• facebook
  • whatsapp
  • telegram

సింధు నాగరికత

* తొలి భారతీయ, మూలభారతీయ నాగరికతను, సింధు నాగరికత అంటారు.
* సింధు నాగరికతను నిర్మించింది - ద్రావిడులు.
* సింధు నాగరికత కాలం క్రీ.పూ.2500 - క్రీ.పూ.1750.
* 1921 - 22లో తొలిసారిగా సింధు నాగరికత అవశేషాలు వెలుగు చూశాయి.
* 1922లో హరప్పా వద్ద దయారాం సహాని, మొహెంజొదారో వద్ద ఆర్.డి.బెనర్జీ తవ్వకాలు జరిపారు.
* సింధు నాగరికత వెలికితీతకు కారకుడు - సర్ జాన్ మార్షల్.
* హరప్పా, మొహెంజొదారో ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్నాయి.
* హరప్పా రావి నదీతీరంలో పంజాబ్ రాష్ట్రంలోని మౌంట్ గోమరి జిల్లాలో ఉంది.
* మొహెంజొదారో సింధు నది ఒడ్డున సింధు రాష్ట్రంలోని లార్ఖాన జిల్లాలో ఉంది.
* కాళీభంగన్ రాజస్థాన్‌లో ఉంది. ఎ.ఘోష్ ఇక్కడ తవ్వకాలు జరిపారు.
* కాళీభంగన్ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం.
* మొహెంజొదారో అంటే మృతుల దిబ్బ అని అర్థం.
* లోథాల్ గుజరాత్‌లో ఉంది. ఇక్కడ తవ్వకాలు జరిపించింది - ఎస్.ఆర్.రావు.
* సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి పట్టణం - హరప్పా
* హరప్పాలో 6 చిన్న ధాన్యాగారాలు, రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ, కార్మికుల నివాస గృహాలు, ఎక్కాగా పిలిచే ఎడ్లబండి లభించాయి.
* మొహెంజొదారోలో మహాస్నానవాటిక, కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, అతిపెద్ద ధాన్యాగారం లభించాయి.
* సింధు నాగరికత కట్టడాలన్నింటిలోకి పెద్దదైన అనేక స్తంభాలున్న సమావేశపు హాలు బయటపడిన ప్రాంతం - మొహెంజొదారో
* నాగలిచాళ్ల ఆనవాళ్లు, కాలిన మసిగుడ్డ అవశేషాలు లభించిన ప్రాంతం - కాళీభంగన్
* రాతివాడకం కనిపించిన ఏకైక సింధు పట్టణం - ధోలవీర
* గుర్రపు ఎముకల అవశేషాలు లభించిన ప్రాంతం - సుర్కటోడా
* కోటలేని ఏకైక సింధు పట్టణం - చన్హుదారో
* సిరా సీసా (Ink - Well) కనిపించిన పట్టణం - చన్హుదారో
* పూసల పరిశ్రమ ఆనవాళ్లు లభించిన ప్రాంతాలు - లోథాల్, చన్హుదారో
* వరిపంట ఆనవాళ్లు లభించిన పట్టణాలు - రంగపూర్, లోథాల్
* సింధు ప్రజల ప్రధాన ఓడరేవు - లోథాల్
* రక్షణ కుడ్యంగా రాతిగోడ ఉన్న ఏకైక నగరం - సుర్కటోడ
* మధ్య పట్టణం ఉన్న ఏకైక నగరం - ధోలవీర
* సింధు నాగరికత ప్రధానంగా పట్టణ నాగరికత
* సింధు ప్రజల కుటుంబ అధిపతి - తల్లి (మాతృస్వామిక వ్యవస్థ)
* సింధు ప్రజల ప్రధాన వృత్తి - వ్యవసాయం
* ప్రధాన పంటలు - గోధుమ, బార్లీ
* ప్రధాన దైవం - అమ్మతల్లి, ప్రధాన పురుషదైవం - పశుపతి
* ప్రపంచంలో తొలిసారిగా పత్తిని పండించింది - సింధు ప్రజలు
* తొలిసారిగా కాల్చిన ఇటుకలను వాడింది - సింధు ప్రజలు
* ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో ఉండేవి.
* తూర్పు ఎత్తైన ప్రాంతాల్లో ఉండే భవనాలు - ప్రభుత్వ భవనాలు
* పశ్చిమ ఎత్తైన ప్రాంతాల్లో ఉండేవి - కోటలు, దుర్గాలు
* సామాన్యుల  గృహాలు తూర్పు పల్లపు ప్రాంతాల్లో ఉండేవి.
* సింధు పట్టణాల్లో రోడ్ల వెడల్పు (వీధుల వెడల్పు) 3 - 10 మీటర్లు.
* పెద్దవీధులు 34 అడుగుల వెడల్పుతో ఉంటే, చిన్నవీధులు 9 అడుగుల వెడల్పుతో ఉండేవి.
* సింధు ప్రజల లిపి - బొమ్మల లిపి
* సింధు లిపి రాసే విధానం - సర్పలేఖనం
* సింధు లిపిలో మొదటివరుస ఎడమ నుంచి కుడికి, రెండో వరుస కుడి నుంచి ఎడమకు ఉండేది (సర్పలేఖనం).
* సింధు ప్రజలు పూజించిన జంతువు - మూపురం ఉన్న ఎద్దు
* పూజించిన చెట్టు - రావిచెట్టు
* పూజించిన పక్షి - పావురం
* ఎక్కువగా ఉపయోగించిన లోహాలు - రాగి, వెండి
* సింధు ప్రజలకు తెలియని లోహం - ఇనుము
* భారతదేశంలో తొలిసారిగా ఇనుమును ఆర్యులు 1500 BC లో ఉపయోగించారు.
* సింధు ప్రజలకు తెలియని జంతువు - గుర్రం
* గుర్రం ఎముకలుగా భావిస్తున్న ఆనవాళ్లు సుర్కటోడాలో లభించాయి.
* వీరి కాలంనాటి ముద్రికలను బంకమన్ను, దంతం, స్టిటైట్‌రాయితో తయారుచేశారు.
* సింధు ప్రజలు ఎక్కువగా మెసపటోమియా (ఇరాక్)తో విదేశీ వ్యాపారం నిర్వహించారు.
* బంగారాన్ని కోలార్, అనంతపురం నుంచి దిగుమతి చేసుకునేవారు.
* రాగిని రాజస్థాన్, బెలుచిస్థాన్‌ల నుంచి దిగుమతి చేసుకునేవారు.
* వెండిని అఫ్గనిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* తగరాన్ని బిహార్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* పర్షియా (ఇరాన్) నుంచి పచ్చలు దిగుమతి చేసుకునేవారు.
* సింధు, మెసపటోమియా రాజ్యాల మధ్య ప్రధాన వాణిజ్య కేంద్రం - మెలూహ
* సింధు నాగరికత కాలం నాటి ఎద్దుబొమ్మ ముద్రిక గురించి 1875 లోనే వ్యాసం రాసిన చరిత్రకారుడు - అలెగ్జాండర్ కన్నింగ్‌హాం
* సింధు లిపి నుంచే తమిళ భాష పుట్టింది అన్నది - ఫాదర్ హీరాస్
* సింధు లిపి నుంచే బ్రాహ్మీ లిపి పుట్టింది అన్నది - కన్నింగ్ హాం
* ఆర్యుల దండయాత్ర వల్ల సింధు నాగరికత పతనమైందనే సిధ్ధాంతాన్ని ప్రతిపాదించినవారు - వీలర్, గోర్డన్ చైల్డ్
* సింధు నాగరికతపై రోమిలా థాపర్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు:
    1) సింధు నాగరికత మూడు దశలు/అంచెలు ఉన్నాయి.
    2) సింధు ప్రజలకు గుర్రం తెలియదు.
   3) సింధు ప్రజలు వరిని పండించేవారు.
* 'సింధు ప్రజల కాలంలో వరిసాగు లేదు' అన్నది - ఎ.ఎల్. భాషం.
* 'సింధు ప్రజలు యోని - లింగ పూజ చేసేవారు' అన్నది - సర్‌జాన్ మార్షల్.
* సర్ జాన్ మార్షల్ యోని - పూజ సిద్ధాంతాన్ని తిరస్కరించింది - ఎఫ్.డేల్స్.
* భారతదేశంలో అధిక సింధు నాగరికత పట్టణాలు బయటపడిన రాష్ట్రం - గుజరాత్.
* సింధు ముద్రికలపై (270) అధికంగా ముద్రించిన జంతువు - వృషభం.
* కాల్చిన మట్టి బొమ్మలను టెర్రాకోట బొమ్మలుగా పేర్కొంటారు.
* సతీసహగమన ఆచారాన్ని సూచించే ఆనవాళ్లు లభించిన ప్రాంతం లోథాల్.
* టెర్రాకోట బొమ్మలపై కనిపించని జంతువు ఆవు.
* సింధు కాలంనాటి కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి.
* చదరంగం ఆటకు సంబంధించిన ఆనవాళ్లు లభించిన ప్రాంతం - లోథాల్.
* నాటి ప్రధాన రవాణా సాధనం ఎడ్లబండి.
* నేసిన నూలు వస్త్రం ముక్క (మసిబట్ట) లభించిన ప్రాంతం కాళీభంగన్.
* ఇంగ్లిష్ బాండ్‌గా పిలిచే తాపీ పనిని ప్రవేశపెట్టింది సింధు ప్రజలు.
* స్త్రీలు పెదాలకు రంగులు (లిప్‌స్టిక్) వాడేవారని పేర్కొన్న చరిత్రకారుడు - ఆర్.సి.మజుందార్.
* సింధు ప్రజలు లాపిజ్‌లాజులి అనే ప్రత్యేక రాతిని ఉత్తర అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకునేవారు.
* నటరాజ విగ్రహాన్ని పోలిన రాతి విగ్రహం లభించిన ప్రాంతం హరప్పా.
* స్త్రీల మర్మాంగాలను పోలిన రాళ్లు హరప్పా పట్టణంలో లభించాయి.
* ఏనుగును మచ్చిక చేసుకున్నట్లు గుజరాత్ ప్రాంతంలో ఆధారాలు లభించాయి.
* జంతు బలి అవశేషాలు లభించిన ప్రాంతం కాళీభంగన్.
* పులిబొమ్మను పోలిన జంతువు ఉన్న టెర్రాకోట ముద్రిక లభించిన ప్రాంతం బన్వాలి.
* సింధు నాగరికతను నిర్మూలించిన వారు ఆర్యులు.
 

ఆర్య నాగరికత


మలి వేదకాలం క్రీ.పూ. 1000 - 600
* మలి వేదకాలంలో ఆర్యులు గంగా - యమునా అంతర్వేదిలో నివసించేవారు.
* మలివేద ఆర్యుల వలసను బ్రాహ్మణాలు వివరిస్తాయి.
* మలివేద కాలంలో రాజును సామ్రాట్ అని పిలిచేవారు.
* రాజ్యాన్ని మహా జనపథం అనేవారు.
* రాజుకు పాలనలో సహాయపడే ఉద్యోగులను రత్నిన్‌లు అనేవారు.
* పన్ను వసూలు అధికారిని భాగదుషు అనేవారు.
* కోశాధికారిని సంగ్రహితగా పేర్కొనేవారు.
* గణకుడు / గణాంకాధ్యక్షుడిని అక్షవాస అనేవారు (జూద గృహంపై అధిపతి)
* పోలీసు విధులు నిర్వహించే వ్యక్తిని అధికృతగా పేర్కొనేవారు.
* రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయం లాంటి యజ్ఞ యాగాలను మలి వేదకాలంలోనే ప్రారంభించారు.
* మలి వేదకాలంలో ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయంగా మారింది.
* వరి, గోధుమ, బార్లీ, పత్తి లాంటి పంటలను పండించేవారు.
* వడ్రంగం, లోహపు పని, చర్మాలను శుద్ధి చేయడం, నేత, కుండలు చేయడం లాంటి పరిశ్రమలు ప్రారంభమయ్యాయి.
* మలి వేదకాలంలో దంతపు పని (ట్యానింగ్ పరిశ్రమ) లేదు.
* శతమాన, కర్షాపణ (కృష్ణాలు) లాంటి నాణేలు వాడేవారు.
* వర్ణ వ్యవస్థ క్లిష్టమైంది. వృత్తుల ఆధారంగా అనేక కులాలు ఆవిర్భవించాయి.
* వర్ణాశ్రమ ధర్మాలు నాలుగు మలి వేదకాలంలో అభివృద్ధి చెందాయి.
* వర్ణాశ్రమ ధర్మాల గురించి తొలిసారిగా ప్రస్తావించింది ఐతరేయ బ్రాహ్మణం.
* బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం ధర్మాలను ఛాందోగ్యోపనిషత్తు వివరించగా, సన్యాసంతో సహా నాలుగు ఆశ్రమ ధర్మాలను 'జాబాలోపనిషత్తు' వివరించింది.
* గోత్ర వ్యవస్థ మలి వేదకాలంలోనే (అధర్వణ వేదం) ఆవిర్భవించింది.
* స్త్రీ స్థానం దిగజారింది. వంటింటికే పరిమితమైంది. బాల్య వివాహాలు లాంటి సాంఘిక దురాచారాలు అధికమయ్యాయి.
* మలి వేదకాలంలో త్రిమూర్తుల ఆరాధన ప్రధానంగా ఉండేది.
* రుగ్వేదంలోనే 33 మంది దేవుళ్ల ప్రస్తావన కనిపిస్తుంది.
* అగ్ని దేవుడిని రెండో అతి ముఖ్యమైన దేవుడిగా పేర్కొన్నారు. 'అగ్ని'ని దేవతలకు, ప్రజలకు మధ్యవర్తిగా ప్రస్తావించారు.
* సోమ, సుర అనే మత్తు పానీయాలను ఆర్యులు సేవించేవారు.
* సోమను యజ్ఞ యాగాల సమయంలో, సురను అన్నివేళలా సేవించేవారు.
* వస, అధివస అనే దుస్తులను ఆర్యులు ధరించేవారు.
* వేదకాలంలో అతిథిని గోఘన అని పిలిచేవారు.
* ధాన్యాన్ని వృహి అని, ఇనుమును అయస్ అని పిలిచేవారు.
* ఆర్య నాగరికతను దక్షిణా పథంలో విస్తరింపజేసింది అగస్త్యుడు.
* 'యుద్ధం ఎల్లప్పుడూ మానవ హృదయాల్లో ప్రారంభమవుతుంది' అని అధర్వణ వేదం పేర్కొంది.
* మలివేద కాలం నాటికి రాజు అధికారాలు బలపడినట్లు శతపథ బ్రాహ్మణం వివరిస్తుంది.
* రుగ్వేద కాలంలో వర్ణం అంటే వర్గం అని అర్థం. కానీ మలి వేదకాలంలో వర్ణం అంటే కులం అని అర్థం.
* మలివేద కాలం నాటి శూద్రుల ప్రత్యేక దైవంగా పుషాన్‌ను పేర్కొంటారు.
* సీతను నాగలి దేవతగా పేర్కొంటారు.
* 'ఉపనయన' క్రతువు గురించి శతపథ బ్రాహ్మణం వివరించింది.
* హిందూ మతంలో 44 సంస్కారాలు ఉండేవి.
* మలి వేదకాలంలో రాజ్యాలు, భూముల ఆక్రమణల కోసం యుద్ధాలు జరిగేవి.
* ఉపనయన సంస్కారం పొందే అర్హత కలిగిన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలను 'ద్విజులు' అని పిలిచారు.
* వడ్డీ వ్యాపారం గురించి శతపథ బ్రాహ్మణంలో పేర్కొన్నారు.
* విధాత అనేది పురాతమైన గిరిజన/ ఆటవిక జాతుల సభ. మలివేద కాలంలో ఈ సభ అదృశ్యమైంది.

         భారతదేశంలో సింధు నాగరికత అతి ప్రాచీనమైంది. ఇది తొలి కాంస్యయుగానికి చెందినది. క్రీ.పూ.2500 - 1750 కాలంలో ఈ నాగరికత విలసిల్లింది. తొలిసారి 1921 - 22 నాటి తవ్వకాల ద్వారా ప్రపంచానికి పరిచయమైంది. మొహంజొదారో అనే మృతుల దిబ్బలో నేటికీ సజీవంగా నిలిచిన సంస్కృతి ఆధారాలు లభించాయి. ప్రస్తుత మన నాగరికతకు చెందిన అనేక అంశాలు సింధు ప్రజలు అందించినవే. తొలి పట్టణ సంస్కృతికి పునాదులు వేసిన సింధునాగరికత ప్రారంభం నుంచి పతనం వరకు పరీక్షల దృష్ట్యా ముఖ్యం.
 

పట్టణాలు - విశేషాలు
      
సింధు నాగరికతకు సంబంధించిన అవశేషాలు మొదటిసారిగా 1921లో బయల్పడ్డాయి. పురావస్తు శాఖ వాటిని పరిశీలించి 1922లో హరప్పా, మొహంజొదారోల వద్ద తవ్వకాలు జరపగా ఈ నాగరికత విశేషాలు బయటపడ్డాయి. నాటి పురావస్తు శాఖ డైరెక్టర్‌ జనరల్‌ సర్‌ జాన్‌ మార్షల్‌ కృషి వల్ల సింధు నాగరికత ప్రపంచానికి తెలిసింది. ఈ నాగరికతకు సంబంధించిన విశేషాలు మొదటిసారిగా హరప్పాలో కనుక్కోవడం వల్ల దీన్ని హరప్పా నాగరికతగా పేర్కొంటారు. నేటి పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో ఉన్న మాంట్‌గోమరి జిల్లాలో గల హరప్పా నగరంలో దయారాం సహానీ నాయకత్వంలో 1922లో తవ్వకాలు చేపట్టారు.

సింధు రాష్ట్రంలోని లార్ఖనా జిల్లాలో సింధునది ఒడ్డున గల మొహంజొదారోలో ఆర్‌.డి. బెనర్జీ, రాజస్థాన్‌లోని కాళీభంగన్‌లో ఎ. ఘోష్, గుజరాత్‌లోని లోథాల్‌లో ఎస్‌.ఆర్‌.రావు నాయకత్వంలో తవ్వకాలు జరిపారు. క్రమంగా ఉత్తర భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో తవ్వకాలు చేపట్టి సింధు నాగరికత లక్షణాలను గుర్తించారు. గుజరాత్‌లోని లోథాల్‌తోపాటు చాన్హుదారో, ధోలవీర; బెలూచిస్థాన్‌లోని సుత్కార్‌ జెండార్, పంజాబ్‌లోని రూపార్, హరియాణాలోని బన్వాలీ లాంటి అనేక ప్రాంతాల్లో సింధు నాగరికత లక్షణాలను గుర్తించారు.
 

సరిహద్దులు
     నిరంతరం జరుగుతున్న తవ్వకాల వల్ల సింధు నాగరికత విశాలమైన ప్రాంతాలకు విస్తరించింది. తూర్పున ఆలంఘీర్‌పూర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), పశ్చిమాన సుత్కార్‌ జెండార్‌ (బెలూచిస్థాన్‌), ఉత్తరాన మాండు (జమ్ముకశ్మీర్‌), దక్షిణాన దయామాబాద్‌ (మహారాష్ట్ర)లను సింధు నాగరికత సరిహద్దులుగా గుర్తించారు.

పట్టణాలు - ప్రాధాన్యాలు

      అనేక పట్టణాల్లో లభించిన అవశేషాలు, ఆనవాళ్ల ఆధారంగానే సింధు నాగరికత లక్షణాలను అంచనావేశారు. సింధు తవ్వకాల్లో బయటపడిన తొలి నగరం హరప్పా. ఇక్కడ ఆరు చిన్న ధాన్యాగారాలు, రాయితో చేసిన గడ్డం ఉన్న పురుషుడి బొమ్మ, కార్మికుల నివాసగృహాలు, ఎక్కాగా పిలిచే ఎడ్లబండి లాంటి అంశాలు బయల్పడ్డాయి.

మృతుల దిబ్బగా పిలిచే మొహంజొదారోలో మహాస్నానవాటిక, అతిపెద్ద ధాన్యాగారం, కంచుతో చేసిన నాట్యగత్తె విగ్రహం, పెద్ద సమావేశ మందిరం లభించాయి. కాళీభంగన్‌ అంటే కాలిన నల్లని గాజులు అని అర్థం. ఇక్కడ నేలను నాగలితో దున్నిన ఆనవాళ్లు, కాలిన మసిగుడ్డ లభించాయి. గుజరాత్‌లోని చాన్హుదారోలో సిరాసీసాను గుర్తించారు. కోటలేని ఏకైక సింధు పట్టణం చాన్హుదారో (గమనిక: సింధు నాగరికత అన్ని పట్టణాల్లోనూ కోటలు నిర్మించారు). రంగపూర్, లోథాల్‌ పట్టణాల్లో వరి పంట ఆనవాళ్లు లభించాయి. లోథాల్, చాన్హుదారో పట్టణాల్లో పూసల పరిశ్రమ అభివృద్ధి చెందింది. గుర్రపు ఎముకల ఆనవాళ్లను సుర్కటోడా (గుజరాత్‌)లో గుర్తించారు. సింధు నాగరికతకు చెందిన ఎక్కువ పట్టణాలు, స్థావరాలు గుజరాత్‌లోనే బయల్పడ్డాయి.
 

విశిష్ట లక్షణాలు
      
సింధు నాగరికత విశిష్ట లక్షణం నగర నిర్మాణం. కాబట్టి ఇది పట్టణ నాగరికతగా పేరొందింది. సింధు ప్రజలు తమ పట్టణాలు, ఇళ్లను దీర్ఘచతురస్రాకారం (గ్రిడ్‌ పద్ధతి)లో కాల్చిన ఇటుకలతో నిర్మించారు. ప్రపంచంలో తొలిసారిగా కాల్చిన ఇటుకలను ఉపయోగించినవారు సింధు ప్రజలే. నాటి సమకాలీన నాగరికతలైన మెసపటోమియా, ఈజిప్టు నాగరికతల్లో ఇలాంటి ప్రత్యేకత కనిపించలేదు. సింధు ప్రజలు తమ ఇళ్లను అన్ని సౌకర్యాలతో నిర్మించుకున్నారు. ప్రతి ఇల్లు రెండు మూడు అంతస్థులతో బావి, స్నానపుగదులు, మురుగునీటి పారుదల వసతులను కలిగి ఉండేది. ప్రధాన వీధులు ఉత్తర, దక్షిణ దిక్కుల్లో; ఉప వీధులు తూర్పు, పడమర దిక్కుల్లో నిర్మించారు. పట్టణాల్లో తూర్పున ఎత్తయిన ప్రాంతాల్లో కోటలు, దుర్గాలు; పల్లపు ప్రాంతాల్లో సామాన్యుల ఇళ్లను నిర్మించారు. నాటి నాగరికతలో అత్యంత సాంకేతిక పరమైన అంశం మురుగునీటి పారుదల వ్యవస్థ (డ్రైనేజి సిస్టం).

         ఇళ్లలో వినియోగించిన నీటిని రహదారి పక్కన మురుగుకాలువల్లోకి చేరేలా ఏర్పాట్లు చేశారు. స్నానపుగదులు, బావి చుట్టూ ఉండే కాలువల నిర్మాణానికి ‘L’ ఆకారంలో ఉండే ఇటుకలు ఉపయోగించారు. ఎక్కువ అంతస్థులున్న గృహాల్లో పొడవైన నిలువు మురుగునీటి గొట్టాలను ఏర్పాటుచేశారు. మొహంజొదారోలో బయల్పడిన అతి పెద్ద స్నానవాటిక వీరి ఇంజినీరింగ్‌ నైపుణ్యానికి గొప్ప నిదర్శనం. 11.8 మీ. × 7 మీ. కొలతలతో ఉండే ఈ స్నానవాటికలో మెట్ల వరుసలను ఉత్తర దక్షిణ దిక్కుల్లో నిర్మించారు. దీనిలో వేడినీటి సౌకర్యం ఉండేది. వాడిన నీటిని తొలగించే ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. లోతట్టు పట్టణాన్ని, రాజప్రాసాదాన్ని చుట్టుకుని పెద్దగోడ ఉన్న ఆనవాళ్లు కాళీభంగన్‌లో లభించాయి. సింధు ప్రజల ప్రధాన ఓడరేవుగా పేరొందిన లోథాల్‌ (గుజరాత్‌)లో విశాలమైన నౌకా నిర్మాణ కేంద్రం బయల్పడింది. ఈ ఓడరేవులో చక్రాల సాయంతో కదిలే తలుపులను ఏర్పాటుచేశారు. సింధు నాగరికతలోని గృహాల వాకిళ్లు ప్రధాన రహదారి (ప్రధాన వీధి) వైపు కాకుండా ఉపవీధివైపు, కోటల ముఖద్వారం పశ్చిమ దిక్కు వైపునకు ఉండేవి.
 

రాజకీయ, సాంఘిక, మత పరిస్థితులు
పాలకులు లేరు
      
సింధు నాగరికత కాలం నాటి రాజకీయ పరిస్థితులు, పాలన గురించి సరైన ఆధారాలు లభించలేదు. కోటలు, దుర్గాలు బయల్పడినప్పటికీ అవి ఎవరి అధీనంలో ఉండేవనే విషయం తెలియలేదు. మతాధిపతి (పూజారి) లేదా గృహాధిపతి రాజకీయ అధికారాలను కలిగి ఉండేవారని, వివిధ ప్రాంతాలకు వేర్వేరు వ్యక్తులను అధికారులుగా నియమించేవారని చరిత్రకారులు భావిస్తున్నారు. హరప్పా సమాజంలో పాలకులు లేరని అందరూ సమాన హోదా అనుభవించేవారని ఆధునిక చరిత్రకారులు తెలియజేశారు.

కుటుంబానికి తల్లి అధిపతి
     
సింధు నాగరికత సాంఘిక పరిస్థితులను పరిశీలిస్తే మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ అమల్లో ఉండేది. కుటుంబానికి తల్లి అధిపతి. సింధు ప్రజల్లో ప్రధానంగా ప్రొటో ఆస్ట్రలాయిడ్స్, మెడిటరేనియన్స్, మంగోలాయిడ్స్, ఆల్ఫైన్స్‌ అనే నాలుగు జాతులు ఉండేవి. సింధు ప్రజల సాంఘిక, మత, సాంస్కృతిక పరిస్థితులు ద్రవిడులను పోలి ఉండటం వల్ల వారిని సింధు నాగరికత నిర్మాతలుగా పేర్కొన్నారు. నాటి సమాజంలో పూజారి వర్గం, వృత్తి పనివారు, వ్యవసాయదారులు లాంటి అనేక వర్గాలు, వృత్తులు ఉన్నాయి. సాంఘిక దురాచారాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. కుండల తయారీ, టెర్రాకోట బొమ్మలు,  ముద్రికలు, తాయెత్తుల తయారీ లాంటివి వారి వృత్తి నైపుణ్యానికి నిదర్శనం. సింధు ప్రజలు పాత్రలపై (కుండలపై) వృత్తాలు, చెట్ల బొమ్మలను అధికంగా ముద్రించేవారు. కుండలు ఎక్కువగా ఎరుపు రంగులో ఉండేవి. బంకమన్ను, స్టియటైట్‌ రాయి, దంతంతో చేసిన ముద్రికలు; టెర్రాకోట బొమ్మల్లో అధికంగా స్త్రీల బొమ్మలు, మూపురం గల ఎద్దు బొమ్మలు లభించాయి. ఆ కాలంలో స్త్రీలు లిప్‌స్టిక్‌ కూడా వాడినట్లు ఆర్‌.సి. మజుందార్‌ లాంటి చరిత్రకారులు పేర్కొన్నారు.
 

ప్రకృతి శక్తులు ప్రధానం
      
సింధు ప్రజలు అవలంబించిన మత విధానాల్లో అమ్మతల్లిని ప్రధాన దైవంగా; పశుపతిని పురుష దైవంగా భావించేవారు. ప్రకృతి శక్తులను పూజించేవారు. స్త్రీ దేవతలకు అధిక ప్రాధాన్యం ఉండేది. మూపురం ఉన్న ఎద్దు (జంతువు), పావురం (పక్షి), రావిచెట్టును పూజించేవారు. ఏనుగు, ఖడ్గమృగం, పులి, దున్నపోతు, జింక లాంటి జంతువులు చుట్టూ ఉన్న పశుపతి ముద్రిక లభించింది.

           నాటి పశుపతియే నేటి శివుడు అని సర్‌ జాన్‌ మార్షల్‌ పేర్కొన్నాడు. ప్రజలు యోని, లింగ పూజ చేసేవారని తెలిపాడు. అగ్నిని పూజించిన ఆనవాళ్లు కాళీభంగన్, లోథాల్‌లో లభించాయి. సింధు ప్రజలు చనిపోయిన వారిని ఖననం (పూడ్చిపెట్టడం), దహనం చేసేవారు. వారు ఆచరించిన మత విశ్వాసాలనే నేటికీ మనం అనుసరిస్తున్నాం. మృతదేహాల తల ఉత్తరం వైపునకు, కాళ్లు దక్షిణం వైపునకు ఉంచి పూడ్చిపెట్టేవారు. మృతదేహాలతోపాటు గాజులు, పూసలు, రాగి అద్దాలు ఉంచేవారు. దీన్ని బట్టి వారికి మరణానంతర జీవితంపై విశ్వాసం ఉందని తెలుస్తోంది.

రచయిత: బొత్స నాగరాజు

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌