• facebook
  • whatsapp
  • telegram

పంచాయతీరాజ్ వ్యవస్థ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1959 అక్టోబరు 11న నాటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో మొదటి పంచాయతీ సమితిని లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన రాష్ట్రాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండోది. ఆ తర్వాత అశోక్ మెహతా సిఫారసులను అనుసరించి 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి రామారావు పంచాయతీ వ్యవస్థను రద్దుచేసి, మండల పరిషత్ విధానాన్ని ప్రవేశపెట్టారు. మండల పరిషత్ వ్యవస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1987 నుంచి అమల్లోకి వచ్చింది. తర్వాత కొన్ని కమిటీలు చేసిన సిఫారసులు, 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ఆధారంగా 1994లో నూతన పంచాయతీ రాజ్ చట్టాన్ని రూపొందించారు. ఈ చట్టం 1994 మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మొదటిసారిగా 1986లో సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు. 1995 మే 30 తర్వాత ఇద్దరు పిల్లలకు మించి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి లేదా పదవిలో కొనసాగడానికి అనర్హులు. మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్లు కల్పించడానికి, రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదనే సూత్రానికి వ్యతిరేకం కాదని సుప్రీం కోర్టు అబ్దుల్ అజీజ్ అసాద్ Vs ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేసులో పేర్కొంది. ప్రస్తుత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని బి.పి.ఆర్. విఠల్ కమిటీ సూచనల ప్రకారం ఏర్పాటు చేశారు.

గ్రామసభ

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పారదర్శకతను, బాధ్యతాయుతమైన పరిపాలనను ఇనుమడింపజేసేదే గ్రామసభ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని అనుసరించి గ్రామసభకు సర్పంచ్, సర్పంచ్ లేనప్పుడు ఉపసర్పంచ్ అధ్యక్షత వహిస్తారు. గ్రామ పంచాయతీ సరిహద్దు లోపల సభ్యులకు అనుగుణంగా సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంలోపు గ్రామసభ సమావేశాన్ని ఎప్పుడైనా నిర్వహించవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం గ్రామసభను సంవత్సరానికి నాలుగుసార్లు (జనవరి 2, ఏప్రిల్ 14, జులై 1, అక్టోబరు 3) తప్పనిసరిగా నిర్వహించాలి. అయితే అవసరాన్ని బట్టి గ్రామసభను ఎన్నిసార్లయినా సమావేశపరచవచ్చు. కనీసం 50 మంది లేదా కనీసం 10% మంది సభ్యులు (ఏది ఎక్కువైతే అది) సభను ఏర్పాటు చేయమని లిఖితపూర్వకంగా కోరినట్లయితే సర్పంచ్ తప్పనిసరిగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభ నిర్వహణకు కోరం నిర్ణయించలేదు.

రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్

పన్నెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా 2013 మార్చి 7న కేంద్ర ప్రభుత్వం రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకాన్ని ప్రారంభించింది. గ్రామసభను మరింత సమర్థంగా నిర్వహించడం, పారదర్శకత, జవాబుదారీతనం పెంచడం, సమర్థ సేవల నిర్వహణ (Transparency, accountability and efficient delivery services) ఈ పథకం ముఖ్యోద్దేశం. ఇందులో సమాచార సేకరణ వ్యవస్థ ఏర్పాటు, సాంకేతిక సామర్థ్యం పెంపు, బాధ్యతతో వ్యవహరించడం మొదలైన అంశాలకు ప్రాధాన్యం ఇస్తారు.

గమనిక: రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ (RGPSA) పథకానికి అనుగుణంగా పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయటానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2013 నవంబరు 7న ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని అనుసరించి సంవత్సరంలో నాలుగుసార్లు గ్రామసభను నిర్వహించాలి.

ఈ - పంచాయత్

2004లో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశంలో సమాచార సాంకేతికతను స్థానిక ప్రభుత్వాల ద్వారా గ్రామీణాభివృద్ధికి ఉపయోగించాలని తీర్మానించింది. పంచాయతీరాజ్‌లో సాంకేతికతతో కూడిన పాలననే ఈ - పంచాయత్ అంటారు. నేషనల్ ఈ - పంచాయత్ 2006లో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఒక భాగంగా ఏర్పడింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమాచార, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. 2013లో ప్రవేశపెట్టిన రాజీవ్‌గాంధీ స్వశక్తీకరణ అభియాన్ కూడా సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది.

73వ రాజ్యాంగ సవరణ కంటే పూర్వచరిత్ర

* గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని గాంధీజీ పేర్కొన్నారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి, వాటిని సమర్థవంతంగా అమలుచేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం. ఈ అధికార వికేంద్రీకరణలో భాగమే స్థానిక స్వపరిపాలనా సంస్థలు.

స్థానిక స్వపరిపాలనా సంస్థలు ఏం చేస్తాయంటే...

* ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగిస్తాయి.

* ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తాయి.

* ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పిస్తాయి.

* స్థానిక సమస్యలను గుర్తించి, వాటికి పరిష్కార మార్గాలను అన్వేషిస్తాయి.

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపైన పరిపాలనా భారాన్ని తగ్గిస్తాయి.

* మన దేశంలోని ప్రాచీన కాలం నాటి గ్రామ పంచాయతీలను Little Republics గా ఛార్లెస్ మెట్‌కాఫ్ అభివర్ణించారు.

స్థానిక సంస్థల చరిత్ర

* రుగ్వేదంలో సభ, సమితి అనే రెండు స్థానిక స్వపరిపాలనా సంస్థలు కవలలుగా పేరొందాయి. ఇవి గ్రామస్థాయిలో అనేక పరిపాలన, రాజకీయ విధులను నిర్వర్తించాయి.

* ఆది కావ్యమైన రామాయణంలో జనపదం అనే పేరును అనేక గ్రామాల సమాఖ్యగా అభివర్ణించారు.

* మహాభారతంలోని శాంతిపర్వంలో గ్రామసంఘాలు అనే పేరుతో పరిపాలన సాగించారు.

* శుక్రాచార్యుడు తన నీతిశాస్త్రంలో గ్రామాల కామన్వెల్త్ ఉన్నట్లు పేర్కొన్నాడు.

* మెగస్తనీస్ ఇండికా గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పాలన గురించి వివరించాడు.

* చంద్రగుప్త ప్రధాని కౌటిల్యుడు తన అర్థశాస్త్రం గ్రంథంలో మౌర్యుల కాలం నాటి స్థానిక పాలనను వివరించారు. ఈ గ్రంథంలో గ్రామపరిపాలనాధికారిని గ్రామణి అని, పది గ్రామాల అధిపతిని దశగ్రామణి అని పేర్కొన్నారు.

* డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారం బౌద్ధం విలసిల్లిన కాలంలోనే భారత్‌లో స్థానిక పాలన విలసిల్లింది.

* గాంధీజీ అభిప్రాయం ప్రకారం ప్రాచీన భారత గ్రామాలు స్వయంసమృద్ధితో వర్థిల్లుతూ, వాటికి అవసరమైన అంశాలన్నింటినీ అవే సమకూర్చుకునేవి.

* మనదేశంలో చోళులు గ్రామీణ పాలనకు ప్రణాళిక బద్ధమైన పునాదులు వేసి వాటిని అభివృద్ధి పరిచారు. చోళరాజైన మొదటి పరాంతకుడు వేయించిన ఉత్తర మెరూర్ శాసనం ప్రకారం చోళులు రంధ్రం చేసిన కుండలను బ్యాలెట్ బాక్స్‌లుగా, తాటి ఆకులను బ్యాలెట్ పత్రాలుగా ఉపయోగించి, ఎన్నికల ప్రక్రియను నిర్వహించేవారు.

* చోళుల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ సమస్యల పరిష్కారం కోసం పంచాస్ అనే ఒక మండలి ఉండేది. దీనిలో అయిదుగురు సభ్యులుండేవారు. పంచాస్ అనే పదమే తర్వాత కాలంలో పంచాయతీగా అవతరించింది.

* షేర్షా కాలంలో గ్రామస్థాయిలో స్థానిక సంస్థలు పనిచేసేవి.

* దిల్లీ సుల్తానుల కాలంలో గ్రామస్థాయిలో గ్రామపంచాయతీలు ఉన్నప్పటికీ, అవి స్వయంపోషకత్వాన్ని కలిగిలేవు.

* మనదేశంపైకి మహ్మదీయుల దండయాత్రలు ప్రారంభం కావడంతో మధ్యయుగంలో స్థానిక సంస్థల పరిస్థితి తగ్గిపోయింది.

* దిల్లీ సుల్తానులు, మొగలుల కాలంలో కొత్వాల్ అనే పదవిని ఏర్పాటు చేశారు. శాంతిభద్రతలు, శిస్తు వసూలు, పట్టణ పరిపాలన కోసం ఈ పదవిని ఏర్పాటు చేశారు. గ్రామీణ పాలనను విస్మరించారు.

ఆంగ్లేయుల కాలంలో స్థానిక సంస్థలు

* క్రీ.శ. 1687లో రెండో జేమ్స్ చక్రవర్తి జారీచేసిన చార్టర్ చట్టం ద్వారా పన్నులు వసూలు చేయాలనే లక్ష్యంతో మద్రాస్‌లో మొదటి మున్సిపల్ కార్పొరేషన్‌ను నెలకొల్పారు. దీంతో మనదేశంలో ఆధునిక స్థానిక చరిత్ర ప్రారంభమైంది.

* క్రీ.శ. 1726లో ఆంగ్లేయులు బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను ప్రారంభించారు.

* ఆంగ్లేయులు జిల్లాను ఒక పరిపాలనా యూనిట్‌గా తీసుకుని 1772లో కలెక్టర్ అనే పదవిని ప్రవేశపెట్టారు.

* 1793 చార్టర్ చట్టం ద్వారా మద్రాస్, కలకత్తా, బొంబాయి పట్టణాల్లో స్థానిక ప్రభుత్వాల ఏర్పాటుకు చట్టబద్ధతను కల్పించారు.
 

* 1813లో చార్టర్ చట్టం ద్వారా స్థానిక సంస్థలకు పన్నులు విధించే అధికారాన్ని కల్పించారు

* 1861 నాటి భారత కౌన్సిల్ చట్టం ద్వారా స్థానిక అవసరాలను తీర్చే బాధ్యతను రాష్ట్రాలకు అప్పగించారు.

* 1870లో లార్డ్‌మేయో ఆర్థిక వికేంద్రీకరణలో భాగంగా, మనదేశంలో పరిపాలనా వికేంద్రీకరణను ప్రారంభించారు.

* 1882, మే, 18న లార్డ్ రిప్పన్ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక, పరిపాలనాపరమైన అధికారాలను బదలాయిస్తూ కీలక తీర్మానాన్ని చేశారు. ఈ తీర్మానం భారత్‌లో స్థానిక ప్రభుత్వాలకు మాగ్నాకార్టాగా పేరొందింది. స్థానిక సంస్థలకు ఒక నిర్దిష్ట రూపాన్ని ఇచ్చిన లార్డ్ రిప్పన్‌ను మనదేశంలో స్థానిక స్వపరిపాలనా పితామహుడిగా పేర్కొంటారు.

1882 స్థానిక స్వపరిపాలనా చట్టం ప్రకారం

రాయల్ కమిషన్:

* మనదేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును, అవి ఎదుర్కొంటున్న సమస్యలను అధ్యయనం చేయడానికి 1907లో చార్లెస్ హాబ్‌హౌస్ అధ్యక్షతన ఒక వికేంద్రీకరణ సంఘం ఏర్పడింది. రాయల్ కమిషన్‌గా పేరొందిన ఈ కమిషన్ తన నివేదిను 1909లో సమర్పించింది.

ఈ నివేదికలోని ముఖ్యాంశాలు

* సమర్థవంతంగా పరిపాలనా వికేంద్రీకరణను అమలు పరచాలి.

* ప్రతిగ్రామానికి ఒక గ్రామ పంచాయతీ ఉండాలి.

* జనాభా ఆధారంగా మున్సిపల్ సంస్థలను ఏర్పాటు చేయాలి.

* స్థానిక సంస్థల్లో ప్రజలు ఎన్నుకునే ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యాన్ని పెంచాలి.

* రాయల్ కమిషన్ సిఫారసుల మేరకు 1909లో మింటో - మార్లే సంస్కరణల చట్టంలో స్థానిక ప్రతినిధులను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకునే పద్ధతిని ప్రవేశపెట్టారు.

* 1919 మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా కేంద్ర జాబితాలోని స్థానిక స్వపరిపాలనను రాష్ట్రజాబితాలోకి బదిలీ చేశారు. 1919 నాటికి జిల్లాల సంఖ్య 207, తాలుకా బోర్డుల సంఖ్య 584గా ఉంది.

* 1935 భారత ప్రభుత్వ చట్టం ద్వారా స్థానిక స్వపరిపాలనా సంస్థలకు స్వయం ప్రతిపత్తి అధికారాలను కల్పించారు. అధికారులు నామినేట్ చేసే పద్ధతిని పూర్తిగా రద్దు చేశారు. స్థానిక సంస్థల పాలన మంత్రుల పరిధిలోకి వచ్చింది. ఈ చట్టం ద్వారా జిల్లాబోర్డుల్లో రాష్ట్రాలకు పూర్తిస్థాయి స్వాతంత్య్రం కల్పించడం వల్ల స్థానిక సంస్థల ప్రాతినిధ్యం పెరిగింది.

* 1935 భారత ప్రభుత్వచట్టం ప్రకారం 1937లో రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు జరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 1939లో రెండో ప్రపంచయుద్ధం ప్రారంభమవడం, రాష్ట్రప్రభుత్వాలు రాజీనామా చేయడంతో స్థానిక సంస్థల పరిస్థితి అయోమయంగా మారింది.

* 1947లో స్వాతంత్య్రానంతరం దేశపరిపాలనకు అవసరమైన రాజ్యాంగ రచన సందర్భంగా శ్రీమన్నారాయణ్ అగర్వాల్ రాజ్యాంగ పరిషత్‌లో గ్రామస్థాయి మొదలుకుని, జాతీయస్థాయి వరకు పంచాయతీ వ్యవస్థ ఏర్పాటును తెలియజేస్తూ గాంధీ ప్లాన్‌ను ప్రతిపాదించారు.

* భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ - 40లో గ్రామపంచాయతీలను ఏర్పాటుచేసే బాధ్యతను రాష్ట్రప్రభుత్వాలకు అప్పగించారు.

* రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌లోని అధికారాల విభజనకు సంబంధించి, స్థానిక స్వపరిపాలనను రాష్ట్రజాబితాలో నిర్దేశించారు.

73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992)

భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలోని 4వ భాగంలోని ఆదేశిక సూత్రాల్లో ఆర్టికల్ - 40లో స్థానిక స్వపరిపాలనా సంస్థలను పొందుపరిచారు. రాష్ట్రజాబితాలోని పంచాయతీరాజ్ సంస్థలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వాలపై ఉన్నప్పటికీ, రాష్ట్రప్రభుత్వాలు వీటిని అమలు చేయడానికి అవసరమైన చట్టాలను రూపొందిచలేకపోవడంతో స్థానిక ప్రభుత్వాలు సమర్థంగా పనిచేయలేదు.

* ప్రజాస్వామ్య ఆర్థికాభివృద్ధిలో పంచాయతీరాజ్ సంస్థల పాత్ర అనే అంశంపై అధ్యయనానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1986లో ఎల్.ఎం. సింఘ్వి కమిటీని నియమించింది. ఈ కమిటీ పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ బద్ధతను కల్పించాలని సిఫార్సు చేసింది.

* ఎల్.ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సులపై రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1987లో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పి.కె. తుంగన్ నేతృత్వంలో ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది.

* సింఘ్వి కమిటీ సూచనల ఆధారంగా, తుంగన్ కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకున్న రాజీవ్ గాంధీ ప్రభుత్వం 64, 65 రాజ్యాంగ సవరణ బిల్లులను రూపొందించింది.

* పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 64వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

* 64వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభ 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువ కావడంతో ఆ బిల్లు వీగిపోయింది.

* వి.పి. సింగ్ నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం పంచాయతీలు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబరు 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టినప్పటికీ ప్రభుత్వం పడిపోవడం వల్ల అది కార్యరూపం దాల్చలేదు.

1991లో అధికారానికి వచ్చిన పి.వి. నరసింహారావు ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 73వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న పార్లమెంటులో ప్రవేశపెట్టింది. 1992, డిసెంబరు 22న 73వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఆ తర్వాత దేశంలోని 17 రాష్ట్రాల శాసనసభల ఆమోదం పొందింది. రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ 1993, ఏప్రిల్ 20న సంతకం చేయడంతో, 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992), 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది.

* పంచాయతీలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించే 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 24ను జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా నిర్వహిస్తారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం - కర్ణాటక.

* 1993, మే 10 నుంచి కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలోని పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం - కర్ణాటక

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా భారత రాజ్యాంగంలో IXవ భాగాన్ని చేర్చి, దానిలో 243, 243(A) నుంచి 243(O) వరకు ఉన్న మొత్తం 16 ఆర్టికల్స్‌లో పంచాయతీరాజ్ చట్టం విధివిధానాలను నిర్దేశించారు.

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా భారత రాజ్యాంగానికి XIవ షెడ్యూల్ చేర్చారు. దీనిలో పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

ఆర్టికల్ - 243: పంచాయతీరాజ్ - నిర్వచనాలు

* పంచాయతీరాజ్ సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున వీటిపై రాష్ట్ర శాసనసభ చట్టం చేసి, నిర్వచిస్తుంది. గవర్నర్ గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నిర్వచనాలను తెలియజేస్తారు.

a) జిల్లా అంటే - ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.

b) గ్రామసభ అంటే - గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలోని రిజిస్టర్ అయిన వ్యక్తుల సముదాయం.

c) మాధ్యమిక స్థాయి అంటే - జిల్లాస్థాయికి, గ్రామస్థాయికి మధ్య ఉండే స్థాయి.

d) పంచాయతీ అంటే - ఆర్టికల్ 243(B) ద్వారా ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.

e) పంచాయతీ ఏరియా అంటే - ఒక పంచాయతీ యొక్క ప్రాదేశిక ప్రాంతం.

f) జనాభా అంటే - జనాభా లెక్కల సేకరణ తర్వాత ప్రచురించిన జాబితాలోని జనాభా అని అర్థం.

g) గ్రామం అంటే - గవర్నరు గ్రామంగా నోటిఫై చేసిన ప్రాంతం.

ఆర్టికల్ - 243(A): గ్రామ సభ

* గ్రామంలోని ఓటర్లందరూ గ్రామసభలో సభ్యులుగా ఉంటారు.

* గ్రామ పంచాయతీకి గ్రామసభ ప్రాతిపదికగా పనిచేస్తుంది.

* గ్రామసభ గ్రామ పంచాయతీకి శాసన శాఖగా పనిచేస్తుంది.

* ప్రత్యక్ష ప్రజాస్వామ్యానికి గ్రామసభను ప్రాతిపదికగా పేర్కొనవచ్చు.

* గ్రామ పంచాయతీ గ్రామసభకు సమష్టి బాధ్యత వహిస్తుంది.

* గ్రామాభివృద్ధికి అవసరమైన విధానాలను గ్రామసభ రూపొందిస్తుంది.

* మన గ్రామసభను పోలిన స్థానిక ప్రభుత్వ సంస్థ స్విట్జర్లాండ్‌లో ఉంది. దాన్ని ల్యాండ్స్ గెమెండ్ అంటారు.

* గ్రామ సభ సంవత్సరానికి రెండుసార్లు సమావేశం కావాలి. ఒక సమావేశానికి మరొక సమావేశానికి మధ్యకాలం 6 నెలలు మించకూడదు.

* ఒకవేళ సంవత్సరానికి రెండుసార్లు గ్రామసభను ఏర్పాటు చేయకపోతే సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.

* గ్రామసభ సమావేశాలు సమర్థవంతంగా జరగలేదని రాజస్థాన్ ప్రభుత్వం నియమించిన సాధిక్ అలీ కమిటీ తన నివేదికలో పేర్కొంది.

* గ్రామ సభ పనితీరును మెరుగుపరచడానికి అవసరమైన సూచనల కోసం రాజస్థాన్ ప్రభుత్వం గిరిధర్‌లాల్ వ్యాస్ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆర్టికల్ - 243(B): పంచాయతీరాజ్ వ్యవస్థాపన

* 73వ రాజ్యాంగ సవరణ చట్టం, (1992) ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను 3 స్థాయుల్లో నెలకొల్పాలి.

అవి:

    1. కింది స్థాయిలో - గ్రామ స్థాయిలో - గ్రామ పంచాయతీ

    2. మధ్య స్థాయిలో - తాలూకా/బ్లాకు స్థాయిలో - పంచాయతీ సమితి

    3. ఉన్నత స్థాయిలో - జిల్లా స్థాయిలో - జిల్లా పరిషత్

* ఒక రాష్ట్ర జనాభా 20 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ రాష్ట్రంలో మాధ్యమిక సంస్థలను ఏర్పాటు చేసుకునే విచక్షణాధికారం ఆ రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటుంది.              

ఆర్టికల్ - 243(C): పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్మాణం, సభ్యులు, అధ్యక్షుల ఎన్నిక

» 3 స్థాయుల్లోని (గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్) సభ్యులందరినీ ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

» జిల్లా పరిషత్, మాధ్యమిక స్థాయుల్లోని అధ్యక్షుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

» గ్రామ పంచాయతీ అధ్యక్షుడి ఎన్నిక ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆ రాష్ట్ర శాసనసభ నిర్మాణ శాఖ చట్టం ప్రకారం నిర్ణయించవచ్చు.

» గ్రామ పంచాయతీ అధ్యక్షులు మాధ్యమిక వ్యవస్థలో, మాధ్యమిక వ్యవస్థకు చెందిన అధ్యక్షులు జిల్లా పరిషత్‌లో సభ్యులుగా కొనసాగవచ్చు.

» జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యులు, విధానసభ సభ్యులు తాము ప్రాతినిధ్యం వహించే నియోజక వర్గాల పరిధిలోని మాధ్యమిక వ్యవస్థల్లో, జిల్లా పరిషత్‌లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగవచ్చు.

» జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు తాము ఓటరుగా నమోదైన జిల్లాలో, మాధ్యమిక వ్యవస్థలో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగవచ్చు.

» రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఉన్న రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, జిల్లా పరిషత్‌లో సభ్యులుగా కొనసాగవచ్చు.

ఆర్టికల్ - 243(D): స్థానిక సంస్థల్లో సీట్లు - రిజర్వేషన్

» పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని స్థాయుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన సీట్లు రిజర్వ్ చేయాలి.

» ఈవిధంగా రిజర్వ్ చేసిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వు చేయాలి.

» బీసీ వర్గాల వారికి రిజర్వేషన్లు కేటాయించే అధికారం సంబంధిత రాష్ట్ర శాసన సభల విచక్షణకే 73వ రాజ్యాంగ సవరణ చట్టం విడిచిపెట్టింది.

» పంచాయతీరాజ్ సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు 1/3 నుంచి 1/2వ వంతు వరకు (50%) పెంచడానికి ఉద్దేశించిన 110వ రాజ్యాంగ సవరణ బిల్లు పార్లమెంటు ముందు ఉంది.

అబ్దుల్ అజీజ్ అసాద్ Vs ఆంధ్రప్రదేశ్ కేసు

» స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లను రిజర్వు చేయడం అనేది రిజర్వేషన్లు 50% మించరాదు అనే సూత్రానికి వ్యతిరేకం కాదని అబ్దుల్ అజీజ్ అసాద్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

» ఎస్సీ, ఎస్టీ వర్గాలకు, మహిళలకు కేటాయించిన స్థానాలు రొటేషన్ పద్ధతిలో జరగాలి.

ఆర్టికల్ - 243 (E): పంచాయతీరాజ్ సంస్థల కాలపరిమితి

» స్థానిక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలుగా నిర్దేశించారు. అయితే ఈ పదవీకాలం ముగియకముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దుచేయవచ్చు.

» ఏదైనా కారణం వల్ల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేస్తే 6 నెలల్లోగా తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి.

» ఖాళీలు ఏర్పడినప్పుడు జరిగే ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకున్న ప్రతినిధులు మిగిలిన పదవీకాలానికి మాత్రమే అధికారంలో కొనసాగుతారు.

» సంస్థ మొత్తానికి ఎన్నికలు కాలయాపన ద్వారా జరిగితే మాత్రం పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగవచ్చు. అయితే సంస్థ పదవీకాలం ముగియడానికి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఉప ఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఆర్టికల్ - 243(F): అర్హతలు - అనర్హతలు

» స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు.

» పార్లమెంటు, శాసన సభలకు పోటీచేసే అభ్యర్థులకు వర్తించే అర్హతలు, అనర్హతలన్నీ స్థానిక సంస్థల్లో పోటీచేసే అభ్యర్థులకు వర్తిస్తాయి.

» ఏ స్థానిక సంస్థకు పోటీ చేస్తున్నారో దాని పరిధిలో ఓటరై ఉండాలి.

» రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే డిపాజిట్‌ను చెల్లించాలి.

» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదు.

మహ్మద్ షరీఫ్ Vs స్టేట్ ఆఫ్ హర్యానా కేసు:

» సమాజం, దేశ ప్రయోజనాల దృష్ట్యా, 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీచేయరాదని నిర్దేశించడం సమర్థనీయమేనని మహ్మద్ షరీఫ్ కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది.

» పంచాయతీ సభ్యుల అనర్హతను విచారించే అధికారం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి మున్సిఫ్ కోర్టులకు ఉందని నిర్దేశించారు.

ఆర్టికల్ - 243 (G): అధికారాలు - విధులు

» పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 అంశాలను XIవ షెడ్యూల్‌లో పొందుపరిచారు. వీటిని స్థానిక స్వపరిపాలనా సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు బదిలీ చేయాలి.

గమనిక: ఈ 29 అంశాలు ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని చాప్టరులో పొందుపరిచారు.

ఆర్టికల్ - 243 (H): ఆర్థిక వనరులు

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు

» ఇంటిపన్ను, నీటి పన్ను, అడ్వర్టైజ్ పన్ను, సంతలు, మార్కెట్‌లపై పన్ను

» అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆర్థిక వనరులు

» రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిన కొన్ని పన్నులను పంచాయతీలకు జమ చేయవచ్చు.

» రాష్ట్ర శాసన సభ ప్రత్యేక శాసనం ద్వారా కొన్ని అంశాలకు సంబంధించి, పన్నులు విధించి, వసూలు చేసే అధికారాన్ని పంచాయతీలకు బదలాయించవచ్చు.

» దాతలు సమకూర్చే విరాళాలు

ఆర్టికల్ - 243(I): రాష్ట్ర ఆర్థిక సంఘం

» గవర్నరు ప్రతి 5 సంవత్సరాలకొకసారి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

» స్థానిక సంస్థలు సమర్థవంతంగా పనిచేయడానికి, ఆర్థిక వనరులను సమకూర్చుకోవడంలో తగిన సూచనలు, సలహాలను ఆర్థిక సంఘం రూపొందిస్తుంది.

» రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థలకు మంజూరు చేయాల్సిన నిధులకు సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ఆర్థిక సంఘం అందిస్తుంది.

» కేంద్రం నుంచి నిధుల మంజూరు కోసం గవర్నరు ద్వారా కేంద్ర ఆర్థిక సంఘానికి, రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫారసు చేస్తుంది.

» పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి సంబంధించి, గవర్నరు సూచించిన అంశాలపై తగిన సూచనలు, సలహాలు ఇస్తుంది.

» ఆర్థిక సంఘం ప్రతి సంవత్సరం తన నివేదికను గవర్నరుకు సమర్పిస్తుంది.

» ఆంధ్రప్రదేశ్‌లో మొదటి ఆర్థిక సంఘం 1994, జూన్ 24న ఏర్పాటైంది. దీని తొలి అధ్యక్షులు - లక్ష్మణస్వామి.

ఆర్టికల్ - 243(J): అకౌంట్స్ అండ్ ఆడిటింగ్

» స్థానిక సంస్థలు వివిధ అంశాలపై చేసిన ఖర్చులు, ఖాతాలను ఆడిట్ చేసే విధానాన్ని ఆర్టికల్ - 243(J) తెలియజేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను రాష్ట్ర శాసన సభలే నిర్దేశిస్తాయి.

» ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఖాతాల ఆడిట్‌ను రాష్ట్ర ఆడిట్ సంచాలకులు (Director of State Audit) నిర్వహిస్తారు.

» ప్రస్తుతం మన రాష్ట్రంలో కింది విధంగా ఆడిట్‌ను నిర్వహిస్తున్నారు.

    1. లోకల్ ఫండ్ ఆడిట్

    2. శాఖాపరమైన ఆడిట్

    3. జనరల్ ఆడిట్

ఆర్టికల్ - 243(K): రాష్ట్ర ఎన్నికల సంఘం

» స్థానిక సంస్థలకు చెందిన ఓటర్ల జాబితాను రూపొందించడం, సవరించడం, ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ లాంటి అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటుంది.

» రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌ను గవర్నరు నియమిస్తారు. కానీ తొలగించేది మాత్రం రాష్ట్రపతి.

» హైకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిలోనే రాష్ట్రపతి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను తొలగిస్తారు.

» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం 1994, సెప్టెంబరులో ఏర్పడింది.

» దీని మొదటి కమిషనర్ - ఎస్. కాశీ పాండ్యన్

» ప్రస్తుత కమిషనర్ - రమేష్‌ కుమార్

» రాష్ట్ర ఎన్నికల కమిషన్ టోల్ ఫ్రీ నెంబరు - 1950.

ఆర్టికల్ - 243(L): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం

» రాష్ట్రపతి నిర్దేశం ప్రకారం 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి, పంచాయతీరాజ్ విధానాన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయాలా? లేదా? అనేది నిర్ణయిస్తారు.

» దిల్లీ, పాండిచ్చేరిల్లో వాటి శాసన సభలు అక్కడి స్థానిక సంస్థలకు సంబంధించిన చట్టాలు చేసినప్పటికీ, అవి కేంద్రం ఉత్తర్వులకు లోబడి ఉండాలి.

ఆర్టికల్ - 243(M): మినహాయించిన ప్రాంతాలు

73వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి కింద పేర్కొన్న ప్రాంతాలను మినహాయించారు.

» ఆర్టికల్ - 244(1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలు.

» ఆర్టికల్ - 244(2)లో పేర్కొన్న ఆటవిక జాతుల ప్రాంతాలు.

» నాగాలాండ్, మేఘాలయ, మిజోరం, జమ్ము కశ్మీర్ రాష్ట్రాలు.

» మణిపూర్ రాష్ట్రంలోని జిల్లా కౌన్సిల్ ప్రాంతాలు.

» పశ్చిమ్ బంగాలోని డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాహిల్ కౌన్సిల్ ప్రాంతం.

ఆర్టికల్ - 243(N): పూర్వ శాసనాల కొనసాగింపు

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు అంటే 1993, ఏప్రిల్ 24 నుంచి 1994, ఏప్రిల్ 23 వరకు సంబంధిత రాష్ట్రాల్లో పూర్వశాసనాలు కొనసాగుతాయి.

» ఈ చట్టంలోని అంశాలను రాష్ట్ర శాసన సభ 2/3వ ప్రత్యేక మెజార్టీ ద్వారా 73వ సవరణ చట్టం మౌలిక స్వరూపం దెబ్బతినకుండా సవరించుకోవచ్చు.

ఆర్టికల్ - 243(O): కోర్టుల జోక్యంపై పరిమితులు - ప్రత్యేక ట్రిబ్యునళ్లు

» పంచాయతీరాజ్ వ్యవస్థలోని నియోజక వర్గాల ఏర్పాటు, నియోజక వర్గాల సీట్ల కేటాయింపునకు సంబంధించిన అంశాలను న్యాయస్థానాల్లో ప్రశ్నించరాదు.

» పంచాయతీ ఎన్నికల వివాదాలను విచారించే నిమిత్తం సంబంధిత రాష్ట్ర శాసన సభ ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయవచ్చు.

» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం Muncif Courtలను ఈ అధికారం కింద ప్రత్యేక Authorityగా ప్రకటించింది. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి Muncif Courtలు ఎన్నికల వివాదాలను Muncif Court హోదాలో కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్ హోదాలో విచారిస్తాయి.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ

బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సులను అనుసరించి 3 అంచెల పంచాయతీరాజ్ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రం - రాజస్థాన్, రెండో రాష్ట్రం - ఆంధ్రప్రదేశ్.

» ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సమితి, జిల్లా పరిషత్‌ల చట్టాన్ని 1959లో చేశారు. దీని ప్రకారం 1959, నవంబరు నాటికి పంచాయతీ సమితులు; 1959, డిసెంబరు నాటికి జిల్లాపరిషత్‌లు అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటయ్యాయి.

» ఆంధ్రప్రదేశ్‌లో 1959 చివరి నాటికి 235 పంచాయతీ సమితులను ఏర్పాటు చేశారు.

» 1959 డిసెంబరు నాటికి రాష్ట్రంలోని 20 జిల్లాల్లోని జిల్లా బోర్డులను రద్దుచేసి, జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేశారు.

» జిల్లా బోర్డుల అధికారాలు, విధులు, విధానాలు మొత్తం పంచాయతీ సమితులు, జిల్లాపరిషత్‌లకు అప్పగించారు.

» 1963 నాటికి రాష్ట్రంలో 448 సమితి బ్లాకులు ఏర్పాటు చేశారు.

పురుషోత్తమ్ పాయ్ కమిటీ

» పంచాయతీ సంస్థల సామాజిక విధులు, ఆర్థిక అధికారాలపై తగిన సిఫార్సులు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 1963లో పురుషోత్తం పాయ్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సిఫార్సులు:

» బ్లాకుల పరిమాణం పెద్దదిగా ఉండాలి. అప్పుడే స్వతంత్ర ప్రణాళికలను ఏర్పరచుకుంటాయి.

» బ్లాకులను ఉన్నతస్థాయి, సాధారణ, వెనుకబడిన, గిరిజన బ్లాకులుగా విభజించాలి.

» పురుషోత్తమ్ పాయ్ సిఫార్సుల మేరకు 1959 నాటి చట్టానికి 1964లో సవరణ చేశారు. ఈ సవరణ ప్రకారం బ్లాకుల పరిధులను మార్చేందుకు, సమితులను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వానికి అధికారం కల్పించారు. దీని ఫలితంగా 1964, జులై నాటికి బ్లాకుల సంఖ్య 448 నుంచి 321కి తగ్గించడమైంది.

» గ్రామస్థాయిలో గ్రామ పంచాయతీ ప్రజలతో కూడిన మౌలిక వ్యవస్థ.

» 10 వేల మంది లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి గ్రామం ఒక పంచాయతీని కలిగి ఉండాలి.

» పంచాయతీ సభ్యులను గ్రామంలోని ఓటర్లు ఎన్నుకోవాలి.

» పంచాయతీ సభ్యుల సంఖ్య 5 - 17 వరకు ఉండాలి.

» మొత్తం పంచాయతీ సభ్యుల సంఖ్య 7 కంటే తక్కువ ఉంటే ఒక సీటును, 9 కంటే ఎక్కువ ఉంటే 2 సీట్లను మహిళలకు కేటాయించాలి.

» ఎస్సీ, ఎస్టీలకు ఒక సీటును కేటాయించాలి.

» సర్పంచ్ / ఉపసర్పంచ్‌ను పంచాయతీ సభ్యులు పరోక్షంగా ఎన్నుకోవాలి.

» 1965 వరకు ప్రతీ పంచాయతీ సమితిలో, దాని పరిధిలోని అన్ని గ్రామాల సర్పంచ్‌లు, నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉండేవారు.

» 1964 నాటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ చట్టం ప్రకారం ఎమ్మెల్యే / ఎమ్మెల్సీ పంచాయతీ సమితి అధ్యక్షుడిగా లేదా ఉపాధ్యక్షుడిగా పనిచేయడాన్ని నిషేధించారు.

» పంచాయతీ సమితి కనీసం 3 నెలలకొకసారి సమావేశం కావాలి.

» పంచాయతీ సమితికి BDO ప్రధాన కార్యనిర్వాహక అధికారిగా వ్యవహరిస్తారు.

జిల్లా పరిషత్

» దీనిలో కింద పేర్కొన్నవారు సభ్యులుగా ఉంటారు.

    1. జిల్లాలోని అన్ని పంచాయతీ సమితుల అధ్యక్షులు

    2. జిల్లా కలెక్టరు

    3. జిల్లాలోని మొత్తం ఎంపీలు

    4. జిల్లాలోని మొత్తం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

» జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు జిల్లాపరిషత్ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.

» 1959 నాటి చట్టానికి 1963లో చేసిన సవరణ ప్రకారం జిల్లా కలెక్టరు జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసేందుకు అనర్హుడు.

ఎం.టి. రాజు కమిటీ

» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1968లో ఎం.టి. రాజు కమిటీని నియమించింది.

» జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా జిల్లా అభివృద్ధి బోర్డులను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచించింది.

జలగం వెంగళరావు కమిటీ:

» పంచాయతీరాజ్ సంస్థలపై వివిధ వర్గాల నుంచి విమర్శలు రావడంతో 1968, మార్చిలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ పంచాయతీరాజ్‌కు సంబంధించిన అంశాలపై సిఫార్సులు చేసేందుకు జలగం వెంగళరావు అధ్యక్షతన 12 మంది శాసన సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసింది.

ఈ కమిటీ సిఫార్సులు

» పంచాయతీరాజ్ సంస్థలపై విమర్శలకు ప్రధాన కారణం నిధుల లేమి, కార్యాచరణలో స్వాతంత్య్రం లేకపోవడం.

» District Development Boardలను రద్దుచేయాలి.

» సర్పంచ్, పంచాయతీ సమితి అధ్యక్షుడు లేదా జిల్లా పరిషత్ ఛైర్మన్ స్వతంత్ర అధికారాలు కలిగి ఉండరాదు.

» స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీల ఎన్నికల గుర్తులను ఉపయోగించరాదు.

» జిల్లా పరిషత్‌కు సాలీనా తలసరి నిధులను 25 పైసల నుంచి ఒక రూపాయికి పెంచాలి.

» పంచాయతీలు నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడకుండా వాటికి తగినంత వనరులను కల్పించాలి.

సి. నరసింహం కమిటీ:

» పంచాయతీ సంస్థలు మెరుగైన పనితీరును కనబరిచేందుకు అవసరమైన సిఫార్సుల కోసం రాష్ట్రప్రభుత్వం 1971లో సి. నరసింహం కమిటీని ఏర్పాటు చేసింది.

» ఈ కమిటీ తన నివేదికను 1972లో సమర్పించింది.

కమిటీ నివేదికలోని ముఖ్యాంశాలు:

» గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.

» ఉపసర్పంచ్‌ను సర్పంచ్, గ్రామపంచాయతీ సభ్యులు ఎన్నుకోవాలి.

» గ్రామ సర్పంచ్‌లు, గ్రామపంచాయతీ సభ్యులతో కూడిన ఒక ఎన్నికల గణం ప్రత్యక్ష పద్ధతిలో పంచాయతీ సమితి సభ్యులను ఎన్నుకోవాలి.

» పంచాయతీ సమితి సభ్యుల సంఖ్య జిల్లా పరిషత్ సభ్యుల సంఖ్యకు 12 రెట్లు ఉండాలి.

» పంచాయతీ సమితి సభ్యులు తమలో నుంచి ఒకరిని అధ్యక్షుడిగా, మరొకరిని ఉపాధ్యక్షుడిగా వారే ఎన్నుకోవాలి.    

» గ్రామ పంచాయతీలో వారి సంఖ్యను బట్టి మహిళలకు 1 నుంచి 3 సీట్లను రిజర్వు చేయాలి.

» పంచాయతీ సమితిలో, జిల్లాపరిషత్‌లో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయాల్సిన అవసరం లేదు.

» జిల్లాపరిషత్ స్థాయీ సంఘం అధ్యక్షుడిగా, ఎక్స్అఫీషియో సభ్యుడిగా జిల్లా కలెక్టరును కొనసాగించే విధానాన్ని రద్దుచేయాలి.

» గ్రామపంచాయతీ సర్పంచ్‌ను ప్రత్యక్షంగా (నేరుగా) ఎన్నుకుంటారు. కాబట్టి అతడిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించడానికి వీల్లేదు.

» ఉపసర్పంచ్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.

» గ్రామ పంచాయతీ ఓటర్లలో కనీసం 10 మంది ఎస్సీ లేదా ఎస్టీ వర్గాలవారు ఉంటే గ్రామపంచాయతీ సీట్లలో వారికి కనీసం ఒక సీటును రిజర్వు చేయాలి.

» జిల్లా పరిషత్, పంచాయతీ సమితులకు శాసన సభ్యులను ఎక్స్అఫీషియో సభ్యులుగా చేయాల్సిన అవసరం లేదు.

» జాతీయ ఆర్థిక సంఘం మాదిరిగా ఒక స్థానిక ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

» పంచాయతీ సమితి లేదా జిల్లా పరిషత్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలకు గుర్తింపును ఇవ్వాలి.

» గ్రామ పంచాయతీ సర్పంచ్ లేదా ఉపసర్పంచ్‌ను పంచాయతీ సభ్యులను తొలగించే అధికారం పంచాయతీరాజ్ కమిషనర్‌కు ఇవ్వాలి.

అశోక్ మెహతా కమిటీ సిఫార్సులపై అధ్యయనం కోసం ఏర్పడిన సి. నరసింహం కమిటీ సిఫార్సులు (1979)

» పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలి.

» పంచాయతీరాజ్ సంస్థలకు నియమబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలి.

» రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి.

» ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సర్పంచ్, పంచాయతీ సమితి, జిల్లాపరిషత్ అధ్యక్ష పదవుల్లో రిజర్వేషన్లు ఇవ్వాలి.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సమీక్షా మండళ్ల చట్టం (1986)

» ఈ చట్టం ద్వారా ఎన్.టి. రామారావు ప్రభుత్వం 4 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అవి:

    1. గ్రామపంచాయతీ

    2. మండల ప్రజాపరిషత్

    3. జిల్లా ప్రజాపరిషత్

    4. జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్షామండలి

» పై వ్యవస్థ కోసం ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికాభివృద్ధి సమీక్షామండళ్ల చట్టం 1986ను చేసింది.

» ఈ చట్టం 1986, జనవరి నుంచి అమల్లోకి వచ్చింది.

ఈ చట్టంలోని ముఖ్యాంశాలు:

» 330 పంచాయతీ సమితులు రద్దుచేసి వాటిస్థానంలో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేశారు.

» ప్రతి పంచాయతీ సమితిని 3 లేదా 4 మండల ప్రజాపరిషత్‌లుగా విభజించారు.

» 35,000 నుంచి 50,000 వరకు జనాభా ఉన్న గ్రామాల సముదాయాన్ని కలిపి, మండల ప్రజాపరిషత్‌గా ఏర్పాటు చేశారు.

» జిల్లా పరిషత్‌ను జిల్లా ప్రజాపరిషత్‌గా మార్చారు.

బి.పి.ఆర్. విఠల్ కమిటీ (1991)

» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థ, రెవెన్యూ వ్యవస్థల పునర్వ్యవస్థీకరణ కోసం అధ్యయనం చేసేందుకు 1991లో బి.పి.ఆర్. విఠల్ అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బి.పి.ఆర్. విఠల్ కమిటీ సిఫార్సులపై అప్పటి ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ శాఖా మంత్రి డీకే సమరసింహా రెడ్డి అధ్యక్షతన కేబినెట్సబ్ కమిటీని ఏర్పరిచి అధ్యయనం చేయమని కోరింది.

ఈ కమిటీ సిఫారసులు:

» ఆంధ్రప్రదేశ్‌లోని 1104 మండలాల స్థానంలో 500 నుంచి 550 వరకు తాలూకాలను ఏర్పాటు చేయాలి.

» ప్రతి 80 వేల నుంచి లక్ష జనాభాకు ఒక తాలూకా పంచాయతీ సమితిని ఏర్పాటు చేయాలి.

» వ్యతిరేక ఓటు విధానాన్ని అమలు చేయాలి

» ఎన్నికల్లో 50% కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థినే ఎన్నికైనట్లు ప్రకటించాలి.

» పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుల వినియోగాన్ని నిషేధించాలి.

» పంచాయతీ ఎన్నికల్లో పార్టీరహిత పోటీ విధానాన్ని అమలు చేయాలి.

» జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవికి పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరపాలి.

» జిల్లా ప్రజా పరిషత్ అనే పదం నుంచి ప్రజా అనే పదాన్ని తీసివేసి జిల్లా పరిషత్‌గా నిర్దేశించాలని సూచించింది.

» ప్రతి తాలూకా పంచాయతీ సమితిలో ఒక తాలూకా అభివృద్ధి అధికారిని నియమించాలి.

» ఇతడికి విధి నిర్వహణలో సహాయం అందించేందుకు విస్తరణాధికారులు ఉండాలి.

» వివిధ రకాల ఏజెన్సీలు నిర్వర్తిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ తాలూకా పంచాయతీ సమితికి అప్పగించాలి.

» వివిధ రంగాల సమగ్రాభివృద్ధికి మొత్తం 6 రకాల స్థాయీ సంఘాలను ఏర్పాటు చేయాలి. అవి:

      1. ప్రణాళికా స్థాయీ సంఘం

      2. ఆర్థిక వ్యవస్థ స్థాయీ సంఘం

      3. వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం

      4. విద్యాస్థాయీ సంఘం

      5. సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘం

      6. మహిళాభివృద్ధి స్థాయీ సంఘం

ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టం - 1994

» ఈ చట్టం 3 అంచెల వ్యవస్థను కింది విధంగా పేర్కొంది.

    1. కింది స్థాయిలో - గ్రామ పంచాయతీ

    2. మధ్యస్థాయిలో - మండల పరిషత్

    3. జిల్లాస్థాయిలో - జిల్లా పరిషత్

PESA Act - 1996

» దిలీప్‌ సింగ్ భూరియా కమిటీ సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్ చట్టాన్ని షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరిస్తూ చేసిన చట్టమే పెసా చట్టం

» PESA అంటే Panchayat Raj Extention to Scheduled Areas

» భారత ప్రభుత్వం 1996, డిసెంబరు 24 నుంచి ఈ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది.

» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PESA చట్టానికి అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి, షెడ్యూల్డ్ ప్రాంతాలకు విస్తరించింది. దీని ప్రకారం....

1. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామసభ ఆమోదంతోనే గ్రామ పంచాయతీలు ఆర్థికాభివృద్ధి, సామాజిక న్యాయం, ప్రణాళికల రూపకల్పన అమలు చేయాలి.

2. గ్రామసభ ద్వారానే దారిద్య్ర నిర్మూలన, ఇతర కార్యక్రమాల్లో లబ్దిదారుల ఎంపిక కూడా జరగాలి.

3. గ్రామ పంచాయతీ ద్వారా అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు, నిధుల వినియోగానికి సంబంధించిన ధ్రువపత్రాలు గ్రామసభ ఆమోదం పొందాలి.

4. గ్రామసభ, గ్రామ పంచాయతీలు చేసిన సిఫార్సులు చట్టబద్ధమైనవిగా పరిగణిస్తారు.

5. గిరిజన ప్రాంతాల్లో గనుల తవ్వకానికి వేలంపాట ద్వారా ఖనిజ సంపద వినియోగానికి లైసెన్సులు మంజూరు చేసే అధికారం గ్రామసభ, గ్రామ పంచాయతీలకు ఉంటుంది.

6. ప్రతిగ్రామానికి గ్రామసభ ఉంటుంది. ఆ సభ గిరిజన ప్రజల సంప్రదాయాలను పరిరక్షించేదిగా ఉండాలి.

7. షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ప్రతి పంచాయతీలో వివిధ వర్గాల జనాభా ప్రాతిపదికగా సీట్లను రిజర్వు చేయాలి.

8. అన్ని స్థాయుల్లోని పంచాయతీల ఛైర్మన్ పదవులన్నింటినీ షెడ్యూల్డ్ తెగలకు తప్పకుండా రిజర్వు చేయాలి.

9. పంచాయతీలకు, గ్రామసభకు రాష్ట్ర శాసనసభ కింది అధికారాలను బదలాయించాలి.

» మద్యపాన నిషేధాన్ని అమలు చేసే, నియంత్రించే అధికారం ఉండాలి.

» గ్రామ మార్కెట్‌లను నిర్వహించే అధికారం.

» గిరిజనులకు పరపతి సౌకర్యం కల్పించే వడ్డీ వ్యాపారులను నియంత్రించే అధికారం.

» స్థానిక ప్రణాళికలు, వనరులను నియంత్రించే అధికారం.

షెడ్యూల్ ప్రాంతాల్లో స్థానిక పాలన - ఆంధ్రప్రదేశ్

» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు సంబంధించిన ప్రత్యేక నియమాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించింది.

» గిరిజన ప్రాంతాల పరిరక్షణకు, అక్కడి ప్రజల ప్రత్యేక అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన చట్టం 1998, జనవరి 16 నుంచి అమల్లోకి వచ్చింది.

చట్టంలోని ముఖ్యాంశాలు

» గిరిజన గ్రామంలోని ప్రజల ఆచార సంప్రదాయాలను, సాంస్కృతిక పరమైన ప్రత్యేకతను పరిరక్షించుకునే హక్కు ఆ గ్రామసభకే ఉంటుంది.

» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని మొత్తం గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థానాల్లో కనీసం సగం స్థానాలను ఎస్టీ వర్గాలకు రిజర్వు చేయాలి.

» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని అన్ని గ్రామ సర్పంచ్ పదవులు, అన్ని మండల పరిషత్ అధ్యక్ష పదవులు తప్పనిసరిగా ఎస్టీ వారికి రిజర్వు చేయాలి.

» షెడ్యూల్డ్ ప్రాంతాల్లోని ఖనిజ నిక్షేపాలను వెలికితీయడానికి అవసరమైన లైసెన్స్‌లను ఇచ్చే ముందు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత గ్రామ పంచాయతీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.

» అభివృద్ధి పనులను చేపట్టడానికి షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూసేకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తే, సంబంధిత మండల పరిషత్‌ను సంప్రదించాలి.

» మండల పరిషత్‌లో ఏదైనా తెగకు ప్రాతినిధ్యం లేనట్లయితే ఆ తెగలకు చెందినవారిని మండల పరిషత్ సభ్యులుగా ప్రభుత్వం నామినేట్ చేయవచ్చు.

ఆర్టికల్ 243 (A) గ్రామసభ

» రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(A) ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామసభ ఏర్పాటవుతుంది.

» గ్రామసభలో గ్రామ పంచాయతీకి చెందిన రిజిస్టర్డ్ ఓటర్లు సభ్యులుగా ఉంటారు.

» గ్రామసభ పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలాధారం.

» గ్రామసభ సమావేశాలను సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంలోపు ఎప్పుడైనా నిర్వహించవచ్చు.

గ్రామసభ - విధులు

» గ్రామ పంచాయతీకి సంబంధించిన వార్షిక పరిపాలనను పరిశీలించడం.

» ఆడిట్ నివేదికలను పరిశీలించడం, ఆమోదించడం.

» కొత్తగా పన్నులు విధించడానికి లేదా ప్రస్తుతం ఉన్న పన్నులను పెంచడానికి ప్రతిపాదనలు చేయడం.

» ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేయడం

» గ్రామసభలో చేసిన తీర్మానాలకు గ్రామపంచాయతీ సముచిత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం పేర్కొంది.

గ్రామసభ సమావేశాలకు కోరం

» సభాసమావేశాలు నిర్వహించడానికి కావాల్సిన కనీస సభ్యుల హాజరునే కోరం అంటారు. ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. అవి:

    1) మధ్యప్రదేశ్ - 1/3

    2) హిమాచల్ ప్రదేశ్ - 1/5

    3) మహారాష్ట్ర - 1/15

    4) ఉత్తరప్రదేశ్, పశ్చిమ్ బంగా - 1/20

    5) తమిళనాడు, ఒడిశా, రాజస్థాన్, కేరళ, కర్ణాటక, బిహార్ - 1/10

» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం గ్రామసభకు కోరం నిర్ణయించలేదు.

గ్రామసభ సమావేశాలు - సంవత్సరానికి ఎన్నిసార్లు జరపాలి?

» ఆర్టికల్, 243 (A) ప్రకారం గ్రామసభ సమావేశాలను 6 నెలల వ్యవధి మించకుండా సంవత్సరానికి 2 సార్లు నిర్వహించాలి.

     1) ఏప్రిల్ 14

     2) అక్టోబరు 3

వివిధ రాష్ట్రాల్లో గ్రామసభ సమావేశాలను కింది విధంగా నిర్వహిస్తున్నారు.

     1) మధ్యప్రదేశ్, పశ్చిమ్ బంగా - సంవత్సరానికి ఒకసారి

     2) గుజరాత్, కేరళ - సంవత్సరానికి 2 సార్లు

     3) తమిళనాడు - సంవత్సరానికి 3 సార్లు

     4) మహారాష్ట్ర - సంవత్సరానికి 6 సార్లు

» 2009 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామసభ సంవత్సరానికి 4 సార్లు తప్పనిసరిగా నిర్వహించాలని నిర్దేశించారు. అవి:

    1) ఏప్రిల్ 14

    2) అక్టోబరు 3

    3) జనవరి 2

    4) జులై 1

» గ్రామసభను సంవత్సరానికి 2 సార్లు సమావేశపరచడంలో సర్పంచ్ విఫలమైతే అతడు తన పదవిని కోల్పోతాడు.

» ఈ విధంగా పదవిని కోల్పోయిన సర్పంచ్ తొలగించిన తేదీ నుంచి ఒక సంవత్సరం వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హతను కోల్పోతాడు.

» గ్రామసభ సభ్యుల్లో కనీసం 50 మంది లేదా 10% సభ్యులు లిఖిత పూర్వకంగా కోరినట్లయితే గ్రామసభ సమావేశాలను సర్పంచ్ ఏర్పాటు చేయాలి.

» భారత ప్రభుత్వం 2009 - 2010 సంవత్సరాన్ని గ్రామసభల సంవత్సరంగా ప్రకటించింది

గ్రామ పంచాయతీ

» గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1964ను ఆంధ్రప్రదేశ్‌లో రూపొందించారు.

» ఆంధ్రప్రదేశ్‌లో 1964లో మొదటిసారిగా పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి.

గ్రామ పంచాయతీ సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకోవాలని సిఫార్సు చేసిన కమిటీలు

    1. జలగం వెంగళరావు కమిటీ

    2. నరసింహం కమిటీ

    3. దంత్‌వాలా కమిటీ

» 1981 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచ్‌ను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునే విధానాన్ని ప్రవేశపెట్టారు.

» ఎన్.టి. రామారావు ప్రభుత్వం పటేల్, పట్వారీ వ్యవస్థను రద్దుచేసి గ్రామ పరిపాలనాధికారులను నియమించింది.

» గ్రామ పంచాయతీ గ్రామస్థాయిలోని పరిపాలనా విభాగం.

» గ్రామ పంచాయతీలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ ఏర్పాటు చేస్తారు.

గ్రామ పంచాయతీలు 2 రకాలు

     1. నోటిఫైడ్ పంచాయతీ: (మేజర్ గ్రామ పంచాయతీ)

        » దీని వార్షికాదాయం రూ.60,000/- కంటే ఎక్కువ.

     2. నాన్ - నోటిఫైడ్ పంచాయతీ: (మైనర్‌ గ్రామ పంచాయితీ)

        » దీని వార్షికాదాయం రూ.60,000/- కంటే తక్కువ.

» 250 కంటే జనాభా ఎక్కువ ఉన్న గ్రామంలో గ్రామపంచాయతీని ఏర్పాటు చేయవచ్చు.

» గ్రామ జనాభాను బట్టి గ్రామపంచాయతీలో కనిష్ఠంగా 5, గరిష్ఠంగా 21 మంది వార్డు సభ్యులు ఉండవచ్చు.

» గ్రామపంచాయతీ సర్పంచ్‌ను, వార్డు సభ్యులను గ్రామంలోని ఓటర్లు పార్టీరహితంగా ప్రత్యక్ష పద్ధతిలో రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

» గ్రామాన్ని ఓటర్ల సంఖ్య ఆధారంగా వార్డులుగా విభజించి ప్రతి వార్డుకు ఒక సభ్యుడిని ఎన్నుకుంటారు.

» గ్రామపంచాయతీలో ఓటర్లుగా పేరు నమోదు చేసుకున్నవారే గ్రామపంచాయతీ ఎన్నికల్లో పాల్గొనాలి.
 

వార్డులు - విభజన

జనాభా వార్డు సభ్యుల సంఖ్య
300 వరకు 5 మంది
301 నుంచి 500 వరకు 7 మంది
501 నుంచి 1500 వరకు 9 మంది
1501 నుంచి 3000 వరకు 11 మంది
3001 నుంచి 5000 వరకు 13 మంది
5001 నుంచి 10,000 వరకు 15 మంది
10001 నుంచి 15,000 వరకు 17 మంది
15001 కంటే ఎక్కువ జనాభా ఉంటే 19 మంది నుంచి 21 మంది

గ్రామపంచాయతీకి పోటీ చేయడానికి ఉండాల్సిన అర్హతలు

» గ్రామ పంచాయతీలో రిజిస్టరైన ఓటరుగా ఉండాలి.

» 21 సంవత్సరాల వయసు నిండాలి.

» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.

» శాసనసభకు పోటీచేయడానికి కావాల్సిన అర్హతలు ఉండాలి.

» మహ్మద్ షరీఫ్ Vs హర్యానా రాష్ట్రం కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు పోటీ చేయరాదనే నియమం దేశం శ్రేయస్సు దృష్ట్యా సమర్థనీయమేనని పేర్కొంది.

ఇతర అనర్హతలు

» అంధులు, మూగవారై ఉండరాదు.

» దివాలా కోరై ఉండరాదు.

» కుష్టురోగై ఉండరాదు.

గ్రామపంచాయతీ - సమావేశాలు

» గ్రామపంచాయతీ సమావేశాల కోరం గ్రామపంచాయతీ మొత్తం సభ్యుల్లో 1/3వ వంతు.

» గ్రామపంచాయతీ నెలకొకసారి తప్పనిసరిగా సమావేశం కావాలి.

» పంచాయతీ సమావేశాల్లో చర్చకు వచ్చిన ప్రతి విషయంపైన ఓటింగ్ జరుగుతుంది.

» ఏదైనా తీర్మానంపై అనుకూలంగా, వ్యతిరేకంగా సమానంగా ఓట్లు వచ్చినప్పుడు సర్పంచ్ తన నిర్ణాయక ఓటును వినియోగిస్తారు.

» పంచాయతీ సభ్యుల్లో కనీసం 3వ వంతు సభ్యులు లిఖితపూర్వకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరితే సర్పంచ్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.

» ఒక వ్యక్తి ఒకే సమయంలో గ్రామపంచాయతీలోని ఒకటికంటే ఎక్కువ వార్డుల నుంచి పోటీచేయరాదు.

» గ్రామపంచాయతీలను రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వానికే ఉంది. రద్దు అయిన గ్రామపంచాయతీలకు 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలి.

» ఒక గ్రామపంచాయతీ రద్దయ్యే సమయానికి దాని కాలపరిమితి 6 నెలల కంటే తక్కువగా ఉంటే ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.

» స్థానిక సంస్థల ప్రతినిధులను తొలగించే అధికారం జిల్లా కలెక్టరుకు ఉంది.

» వరుసగా 3 సమావేశాలకు హాజరుకాని సభ్యుడు తన సభ్యత్వాన్ని కోల్పోతాడు, అయితే 30 రోజుల లోపల తన సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరితే తప్పనిసరిగా పునరుద్ధస్తారు. అయితే రెండోసారి ఇలా జరిగితే పునరుద్ధరించరు.

» ఏవైనా కారణాల వల్ల సభ్యుడు లేదా సర్పంచ్ స్థానాలు ఖాళీ అయితే వాటిని 4 నెలల లోపు భర్తీచేయాలి.

» గ్రామ సర్పంచ్/ ఉపసర్పంచ్/ పంచాయతీ సభ్యుడు... వీరిలో ఎవరైనా గ్రామ పంచాయతీ నిర్వహణకు సంబంధించిన రాష్ట్రప్రభుత్వ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలుచేయడంలేదని జిల్లా కలెక్టరు భావించినట్లయితే వారిని 3 నెలల వరకు కలెక్టరు సస్పెండ్ చేయవచ్చు. ఈ సస్పెండ్‌ను 6 నెలల వరకు పొడిగించే అధికారం ప్రభుత్వానికే ఉంది.

శాశ్వత ఆహ్వానితులు

» మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గ సభ్యుడు (MPTC) తన ప్రాదేశిక పరిధిలోని గ్రామ పంచాయతీల సమావేశాలకు శాశ్వత ఆహ్వానితుడిగా హాజరు కావచ్చు. కానీ ఓటు హక్కు మాత్రం ఉండదు.

కోఆప్టెడ్ సభ్యులు

» స్వయంసహాయక బృందాల నుంచి సర్పంచ్ అధ్యక్షతన ఒక సంఘం ప్రతి బృందం నుంచి ఒక్కో సభ్యుడిని ఎంపిక చేస్తుంది. ఆ సభ్యులను పంచాయతీ సమితికి కో-ఆప్ట్ చేస్తారు.

రిజర్వేషన్లు ఆర్టికల్ - 243(D)

» గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలి.

» ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన సీట్లలో 1/3వ వంతు సీట్లను ఈ వర్గాల మహిళలకు కేటాయించాలి.

వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు నిర్దేశించలేదు. అయితే ఆయా రాష్ట్రాల శాసనసభలు బీసీలకు ఎంతశాతం రిజర్వేషన్లు ఇవ్వాలో నిర్ణయించవచ్చు.

» ఆంధ్రప్రదేశ్‌లోని స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల వారికి 34% సీట్లు రిజర్వ్ చేశారు.

» బీసీలకు కేటాయించిన సీట్లలో 1/3వ వంతు మహిళలకు కేటాయించాలి.

» 73వ సవరణ చట్టం ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 1/3వ వంతు సీట్లు నిర్దేశించాలి.

» ప్రస్తుతం మనదేశంలో ఆంధ్రప్రదేశ్‌తో సహా 13 రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లు రిజర్వ్ చేశారు.

» గ్రామపంచాయతీల్లోని రిజర్వ్ చేసిన సీట్లు రొటేషన్ పద్ధతిపై వివిధ వార్డులకు కేటాయిస్తారు.

ఆంధ్రప్రదేశ్‌లో

» ఆంధ్రప్రదేశ్ రాష్ట్రప్రభుత్వం 2013, జూన్ 1న జీవో 279ను విడుదల చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% సీట్లను రిజర్వు చేసింది.

» 2011 జనాభా లెక్కల ప్రకారం ఏపీలో బీసీ వర్గాల జనాభా 39.18% గా ఉంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్ (ధరావత్తు) వివరాలు

కేటగిరి వార్డు మెంబరు సర్పంచ్ అభ్యర్థి MPTC అభ్యరి ZPTC అభ్యర్థి
జనరల్ రూ.500 రూ.2,000 రూ.2,500 రూ.5,000
ఎస్సీ, ఎస్టీ, బీసీ రూ.250 రూ.1,000 రూ.1,250 రూ.2,500


స్థానిక సంస్థల ఎన్నికల్లో అభ్యర్థుల వ్యయ పరిమితి

» జనాభా పదివేల కంటే ఎక్కువ ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.80,000/, వార్డు మెంబరు రూ. 10,000/- వరకు ఖర్చు చేసుకోవచ్చు.

» జనాభా పదివేల కంటే తక్కువ ఉంటే సర్పంచ్ అభ్యర్థి రూ.40,000/, వార్డు మెంబరు రూ.6,000/ వరకు ఖర్చు చేసుకోవచ్చు.

» MPTC అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితి లక్ష రూపాయలు.

» ZPTC అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితి 2 లక్షల రూపాయలు.


ఏకగ్రీవ పంచాయతీలకు - ప్రోత్సాహకాలు

» 15,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే రూ.20 లక్షలు.

» 15,000 కంటే తక్కువ జనాభా ఉన్న పంచాయతీలకు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగితే రూ.7 లక్షలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రోత్సాహకం కింద అందిస్తోంది.

సర్పంచ్‌ల రిజర్వేషన్‌లు

» 2013, జులైలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల రిజర్వేషన్ల కోసం రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకున్నారు.

» బీసీ వర్గాల రిజర్వేషన్ల కోసం జిల్లాను యూనిట్‌గా తీసుకున్నారు.

» మొత్తం సర్పంచ్ పదవుల్లో 50% స్త్రీలకు రిజర్వు చేయాలి.


గ్రామపంచాయతీ అధికారాలు - విధులు

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994లోని వివరాల ప్రకారం

» సెక్షన్ 45 - 59 వరకు గ్రామ పంచాయతీ నిర్వహించాల్సిన విధులు, దానికి సంబంధించిన ఆస్తుల విషయాలను నిర్దేశించడమైంది.

» సెక్షన్ 60 - 79 వరకు గ్రామ పంచాయతీ ఆర్థిక విషయాలకు సంబంధించిన అధికారాలు.

» సెక్షన్ 80 - 125 వరకు ప్రజాభద్రత సౌకర్యం, ఆరోగ్యం గురించి చేయాల్సిన పనులు.

» సెక్షన్ 126 - 142 వరకు గ్రామ పంచాయతీకి చెందిన ఇతర విషయాలను పేర్కొంటుంది.


గ్రామ పంచాయతీ తప్పనిసరిగా నిర్వహించాల్సిన విధులు

» సెక్షన్ 45 ప్రకారం గ్రామ పంచాయతీ కింద పేర్కొన్న విధులను తప్పనిసరిగా నిర్వహించాలి. అవి:

    1. గ్రామస్థాయిలో ఆర్థిక వనరులను సమీకరించడం.

    2. జనన, మరణాలను నమోదు చేయడం.

    3. తన అధికార పరిధిలోని భవనాలు, రహదారులు, వంతెనల నిర్మాణం, నిర్వహణ.

    4. ప్రజా మరుగుదొడ్లు నిర్మాణం, నిర్వహణ.

    5. వీధిదీపాల ఏర్పాటు.

    6. మురుగునీరు కాలువల నిర్మాణం.

    7. పంచాయతీ పరిధిలోని బజార్లు, వీధుల్లో చెత్తకుప్పలు, పిచ్చిమొక్కలను తొలగించడం.

    8. శ్మశాన వాటికల ఏర్పాటు, నిర్వహణ.

    9. అంటు వ్యాధుల నివారణ.

    10. రక్షిత మంచినీటి సరఫరా.

    11. కంపోస్టు ఎరువుల తయారీ.

    12. బందెలదొడ్లు ఏర్పాటు, నిర్వహణ.

సెక్షన్, 46 ప్రకారం వివేచనాత్మక విధులు

» గ్రామ పంచాయతీకి ఉన్న ఆర్థిక వనరుల లభ్యతను బట్టి కింది విధులను నిర్వహించాల్సి ఉంటుంది.  అవి:

    1. గ్రంథాలయాల ఏర్పాటు - నిర్వహణ.

    2. ప్రయాణికులకు ధర్మశాలలు, విశ్రాంతి గృహాల నిర్మాణం.

    3. రోడ్ల పక్కన, ఇతర పబ్లిక్ స్థలాల్లో చెట్లు నాటించడం.

    4. వైద్యశాలల ఏర్పాటు, నిర్వహణ.

    5. ఆటస్థలాలు, వ్యాయామశాలల ఏర్పాటు.

    6. పార్కుల నిర్మాణం, నిర్వహణ.

    7. వికలాంగులు, రోగులకు సహాయ కార్యక్రమాలు.

    8. గ్రంథాలయాలు, పఠన మందిరాల ఏర్పాటు.

    9. గిడ్డంగులు, ధాన్యాగారాల ఏర్పాటు, నిర్వహణ.

    10. మేలిరకం వ్యవసాయ పద్ధతులను అనుసరించడం.

    11. వ్యవసాయ అభివృద్ధి కోసం ప్రదర్శనల నిర్వహణ.

    12. గ్రామ నివేశన స్థలాల విస్తరణ.

    13. సహకార సంఘాలకు చేయూతనివ్వడం.

    14. ప్రసూతి, శిశు సంక్షేమ కేంద్రాల స్థాపన, నిర్వహణ.

    15. మార్కెట్లు, జాతరలు, ఉత్సవాల నిర్వహణ.

    16. పశువుల కొట్టాల స్థాపన, నిర్వహణ.

    17. పబ్లిక్ కబేళాలు తెరవడం, నిర్వహించడం.

    18. నిరుద్యోగ గణాంకాల తయారీ.

    19. విపత్తుల సమయంలో సహాయక చర్యలు.

    20. ఊర కుక్కలను నియంత్రించడం.

    21. కమతాల ఏకీకరణ, భూసంస్కరణ చర్యలు.

    22. గ్రామ ప్రజల నైతిక, సాంఘిక, భౌతిక సంక్షేమం పెంపొందించడం.

    23. అవినీతి, అస్పృశ్యతల నివారణకు కృషి.

    24. పబ్లిక్ మార్కెట్‌ల ఏర్పాటు, నిర్వహణ.

    25. పశుసమృద్ధి, వైద్యసహాయం.


ఇతర విధులు

» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం, 1994లోని సెక్షన్, 67 ప్రకారం అనుమతులు లేని ప్రకటనలు తొలగించడం.

» సెక్షన్ - 92 ప్రకారం లైసెన్స్ లేని పందులను, కుక్కలను నిర్మూలించడం.

» సెక్షన్ - 98 ప్రకారం దురాక్రమణలను తొలగించడం.

» సెక్షన్ - 101 ప్రకారం రోడ్లపై ఆటంకాలు, గుంతలను తవ్వడం నిషేధించడం.

» సెక్షన్ - 102 ప్రకారం అనుమతి లేకుండా పబ్లిక్ రోడ్లపై చెట్లు నాటడం లేదా కొట్టివేయడం.

» సెక్షన్ - 111 ప్రకారం పబ్లిక్ రోడ్లపై విక్రయం నిషేధించడం.

» సెక్షన్ - 121 ప్రకారం ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయడం.

» సెక్షన్ - 105 ప్రకారం ప్రైవేటు మార్కెట్లకు లైసెన్స్ ఇవ్వడం.

» సెక్షన్ - 122 ప్రకారం వివిధ యంత్రాల వల్ల కలిగే శబ్దాలను తొలగించడానికి ఆదేశాలు జారీచేయడం.


ఆర్టికల్, 243 (G)

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా XIవ షెడ్యూల్‌లో పొందుపరచిన పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేయాల్సిన 29 రకాల అధికారాలు, విధులను నిర్దేశించారు. అవి:

     1. చిన్ననీటిపారుదల, నీటి నిర్వహణ, వాటర్‌షెడ్‌ల అభివృద్ధి

     2. వ్యవసాయం, సంబంధిత రంగాలు

     3. భూ సంస్కరణలు

     4. గృహ నిర్మాణం

     5. చేపల పెంపకం

     6. సామాజిక పర్యావరణ

     7. ఖాదీ, చేనేత పరిశ్రమ

     8. పేదరిక నిర్మూలనా కార్యక్రమాలు

     9. తాగునీరు

     10. రోడ్లు, కల్వర్టుల నిర్మాణం

     11. ప్రాథమిక, మాధ్యమిక విద్య

     12. వయోజన విద్య

     13. గ్రంథాలయాలు

     14. సాంస్కృతిక కార్యక్రమాలు

     15. స్త్రీ, శిశు సంక్షేమాభివృద్ధి

     16. పశు సంవర్థకం

     17. ప్రజాపంపిణీ వ్యవస్థ

     18. గ్రామీణ విద్యుద్దీకరణ

     19. అటవీ ఉత్పత్తులు

     20. ఇంధనం, పశుగ్రాసం

     21. ఆరోగ్యం, పరిశుభ్రత

     22. ప్రత్యామ్నాయ ఇంధన వనరులు

     23. సాంకేతిక శిక్షణ, వృత్తివిద్య

     24. బలహీన వర్గాల సంక్షేమం

     25. కుటుంబ సంక్షేమం

     26. సామాజిక సంక్షేమం

     27. చిన్నతరహా పరిశ్రమలు

     28. ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ

     29. సంతలు, మార్కెట్ల నిర్వహణ


గ్రామ పంచాయతీ ఆర్థిక వనరులు

1. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం

    » ఇంటిపన్ను

    » వృత్తి పన్ను

    » ఆస్తుల బదిలీపై పన్ను

    » దుకాణాలపై పన్ను

    » భూమిశిస్తు

    » వాహనాలపై పన్ను

    » ఖాళీస్థలాలపై పన్ను

    » జంతువులపై పన్ను

2. ఆదాయాన్నిచ్చే ఆస్తులు

3. ఫీజులు, రుసుములు

4. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు

5. పంచాయతీ పరిధిలో పండించే వ్యవసాయోత్పత్తులపై పన్ను

6. గ్రామంలో సెల్‌ఫోన్ టవర్ ఏర్పాటు చేయాలంటే సంబంధిత కంపెనీ రూ.1000 దరఖాస్తు ఫీజును గ్రామ పంచాయతీకి చెల్లించాలి.

7. గ్రామ పంచాయతీ జనాభా ఆధారంగా ప్రతి ఒక్కరికి 4 రూపాయల చొప్పున ప్రభుత్వం తలసరి గ్రాంటును పంచాయతీ ఖాతాకు జమచేస్తుంది.

8. తన మూలధనంపై వచ్చే ఆదాయం, విశ్రాంతి భవనాలు, ఖాళీస్థలాలు, మార్కెట్లపై వచ్చే అద్దె లాంటివి.

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ప్రభుత్వాలకు బదిలీ చేసిన అంశాలు

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా

» నీటి పరీక్షల నివేదికలను సమీక్షించి తాగునీటి నాణ్యతను పర్యవేక్షించడం

» వాటర్‌షెడ్ కార్యక్రమాల అమలు

» జాతీయ ఉపాధి హామీ చట్టం

» గ్రామీణ నీటిసరఫరా పథకాల నిర్వహణ

» సంపూర్ణ పారిశుద్ధ్యం ప్రణాళికల తయారీ, అమలు, పర్యవేక్షణ

» కొత్త తాగునీటి పథకాల ప్రణాళికలను తయారుచేయడంలో పాల్గొనడం


వ్యవసాయ, సహకార శాఖల ద్వారా

» విపత్తు యాజమాన్యం, ప్రకృతి వైపరీత్యాలు

» వాటర్‌షెడ్ అభివృద్ధి పథకాల ద్వారా భూమి, నీటి సంరక్షణ

» ప్రోత్సాహక బహుమతులు

పాఠశాల విద్యాశాఖ ద్వారా

» గ్రామ పంచాయతీలో గ్రామ సర్పంచ్ అధ్యక్షుడిగా, ఒక మహిళా వార్డు సభ్యురాలు; ఎస్సీ, ఎస్టీ, బీసీ తరగతులకు చెందిన ఇద్దరు వార్డు సభ్యులతో విద్యకు సంబంధించిన ఒక ఉప కమిటీని ఏర్పాటు చేయాలి.

» విద్యా ఉప కమిటీ గ్రామ పంచాయతీ పరిధిలోని అన్ని పాఠశాలల పనితీరుని పర్యవేక్షించే అధికారం కలిగి ఉంటుంది.

» పాఠశాల సిబ్బంది రోజువారీ హాజరు, పాఠశాలలో బోధించే విద్యా ప్రమాణాలు, పాఠశాలలోని మౌలిక సదుపాయాలు, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించడం లాంటి అధికారాలు.

» గ్రామ పంచాయతీలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయుల, పాఠశాలలో ఒకరు లేదా ఇద్దరు సీనియర్ ఉపాధ్యాయులతో ప్రతి శనివారం ఈ విద్యా ఉప కమిటీ సమావేశం నిర్వహించి, పాఠశాల పనితీరుపై పర్యవేక్షిస్తుంది.

» ఈ ఉప కమిటీ పాఠశాల అభివృద్ధికి సంబంధించి ఏవైనా మరమ్మతులు, అదనపు గదుల కొత్త నిర్మాణాలు, ఫర్నిచర్ సరఫరా లాంటి పనులను తనిఖీచేసి, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నవీ, లేనివీ సరి చూసుకుని ఏవైనా లోపాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లాలి.

» ఈ విద్యా ఉప కమిటీ ఇతర అధికారలు

    ఎ. ఉపాధ్యాయుల హాజరును తనిఖీ చేయడం

    బి. పాఠ్యపుస్తకాల పంపిణీని పరిశీలించడం

    సి. విద్యార్థినీ, విద్యార్థుల నమోదు, హాజరు, డ్రాపవుట్స్‌ను పరిశీలించడం.

పశుసంవర్థక శాఖ డైరీ డెవలప్‌మెంట్, మత్స్యశాఖ

» పశువైద్య సంబంధిత సేవల ఏర్పాటు

» జంతువధశాలలు

» ప్రకృతి వైపరీత్యాల్లో పునరావాస చర్యలు

» పశుగణ బీమా

» పశుగ్రాస అభివృద్ధి

» మత్స్యకారుల సంక్షేమ పథకాలు చెరువులు, రిజర్వాయర్లలో చేపలు పట్టే హక్కుల వేలంలో వచ్చిన ఆదాయాన్ని కింది విధంగా విభజించారు.

» గ్రామ పంచాయతీలకు - 30%

» నీటి వినియోగదారుల సంఘాలకు - 50%

» మత్స్యశాఖకు - 20%


వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

» మందుల సరఫరా, ఉపయోగాన్ని సమీక్షించడం.

» అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకున్న చర్యలను సమీక్షించడం, పర్యవేక్షించడం.

» జాతీయ ఆరోగ్యమిషన్, ఇతర కార్యక్రమాల కింద వచ్చే జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించడం, పర్యవేక్షించడం.

» రక్షిత తాగునీరు, ఆరోగ్యం, పారిశుద్ధ్యం లాంటి కార్యకలాపాల అమలును నిర్వహించడం, పర్యవేక్షించడం.

» గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు తమ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించడం.


వెనుకబడిన తరగతులు సంక్షేమ శాఖ

» వసతి గృహాలకు మరమ్మతులు

» హాస్టల్ పిల్లలకు యూనిఫాం దుస్తులు

» కులాంతర వివాహం చేసుకునేవారికి ప్రోత్సాహం

» వసతిగృహంలో విద్యార్థులను చేర్పించడం


సాంఘిక సంక్షేమశాఖ

» కమ్యూనిటీ భవనాలు, అంబేడ్కర్ విగ్రహాల నిర్మాణం.

» వెట్టిచాకిరీ, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన కల్పించడం.

» వసతి గృహాల్లో విద్యార్థుల ప్రవేశాలను సమీక్షించి, పర్యవేక్షించడం.

» పాఠశాల యూనిఫాం, పుస్తకాలు, ఇతర సామాగ్రిని పర్యవేక్షించడం.

» కులాంతర వివాహాలను ప్రోత్సహించడం.


మహిళా శిశుసంక్షేమ, వికలాంగుల సంక్షేమ శాఖ

» మహిళలు, శిశుసంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధను కనపరచడం.

» ICDS, బాలికా శిశు సంరక్షణ పథకం, కిశోరశక్తి యోజన లాంటి పథకాల అమలును పర్యవేక్షించడం.

» 73వ సవరణ చట్టం ప్రకారం 11వ షెడ్యూల్‌లో పేర్కొన్న 29 అంశాలను స్థానిక సంస్థలకు బదిలీ చేసిన రాష్ట్రాలు - కర్ణాటక, కేరళ, తమిళనాడు, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ్ బంగా.

» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 29 అంశాలకు, కేవలం 10 అంశాలను మాత్రమే పంచాయతీరాజ్ సంస్థలకు బదిలీ చేసింది.

సర్పంచ్ అధికారాలు - విధులు

» సర్పంచ్ గ్రామ పంచాయతీకి రాజకీయ అధిపతి.

» గ్రామ పంచాయతీ, గ్రామసభ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

» గ్రామ పంచాయతీకి ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తారు.

» నెలకొకసారి గ్రామ పంచాయతీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

» 6 నెలలకొకసారి గ్రామసభ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

» గ్రామ పంచాయతీ వార్షిక ఖాతాలను ప్రతి సంవత్సరం ఆడిట్ చేయిస్తారు.

» గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేస్తారు.

» పంచాయతీ సభ్యుల అనర్హతలను జిల్లా పంచాయతీ అధికారికి తెలియజేస్తారు.

» గ్రామ పంచాయతీ పరిధిలోని ఏ అధికారి నుంచైనా ఎలాంటి సమాచారాన్నైనా సర్పంచ్ పొందగలరు.

» పంచాయతీ కార్యదర్శిపై పరిపాలనా పరమైన నియంత్రణ ఉంటుంది.


సర్పంచ్ - పదవీకాలం

» సర్పంచ్ పదవీకాలం సాధారణంగా 5 సంవత్సరాలు.

» గ్రామ సభను సకాలంలో నిర్వహించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు. ఈవిధంగా పదవిని కోల్పోయినట్లయితే, పదవిని కోల్పోయిన తేదీ నుంచి ఒక సంవత్సరంపాటు ఏవిధమైన ఎన్నికల్లో పోటీచేయకుండా అనర్హతలకు గురవుతారు.

» సర్పంచ్, ఉప సర్పంచ్‌లు అధికార దుర్వినియోగానికి పాల్పడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వారిని పదవి నుంచి తొలగిస్తుంది. వీరు 2 సంవత్సరాల వరకు తిరిగి ఆ పదవులకు పోటీచేయరాదు.

» గ్రామ పంచాయతీ అకౌంట్లను ఆడిట్ చేయించని సర్పంచ్ తన పదవిని కోల్పోతారు.

» సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వీల్లేదు.

» ఎన్నికలకు సంబంధించిన నేరాలకు పాల్పడినందుకు ఎవరైనా శిక్షకు గురైతే, శిక్ష విధించిన రోజు నుంచి పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ - 233 ప్రకారం 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీచేయరాదు.

» సర్పంచ్ తన రాజీనామాను గ్రామ పంచాయతీకి పంపాలి.

» ఏదైనా కారణం వల్ల గ్రామ పంచాయతీకి పంపే వీలు లేకపోతే సర్పంచ్ తన రాజీనామాను జిల్లా పంచాయతీ అధికారికి పంపాలి.


గ్రామ పంచాయతీ ఎన్నికల వివాదాలు

» గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని 1994 నాటి ఆంధ్రప్రదేశ్ నూతన పంచాయతీరాజ్ చట్టంలో నిర్దేశించారు.

» ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూనియర్ సివిల్ జడ్జి (మున్సిఫ్ కోర్టులు) కోర్టులను ప్రత్యేక ట్రిబ్యునల్‌గా ప్రకటించింది.

» సివిల్ కోర్టు న్యాయమూర్తే ఎన్నికల వివాదాలకు సంబంధించిన ఎన్నికల ట్రిబ్యునల్‌గా వ్యవహరిస్తారు.

» రెండు నెలల ముందస్తు నోటీసుతో గ్రామ పంచాయతీలపై కేసులను District Munsif Courtల్లో మాత్రమే దాఖలు చేయాలి.

» ఎన్నికల్లో పోటీ చేయడానికి, పదవుల్లో కొనసాగడానికి సంబంధించిన వివాదాలను ఆ గ్రామ పంచాయతీ ఏ జిల్లాలో ఉంటే, ఆ జిల్లాలో ఉండే జిల్లా కోర్టులోనే కేసును దాఖలు చేయాలి.

» ఒకసారి గ్రామ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎన్నికల ప్రక్రియ నిలిపివేసే అధికారం ఎవరికీ లేదు.


ఉప సర్పంచ్

» గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే అదే రోజు లేదా మరొక రోజు ఉపసర్పంచ్ ఎన్నిక జరుగుతుంది.

» ఉప సర్పంచ్ ఎన్నిక జరిపే సమావేశానికి జిల్లా పంచాయతీ అధికారి లేదా ఆయన ద్వారా అధికారం పొందిన వ్యక్తి అధ్యక్షత వహిస్తారు.

» గ్రామ పంచాయతీకి ఎన్నికైన వార్డు సభ్యులు, సర్పంచ్ చేయి ఎత్తడం ద్వారా ఉపసర్పంచ్‌ను ఎన్నుకుంటారు.

» సర్పంచ్ లేని సమయంలో ఆయన బాధ్యతలను ఉపసర్పంచ్ నిర్వహిస్తారు.

» సాధారణంగా ఉపసర్పంచ్ పదవీకాలం 5 సంవత్సరాలు.

» ఏదైనా కారణాల వల్ల ఉపసర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడితే 30 రోజుల్లోపు ఉప ఎన్నిక ద్వారా కొత్త ఉపసర్పంచ్‌ను ఎన్నుకోవాలి.

» ఉపసర్పంచ్ తన రాజీనామాను మండల పరిషత్ అభివృద్ధి అధికారికి (MPDO) పంపాలి.

» MPDOకు పంపలేకపోతే డివిజనల్ పంచాయతీ అధికారికి (DPO) పంపాలి.

» 2009 నాటి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఉప సర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టవచ్చు.

» ఉపసర్పంచ్‌గా పదవి చేపట్టిన నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి మాత్రమే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.

» అవిశ్వాస తీర్మానం 2/3వ వంతు సభ్యుల ఆమోదం పొందితే పంచాయతీరాజ్ కమిషనర్ ఉపసర్పంచ్‌ను పదవి నుంచి తొలగిస్తారు.

» ఉపసర్పంచ్‌ను తొలగించే అవిశ్వాస తీర్మానంలో సస్పెండ్ అయిన వార్డు సభ్యుడు కూడా పాల్గొని ఓటుహక్కును వినియోగించుకోవచ్చు.

ఇతర ముఖ్యాంశాలు

» కేంద్ర పంచాయతీరాజ్ శాఖ స్థానిక సంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం కోసం IGNOU (Indira Gandhi National Open University)తో ఒప్పందం కుదుర్చుకుంది.

» పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసి, సమర్థంగా నిర్వహించేందుకు ఉద్దేశించిన రాజీవ్‌గాంధీ పంచాయతీ స్వశక్తి కిరణ్ అభియాన్ పథకం 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో అమల్లోకి వచ్చింది.

» మనదేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి సంస్థల పనివిధానంపై శిక్షణ ఇవ్వడానికి ఏర్పాటు చేసిన సంస్థ - NIRD (National Institute of Rural Development). ఇది హైదరాబాద్‌లో ఉంది.

» ఒడిశాలోని గంజాం జిల్లాలోని ధుంకపరా గ్రామ సర్పంచ్ ఆరతీదేవికి అమెరికాలో జరిగే International Visitors Leadership Programme సదస్సులో భారతదేశం తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది.

ఆంధ్రప్రదేశ్‌లో 2016 మార్చిలో ప్రజా ప్రతినిధులకు పెరిగిన వేతనాల వివరాలు

హోదా పెరిగిన జీతం (రూపాయల్లో) (నెలకు)
జిల్లా పరిషత్ ఛైర్మన్ 40,000
ZPTC సభ్యులు 6,000
మండల పరిషత్ అధ్యక్షులు 6,000
MPTC సభ్యులు 3,000
సర్పంచ్ 3,000
మేయర్ 25,000
డిప్యూటీ మేయర్ 15,000
మున్సిపల్ ఛైర్మన్ (Special Grade) 15,000
మున్సిపల్ ఛైర్మన్ (ఇతర గ్రేడ్) 12,000
కార్పొరేటర్ 6,000
కౌన్సిలర్ (Special Grade) 3,500
కౌన్సిలర్ (ఇతర గ్రేడ్) 3,000

» మనదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థల పనితీరును ప్రోత్సహించడానికి కేంద్రప్రభుత్వం నిర్మల్ గ్రామీణ పురస్కార్ అవార్డులను ప్రవేశపెట్టింది.

     A. ఉత్తమ గ్రామపంచాయతీ - 7 లక్షల రూపాయలు

     B. ఉత్తమ మాధ్యమిక వ్యవస్థ - 15 లక్షల రూపాయలు

     C. ఉత్తమ జిల్లాపరిషత్ - 25 లక్షల రూపాయల.

» ఈ పారితోషికాలను ఆ సంస్థల అభివృద్ధికి వినియోగించాలి.

గ్రామ పంచాయతీలను వాటి వార్షిక ఆదాయం ఆధారంగా కిందివిధంగా వర్గీకరణ చేయవచ్చు.

     1. గ్రేడ్ - 1 గ్రామపంచాయతీ - 4 లక్షల కంటే ఎక్కువ ఆదాయం

     2. గ్రేడ్ - 2 గ్రామ పంచాయతీ - 3 నుంచి 4 లక్షల మధ్య ఆదాయం

     3. గ్రేడ్ - 3 గ్రామపంచాయతీ - 2 నుంచి 3 లక్షల మధ్య ఆదాయం

     4. గ్రేడ్ - 4 గ్రామపంచాయతీ - 2 లక్షల కంటే తక్కువ ఆదాయం


గ్రామపంచాయతీ - సాధారణ ముద్ర

» గ్రామ పంచాయతీ సాధారణ ముద్ర రాష్ట్ర చిహ్నాన్ని పోలి ఉంటుంది.

» సాధారణ ముద్రలోని మాటలు తెలుగుభాషలో మాత్రమే ఉండాలి.

» సాధారణ ముద్రకు సర్పంచ్/పంచాయతీ కార్యదర్శి వ్యక్తిగతంగా బాధ్యుడు అవుతాడు.

» సాధారణ ముద్రకు గ్రామపంచాయతీ సర్పంచ్, కార్యదర్శి రక్షకులుగా వ్యవహరించాలి.

» సాధారణ ముద్ర తమవద్ద భద్రంగా ఉందని కార్యదర్శి/సర్పంచ్ ప్రతి సంవత్సరం డిసెంబరు 31 నాటికి ఒక ధ్రువపత్రాన్ని జిల్లా కలెక్టరుకు పంపాలి.

» ఈ ముద్రను చట్టపరంగా అవసరమైనచోట సర్పంచ్ లేదా కార్యదర్శి సమక్షంలోనే వేయాలి.

» 1994, ఆగస్టు 6న విడుదల చేసిన జీవో నెం.508 ప్రకారం పంచాయతీ తనిఖీ అధికారులు తమ పరిశీలనా సమయంలో అలాంటి ముద్ర సంబంధిత అధికారి రక్షణలో ఉన్నట్లు ధ్రువీకరించాలి.

» జీవో నంబరు - 434 ప్రకారం గ్రామపంచాయతీలు తయారుచేసుకునే బై - లా (ByLaw) కలెక్టర్ ఆమోదం పొందాలి.

» కలెక్టర్ ఆమోదం పొందిన నెల రోజుల తర్వాత పథకం అమల్లోకి వస్తుంది.

» వార్డు సభ్యుల రిజర్వేషన్లు రెవెన్యూ డివిజన్ స్థాయిలో ఉంటాయి.

» వార్డు సభ్యులు స్టేజ్ - 2 అధికారి సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

» వార్డు సభ్యులు తమ రాజీనామాను MPDOకు సమర్పించాలి.

» 50 వేల రూపాయల ఆదాయం మించిన గ్రామపంచాయతీలు ప్రధాన విధులకు ఖర్చు చేయగా మిగిలిన నిధులను ఎస్సీ (15%), ఎస్టీ (3%) సంక్షేమానికి ఖర్చు చేయవచ్చు.

» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994, సెక్షన్ - 28లో గ్రామ పంచాయతీ సభ్యుల బాధ్యతలు, విధులను తెలియజేస్తుంది.

» సెక్షన్ - 40 ప్రకారం గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తారు.

» గ్రామ కమిటీలకు అధ్యక్షుడిగా సర్పంచ్ ఉంటారు. సర్పంచ్‌లేని సమయంలో ఉపసర్పంచ్ ఉంటారు.

» గ్రామ కమిటీల్లో కనీస సభ్యుల సంఖ్య - 7, గరిష్ఠ సభ్యుల సంఖ్య - 21.

» సర్పంచ్ మినహా మిగిలిన సభ్యులెవరూ ఒకటికంటే ఎక్కువ కార్యాచరణ కమిటీల్లో సభ్యులుగా ఉండరాదు.

» జూన్, 2003లో 5 కార్యాచరణ కమిటీలను ఏర్పాటు చేశారు.

     1. సహజ వనరుల నిర్వహణ కార్యాచరణ కమిటీ

     2. మానవ వనరుల అభివృద్ధి కార్యాచరణ కమిటీ

     3. ఉపాధికల్పన, స్వయం ఉపాధి సహాయ బృందాల కార్యాచరణ కమిటీ

     4. ఆర్థిక, ప్రణాళిక కార్యాచరణ కమిటీ

     5. పనులు, మౌలిక వసతుల కార్యాచరణ కమిటీ

» ప్రస్తుతం అమల్లో ఉన్న ఉత్తర్వుల ప్రకారం ఇంటిపన్నును 2000 - 2001 పన్ను ప్రాతిపదికగా ప్రతి సంవత్సరం 5% పెంచాలి.

» లైసెన్స్ పొందని పందుల యజమానుల నుంచి పందికి ఒక రూపాయి, కుక్కల యజమానుల నుంచి కుక్కకు 5 రూపాయల చొప్పున గ్రామపంచాయతీ జరిమానా విధించవచ్చు.

» గ్రామపంచాయతీకి బాకీపడిన వ్యక్తులు నోటీసు అందిన 15 రోజుల్లోగా బకాయిలు చెల్లించాలి.

» గ్రామ పంచాయతీలో జరిగే ఆస్తుల విక్రయాలపై విధించే స్టాంపు డ్యూటీపై విధించే సర్‌ఛార్జ్‌ను 3 : 1 : 1 నిష్పత్తిలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు ప్రతి 3 నెలలకొకసారి చొప్పున పంచుకుంటాయి.

» సెక్షన్ - 4(3) ప్రకారం గ్రామపంచాయతీ పరిపాలనా సౌలభ్యం కోసం కాంట్రాక్టులు కుదుర్చుకోగలదు.

» సెక్షన్ - 257 ప్రకారం గ్రామ ప్రజల ప్రయోజనాల కోసం గ్రామపంచాయతీ చట్ట పరిధిలో సదుద్దేశంతో తీసుకునే చర్యలకు చట్టపరమైన రక్షణ ఉంటుంది.

» గ్రామసభ నిర్వహణ నోటీసు నిమిత్తం ఒక బౌండు రిజిస్టరు, హాజరైన సభ్యుల సంతకాల కోసం మరొకటి, తీర్మానాలు రాసేందుకు ఇంకోటి ఇలా....మొత్తం 3 రిజిస్టర్లను కార్యదర్శి నిర్వహించాలి.


మండల పరిషత్

» బల్వంతరాయ్ మెహతా కమిటీ సిఫార్సుల్లోని 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలో మధ్యస్థాయి అంచెను పంచాయతీ సమితి అంటారు.

» 1959లో ఆంధ్రప్రదేశ్‌లో దీన్ని ప్రవేశపెట్టారు.

» జనతా ప్రభుత్వం నియమించిన అశోక్‌మెహతా కమిటీ 2 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను సిఫార్సు చేసింది.

» 2 అంచెల వ్యవస్థలో కీలకమైంది రెండో అంచె అయిన మండల పరిషత్.

» మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం కర్ణాటక.

» కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే 1985, అక్టోబరు 2న మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టారు.

» మండల పరిషత్ వ్యవస్థను ప్రవేశపెట్టిన 2వ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ (1986)

» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రణాళికా అభివృద్ధి సమీక్షా మండలాల చట్టం, 1986ను రూపొందించింది.

» ఈ చట్టం 1987, జనవరి 15 నుంచి అమల్లోకి వచ్చింది.

» ఈ చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని 330 పంచాయతీ సమితులను రద్దుచేసి, వాటిస్థానంలో 1104 మండల ప్రజాపరిషత్‌లను ఏర్పాటు చేశారు.

» ఆంధ్రప్రదేశ్‌లో 'నూతన పంచాయతీరాజ్ చట్టం 1994', మే 30 నుంచి అమల్లోకి వచ్చింది.

» 1994, జూన్ 28న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఒక ఉత్తర్వు ప్రకారం మండల పరిషత్తులకు సంబంధించిన ఏదైనా ఒక అంశం మీద కొత్త చట్టం చేసేవరకు ఆంధ్రప్రదేశ్ మండల పరిషత్ చట్టం, 1986లోని నియమాలే అమల్లో ఉంటాయని పేర్కొంది.

మండల పరిషత్ - పాలన

» ప్రతి జిల్లాను పరిపాలనా సౌలభ్యం కోసం కొన్ని మండలాలుగా విభజిస్తారు.

» ప్రతి మండల పరిషత్ నుంచి 20 - 30 గ్రామపంచాయతీల్లో 35,000 - 50,000 వరకు జనాభా ఉంటుంది.

» ప్రతి మండలాన్ని జనాభాను బట్టి మండల పరిషత్ ప్రాదేశిక నియోజక వర్గాలు (MPTC)గా విభజిస్తారు.

» ప్రతి MPTC పరిధిలో 3500 జనాభా ఉంటుంది.

» మండల పరిషత్‌లో కనీస MPTCల సంఖ్య - 7

» మండల పరిషత్‌లో గరిష్ఠ MPTCల సంఖ్య - 23

» MPTC సభ్యులను ప్రజలు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

» మండల పరిషత్‌కు ఎన్నికైన MPTCలు తమలో నుంచి ఒకరిని MPPగా, మరొకరిని Vice MPP గా ఎన్నుకుంటారు.

» MPP, Vice MPPల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

» మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని కో - ఆప్టెడ్ సభ్యుడిగా నామినేట్ చేస్తారు.

అర్హతలు

» ఒక మండల పరిషత్‌లో ఓటరుగా నమోదైన వ్యక్తి ఆ మండల పరిషత్‌లోని ఏ ప్రాదేశిక నియోజక వర్గం నుంచైనా పోటీ చేయవచ్చు.

» ఆ వ్యక్తికి 21 ఏళ్లు నిండి ఉండాలి.

» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉండరాదు.

» దివాళాకోరై ఉండరాదు.

» స్థానిక సంస్థలకు ఎలాంటి బకాయిపడి ఉండరాదు.

» మిగిలినవన్నీ శాసనసభ్యుల ఎన్నికకు ఉండాల్సిన అర్హతలే.


పదవీకాలం

» మండల పరిషత్ పదవీ కాలం - 5 సంవత్సరాలు.

» MPTC, Vice MPP, MPPల పదవీకాలం 5 సంవత్సరాలు.

» ఏదైనా కారణం వల్ల పదవికి ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా ఉప ఎన్నికను నిర్వహించి భర్తీ చేయాలి.

రాజీనామా

» MPTC, Vice MPP, MPPలు తమ రాజీనామా పత్రాలను జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారికి అందజేయాలి.

రిజర్వేషన్లు

» మొత్తం మండల పరిషత్‌లోని MPTC స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా సీట్లు రిజర్వు చేయాలి. ఈవిధంగా రిజర్వ్ చేసిన సీట్లలో 50% సీట్లను ఎస్సీ, ఎస్టీలకు చెందిన మహిళలకు నిర్దేశించాలి.

» వెనుకబడిన వర్గాల వారికి 34% సీట్లు నిర్దేశించాలి.

» అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి కనీసం 1/2వ వంతు సీట్లు మహిళలకు నిర్దేశించాలి.

» రాష్ట్రంలోని మండలాధ్యక్ష పదవులకు కూడా పైన పేర్కొన్న రిజర్వేషన్ విధానమే వర్తిస్తుంది.

మండల పరిషత్ నిర్మాణం

» మండల పరిషత్ పరిధిలోని MPTC సభ్యులు.

» మండల పరిషత్ పరిధిలోని ఎమ్మెల్యే.

» మండలంలోని ఓటర్ల జాబితాలోని ఎమ్మెల్సీ.

» మండల పరిషత్ పరిధిలోని లోక్‌సభ సభ్యుడు.

» మండలంలోని ఓటర్ల జాబితాలో పేరు నమోదైన రాజ్యసభ సభ్యుడు.

» మైనార్టీ వర్గం నుంచి నామినేట్ అయిన కో - ఆప్ట్‌డ్‌ సభ్యుడు.


మండల పరిషత్‌లో శాశ్వత ఆహ్వానితులు

1. జిల్లా కలెక్టరు.

2. మండల పరిషత్ పరిధిలోని గ్రామ సర్పంచ్‌లు.

3. మండల వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్.

4. మండల పరిషత్ నుంచి ఎన్నికైన ZPTC సభ్యుడు.

5. జిల్లా పరిషత్ ఛైర్మన్.


మండల పరిషత్ అధికారాలు - విధులు

» గ్రామ పంచాయతీ సాధారణ విధులపై పర్యవేక్షణ.

» మెరుగైన వ్యవసాయోత్పత్తుల సాధన కోసం కృషి.

» పాడిపరిశ్రమ, మత్స్య సంపదను పెంపొందించడం.

» పంచాయతీలు, సహకార సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజల సహకారంతో సమాజ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ.

» వైద్య, ఆరోగ్య సేవలను పెంపొందించడం.

» మండల పరిషత్ పరిధిలో రవాణా సదుపాయాలను మెరుగుపరచడం.

» స్వయం సహాయక పథకాలను అమలుపరచడం.

» మహిళా, శిశు సంక్షేమ కేంద్రాలను ఏర్పాటు చేయడం.

» రైతు కేంద్రాలు, గ్రంథాలయాలు, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేయడం.

» సహకార పరపతి సొసైటీలు, వ్యవసాయ సొసైటీలను ఏర్పాటు చేయడం.

» ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సమర్థవంతంగా అమలుచేయడం.

» అగ్ని ప్రమాదాలు, అంటువ్యాధులు, వరదలు లాంటివి సంభవించినప్పుడు సహాయక కార్యక్రమాలను నిర్వహించడం.

» ప్రాథమిక విద్యను మెరుగుపరచడానికి కృషి చేయడం.

» రాష్ట్ర ప్రభుత్వానికి అవసరమైన గణాంకాలను సేకరించడం.

» గ్రామీణ, కుటీర, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేయడం.
 

మండల పరిషత్ అధ్యక్షులు - అధికారాలు, విధులు

» మండల పరిషత్ అధ్యక్షుడు మండల పరిషత్‌ల రాజకీయ అధిపతిగా వ్యవహరిస్తారు.

» మండల విద్యా కమిటీకి అధ్యక్షులుగా వ్యవహరిస్తారు.

» మండల పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

» మండల పరిషత్ తీర్మానాల అమల్లో మండల అభివృద్ధి అధికారిపై నియంత్రణ కలిగి ఉంటారు.

» ప్రజా సంక్షేమంకోసం చేపట్టాల్సిన పనులను MPDOతో చర్చించి, పనులను చేపట్టాల్సిందిగా ఆదేశించవచ్చు.

» మండల పరిషత్ అధ్యక్షులు సమావేశాలకు హాజరుకాకపోతే ఉపాధ్యక్షులు ఆ బాధ్యతలను నిర్వహిస్తారు.

» మండలాధ్యక్ష పదవి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


మండల పరిషత్ - అభివృద్ధి అధికారి

» ఇతడు మండల పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు.

» రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పరిపాలనాధిపతి.

» మండల పరిషత్ తీర్మానాలను అమలు చేస్తారు.

» మండలంలోని గ్రామ పంచాయతీలపై పర్యవేక్షణాధికారాలు కలిగి ఉంటారు.

» రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తారు.

» మండలాధ్యక్షుడిని సంప్రదించి, మండల పరిషత్, మండల మహాసభ సమావేశాలను ఏర్పాటు చేస్తారు.

» మండల పరిషత్‌లోని ఉద్యోగులపై పర్యవేక్షణ, నియంత్రణాధికారాలు కలిగి ఉంటారు.

» మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొంటారు.

» నెలకొకసారి మండల పరిషత్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు.

» మండల పరిషత్ చివరి సమావేశం జరిగిన తేదీ నుంచి 90 రోజల్లోపు మరొక సమావేశాన్ని ఏర్పాటు చేయకపోతే MPDOపై రాష్ట్ర ప్రభుత్వం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుంది.


మండల పరిషత్ - ఆర్థిక వనరులు

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరుచేసే గ్రాంట్లు

» గ్రామ పంచాయతీలు, ప్రజల నుంచి లభించే విరాళాలు

» మండల పరిషత్ విధించే సెస్సు

» సాముదాయక అభివృద్ధి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే నిధులు

» ఖాదీ బోర్డు, గ్రామీణ కుటీర పరిశ్రమల బోర్డులు మంజూరుచేసే నిధులు

» జిల్లా పరిషత్ ఆదాయం నుంచి మండల పరిషత్‌కు లభించే వాటా

» మండల పరిషత్‌లోని జన సంఖ్యను బట్టి ఒక్కో వ్యక్తికి రూ.5 చొప్పున వార్షిక గ్రాంటును రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండలానికి విడుదల చేస్తుంది

» మండల పరిషత్ స్వీకరించే సొమ్మును మండల పరిషత్ నిధి అనే ఖాతాలో జమ చేస్తారు.


2014 నాటి మండల పరిషత్ ఎన్నికలు

» మండల పరిషత్ ఎన్నికలు పార్టీ చిహ్నాల ప్రాతిపదికన జరుగుతాయి.

» 1096 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఉన్నాయి.

» 16,589 MPTC స్థానాలు ఉన్నాయి.

» మండల పరిషత్ అధ్యక్ష స్థానాలకు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.

» MPTC స్థానాలకు రిజర్వేషన్ల కోసం మండలాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.

» 1096 మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో 49 స్థానాలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయి. PESA చట్టం ప్రకారం 49 అధ్యక్ష స్థానాలను పూర్తిగా ఎస్టీలకు కేటాయించారు.

» MPTC సభ్యుల బ్యాలెట్ పేపర్ - ఊదారంగులో ఉంటుంది.


మండల పరిషత్‌లకు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పేర్లు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - మండల పరిషత్

మధ్యప్రదేశ్ - జనపథ్ పంచాయతీ

అరుణాచల్‌ప్రదేశ్ - అంచల్ కమిటీ

జమ్మూకశ్మీర్ - బ్లాక్ డెవలప్‌మెంట్ కౌన్సిల్

ఉత్తర్‌ప్రదేశ్ - క్షేత్ర పంచాయతీ

బిహార్, పశ్చిమ్ బంగా, పంజాబ్, హరియాణ - పంచాయతీ సమితి


జిల్లా పరిషత్

» మూడు అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థలోని అత్యున్నత అంచె జిల్లా పరిషత్.

» ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం - 1994, ప్రతి జిల్లాకు ఒక జిల్లా పరిషత్‌ను ఏర్పాటు చేసింది.

» ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం జిల్లా పరిషత్‌ల సంఖ్య 537.

» ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా పరిషత్‌ల సంఖ్య 13

» తెలంగాణలోని జిల్లా పరిషత్‌ల సంఖ్య 9

» హైదరాబాద్‌కు జిల్లా పరిషత్ లేదు

» ప్రతి జిల్లా పరిషత్ అధికార ముద్రను (SEAL), ఆస్తులను కలిగి ఉంటుంది.

» వ్యక్తులు, సంస్థలపైన కేసు వేసే అధికారాన్ని జిల్లా పరిషత్ కలిగి ఉంటుంది.


జిల్లా పరిషత్ - నిర్మాణం

» జిల్లాలోని ప్రతి మండలాన్ని ఒక జిల్లా ప్రాదేశిక నియోజకవర్గంగా (ZPTC) పరిగణిస్తారు.

» జిల్లా పరిషత్ జిల్లాలోని ZPTCలతో ఏర్పడుతుంది.

» ZPTC స్థానాలకు ఎన్నికలు రాజకీయ పార్టీల ప్రాతిపదికన జరుగుతాయి.

» ZPTC స్థానాలకు రిజర్వేషన్లను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నిర్ణయిస్తారు.

» ZPTC సభ్యుల ఎన్నికల బ్యాలెట్ పత్రం - తెలుపు రంగులో ఉంటుంది.


జిల్లా పరిషత్‌లోని వివిధ రకాల సభ్యులు

» ఎక్స్ అఫీషియో సభ్యులు

» జిల్లాలోని విధానసభ సభ్యులు (ఎమ్మెల్యేలు)

» జిల్లాలో ఓటరుగా నమోదైన ఎమ్మెల్సీలు

» జిల్లాలోని లోక్‌సభ సభ్యులు

» జిల్లాలో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు

» పై సభ్యులందరూ జిల్లా పరిషత్ సమావేశాల్లో పాల్గొనవచ్చు. కానీ, వీరికి ఓటు హక్కు ఉండదు.


జిల్లా పరిషత్ - ఎన్నికలు

» ఒక జిల్లాలో ఎన్ని మండలాలు ఉన్నాయో అన్ని మండలాల నుంచి ఒక్కో జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యుడి (ZPTC)ని ప్రజలు ప్రత్యక్షంగా, రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

» ఎన్నికైన ZPTC సభ్యులు తమలో నుంచి ఒకరిని జిల్లా పరిషత్‌కు ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్ గా ఎన్నుకుంటారు.

» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

» జడ్పీ ఛైర్మన్ ఎన్నిక సమయంలో రాజకీయ పార్టీలు తమ సభ్యులకు విప్ జారీచేస్తూ, ఎవరికి ఓటు వేయాలో నిర్దేశిస్తాయి.

» ఎవరైనా సభ్యుడు పార్టీ ఆదేశాలను ధిక్కరించినట్లయితే అతడి సభ్యత్వం రద్దు అవుతుంది.


జిల్లా పరిషత్ - రిజర్వేషన్లు

» ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి వారి జనాభా ఆధారంగా సీట్లను రిజర్వు చేస్తారు.

» ఈవిధంగా రిజర్వ్ చేసిన స్థానాల్లో 1/2వ వంతు మహిళలకు కేటాయిస్తారు.

» బీసీ వర్గాల వారికి 34% సీట్లు రిజర్వు చేస్తారు.

» ఈవిధంగా రిజర్వు చేసిన సీట్లలో 1/2వ వంతు సీట్లను బీసీ మహిళలకు కేటాయిస్తారు.

» అన్నిరకాల రిజర్వేషన్లు కలిపి మహిళలకు 1/2వ వంతు నిర్ణయిస్తారు.

» ZPTC స్థానాలకు రిజర్వేషన్లు జిల్లాను యూనిట్‌గా తీసుకోగా, Z.P. ఛైర్మన్ స్థానాలకు రిజర్వేషన్లను నిర్ణయించినప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుంటారు.


పదవీ కాలం

» జిల్లా పరిషత్ సభ్యులు, ఛైర్మన్, వైస్-ఛైర్మన్‌ల పదవీకాలం అయిదు సంవత్సరాలు.

» 21 సంవత్సరాల వయసు నిండినవారు పోటీ చేయవచ్చు.

అనర్హతలు

» గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ల సభ్యులకు వర్తించేవే.

కోఆప్టెడ్ సభ్యులు

» జిల్లా పరిషత్‌కు మైనార్టీ వర్గం నుంచి ఇద్దరు (2) సభ్యులను కోఆప్ట్ చేసుకుంటారు. ఈ సభ్యులు సంబంధిత జిల్లాలో ఓటర్లుగా నమోదు కావడంతోపాటు 21 ఏళ్లు నిండి ఉండాలి. వీరికి జిల్లా పరిషత్ సభ్యులతో సమానంగా ఓటు హక్కు ఉంటుంది.

ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌ల తొలగింపు విధానం

» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లను రాష్ట్ర ప్రభుత్వం కింది కారణాలతో పదవుల నుంచి తొలగించగలదు.

» అధికార దుర్వినియోగానికి పాల్పడటం.

» ప్రభుత్వ ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం.

» పంచాయతీరాజ్ చట్టం ద్వారా లభించిన అధికారాలను నిర్వర్తించడంలో పలుసార్లు విఫలమవడం.

» అధికార విధులను స్వార్ధానికి వినియోగించడం.


అవిశ్వాస తీర్మానం

» 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం

» మండల పరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు

» జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లపై వారి పదవీ కాలంలో ఒకసారి మాత్రమే వారిపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి.

» అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలంటే పదవిలోకి వచ్చిన 4 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రవేశపెట్టాలి.

» MPTCలు MPP, Vice MPPని, ZPTCలు జడ్పీ ఛైర్మన్, వైస్ - ఛైర్మన్‌లను సాధారణ మెజార్టీ ద్వారా తొలగించగలరు.


జిల్లా పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులు

» జిల్లా కలెక్టరు

» జిల్లాలోని మండల పరిషత్ అధ్యక్షులు

» జిల్లా మార్కెటింగ్ సొసైటీ ఛైర్మన్

» జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్

» జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్


స్థాయీ సంఘాలు

» ప్రతి జిల్లాపరిషత్‌లో 7 స్థాయీసంఘాలు ఉంటాయి. అవి:

    1. ప్రణాళిక, ఆర్థిక స్థాయీ సంఘం

    2. వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘం

    3. గ్రామీణాభివృద్ధి స్థాయీ సంఘం

    4. విద్య, వైద్య స్థాయీ సంఘం

    5. సాంఘిక, సంక్షేమ స్థాయీ సంఘం

    6. స్త్రీ, శిశు సంక్షేమ స్థాయీ సంఘం

    7. అభివృద్ధి పనుల స్థాయీ సంఘం

» స్థాయీ సంఘాల సమావేశాలు 2 నెలల కొకసారి చొప్పున తప్పనిసరిగా జరగాలి.

» స్థాయీ సంఘాల సమావేశాలకు కోరం - 1/3వ వంతు.

» జిల్లా పరిషత్ ఛైర్మన్ అన్ని స్థాయీ సంఘాల్లో పదవీ రీత్యా సభ్యుడిగా ఉంటారు.

» స్థాయీ సంఘాల సభ్యులను ZPTCలు ఎన్నుకుంటారు.

» వ్యవసాయాభివృద్ధి స్థాయీ సంఘానికి అధ్యక్షుడిగా జడ్పీ వైస్ ఛైర్మన్ వ్యవహరిస్తారు.

» ఏవైనా రెండు స్థాయీ సంఘాలకు అధ్యక్షులుగా మహిళా ZPTCలను జడ్పీ ఛైర్మన్ నామినేట్ చేస్తారు.

» మిగిలిన 4 స్థాయీ సంఘాలకు అధ్యక్షుడిగా జడ్పీ ఛైర్మన్ వ్యవహరిస్తారు.


జిల్లా పరిషత్ అధికారాలు - విధులు

» జిల్లా పరిషత్ పరిధిలోని బడ్జెట్‌లను రూపొందించి, ఆమోదించడం.

» మండల పరిషత్‌ల పనితీరును పర్యవేక్షించడం.

» కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ఆదేశాలను అమలు చేయడం.

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే నిధులను మండల పరిషత్‌లకు పంపిణీ చేయడం.

» కొన్ని మండల పరిషత్‌ల విజ్ఞప్తిపై ఉమ్మడి అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించడం.

» గ్రామపంచాయతీలు, మండల పరిషత్‌ల మధ్య వనరుల పంపిణీ విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలను ఇవ్వడం.

» మండలాల ప్రణాళికా కార్యక్రమాలను సమన్వయపరచి క్రమబద్ధీకరించడం.

» జిల్లాకు సంబంధించిన ప్రణాళికలను రూపొందిచడం.

» ప్రాథమికోన్నత, వృత్తి, విద్య, పారిశ్రామిక విద్యాలయాలను నిర్వహించడం.

» స్థానిక సంస్థల నిర్వహణకు సంబంధించిన గణాంక సమాచారాన్ని ప్రచురించడం.

» వివిధ ట్రస్టుల కార్యక్రమాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవడం.

» రుణాలను మంజూరు చేయడం.

» రాష్ట్ర ప్రభుత్వ అనుమతిలో మండల పరిషత్ నిధులపై లెవీని విధించడం.


జడ్పీ ఛైర్మన్ అధికారాలు - విధులు

» జిల్లా పరిషత్ సమావేశాలకు అధ్యక్షత వహిస్తారు.

» జిల్లా పరిషత్ తీర్మానాల అమలు విషయంలో సీఈవోపై పాలనా పరమైన నియంత్రణను కలిగి ఉంటారు.

» జిల్లా పరిషత్ రికార్డులను తనిఖీచేసే అధికారాలను కలిగి ఉంటారు.

» ఛైర్మన్ ప్రతి 90 రోజులకు కనీసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలి.

» 90 రోజుల తర్వాత నుంచి 30 రోజుల లోపు కూడా జిల్లా పరిషత్ సమావేశం ఏర్పాటు చేయలేకపోతే ఛైర్మన్ తన పదవిని కోల్పోతారు.

» ఈ విధంగా పదవిని కోల్పోయిన వ్యక్తి ఒక సంవత్సరం వరకు ఎన్నికల్లో పోటిచేయడానికి అనర్హుడవుతాడు.


ముఖ్య కార్యనిర్వహణాధికారి (Chief Executive Officer -CEO)

» రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి (CEO)ని నియమిస్తుంది.

CEO అధికారాలు - విధులు

» జిల్లా పరిషత్ ఛైర్మన్‌ను సంప్రదించి జిల్లా పరిషత్ సమావేశాలను ఏర్పాటు చేస్తారు.

» జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ మండల పరిషత్ సమావేశాలకు హాజరై చర్చల్లో పాల్గొంటారు.

» ఈ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టే హక్కు లేదా ఓటువేసే హక్కు లేదు.

» జిల్లా పరిషత్, ఇతర అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై పాలనా పరమైన నియంత్రణను కలిగి ఉంటారు.

» జిల్లా పరిషత్, స్టాండింగ్ కమిటీ తీర్మానాలను అమలు చేస్తారు.

» జిల్లా పరిషత్‌కు చెందిన అభివృద్ధి పథకాలను అమలు చేస్తారు.

» జిల్లా పరిషత్ తరఫున ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

» జిల్లా పరిషత్ ఆదేశాలను అమలు చేస్తారు.

» రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా పరిషత్‌కు తెలియజేస్తారు.


జిల్లాపరిషత్ - ఆదాయ వనరులు

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదలచేసే నిధులు.

» జిల్లా పరిషత్ విధించే పన్నులు లేదా ఫీజులు.

» గ్రామీణ, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం అఖిలభారత సంస్థలు విడుదల చేసే గ్రాంట్లు.

» రాష్ట్ర ప్రభుత్వ పన్నుల నుంచి జిల్లా పరిషత్‌కు లభించే వాటా

» మండల పరిషత్‌లు, ప్రజల ద్వారా వచ్చే విరాళాలు

» జిల్లా పరిషత్ నిర్వహించే దేవదాయ, ధర్మదాయ సంస్థల ద్వారా లభించే ఆదాయం.

» రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో మండల పరిషత్‌లపై జిల్లా పరిషత్ విధించి వసూలు చేసే లెవీ ద్వారా లభించే ఆదాయం.

» జిల్లాలోని ఒక్కో పౌరుడికి రూ.2 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిధులను జిల్లా పరిషత్‌కు విడుదల చేస్తుంది.

» 24-04-2016న కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణం, పట్టణ పేదరిక నిర్మూలన పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి ఎం. వెంకయ్య నాయుడు వెల్లడించిన వివరాలు:

తాజా నివేదిక ప్రకారం దేశంలోని ప్రజాభాగస్వామ్యం పరిపాలనలో కింది విధంగా ఉంది.

» మొత్తం గ్రామ పంచాయతీ సభ్యులు - 27,75,858 మంది.» మధ్యస్థ వ్యవస్థలైన సమితి/ మండలాల సభ్యులు - 1,44,491 మంది.

» జిల్లా పరిషత్ సభ్యులు - 15,067 మంది.

» ప్రపంచంలో ఇంతటి విస్తృత భాగస్వామ్యం ఏ దేశంలోనూ లేదు.

» దేశంలో ప్రస్తుతం ఉన్న గ్రామ పంచాయతీలు - 2,48,255.

» దేశంలో ప్రస్తుతం ఉన్న మధ్యస్థ సమితి/ మండల పరిషత్‌లు - 6,618.

» దేశంలో ప్రస్తుతం ఉన్న జిల్లా పరిషత్‌లు - 618.

» ఈ వ్యవస్థలన్నీ దేశవ్యాప్తంగా అట్టడుగు స్థాయిలో పరిపుష్టమై వర్ధిలుతున్న ప్రజాస్వామిక వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.

» ఈ సంస్థలకు ఎన్నికైన 29.17 లక్షల ప్రజాప్రతినిధుల్లో సుమారు 13.54 లక్షల మంది మహిళలే. అంటే పాలనలో మహిళ భాగస్వామ్యం 45.15 శాతంగా ఉంది.

» మన ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పదనాన్ని ఈ గణాంకాలు ప్రతిబింబిస్తున్నాయి.


పంచాయతీరాజ్ వ్యవస్థకు ఆర్థిక పరిపుష్టి

» గ్రామపంచాయతీలకు 2015 -2020 మధ్య కాలంలో నేరుగా రూ.2,00,292.20 కోట్ల మేరకు గ్రాంట్లు ఇవ్వాలంటూ 14వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులను నరేంద్ర మోదీ ప్రభుత్వం యథాతదంగా ఆమోదించింది.

» గ్రామపంచాయతీ స్థాయిలో వచ్చే 5 సంవత్సరాల్లో తలసరి నిధుల లభ్యత రూ.2,404గా ఉంటుంది.

» ఒక్కోగ్రామ పంచాయతీకి సగటున ఏటా రూ.17 లక్షలు (అయిదేళ్లలో రూ.85 లక్షలు) అందజేస్తారు.

» ఈ నిధులతో పంచాయతీల్లో పారిశుద్ద్యం, తాగునీరు, సామాజిక ఆస్తుల నిర్వహణ లాంటి మౌలిక వసతుల కోసం ఉపయోగించుకోవాలి.

» కేంద్రనికర పన్ను ఆదాయంలో రాష్ట్రాలకు ఇచ్చే వాటాను 14వ ఆర్థిక సంఘం ఇప్పటి 32 శాతం నుంచి 42 శాతానికి పెంచింది. దీంతో అధికంగా అందుబాటులోకి వచ్చే నిధులను ఉపయోగించుకోవడం రాష్ట్రప్రభుత్వాల బాధ్యత అయ్యింది.

» అట్టడుగు స్థాయిలో అత్యవసర పరిస్థితుల్లో తక్షణం రంగంలోకి దిగేలా సుమారు 10 లక్షల మంది ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులను కేంద్రప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వీరు వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాల రూపకల్పనలో గ్రామపంచాయతీలకు ఉపయోగపడేలా శిక్షణ పొందుతున్నారు.

» 300 సమూహాలను రూర్బన్ క్లస్టర్లు (Rurban Clusters)గా అభివృద్ధి పరచనున్నారు.

» ఒక్కో రూర్బన్ క్లస్టర్‌లో 30 గ్రామాలు, 50,000 జనాభా ఉంటుంది.


రాష్ట్రాల పనితీరు

» పంచాయతీరాజ్‌కు అధికారాల బదిలీ ఏవిధంగా ఉందన్న దానిపై పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ 2014 - 2015లో ఒక అధ్యయనం నిర్వహించి, సూచీని రూపొందించింది.

» నిధులు, విధులు, కార్యనిర్వాహకులను ప్రాతిపదికగా తీసుకుని సూచీని రూపొందించారు.

» ఈ సూచీ ఆధారంగా నిధులను మినహాయిస్తే ఈ అంశాల్లో కేరళ అగ్రస్థానంలో ఉంటుంది.

» పంచాయతీరాజ్ సంస్థలకు నిధుల బదలాయింపు విషయంలో కర్ణాటక అగ్రస్థానంలో ఉంది.

» విధుల బదలాయింపులో సిక్కిం బ్రహ్మాండం అనిపించుకున్నా మిగిలిన విభాగాల్లో వెనుకబడి ఉంది.

» గ్రామస్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని మహాత్మాగాంధీ పేర్కొన్నారు.

» గాంధీజీ భావనకు అనుగుణంగా రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ - 40లో గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశించారు.

» ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించిన కార్యక్రమం గ్రామ ఉదయ్ సే భారత్ ఉదయ్ అనే గ్రామ స్వరాజ్య లక్ష్యాన్ని సాధించడానికి ప్రారంభించారు.


జిల్లాపాలనలో కలెక్టరు పాత్ర

» మన దేశంలో 1772, మే 11న వారన్ హేస్టింగ్స్ జిల్లా కలెక్టరు పదవిని ఏర్పరిచారు.

» ఫ్రాన్స్‌లో ఉండే Prefect అనే అధికారితో భారత్‌లో ఉండే జిల్లా కలెక్టరు పదవిని పోల్చవచ్చు.

» విలియం బెంటింక్ గవర్నర్ జనరల్‌గా ఉన్న కాలంలో మెజిస్ట్రేట్ కార్యనిర్వాహక విధులను జిల్లా న్యాయాధిపతి నుంచి వేరుచేసి, ఆ అధికారాలను జిల్లాకలెక్టరుకు బదలాయించి, జిల్లా కలెక్టరు హోదాను జిల్లామెజిస్ట్రేట్, కలెక్టరుగా మార్చడమే కాకుండా అతడికి సహాయంగా డిప్యూటీ కలెక్టరు అనే పదవిని ఏర్పాటు చేశారు.

» ప్రస్తుతం ప్రభుత్వం 6 సంవత్సరాల కనీస పాలనానుభవం ఉన్న IAS అధికారులను కలెక్టరుగా నియమించడంతోపాటు రాష్ట్రసివిల్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారులను కూడా IAS స్థాయి పదోన్నతిని కల్పించి వారిని కూడా జిల్లా కలెక్టర్లుగా నియమిస్తోంది.

» రాష్ట్రాల్లో జిల్లాను పరిపాలనా యూనిట్‌గా తీసుకుంటారు.

» జిల్లా పాలనాధిపతి జిల్లా కలెక్టరు.

» జిల్లాలో భూమిశిస్తు వసూలు చేసే బాధ్యత కలెక్టరుకు ఉంటుంది.

» రాజ్యాంగంలోని ఆర్టికల్ - 50 ప్రకారం కార్యనిర్వాహక వర్గం నుంచి న్యాయవిధులను వేరు చేశారు. దీని ఫలితంగా నేడు జిల్లాస్థాయిలో న్యాయవిధుల కోసం న్యాయమూర్తులను నియామకం చేస్తున్నారు.


జిల్లాకలెక్టరు - అధికారాలు - విధులు

     1. రెవెన్యూ అధికారాలు.

     2. కార్యనిర్వాహక మెజిస్ట్రేట్ అధికారాలు.

     3. జిల్లాస్థాయిలో ముఖ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించడం.

     4. జిల్లాలో రాష్ట్రప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరించడం.

     5. స్థానిక సంస్థలపై పర్యవేక్షణా అధికారాలు.

     6. జిల్లా అభివృద్ధి అధికారిగా వ్యవహరించడం.

     7. జిల్లాస్థాయిలో ముఖ్య జనాభా లెక్కల అధికారిగా వ్యవహరించడం.

     8. జిల్లా పాలనా యంత్రాంగాన్ని సమన్వయ పరచడం.

» కలెక్టరు సామర్థ్యంపైన జిల్లా ప్రగతి ఆధారపడుతుంది.

* పట్టణ, నగరపాలక సంస్థలను మున్సిపల్ సంస్థలుగా పేర్కొనవచ్చు. మున్సిపల్ అనే పదం మున్సిపియం అనే రోమన్ పదం నుంచి ఆవిర్భవించింది. మున్సిపియం అంటే సంఘటితత్వం అని అర్థం.

* భారతదేశంలో ప్రాచీన కాలం నుంచి పట్టణ, నగరపాలక సంస్థలు వర్ధిల్లుతున్నాయి. ప్రాచీన కాలంలో సింధునాగరికత మనదేశంలో అత్యున్నత పట్టణ నాగరికతకు నిదర్శనం.

* క్రీ.పూ. 2750 - 1750 మధ్య మనదేశంలో సింధునాగరికత వర్థిల్లింది.ఈ కాలంలో...
 

 అద్భుతమైన మురుగు నీటి పారుదల వ్యవస్థ

 నిర్ణీత కొలతల ప్రకారం భవనాల నిర్మాణం

 ప్రధాన రహదారులను ఉత్తర-దక్షిణ దిక్కులను కలిపే విధంగా నిర్మించడం
 మహాస్నాన వాటిక నిర్మాణాలు ఇలా ప్రతి ఒక్కటిని అద్భుతంగా నిర్మించారు. అంతేకాకుండా శాంతికాముక పరిపాలనా విధానాలను అనుసరించారు.

* మనదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం చోళులు కాగా, పట్టణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం మౌర్యులు.

* మౌర్యుల రాజధాని నగరం పాటలీపుత్రం. ఈ నగర పాలనను అయిదుగురేసి సభ్యుల చొప్పున, ఆరు బృందాలు (30 మంది) సమర్థంగా పౌరపాలనను నిర్వహించేవని, చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీస్ తన గ్రంథమైన ఇండికాలో వివరించారు.

* మధ్యయుగంలో ఢిల్లీ సుల్తానులు, మొగలుల పరిపాలనా కాలంలో పట్టణ, నగరాల శాంతిభద్రతల పరిరక్షణలో కొత్వాల్ అనే అధికారి కీలకపాత్ర వహించేవారు.

* ఆంగ్లేయులు మనదేశంలో తొలి మున్సిపల్ కార్పొరేషన్‌ను 1687లో మద్రాస్‌లో నెలకొల్పారు.
 

* 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్‌లను నెలకొల్పారు.

* 1793 ఛార్టర్ చట్టం ద్వారా పట్టణ ప్రభుత్వాలకు చట్టబద్ధత కల్పించడానికి ఆంగ్లేయులు తొలిసారిగా ప్రయత్నించారు.

* 1870లో లార్డ్‌మేయో తీర్మానం భారతదేశంలో పట్టణ, స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసే ఉద్దేశంతో, భారతీయుల భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రయత్నించింది.

* 1882లో లార్డ్‌రిప్పన్ తీర్మానం పట్టణ, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలను ఎక్కువగా కల్పిస్తూ, వాటి నిర్వహణలో అధికారుల సంఖ్యను 3వ వంతు తగ్గించేందుకు ప్రయత్నించింది.

1907 రాయల్ కమిషన్ సిఫారసులు

* 1907లో ఛార్లెస్ హాబ్‌హౌస్ నాయకత్వంలోని రాయల్ కమిషన్ అధికారాల వికేంద్రీకరణ కోసం కింది సిఫార్సులను చేసింది.

    A. పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో అధికారుల సంఖ్యను తగ్గించడం.

    B. ఓటు హక్కుపై ఉండే పరిమితిని తొలగించి, విస్తృత పరచడం.

    C. ఆర్థిక వనరులను అధికంగా కేటాయించడం.

* 1919లో మాంటేగ్ చెమ్స్‌ఫర్డ్ సంస్కరణల చట్టం ద్వారా రాష్ట్రస్థాయిలో ద్వంద్వపాలనను ప్రవేశపెట్టారు.

* భారత ప్రభుత్వ చట్టం - 1935 ద్వారా స్థానిక సంస్థలకు స్వయంప్రతిపత్తిని కల్పించారు.

 భారత రాజ్యాంగంలోని 4వ భాగంలోని నిర్దేశిక నియమాల్లోని ఆర్టికల్ 40 ప్రకారం స్థానిక పాలన కోసం స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి.

 పట్టణంలో/ నగరంలో నివసించే పౌరులు ఆమోదించి, ఎన్నుకున్న వ్యక్తులతో స్థానిక పరిపాలనా ప్రయోజనాల కోసం ఏర్పాటైన సంస్థను పురపాలక సంస్థ/ నగరపాలక సంస్థ అంటారు.

 క్రీ.పూ. 500 సంవత్సరాల నాటికి భారతదేశంలో 16 నగర రాజ్యాలు ఉన్నట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.

 ఎల్. ఎం. సింఘ్వి కమిటీ సిఫార్సుల మేరకు పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 65వ రాజ్యాంగ సవరణ బిల్లును 1989 ఆగస్టులో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును లోక్‌సభలో చర్చిస్తున్న కాలంలోనే సభ రద్దు కావడంతో బిల్లు కూడా రద్దు అయ్యింది.

 పునర్వ్యవస్థీకరించిన నగరపాలక బిల్లును వి.పి. సింగ్ ప్రభుత్వం 1990, సెప్టెంబరులో లోక్‌సభలో ప్రవేశపెట్టి విఫలమైంది.

 పి.వి. నరసింహారావు ప్రభుత్వం పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పించే లక్ష్యంతో 74వ రాజ్యాంగ సవరణ బిల్లును 1991, సెప్టెంబరు 16న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును పార్లమెంట్ 1992, డిసెంబరు 22న ఆమోదించింది.

 పార్లమెంట్ ఆమోదం పొందిన 74వ రాజ్యాంగ సవరణ బిల్లు 1993, ఏప్రిల్ 20న రాష్ట్రపతి ఆమోదం పొంది 1993, జూన్ 1 నుంచి 74వ రాజ్యాంగ సవరణ చట్టంగా అమల్లోకి వచ్చింది.

 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారా పట్టణ ప్రభుత్వాలకు రాజ్యాంగ భద్రతను కల్పిస్తూ రాజ్యాంగానికి IX(A) అనే నూతన భాగాన్ని ఏర్పాటు చేసి దానిలో ఆర్టికల్ 243(P) నుంచి 243(ZG) వరకు ఉండే మొత్తం 18 ప్రకరణల్లో పట్టణ ప్రభుత్వాల గురించి పొందుపరిచారు.

 74వ రాజ్యాంగ సవరణ చట్టం (1992) ద్వారానే రాజ్యాంగానికి 12వ షెడ్యూల్‌ను చేర్చి పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులను పొందుపరిచారు.

74వ రాజ్యాంగ సవరణ చట్టం - విశేషాలు

ఆర్టికల్ 243(P): పట్టణ ప్రభుత్వాల నిర్వచనాన్ని తెలియజేస్తుంది.

* స్థానిక సంస్థల్లోని మున్సిపల్ సంస్థల నిర్వచనాలను గవర్నరు నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారు.

* రాష్ట్రప్రభుత్వం గవర్నరు నోటిఫికేషన్‌ను అనుసరించి, కింది అంశాలపై చట్టాల ద్వారా నిర్వచనాలను రూపొందిస్తుంది.

1. జనాభా: చివరిసారిగా జనాభా లెక్కల సేకరణ జరిగి నోటిఫై అయిన సందర్భంలో నిర్ధారించిన జనాభా.

2. పంచాయతీ: ఆర్టికల్, 243(B) ప్రకారం పంచాయతీగా ఏర్పాటు చేసిన ప్రాంతం.

3. జిల్లా: ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.

4. కమిటీ: ఆర్టికల్ 243(S) ప్రకారం ఏర్పాటైన కమిటీ.

5. మున్సిపల్ ప్రాంతం: గవర్నరు నోటిఫై చేసిన ఒక మున్సిపాలిటీలోని ప్రాదేశిక ప్రాంతం.

6. మున్సిపాలిటీ: ఆర్టికల్, 243(Q) ప్రకారం ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.

7. మెట్రోపాలిటన్ ప్రాంతం: 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతం.

ఆర్టికల్ 243(Q): మున్సిపల్ సంస్థల వ్యవస్థాపన

1. మెట్రోపాలిటన్ నగరాలు: 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

2. నగరపాలక సంస్థలు: 3 లక్షలు కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాలను నగర కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తారు.

3. మున్సిపల్ కౌన్సిల్: 20 వేల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలను మున్సిపల్ కౌన్సిల్‌గా ఏర్పాటు చేస్తారు.

4. నగర పంచాయతీలు: గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంగా వేగవంతంగా అభివృద్ధి చెందే ప్రాంతాలను నగర పంచాయతీలుగా ఏర్పాటు చేస్తారు. వీటి కనీస జనాభా 11 వేల పైన, 20 వేల లోపు ఉంటుంది.

5. టౌన్‌షిప్‌లు: భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకున్న ప్రజల పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేసే సంస్థలు.

ఆర్టికల్ 243(R) మున్సిపల్ వ్యవస్థల నిర్మాణం

* మున్సిపల్ ఛైర్‌పర్సన్, నగర కార్పొరేషన్ మేయర్, మెట్రోపాలిటన్ నగర మేయర్‌లు అంటే ఆయా సంస్థల అధిపతులు. వీరిని ఆయా సంస్థలకు చెందిన సభ్యులు పరోక్షంగా ఎన్నుకుంటారు.

* నగర పంచాయతీల అధ్యక్షుల ఎన్నిక ప్రత్యక్షమా? పరోక్షమా? అనే అంశాన్ని రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించుకోవచ్చు.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నగర పంచాయతీ అధ్యక్షులను పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటున్నారు. పట్టణ, నగరపాలక సంస్థలు ఏ పార్లమెంటు నియోజక వర్గ పరిధి కిందకు వస్తాయో, సంబంధిత పార్లమెంటు సభ్యులు, శాసనసభల సభ్యులు ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటరుగా నమోదైన రాజ్యసభ సభ్యులు, విధాన పరిషత్‌ల సభ్యులు కూడా ఆయా సంస్థల్లో ఎక్స్అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు.

* ఎక్స్అఫీషియో సభ్యులకు ఓటుహక్కు కల్పించే అంశంపై రాష్ట్రప్రభుత్వం చట్టం చేయవచ్చు.

* 2009లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్అఫీషియో సభ్యులకు పట్టణ, నగరపాలక సంస్థల్లో ఓటుహక్కు కల్పించింది.

ఆర్టికల్, 243(S): వార్డులు, వార్డు కమిటీల ఏర్పాటు

* పట్టణ, నగరపాలక సంస్థలను కొన్ని వార్డులు/ డివిజన్లుగా విభజిస్తారు. గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన బహుళ సభ్య వార్డుల ఏర్పాటును సుప్రీంకోర్టు సమర్థించింది

మెట్రోపాలిటన్ నగరాలు:

* మెట్రోపాలిటన్ నగరాలను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. వీటిలో 100 - 200 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికైనవారిని కార్పొరేటర్లు అంటారు.

* గ్రేటర్ ముంబై కార్పొరేషన్‌లో 228 డివిజన్లు ఉన్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్:

* మున్సిపల్ కార్పొరేషన్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం డివిజన్లుగా విభజిస్తారు. కార్పొరేష‌న్‌లో 50 - 100 వరకు డివిజన్లు ఉంటాయి. ఈ డివిజన్ల నుంచి ఎన్నికయ్యే సభ్యులను కార్పొరేటర్లు అంటారు.

మున్సిపాలిటీ

* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను కౌన్సిలర్లు అంటారు. మున్సిపాలిటీలో వార్డు సభ్యుల సంఖ్య 23 - 50 వరకు ఉంటుంది.

నగర పంచాయతీ

* దీన్ని పరిపాలనా సౌలభ్యం కోసం వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి ఎన్నుకునే సభ్యులను వార్డు సభ్యులు అంటారు. నగర పంచాయతీలో వార్డు సభ్యుల సంఖ్య 15 - 21 వరకు ఉంటుంది.

* 3 లక్షల జనాభా కంటే ఎక్కువ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్‌లు, 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న మెట్రోపాలిటన్ నగరాల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేసుకునే వీలు ఉంటుంది.

* రెండు లేదా అంత కంటే ఎక్కువ వార్డులు/ డివిజన్‌లు కలిసి వార్డు కమిటీగా ఏర్పాటైనప్పుడు ఆ వార్డులు/ డివిజన్‌ల సభ్యులు తమలో నుంచి ఒకరిని వార్డు కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.

* ఈ వార్డు కమిటీలు కార్పొరేటర్లకు పరిపాలనకు సంబంధించిన అంశాలపై సూచనలు, సలహాలు అందిస్తాయి.

ఆర్టికల్ 243 (T)

* పట్టణ, నగరపాలక సంస్థల్లో కొన్ని స్థానాలను జనాభా ప్రాతిపదికపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కేటాయించిన స్థానాల్లో 1/3వ వంతు స్థానాలను మహిళలకు రిజర్వ్ చేయాలి.

* వెనుకబడిన వర్గాలకు (OBC) రిజర్వేషన్లు కల్పించే అంశంపై 74వ రాజ్యాంగ సవరణ చట్టం ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకుండా, ఆ అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలేసింది.

* ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన వర్గాలవారికి 34% స్థానాలను రిజర్వ్ చేస్తున్నారు.

* మైనార్టీ వర్గానికి చెందిన ఇద్దరిని మున్సిపాలిటీలో, ముగ్గురిని మున్సిపల్ కార్పొరేషన్‌లో కో ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేసుకునే వీలుంది.

* ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో సహా ప్రస్తుతం మనదేశంలో 11 రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల్లో మొత్తం స్థానాల్లో 50% స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు.

* వెనుకబడిన తరగతులకు రిజర్వ్ చేసిన స్థానాల్లో వెనుకబడిన తరగతుల్లో జన్మించినవారు మాత్రమే పోటీ చేయడానికి అర్హులు. వెనుకబడిన తరగతులకు చెందిన వారిని వివాహం చేసుకున్న అగ్ర కుల స్త్రీలు వెనుకబడిన తరగతులకు రిజర్వు చేసిన స్థానాల్లో పోటీచేయడానికి అర్హులు కాదని 2005లో సుప్రీంకోర్టు పేర్కొంది.

ర్టికల్ 243 (U): పదవీకాలం

* అన్ని స్థాయుల్లోనూ సభ్యులు, అధ్యక్షుల పదవీకాలం 5 సంవత్సరాలు.

* పట్టణ, నగరపాలక సంస్థల పదవీకాలం 5 సంవత్సరాలు.

* పదవీకాలం ముగియకముందే ఈ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయవచ్చు.

* ఏ కారణం వల్లనైనా రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థల పదవీకాలం ముగియకముందే మధ్యలోనే రద్దుచేసినట్లయితే, రద్దయిన 6 నెలల్లోగా తప్పనిసరిగా ఆయా సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి.

* ఏవైనా స్థానాలకు ఖాళీలు ఏర్పడినప్పుడు ఉప ఎన్నికల ద్వారా ఎన్నుకునే సభ్యుల పదవీకాలం మిగిలిన పదవీకాలం వరకే వర్తిస్తుంది. అయితే సంస్థ మొత్తం ఎన్నికలు కాలయాపన ద్వారా ఆలస్యం జరిగితే పూర్తి పదవీకాలం కొనసాగవచ్చు. సంస్థ పదవీకాలం 6 నెలల కంటే తక్కువగా ఉన్నట్లయితే ఉపఎన్నికలను నిర్వహించాల్సిన అవసరం లేదు.

ఆర్టికల్ 243 (V): అర్హతలు, అనర్హతలు

* పట్టణ, నగరపాలక సంస్థల్లోని అన్ని స్థాయుల్లో అధ్యక్షులు, వారి అర్హతలు, అనర్హతలను నిర్ణయించే అధికారం రాష్ట్ర శాసన నిర్మాణ శాఖకు ఉంటుంది.

* పార్లమెంటు, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థుల అర్హతలు, అనర్హతలు స్థానిక సంస్థలకు వర్తిస్తాయి.

* స్థానిక సంస్థలకు పోటీచేసేవారి కనీస వయసు 21 సంవత్సరాలు ఉండాలి.

* 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉండరాదు.

ఆర్టికల్ 243 (W): అధికారాలు, విధులు

* 12వ షెడ్యూల్ ప్రకారం పట్టణ, నగరపాలక సంస్థలకు 18 రకాల అధికారాలు, విధులను బదిలీ చేయాలని నిర్దేశించారు.

* వీటిలో 11 విద్యుక్త (తప్పనిసరి) అంశాలు కాగా, 7 ఐచ్ఛిక అంశాలు. ఈ అధికారాల బదిలీ విషయం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణకే వదిలిపెట్టారు.

పట్టణ ప్రభుత్వాలకు బదిలీ చేయాల్సిన 18 రకాల అధికారాలు, విధులు:

    1. నగర ప్రణాళిక

    2. మురికివాడల నిర్మూలన, అభివృద్ధి

    3. భూమి సమర్థవంత వినియోగం, భవన నిర్మాణాలపై నియంత్రణలు

    4. ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళికలు

    5. రహదారులు, వంతెనలు

    6. పట్టణ అడవులు, పర్యావరణ పరిరక్షణ

    7. అగ్నిమాపక వ్యవస్థ

    8. ప్రజారోగ్యం, మురుగునీటి పారుదల, చెత్త నియంత్రణ

    9. పరిశ్రమలకు, గృహాలకు నీటివసతి

    10. వీధి దీపాలు, బస్‌స్టాండ్‌ల నిర్వహణ

    11. బలహీనవర్గాల సంరక్షణలు, వికలాంగులకు వసతి

    12. నగర దారిద్య్ర నిర్మూలన పథకాలు

    13. కబేళాలపై నియంత్రణ

    14. జంతువుల సంరక్షణ

    15. విద్య, సాంస్కృతిక అభివృద్ధికి చర్యలు

    16. జనన మరణాల నమోదు

    17. స్మశాన వాటికల నిర్వహణ

    18. ఆటస్థలాలు, ఉద్యానవనాల నిర్వహణ


ఆర్టికల్ 243 (X): ఆదాయ వనరులు, పన్నులు

» పట్టణ, నగరపాలక సంస్థలు శాసనసభ నిర్ణయించిన మేరకు పన్నులను విధించి, వసూలు చేసుకోవచ్చు.
 

పన్నులు

» తాగునీరుపై పన్ను

» వినోదపు పన్ను

» ఇంటి పన్ను

» ఆక్ట్రాయ్ పన్ను

» అడ్వర్టైజ్‌మెంట్‌లపై పన్ను

» మార్కెట్లు, సంతలపై పన్ను

» ఖాళీస్థలాలపై పన్ను

» నిర్మాణాలకు ఇచ్చే అనుమతులపై పన్ను

» మున్సిపల్ సంస్థలు తమ మొత్తం ఆదాయంలో 2/3వ వంతు స్థానిక పన్నుల ద్వారానే సమకూర్చుకుంటాయి.

» దేశంలోని మొత్తం స్థానిక సంస్థల పన్నుల ఆదాయంలో 1/4వ వంతు ఆక్ట్రాయ్ పన్ను ద్వారానే సమకూరుతుంది. ఆక్ట్రాయ్ పన్ను అంటే: సరిహద్దులను మూసివేసి, చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వసూలు చేసే పన్ను.


ఇతర ఆదాయ వనరులు

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చే నిధులు

» విరాళాలు

» అద్దెలు, అమ్మకాల ద్వారా లభించే ఆదాయం.


ఆర్టికల్ 243 (Y) రాష్ట్ర ఆర్థిక సంఘం:

» 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఆర్టికల్ 243 (I)లో నిర్దేశించిన రాష్ట్ర ఆర్థిక సంఘం ఆర్టికల్, 243 (Y)కు కూడా వర్తిస్తుంది.

» కేంద్ర ప్రభుత్వం సమకూర్చాల్సిన నిధులకు సంబంధించిన అంశాలపై కేంద్ర ఫైనాన్స్ కమిషన్‌కు రాష్ట్ర ఆర్థిక సంఘం ప్రతిపాదనలను పంపుతుంది.

» రాష్ట్రంలోని పట్టణ, నగరపాలక సంస్థలు చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వాలే సమకూర్చాలి.

» రాష్ట్రాలు ఆర్థిక వనరులను రాష్ట్ర ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు అందిస్తాయి.

» రాష్ట్ర ఆర్థిక సంఘం అదనపు ఆర్థిక వనరుల సమీకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇస్తుంది.

» ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ఆర్థిక సంఘం 1994లో ఏర్పడింది. దీని మొదటి ఛైర్మన్ లక్ష్మణస్వామి.

» రాష్ట్ర ఆర్థిక సంఘం సూచనలను, వాటిపై ప్రభుత్వం తీసుకునే చర్యలతో కూడిన రిపోర్టును గవర్నరు శాసనసభకు సమర్పించాలి.


ఆర్టికల్ 243 (Z) అకౌంటింగ్, ఆడిటింగ్

» మున్సిపల్ వ్యవస్థల జమా ఖర్చుల ఖాతాల నిర్వహణ, వాటి ఆడిటింగ్‌కు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర శాసనసభ ఒక శాసనం ద్వారా రూపొందిస్తుంది.

» ఆంధ్రప్రదేశ్‌లో అన్ని స్థానిక సంస్థల ఆడిట్‌లను రాష్ట్ర ఆడిట్ సంచాలకుడు నిర్వహిస్తారు.

     ఎ. లోకల్ ఫండ్ ఆడిట్

     బి. శాఖాపరమైన ఆడిట్

     సి. సాధారణ ఆడిట్

» స్థానిక సంస్థల ఆడిట్‌ను CAG పరిధిలోకి తీసుకురావాలని CAGగా పదవీ విరమణ చేసిన వినోద్‌రాయ్ సూచించారు.


ఆర్టికల్ 243 (ZA): రాష్ట్ర ఎన్నికల సంఘం

» రాష్ట్రస్థాయిలో గవర్నరు నియమించే రాష్ట్ర ఎన్నికల సంఘం పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తుంది.

» పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర శాసనసభ రూపొందించిన ఎన్నికల చట్టాలకు అనుగుణంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ తన విధులను నిర్వహిస్తుంది.

» రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను గవర్నర్ నియమించినప్పటికీ రాష్ట్రపతి మాత్రమే తొలగించగలరు.

» మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణకు సంబంధించిన అధికారాలను ఆర్టికల్ 243 (K)లో పేర్కొన్న రాష్ట్ర ఎన్నికల కమిషన్ కలిగి ఉంటుంది.


ఆర్టికల్, 243 (ZB): కేంద్రపాలిత ప్రాంతాలకు వర్తింపజేయడం?

» కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టణ, నగరపాలక సంస్థల అమలుపై నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది.

» కేంద్రపాలిత ప్రాంతాల్లోని స్థానిక సంస్థలపై కేంద్ర హోంశాఖ నియంత్రణ కలిగి ఉంటుంది.

» శాసనసభలు ఉన్న దిల్లీ, పాండిచ్చేరి ప్రత్యేక చట్టాలను రూపొందించుకోవచ్చు. కానీ ఆ చట్టం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఉండాలి.

» 74వ రాజ్యాంగ సవరణ చట్టంలోని అంశాలు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి లేదా కేంద్రపాలిత ప్రాంతంలో కొంతభాగానికి వర్తింపజేస్తూ రాష్ట్రపతి ఒక నోటిఫికేషన్‌ను జారీ చేయవచ్చు.


ఆర్టికల్ 243 (ZC) మినహాయించిన ప్రాంతాలు

» ఆర్టికల్ 244 (1)లో పేర్కొన్న షెడ్యూల్డ్ ప్రాంతాలకు, ఆర్టికల్ 244 (2)లో పేర్కొన్న ఆదివాసీ ప్రాంతాలకు 74వ రాజ్యాంగ సవరణ చట్టం నుంచి మినహాయింపు ఇచ్చారు.

» మనదేశంలో ట్రైబల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఏర్పాటు విషయమై మినహాయింపు ఉంది.

» పశ్చిమ్ బంగలోని డార్జిలింగ్ జిల్లాలోని గూర్ఖాలాండ్ ప్రాంతం కూడా మినహాయింపు పొందింది.

» పార్లమెంటు ప్రత్యేక చట్టం చేసి, ఈ ప్రాంతాల్లో కూడా సంస్థలను ఏర్పాటు చేయవచ్చు. సంస్థల ఏర్పాటు; మార్పులు, చేర్పులు చేయడంలోనూ పార్లమెంటు పూర్తి అధికారాన్ని కలిగి ఉంటుంది.


ఆర్టికల్ 243 (ZD) జిల్లా ప్రణాళికా బోర్డు ఏర్పాటు

» జిల్లాలోని గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను జిల్లా ప్రణాళిక బోర్డు రూపొందిస్తుంది.

» జిల్లా ప్రణాళికా బోర్డు‌కు సంబంధించిన విధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర శాసనసభ మార్గదర్శక సూత్రాలను రూపొందించవచ్చు.

» జిల్లా ప్రణాళికా బోర్డులోని మొత్తం సభ్యుల్లో 4/5వ వంతు మందికి తక్కువ కాకుండా సంబంధిత జిల్లాలోని పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికైన సభ్యులు వీరిని ఎన్నుకుంటారు. ఈ విధంగా ఎన్నికైన సభ్యుల్లో మున్సిపాలిటీలు, పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది ఆ జిల్లాలోని గ్రామీణ ప్రాంత జనాభా,

పట్టణ ప్రాంత జనాభాల నిష్పత్తిపైన ఆధారపడి ఉంటుంది.

» ఆంధ్రప్రదేశ్‌లో జిల్లా ప్రణాళికా బోర్డుకు ఎక్స్అఫీషియో ఛైర్మన్‌గా జిల్లా పరిషత్ ఛైర్మన్ వ్యవహరిస్తారు. జిల్లా ప్రణాళికా బోర్డుకు మెంబర్ సెక్రెటరీగా కలెక్టరు వ్యవహరిస్తారు.

» జిల్లా ప్రణాళికా బోర్డులో మొత్తం సభ్యులు 30 మంది. వీరిలో 24 మంది సభ్యులు ఎన్నికవుతారు. సంబంధిత అంశాలపై ముగ్గురు నిపుణులు నామినేట్ అవుతారు. అల్ప సంఖ్యాక వర్గాల నుంచి ఒక్కరు నామినేట్ అవుతారు.

» జిల్లా పరిషత్ ఛైర్మన్ + జిల్లా కలెక్టరు

» జిల్లా ప్రణాళికా కమిటీ రూపొందించిన అభివృద్ధి ప్రణాళికను జిల్లా ప్రణాళికా కమిటీ అధ్యక్షుడు రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతాడు.


ఆర్టికల్ 243 (ZE) మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం

» మెట్రోపాలిటన్ నగరాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికలను రూపొందించడానికి దీన్ని ఏర్పాటు చేస్తారు.

» మెట్రోపాలిటన్ నగరాలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేవలం నిర్మాణపరమైన, నిర్వహణపరమైన అభివృద్ధి విషయాలే కాకుండా సాధారణ అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాల్సి ఉంది.

» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలోని మొత్తం సభ్యుల సంఖ్యలో 2/3వ వంతు సభ్యులను మెట్రోపాలిటన్ ప్రాంత పరిధి నుంచి ఎన్నికైన మున్సిపాలిటీల సభ్యులు, కార్పొరేషన్‌ల సభ్యులు, పంచాయతీ సభ్యులు ఎన్నుకుంటారు.

» ఈ సభ్యుల్లో పంచాయతీలకు చెందినవారు ఎంతమంది ఉండాలి, మున్సిపల్ వ్యవస్థకు చెందినవారు ఎంతమంది ఉండాలనేది వాటి జనాభా నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది.

» మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘంలో మొత్తం సభ్యుల సంఖ్య 24. వీరిలో 18 మందిని ఎన్నుకుంటారు. నలుగురిని రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేస్తుంది.

» దీనికి ఛైర్మన్‌గా నగర మేయర్, మెంబర్ సెక్రెటరీగా మున్సిపల్ కమిషనర్ వ్యవహరిస్తారు.

» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు తన నివేదికను రాష్ట్ర గవర్నరుకు సమర్పిస్తుంది. మరొక నివేదికను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపిస్తుంది.

» మెట్రోపాలిటన్ ప్రణాళికా బోర్డు ప్రణాళిక రూపకల్పన చేసే సందర్భంలో గవర్నరు నిర్దేశించిన సంస్థలను తప్పనిసరిగా సంప్రదించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే భౌతిక వనరులను ఆధారం చేసుకుని మౌలిక వసతుల కల్పనపై ప్రణాళికలను రూపొందించాల్సి ఉంటుంది.

» 10 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో మెట్రోపాలిటన్ నగరాలు వర్థిల్లుతాయి.

» ఇతర మెట్రోపాలిటన్ నగరాల్లో మాదిరి దిల్లీలో కూడా మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం ఉండాలి. కానీ, దాని స్థానంలో దిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వం మెట్రోపాలిటన్ ప్రణాళికా సంఘం కార్యకలాపాలను నిర్వరిస్తుంది.

» 1964లో దేశంలో మొదటి పట్టణాభివృద్ధి సంస్థను దిల్లీలో నెలకొల్పారు.


ఆర్టికల్ 243 (ZF): పాత శాసనాల కొనసాగింపు

» 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది అమల్లోకి వచ్చిన తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు అంటే 1994, మే 31 వరకు పాత శాసనాలు కొనసాగుతాయి.

» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి విరుద్ధం కాని రీతిలో రాష్ట్ర ప్రభుత్వాలు స్వంత చట్టాలు రూపొందించి, అమలుపరచుకోవచ్చు.


ఆర్టికల్ 243 (ZG): మున్సిపల్ ఎన్నికల విషయంలో కోర్టుల జోక్యం నిషేధం

» మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నియోజక వర్గాల పరిధులను నిర్ణయించడం, సీట్ల కేటాయింపులను న్యాయస్థానాల్లో సవాల్ చేయరాదు.

» పట్టణ, నగరపాలక సంస్థలకు ఎన్నికలు జరిపే సందర్భంలో తలెత్తే వివాదాలను పరిష్కరించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చట్టబద్ధంగా సాధికారిక (స్వయం ప్రతిపత్తి) సంస్థలను ఏర్పాటు చేయవచ్చు.

» దిగువ న్యాయస్థానాలు రాష్ట్ర జాబితాలో ఉన్నందున ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటుచేసే అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కలిగి ఉన్నాయి. దాంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పట్టణ, నగరపాలక సంస్థల ఎన్నికల వివాదాలను జిల్లా సెషన్స్ కోర్టులకు అప్పగించారు.

» జిల్లా సెషన్స్ కోర్టులు ఎన్నికల వివాదాలను విచారించే సందర్భంలో సాధారణ కోర్టుల మాదిరి కాకుండా ప్రత్యేక ట్రిబ్యునల్స్‌గా వ్యవహరిస్తాయి.


పట్టణ స్థానిక ప్రభుత్వాలు - వర్గీకరణ

1. నగరపాలక సంస్థలు (Municipal Corporations)

» రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని పెద్ద పట్టణాలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ శాసనసభలో చట్టం చేయడం ద్వారా మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాయి.

» 3 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు.

» మనదేశంలో మొదటి మున్సిపల్ కార్పొరేషన్ 1687లో మద్రాస్‌లో ఏర్పాటు చేశారు. 1726లో బొంబాయి, కలకత్తాల్లో కూడా మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పడ్డాయి.

» 1950లో హైదరాబాద్ కార్పొరేషన్ చట్టం ప్రకారం హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాలకు ప్రత్యేక మున్సిపల్ కార్పొరేషన్లను ఏర్పాటు చేశారు.

» 1955 నాటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం 1960, ఆగస్టు 3న హైదరాబాద్, సికింద్రాబాద్ కార్పొరేషన్లను ఒకే కార్పొరేషన్‌గా విలీనం చేసి ఏర్పాటు చేశారు.

» 74వ రాజ్యాంగ సవరణ చట్టం - 1992 ద్వారా హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1994లో సవరణకు గురైంది.


మున్సిపల్ కార్పొరేషన్ - ప్రధాన అంగాలు

నగరపాలక మండలి

» మున్సిపల్ కార్పొరేషన్ చర్చా సంబంధమైన అంగ(భాగ)మే నగరపాలక మండలి. నగరపాలక సంస్థలోని రిజిస్టరైన ఓటర్లు డివిజన్ల నుంచి కార్పొరేటర్లను ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.

» కార్పొరేటర్ల పదవి కాలం 5 సంవత్సరాలు.

» నగరపాలక సంస్థ పరిధిలోని శాసన సభ్యులు, పార్లమెంటు సభ్యులు, నగరపాలక సంస్థ కమిషనర్ పదవిరీత్యా నగరపాలక మండలిలో సభ్యులుగా ఉంటారు. నగరపాలక మండలికి మేయర్ అధ్యక్షత వహిస్తారు.

మేయర్, డిప్యూటీ మేయర్

» డివిజన్ల నుంచి ఎన్నికైన కార్పొరేటర్లు తమలో నుంచి ఒకరిని మేయర్‌గా, మరొకరిని డిప్యూటీ మేయర్‌గా ఎన్నుకుంటారు.

» మేయర్ నగరపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.

» మేయర్ నగరపాలక సంస్థకు రాజకీయ అధిపతి. ఇతడి పదవీకాలం 5 సంవత్సరాలు.

» ఆంధ్రప్రదేశ్‌లో మేయర్, డిప్యూటీ మేయర్‌లు పరోక్షంగా ఎన్నికవుతున్నారు.


స్థాయీసంఘాలు

» నగరపాలక సంస్థలకు కళ్లు, చెవులు, చేతులుగా స్థాయీసంఘాలను పేర్కొంటారు. ఇవి నగరపాలక సంస్థకు సలహా సంస్థలుగా వ్యవహరిస్తాయి

స్థాయీ సంఘాల విధులు

» నగరపాలక సంస్థ కార్యకలాపాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండటం.

» నగరపాలక సంస్థ వార్షిక బడ్జెట్‌ను పరిశీలించడం.
» అధికారుల నుంచి అవసరమైన సమాచారాన్ని, రికార్డులను పొందడం.

కమిషనర్

» ఇతడు నగరపాలక సంస్థకు పరిపాలనా అధిపతి. రాష్ట్రప్రభుత్వం ఇతడిని నియమిస్తుంది. ఇతడు సాధారణంగా ఐఏఎస్ క్యాడర్‌కు చెందిన వ్యక్తి అయి ఉంటారు. నగరపాలక సంస్థకు సంబంధించిన పరిపాలన, నియంత్రణాధికారాన్ని కలిగి ఉంటారు. మేయర్‌ను సంప్రదించి నగరపాలక సంస్థ సమావేశాల తేదీలు, కార్యక్రమాల అజెండాను రూపొందిస్తారు.

మనదేశంలో వివిధ రాష్ట్రాల్లోని మున్సిపల్ కార్పొరేషన్ల సంఖ్య:

    మహారాష్ట్ర - 26

    ఉత్తర్‌ప్రదేశ్ - 14

    మధ్యప్రదేశ్ - 14

    ఆంధ్రప్రదేశ్ - 13

    తమిళనాడు - 12

    కర్ణాటక - 11

    తెలంగాణ - 6

    జమ్మూకశ్మీర్ - 2


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపల్ కార్పొరేషన్లు - 13

    1) గ్రేటర్ విశాఖపట్నం
    2) కాకినాడ

    3) రాజమండ్రి

    4) ఏలూరు

    5) విజయవాడ

    6) గుంటూరు

    7) ఒంగోలు

    8) నెల్లూరు

    9) కడప

    10) కర్నూలు

    11) తిరుపతి

    12) చిత్తూరు

    13) అనంతపురం

» విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ - 1989

» విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ - 1991

» మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లను - 1994 నాటి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం ఏర్పాటు చేశారు.

» కర్ణాటకలోని బళ్లారి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పర్వీన్‌భాను అనే హిజ్రా ఎన్నికయ్యారు.

2. పురపాలక సంఘాలు: (Municipalities)

» ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టం - 1965 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను ఏర్పాటు చేశారు. ఈ చట్టం 1965, ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి వచ్చింది.

» 74వ రాజ్యాంగ సవరణ చట్టానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాల చట్టాన్ని 1994లో సవరించారు.

» నగరపాలక సంస్థకు దిగువన గ్రామపంచాయతీ, నగర పంచాయతీలకు ఎగువన ఏర్పాటు చేసిన పట్టణ స్థానిక సంస్థలే పురపాలక సంఘాలు. 20,001 లేదా అంతకు మించి జనాభా ఉన్న ప్రాంతాల్లో పురపాలక సంఘాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

» ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాలను వాటి ఆదాయం ప్రాతిపదికగా 5 గ్రేడులుగా వర్గీకరించారు.


ఆంధ్రప్రదేశ్‌లో పురపాలక సంఘాల వర్గీకరణ - వివరాలు

పురపాలక సంఘం గ్రేడ్  వార్షిక ఆదాయం (రూ. కోట్లలో) సంఖ్య
1. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ 8 కోట్లపైన 4
2. స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ 6 - 8 7
3. ఫస్ట్ గ్రేడ్ మున్సిపాలిటీ 4 - 6 13
4. సెకండ్ గ్రేడ్ మున్సిపాలిటీ 2 - 4 25
5. థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీ 1 - 2 18
మొత్తం మున్సిపాలిటీల సంఖ్య   67

పురపాలక సంఘాలు - ప్రధాన అంగాలు

పురపాలక మండలి

» పురపాలక సంఘం చర్చావేదికే పురపాలక మండలి. ఇది సాధారణంగా నెలకొకసారి సమావేశమవుతుంది. దీనిలో కింద పేర్కొన్న సభ్యులుంటారు.ఎన్నికైన సభ్యులు: పురపాలక మండలి ఎన్నిక కోసం దాన్ని వార్డులుగా విభజిస్తారు. ఈ వార్డుల నుంచి కౌన్సిలర్‌లను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు.
ఎక్స్అఫీషియో సభ్యులు: రాష్ట్రాల విధాన సభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు పదవీరీత్యా పురపాలక మండలిలో ఎక్స్అఫీషియో సభ్యులుగా వ్యవహరిస్తారు. వీరికి ఓటువేసే అధికారం ఉంటుంది.

» జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు కూడా ఓటువేసే అధికారం లేకుండా పురపాలక మండలి సభ్యులుగా పదవిరీత్యా వ్యవహరిస్తారు.

» మైనార్టీ వర్గానికి చెందిన ఒకరిని పురపాలక సంఘానికి కో-ఆప్టెడ్ సభ్యుడిగా నియమిస్తారు.

» పురపాలక మండలి సభ్యులు, ఛైర్మన్‌ల పదవీకాలం 5 సంవత్సరాలు.

» 1995, మే 30 తర్వాత ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్న వ్యక్తులు మున్సిపల్ ఎన్నికల్లో పోటీచేయడానికి అనర్హులు.


మున్సిపల్ ఛైర్మన్

» పురపాలక సంస్థకు ఎన్నికైన కౌన్సిలర్‌లు తమలో నుంచి ఒకరిని మున్సిపల్ ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్‌గా ఎన్నుకుంటారు.

» మున్సిపల్ ఛైర్మన్ పురపాలక సంస్థకు ప్రథమ పౌరుడు.

» ఛైర్మన్ ఎన్నిక పరోక్షం.

» ఛైర్మన్ పురపాలక మండలిలోని కొన్ని స్థాయీ సంఘాలకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.


కమిషనర్

» మున్సిపల్ కమిషనర్ పురపాలక సంస్థకు పరిపాలనాధిపతిగా వ్యవహరిస్తారు.

» ఛైర్మన్‌ను సంప్రదించి, సమావేశాల అజెండాను రూపొందిస్తారు.

» మండలి సమావేశాల్లో ఎక్స్అఫీషియో సభ్యుడి హోదాలో పాల్గొంటారు.

» పురపాలక మండలికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తారు.

» పురపాలక మండలి తీర్మానాలను జిల్లా కలెక్టరుకు, పురపాలక పాలన ప్రాంతీయ డైరెక్టరుకు పంపుతారు.

» సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, కార్యకలాపాలపై నియంత్రణ కలిగి ఉంటారు. సంస్థ వార్షిక బడ్జెట్‌ను రూపొందిస్తారు.


పురపాలక సంస్థ - విధులు

ఇవి 2 రకాలు

ఆవశ్యక విధులు (Compulsory Functions)

» ప్రజారోగ్యం, పరిశుభ్రతలను నిర్వహించడం

» జనన, మరణ రికార్డులను నిర్వహించడం

» ప్రాథమిక, మాధ్యమిక, సెకండరీ పాఠశాలలను నిర్వహించడం.

» పౌరులకు పరిశుభ్రమైన నీరు, వీధి దీపాలను ఏర్పాటు చేయడం.

» పురపాలక సంస్థ పరిధిలోని రహదారులు, భవనాల నిర్మాణం, నిర్వహణ.

వివేచనాత్మక విధులు (Discriminary Functions)

» మాతా, శిశు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం.

» పార్కులు, మ్యూజియం, విశ్రాంతి గృహాలు, గ్రంథాలయాలను నిర్వహించడం.

» మహిళల కోసం ప్రసూతి కేంద్రాలను నిర్వహించడం.


స్థాయీ సంఘాలు

» వీటిని పురపాలక సంస్థకు కళ్లు, చెవులు, చేతులుగా అభివర్ణిస్తారు.

    1) విత్తం

    2) ఆరోగ్యం

    3) పన్నులు

    4) మహిళా సంక్షేమం

    5) వెనకబడిన వర్గాల సంక్షేమం

    6) విద్య

పై అంశాలకు సంబంధించిన స్థాయీ సంఘాలు ఉంటాయి.


ఆర్థిక వనరులు

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు.

» వివిధ పన్నుల ద్వారా వచ్చే ఆదాయం.

» విరాళాలు, స్థిర ఆస్తుల ద్వారా సమకూరే ఆదాయం.


3. నగర పంచాయతీలు

» గ్రామీణ ప్రాంతం క్రమంగా పట్టణ ప్రాంతంగా అభివృద్ధి చెందుతుంటే దాన్ని నగర పంచాయతీగా మారుస్తారు. నగర పంచాయతీ జనాభా 11000 కంటే ఎక్కువగా 25000 కంటే తక్కువగా ఉంటుంది. నగర పంచాయతీ పరిపాలన నగర పంచాయతీ కమిటీ ద్వారా జరుగుతుంది.

» పరిపాలనా సౌలభ్యం కోసం ప్రతి నగర పంచాయతీ కొన్ని వార్డులుగా విభజన చెంది ఉంటుంది. ప్రతివార్డు నుంచి ఒక వార్డు మెంబరు చొప్పున 5 సంవత్సరాల కాలానికి వయోజన ఓటర్ల ద్వారా ఎన్నికవుతారు. నగర పంచాయతీ కమిటీలో కనీసం 10 మంది ఎన్నికైన వార్డు మెంబర్లు, ముగ్గురు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. నగర పంచాయతీ పరిధిలో ఉండే ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్‌సీలు పదవీరిత్యా సభ్యులుగా ఉంటారు.

» నగర పంచాయతీ సభ్యులు తమలో నుంచి ఒకరిని అధ్యక్షులుగా, మరొకరిని ఉపాధ్యక్షులుగా ఎన్నుకుంటారు. వీరిని అవిశ్వాస తీర్మానం ద్వారా తొలగించవచ్చు.


ఆదాయ వనరులు

» వ్యాపారం, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలుచేసే ఫీజు, భవన నిర్మాణం, నీటి సరఫరాపై వసూలు చేసే పన్ను.

» ఆస్తులపై అద్దె, అమ్మకం వ్యవహారాలపై వసూలు చేసే రుసుములు.

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే గ్రాంట్లు

» ఆస్తిపన్ను, వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు వసూలు చేసే పన్ను.

» ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 32, తెలంగాణలో 26 నగర పంచాయతీలు ఉన్నాయి.

4. నోటిఫైడ్ ఏరియా కమిటీలు

» 'సెమీ మున్సిపల్ అథారిటీ పద్ధతిలో చిన్నపట్టణాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర శాసనసభ చేసే చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో పూర్తిగా ఎన్నికైన లేదా నామినేట్ చేసిన లేదా కొందరు నామినేట్ విధానం ద్వారా, మరొకొందరు ఎన్నికైన సభ్యులు ఉంటారు. ప్రజలకు అవసరమైన పౌర సదుపాయాలను కల్పించడానికి ఇవి పనిచేస్తాయి.


5. నోటిఫైడ్ ఏరియా కమిటీలు

» అతివేగంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో, మున్సిపాలిటీలను ఏర్పాటుచేయడానికి అనువైన పరిస్థితులు లేని ప్రాంతాల్లో ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా వీటిని ఏర్పాటు చేస్తుంది. అందుకే వీటిని నోటిఫైడ్ ఏరియా కమిటీలు అంటారు.

» వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. ఇందులోని సభ్యులందరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. కాబట్టి ఇవి ఎన్నికైన సంస్థలు కావు.


6. టౌన్ షిప్‌లు (Townships)

» ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికులు, ఆ ప్రాంతంలో నివసించేవారికి పౌరసదుపాయాలు కల్పించడానికి సంబంధిత పారిశ్రామిక సంస్థలు టౌన్‌షిప్స్‌ను ఏర్పాటు చేస్తాయి.

» టౌన్‌షిప్‌ల నిర్వహణ అధికారిని, ఇతర సిబ్బందిని సంబంధిత పరిశ్రమ యాజమాన్యమే నియమిస్తుంది. దీనిలో ఎన్నికైన సభ్యులుండరు. పౌరసదుపాయాల కల్పనలో వీటిని అత్యున్నత శ్రేణి సంస్థలుగా అభివర్ణిస్తారు. ఉదా: విశాఖ స్టీల్

7. పోర్ట్‌ట్రస్ట్ (Port Trust)

» నౌకాశ్రయాలు ఉన్నచోట పోర్ట్‌ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. ముంబయి, కోల్‌కతా, చెన్నై, విశాఖపట్నం లాంటి కీలక ఓడరేవులు ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ రూపొందించిన ఒక చట్టం ద్వారా వీటిని ఏర్పాటు చేస్తారు.

» పోర్టు పరిరక్షణ, నిర్వహణ, అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు పౌరసదుపాయాలు కల్పించడానికి పోర్ట్ ట్రస్ట్‌లను ఏర్పాటు చేస్తారు. వీటి విధులు మున్సిపాలిటీలతో సమానంగా ఉంటాయి. 1963 నాటి మేజర్ పోర్ట్స్ చట్టం ప్రకారం ప్రస్తుతం 13 పోర్ట్ ట్రస్టులు ఉన్నాయి.

8. కంటోన్మెంట్ బోర్డు (Cantonment Board)

» కేంద్ర రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో సైనిక స్థావరాలు ఉన్న ప్రాంతాల్లో పౌరసదుపాయాలను కల్పించడానికి వీటిని ఏర్పాటు చేస్తారు. దీనిలో పాక్షికంగా ఎన్నికైన సభ్యులు, నామినేటెడ్ సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం 5 సంవత్సరాలు. సంబంధిత ప్రాంత మిలటరీ కమాండింగ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డుకు అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడుగురు సభ్యులను ప్రజలు ఎన్నుకుంటారు. ఉపాధ్యక్షుడిని బోర్డు సభ్యులు ఎన్నికుంటారు. కంటోన్మెంట్ బోర్డు కార్యనిర్వాహక అధికారిని రాష్ట్రపతి నియమిస్తారు.

» కంటోన్మెంట్ బోర్డు చట్టం - 1924 ప్రకారం దేశంలో ప్రస్తుతం 62 కంటోన్మెంట్ బోర్డులున్నాయి. 2006లో ఈ చట్టానికి సవరణ చేశారు. తెలంగాణలోని సికింద్రాబాద్ సమీపంలో ఒక కంటోన్మెంట్ బోర్డు ఉంది.

ప్రత్యేక ప్రయోజన సంస్థలు (Special Purpose Agencies)

» బహుళ ప్రయోజనార్థం పట్టణాల్లో వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయోజన సంస్థలను ఏర్పాటు చేస్తుంది. వీటిని విధుల ప్రాతిపదికపై ఏర్పాటు చేస్తారు. వీటి అధిపతులను రాష్ట్రప్రభుత్వమే నియమిస్తుంది. ఇవి స్థానిక మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లతోనూ కలిసి పనిచేస్తాయి.

ఉదా: 1. పట్టణాభివృద్ధి సంస్థలు HUDA, TUDA, VUDA

         2. హౌసింగ్ బోర్డులు

         3. పొల్యుషన్ కంట్రోల్ బోర్డులు

         4. ఎలక్ట్రిసిటీ సప్లై బోర్డులు

పట్టణ, నగర పాలక సంస్థలకు సంబంధించి 2వ పరిపాలనా సంస్కరణల సంఘం సిఫార్సులు

» స్థానిక సంస్థల్లో ఎంఎల్ఏ, ఎంపీలకు ప్రాతినిథ్యం కల్పించకూడదు.

» అన్ని రాష్ట్రాలకు విధానపరిషత్‌లను ఏర్పాటుచేసి, వాటిలో స్థానిక సంస్థల సభ్యులకు స్థానం కల్పించాలి.

» రిజర్వ్ చేసిన నియోజన వర్గాలు కనీసం 10 సంవత్సరాలపాటు కొనసాగాలి.

» పరిపాలనా పారదర్శకతకు జిల్లాస్థాయిలో నిఘా కమిటీని ఏర్పాటు చేయాలి.

» స్థానిక ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను రద్దుచేసే అధికారం రాష్ట్రప్రభుత్వాలకు ఉండకూడదు.

» కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షరతులు లేని గ్రాంట్లను అందజేయాలి.

» మేయర్ లేదా ఛైర్మన్‌ను ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి.

» నగరాల్లో మెట్రోపాలిటన్ పోలీస్ అథారిటీని ఏర్పాటు చేయాలి.

» రాష్ట్ర శాసనసభల్లో స్థానిక సంస్థల విషయాలను పరిశీలించడానికి స్థాయీ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.

 

Posted Date : 30-01-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌