• facebook
  • whatsapp
  • telegram

రాజ్యాంగ సంస్థలు

        భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశంలో ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం
(Indirect Democracy) అమల్లో ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులే పాలకులు. ప్రజలు రాజ్యాంగబద్ధంగా లభించే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా నిర్ణీత కాలానికి ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు సకాలంలో సక్రమంగా జరిగే ఎన్నికలు వెన్నెముక, చుక్కాని లాంటివి.
 

ఎన్నికల సంఘం
ప్రజాస్వామ్యం విజయవంతంగా పనిచేయడానికి అవసరమైన పరిస్థితుల్లో నిర్ణీత కాలానికి జరిగే ఎన్నికలు ముఖ్యమైనవి. అలాంటి ఎన్నికల నిర్వహణకు మన దేశంలో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన సంస్థ ఎన్నికల సంఘం.

* రాజ్యాంగం 15వ భాగంలో 324 నుంచి 329 వరకు ఉన్న నిబంధనలు ఎన్నికల సంఘం గురించి తెలియజేస్తున్నాయి.
* నిబంధన 324(2) ప్రకారం ఎన్నికల సంఘంలో ప్రధానాధికారితోపాటు రాష్ట్రపతి నిర్ధారించినంత మంది ఎన్నికల అధికారులుంటారు. పార్లమెంట్ చేసిన చట్టాలకు అనుగుణంగా రాష్ట్రపతి ఎన్నికల ప్రధానాధికారిని లేదా అధికారులను నియమిస్తారు.
* 1950 నుంచి 1989 వరకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి (Chief Election Commissioner) మాత్రమే ఉండేవారు. 1989, అక్టోబరు 16న త్రిసభ్య కమిటీని ఏర్పాటుచేశారు. 1990 జనవరిలో ఏకసభ్య సంఘంగా మార్చారు. 1993, అక్టోబరు 1 నుంచి త్రిసభ్య సంఘంగా కొనసాగుతోంది. ఇతర ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటికీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఈ సంఘానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
* ఎన్నికల సంఘం నిర్ణయాధికారంపై సుప్రీంకోర్ట్ తీర్పు చెబుతూ ముగ్గురు కమిషనర్లకు సమాన అధికారాలుంటాయని, సమన్వయం కుదరకపోతే మెజారిటీ నిర్ణయం చెల్లుబాటవుతుందనీ వెల్లడించింది.
* ఎన్నికల కమిషనర్లను నియమించినప్పటి నుంచి 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకూ అధికారంలో కొనసాగుతారు. రాష్ట్రపతి ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సంప్రదించి ప్రాంతీయ ఎన్నికల సంఘాలను ఏర్పాటు చేస్తారు.
* ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్ధ. సుప్రీంకోర్ట్ న్యాయమూర్తిని అభిశంసించే పద్ధతినే ఎన్నికల సంఘం కమిషనర్‌ను అభిశంసించడానికి అనుసరించాలని నిబంధన 324(5) సూచిస్తుంది. నిబంధన 324(6) ప్రకారం ఎన్నికల అధికారులను, ప్రాంతీయ ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి సిఫారసు లేకుండా తొలగించడానికి వీలులేదు.
* జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు ఎన్నికల అధికారులుగా వ్యవహరిస్తారు.

విధులు
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభల ఎన్నికల నిర్వహణ, ఓటర్ల జాబితాను తయారుచేయడం, ఎన్నికల తేదీలు నిర్ణయించడం ఎన్నికల సంఘం విధులు.

* ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రూపొందించి,  సక్రమంగా నిర్వహించడం. శాంతియుతంగా అక్రమాలు లేకుండా జరగడానికి పోలీసు సిబ్బంది సహకారం తీసుకోవడం.
* రాజకీయ పార్టీలకు గుర్తింపునివ్వడం, పార్టీలకు గుర్తులు కేటాయించడం, కొన్ని పరిస్థితుల్లో రద్దు చేయడం మొదలైనవి కూడా ఎన్నికల సంఘం విధులు.
* ఒక పార్టీకి ఏదైనా ఒక రాష్ట్ర ఎన్నికల్లో కనీసం 4% ఓట్లు వస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా, 4 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో 6% ఓట్లు వస్తే జాతీయ పార్టీగా గుర్తిస్తారు.
* ఎన్నికల వివాదాల్లో న్యాయస్థానాల్లో పాల్గొని పరిష్కరించడం, డిపాజిట్ల నిర్వహణ ఈ సంఘం ముఖ్య విధులు.
* స్వేచ్ఛాపూరిత వయోజన ఓటింగ్ పద్ధతి ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఆత్మ లాంటిది. 326 నిబంధన ప్రకారం మన దేశంలో పౌరులందరికీ కుల, మత, వర్ణ, వర్గ భేదాలు లేకుండా సార్వజనీన వయోజన ఓటింగ్ విధానాన్ని ఏర్పాటు చేశారు.
* 325 నిబంధన ప్రకారం కుల, మత, వర్గ విచక్షణతో ఎవరినీ ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
* రాజ్యాంగం అమల్లోకి వచ్చిన కొత్తలో 21 సంవత్సరాల వయోపరిమితి నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు. దేశంలో యువతకు ఎన్నికల్లో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు వయో పరిమితిని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించారు.
 

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్
 

* ఇది బ్రిటిష్‌వారి పాలనాంశాల నుంచి మన దేశానికి సంక్రమించిన పాలనా వ్యవస్థ (Controller and Auditor General - CAG). 1753లో భారత్‌లో ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్ డిపార్ట్‌మెంట్‌ను మొదటిసారిగా ప్రారంభించారు. వివిధ ప్రావిన్స్‌లు ఖాతాల నిర్వహణకు అకౌంటెంట్ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాయి.
* 1857లో లార్డ్ కానింగ్ చర్యల వల్ల బొంబాయి, మద్రాస్, బెంగాల్‌ను ఒక అకౌంటెంట్ జనరల్ ఆధిపత్యంలోకి తెచ్చారు. 1919లో ఆడిటర్ జనరల్‌కు భారత ప్రభుత్వం నుంచి స్వతంత్రత కల్పించారు. 1935 చట్టం ద్వారా ఇతడికి ఫెడరల్ కోర్ట్ న్యాయమూర్తి హోదా కల్పించారు.
* స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆడిటర్ జనరల్‌కు 1950లో 'కంప్ట్రోలర్' అనే పదాన్ని చేర్చి, ప్రభుత్వ ఖాతాల తనిఖీ, వ్యయ సఫలత, అక్రమాలు బయటకు తీసే అవకాశం కల్పించారు.
* 'రాజ్యాంగం సృష్టించిన అధికారుల్లో అత్యంత ముఖ్యుడు కాగ్' - అంబేడ్కర్.
* రాజ్యాంగ నిబంధన 148 ప్రకారం కాగ్‌ని రాష్ట్రపతి నియమిస్తారు. రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. 1953లో పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారం ఇతడి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయో పరిమితి వచ్చేవరకు. కాగ్ రాజీనామా చేయాలంటే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.
* సుప్రీంకోర్ట్ న్యాయమూర్తికి లభించిన వేతనం కాగ్‌కు లభిస్తుంది. అవినీతి, అసమర్థత ఆరోపణలుంటే కాగ్‌ను పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానం ఆమోదించడం ద్వారా తొలగించవచ్చు. (సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై అభిశంసన మాదిరిగా.)
 

విధులు
నిబంధన 149లో కాగ్ విధులను తెలియజేశారు. 1976 వరకు కాగ్ ఖాతాల నిర్వహణకు కూడా అధిపతిగా ఉండేవారు. ఖాతాల నిర్వహణకు ఒక కంప్ట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్‌ను (CGA)నియమించిన తర్వాత ఖాతాల నిర్వహణ బాధ్యతల నుంచి కాగ్‌కు విముక్తి లభించింది.

* 'బయటి వ్యక్తుల ప్రమేయం లేకుండా తనకు తానుగా విషయాలను క్షుణ్నంగా పరిశీలించి తీర్పునిచ్చే సుప్రీం మాస్టర్ కాగ్' - పట్టాభి సీతారామయ్య.
* ప్రభుత్వ ఖాతాల సంఘానికి హితుడిగా వ్యవహరించే కాగ్ కింది విధులను నిర్వర్తిస్తారు.
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయ వ్యయాలను పరిశీలించి ఆడిట్ చేయడం.
* ప్రభుత్వం చేసిన వ్యయం చట్టబద్దంగా జరిగిందా లేదా నిర్దేశిత అధికారి ద్వారా జరిగిందా లేదా అని పరిశీలించడం.
* కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల లావాదేవీలను ఆడిట్ చేయడం, రాష్ట్రపతికి, గవర్నర్లకు నివేదికలు ఇవ్వడం.
* కంటింజెన్సీ ఫండ్ నుంచి తీసిన ధనం వ్యయాన్ని పరిశీలించడం. ప్రభుత్వ రంగ సంస్థల, అన్ని ప్రభుత్వ విభాగాల ఖాతాలను ఆడిట్ చేయడం.
* కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి నిధుల విడుదలకు కాగ్ ప్రమేయం ఉండదు.
* కాగ్ ఆదాయ వ్యయాలనే కాకుండా గోదాముల్లో నిల్వలను కూడా ఆడిట్ చేయవచ్చు.
* కాగ్ స్వతంత్రంగా వ్యవహరించడానికి వీలుగా కొన్ని రక్షణలను కల్పించారు.
* పదవి నుంచి తొలగించడానికి అభిశంసన తీర్మానం ఆమోదించడం ఒక్కటే మార్గం. పదవీ కాలంలో జీతభత్యాలు, సర్వీసు నిబంధనలను సవరించకూడదు. పదవీ విరమణ తర్వాత ఏ ప్రభుత్వ ఉద్యోగం చేయకూడదు. జీత భత్యాలను సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* మన దేశంలో తొలి కాగ్ వి. నరసింహారావు
* ప్రస్తుత కాగ్ రాజీవ్ మెహ్రిషి.
* తొలి ఎన్నికల ప్రదానాధికారి టి. సుకుమార సేన్
* ప్రస్తుత ఎన్నికల సంఘ కమిషనర్లు (త్రిసభ్య సంఘం) ప్రధానాధికారి ఓంప్రకాష్ రావత్; సునీల్ ఆరోరా, అశోక్ లావాసా.

ఆర్థిక సంఘం
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేంద్ర, రాష్ట్రాల మధ్య ఆర్థిక వనరులను పంపిణీ చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ ఆర్థిక సంఘం.

* రాజ్యాంగం 12వ భాగం 280, 281 నిబంధనలు ఆర్థిక సంఘం నిర్మాణం, విధులను తెలియజేస్తున్నాయి. నిబంధన 280(1) ప్రకారం 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఈ సంఘాన్ని నియమిస్తారు.
* 1951 సంవత్సరం విత్త చట్టం ప్రకారం ఆర్థిక సంఘం ఏర్పడింది. 1959 సంవత్సరం సవరణ ప్రకారం ఈ సంఘం రాష్ట్రపతికి సలహాలివ్వాలని కూడా నిర్ణయించారు.
* ఆర్థిక సంఘంలో ఒక ఛైర్మన్, నలుగురు సభ్యులు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను పార్లమెంట్ నిర్ణయిస్తుంది. కానీ సాధారణంగా కింది అర్హతలు ఉండాలి.
* ఛైర్మన్‌కు ప్రజా సంబంధ విషయాల్లో విషయ పరిజ్ఞానం ఉండాలి.
* నలుగురు సభ్యులు అర్థశాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి. అకౌంటింగ్, ఆడిటింగ్‌లలో అనుభవం ఉండాలి.
 

విధులు
కేంద్ర, రాష్ట్రాల మధ్య నిధుల పంపిణీకి సూచనలు ఇవ్వడం. పంపిణీ చేసిన పన్నులను, రాబడులను రాష్ట్రాల మధ్య కేటాయించడం. భారత సంఘటిత నిధి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్ల మీద నియమాలు రూపొందించడం.

* రాష్ట్రపతి కోరిన ఇతర విషయాలపై సూచనలివ్వడం.
* ఆర్థిక సంఘం తన నివేదికను రాష్ట్రపతికి సమర్పిస్తుంది. ఆ నివేదికకు విశ్లేషణ జతపరిచి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా చేస్తుంది. ఆర్థిక సంఘం సిఫారసులను రాష్ట్రపతి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* మొదటి ఆర్థిక సంఘం ఛైర్మన్ కె.సి. నియోగి.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, కేంద్ర, రాష్ట్రాల మధ్య సంబంధాలపై విచారణ సంఘం ఛైర్మన్‌గా పని చేసింది పి.వి. రాజమన్నార్.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి 6వ ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా పని చేసింది కాసు బ్రహ్మానంద రెడ్డి.
* బొంబాయి ముఖ్యమంత్రి, 8వ ఆర్థిక సంఘం ఛైర్మన్ వై.బి. చవాన్.
* ఆర్థిక సంఘం ఛైర్మన్‌గా, ఏపీ తాత్కాలిక గవర్నర్‌గా, ప్రధాని సలహాదారుగా సేవలందించింది సి. రంగరాజన్.
* ప్రస్తుత ఆర్థిక సంఘం ఛైర్మన్ ఎన్.కె. సింగ్.
 

పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC)

కార్యనిర్వహణ శాఖను రెండు భాగాలుగా విభజించుకుంటే మొదటిది రాజకీయ కార్యనిర్వాహక వర్గం. రాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి, వీరు తీసుకున్న నిర్ణయాలు వాస్తవంగా అమలు చేసేది రెండో భాగం - ప్రభుత్వ ఉద్యోగులు.
* అలాంటి ప్రభుత్వ ఉద్యోగాలకు సమర్థులను ఎంపిక చేయడానికి రాజ్యాంగం ఏర్పాటుచేసిన స్వతంత్ర సంస్థ 'యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్' .
* రాజ్యాంగంలోని 14వ భాగంలో 316 నుంచి 323 నిబంధనల వరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఏర్పాటు, అధికారాలు, విధుల గురించి తెలియజేస్తాయి.
* భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారం యూపీఎస్సీ ఏర్పడింది. 1926లో లీ కమిషన్ సిఫారసుల మేరకు నిర్మాణం చేశారు. 1935 చట్టంలో ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు రాష్ట్ర సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా సర్వీస్ కమిషన్‌లను ఏర్పాటు చేశారు. రెండు మించిన రాష్ట్రాలకు ఉమ్మడి సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు.
* యూపీఎస్సీలో ఒక ఛైర్మన్, రాష్ట్రపతి నిర్ణయం మేరకు 9 - 11 మంది సభ్యులుంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి అర్హతలను రాజ్యాంగంలో సూచించలేదు. కానీ మొత్తం సభ్యుల్లో సగం మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిపాలన అనుభవం ఉన్నవారిని నియమించాలి. మిగిలినవారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారం ప్రకారం జరుగుతుంది. ప్రస్తుతం ఛైర్మన్, పది మంది సభ్యులున్నారు.
* వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాల వయోపరిమితి వచ్చేవరకు ఏదిముందుగా వస్తే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.
* యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటానికి కొన్ని చర్యలు చేపట్టారు. వీరి వేతనాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో తప్ప వేతనాలను తగ్గించకూడదు.
* అవినీతి, అసమర్థ ఆరోపణలుంటే 317 నిబంధన ప్రకారం సుప్రీంకోర్ట్ న్యాయమూర్తితో విచారణ జరిపించి, అభిశంసన తీర్మానాన్ని పార్లమెంట్‌లో ఆమోదించడం ద్వారా అధికారం నుంచి తొలగించవచ్చు. ఏ కారణంతో తొలగించినా సుప్రీంకోర్ట్ సలహా తీసుకోవాలి. తొలగింపు, అభిశంసన రాజ్యాంగపరమైన ప్రక్రియ.
విధులు: అఖిల భారత సర్వీసులు, కేంద్ర ప్రభుత్వ సర్వీసులు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేయడానికి అభ్యర్థులను పోటీ పరీక్షల ద్వారా ఎంపిక చేయడం.
* ఈ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, క్రమశిక్షణా చర్యలు మొదలైన సర్వీసు నిబంధనల్లో సలహాలివ్వడం.
* తొలి యూపీఎస్సీ ఛైర్మన్ హెచ్.కె. కృపలానీ, ప్రస్తుత ఛైర్మన్ వినయ్ మిట్టల్.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌