• facebook
  • whatsapp
  • telegram

మానవ అస్థిపంజర వ్యవస్థ

మానవ శరీరానికి రక్షణ నిచ్చే ఎముకలగూడును అస్థిపంజరం అంటారు. ఇది రక్షణతోపాటు గుండె, మెదడు, ఊపిరితిత్తులను కాపాడుతుంది. ఎముకలు కాల్షియం, ఫాస్పరస్‌లతో నిర్మితమవుతాయి. పొడవైన ఎముక మధ్యభాగంలో ఉన్న ఎముకమజ్జ నుంచి రక్తకణాలు తయారవుతాయి. యవ్వనదశలో మానవశరీరంలో 206 ఎముకలు ఉంటాయి. వీటిలో తలలో 29, ఒక్కొక్క కాలు, చేతిలో 30, వెన్నుపూసలో 26 ఉంటాయి. మానవశరీరంలో అతి ముఖ్య భాగమైన మెదడు కపాలంలో అమరి ఉంటుంది. తలలో మొత్తం 29 ఎముకలుంటాయి. దవడ ఎముకల్లో దంతాలు అమరి ఉంటాయి. వెన్నెముక మధ్య నుండే కాలువలాంటి భాగం నుంచి వెన్నుపాము ప్రయాణిస్తుంది. వెన్నెముక శరీరానికి ఆధారంలా పనిచేస్తుంది. వెన్నెముక 12 జతల పక్కటెముకలు కలిసి ఉరఃపంజరం ఏర్పడుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులను రక్షిస్తుంది. బాహ్య చెవి, ముక్కు చివరల్లో మెత్తటి ఎముకయిన మృదులాస్థి ఉంటుంది. 
            ఎముకలు ఒకదానితో ఒకటి అతికి ఉండే భాగాన్ని కీలు అంటారు. ఇవి రెండు రకాలు. అవి: 1) కదలని కీళ్లు, 2) కదిలే కీళ్లు. కపాలం లేదా తలలోని కీళ్లు కదలని కీళ్లకు ఉదాహరణ. తలలో కదిలే ఎముక కింది దవడ. కదిలే కీళ్లు మిగతా శరీర భాగాల్లో ఉంటాయి. ఇవి తిరిగి బంతిగిన్నెకీలు, బొంగరపు కీలు, మడతబందు కీలు, జారెడికీలు అనే రకాలుగా ఉంటాయి. భుజవలయం, కటివలయంలో బంతిగిన్నె కీలు ఉంటుంది. దీనివల్ల మనం చేతులను దాదాపు గుండ్రంగా తిప్పగలం. మోకాలు, మోచేతుల్లో మడతబందు కీళ్లు ఉంటాయి. ఇవి ఒకేవైపు కదులుతాయి.
మెడలో బొంగరపు కీలు ఉంటుంది. దీనివల్ల మనం తలను అటూ ఇటూ తిప్పగలం. వెన్నెముకలో జారెడు కీళ్లు ఉంటాయి. దీనివల్ల వెన్నెముక వంగుతుంది. మన శరీరంలో 600 వరకు కండరాలుంటాయి. ఎముకలు కండరాల వల్ల కదులుతాయి.

మానవ మూత్రపిండాలు

           మానవుడిలో మూత్రపిండాలు ముఖ్య విసర్జక అవయవాలు. మూత్రపిండాలు, మూత్రనాళాలు మూత్రకోశం కలిసి విసర్జక వ్యవస్థగా ఉంటాయి. మూత్రపిండాలు వెన్నెముకకు రెండువైపులా చిక్కుడుగింజ ఆకారంలో, ఎరుపు గోధుమరంగులో ఉంటాయి. కుడి మూత్రపిండం ఎడమదానికంటే చిన్నదిగా, కొంచెం దిగువగా ఉంటుంది. మూత్రపిండం లోపలి అంచు పుటాకారంగా ఉండి మధ్యలో నొక్కుతో ఉంటుంది. దీన్ని నాభి అంటారు. మూత్రపిండానికి రక్తాన్ని తీసుకెళ్లే వృక్కధమని దీని నుంచి లోపలికి ప్రవేశిస్తుంది. వృక్కసిర, మూత్రనాళాలు దీని నుంచి బయటికి వస్తాయి. మూత్రపిండం నిలువుకోతలో కనిపించే బయటి భాగాన్ని వల్కలం, లోపలి భాగాన్ని దవ్వ అంటారు. ఒక్కో మూత్రపిండంలో సుమారు పదిలక్షల నెఫ్రాన్లు లేదా మూత్రనాళికలు ఉంటాయి. ఇవి మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు. వీటిలోనే చివరిగా రక్తం వడపోత జరిగి, మూత్రం ఏర్పడుతుంది.
          ప్రతి నెఫ్రానులో రెండు భాగాలుంటాయి. 1) భౌమన్ గుళిక 2) నాళిక. భౌమన్ గుళిక గిన్నెలా ఉండే భాగం. మూత్రపిండంలోకి వృక్కధమని అనేక నాళికలుగా చీలి అభివాహిధమనికలుగా ప్రవేశిస్తుంది. ఒక్కో ధమనిక భౌమన్ గుళికలోకి వెళ్లి రక్తకేశనాళికా వలను ఏర్పరుస్తుంది. దీన్ని రక్తకేశనాళికా గుచ్ఛం అంటారు. భౌమన్ గుళిక నుంచి ఈ కేశనాళికలన్నీ కలిసి ఏర్పరచిన అప వాహి ధమని బయటికి వస్తుంది.
భౌమన్ గుళికలోని రక్తకేశనాళికాగుచ్ఛంలో రక్తం వడపోత జరుగుతుంది. రక్తం దీని ద్వారా ప్రవహించినప్పుడు రక్తంలోని నీరు, లవణాలు, గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలు, తక్కువ అణుపరిమాణం ఉన్నవి వడపోతకు గురవుతాయి. రక్తకణాలు, ప్రొటీన్లు వడపోయబడవు. ఈ రకమైన వడపోతను సూక్ష్మగాలనం అంటారు. ఈ విధంగా ఏర్పడిన దాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. 
              నాళికలో తిరిగి నాలుగు భాగాలుంటాయి. అవి: 1) సమీప సంవలిత నాళిక 2) హెన్లి మెలిక 3) దూరస్థ సంవలిత నాళిక 4) సంగ్రహణ నాళిక. ప్రాథమిక మూత్రం నాళికా భాగంలో ప్రయాణిస్తున్నప్పుడు శరీరానికి అవసరమైన పదార్థాలు తిరిగి పునఃశోషణం చెందుతాయి. భౌమన్ గుళిక వెనుక ఉన్న భాగాన్ని సమీప సంవలిత నాళిక అని, దీని తర్వాత (U) ఆకారంలో ఉన్న భాగాన్ని హెన్లి మెలిక అంటారు. దీని తరువాత దూరస్థ సంవలిత నాళిక ఉంటుంది. ఈ భాగాల నుంచి పునఃశోషణం కాని మూత్రం సంగ్రహణ నాళిక నుంచి మూత్రనాళంలోకి చేరుతుంది. ఈ విధంగా అన్ని నెఫ్రాన్లలో ఉన్న సంగ్రహణ నాళికల నుంచి వచ్చిన మూత్రం మూత్రనాళంలోకి ప్రవేశించి చివరకు మూత్రాశయాన్ని చేరుతుంది. ఇక్కడి నుంచి మూత్రం బయటకు విడుదలవుతుంది.
           మూత్ర విసర్జన ప్రక్రియ అనేది చిన్న పిల్లల్లో అనియంత్రిత చర్య. పెద్దవారిలో నియంత్రిత చర్య. మూత్రపిండాలు వ్యాధులకు గురైనప్పుడు లేదా నెఫ్రాన్లు పనిచేయనప్పుడు రక్తంలో విషపదార్థాలు పేరుకుంటాయి. వీటిని రక్తం నుంచి కృత్రిమ పద్ధతిలో వడపోసి వేరు చేస్తారు. ఈ పద్ధతినే డయాలిసిస్ అంటారు. దీనికి డయాలిస్ యంత్రం ఉపయోగపడుతుంది. ఇది కృత్రిమ మూత్ర పిండంలా పనిచేస్తుంది.
ధమని నుంచి రక్తాన్ని ఈ యంత్రంలోకి పంపి మలినాలను తొలగించి సిర ద్వారా శరీరంలోకి పంపిస్తారు. మానవుడిలో మూత్రపిండాలు ఎక్కువైన నీరు, లవణాలు, నత్రజని సంబంధ వ్యర్థ పదార్థాలను విసర్జిస్తాయి. మూత్రపిండాలే కాకుండా మానవుడిలో చర్మం, ఊపిరితిత్తులు అనుబంధ విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. చర్మం లవణాలు, నీరును బయటికి విసర్జిస్తుంది. ఊపిరితిత్తులు రక్తంలోని కార్బన్‌డైఆక్సైడ్‌ను బయటికి విసర్జిస్తాయి.

నిమ్నస్థాయి జంతువుల్లో విసర్జన

            నిమ్నస్థాయి జంతువులైన అకశేరుకాల్లో (వెన్నెముక లేని జంతువుల్లో) విసర్జన క్రియకు ప్రత్యేక భాగాలున్నాయి. ప్రోటోజోవా, పోరిఫెరా, సీలెంటరేటా లాంటి జీవుల్లో వ్యర్థపదార్థాలు వ్యాపన పద్ధతి ద్వారా విసర్జితమవుతాయి. ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో (ఉదా: ప్లనేరియా) విజర్జన క్రియ జ్వాలాకణాలనే నిర్మాణాల ద్వారా జరుగుతుంది. అనిలెడా జీవుల్లో (ఉదా: వానపాము) నెఫ్రీడియమ్‌లు (వృక్కాలు) విసర్జక అవయవాలుగా పనిచేస్తాయి. మొలస్కా జీవుల్లో వృక్కాలన్నీ కలిసి మూత్రపిండం లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచి విసర్జన క్రియను నిర్వహిస్తాయి. ఆర్థ్రోపొడా జీవులైన బొద్దింక, తేలు, సాలీడు, ఇతర కీటకాల్లో విసర్జన క్రియ మాల్ఫీ జియన్ నాళికల ద్వారా జరుగుతుంది.

వివిధ జంతువుల్లో ఏర్పడే విసర్జక పదార్థాలు

           జంతువుల్లో జీవక్రియల వల్ల వివిధ వ్యర్థ పదార్ధాలు ఏర్పడతాయి. వీటిలో అమ్మోనియా, యూరియా, యూరికామ్లం లాంటి నత్రజని సంబంధ వ్యర్థ పదార్ధాలు ముఖ్యమైనవి. ఇవి అమైనో ఆమ్లాలు, కేంద్రకామ్లాల జీవక్రియలో ఏర్పడతాయి.
వీటితోపాటు ఎక్కువగా ఉన్న నీరు, లవణాలు, కర్బన పదార్థాలను బయటికి పంపడాన్ని విసర్జనగా పిలుస్తారు. ఈ పదార్థాలను శరీరం నుంచి బయటికి పంపకపోతే అవి శరీరానికి హానికరంగా మారతాయి. విసర్జన ప్రక్రియ వల్ల నీరు, అయాన్ల తుల్యస్థితి నియంత్రితమవుతుంది. వివిధ జంతువుల్లో వేర్వేరు విసర్జన పదార్థాలు ఏర్పడతాయి.
             నీటిలో నివసించే జీవులైన ప్రోటోజోవాలు, స్పంజికలు, సీలెంటరేటా జీవులు పీత, రొయ్య లాంటి జీవుల్లో అమోనియా ముఖ్య విసర్జక పదార్థం. క్షీరదాలు, మానవుడు, ఉభయచర జీవులకు యూరియా ముఖ్య విసర్జక పదార్థం. సరీసృపాలు, పక్షులు, కీటకాలకు నీటి లభ్యత తక్కువ కాబట్టి ఇవి యూరిక్ ఆమ్లాన్ని ముఖ్య విసర్జక పదార్థంగా విసర్జిస్తాయి. వివిధ జంతువుల్లో ఏర్పడే విసర్జక పదార్థం సాధారణంగా దానికి లభించే నీటి పరిమాణాన్ని బట్టి మారుతుంది.

మొక్కల్లో విసర్జక పదార్థాలు

             మొక్కల్లో కూడా జంతువుల మాదిరిగానే వివిధ జీవక్రియల ఫలితంగా నత్రజని సంబంధ, ఇతర వ్యర్థ పదార్థాలు ఏర్పడతాయి. మొక్కల్లో వీటి విసర్జనకు ప్రత్యేక అవయవాలు లేవు. మొక్కలు వ్యర్థ పదార్థాలను తమలోని పత్రాలు, గింజలు, బెరడు, కాండం లాంటి భాగాల్లో దాచుకుంటాయి. దీనివల్ల మొక్కకు ఇతర జీవుల నుంచి రక్షణ కలుగుతుంది. ఈ వ్యర్థ పదార్థాలను మొక్కల నుంచి మానవుడు సేకరించి అనేక అవసరాల కోసం వాడుకుంటున్నాడు. మొక్క దేహంలో మొత్తంగా జీవక్రియల ఫలితంగా ఏర్పడే పదార్థాలు రెండు రకాలు. అవి: 1) ప్రాథమిక జీవక్రియోత్పన్నాలు 2) ద్వితీయ జీవక్రియోత్పన్నాలు. కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీనుల్లాంటివి ప్రాథమిక జీవక్రియోత్పన్నాలకు ఉదాహరణ. ఇవి వ్యర్థపదార్థాలు కావు.
ఇవి మొక్క పెరుగుదలకు, జీవక్రియలకు ఉపయోగపడతాయి. ఆల్కలాయిడ్లు, టానిన్లు, రెసిన్లు, జిగురు, లేటెక్స్ లాంటి వాటిని ద్వితీయ జీవక్రియోత్పన్నాలు అంటారు. ఇవి ఎక్కువగా విసర్జన పదార్థాలు.
            ఆల్కలాయిడ్లు నత్రజని సంయోగ విసర్జన పదార్థాలు. వీటిలో కొన్ని విషపూరితంగా ఉంటాయి. వివిధ భాగాల్లో నిల్వ ఉన్న ఈ పదార్థాలు మానవుడికి ఔషధాలుగా ఉపయోగపడతాయి(పట్టిక చూడండి). ఫినాల్ సంబంధిత సంక్లిష్ట కర్బన సమ్మేళనాలు టానిన్లు. వీటిని ఇంకు తయారీకి, తోళ్ల శుద్ధికి, ఔషధాల తయారీకి ఉపయోగిస్తారు. ఇవి తంగేడు, తుమ్మ లాంటి మొక్కల్లో ఉంటాయి. పైనస్ లాంటి వివృతబీజ మొక్కల్లో రెసిన్ నాళాల్లో రెసిన్లు తయారవుతాయి. వీటిని వార్నిష్‌ల తయారీలో ఉపయోగిస్తారు. మొక్కల సహజ రంధ్రాలు, లేదా గాయాల ద్వారా జిగురు స్రవిస్తుంది. వేప, తుమ్మ లాంటి మొక్కలు జిగురునిస్తాయి. ఇవి మొక్కకు గాయాలను మాన్పడంతోపాటు, మానవుడికి బైండింగ్ ఏజెంట్‌గా, ఆహారపదార్థాలు, ఔషధాల తయారీకి ఉపయోగపడతాయి.
              మొక్కల శాఖీయ భాగాల నుంచి వెలువడే తెల్లగా, పాలలా ఉండే పదార్థం లేటెక్స్. ఇది లేటెక్స్ కణాల్లో లేదా నాళికల్లో నిల్వ ఉంటుంది. హీవియా బ్రెజీలియెన్సిస్ అనే శాస్త్రీయ నామం ఉన్న రబ్బరు మొక్క లేటెక్స్ నుంచి నిత్యజీవితంలో ఉపయోగించే రబ్బరును తయారుచేస్తారు. ఈ మొక్క యుఫోర్బియేసి కుటుంబానికి చెందింది. ఆస్ల్కిపియడేసి కుటుంబానికి చెందిన జిల్లేడు, సపోటేసి కుటుంబానికి చెందిన సపోటా మొక్కలో లేటెక్స్ ఉంటుంది. ఇవి కాకుండా అపోసైనేసి, పపావరేసి కుటుంబంలోని కొన్ని మొక్కల్లో కూడా లేటెక్స్ ఉంటుంది.

Posted Date : 09-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌