• facebook
  • whatsapp
  • telegram

భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తి

         భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్యవ్యాప్తిలో భాగంగా- కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ, బక్సార్ యుద్ధాలు, ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఆంగ్ల-మైసూర్ యుద్ధాలు - కారణాలు - ఫలితాలు - పోరాటాలలో విజయసాధనకు బ్రిటిష్‌వారి కుట్రలు - అవినీతి పాత్ర తదితర విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.
 

ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు
*    క్రీ.శ. 1769 నుంచి మూడు దశాబ్దాలపాటు ఆంగ్లేయులకు, మైసూర్ పాలకులకు మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు అంటారు.
*    ఆంగ్లో-మైసూర్ యుద్ధాలు మొత్తం నాలుగు జరిగాయి.
*    దక్షిణ భారతదేశంలో ఆంగ్లేయులను ధైర్యంగా ఎదుర్కొన్న రాజ్యాలలో మైసూర్ ప్రముఖమైంది.
*    మైసూర్ తరఫున హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ పోరాటపటిమ భారతదేశ చరిత్రలో చిరస్మరణీయం.
*    'ఔరంగజేబు మరణానంతరం 150 సంవత్సరాల భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ, టిప్పు సుల్తాన్ ఇద్దరే భారతదేశాన్ని పరిపాలించిన రాజుల్లో ఏ సందర్భంగా కూడా విదేశీయుల సహాయాన్ని అర్థించనివారు' అని ఆంగ్లేయులే పేర్కొన్నారు.

 

మొదటి ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1766-1769)
కారణాలు :

*    భారతదేశం నుంచి ఆంగ్లేయులను పారదోలాలనే హైదర్ఆలీ ఆశయం.
*    హైదర్ఆలీ ద్వారా తమకు ప్రమాదం ఎదురవుతుందని ఆంగ్లేయులు గ్రహించారు.
*    హైదర్ఆలీకి వ్యతిరేకంగా ఆంగ్లేయులు మరాఠాలతోనూ, హైదరాబాద్ నిజాంతోనూ త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకున్నారు.
*    హైదర్ఆలీ త్రైపాక్షిక ఒప్పందాన్ని విఫలంచేసి, ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించాడు.

 

యుద్ధ విశేషాలు :
*    బ్రిటిష్‌వారి స్థావరమైన మద్రాసు సమీపం వరకు హైదర్ఆలీ పలు ప్రాంతాలు ఆక్రమించాడు. మద్రాసును ఆక్రమించుకునే సమయంలో ఆంగ్లేయులు నిస్సహాయులై హైదర్ఆలీతో సంధికి అంగీకరించారు.
*    బ్రిటిష్‌వారు సంధికి అంగీకరించకుంటే హైదర్ఆలీ మద్రాస్‌ను ఆక్రమించేవాడు. ఒకవేళ మద్రాస్‌ను ఆక్రమించి ఉంటే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య చరిత్ర ఎలా ఉండేదో ప్రశ్నార్థకం.
*    భారతీయ సంప్రదాయాలను అనుసరించి, ఆంగ్లేయులు సంధికి వచ్చినప్పుడు అదే న్యాయమని హైదర్ఆలీ భావించాడు. అదే మద్రాస్ సంధి.

 

మద్రాస్ సంధి (1769)
ముఖ్యాంశాలు :

*   యుద్ధానికి పూర్వం ఉన్న స్థితిని అంగీకరించాలి. అంటే యుద్ధకాలంలో స్వాధీనం చేసుకున్న ప్రాంతాలను ఎవరికి వారు ఇచ్చేయాలి.
*    యుద్ధానికి అయిన ఖర్చులకు నష్టపరిహారాన్ని ఆంగ్లేయులు హైదర్ఆలీకి ఇవ్వాలి.
*    ఈ రెండు పక్షాలలో ఎవరినైనా మూడోవారు ఎదిరిస్తే, ఇరుపక్షాలు పరస్పరం సహాయపడాలి.

 

ఫలితాలు :
*    ఆంగ్లేయులను ఆజ్ఞాపించదగిన స్థానాన్ని హైదర్ఆలీ పొందాడు.
*    ఇరుపక్షాలు ఆర్థికంగా నష్టపోయాయి.

 

రెండో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1780-1784)
కారణాలు :

*    బ్రిటిష్‌వారు మద్రాస్ సంధిని కేవలం తిరిగి యుద్ధం చేయడానికి వ్యవధి అవసరమని కుదుర్చుకున్నారు.
*    హైదర్ఆలీ కూడా ఆంగ్లేయుల ఉద్దేశం, నడవడిక గ్రహించాడు. పరస్పరం అపనమ్మకం పెంచుకున్నారు.
*    మద్రాస్ సంధి షరతులను బ్రిటిష్‌వారు ఉల్లంఘించారు. ఉదా: హైదర్ఆలీపై మరాఠాలు దాడిచేస్తే మద్రాస్ సంధి ప్రకారం హైదర్ఆలీకి ఆంగ్లేయులు సహకరించాలి. కానీ ఆంగ్లేయులు తటస్థ వైఖరిని అవలంబించారు.
*    ఆంగ్లేయులు - ఫ్రెంచివారి మధ్య యూరప్‌లో ఘర్షణల కారణంగా హైదర్ఆలీ రాజ్యపరిధిలోని ఫ్రెంచివారి వర్తక స్థావరమైన 'మాహే'ను బ్రిటిష్‌వారు ఆక్రమించారు.
*    ఇంగ్లిష్‌వారికి వ్యతిరేకంగా హైదర్ఆలీ నైజాం, మరాఠాలతో ఒప్పందం కుదుర్చుకోవడం మరో పరిణామం.

 

యుద్ధ విశేషాలు :
*    హైదర్ఆలీ యుద్ధం మొదట్లో ఘనవిజయాలు సాధించాడు. అయితే, అప్పటి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ తన రాజకీయ చతురతతో నిజాం, మరాఠాలను తనవైపు తీసుకున్నాడు.
*    1781లో పోర్ట్‌నోవా వద్ద బ్రిటిష్‌సేనాని సర్ఐర్‌క్యూట్ హైదర్ఆలీని ఓడించాడు. 1782లో హైదర్ఆలీ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. దీనితో హైదర్ఆలీ కుమారుడైన టిప్పుసుల్తాన్ యుద్ధనిర్వహణ బాధ్యతలను స్వీకరించాడు.
*    1784నాటికి ఎవరూ గెలిచే స్థితిలో లేకపోవడంతో ఒప్పందం చేసుకున్నారు. ఇదే మంగుళూరు ఒప్పందం.

 

మంగుళూరు ఒప్పందం (1784)
ముఖ్యాంశాలు :

*    ఇరుపక్షాలు తాము గెలుచుకొన్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.
*   ఒకరిపై ఒకరు దాడి చేసుకోకూడదు. ఎవరైనా దాడిచేస్తే ఒకరికొకరు సహకరించుకోవాలి.
*    ఆంగ్లేయుల దగ్గర నుంచి హైదర్ఆలీ గెలుచుకున్న ప్రాంతాలను తిరిగి ఇచ్చివేయాలి.
మూడో ఆంగ్లో-మైసూర్ యుద్ధం (1790-1792)

 

కారణాలు :
*    టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా ఆంగ్లేయులు హైదరాబాద్ నిజాం రాజులతోనూ మరాఠాలతోనూ ఒప్పందం కుదుర్చుకోవడం.
*    టిప్పు సుల్తాన్ ఫ్రాన్స్, టర్కీ దేశాల సహాయం పొందడానికి రాయబారాలు చేయడం.
*    బ్రిటిష్ పక్షపాతి అయిన ట్రావెన్‌కోర్ రాజుపై టిప్పు సుల్తాన్ దాడి చేస్తున్నారనే ఆరోపణ.
*    ఈ కారణాలతో గవర్నర్ జనరల్ కారన్ వాలీస్, టిప్పు సుల్తాన్‌పై యుద్ధం ప్రకటించాడు.

 

యుద్ధ విశేషాలు :
*    కారన్‌వాలీస్ స్వయంగా యుద్ధానికి నాయకత్వం వహించాడు.
*    మైసూర్ రాజధాని అయిన శ్రీరంగపట్నంపై దాడిచేసి, ఆంగ్లేయులు స్వాధీనం చేసుకున్నారు.
*    టిప్పు సుల్తాన్‌తో సంధి చేసుకోవాల్సిందిగా మరాఠాలు, నిజాం రాజులు ఒత్తిడి తేవడంతో ఆంగ్లేయులు సంధి కుదుర్చుకున్నారు. అదే శ్రీరంగపట్నం సంధి.

 

శ్రీరంగపట్నం ఒప్పందం (1792)
ముఖ్యాంశాలు :

*    టిప్పు సుల్తాన్ తన భూభాగాలలో దాదాపు సగభాగం ఆంగ్లేయులు వారి మిత్రులకు ఇవ్వాలి.
*    యుద్ధ నష్టపరిహారంగా మూడు కోట్ల మొత్తాన్ని టిప్పుసుల్తాన్ ఆంగ్లేయులకు చెల్లించాలి. ఆ పైకం చెల్లించేవరకు టిప్పుసుల్తాన్ ఇద్దరు కొడుకులను ఆంగ్లేయుల చెరలో ఉంచాలి.

 

నాలుగో ఆంగ్లో- మైసూర్ యుద్ధం (1799)
కారణాలు :

*    ఆంగ్లేయుల చేతిలో తమకు వాటిల్లిన అవమానకరమైన పరాజయానికి, ఆంగ్లేయులు తమపై విధించిన షరతులకు ప్రతీకారం తీర్చుకోవాలనే టిప్పుసుల్తాన్ బలమైన కోరిక.
*    విప్లవాత్మక ఫ్రాన్స్, ముస్లిం దేశాలైన అరేబియా, కాబూల్, టర్కీ తదితర దేశాల సహాయం కోసం టిప్పుసుల్తాన్ రాయబారులను పంపడం.
*   టిప్పుసుల్తాన్ నుంచి ఎదురయ్యే ప్రమాదాన్ని శాశ్వతంగా నిర్మూలించాలని గవర్నర్ జనరల్ లార్డ్ వెల్లస్లీ నిర్ణయం.
*    వెల్లస్లీ సైన్య సహకార ఒప్పందానికి టిప్పుసుల్తాన్ అంగీకరించకపోవడం.

 

యుద్ధ విశేషాలు :
*    టిప్పుతో పనిచేస్తున్న సైనికాధికారులు, ముఖ్య ఉద్యోగులు అతడికి సహాయం చేయకుండా తమవైపు చేరితేగాని విజయం సాధించలేమని వెల్లస్లీ భావించాడు. లంచమిచ్చి, అవినీతి మార్గాల ద్వారా తమవైపు తిప్పుకొనేందుకు అయిదుగురితో కమిషన్ ఏర్పాటు చేశాడు.
*    బ్రిటిష్‌వారి దగ్గర లంచం తీసుకున్న సైన్యాధికారులు, టిప్పుసుల్తాన్‌కు వెన్నుపోటు పొడిచారు.
*    పూర్ణయ్య, కమరుద్దీన్ అనే సైన్యాధికారులను పూర్తిగా నమ్మి బాధ్యతలు అప్పగించగా వారు టిప్పుసుల్తాన్‌ను మోసగించారు. వారు ఆంగ్లేయుల సైన్యం సంఖ్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చారు.
*    ఆంగ్లేయ సైన్యం దాడిచేసే మార్గంపై తప్పుడు సమాచారం ఇచ్చారు.
*    శ్రీరంగపట్నం రక్షణ బాధ్యతను కమరుద్దీన్‌కు అప్పగించగా ఆంగ్లేయులకు అమ్ముడుపోయిన కమరుద్దీన్ మైసూర్ సైన్యంలో కల్లోలం సృష్టించాడు.
*    ఈ విధంగా అవినీతికి పాల్పడి సొంతవారే మోసంచేయడంతో టిప్పుసుల్తాన్ ఓటమి పాలయ్యాడు. వీరమరణం పొందాడు.

 

యుద్ధ ఫలితాలు :
*    యుద్ధంలో సహాయం చేసిన మైసూర్ ఉద్యోగులు ఆంగ్లేయుల నుంచి బహుమతులు పొందారు.
*    టిప్పుసుల్తాన్‌కు చెందిన పుస్తక భాండాగారాన్ని ఇంగ్లాండుకు తరలించారు.
*    మైసూర్ పాలకుడిగా ఒడయార్ వంశానికి చెందిన కృష్ణరాజ - 3ని నియమించారు. కృష్ణరాజ - 3 బ్రిటిష్‌వారితో సైన్య సహకార ఒప్పందంపై సంతకంచేశాడు.
*    దుష్పరిపాలన కారణంగా 1831లో విలియం బెంటింక్ మైసూర్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
*   1882లో లార్డ్‌రిప్పన్ వైస్రాయ్ కాలంలో వడయార్ రాజవంశీయులకు బ్రిటిష్‌వారు మైసూర్ రాజ్యాన్ని అప్పగించారు.

 

హైదర్ఆలీ (1761 - 1782)
*    ఆధునిక భారతదేశ చరిత్రలో మైసూర్ రాజ్యానికి విశేష పేరు ప్రఖ్యాతులు తెచ్చిన పాలకుడు హైదర్ఆలీ.
*    విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత 'వడయార్ల' వంశపాలనలో స్వతంత్ర రాజ్యంగా ఉన్న మైసూర్ రాజ్యంలో హైదర్ఆలీ సైనికుడిగా జీవితం ప్రారంభించాడు
*    తక్కువ కాలంలోనే తన ప్రతిభతో 'దిండిగల్' ప్రాంతానికి ఫౌజుదార్ అయ్యాడు. ఫౌజ్‌దార్ అంటే శాంతిభద్రతలు చూసే అధికారి.
*    ఫ్రెంచివారి సహాయంతో 'దిండిగల్‌' లో ఆయుధ కర్మాగారం స్థాపించాడు.
*    క్రీ.శ. 1761లో కృష్ణరాజ వడయార్‌ను రాజ్యం నుంచి తొలగించి మైసూర్ స్వతంత్ర పాలకుడయ్యాడు. శ్రీరంగపట్నంను రాజధానిగా చేశాడు.
*    ఆంగ్లో-మైసూర్ మొదటి, రెండో యుద్ధాల్లో పాల్గొన్నాడు.
*    హైదర్ఆలీ నిరక్షరాస్యుడు. అయినా అతడి జ్ఞాపకశక్తి అమోఘం. దేశీయులతోపాటు విదేశీయులు కూడా గొప్పగా మెచ్చుకునేవారు.
*    పరమత సహనంగలవాడు. అవసరమైనప్పుడు శృంగేరి శంకరాచార్యుల సలహాలు తీసుకునేవాడు.
*    సామాన్య ప్రజలకు, సైనికులకు ఆరాధ్యదైవంగా వెలిగాడు.
*    ''రాజుకు, ప్రజలకు మధ్య సంబంధాన్ని తెంచివేయడానికి ప్రయత్నించడం అన్ని పాపాలకన్నా హీనమైంది. బలవంతులు బలహీనులను రక్షించాలి. దేవుడు రాజులను సృష్టించింది బలహీనులను కాపాడటానికే. తప్పుచేసినవారిని శిక్షించకపోయినా, ప్రజలను హింసించినవారిని రాజు వదలిపెట్టినా ప్రజలకు రాజుమీద నమ్మకం, ఆశలు నశిస్తాయి'' అని హైదర్ఆలీ చెప్పేవాడు.
*    అవసరమైతే రాత్రనక, పగలనక రోజుల తరబడి వానలో కూడా గుర్రం మీద ఎక్కడా నిలవకుండా స్వారీ చేసేవాడు. పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు హైదర్ఆలీ.
*    1782లో క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
*    భారతదేశ చరిత్రలో హైదర్ఆలీ మరువరాని వ్యక్తిగా మిగిలిపోయాడు.

 

టిప్పు సుల్తాన్ (1782 - 1799)
*    2, 3, 4 ఆంగ్లో- మైసూర్ యుద్ధాలు చేశాడు.
*    విదేశీ వర్తకాన్ని అభివృద్ధి చేసేందుకు ఫ్రాన్స్, టర్కీ, ఇరాన్, పెరూ దేశాలకు రాయబారులను పంపాడు.
*    ఫ్రెంచి విప్లవంతో ప్రభావితమయ్యాడు. ఫ్రెంచి విప్లవానికి స్ఫూర్తిగా శ్రీరంగపట్నంలో స్వేచ్ఛావృక్షాన్ని నాటించాడు.
*    ఫ్రెంచి విప్లవంలోని అతివాదుల సంఘం అయిన 'జాకోబియన్ క్లబ్‌' లో సభ్యుడిగా చేరాడు.
*    మైసూర్ రాజ్యమంతా ఒకే విధమైన ద్రవ్యవిధానం, తూనికలు, కొలతలు ప్రవేశపెట్టాడు.
*    శ్రీరంగపట్నంలోని రంగనాథ ఆలయానికి భూదానాలు చేసి పరమత సహనం పాటించాడు. శంకరాచార్యులను జగత్ గురువుగా భావించాడు.
*    యూరప్‌వారిని ఆదర్శంగా తీసుకుని ఆధునిక నౌకాదళాన్ని నిర్మించాడు.
*    'టైగర్ ఆఫ్ మైసూర్' గా కీర్తిపొందాడు.

 

Posted Date : 13-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌