• facebook
  • whatsapp
  • telegram

భారతదేశ ఉనికి

భారతదేశం

* భారతదేశానికి వాయవ్య దిశలో ఉన్న సింధూ నదిని ప్రాచీన కాలంలో గ్రీకులు ‘ఇండస్‌’ నదిగా పిలిచేవారు. ఈ నది వెంబడి నివసించే ప్రజలను ‘ఇండోయీలు’ అనేవారు. తర్వాత కాలంలో ఇండోయీలు నివసించే ఈ ప్రాంతాన్ని బ్రిటిష్‌వారు ‘ఇండియా’గా పిలవడం ప్రారంభించారు. పూర్వం మన దేశాన్ని పాలించిన దుష్యంతుడి కుమారుడు భరతుడి పేరు మీదుగా దీనికి ‘భారతదేశం’ అనే పేరు వచ్చింది. పురాణాల్లో మన దేశాన్ని ‘జంబూ ద్వీపం’గా పేర్కొన్నారు. తూర్పు, పడమర, దక్షిణం మూడువైపులా నీటితో ఆవరించి ఉండటం వల్ల భారతదేశాన్ని ద్వీపకల్పం అంటారు.


ఉనికి:
* భారతదేశం ఆసియా ఖండానికి దక్షిణ భాగాన పూర్తిగా ఉత్తరార్ధ గోళంలో 8o 4' - 37o 6' ఉత్తర అక్షాంశాలు, 68o 7' - 97o 25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.

ప్రామాణిక రేఖాంశం:
* భూభ్రమణ ప్రక్రియలో భాగంగా భూమి తన చుట్టూ తాను పడమర నుంచి తూర్పునకు తిరుగుతున్నప్పుడు ఒక రేఖాంశం నుంచి మరో రేఖాంశానికి తిరగడానికి 4 నిమిషాల సమయం పడుతుంది. అలా భూమి తన చుట్టూ తాను ఒకసారి భ్రమణం చేయడానికి మొత్తం 360 రేఖాంశాలు × 4 నిమిషాల చొప్పున 1440 నిమిషాల సమయం అంటే 24 గంటలు (1440 ÷ 60 నిమిషాలు) లేదా ఒకరోజు పడుతుంది.
* భారతదేశం పడమర నుంచి తూర్పునకు సుమారు 30 రేఖాంశాలు (68o 7' - 97o 25' తూర్పు రేఖాంశాల మధ్య) విస్తరించి ఉండటం వల్ల పశ్చిమాన ఉన్న గుజరాత్‌లోని ద్వారక కంటే తూర్పున ఉన్న అరుణాచల్‌ప్రదేశ్‌లో సూర్యోదయం 2 గంటలు ముందుగా అవుతుంది (రేఖాంశాల పరంగా 30o విస్తరించి ఉండటం వల్ల, 30 × 4 ని. = 120 ని. లేదా 2 గంటలు). 
* భారతదేశం విశాలమైంది కాబట్టి వివిధ ప్రాంతాల్లోని కాల వ్యత్యాసాలను తగ్గించడానికి దాదాపు దేశం మధ్యగా వెళ్లే 82 1/2o తూర్పు రేఖాంశాన్ని భారత ప్రామాణిక రేఖాంశంగా తీసుకున్నారు. సాధారణంగా ఒక రేఖాంశంపై ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతుంది. కాబట్టి 82 1/2తూర్పు రేఖాంశంపై మిట్ట మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు అదే కాలాన్ని దేశంలో అన్ని ప్రాంతాలకూ వర్తింపజేస్తారు. 
* భారత ప్రామాణిక రేఖాంశం (82 1/2o తూర్పు రేఖాంశం) గ్రీనిచ్‌ కాలమానానికి (0º రేఖాంశం) 5 1/2o గంటలు ముందుగా ఉంటుంది.
(82 1/2 × 4 ని. = 330 ని., 330 ని. ÷ 60 ని. = 5 1/2  గంటలు).

* భారత ప్రామాణిక రేఖాంశం భారతదేశంలోని ఉత్తర్‌ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు; కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి పాలనా విభాగమైన యానాం ద్వారా వెళుతుంది.
* 82 1/2o తూర్పు రేఖాంశం భారతదేశంలోని కింది ప్రధాన నగరాల ద్వారా వెళుతుంది.


1) ప్రయాగ్‌రాజ్‌ (అలహాబాద్‌), వారణాసి, మీర్జాపూర్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌)
2) జబల్‌పూర్, రేవా (మధ్యప్రదేశ్‌)
3) రాయ్‌పూర్‌ (ఛత్తీస్‌గఢ్‌)
4) కొరాపుట్‌ (ఒడిశా)
5) కాకినాడ (ఆంధ్రప్రదేశ్‌)
6) యానాం (పుదుచ్చేరి)

సరిహద్దులు:
* ఉత్తరాన హిమాలయాలు
* దక్షిణాన హిందూ మహాసముద్రం
* తూర్పున బంగాళాఖాతం
* పడమరన అరేబియా సముద్రం

భూసరిహద్దులు:
* ఉత్తరాన జమ్ముకశ్మీర్‌లోని హిమాలయ పర్వతాల్లో కిలిక్‌ ధావన్‌ పాస్‌ లేదా ఇందిరా కాల్‌. 
* దక్షిణాన హిందూ మహాసముద్రంలోని అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఉన్న ఇందిరా పాయింట్‌ లేదా పిగ్మాలియన్‌ పాయింట్‌.
* పశ్చిమాన గుజరాత్‌లోని చిత్తడి నేలలతో కూడిన రాణ్‌ ఆఫ్‌ కచ్‌ ప్రాంతం.
* తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌లోని దిహాంగ్‌ లోయ.

 

విస్తీర్ణం:
* భారతదేశం సమారు 32,87,263 చ.కి.మీ./3.28 మి.చ.కి.మీ. విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచ ఖండాల భూభాగ వైశాల్యంలో సుమారు 2.42%, భూమి మొత్తం ఉపరితల విస్తీర్ణంలో 0.57% ఆక్రమించింది.
* విస్తీర్ణపరంగా పెద్ద దేశాలు రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా కాగా భారత్‌ 7వ అతిపెద్ద దేశంగా ఉంది.
* ఇది ఉత్తరం నుంచి దక్షిణం వరకు సుమారు 3,214 కి.మీ. పొడవున, తూర్పు నుంచి పశ్చిమం వరకు 2,933 కి.మీ. వెడల్పుతో విస్తరించి ఉంది.  ప్రపంచం మొత్తం జనాభాలో సుమారు 17.5% కలిగిన రెండో పెద్ద దేశం భారత్‌.

 

కర్కటరేఖ:
* 23 1/2o ఉత్తర అక్షాంశం లేదా కర్కటరేఖ గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, పశ్చిమ్‌ బంగ, త్రిపుర, మిజోరం రాష్ట్రాల ద్వారా వెళుతుంది. అక్షాంశాలు తూర్పు నుంచి పడమరకు ఉండటం వల్ల కర్కటరేఖ మనదేశంలో మొదట మిజోరంలో ప్రవేశిస్తుంది. ఈ రేఖ మధ్యప్రదేశ్‌ ద్వారా అత్యధిక దూరం, రాజస్థాన్‌ ద్వారా అతి తక్కువ దూరం ప్రయాణిస్తుంది.

రాష్ట్రాలు:
* ప్రస్తుతం మనదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి.
* విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌. 
* విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్‌ (1,60,205 చ.కి.మీ.) 8వ పెద్ద రాష్ట్రం కాగా, చిన్న రాష్ట్రం గోవా. కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తీర్ణపరంగా అండమాన్‌ నికోబార్‌ దీవులు, దిల్లీ, పుదుచ్చేరి పెద్దవి. లక్షదీవులు అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం.
* దేశంలో భూ పరివేష్టిత రాష్ట్రాలు (తీరరేఖ లేదా ఇతర దేశాలతో సరిహద్దు లేని రాష్ట్రాలు) తెలంగాణ, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, హరియాణా. అత్యధికంగా ఎనిమిది రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంతో సరిహద్దు గల రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్‌.
* ఉత్తర్‌ ప్రదేశ్‌ తర్వాత అత్యధిక రాష్ట్రాలతో (7 రాష్ట్రాలు) సరిహద్దు గలది అసోం. కేవలం ఒక్క రాష్ట్రంతో మాత్రమే భూసరిహద్దు గల రాష్ట్రాలు సిక్కిం (పశ్చిమ్‌ బంగ), మేఘాలయ (అసోం).

 

ఇతర దేశాలతో సరిహద్దులు:

* భారతదేశం తన పొరుగుదేశాలతో సుమారు 15,200 కి.మీ. పొడవున భూసరిహద్దును కలిగి ఉంది. మనదేశంతో భూసరిహద్దును కలిగి ఉన్న దేశాలు ఏడు. ఇవి 17 రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటున్నాయి.
* భారతదేశంతో అత్యధిక భూసరిహద్దు కలిగిన దేశం బంగ్లాదేశ్‌ కాగా అత్యల్ప భూసరిహద్దు కలిగిన దేశం అఫ్గానిస్థాన్‌. మూడు దేశాలతో భూసరిహద్దు కలిగిన రాష్ట్రాలు జమ్ముకశ్మీర్, పశ్చిమ్‌ బంగ, సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌.

* పాకిస్థాన్, భారతదేశం మధ్య ఉన్న సరిహద్దు రేఖను రాడ్‌క్లిఫ్‌రేఖ అంటారు.
* భారత్, పాకిస్థాన్‌ మధ్య వివాదస్పద ప్రాంతాలు సర్‌క్రీక్, సియాచిన్‌. సర్‌క్రీక్‌ భారత్‌లోని రాణ్‌ ఆఫ్‌ కచ్, పాకిస్థాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌ల మధ్య ఉంది. ఇది చిత్తడి నేలలను కలిగి ఉండే ప్రాంతం (అరేబియా తీరప్రాంతంలో).
* సియాచిన్‌ అనేది ఒక ఎత్తయిన హిమానీనద ప్రాంతం. ఇది భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉండే అతిపెద్ద యుద్ధక్షేత్రం. ఈ ప్రాంతం కారకోరం పర్వతాల్లో ఉంది.
* భారత్, చైనా మధ్య వివాదాస్పద ప్రాంతం ఆక్సాయ్‌ చిన్‌. దీన్ని చైనా ఆక్రమించింది. ఈ ప్రాంతం ద్వారానే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ మీదుగా ‘వన్‌ బెల్ట్‌ వన్‌ రోడ్‌’ ప్రాజెక్టును చైనా చేపడుతుంది. ఇది రెండు దేశాల మధ్య వివాదాస్పదంగా మారింది.
* భారత్, చైనా మధ్య తూర్పు ప్రాంతంలో అరుణాచల్‌ప్రదేశ్‌ను ఆనుకొని మెక్‌మోహన్‌ రేఖ ఉంది.

భారత్, చైనాల మధ్య ఉండే ప్రధాన కనుమలు:

నాథూలా కనుమ: టిబెట్‌ (చైనా) లోని లాసా ప్రాంతాన్ని పశ్చిమ్‌ బంగలోని డార్జిలింగ్‌తో కలుపుతుంది.
నిథిలా కనుమ: ఉత్తరాఖండ్, టిబెట్‌ల మధ్య సరిహద్దుగా ఉంది.
లిపులేఖ్‌ కనుమ: ఉత్తరాఖండ్, టిబెట్‌ల మధ్య సరిహద్దుగా ఉంది.
షిప్కి లా కనుమ: హిమాచల్‌ప్రదేశ్, టిబెట్‌ల మధ్య సరిహద్దుగా ఉంది.
బొమిడిలా కనుమ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ను చైనాలోని టిబెట్‌తో కలుపుతుంది.
* భారత్, అఫ్గానిస్థాన్‌ల మధ్య సరిహద్దు రేఖను డ్యూరాండ్‌ రేఖ అంటారు.
* భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య వివాదాస్పద దీవులు, ప్రాంతాలు వరుసగా బంగాళాఖాతంలోని న్యూమూర్‌ దీవులు; తీన్‌భిగా, సిలిగురి కారిడార్‌.
* భారత్‌తో జల సరిహద్దు గల దేశాలు శ్రీలంక, మాల్దీవులు, బంగ్లాదేశ్, మయన్మార్, ఇండోనేషియా, థాయ్‌లాండ్‌.
* భారత్, శ్రీలంకను వేరుచేస్తున్నవి పాక్‌ జలసంధి, మన్నార్‌ సింధుశాఖ. వీటి మధ్య శిలా ఉపరితలం గల పాంబన్‌ దీవి ఉంది.
* సముద్ర జలాల్లో వివిధ దేశాల మధ్య ఉన్న జల సరిహద్దులను ఛానెల్స్ అంటారు. భారత్, మాల్దీవుల మధ్య ఉన్న ఛానెల్‌ను 8º ఛానెల్‌ అంటారు.
* భారత్, ఇండోనేషియాల మధ్య గ్రేట్‌ ఛానెల్‌; భారత్, మయన్మార్‌ల మధ్య కోకో ఛానెల్‌ ఉన్నాయి.

డోక్లాం వివాదం:
* ఇది భారత్, భూటాన్, చైనా సంధిభాగంలో ఉన్న వ్యూహాత్మక ప్రాంతం. దీనిపై ఆధిపత్యాన్ని సాధిస్తే మిగతా భారతదేశాన్ని ఈశాన్య ప్రాంతంతో అనుసంధానించే చికెన్‌ నెక్‌ ప్రాంతంపై వ్యూహాత్మక ఒత్తిడి కొనసాగించవచ్చని చైనా ఇక్కడ పక్కా రహదారుల నిర్మాణానికి ప్రయత్నించింది. దీంతో 2017 జూన్‌ నుంచి ఆగస్టు వరకు భారత్, చైనా మధ్య ప్రతిష్టంభన కొనసాగింది. చివరకు చైనా వెనుకకు తగ్గడంతో ఈ వివాదం సద్దుమణిగింది.
* భారతదేశంలో అతిపెద్ద జిల్లా కచ్‌ (గుజరాత్), రెండో అతిపెద్ద జిల్లా లడఖ్‌ (జమ్ముకశ్మీర్), అతిచిన్న జిల్లా మహే (కేరళ) కానీ పాలనాపరంగా ఇది పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత ఆధ్వర్యంలో ఉంది.

* భారతదేశంలో అత్యంత చల్లని ప్రాంతం ద్రాస్‌ లోయ (జమ్ముకశ్మీర్‌లోని పశ్చిమ లడక్‌ ప్రాంతం), అత్యంత తడి ప్రాంతం మాసిన్రామ్, చిరపుంజి (మేఘాలయ).
* భారతదేశంలో అతిపెద్ద నదీ ఆధార దీవి అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో ఉన్న మజులి దీవి (ఈ ద్వీపంలో సుమారు 1,50,000 మంది ప్రజలు 23 గ్రామాల్లో ఉంటున్నారు).
* మన దేశంలో అతిపెద్ద గ్లేసియర్‌ సియాచిన్‌. దేశంలో ప్రవహిస్తున్న నదుల్లో అతిపొడవైంది గంగా (2525 కి.మీ.).

Posted Date : 07-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌