• facebook
  • whatsapp
  • telegram

విజయనగర రాజుల సాంస్కృతిక సేవ

క్రీ.శ. 14వ శతాబ్దం ప్రథమార్థంలో స్థాపితమైన విజయనగర సామ్రాజ్యం క్రీ.శ. 16 శతాబ్దం నాటికి అత్యున్నత దశకు చేరుకుని, 17వ శతాబ్దానికి అంతమైంది. విజయనగర రాజులు సామాజిక, ఆర్థిక సుస్థిరతను పెంపొందించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు. మత సామరస్యం, విద్య, సాహిత్యం, కళలు, చిత్రలేఖనం, వాస్తు శాస్త్రం అభివృద్ధికి కృషి చేశారు. భారతదేశ చరిత్రలో హిందూ సాంస్కృతిక వికాసంలో చివరిదశగా విజయనగర యుగాన్ని పేర్కొనవచ్చు.
విజయనగర కాలంలోనూ బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే చతుర్వర్ణ విధానమే కొనసాగింది. విజయనగర రాజులు వర్ణవ్యవస్థను పరిరక్షించడానికి తమ వంతు కృషి చేశారు. అయితే బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యం ఇచ్చి, ప్రధాన మంత్రులు, రాజగురువులు, దండ నాయకులుగా వారిని నియమించేవారు. సాళువ తిమ్మరుసు, అతని కొడుకు కృష్ణదేవరాయల ప్రధానమంత్రి, సైన్యాధ్యక్షులుగా వ్యవహరించారు. సమాజంలో ఉన్నత కులాలకు చెందిన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు సామరస్యంతో జీవించేవారు.

 

స్త్రీల స్థాయి: విజయనగర కాలంలో స్త్రీలు సమాజంలో గొప్పస్థానాన్ని ఆక్రమించారు. వారు సామాజిక, రాజకీయ, మత జీవితంలో ప్రధానపాత్ర పోషించారు. విజయనగర కాలంలో స్త్రీలు జ్యోతిష్కులు, గణాంక అధికారులు, చరిత్రకారులు, సంగీత విద్వాంసులు, న్యాయమూర్తులు, రాజప్రసాద రక్షకులుగా పనిచేసినట్లు నూనిజ్ పేర్కొన్నాడు. రాజులు, ఉన్నతోద్యోగులు బహుభార్యత్వాన్ని ఆచరించినట్లు నికోలో డి కాంటె పేర్కొన్నాడు. ఈ కాలంలో బాల్యవివాహాలు సాధారణం.
పెళ్లి సమయంలో భారీగా వరకట్నం తీసుకునేవారు. సతీసహగమనం కూడా సర్వసాధారణం. అయితే ఇది ఉన్నత వర్గాల స్త్రీలకు మాత్రమే పరిమితమైంది. రాజు మరణించినప్పుడు అతని భార్యలు సతీసహగమనం చేయడాన్ని గౌరవంగా భావించేవారు. స్త్రీలు రాజకీయ, సాహిత్యరంగాల్లో పాలుపంచుకున్నారు. కొంతమంది రాణులు కవయిత్రులుగా ప్రసిద్ధి చెందారు. గంగాదేవి, తిరుమలదేవి దీనికి నిదర్శనం.

 

నగర జీవనం: విజయనగరంలో రాజులు, ఉన్నతోద్యోగుల విలాసవంతమైన జీవనం గురించి అబ్దుల్ రజాక్ చక్కగా వర్ణించాడు. విజయనగరం లాంటి నగరాన్ని భూమి మీద ఇంతవరకు చూడలేదని అబ్దుల్ రజాక్ పేర్కొన్నాడు.
 

వినోదాలు: విజయనగర రాజులు, ఉన్నతోద్యోగులు శాంతి సమయాల్లో అనేక పండుగలను జరుపుకుంటూ, వినోదాల్లో పాల్గొనేవారు. నికోలో డి కాంటె, అబ్దుల్ రజాక్ రాజులు, ఉన్నతోద్యోగులు అట్టహాసంగా జరుపుకొనే కొన్ని పండుగల గురించి ప్రస్తావించారు. వాటిలో ప్రధానమైంది - మహార్ణవమి పండుగ. ఈ పండుగను సాధారణంగా తొమ్మిది రోజులపాటు జరుపుకునేవారు. ఈ పండుగ గురించి అబ్దుల్ రజాక్ ఇలా పేర్కొన్నాడు. ''విజయనగర రాజు దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి ప్రభువులు, ఉన్నతోద్యోగులు విజయనగరంలో సమావేశం కావలసిందిగా ఆదేశించేవాడు".
* నికోలో డి కాంటె అభిప్రాయం ప్రకారం విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ దీపావళి. ఈ పండుగ సందర్భంగా అనేక నూనె దీపాలు రాత్రింబవళ్లు వెలుగుతూ ఉండేవి.
* విజయనగర ప్రజలు జరుపుకునే మరో పండుగ వసంతోత్సవం. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వీధుల్లో వెళ్లేవారిపై (రాజు, రాణితో సహా) పసుపు నీళ్లు చల్లేవారు. ఈ ఉత్సవాల సందర్భంగా సామాన్య ప్రజలకు కూడా ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది.
* శ్రీకృష్ణదేవరాయలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందు నువ్వుల నూనె తాగి ఆ నూనె చెమట రూపంలో బయటకు వచ్చేవరకు మట్టితో కూడిన బరువులు ఎత్తి, కత్తితో వ్యాయామం చేసేవాడని తర్వాత కుస్తీ పోటీలో పాల్గొని, స్నానానికి ముందు గుర్రపు స్వారీ చేసేవాడని పోర్చుగీసు యాత్రికుడు డోమింగో పేస్ పేర్కొన్నాడు.

 

బలులు: విజయనగర కాలంలో భారీగా బలులు ఇచ్చేవారు. కొన్ని పండుగల సందర్భంగా నిర్వహించే జంతు బలులను రాజు స్వయంగా వీక్షించేవాడని, మహార్ణవమి పండుగ చివరి రోజున 250 దున్నపోతులు, 450 గొర్రెలను బలి ఇచ్చేవారని పేస్ పేర్కొన్నాడు.
* మానవులను బలి ఇచ్చే దురాచారం విజయనగర కాలంలో సాధారణం. చెరువులు, రిజర్వాయర్లు, దేవాలయాల ప్రారంభోత్సవం సమయంలో యుద్ధ ఖైదీలను బలి ఇచ్చేవారు.


మతం 
విజయనగర రాజులు మతసామరస్యాన్ని పాటించారు. కృష్ణదేవరాయలు శైవులు, వైష్ణవులు, జైనులు, క్రిస్టియన్లు, పార్శీల పట్ల ఆదరణ చూపాడని బార్బోసా పేర్కొన్నాడు. శ్రీకృష్ణదేవరాయలు వైష్ణవ మతాభిమాని. హంపిలో ప్రసిద్ధి చెందిన విఠలస్వామి దేవాలయం, హజారరామ దేవాలయాలను నిర్మించాడు.
* అచ్యుతదేవరాయలు కూడా విష్ణుభక్తుడే. అయితే కంచి, లేపాక్షిలలోని శివాలయాలకు ఇతడు భారీగా దానధర్మాలు చేశాడు. రామరాయలు కూడా పరమత సహనాన్ని పాటించాడు. ముస్లిం ప్రజలు, సైనికులు విధేయపూర్వకంగా తనని కలవడానికి వచ్చినప్పుడు రామరాయలు ఖురాన్ ప్రతిని తన ముందు ఉంచేవాడు.


ఆర్థిక పరిస్థితులు 
విదేశీ యాత్రికుల రచనలను బట్టి విజయనగర కాలంలో ఆర్థిక పరిస్థితి బాగున్నట్లు తెలుస్తోంది. విజయనగర రాజుల వద్ద లెక్కకు మించిన సంపద ఉండేదని, విజయనగరంలోని ప్రజలు విలువైన రాళ్ల వ్యాపారం చేసేవారని, అక్కడ వస్తువులు ఎక్కువ సంఖ్యలో, చౌకగా లభించేవని డోమింగో పేస్ పేర్కొన్నాడు.
* తళ్లికోట యుద్ధంలో విజయనగర రాజు ఓటమి తర్వాత జరిగిన రెండు సంఘటనలను బట్టి విజయనగర రాజుల వెలకట్టలేని సంపదను అర్థం చేసుకోవచ్చు. మొదటిది - రామరాయల కొడుకు తిరుమలరాయలు విజయనగరంలోకి ప్రవేశించి, సదాశివరాయల ఖజానాలోని మొత్తం సంపదను 1550 ఏనుగులపై ఎక్కించి పెనుగొండకు తరలించాడు. రెండవది- యుద్ధం తర్వాత విజయనగరాన్ని ధ్వంసం చేసిన ముస్లింలు 10 కోట్ల స్టెర్లింగ్‌ల విలువైన బంగారం, వజ్రాలు, విలువైన రాళ్లతోపాటు, విలువైన రాళ్లతో చేసిన రాజ సింహానాన్ని 550 ఏనుగులపై తరలించారని రాబర్ట్ సెవెల్ 'ఎ ఫర్‌గాటెన్ ఎంపైర్' (A forgotten Empire) అనే గ్రంథంలో పేర్కొన్నారు.


వర్తక వాణిజ్యాలు
అభివృద్ధి చెందిన వర్తక, వాణిజ్యాలు విజయనగర కాలం నాటి ఆర్థిక వ్యవస్థ ప్రధాన లక్షణం. ఈ వ్యాపారం భూమార్గం, తీర ప్రాంతాలు, సముద్ర మార్గాల ద్వారా జరిగేది. విజయనగర సామ్రాజ్యంలో కాలికట్, కొచ్చిన్, భట్కల్, మంగుళూరు మొదలైనవి ప్రధాన ఓడరేవులు. కోరమాండల్, మలబార్ తీరాలను వర్తక వాణిజ్యాల అభివృద్ధికి పూర్తిస్థాయిలో వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. విదేశీ వ్యాపారం పోర్చుగీసు, అరబ్ వ్యాపారుల ద్వారా జరిగేది.
హిందూ మహాసముద్రంలోని దీవులు- మలయ, బర్మా, చైనా, అబీసీనియా, దక్షిణాఫ్రికా, పర్షియా లాంటి దేశాలతో విజయనగర ప్రజలకు వర్తక సంబంధాలు ఉండేవి. విజయనగర సామ్రాజ్యం నుంచి వస్త్రాలు, ఇనుము, చక్కెర, సుగంధ ద్రవ్యాలు, బియ్యం లాంటివి ఎగుమతయ్యేవి. గుర్రాలు, ఏనుగులు, పగడాలు, పాదరసం, చైనా పట్టు మొదలైనవి ప్రధాన దిగుమతులు.


సాహిత్యం
విజయనగర రాజులు తెలుగు, సంస్కృతం, కన్నడ, తమిళ కవులను ఆదరించారు. కొంతమంది చక్రవర్తులు, రాణులు సాహిత్యరంగంలో ప్రసిద్ధి చెందారు.


సంస్కృతం
విజయనగర కాలం నాటి తొలి రోజుల్లో ముఖ్యంగా మొదటి బుక్కరాయల కాలంలో శయనుడి ఆధ్వర్యంలో అనేకమంది పండితులు ఉండేవారు. వారు నాలుగు వేదాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలపై వ్యాఖ్యానాలు రచించారు. దేవరాయలు 15వ శతాబ్దంలో శ్రీరంగంలో రచించిన 'నిఘంటు వ్యాఖ్య' అనే గ్రంథం ప్రముఖమైంది. రామాయణం, మహాభారతంపై వ్యాఖ్యానాలు రచించిన గోవిందరాజ (ఇతడు కాంచీపురం వాస్తవ్యుడు) శ్రీకృష్ణదేవరాయలు, రామరాయలకు సమకాలీకుడు.
* మొదటి బుక్కరాయల రెండో కుమారుడు కుమార కంపన విజయాలను అతడి రాణి గంగాదేవి తన 'మధురా విజయం'లో వివరించింది. అచ్యుత దేవరాయల ఆస్థానకవి రాజనాథుడు 'సాళువాభ్యుదయం, భాగవత చంపూ, అచ్యుతాభ్యుదయం' అనే గ్రంథాలు రచించాడు.
అచ్యుతాభ్యుదయంలో అచ్యుత దేవరాయల పాలన గురించిన వర్ణన ఉంటుంది. తిరుమలాంబ రచించిన వరదాంబిక పరిణయం అనే చారిత్రక గ్రంథంలో వరదాంబికతో అచ్యుతరాయల వివాహాన్ని పేర్కొన్నారు. శ్రీకృష్ణదేవరాయలు సంస్కృత, తెలుగు భాషల్లో గొప్ప కవి, పండితుడు. ఇతడు సంస్కృతంలో రచించిన జాంబవతి కల్యాణం అనే నాటకం ప్రసిద్ధి చెందింది.


కన్నడం
విజయనగర కాలం నాటి లింగాయత్ సాహిత్యంలో సంస్కర్తలు, భక్తుల కథలు ప్రధానమైనవి. క్రీ.శ. 1369లో భీమకవి రచించిన బసవ పురాణం ఇందులో ముఖ్యమైంది. బసవేశ్వరుని జీవితం గురించి రచించిన మరో గ్రంథం మాల బసవరాజ చరిత. దీన్ని సింగిరాజు క్రీ.శ. 1500లో రచించాడు. దీనికే మరోపేరు సింగిరాజు పురాణం. ఇందులో బసవేశ్వరుని 84 అద్భుతాల గురించి పేర్కొన్నారు.
* రెండో దేవరాయల ఆస్థానంలోని చామరసుడు 'ప్రభు లింగతాల' అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని దేవరాయలకు చదివి వినిపించగా దేవరాయలు దీన్ని తెలుగు, తమిళంలోకి అనువదించేలా చర్యలు తీసుకున్నాడు. చామరసుడు రాజు సమక్షంలో వైష్ణవులతో వాగ్వాదాలు చేసేవాడు. కన్నడ భారతాన్ని రచించిన కుమార వ్యాసుడు చామరసుడికి ప్రధాన పోటీదారుడు. క్రీ.1584లో విరూపాక్ష పండితుడు చెన్న బసవ పురాణాన్ని రచించాడు.
* శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి వైష్ణవ ఉద్యమం కన్నడ సాహిత్యం మీద గొప్ప ప్రభావం చూపింది. మహాభారతంలోని మొదటి పది పర్వాలను నరసప్ప కన్నడంలోకి అనువదించాడు. మిగిలిన పర్వాలను క్రీ.శ. 1510లో తిమ్మన్న కృష్ణరాయల పేరు మీదుగా కృష్ణరాయభారతం అనే పేరుతో అనువదించాడు. కృష్ణదేవరాయలు, అచ్యుత రాయల ఆస్థానంలోని చటు విఠలనాథుడు భాగవతాన్ని కన్నడంలోకి అనువదించాడు.


తెలుగు
తెలుగు సాహిత్య చరిత్రలో రాయల యుగాన్ని స్వర్ణయుగంగా భావించవచ్చు. ఇంగ్లండ్‌లో ఎలిజబెత్ యుగంతో, గ్రీసులో పెరిక్లస్ యుగంతో రాయల కాలాన్ని పోల్చవచ్చు. రాయల ఆస్థానానికి భువన విజయం అనే పేరుంది. ఆయన ఆస్థానంలో అష్టదిగ్గజాలనే ఎనిమిది మంది కవులుండేవారు. కృష్ణదేవరాయలు 'దేశభాషలందు తెలుగు లెస్స' అని పేర్కొన్నాడు. ఈ కాలాన్ని ప్రబంధ యుగంగా పిలుస్తారు.
* అష్టదిగ్గజాల్లో మనుచరిత్రను రచించిన అల్లసాని పెద్దన సాటిలేని మేటికవిగా ప్రసిద్ధి చెందాడు. మనుచరిత్రకే స్వారోచిష మనుసంభవం అనే పేరు కూడా ఉంది. కృష్ణదేవరాయలు పెద్దనకు 'ఆంధ్ర కవితా పితామహుడు' అనే బిరుదునిచ్చి సత్కరించాడు. పెద్దన మనుచరిత్రను కృష్ణదేవరాయలకు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా రాయలు పెద్దన కాలికి గండపెండేరాన్ని తొడిగి, పెద్దన ఎక్కిన పల్లకీని స్వయంగా మోశాడు. కోకట గ్రామాన్ని పెద్దనకు దానంగా ఇచ్చాడు.
* నంది తిమ్మన పారిజాతాపహరణం అనే గ్రంథాన్ని రచించి రాయలకు అంకితమిచ్చాడు. భట్టుమూర్తికి రామరాజ భూషణుడు అనే పేరు కూడా ఉంది. ఇతని గ్రంథాల్లో ముఖ్యమైంది వసుచరిత్ర. ఇందులో రాకుమారుడు వసు, రాకుమారి గిరికల వివాహం గురించి పేర్కొన్నారు.
* ధూర్జటి 'కాళహస్తి మాహాత్మ్యం', అతని కుమారుడు కుమార ధూర్జటి 'కృష్ణదేవరాయ విజయం' రచించారు. కృష్ణదేవరాయ విజయంలో చక్రవర్తి యుద్ధ విజయాల గురించి పేర్కొన్నారు. పింగళి సూరన రాఘవ పాండవీయం, ప్రభావతి ప్రద్యుమ్నం గ్రంథాలను రచించాడు. సూరన తన రచనల్లో ఉత్తమమైందిగా ప్రభావతీ ప్రద్యుమ్నాన్ని పేర్కొన్నాడు. ఈ గ్రంథం దైత్యరాజును శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు ఓడించిన తీరును, దైత్యరాజు కుమార్తె ప్రభావతితో ప్రద్యుమ్నుడి వివాహాన్ని వివరిస్తుంది.
తెనాలి రామకృష్ణుడు పాండురంగ మాహాత్మ్యం, ఉద్భటారాధ్య చరిత్ర, ఘటికాచల మాహాత్మ్యం అనే గ్రంథాలను రచించాడు. మాదయగారి మల్లన 'రాజశేఖర చరితం' అనే గ్రంథాన్ని, అయ్యలరాజు రామభద్రుడు 'రామాభ్యుదయం' అనే గ్రంథాన్ని రచించారు.
* శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కవి, పండితుడు. ఇతడు తెలుగులో ఆముక్తమాల్యద లేదా విష్ణుచిత్తీయం అనే గ్రంథాన్ని రచించాడు. దీన్ని తెలుగు సాహిత్యంలో అయిదు గొప్ప కావ్యాల్లో ఒకటిగా పేర్కొంటారు. ఇది తెలుగు సాహిత్యంపై వైష్ణవ మత ప్రభావం ప్రారంభమవడాన్ని సూచిస్తుంది. ఇది ఆళ్వార్ విష్ణుచిత్తుడి జీవితం గురించి, అతడి వైష్ణవ తత్వాన్ని గురించి వివరిస్తుంది.
* మొల్ల రామాయణం రచించిన కవయిత్రి మొల్ల ఈ కాలానికి చెందిందే. ప్రజాకవి, గొప్ప సామ్యవాది అయిన వేమన ఈ కాలం వాడే. వేమన సామాజిక దురాచారాలైన కులవ్యవస్థ, విగ్రహారాధన మొదలైన వాటిని తన పద్యాల ద్వారా విమర్శించాడు.


వాస్తు కళలు, చిత్రలేఖనం  
విజయనగర కాలంలో వాస్తు కళలు, చిత్రలేఖనం బాగా అభివృద్ధి చెందాయి. విజయనగర రాజుల తొలి రాజధాని హంపిలోని అవశేషాలు గొప్ప కట్టడాలకు నిదర్శనం. రాజులతోపాటు రాణులు, ఉన్నతోద్యోగులు, భవన నిర్మాణ కార్యకలాపాల్లో ప్రత్యేక శ్రద్ధ చూపారు. హంపిలోని విఠల, పంపావతి, విరూపాక్ష, హజారరామ ఆలయాలు శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే నిర్మితమయ్యాయి. లేపాక్షిలోని వీరభద్రస్వామి దేవాలయం, సోంపాలెంలోని చెన్నకేశవ దేవాలయం, యెల్లూరులోని జలకంఠేశ్వర దేవాలయం, చిదంబరంలోని పార్వతి దేవాలయం, కంచిలోని వరదరాజ, ఏకాంబర నాథ దేవాలయాలు ద్రావిడ, విజయనగర వాస్తు శైలికి ఉదాహరణలు.
* లేపాక్షిలోని వీరభద్రస్వామి ఆలయంలోని చిత్రలేఖనం నాటి సామాజిక జీవితానికి అద్దం పడుతోంది. ఇందులో శిరోజాల అలంకరణలు, దుస్తులు, ఆభరణాలు, సంగీత వాయిద్యాలు, గొడుగులు, ఆటలు మొదలైన అంశాలను చక్కగా చిత్రించారు.

Posted Date : 03-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌