• facebook
  • whatsapp
  • telegram

భారత స్వాతంత్య్ర ఉద్యమం

శాసనోల్లంఘన, సైమన్ కమిషన్ బహిష్కరణ
 

         భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా శాసనోల్లంఘన, సైమన్ కమిషన్ బహిష్కరణ ఉద్యమాలు ప్రఖ్యాతి గాంచాయి. ఇవి ఆంధ్రరాష్ట్రంలో కూడా కొనసాగాయి.

రౌండ్ టేబుల్ సమావేశాలు (1930-1932): సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా రాజ్యాంగ సంస్కరణలు యథాతథంగా ప్రవేశపెట్టడం ప్రమాదకరమని భావించారు. సైమన్ కమిషన్ నివేదికపై భారతదేశంలోని అన్ని రాజకీయ పక్షాలతో చర్చించి, రాజ్యాంగ సంస్కరణలు తీసుకురావాలని లండన్‌లో రౌండ్‌టేబుల్ సమావేశాలు ఏర్పాటుచేశారు. 1930 నవంబరులో మొదటి రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ముస్లింలీగ్, హిందూ మహాసభ, దళిత కులాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నప్పటికీ సంపూర్ణ స్వరాజ్యం ప్రాతిపదికగా చర్చలు జరపడానికి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించక పోవడంతో భారత జాతీయ కాంగ్రెస్ పాల్గొనలేదు.
 

గాంధీ-ఇర్విన్ ఒప్పందం (1931-మార్చి, 5 ): కాంగ్రెస్ ప్రతినిధులు లేకుండా రాజ్యాంగ సంస్కరణలపై సమావేశం నిర్వహించడం కష్టమని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించగా, ఎం.ఆర్.జయకర్, శ్రీనివాస శాస్త్రి, తేజ్‌బహదూర్‌సప్రూ మధ్యవర్తిత్వంతో గాంధీ-ఇర్విన్ మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం: కాంగ్రెస్ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేసి రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటుంది.
జైళ్లలో నిర్బంధంలో ఉన్నవారిని బ్రిటిష్ ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఉప్పు తయారీ హక్కును కల్పించడం మొదలైనవి చేపడుతుంది. ఆర్.సి.మజుందార్ అభిప్రాయం ప్రకారం- బ్రిటిష్ ఇండియా చరిత్రలో గాంధీ - ఇర్విన్ ఒడంబడిక భారత జాతీయ కాంగ్రెస్‌ను బ్రిటిష్ ప్రభుత్వం మొట్టమొదటగా తన రాజకీయ సమఉజ్జీగా గుర్తించే విధంగా చేసింది.

 

2వ రౌండ్ టేబుల్ సమావేశం: రెండో రౌండ్ టేబుల్ సమావేశం 1931 సెప్టెంబరులో ప్రారంభమైంది. ఇందులో ముస్లింలకు మాత్రమే కాకుండా, దళిత కులాలు, భారతీయ క్రైస్తవులు, ఆంగ్లో ఇండియన్లు, యూరోపియన్లకు కూడా ప్రత్యేక నియోజకవర్గాల కోసం డిమాండ్ చేశారు. అప్పటి బ్రిటన్ ప్రధాని రామ్‌సే మెక్‌డోనల్ అల్పసంఖ్యాకవర్గాల వారికి (మైనారిటీలు) ప్రత్యేక నియోజక వర్గాల ఏర్పాటు కోసం కమ్యూనల్ అవార్డ్ చేస్తామని చెప్పడంతో సమావేశం ముగిసింది. దీనిని గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇండియాకు నిరాశగా వచ్చారు.
కమ్యూనల్ అవార్డు ప్రకటన (1931 ఆగస్టు): భారతదేశంలోని ప్రజలు రాజకీయంగా ఒక జాతికి చెందినవారు కాదు. అనేక వర్గాలతో కూడిన వారు. శాసనసభల్లో వర్గ విభేదాల ఆధారంగా ప్రాతినిధ్యం ఉండాలి. అంటే రాష్ట్ర కేంద్ర శాసనసభల్లో ముస్లిములు, సిక్కులు ఆంగ్లో - ఇండియన్లు తదితరులకు ప్రత్యేక స్థానాలు కేటాయించడమే కమ్యూనల్ అవార్డ్.

 

పుణే ఒప్పందం: బ్రిటిష్ వారు భారతీయ సమాజాన్ని ముక్కలు చేసేందుకు కమ్యూనల్ అవార్డు ప్రకటించడంతో గాంధీ దానిని నిరసిస్తూ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించారు. 1932 సెప్టెంబరులో కమ్యూనల్ అవార్డుకు వ్యతిరేకంగా, రాజేంద్రప్రసాద్, రాజగోపాలాచారి మొదలైనవారు దళితవర్గాల నాయకుడైన అంబేద్కర్‌కు, గాంధీకి మధ్య ఒప్పందాన్ని రూపొందించారు. అదే పుణే ఒప్పందం. దీని ప్రకారం - రాష్ట్రాల శాసనసభల్లో బ్రిటిష్ ప్రధాని దళితులకు 71 స్థానాలు కేటాయించగా గాంధీ 148 స్థానాలు ఇస్తామన్నారు. ఆ స్థానాలన్నీ సంయుక్త నియోజక వర్గాలుగా ఉంటాయి.
అంటే ఆస్థానాల నుంచి దళితులతోపాటు, ఇతర హిందువులు కూడా నియోజకవర్గానికి నలుగురు చొప్పున ఉంటారు.

3వ రౌండ్ టేబుల్ సమావేశం: 1932 నవంబరులో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పాల్గొనలేదు. అంబేద్కర్ దళితవర్గాల తరపున సమావేశాలకు హాజరయ్యారు. రెండో రౌండ్ సమావేశంలో, రక్షణ, సమాఖ్య నిర్మాణం, మహిళల ఓటుహక్కు మొదలైన విషయాలపై నియమించిన ఉపసంఘాల నివేదికపై చర్చ జరిగింది. మూడో రౌండ్‌టేబుల్ సమావేశంలో జరిపిన చర్చల ప్రాతిపదికన 1933 మార్చిలో పార్లమెంటుకు ఒక శ్వేత పత్రం సమర్పించారు. దీనిని బ్రిటిష్ పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశీలించి, ఆమోదించింది. ఈ నివేదిక ఆధారంగా భారతదేశంలో నూతన రాజ్యాంగ సంస్కరణల కోసం బ్రిటిష్ ప్రభుత్వం పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. అదే 1935 భారత ప్రభుత్వ చట్టంగా రూపొందింది.
 

శాసనోల్లంఘన ఉద్యమం లేదా ఉప్పు సత్యాగ్రహం 

* 1919 మాంటేంగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలపై అసంతృప్తి వ్యక్తమైంది. సైమన్ కమిషన్‌ను భారతీయులు బహిష్కరించారు. మోతీలాల్ నెహ్రూ నివేదికను ఆంగ్లేయులు తిరస్కరించారు. 1929 ఆర్థిక మాంద్యం, విప్లవ ఉగ్రవాదుల కార్యకలాపాలు భారతీయులను ఉత్తేజ పరచడం, 1929 లాహోర్ కాంగ్రెస్ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యమే భారతీయుల అంతిమ లక్ష్యమనే చరిత్రాత్మక ప్రకటన తదితర కారణాలతో శాసనోల్లంఘన ఉద్యమం జాతీయస్థాయితోపాటు, ఆంధ్రలో కూడా ప్రారంభమైంది.
*  శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా గాంధీజీ మొట్టమొదట ఉప్పు తయారీతో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించడానికి సంకల్పించారు. 1930 ఏప్రిల్ 6న గుజరాత్ తీరంలో ఉన్న దండి గ్రామంలో ఉప్పు తయారు చేయడంతో శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభమైంది. దండియాత్రలో ఆంధ్ర నుంచి ఎర్నేని సుబ్రమణ్యం పాల్గొన్నారు.
* ఉప్పు సత్యాగ్రహం అనే పేరుతో ప్రసిద్ధమైన శాసనో ల్లంఘన ఉద్యమానికి ఆంధ్రలో కొండా వెంకటప్పయ్య నాయకత్వం వహించారు. దక్షిణ భారతదేశం మొత్తంలో ఆంధ్రలోనే ఉప్పు శాసనోల్లంఘన ఉద్యమం తీవ్రంగా నడిచింది. 
* పలు జిల్లాల్లో ఉప్పు సత్యాగ్రహం: ఆంధ్ర రాష్ట్రంలో ఉప్పు సత్యాగ్రహం మొదట కృష్ణాజిల్లాలో ప్రారంభమైంది. అయ్యదేవర కాళేశ్వరరావు, పట్టాభి సీతారామయ్య, మట్నూరి కృష్ణారావు మొదలైన వారు మచిలీపట్నం సముద్రతీరానికి వెళ్ళి ఉప్పును తయారు చేసి ఆదేరోజు జరిగిన బహిరంగసభలో పంచిపెట్టారు.
* గుంటూరు: కొండా వెంకటప్పయ్య స్వగృహంలో ఉప్పును తయారు చేశారు. గుంటూరు జిల్లాలో ఉప్పు సత్యాగ్రహాన్ని వ్యాప్తిచేసిన మహిళల్లో ఉన్నవ లక్ష్మీ బాయమ్మ, రుక్మిణీ లక్ష్మీపతి ముఖ్యులు. త్రిపురనేని రామస్వామి చౌదరి ''వీర గంధము తెచ్చినారము, వీరులెవ్వరో తెల్పుడి'' అనే గేయం తెనాలిలో బాగా స్ఫూర్తినిచ్చింది. 
* తూర్పుగోదావరి జిల్లాలో బులుసు సాంబమూర్తి, వెన్నంటి సత్యనారాయణ కాకినాడ వద్ద ఉప్పు తయారు చేయగా, పశ్చిమగోదావరి జిల్లాలో గోవిందాచార్యులు, దండు నారాయణరాజు నేతృత్వంలో ఉప్పును తయారు చేశారు. ఈ విధంగా ఉప్పు సత్యాగ్రహం అన్ని జిల్లాల్లో జరిగింది. 
*  రాయలసీమకు సముద్రతీరం లేనందువల్ల ఉప్పును తయారు చేయలేదు. కానీ రాయలసీమ పితామహుడుగా కల్లూరు సుబ్బారావు శాసనోల్లంఘన ఉద్యమం నడిపారు.
* ఆంధ్రలో ప్రతిజిల్లాలో ఉద్యమ నిర్వహణకు శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటిలో వాలంటీర్లకు శిక్షణనిచ్చారు. సమాచారం అందించారు. కొత్తవారిని చేర్చుకున్నారు. ఉద్యమ నిర్వహణకు విశేషకృషి చేశారు. శిబిరాలలో నెల్లూరు జిల్లాలోని పల్లిపాడు, తూర్పుగోదావరి జిల్లాలో సీతానగరం మొదలైనవి ఉన్నాయి. 
* ఉప్పు సత్యాగ్రహంతోపాటు అనేక కార్యక్రమాలు శాసనోల్లంఘన ఉద్యమంలో భాగంగా జరిగాయి. అవి: 
* విదేశీ వస్తు బహిష్కరణ: విజయవాడ, గుంటూరు, ఏలూరు, మచిలీపట్నంలలో వర్తకులు విదేశీ వస్త్రాల దిగుమతిని నిషేధించారు. విదేశీ వస్త్రాలు అమ్మే దుకాణాలవద్ద ఆందోళన చేపట్టారు. గుంటూరు, తెనాలి, బాపట్ల, మొదలైనచోట్ల న్యాయవాదులు స్వదేశీ తీర్మానాలు చేసి, ఖద్దరు ధరించి కోర్టుకు వెళ్లారు. 
* గ్రామాధికారుల సహాయనిరాకరణ ఉద్యమం: శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతుగా గ్రామాధికారులు ఆంధ్రరాష్ట్రంలో పలుచోట్ల రాజీనామాలు చేశారు. చల్లపల్లి, యలమంచిపాడు మొదలైనచోట్ల రాజీనామా చేసిన వారిని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రంగా శిక్షించింది.
మద్య నిషేధ కార్యక్రమం: మద్య నిషేధ కార్యక్రమంలో, కల్లుతీసే చెట్లను నరికివేయడం ప్రఖ్యాతిగాంచింది. గుంటూరు జిల్లాలో తాటిచెట్లను నరికివేసే కార్యక్రమానికి గొల్లపూడి సీతారామ శాస్త్రి నాయకత్వం వహించారు. పలుచోట్ల కల్లు, సారాయి దుకాణాల వద్ద ఆందోళనలు, మద్యం తాగబోమని శపథాలు చేశారు. 
*  పదవులకు రాజీనామాలు: శాసనోల్లంఘన ఉద్యమానికి మద్దతుగా టంగుటూరి ప్రకాశం, వి.వి. జోగయ్య, గాడిచర్ల హరిసర్వోత్తమరావు తదితరులు శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. 
*  పన్నుల నిరాకరణ ఉద్యమం: పన్నుల నిరాకరణ ఉద్యమంలో భాగంగా యల్లాయపాలెం రైతులు పన్నులు చెల్లించడానికి నిరాకరించగా, శిస్తు చెల్లించలేదని ములుమూడి సుబ్బారామరెడ్డి ఆస్తులను ప్రభుత్వ అధికారులు జప్తు చేసేందుకు ప్రయత్నించారు. దాన్ని గ్రామ ప్రజలు విఫలం చేశారు.
*  పతాక ఆవిష్కరణ ఉద్యమం: ప్రజల్లో దేశభక్తిని పునరుజ్జీవింప చేయడానికి కాంగ్రెస్ జాతీయ పతాకావిష్కరణ ఉద్యమాన్ని నిర్వహించింది. మచిలీపట్నంలో తిలక్‌చౌక్ వద్ద జెండా ప్రతిష్ఠాపనకు ప్రయత్నించగా తోట నర్సయ్య అనే వ్యక్తిని పోలీసులు స్పృహ కోల్పోయే విధంగా కొట్టారు. గుంటూరు, కృష్ణాజిల్లాల్లో జెండా ప్రదర్శనలో పొల్గొన్న వారిని ప్రభుత్వం అరెస్ట్ చేసి లాఠీలతో కొట్టడమే కాకుండా, ఆమాయక ప్రజలపై కాల్పులు జరిపింది.
*  మొదటి దశ శాసనోల్లంఘన ఉద్యమం నిలుపుదల: 1931 మార్చి 5న గాంధీ- ఇర్విన్ ఒప్పందంతో శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిలిపివేశారు. 
*  ద్వితీయ శాసనోల్లంఘన ఉద్యమం: (1932 జనవరి నుంచి 1934 మే 20 వరకు): గాంధీ - ఇర్విన్ ఒప్పందాన్ని అనుసరించి గాంధీ 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి లండన్‌లో హాజరయ్యారు. అక్కడ కమ్యూనల్ అవార్డ్‌పై (మైనారిటీ వర్గాలకు ప్రత్యేక నియోజకవర్గాలు) బ్రిటిష్ ప్రభుత్వం మొగ్గు చూపటంతో గాంధీ నిరాశగా ఇండియాకు వచ్చేశారు. దీంతో శాసనోల్లంఘన ఉద్యమం పునః ప్రారంభమైంది. 
*  1932 ఏప్రిల్‌లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జాతీయ వారోత్సవాలు జరిపి, జాతీయ పతాకాలు ఎగురవేశారు. ఖద్దరు ఉద్యమాన్ని విశేషగా ప్రచారంచేశారు. 
*  144వ సెక్షన్‌ను ఉల్లంఘించి ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘం 1932లో జూన్‌లో గుంటూరులో సమావేశమైంది. 
*  పత్రికలపై ప్రభుత్వ ఆంక్షలను ఉల్లంఘించి, వీరభారతి అనే పత్రిక ఉద్యమ వ్యాప్తికి కృషి చేసింది. పలు కరపత్రాలను ఉద్యమ ప్రచారానికి రహస్యంగా వినియోగించారు. ఉదా: బార్డోలి సత్యాగ్రహ విజయం, భారత స్వరాజ్య యుద్ధం, పూర్ణ స్వాతంత్య్రం తదితరాలు. 
*  1932 మార్చిలో మద్రాస్ పౌరులు 'బయ్ ఇండియన్ లీగ్' స్థాపించి, విదేశీ వస్తు బహిష్కరణ చేసి, స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించారు. 
*  ప్రభుత్వం నానా హింసలకు గురిచేసినా స్త్రీలు వేల సంఖ్యలో పాల్గొని వీరత్వాన్ని చాటుకొన్నారు. భారతదేవిరంగా, దుర్గాభాయి, భారతదేవి తదితరులు పాల్గొనడమేగాక, వేలమంది స్త్రీలను ఉత్తేజపరిచారు.

 

ఉద్యమ క్షీణత 

*  ప్రభుత్వ అణచివేత చర్యలతో ఉద్యమం క్షీణించింది. 
* ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ సంఘంతోపాటు, జిల్లా, తాలూకా కాంగ్రెస్ సంఘాలను బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 
* ప్రముఖ నాయకులైన టంగుటూరి ప్రకాశం, పట్టాభి సీతారామయ్య, బులుసు సాంబమూర్తి తదితరులను ప్రభుత్వం అరెస్ట్‌చేసింది. 
* 144 సెక్షన్ ప్రవేశపెట్టి బహిరంగ సభలు, ఊరేగింపులు, ప్రదర్శనలు జరపరాదని శాసించారు. 
* గాంధీ టోపీ ధరించడం, జాతీయ జెండా ఎగురవేయడాన్ని నిషేధించారు. 
* ప్రభుత్వాన్ని విమర్శించడం, జాతీయ నాయకుల చిత్రాలు, ఉద్యమ వార్తలు ప్రచురించడాన్ని నిషేధించారు. దీంతో కాంగ్రెస్, దరిద్రనారాయణ మొదలైన పత్రికల ప్రచురణ ఆగిపోయింది. 
* కాంగ్రెస్ కమిటీలు, నాయకులకు బ్యాంకులు పరపతి ఇవ్వడాన్ని నిషేధించారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య తదితరులు ఆంధ్రాబ్యాంక్, భారత లక్ష్మీ బ్యాంక్, ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెనీల్లో డబ్బు చెల్లించడం, తీసుకోవడం చేయరాదని ఆంక్షలు విధించారు.
* శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నవారికి సామూహిక జరిమానాలు విధించారు. కృష్ణాజిల్లాలోని వెండ్రప్రగడ గ్రామవాసులకు 4000 రూపాయల సామూహిక జరిమానా విధించారు. కొందరి ఆస్తులను జప్తుచేశారు. 
*  పోలీసులు దురాగతాలకు పాల్పడి ప్రజల్లో భయభ్రాంతులు సృష్టించారు. కాకినాడలో బులుసు సాంబమూర్తిని అపస్మారక స్థితి వచ్చే వరకు కొట్టారు. బర్హాంపూర్‌లో ఆందోళనకారులపై పోలీస్‌లు కాల్పులు జరిపారు. 
*  గాంధీ ఆశ్రమాలను నిషేధించి, ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా సీతానగర ఆశ్రమాన్ని ధ్వంసం చేయడంతో పాటు, ఆశ్రమ నిర్వహణకర్త బ్రహ్మజోశ్యుల సుబ్రమణ్యాన్ని స్పృహకోల్పోయే విధంగా కొట్టారు.  ఈ విధంగా బ్రిటిష్ ప్రభుత్వ అణచివేత చర్యలు జరిగాయి. జాతీయ స్థాయిలో గాంధీ అరెస్ట్‌తోపాటు, సామూహిక శాసనోల్లంఘనకు బదులు వ్యక్తి శాసనోల్లంఘనానికి పిలుపునివ్వడం మొదలైన సంఘటనలతో ఉద్యమం క్షీణించడంతో, ఉద్యమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. 
*  సంపూర్ణ స్వరాజ్యం అనే లక్ష్యం సాధించకుండానే ఉద్యమం ముగిసినా ప్రజలకు స్వాతంత్య్రం సాధించడానికి కావాల్సిన ధైర్యాన్నిచ్చింది. స్త్రీలు సైతం బాధలను లెక్కచేయకుండా త్యాగాలకు సిద్ధపడేలా చేసింది. ఆంధ్ర శాసనోల్లంఘన ఉద్యమం తర్వాత రాబోయే ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.

 

ఆంధ్రలో సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమం 

1919 మాంటేంగ్ - చెమ్స్‌ఫర్డ్ సంస్కరణలను సమీక్షించడానికి 1927లో బ్రిటిష్ ప్రభుత్వం సర్ జాన్ సైమన్ అధ్యక్షతన కమిషన్‌ను నియమించింది. 
* ఈ కమిషన్‌లో ఉన్న సభ్యులందరూ ఆంగ్లేయులు కావడంతో, భారతీయులకు ఎలాంటి ప్రాతినిథ్యం లేకపోవడంతో జాతీయ కాంగ్రెస్ ఈ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించింది.

 

బహిష్కరణ ముఖ్యాంశాలు: 

*  కమిషన్‌కు ఎలాంటి సహకారం ఇవ్వకూడదు. 
*  కమిషన్, విచారణ సందర్భంగా వారికెలాంటి సమాచారం అందచేయకూడదు.
*  వారు ఏ ప్రాంతం సందర్శించినా, వారి రాకపై అసమ్మతిగా 'సైమన్ గో బ్యాక్' నినాదం, నల్లజెండాల ప్రదర్శనలు మొదలైనవి చేయాలి. 
*  ఆంధ్రలో సైమన్ వ్యతిరేక కమిటి ఎన్.సత్యమూర్తి అధ్యక్షతన ఏర్పడింది. 1928 ఫిబ్రవరి 3వ తేదీన సైమన్ కమిషన్ బొంబాయిలో అడుగుపెట్టగానే ఆంధ్రప్రదేశ్ అంతటా సైమన్ వ్యతిరేక ఉద్యమం జరిగింది. కమిషన్ పర్యటన కోసం ఆంధ్రదేశంలో గుంటూరు, ఒంగోలు పట్టణాలను ప్రభుత్వం ఎంపిక చేయగా, ఆ పట్టణాల్లో కమిషన్ పర్యటించినపుడు ప్రజలు నల్లజెండాలతో 'సైమన్ గోబ్యాక్' నినాదాలతో స్వాగతం పలికారు. 
*  1928 ఫిబ్రవరి 26న సైమన్ కమిషన్ మద్రాసును సందర్శించినపుడు సైమన్ కమిషన్ బహిష్కరణోద్యమానికి టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వం వహించారు. వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించిన ప్రజలపై పోలీసులు కాల్పులు జరిపారు.
ఈ సందర్భంగా చనిపోయిన పార్థసారథి అనే వ్యక్తిని చూసేందుకు ప్రకాశం పంతులు వెళ్ళగా, పోలీసులు అడ్డగించారు. 'ముందుకు వస్తే కాలుస్తామని' బెదిరించగా, ప్రకాశం పంతులు బెదరక 'ధైర్యముంటే కాల్చండి' అని చొక్కా గుండీలు ఊడదీసి గుండెను చూపించగా పోలీసులు వెనుతిరిగారు. ప్రకాశం ధైర్య సాహసాలకు మెచ్చి ఆయనను ప్రజలు 'ఆంధ్రకేసరి' అని కీర్తించారు.

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌