• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో రవాణా వ్యవస్థ

దేశ సుస్థిర సర్వతో ముఖాభివృద్ధిలో రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తోంది. అంటే దేశ వ్యవసాయ, పారిశ్రామిక, సామాజికాభివృద్ధిలో రవాణా వ్యవస్థ ప్రధానమైంది. స్వాతంత్య్రానంతరం భారతదేశం రవాణా రంగంలో గణనీయమైన అభివృద్ధిని సాధించింది. మనదేశంలో పర్వత, ఎడారి, చిత్తడి ప్రాంతాలను మినహాయిస్తే మిగిలిన భూ భాగమంతా రవాణా సౌకర్యాలకు అనుకూలంగా ఉంది.
రవాణా సాధనాలను ముఖ్యంగా 4 రకాలుగా విభజించవచ్చు: అవి: 1) రైలు మార్గాలు 2) రోడ్డు మార్గాలు 3) జలమార్గాలు 4) వాయు మార్గాలు.
       

రైల్వే వ్యవస్థ

  భారతదేశ రవాణా రంగంలో రైల్వే వ్యవస్థ ప్రధానమైంది. ప్రయాణికుల, వస్తు రవాణాలోనే కాకుండా దేశ సమగ్రతను, సమైక్యతను పెంపొందించడంలో, విభిన్న సంస్కృతులను పరిరక్షించడంలో, పర్యాటక రంగ అభివృద్ధిలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. భారతదేశంలో రైలు మార్గాల చరిత్ర 1853లో లార్డ్ డల్హౌసి గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో ప్రారంభమైంది. ఆ సంవత్సరంలోనే బొంబాయి - థానేల మధ్య మొట్టమొదటి రైలును ఆరంభించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 34 కిలోమీటర్లు. ఇప్పుడు మన రైలు మార్గాల మొత్తం పొడవు 63,273 కి.మీ.లు. భారతదేశంలో రైల్వే రంగం అతి పెద్ద ప్రభుత్వరంగ వ్యవస్థగా ఉంది.

ప్రస్తుతం భారతీయ రైల్వే వ్యవస్థ ఆసియాలో రెండో అతిపెద్ద రైల్వే వ్యవస్థగా, ప్రపంచంలో నాలుగో పెద్ద వ్యవస్థగా గుర్తింపు పొందింది. (మొదటి మూడు దేశాలు వరుసగా అమెరికా, రష్యా, చైనా).  ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం 63,273 కి.మీ. పొడవునా విస్తరించిన రైల్వే దేశవ్యాప్తంగా 7,025 రైల్వే స్టేషన్లను కలిగి ఉంది. భారత రైల్వేలను 16 ప్రాంతీయ మండలాలుగా విభజించారు. ఈ 16 మండలాలు, వాటి ప్రథాన కేంద్రాలు.

ఉత్తర రైల్వే మండలం అత్యంత పొడవైన రైల్వే మార్గాన్ని కలిగి ఉంది. దాని తర్వాత పశ్చిమ మండలం, ఆ తర్వాత దక్షిణ మధ్య రైల్వేలు పొడవైన రైలు మార్గాన్ని కలిగి ఉన్నాయి.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా BOT ప్రాతిపదికపై (అంటే Build Operate adn Transfer) నిర్మించిన రైలు మార్గం కొంకణ్ రైల్వే. దీని ప్రధాన కేంద్రం నవీ ముంబాయి. కొంకణ్ రైల్వే మార్గం 1998 జనవరి 26 నుంచి పనిచేయడం ప్రారంభించింది. దీని మొత్తం పొడవు 760 కిలోమీటర్లు. ఇది ఆసియాలోనే అతి పెద్ద సొరంగ మార్గాన్ని కలిగి ఉంది. ఈ మార్గాన్ని నిర్మించేందుకు కొంకణ్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు.

ఈ ప్రాజెక్టువల్ల లబ్ధి పొందుతున్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, కేరళ. పట్టాల మధ్య ఉన్న వెడల్పును బట్టి రైలు మార్గాలను మూడు తరగతులుగా విభజించవచ్చు. అవి


 

భారతదేశంలో మొదటి ఎలక్ట్రిక్ రైల్వే లైన్‌ను 1925లోబొంబాయిలోని విక్టోరియా టర్మినస్ నుంచి కుర్లా (V.T.Kurla) వరకు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు పేరు డక్కన్ క్వీన్.  ఇప్పటివరకు దేశంలోని మొత్తం రైలు మార్గాల పొడవులో దాదాపు 28 శాతం రైలు మార్గాలను విద్యుద్దీకరించారు. 
ప్రపంచంలోకెల్లా అత్యధిక మంది ఉద్యోగులను కలిగి ఉన్న సంస్థ - భారతీయ రైల్వేలు. సుమారు 14 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రపంచంలో కెల్లా మిక్కిలి పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం- బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ ప్లాట్‌ఫారం.

రైల్వే ఉత్పత్తి యూనిట్లు
ప్రస్తుతం భారతీయ రైల్వేలకు రైలు ఇంజన్‌లనూ, రైలుపెట్టెలనూ వాటికి సంబంధించిన భాగాలనూ ఉత్పత్తిచేసే యూనిట్లు ఆరు ఉన్నాయి. అవి:
1. చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్: అవిరి లోకోమోటివ్‌లను తయారుచేసేది. 1971 నుంచి ఈ రకం లోకోమోటివ్‌లను ఉత్పత్తిచేయడం నిలిపివేశారు. ప్రస్తుతం ఇది ఎలక్ట్రిక్ డీజిల్ హైడ్రాలిక్ షంటింగ్ లోకోమోటివ్‌లను ఉత్పత్తిచేస్తోంది.
2. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్, వారణాసి (DLW): డీజిల్ లోకోమోటివ్‌లను తయారు చేయడానికి 1964లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ వర్క్‌షాపు, బ్రాడ్‌గేజ్, మీటర్‌గేజ్, డీజిల్ లోకోమోటివ్‌లను, డీజిల్ షంటర్‌లనూ, విద్యుత్ షంటర్‌లనూ తయారుచేస్తోంది.
3. ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పెరంబూర్ (ICF) చెన్నై: ఇది 1955లో ఉత్పత్తిని ప్రారంభించింది. బ్రాడ్‌గేజ్, మీటర్ గేజ్‌లకు సంబంధించిన అన్ని సౌకర్యాలున్న రైలు పెట్టెలను తయారుచేస్తున్నారు.
4. విల్ అండ్ యాక్సిల్ ప్లాంటు, ఎలహంక (RWF) (బెంగళూరు): ఇది 1983లో చక్రాలు, ఇరుసు దండాల ఉత్పత్తిని ప్రారంభించింది.
5. డీజిల్ కాంపోనెంట్ వర్క్స్, పాటియాలా (పంజాబ్): పాటియాలాలోని డీజిల్ కాంపొనెంట్ వర్క్స్ అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణమైన డీజిల్ లోకోమోటివ్‌ల కాంపోనెంట్లను (విడిభాగాలను) ఉత్పత్తి చేస్తోంది. 
6. రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపుర్తలా, (పంజాబ్) (RCF): భారతదేశంలో అతిపెద్ద రైల్వే ఉత్పత్తి యూనిట్ ఇది. ఈ కర్మాగారం ప్రయాణికుల పెట్టెలను తయారుచేస్తోంది.
               ప్రైవేటు రంగంలో డీజిల్ రైలు ఇంజన్లను ఉత్పత్తి చేసే సంస్థ టాటా- ఇంజనీరింగ్ లోకోమోటివ్ వర్క్స్- జంషెడ్‌పూర్ (జార్ఖండ్).  భారత రైల్వే పరిశోధన అభివృద్ధి (R&D)కి సంబంధించిన Research Design and Standard Organisation(RDSO) ను లక్నోలో స్థాపించారు. భారతదేశంలో అత్యధిక రైలు మార్గాల సాంద్రత కలిగిన రాష్ట్రం పంజాబ్. పశ్చిమ బెంగాల్ రెండో స్థానంలోను, బీహార్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. భారతదేశంలో అత్యంత దూరం ప్రయాణించే రైలు- హిమసాగర్ ఎక్స్‌ప్రెస్. ఇది జమ్ముతావి నుంచి కన్యాకుమారి వరకు పయనిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫాం- ఖరగ్‌పూర్ (పశ్చిమబెంగాల్). దీని పొడవు 2,733 అడుగులు. 2010-11 రైల్వే బడ్జెట్‌లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పర్యాటక, పుణ్యక్షేత్రాలను కలుపుతూ భారత తీర్థ్ రైళ్లను ఆరంభించారు. మహిళల కోసం మాతృభూమి రైళ్ళను, కార్మికుల కోసం కర్మభూమి రైళ్ళను తీసుకొచ్చారు. దేశ భద్రతా దళాలకు గౌరవ సూచకంగా జన్మభూమి ప్రత్యేక రైళ్ళను ప్రవేశపెట్టారు.

రోడ్డురవాణా

దేశ సామాజిక - ఆర్థికాభివృద్ధిలో రోడ్లు కీలకమైన పాత్ర నిర్వహిస్తాయి. కాబట్టి, భారతీయ రవాణాలో ఇవి చాలా ముఖ్యమైనవి. రవాణాలో సరళత, విశ్వసనీయత, వేగం, ఇంటింటికీ సేవలు వంటి ప్రయోజనాలెన్నింటినో ఇవి సమకూరుస్తాయి. ఇతర రకాల రవాణాకు ఇవి పూరకంగా కూడా ఉంటాయి. (ఇవి అన్ని రకాల రవాణా విధానాలనూ అనుసంధానం చేస్తాయి.) కాలం గడుస్తున్నకొద్దీ, సమగ్ర రవాణా నిర్వహణలో రోడ్డు రవాణా వాటా నిరంతరం పెరిగిపోతూ ఉంది. ఇటీవలి కాలంలో రోడ్డు మార్గాల ప్రాధాన్యం గణనీయంగా పెరగడంతో రోడ్ల అభివృద్ధి శీఘ్రంగా జరుగుతోంది. భారతదేశం రోడ్డు రవాణా, రోడ్ల పొడవుకు సంబంధించి ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. యు.ఎస్.ఎ. 63 లక్షల కి.మీ. పొడవైన రోడ్లతో మొదటి స్థానంలో ఉంది. భారత్ 33 లక్షల కి.మీ. రోడ్ల పొడవుతో రెండో స్థానంలో ఉంది.
         దేశంలోని రోడ్ల పొడవు 1951లో కేవలం 4 లక్షల కి.మీ. ప్రస్తుతం అది 33 లక్షల కిలోమీటర్లకు పెరిగింది. అదే రోడ్ల ద్వారా సరకు రవాణా 1951 నుంచి 2008-09 మధ్యకాలంలో దాదాపు 100 రెట్లు పెరిగింది. ప్రయాణికుల రవాణా దాదాపు 200 రెట్లు, వాహనాల సంఖ్య 300 రెట్లు పెరిగింది. కాబట్టి, దీన్ని బట్టి రోడ్డు రవాణా అభివృద్ధి ఏ విధంగా ఉందో తెలుస్తుంది.
       భారతదేశంలోని రోడ్లను ప్రధానంగా నాలుగు రకాలుగా వర్గీకరించారు. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు దాదాపు 33 లక్షల కిలోమీటర్లు. అవి.

 

జాతీయ/ ఎక్స్‌ప్రెస్ రహదారులు 

జాతీయ ప్రాధాన్యం ఉన్న నగరాలు, పట్టణాలు, రాష్ట్ర రాజధానులు, ప్రధాన ఓడరేవులు, పారిశ్రామిక సముదాయాలను అనుసంధానం చేసే రోడ్లనే జాతీయ రహదార్లు అంటారు. వీటినే ట్రంక్ రోడ్లు అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 70548 కి.మీ.  అత్యంత పొడవైన జాతీయ రహదారి ఎన్.హెచ్.7. ఇది వారణాసి నుంచి కన్యాకుమారి వరకూ సాగుతుంది. ఇక నాగపూర్ సమీపంలోని ధూలె నుంచి కోల్‌కతా వరకూ సాగే ఎన్.హెచ్.6 రెండో స్థానంలో ఉంది.
 

రాష్ట్ర రహదారులు 
రాష్ట్రం పరిధిలో ప్రయాణికుల రవాణాకు, వాణిజ్య సరకుల రవాణాకు రాష్ట్ర రహదారులే ప్రధానమైనవి. రాష్ట్ర రాజధాని నగరంతో రాష్ట్రంలోని ప్రతి జిల్లాను, పట్టణాన్ని, జాతీయ రహదారులను, ప్రాంతీయ ప్రాధాన్యం ఉన్న ఇతర పట్టణాలు, నగరాలను ఈ రోడ్లు కలుపుతాయి. వీటి నిర్వహణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 1,28,000 కి.మీ.

 

జిల్లా రహదారులు
జిల్లాల పరిధిలోని వివిధ పట్టణాలు, పెద్ద గ్రామాలను ఈ రోడ్లు జిల్లా కేంద్రాలతో అనుసంధానం చేస్తాయి. ఇవి చాలా వరకు కచ్చా రోడ్లు. జిల్లా పరిషత్తులు, పి.డబ్ల్యు.డి. ఈ రోడ్ల అభివృద్ధి, నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తాయి. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 4,70,000 కి.మీ.

గ్రామీణ రహదారులు
ఇవి గ్రామ పంచాయితీల అధీనంలో ఉంటాయి. కచ్చారోడ్లు వానాకాలంలో బురదమయంగా ఉంటాయి. ప్రస్తుతం వీటి మొత్తం పొడవు 26,50,000 కి.మీ.
      ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన అనే పథకం 2000 సంవత్సరంలో ప్రారంభమైంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం మారుమూల గ్రామీణ ప్రాంతాలను జిల్లా, రాష్ట్ర రహదారులతో కొత్తగా నిర్మించి అనుసంధానం చేయడం. ప్రస్తుతం ఉన్న గ్రామీణ రోడ్లను అభివృద్ధి చేయడం కూడా మరో లక్ష్యం. ఈ పథకం ద్వారా ఇటీవలి కాలంలో గ్రామీణ రోడ్ల నిర్మాణం గణనీయంగా కొనసాగుతోంది.
      జాతీయ రహదార్ల అభివృద్ధిని జాతీయ రహదార్ల అభివృద్ధి ప్రాజెక్టు (ఎన్.హెచ్.డి.పి.) ద్వారా భారత జాతీయ రహదారుల సంస్థ (ఎన్.హెచ్.ఎ.ఐ.) నిర్వహిస్తోంది. ఇది ప్రధానంగా కింది రహదారులను నిర్మించింది.

 

స్వర్ణ చతుర్భుజి
స్వర్ణ చతుర్భుజి (Golden Quadrilateral) దేశంలోని నాలుగు ప్రధాన మెట్రోపాలిటన్ నగరాలైన ఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలను అనుసంధానం చేస్తుంది. దీని పొడవు 5486 కి.మీ.
ఉత్తర - దక్షిణ, తూర్పు - పశ్చిమ కారిడార్
ఉత్తరాన శ్రీనగర్ నుంచి దక్షిణాన కన్యాకుమారి వరకు (4000 కి.మీ.),  పశ్చిమాన  పోర్‌బందర్ నుంచి తూర్పున సిల్చర్ వరకు (3142 కి.మీ.) ఈ రహదార్లను నిర్మించారు. ఈ కారిడార్ మొత్తం పొడవు 7,142 కి.మీ.

       భారతదేశంలో ప్రస్తుతం మొత్తం జాతీయ రహదార్ల సంఖ్య 228. రాష్ట్రాలవారీగా పరిశీలిస్తే ఎక్కువ పొడవున్న జాతీయ రహదారులు ఉండే రాష్ట్రం ఉత్తరప్రదేశ్ - 5874 కి.మీ. ఆ తరువాత స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు వరుసగా మధ్యప్రదేశ్ - 4670 కి.మీ., ఆంధ్రప్రదేశ్ - 4472 కి.మీ., తమిళనాడు - 4462 కి.మీ. అతి తక్కువ దూరం జాతీయ రహదార్లు ఉన్న రాష్ట్రం సిక్కిం - 62 కి.మీ. ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రయాణించే జాతీయ రహదారుల సంఖ్య 15.
      ఈశాన్య రాష్ట్రాల్లో రోడ్ల అభివృద్ధికి ముఖ్యంగా ఈ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల కేంద్రాలను అనుసంధానం చేయడానికి (Special Accelerated Road Development Programme - SARDP) పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు.
      ఇటీవలి కాలంలో దేశంలోని జాతీయ రహదారుల విస్తరణ పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ), బిల్ట్, ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (బీఓటీ) కింద నిర్మిస్తున్నారు.

 

సరిహద్దు రోడ్ల సంస్థ
సరిహద్దు రోడ్ల సంస్థ (Border Roads Organization) 1960 లో ప్రారంభమైంది. భారత సరిహద్దుల్లో ముఖ్యంగా ఉత్తర, ఈశాన్య సరిహద్దు ప్రాంతాల్లో రక్షణకు, పౌర అవసరాలకు ఈ సంస్థ రోడ్లను నిర్మిస్తుంది. ఇది దేశ భద్రత, దేశ సమగ్రతలను పరిరక్షించడంలో కీలకపాత్ర వహిస్తుంది. ఈ సంస్థ ఇప్పటి వరకు 46,780 కి.మీ. పొడవున సరిహద్దు రోడ్లను నిర్మించింది.

జలరవాణా

జలరవాణా (Water Transport) అత్యంత చవకైన రవాణా విధానం. భారతదేశ ప్రధాన భూభాగం 6100 కి.మీ. సముద్ర తీరాన్ని, భారతదేశ దీవులను కూడా కలుపుకొని మొత్తం 7516 కి.మీ. పొడవైన సముద్ర తీరాన్ని కలిగి ఉంది. దేశంలో జలరవాణా అభివృద్ధికి ఇది గణనీయంగా తోడ్పడుతుంది. భారత్‌లో అనేక నదులు వందలకొద్దీ కిలోమీటర్లు ప్రవహిస్తున్నాయి. దీంతో దేశంలో (Inland) జలరవాణా (నది, కాలువల ద్వారా) అభివృద్ధి చెందింది. భారతదేశంలో ప్రస్తుతం 12 ప్రధాన, 187 మధ్యస్థ, చిన్న ఓడరేవులు ఉన్నాయి. 12 ప్రధాన ఓడరేవుల్లో పశ్చిమతీరంలో ఆరు, తూర్పు తీరంలో ఆరు చొప్పున ఓడరేవులు ఉన్నాయి.
పశ్చిమతీరంలోని ఓడరేవులు :
1. కాండ్లా (గుజరాత్)
2. ముంబయి (మహారాష్ట్ర)
3. జవహర్‌లాల్ నెహ్రూ నావా సేవా (మహారాష్ట్ర)
4. మర్మగోవా (గోవా)
5. న్యూమంగుళూరు (కర్ణాటక)
6. కొచ్చిన్ (కేరళ).

తూర్పు తీరంలోని ఓడరేవులు:
1. కోల్‌కతా (పశ్చిమబెంగాల్)
2. పారాదీప్ (ఒడిషా)
3. విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)
4. చెన్నై (తమిళనాడు)
5. ఎన్నోర్ (తమిళనాడు)
6. ట్యుటికొరిన్ (తమిళనాడు) దేశంలో అతిపెద్ద ఓడరేవు ముంబయి ఓడరేవు.

 

అంతర్దేశీయ జలమార్గాలు
ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ అసోం, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో మాత్రమే జలరవాణా వృద్ధి చెందుతూ ఉంది. భారతదేశం మొత్తం మీద దాదాపు 14,500 కి.మీ.ల నౌకాయాన యోగ్యమైన జలమార్గాలున్నాయి. వీటిలో 3,500 కి.మీ.లు మాత్రమే స్టీమర్ల ప్రయాణానికి యోగ్యమైంది. మిగిలినవి పడవ ప్రయాణానికి అనువుగా ఉంటాయి.

 

అత్యంత ముఖ్యమైన జల మార్గాలు
నౌకాయానానికి యోగ్యమైన అనేక ఉపనదులతో కూడిన గంగ, బ్రహ్మపుత్ర నదులు, మహానది, గోదావరి, కృష్ణా నదుల డెల్టాలతో పాటు దిగువ ప్రవాహ మార్గాలు, నర్మద, తపతి నదుల దిగువ ప్రవాహ మార్గాలు, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని బకింగ్‌హామ్ కాలువ, గోవాలోని మాందేవి, జువారీ నదులను కలుపుతున్న కుబర్జువా కాలువ. 
        అత్యంత పొడవైన అంతర్దేశీయ జల మార్గాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. తరువాతి స్థానాలను పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, అసోం, కేరళలు ఆక్రమిస్తాయి. నదుల జలరవాణాపరంగా చూస్తే ఉత్తరప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో అసోం, పశ్చిమ బెంగాల్ ఉన్నాయి. కాలువల ద్వారా జరిగే రవాణాపరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రథమస్థానం ఆక్రమించగా, పశ్చిమబెంగాల్, కేరళలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

 

జాతీయ జలమార్గాలు
రవాణా వ్యవస్థలో ప్రభుత్వం జాతీయ జలమార్గాలను ప్రకటించింది. 1986లో అలహాబాద్ - హాల్దియా (1620 కి.మీ.) మధ్య ఉన్న గంగను జాతీయ జలమార్గం - 1 గా ప్రకటించింది. 1988లో బ్రహ్మపుత్ర నదిమీద సదియా-ధుబ్రీల మధ్య ఉన్న ప్రాంతాన్ని (891 కి.మీ.) జాతీయ జలమార్గం-2 గా ప్రకటించింది. 1993లో కేరళలోని కొత్తం - కొట్టాపురం. కాలువను, చంపకర ఉద్యోగ మంచల్ కాలువను (205 కి.మీ.) జాతీయ జలమార్గం-3 గా ప్రకటించింది. ఇతర ముఖ్యమైన జలమార్గాలను అంటే వెస్ట్‌కోస్ట్ కెనాల్, సుందరవనాలు, నర్మద, కృష్ణ, గోదావరి నదులకు సంబంధించిన ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌