• facebook
  • whatsapp
  • telegram

ఆర్య నాగరికత/ వేద నాగరికత

ఆర్య నాగరికత భారతదేశ రెండో నాగరికత, మొదటి ఇనుప నాగరికతగా పేరొందింది. దీన్నే వైదిక సంస్కృతిగా పేర్కొంటారు. సింధు నాగరికత అనంతరం క్రీ.పూ.1500600 మధ్య భారతదేశంలో ఆర్య నాగరికత వర్ధిల్లింది.  

* ఆర్యులు (తొలి విదేశీయులు) మధ్య ఆసియా ప్రాంతం నుంచి భారత్‌కు వచ్చారు. వీరి రాకతో దేశంలో సింధు నాగరికత పతనం చెంది, తొలి ఇనుపయుగ నాగరికత ఏర్పడింది. విదేశీయులైన ఆర్యులు ఈ నాగరికతను నిర్మించడం వల్ల దీన్ని ఆర్య నాగరికత అని, వారికి ఆధారం వేదాలు కాబట్టి వేద నాగరికత అని అంటారు.


ఆర్యులు

ఆర్యుల వలస గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వీరి జన్మస్థలం ఆర్కిటిక్‌ ప్రాంతమని బాలగంగాధర్‌ తిలక్‌; మధ్య ఆసియా అని మాక్స్‌ముల్లర్‌; టిబెట్‌ ప్రాంతవాసులని స్వామి దయానంద సరస్వతి; ధ్రువప్రాంత వాసులని 

ఎ.సి.థార్న్‌ లాంటి వారు పేర్కొన్నారు. 


* ఆర్యుల వలసను తెలిపే ఒక శాసనం మధ్య ఆసియాలోని కవడోషియా ప్రాంతంలో లభించింది. దీన్ని ‘భోగజ్‌కోయి శాసనం’ అంటారు. వీటన్నింటి కారణంగా ఆర్యులు భారత్‌కు చెందినవారు కాదని తెలుస్తోంది. అందుకే భారతదేశంపైకి దండెత్తివచ్చిన తొలి విదేశీయులుగా ఆర్యులను పేర్కొంటారు.


నాగరికత కాలం, విభజన

ఆర్య నాగరికత/ వేదనాగరికత క్రీ.పూ.1500600 మధ్యకాలంలో విరాజిల్లింది. ఈ నాగరికతను తొలివేద నాగరికత, మలివేద నాగరికతగా విభజించారు. రుగ్వేదకాలం నాటి నాగరికత క్రీ.పూ.15001000 మధ్య అభివృద్ధి చెందింది. దీన్నే రుగ్వేద సంస్కృతి లేదా తొలివేద కాలంగా పేర్కొంటారు. 

* క్రీ.పూ.1000600 మధ్య కాలాన్ని మలివేద కాలంగా పేర్కొంటారు. యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను మలి వేదాలుగా పిలుస్తారు.


రుగ్వేద సంస్కృతి 

ఈ కాలం నాగరికతకు రుగ్వేదం ఆధారం. భారతదేశంలో తొలి గ్రంథంగా రుగ్వేదాన్ని పేర్కొంటారు. ఇది సంస్కృత భాషలో, దేవనాగరి లిపిలో ఉంది. ఇందులో మొత్తం పది మండలాలు (భాగాలు) ఉన్నాయి. 1017 ప్రార్థనా శ్లోకాలు ఉన్నాయి. సౌరదేవతను పూజించే గాయత్రీ మంత్రం కూడా రుగ్వేదంలోనే ఉంది. ‘ఆర్య’ అంటే గొప్పవారు అని అర్థం. వీరు సింధు ప్రజలను ‘దస్యులు’గా ప్రస్తావించారు.


రాజకీయ వ్యవస్థ

తొలి వేదఆర్యులు సప్త సింధు ప్రాంతంలో తెగలుగా జీవించారు. తెగలు గ్రామాలుగా; గ్రామాలు విస్‌లుగా; విస్‌లు జనపదాలుగా ఏర్పడ్డాయి (తెగలు ® గ్రామాలు ® విస్‌లు ® జనపదాలు). గ్రామ పెద్దను గ్రామణి; విస్‌  అధిపతిని విశ్వపతి; జనపదం/ రాజ్యం అధిపతిని రాజన్‌ అని పిలిచేవారు. రాజన్‌కు పాలనలో పురోహిత, సేనాని లాంటి వారు సహాయపడేవారు. రాజు ప్రజల నుంచి బలి, భాగ అనే పన్నులు వసూలు చేసేవాడు. పాలనలో సహాయపడేందుకు సభ, సమితి ఉండేవి. సభలో ఉన్నత వర్గాల వారు, సమితిలో సామాన్యులు సభ్యులుగా ఉండేవారని ఎ.ఎల్‌.భాషం అనే చరిత్రకారుడు పేర్కొన్నారు. 

* గమనిక: ఎక్కువమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం సభలో సామాన్యులు, సమితిలో ఉన్నత వర్గాల వారు సభ్యులుగా ఉండేవారు.


ఆర్థిక వ్యవస్థ

తొలి వేదకాలంలో ప్రజల ప్రధాన వృత్తి పశుపోషణ, వ్యవసాయం. వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలకు అధిక ప్రాధాన్యం ఉండేది. గోవులను సంపదగా భావించేవారు. ఆ కాలంలో యుద్ధాలు ఎక్కువగా గోవుల కోసం జరిగేవి. రుగ్వేదంలో ఆవుల కోసం జరిగిన దశరాజ్ఞ యుద్ధం గురించి వివరణ ఉంది. 

* అనేక చేతివృత్తుల వారు ఆర్థిక వ్యవస్థలో ప్రధానపాత్ర పోషించే వారు. కంచు, లోహ పనివారు, వడ్రంగులు, రథాలు తయారుచేసే వారిని రుగ్వేదంలో ప్రశంసించారు. వస్తుమార్పిడి పద్ధతి అమల్లో ఉండేది. ‘నిష్క’ అనే బంగారు నాణెం వాడుకలో ఉండేది. దేశీయ, విదేశీ వాణిజ్యం విరివిగా జరిగేది.బాబిలోనియాతో విదేశీ వాణిజ్యం ఎక్కువగా చేసేవారు.


సామాజిక వ్యవస్థ

తొలి వేదకాలంలో చాతుర్వర్గ వ్యవస్థ ఉండేది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే నాలుగు ప్రధాన వర్గాలు ఉండేవి. అప్పట్లో వర్ణవ్యవస్థ లేదు. తర్వాతి కాలంలో రుగ్వేదంలోని పురుష సూక్తంలో వర్ణవ్యవస్థను చేర్చారు. సమాజంలో పితృస్వామిక వ్యవస్థ అమల్లో ఉండేది. స్త్రీలకు సముచిత స్థానం ఉండేది. మహిళలు కూడా సభ, సమితిల్లో పాల్గొనేవారు. కుటుంబ పెద్దను గృహపతి/ గాహపతి అనేవారు. అపాల, విశ్వవర, ఘోష లాంటి కవయిత్రులు రుగ్వేదకాలంలో పేరొందారు. సాంఘిక దురాచారాలు లేవు. 

* నాటి ప్రజల ఆహార అలవాట్లు, ధరించే దుస్తులు, ఆభరణాలు, వినోదాలు, వివాహ వ్యవస్థలను అధ్యయనం చేస్తే అప్పటి సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది.


మత పరిస్థితులు 

తొలి వేదకాలం నాటి ఆర్యులు ఇంద్రుడిని ప్రధాన దైవంగా, యుద్ధ దేవతగా భావించేవారు. మనుషులు, దేవతలకు మధ్య వారధిగా అగ్నిదేవుడిని ఆరాధించేవారు. ప్రకృతిశక్తుల ఆరాధన జరిగేది. అదితి, పృథ్వి, ఉష లాంటి స్త్రీ దేవతల ఆరాధన గురించి రుగ్వేదంలో పేర్కొన్నారు. 

*  నాటి ప్రజలు సోమ, సుర అనే మత్తు పానీయాలు తాగేవారు. ముఖ్యంగా యజ్ఞయాగాల సమయంలో, మతపరమైన క్రతువులను నిర్వహించేటప్పుడు సోమను ఎక్కువగా సేవించేవారు. కానీ దేవతలకు ఎలాంటి ఆలయాలను నిర్మించలేదు.


మలి వేదకాలం

క్రీ.పూ.1000600 మధ్య కాలాన్ని మలివేద సంస్కృతిగా పేర్కొంటారు. ఈ కాలంలో రాజకీయ, ఆర్థిక, సాంఘిక, మత పరిస్థితుల్లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఆర్యులు సప్త సింధు ప్రాంతం నుంచి తూర్పు  గంగా మైదానానికి వలస వెళ్లారు. శతపథ బ్రాహ్మణంలో దీని ప్రస్తావన ఉంది. ఈ కాలంలోనే రామాయణ, మహాభారతాలతో పాటు పురాణాల రచన ప్రారంభమైందని చరిత్రకారులు పేర్కొన్నారు.


రాజకీయ పరిస్థితులు

మలి వేదకాలంలో రాజ్యాలు (మహాజన పదాలు) విస్తరించాయి. రాజ్య విస్తరణ జరిగి, రాజు అధికారాలు పెరిగాయి. రాజ్యాన్ని మహాజనపదం అని, రాజును సామ్రాట్‌ అని పిలిచేవారు. సేనాని, పురోహితతో పాటు భాగదుషు, సంగ్రహిత లాంటి మంత్రులు, అధికారులు రాజుకు పాలనలో సహాయపడేవారు. రాజుకు పాలనలో సాయపడే ఉద్యోగులను ‘రత్నిన్‌’లు అనేవారు. రాజులు రాజసూయ, అశ్వమేధ, వాజపేయ లాంటి యాగాలు చేసేవారు. ఈ కాలంలో సభ, సమితులు తమ ప్రాధాన్యం కోల్పోయాయి.


ఆర్థిక పరిస్థితులు 

ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, పశుపోషణ. వరి, గోధుమ, బార్లీ లాంటి పంటలు పండించేవారు. అడవులను నరికి, విశాలమైన వ్యవసాయ భూములుగా మార్చారు. దేశీయ, విదేశీ వాణిజ్యం విస్తరించింది. వృత్తి నైపుణ్యం పెరిగింది. లోహ పరిశ్రమ, కుండల తయారీ, చర్మ వస్తువుల తయారీ, వడ్రంగి లాంటి వృత్తులవారికి ప్రాధాన్యం ఉండేది. మలివేద కాలంలో శతమాన, కర్షపన లాంటి బంగారు, వెండి నాణేలు వాడుకలోకి వచ్చాయి. 


సామాజిక పరిస్థితులు  

మలి వేదకాలంలో సామాజిక పరిస్థితులు బాగా మార్పు చెందాయి. తొలివేద కాలంలోని కుల వ్యవస్థ/ వర్ణ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. వృత్తుల ఆధారంగా చాతుర్వర్గ వ్యవస్థ ఈకాలంలో చాతుర్వర్ణ వ్యవస్థగా మారింది. శూద్ర వర్గానికి నిర్దిష్టమైన వృత్తి కేటాయించకపోవడంతో వారు పైన పేర్కొన్న మూడు వర్గాల వారికి కావాల్సిన సేవలు చేస్తూ వివిధ వృత్తులను స్వీకరించారు. ఈ వృత్తి విభజనే కులవ్యవస్థగా రూపాంతరం చెందింది. అనేక నూతన కులాలు, ఉపకులాలు ఏర్పడి వర్ణవ్యవస్థ సంక్లిష్టంగా మారింది. బాల్య వివాహాలు, బహుభార్యత్వం, సతీసహగమనం లాంటి అనేక సాంఘిక దురాచారాలతో స్త్రీ స్థానం దిగజారింది. ఈ కాలంలో ఆడపిల్లను భారంగా భావించేవారని ఐతరేయ బ్రాహ్మణం పేర్కొంటోంది. ఆశ్రమ పద్ధతి అమల్లోకి వచ్చింది. బ్రహ్మచర్య, గృహస్థు, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాలు ప్రతి వ్యక్తి పాటించాల్సి వచ్చింది. క్షత్రియులు, బ్రాహ్మణులు, వైశ్యులు ద్విజులు (రెండుసార్లు జన్మించినవారు)గా గుర్తింపు పొందారు. శూద్రులను తక్కువ వర్ణం వారిగా పేర్కొన్నారు. బ్రాహ్మణ, క్షత్రియ పురుషులు వైశ్య, శూద్ర వర్గ స్త్రీలను వివాహం చేసుకోవచ్చు. కానీ వైశ్య, శూద్ర పురుషులు బ్రాహ్మణ, క్షత్రియ స్త్రీలను వివాహం చేసుకోకూడదని శతపథ బ్రాహ్మణం పేర్కొంది.


మత పరిస్థితులు

మలివేద కాలంలో ప్రధానంగా త్రిమూర్తుల ఆరాధన ఉండేది. బ్రహ్మ, విష్ణు, శివుడిని ప్రధాన దేవతలుగా భావించేవారు. ప్రార్థనల స్థానంలో కర్మకాండలు, యజ్ఞయాగాలకు ప్రాధాన్యం పెరిగింది. పునర్జన్మ, కర్మ సిద్ధాంతాలకు ఆదరణ లభించింది. బ్రాహ్మణ ఆధిక్యం పెరిగింది. జంతుబలులు అధికమయ్యాయి. హిందూ సమాజంలో సుమారు 44 సంస్కారాలు అమల్లోకి వచ్చాయి. వర్ణాశ్రమ ధర్మాలు ప్రచారం పొందాయి. వీటి గురించి ఐతరేయ బ్రాహ్మణం తొలిసారిగా పేర్కొంది. చాందోగ్యోపనిషత్తు మొదటి మూడు ఆశ్రమ ధర్మాలను పేర్కొంటే, జాబాలోపనిషత్తు నాలుగు దశలను ప్రస్తావించింది. షట్‌దర్శనాలు ప్రాముఖ్యం పొందాయి.

Posted Date : 09-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌