• facebook
  • whatsapp
  • telegram

అక్బర్, జహంగీర్ ప‌రిపాల‌న‌

      అక్బర్ చేపట్టిన ఉదారవాద విధానాలు అతడి వ్యక్తిత్వానికి అద్దం పడతాయి. 1562లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం యుద్ధం జరిగే సమయంలో యుద్ధంలో పాల్గొనని హిందువులు, యుద్ధంలో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులను ఖైదీలు, బానిసలుగా చేయకూడదని, అలాగే ఇస్లాం మతంలోకి మార్చకూడదని అక్బర్ పేర్కొన్నాడు.
     అక్బర్ 1563లో యాత్రికుల మీద విధించే పన్నును, 1564లో జిజియా పన్నును నిషేధించాడు. అనువాద శాఖను ప్రారంభించి సంస్కృతం, ఇతర భాషల్లోని గ్రంథాలను పర్షియన్ భాషలోకి అనువదించేలా చర్యలు చేపట్టాడు. రాజ్యంలోని ఉద్యోగాలకు హిందూ, ముస్లింలు సమానంగా పోటీపడొచ్చని పేర్కొన్నాడు. హిందువుల మనోభావాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. గొడ్డు మాంసం వాడకాన్ని నిషేధించాడు. అలాగే 1583లో కొన్ని ప్రత్యేక రోజుల్లో జంతువులను చంపడాన్ని నిషేధించాడు. హిందువుల ఆదరాభిమానాలు పొందడానికి వారి పండుగల్లో పాల్గొన్నాడు. సాంఘిక సంస్కరణల్లో భాగంగా బాల్య వివాహాలను, సతీ సహగమనాన్ని నియంత్రించడమే కాకుండా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించాడు. అక్బర్ తన రాజపుత్ర భార్యలు హిందూ మతాన్ని అవలంబించడాన్ని సమర్థించాడు.
 

మత విధానం
       అక్బర్ 1562 నుంచి 18 సంవత్సరాల పాటు ప్రతి ఏడాది అజ్‌మేర్ (అజ్మీర్)లోని షేక్ మెయినుద్దీన్ చిష్టి దర్గాను సందర్శించాడు. అతని రాజపుత్ర భార్యలు, హిందూ అధికారులైన తోడర్‌మల్, బీర్బల్, మాన్‌సింగ్, ఫైజి, అబుల్ ఫజల్ లాంటి పండితులు; 16వ శతాబ్దం నాటి భక్తి ఉద్యమం... అక్బర్ తన మత భావాలను మార్చుకోవడానికి దోహదపడ్డాయి.
అక్బర్‌కి వేదాంతం, ఆధ్యాత్మిక విషయాలపై ఉన్న అభిమానం 1575లో ఫతేపూర్ సిక్రీలో ఇబాదత్ ఖానా ప్రారంభించడానికి దోహదం చేసింది. ఇక్కడ ప్రతి గురువారం సాయంత్రం మతపరమైన చర్చ జరిగేది. ఇందులో మొదట్లో ముస్లింలు మాత్రమే పాల్గొనేవారు. 1578లో అన్ని మతాల వారు పాల్గొనడానికి అవకాశం కల్పించారు. 1579లో అక్బర్ ముస్లిం ప్రజలను ప్రభావితం చేసే అన్ని మతపరమైన విషయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని భావించాడు. ఇది షేక్ ముబారక్ ఒక ప్రకటన లేదా మజహర్ రూపొందించడానికి దారితీసింది. ఈ ప్రకటనపై అయిదుగురు ఉలేమాలు సంతకాలు చేశారు. దీనిద్వారా మతపరమైన విషయాల్లో ఉలేమాల బదులు చక్రవర్తి అధికారం స్థిరపడిపోయింది. అక్బర్ వివిధ మత ప్రవక్తలతో చర్చించిన తర్వాత 1582లో దీన్-ఇ-ఇలాహిని స్థాపించాడు. దీని ప్రధాన ఉద్దేశం సుల్-ఇ-కుల్ లేదా సార్వత్రిక సామరస్య భావనను పెంపొందించడం.
 

పరిపాలనాపరమైన విధానాలు
       సామ్రాజ్య మనుగడకు బలమైన రాజకీయ వ్యవస్థ, సమర్థవంతమైన పరిపాలనా విధానం అవసరమని అక్బర్ భావించాడు. పరిపాలనా రంగంలో నిరంతరం అనేక ప్రయోగాలు చేశాడు. అక్బర్ తన సామ్రాజ్యంలో పర్షియన్ భాషను అధికార భాషగా ప్రకటించాడు. సామ్రాజ్యం మొత్తంలో ఒకే పరిపాలన విధానం, నాణేలు, ఒకే రకమైన తూనికలు, కొలతలు అమలయ్యేలా చర్యలు చేపట్టాడు. అక్బరు తన రెవెన్యూ మంత్రి తోడర్‌మల్ పర్యవేక్షణలో 1582లో రెవెన్యూ విధానంలో సమూలమైన మార్పులు చేశాడు.
* అక్బర్ తోడర్‌మల్ బందోబస్తు లేదా జబ్తి అనే రెవెన్యూ విధానాన్ని ప్రవేశపెట్టాడు. అంతకు ముందు 1575 - 76లో తన సామ్రాజ్యాన్ని 12 సుబాలుగా విభజించాడు. దక్కన్ ఆక్రమణ తర్వాత ఈ సుబాల సంఖ్య 15 కు చేరింది. ప్రతి సుబాను సర్కార్‌లుగా, ప్రతి సర్కారును పరగణా లేదా మహల్‌గా విభజించాడు.
సుబాలన్నింటిలో ఒకేవిధమైన పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టాడు. 1573 - 74లో గుజరాత్ ఆక్రమణ తర్వాత అధికారులను వేర్వేరు హోదాలు లేదా మున్సబ్‌లుగా వర్గీకరించాడు. ఇది మున్సబ్‌దారీ విధానం రూపొందడానికి దారితీసింది. అక్బర్ ప్రవేశపెట్టిన పరిపాలనా విధానం చిన్న మార్పులతో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకు కొనసాగడం అక్బర్ గొప్పదనానికి నిదర్శనం.
* 1602లో అక్బర్ పెద్ద కుమారుడు సలీం తిరుగుబాటు చేశాడు. దీంతో అక్బర్ తన చివరి రోజులను ఇబ్బందికరంగా గడపాల్సి వచ్చింది. మొగల్ ఆస్థానంలో ఒక వర్గం సలీం చక్రవర్తి కావాలని భావించగా, మరో వర్గం సలీం కుమారుడు ఖుస్రూ చక్రవర్తి కావాలని కోరుకున్నారు. అక్బర్ కూడా ఖుస్రూని చక్రవర్తిగా చేయడానికే సుముఖత చూపాడు. 1605లో తన మరణానికి కొద్ది రోజుల ముందు అక్బర్ స్వయంగా సలీంను చక్రవర్తిగా ప్రకటించాడు. దీంతో సలీం 'జహంగీర్' బిరుదుతో సింహాసనం అధిష్టించాడు.
 

జహంగీర్ (1605-27)
       జహంగీర్ చక్రవర్తి కాగానే ప్రజా సంక్షేమం కోసం, ఉత్తమ పరిపాలన అందించడానికి 12 శాసనాలు ప్రకటించాడు. ఈ శాసనాల ద్వారా అక్బర్ ఉదారవాద విధానాలను కొనసాగించాలని జహంగీర్ భావించినా ఆచరణలో మాత్రం విఫలమయ్యాడు. 1606లో జహంగీర్ కుమారుడు ఖుస్రూ లాహోర్‌లో తిరుగుబాటు చేశాడు. ఇది జహంగీర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. తానే స్వయంగా ఈ తిరుగుబాటును అణిచివేశాడు. ఖుస్రూను బంధించి కళ్లు పీకించాడు. సిక్కుల అయిదో గురువైన అర్జున్‌సింగ్ తరన్ తరన్ అనే ప్రదేశంలో ఖుస్రూకు ఆశ్రయం ఇవ్వడమే కాకుండా పూర్తి మద్దతు తెలిపాడు. దీంతో జహంగీర్ అతడిపై అపరాధ రుసుం విధించాడు. దీన్ని చెల్లించడానికి నిరాకరించిన అర్జున్‌సింగ్‌కి జహంగీర్ మరణ శిక్ష విధించాడు. ఇది సిక్కులకు, మొగలులకు మధ్య వైరానికి దారితీసింది. తర్వాత 1622లో సోదరుడు ఖుర్రం చేతిలో ఖుస్రూ హత్యకు గురయ్యాడు.
 

మేవాడ్‌పై దండయాత్రలు
       జహంగీర్ మేవాడ్ రాజైన రాణా ప్రతాప్‌సింగ్ కుమారుడు రాణా అమర్‌సింగ్‌పై మొదటి సైనిక దండయాత్ర చేశాడు. మేవాడ్‌పై 1606, 1608, 1609 లలో జరిపిన దండయాత్రలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వలేదు. 1613 - 14లో ఖుర్రం ఆధ్వర్యంలో మేవాడ్‌పై జరిపిన దండయాత్ర ఫలించింది. 1615లో అమర్‌సింగ్ మొగలులతో సంధికి అంగీకరించాడు. దీంతో సుదీర్ఘకాలంగా మొగలులకు, మేవాడ్ రాజ్యానికి మధ్య జరిగిన పోరాటం ముగిసింది.
* నర్మదా నదికి దక్షిణంగా ఉన్న భూభాగాలను ఆక్రమించాలనే అక్బర్ ఆశయాన్ని కొనసాగించాలని జహంగీర్ భావించాడు. మొదటగా అహ్మద్‌నగర్ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించాలనుకున్నాడు. అయితే జహంగీర్ చక్రవర్తి అయ్యేనాటికి నిజాం షాహి రాజ్య ప్రధానమంత్రి మాలిక్ అంబర్ కృషి వల్ల అహ్మద్‌నగర్ పరిస్థితి బాగా మెరుగుపడింది.
* 1608 నుంచి జహంగీర్ అహ్మద్‌నగర్‌పై అనేకసార్లు దండెత్తి, లక్షలాది రూపాయలు ఖర్చు చేసినా మొగలులు కొంత భూభాగాన్ని కూడా ఆక్రమించలేకపోయారు. పర్షియా కాందహార్‌ను ఆక్రమించడం జహంగీర్ వైఫల్యాల్లో అతి పెద్దదిగా పేర్కొనవచ్చు. పర్షియాకు చెందిన షా అబ్బాస్ మొగలులతో పైకి స్నేహం నటిస్తూ, 1622లో కాందహార్‌ను ఆక్రమించాడు. మొగలులు కాందహార్‌ను కోల్పోవడంతో మధ్య ఆసియాలో వారి ప్రతిష్ట బాగా దెబ్బతింది. ఇదే సమయంలో నూర్జహాన్‌కు, షాజహాన్‌కు మధ్య విభేదాలు ఏర్పడటంతో కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.
 

నూర్జహాన్ ప్రభావం..
      పర్షియాకు చెందిన మీర్జా గియాస్ బేగ్ కుమార్తె మెహరున్నీసాను జహంగీర్ వివాహమాడటం సమకాలీన సంఘటనలపై తీవ్ర ప్రభావం చూపింది. మెహరున్నీసా మొదటి భర్త షేర్ ఆఫ్గన్ మరణించిన నాలుగేళ్ల అనంతరం జహంగీర్ మెహరున్నీసాను 1611లో వివాహం చేసుకున్నాడు. ఆమెకు మొదట నూర్‌మహల్ (రాజ ప్రాసాదానికి వెలుగు) అనే బిరుదు, తర్వాత నూర్జహాన్ (ప్రపంచానికి వెలుగు) అనే బిరుదు ఇచ్చాడు. 1613లో ఆమెకు 'పాదుషా బేగం' హోదా కల్పించాడు. ఆమె పేరుతో నాణేలు కూడా ముద్రించారు.
* నూర్జహాన్ ప్రభావంతో ఆమె తండ్రికి 'ఇతిమద్ ఉద్దౌలా', సోదరుడికి 'అసఫ్‌ఖాన్' అనే బిరుదులు లభించాయి. జహంగీర్‌తో ఆమె వివాహమైన ఏడాదికే అసఫ్‌ఖాన్ కుమారై ముంతాజ్ మహల్‌గా పేరుగాంచిన అర్జుమండ్ బాను బేగంను జహంగీర్ కుమారుల్లో సమర్థుడైన ఖుర్రంకు ఇచ్చి వివాహం జరిపించారు. దీంతో నూర్జహాన్, ఇతిమద్ ఉద్దౌలా, అసఫ్‌ఖాన్, ఖుర్రంల మధ్య బంధం బలపడింది. ఈ నలుగురితో కూడిన నూర్జహాన్ బృందం పదేళ్లపాటు రాజ్యాన్ని పాలించింది. 1620లో నూర్జహాన్, షేర్ ఆఫ్గన్‌లకు జన్మించిన లాడ్లీ బేగంను జహంగీర్ చిన్న కుమారుడైన షహర్యార్‌కు ఇచ్చి పెళ్లి చేయడంతో ఈ నలుగురి మధ్య సఖ్యత దెబ్బతింది. నూర్జహాన్ తన అల్లుడు షహర్యార్‌ను సింహాసనానికి వారసుడిగా చేయాలని భావించగా, అసఫ్‌ఖాన్ తన అల్లుడు ఖుర్రంను బలపరిచాడు. దీంతో పరిపాలన వ్యవస్థ దెబ్బతింది. కాందహార్‌ను తిరిగి ఆక్రమించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఖుర్రం ఖుస్రూను వధించడం, మహబత్‌ఖాన్ తిరుగుబాటు మొదలైన సంఘటనలన్నీ దీని పర్యవసానంగా జరిగినవే.

* ఇంగ్లండ్ రాజు మొదటి జేమ్స్ ఆస్థానం నుంచి వచ్చిన కెప్టెన్ హాకిన్స్, సర్ థామస్ రో అనే రాయబారులు జహంగీర్ కాలంలో జరిగిన సంఘటనలను చక్కగా వర్ణించారు. వీరిద్దరు జహంగీర్ ఆస్థానాన్ని సందర్శించి ఆంగ్లేయులు భారతదేశంలో వ్యాపారం చేసుకోవడానికి అతడి అనుమతి పొందడానికి ప్రయత్నించారు. థామస్ రో కృషి ఫలితంగా సూరత్, ఆగ్రా, అహ్మదాబాద్, బ్రోచ్‌లలో ఆంగ్లేయులు తమ వర్తక స్థావరాలను నెలకొల్పారు.

Posted Date : 04-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌