• facebook
  • whatsapp
  • telegram

భారత పార్లమెంట్ - లోక్‌సభ

    కేంద్ర ప్రభుత్వ సర్వోన్నత శాసన నిర్మాణ సంస్థ భారత పార్లమెంట్. లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ (79వ అధికరణ) అంటారు. రాష్ట్రపతి పార్లమెంట్‌లో అంతర్భాగం. రాజ్యాంగంలోని 5వ భాగంలో 79 నుంచి 122 వరకు ఉన్న అధికరణలు పార్లమెంట్ నిర్మాణం, అధికారాలు, విధుల గురించి వివరిస్తాయి.
     పార్లమెంట్‌లోని దిగువ సభను లోక్‌సభ House of the People అంటారు. ఇందులో రాజ్యాంగం ప్రకారం గరిష్ఠంగా 552 మంది ఉండవచ్చు. 550 మందిని జనాభా ఆధారంగా విభజించిన ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకుంటారు. ఆంగ్లో ఇండియన్ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమించవచ్చు. అయితే ప్రస్తుతం వివిధ రాష్ట్రాల నుంచి 530 మంది, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 13 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు 543 మంది, ఆంగ్లో ఇండియన్లకు సరైన ప్రాతినిధ్యం లేనప్పుడు ఆ వర్గం నుంచి ఇద్దరిని రాష్ట్రపతి నియమిస్తారు. ప్రస్తుత సభ్యుల సంఖ్య 545. ఎన్నికలు రహస్య ఓటింగ్ పద్ధతిలో జరుగుతాయి. ప్రస్తుతం అత్యధికంగా ఉత్తర్ ప్రదేశ్ నుంచి 80 మందికి, సిక్కిం, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరికి మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్రపాలిత ప్రాంతమైన జాతీయ రాజధాని దిల్లీకి ఏడుగురు, మిగిలిన 6 కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకరు చొప్పున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25, తెలంగాణ నుంచి 17 మంది లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
* లోక్‌సభ సభ్యులు రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి ద్వారా ప్రమాణ స్వీకారం చేస్తారు. సాధారణంగా రాష్ట్రపతి నియమించిన ప్రోటెం స్పీకర్ (Pro Tem Speaker) ప్రమాణ స్వీకారం చేయిస్తారు. సంప్రదాయం ప్రకారం సభలో అత్యధిక అనుభవం ఉన్న సీనియర్‌ను ప్రోటెం స్పీకర్‌గా నియమిస్తారు. ప్రోటెం స్పీకర్‌తో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. స్పీకర్ 10 మంది సభ్యులతో ప్యానల్ స్పీకర్ల జాబితాను రూపొందిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అందుబాటులో లేని సమయంలో ప్యానల్ స్పీకర్ సభకు అధ్యక్షత వహిస్తారు. ఆయన కూడా అందుబాటులో లేకపోతే సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని తాత్కాలిక స్పీకర్‌గా నియమించుకుంటారు.
* ప్రధానమంత్రి లోక్‌సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి రాజ్యసభ సభ్యుడైతే ఆయన రాజ్యసభ నాయకుడిగా వ్యవహరిస్తూ, లోక్‌సభలో సభ్యత్వం ఉన్న తన మంత్రివర్గ సహచరుడిని లోక్‌సభ నాయకుడిగా నియమిస్తారు.
* ప్రస్తుత లోక్‌సభలో (16వ లోక్‌సభ) 38 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీ కనీసం 10 శాతం స్థానాలు పొందలేకపోవడంతో ప్రతిపక్ష పార్టీ నాయకుడి హోదాను పొందలేకపోయాయి. అయితే ఇది రాజ్యాంగబద్ధ పదవి కాదు. పార్లమెంటరీ సంప్రదాయం మాత్రమే.
* లోక్‌సభలోని సభ్యులు ఎన్నుకున్న స్పీకర్ ఆ సభకు అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ లేదా ఉపసభాపతి సభకు అధ్యక్షత వహిస్తారు. ప్రస్తుతం సుమిత్రా మహాజన్ స్పీకర్‌గా, యం.తంబిదురై డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరిస్తున్నారు.
* లోక్‌సభ సభ్యులు తమ రాజీనామా పత్రాన్ని లోక్‌సభ స్పీకర్‌కు రాయాల్సి ఉంటుంది. స్పీకర్ సంతృప్తి మేరకు వాటిని ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు.
* స్పీకర్ అనుమతి లేకుండా సభ సమావేశాలకు 60 రోజులు గైర్హాజరు అయితే వారి సభ్యత్వం రద్దవుతుంది.
 

నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ: 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ తర్వాత పార్లమెంట్ నియమించే నియోజక వర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నియోజక వర్గాల సంఖ్యను పెంచడం లేదా ప్రాదేశిక సరిహద్దులను మార్చడం, షెడ్యూల్డ్ కులాలు, తెగల నియోజక వర్గాలను నిర్ణయిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో షెడ్యూల్డ్ కులాలకు 84, షెడ్యూల్డ్ తెగలకు 47, మొత్తం 131 (24.03%) స్థానాలను రిజర్వు చేశారు.
 

లోక్‌సభ కాలపరిమితి: సభ సమావేశమైన మొదటి రోజు నుంచి 5 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా ప్రధానమంత్రి సిఫారసుపై రాష్ట్రపతి లోక్‌సభను రద్దు చేయగలరు. అంతేకాకుండా జాతీయ అత్యవసర పరిస్థితిని విధించినప్పుడు లోక్‌సభ గడువును అదనంగా ఒక సంవత్సరం పొడిగించవచ్చు.

లోక్‌సభ స్పీకర్
రాజ్యాంగంలో 93 నుంచి 97 వరకు ఉన్న అధికరణలు స్పీకర్ పదవి గురించి వివరిస్తాయి. లోక్‌సభకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సమయంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. బ్రిటిష్ పాలనా కాలంలో 1921 వరకు కేంద్ర శాసన మండలికి గవర్నర్ జనరల్ అధ్యక్షత వహించేవారు. 1919 భారత ప్రభుత్వ చట్టం ద్వారా కేంద్ర శాసన మండలికి ప్రెసిడెంట్ (స్పీకర్), డిప్యూటీ ప్రెసిడెంట్ (డిప్యూటీ స్పీకర్) పదవులను ఏర్పాటు చేశారు. ఇది 1921 నుంచి అమల్లోకి వచ్చింది. ఆ సమయంలో ఫ్రెడరిక్ వైట్ ప్రెసిడెంట్‌గా, సచ్చిదానంద సిన్హా (వైస్ ప్రెసిడెంట్)డిప్యూటీ స్పీకర్‌గా నియమితులయ్యారు. కేంద్రశాసన మండలికి విఠల్‌భాయ్ జె. పటేల్ మొదటిసారిగా ఎన్నికైన ప్రెసిడెంట్ (స్పీకర్). 1935 భారత ప్రభుత్వ చట్టం ఈ పేర్లను స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌గా మార్చినప్పటికీ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మాత్రమే అమల్లోకి వచ్చాయి.

* లోక్‌సభ సభ్యులు తమలో నుంచి ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు. స్పీకర్ ఎన్నిక తేదీని రాష్ట్రపతి నిర్ణయిస్తారు. కానీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తేదీని స్పీకర్ నిర్ణయిస్తారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవి ప్రమాణ స్వీకారం అనేది ప్రత్యేకంగా ఉండదు.
* లోక్‌సభ రద్దు అయినప్పటికీ తిరిగి లోక్‌సభ ఏర్పడేంతవరకూ స్పీకర్ పదవిలో కొనసాగుతారు.
* స్పీకర్, డిప్యూటీ స్పీకర్ జీతభత్యాలను భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
* స్పీకర్‌కు లోక్‌సభలో నిర్ణాయక ఓటు హక్కు ఉంటుంది.
* స్పీకర్ లోక్‌సభను తాత్కాలికంగా వాయిదా వేయగలరు.
* పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశానికి స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. స్పీకర్ లేని సందర్భంలో డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు.
* ఒక బిల్లును ద్రవ్య బిల్లా లేదా సాధారణ బిల్లా అని నిర్ణయించే అంతిమ అధికారం లోక్‌సభ స్పీకర్‌కే ఉంటుంది.
* లోక్‌సభ సభ్యులకు సంబంధించి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు చేయడంలో స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అయితే స్పీకర్ నిర్ణయం సుప్రీంకోర్ట్ న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుంది.

Posted Date : 11-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌