భారత అంతరిక్షరంగ పరిశోధన సంస్థ (ఇస్రో) 2022లో అద్భుత విజయాలను సాధించింది. ఫిబ్రవరి, నవంబరు నెలల మధ్య చేపట్టిన అయిదు మిషన్లలో నాలుగింట్లో సఫలీకృతమైంది. దీంతోపాటు హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ ‘స్కైరూట్ ఏరోస్పేస్’కి చెందిన తొలి ప్రైవేట్ రాకెట్ ‘విక్రమ్ -S' ని విజయవంతంగా ప్రయోగించింది.
పీఎస్ఎల్వీ - C52/ EOS -4 మిషన్
* 2022, ఫిబ్రవరి 14న ఇస్రోకి చెందిన పీఎస్ఎల్వీ-‘52 రాకెట్ EOS-4 ఉపగ్రహంతోపాటు మరొక రెండు చిన్న ఉపగ్రహాలను విజయవంతంగా నిర్దిష్ట కక్ష్యలో ప్రవేశపెట్టింది.
* ప్రాథమిక పేలోడ్ EOS-04 (ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్) ఒక రాడార్ ఇమేజింగ్ శాటిలైట్ (RISAT).
* 529 కి.మీ ఎత్తులోని పోలార్ (సన్‌సింక్రోనస్) ఆర్బిట్‌లో తిరిగే 1,710 కిలోల ద్రవ్యరాశితో ఉండే EOS-4 (అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ) అధిక రిజల్యూషన్ చిత్రాలను రికార్డు చేస్తుంది. వ్యవసాయం, అటవీ, మృత్తికలు, వరదలు తదితరాలను విశ్లేషించడానికి ఈ చిత్రాలు ఉపయోగపడతాయి.
* మరో రెండు ఉపగ్రహాల్లో మొదటిది INSPIREsat-1. ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ) విద్యార్థులు, విదేశీ సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రూపొందింది. దీని ద్రవ్యరాశి 8.1 కేజీలు, జీవితకాలం 1 సంవత్సరం. సూర్యుడి కరోనా వేడి ప్రక్రియ, ఐనోస్పియర్ గతుల (డైనమిక్స్)ను అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది.
* రెండో చిన్న ఉపగ్రహం INS-2D. ఇది భారత్-భూటాన్ సంయుక్తంగా నిర్మించే INS- 2B కి ఒక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్.
ఎస్ఎస్ఎల్వీ-D1/ EOS - 2 మిషన్
* ఎస్ఎస్ఎల్వీ-D1 (స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్)ని 2022, ఆగస్టు 7న ఎస్డీఎస్సీ - షార్ నుంచి ప్రయోగించారు.
* దిగువ భూకక్ష్య ( LEO ) లోకి 500 కేజీల ద్రవ్యరాశి వరకు ఉండే చిన్న ఉపగ్రహాలను ప్రవేశ పెట్టేందుకు ఇస్రో నిర్దేశించిన తొలి, కొత్త తరహా రాకెట్ ఇది.
* కానీ ఇది పేలోడ్లను కక్ష్యలో ప్రవేశపెట్టడంలో విఫలమైంది.
* ఎస్ఎస్ఎల్వీ ఒక మూడంచెల ఘన ఇంధన రాకెట్. దీంతో తక్కువ తయారీ సమయంలో, ఎక్కువ ఉపగ్రహాలను, తక్కువ వ్యయంతో స్పేస్ ఆన్ డిమాండ్ ఆధారంగా ప్రయోగించొచ్చు.
* దీని పేలోడ్‌లోని ఉపగ్రహాలు రెండు. అవి:
1) EOS - 02
2) ఆజాదీ శాట్
* 135 కేజీల భూపరిశీలక ఉపగ్రహం EOS-02 ని 350 కి.మీల ఎత్తులోని LEO లో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేశారు.
* 75 వసంతాల స్వాతంత్య్ర భారతాన్ని దృష్టిలో ఉంచుకుని ‘స్పేస్ కిడ్జ్ ఇండియా’ అనే అంతరిక్ష సంస్థ దేశంలోని 75 ప్రభుత్వ బాలికల పాఠశాలల నుంచి 750 బాలికలతో కలిసి ఆజాదీశాట్ ఉపగ్రహాన్ని రూపొందించింది.
* ఆజాదీశాట్ 8 కిలోల ద్రవ్యరాశితో ఉండే 8U క్యూబ్‌శాట్. ఇందులో ఒక్కొక్కటి 50 గ్రాముల ద్రవ్యరాశి ఉండే 75 పేలోడ్లు ఫెమిటో - ప్రయోగాల కోసం నిర్దేశించినవి.
ఏకకాలంలో 36 శాటిలైట్లు (వన్‌వెబ్ ఇండియా - 1 మిషన్)
* ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా రష్యా ప్రయోగించాల్సిన ఉపగ్రహ ప్రయోగాలను వన్‌వెబ్ సంస్థ ఇస్రో ద్వారా చేపట్టింది.
* లండన్‌కి చెందిన 36 వన్‌వెబ్ ఉపగ్రహాలను మన దేశం LVM3-M2 రాకెట్ ద్వారా 2022, అక్టోబరు 23న శ్రీహరికోట నుంచి విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది.
* విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించడానికి, భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచడానికి నిర్దేశించిన 'NSIL'కి ఇది తొలి GSLV ఆధారిత వాణిజ్య ప్రయోగం.
* ఒక్కొక్కటి సుమారు 150 కేజీల ద్రవ్యరాశి ఉండే 36 ఉపగ్రహాలను (మొత్తం ద్రవ్యరాశి 5,796 కేజీలు) 601 కి.మీ ఎత్తులోని LEO లో ప్రవేశపెట్టడానికి క్రయోజెనిక్ అంచె తీసుకున్న సమయం కేవలం 75 నిమిషాలు మాత్రమే.
* GSLV MK - III రాకెట్లనే LVM3 పేరుతో పిలుస్తున్నారు.
* ఇందులోని మూడంచెల్లో వరుసగా ఘన, ద్రవ, క్రయోజెనిక్ ఇంధనాలను ఉపయోగిస్తారు.
వన్‌వెబ్ జనరేషన్ - 1 శాటిలైట్లు
* లండన్‌కి చెందిన వన్‌వెబ్ అనేది ‘అంతరిక్ష సేవలతో గ్లోబల్ కమ్యూనికేషన్ లేదా కనెక్టివిటీ’ని కల్పించడానికి ఉద్దేశించిన సంస్థ.
* ఇది అంతరిక్షంలో LEO లో 648 శాటిలైట్లను ప్రవేశపెడుతోంది.
* ఇందులో భాగంగా LVM3 ప్రయోగించిన 36 శాటిలైట్ల మిషన్ వన్‌వెబ్‌కి 14వ ప్రయోగం.
* 1200 కి.మీల ఎత్తులో, ఒక్కొక్క కక్ష్యలో 49 ఉపగ్రహాల చొప్పున మొత్తం 12 కక్ష్యల్లో వీటిని ప్రయోగించనున్నారు.
* ఇస్రో వాణిజ్య విభాగం NSIL, వన్‌వెబ్‌తో 72 ఉపగ్రహాలను రెండు విడతల్లో ప్రయోగించడానికి సుమారు రూ.1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది.
* ఇందులో భాగంగా రెండో విడత 36 ఉపగ్రహాలను మరికొద్ది రోజుల్లో ఇస్రో ప్రయోగించనుంది.
పీఎస్ఎల్వీ C- 54/EOS- 06 మిషన్
* ఇస్రో గెలుపుగుర్రం పీఎస్ఎల్వీ ద్వారా చేసిన 56వ ప్రయోగం ఇది.
* ఇందులో పీఎస్ఎల్వీ ‘ 54 రాకెట్ ద్వారా 2022, నవంబరు 26న EOS - 06 ఉపగ్రహంతో పాటు మరో ఎనిమిది నానో శాటిలైట్లను విజయవంతంగా ప్రయోగించారు.
* ఓషన్‌శాట్ ఉపగ్రహాల శ్రేణిలో మూడో తరానికి చెందిన ఉపగ్రహం 'EOS' - 06'.
* సముద్రాల వాతావరణ అధ్యయనంతోపాటు చేపల నివాస జోన్లను గుర్తించడానికి EOS -06 ఉపయోగపడుతుంది.
పీఎస్ఎల్వీ - C53/DS-EO మిషన్
2022, జూన్ 30న శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్డీఎస్సీ - షార్) నుంచి ఇస్రో విజయవంతంగా పూర్తిచేసిన మిషన్ పీఎస్ఎల్వీ-C53. ఈ రాకెట్‌తో సింగపూర్‌కి చెందిన మూడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపారు. వీటితో పాటు పీఎస్ఎల్వీకి చెందిన నాలుగో అంచె కొన్నిరోజుల పాటు ప్రయోగాల వేదికగా కక్ష్యలో కొనసాగింది. పీఎస్ఎల్వీ - C53 ప్రయోగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్ఐఎల్)కి చెందిన రెండో పరిపూర్ణ వాణిజ్య ప్రయోగం. దీనితో ప్రయోగించిన ఉపగ్రహాలు వరుసగా DS-EO, Neusar,SCOOB-1.ఎలక్ట్రో - ఆప్టిక్, మల్టీస్పెక్ట్రల్ పేలోడ్‌ని కలిగిన DS-EO తీసే రంగుల చిత్రాలు విపత్తు సహాయానికి తోడ్పడతాయి. Neusar సింగపూర్‌కి చెందిన తొలి చిన్న వాణిజ్య ఉపగ్రహం కాగా, SCOOB-1 సింగపూర్ విద్యార్థులు తయారు చేసిన తొలి స్టూడెంట్ శాటిలైట్. మిగిలిపోయిన నాలుగో అంచె PS4 ని పీఎస్ఎల్వీ ఆర్బిటాల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ (POEM) గా తొలిసారి వినియోగించారు.
POEMలో ఉన్న ఆరు పేలోడ్లలో రెండు భారత్‌కి చెందిన అంతరిక్ష అంకుర సంస్థలు M/s దిగంతర,M/s ధృవ స్పేస్‌లు రూపొందించాయి. కక్ష్యలో తిరుగుతున్న POEM కి అవసరమయ్యే విద్యుత్‌ను సౌర పలకలు, లిథియం అయాన్ బ్యాటరీలు సమకూరుస్తాయి. ప్రయోగ వేదిక POEM గైడెన్స్, నావిగేషన్, నియంత్రణ వ్యవస్థలను కలిగి ఉంది.
పీఎస్ఎల్వీ C - 54తో ప్రయోగించిన నానో ఉపగ్రహాలు
1) ఇండియా - భూటాన్ శాట్ (INS - 2B)
2) ఆనంద్ - 3
3) ఆస్రోకాస్ట్ (నాలుగు ఉపగ్రహాలు)
4) థైబోల్ట్ (THYBOLT) (రెండు ఉపగ్రహలు)
* ఇండియా భూటాన్ సంయుక్తంగా రూపొందించిన శాటిలైట్ INS - 2B.
* ఆనంద్ - 3 ఒక నానోశాటిలైట్. ఇదొక టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్. ఎలక్ట్రో ఆప్టికల్ పేలోడ్, ఇతర శాటిలైట్ విభాగాలను సూక్ష్మరూపంలో తయారు చేయడానికి ఇదొక ముందస్తు ప్రయోగం. దీన్ని పిక్సెల్ (Pixxel)ఇండియా సంస్థ రూపొందించింది.
* ఆస్ట్రోకార్ట్ (Astrocart) నాలుగు ఉపగ్రహాలు ఉన్న 3U స్పేస్‌క్రాఫ్ట్. దీన్ని అమెరికాకి చెందిన ‘స్పేస్‌ఫ్లైట్’ అనే సంస్థ రూపొందించింది.
* థైబోల్ట్ (THYBOLT) 0.5U స్పేస్ క్రాఫ్ట్. దీన్ని హైదరాబాద్‌కి చెందిన ధృవ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది.