

Posted Date : 13-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌