• facebook
  • whatsapp
  • telegram

విస‌ర్జ‌క వ్య‌వ‌స్థ

* శరీరంలో నిరంతరంగా జరిగే జీవక్రియ ఫలితంగా ఏర్పడే వ్యర్థ పదార్థాలను వెలుపలికి పంపే ప్రక్రియ విసర్జన.
* జీవులు తీసుకునే నీటి అవసరాన్ని బట్టి వివిధ రూపాల్లో నత్రజని సంబంధిత పదార్థాలను విసర్జిస్తాయి.

    విసర్జన పదార్థాలు  -       జీవులు
అమ్మోనియా - చేపలు, పీతలు, కప్ప లార్వా
యూరియా - వానపాము, కప్ప, మానవుడు
యూరికామ్లం - కీటకాలు, సరీసృపాలు, పక్షులు

విధ జీవుల్లో ఉండే విసర్జక అవయవాలు....

  విసర్జక అవయవాలు -     జీవులు
మాల్ఫీజియన్ నాళికలు - కీటకాలు (బొద్దింక)
సంకోచ రిక్తికలు - అమీబా, పేరామీషియం
జ్వాలా కణాలు - ప్లనేరియా, బద్దెపురుగు (ప్లాటి హెల్మింథిస్ నిమటోడ్)
నెఫ్రీడియా/ వృక్కాలు - వానపాము, జలగ
మూత్రపిండాలు - ఉభయచరాలు, చేపలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
మెటానెఫ్రీడియా - మొలస్కా జీవులు
జలప్రసరణ వ్యవస్థ - ఇఖైనోడర్మేటా జీవులు

మానవుడిలో విసర్జన
ఎ) సమతౌల్యత: దేహంలోని వివిధ భాగాల్లోని ద్రవాల గాఢతను స్థిరంగా ఉంచడం.
బి) మన శరీరంలో ఉత్పన్నమయ్యే వ్యర్థ పదార్థాలు: CO2 (కార్బన్ డయాక్సైడ్), నీరు; నత్రజని సంబంధిత వ్యర్థాలైన అమ్మోనియా, యూరియా, యూరికామ్లం, పైత్యరస లవణాలు, ఇతర అదనపు లవణాలు.
* వ్యర్థ పదార్థాలన్నింటిలో విషతుల్యమైంది అమ్మోనియా.
* Excretion అనేది రెండు లాటిన్ పదాల వల్ల ఏర్పడింది. 'Ex' అంటే 'బయటకు', 'Crenere' అంటే 'పంపడం'.
* మానవ విసర్జక వ్యవస్థలో ముఖ్యంగా ఒక జత మూత్రపిండాలు, రెండు మూత్ర నాళాలు, మూత్రాశయం, ప్రసేకం ఉంటాయి.
 

మూత్ర పిండాలు
* మూత్ర పిండాల అధ్యయనాన్ని 'నెఫ్రాలజీ' అంటారు.
* ఉదరకుహరంలో పుష్ట శరీర కుడ్యానికి అతుక్కుని, వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి.
* ఉదరకుహర కుడి భాగంలో అధిక ప్రాంతాన్ని కాలేయం ఆక్రమించడం వల్ల కుడివైపు మూత్రపిండం, ఎడమవైపు దాని కంటే కొద్దిగా కిందికి ఉంటుంది.
మూత్రపిండం బయటివైపు 'కుంభాకారంగా' లోపలివైపు 'పుటాకారం'లో ఉంటుంది.
* మూత్రపిండాలు 10 సెం.మీ. పొడవు, 5 - 6 సెం.మీ. వెడల్పు, 4 సెం.మీ. మందం కలిగి దాదాపుగా 150 గ్రా. బరువుతో ఉంటాయి.
* ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ముదురు ఎరుపురంగులో ఉంటాయి.
* పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలోని నొక్కును హైలస్ అంటారు.
* హైలస్ ద్వారా వృక్క ధమని మూత్రపిండంలోకి ప్రవేశిస్తే, వృక్కసిర, మూత్రనాళం వెలుపలికి వస్తాయి.
* శరీరంలో వివిధ అవయవాల్లో ఉత్పత్తి అయిన వ్యర్థాలు ఆమ్లజని సహిత రక్తంతో కూడి వృక్క ధమని ద్వారా మూత్రపిండాన్ని చేరతాయి.
వృక్కసిర ఆమ్లజని రహిత రక్తాన్ని సేకరించి, వడగట్టి వ్యర్థ పదార్థాలను వేరుపరిచి 'మూత్రం'గా మారుస్తుంది.
* మూత్రపిండం వెలుపలి భాగం ముదురు గోధుమ వర్ణంలో ఉంటుంది. దీన్ని వల్కలం అంటారు. లేత వర్ణంలో ఉండే లోపలి భాగాన్ని దవ్వ అంటారు.
* దవ్వ లోపల ఒక మిలియన్ కంటే ఎక్కువ (1.3 - 1.8 మిలియన్) సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి. వీటినే 'వృక్క ప్రమాణాలు/ నెఫ్రాన్' లని అంటారు. ఇవి మూత్రపిండం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణాలు.

నెఫ్రాన్‌లో ప్రధానంగా రెండు భాగాలు

మాల్ఫీజియన్ దేహం
కప్పు ఆకారంలోని 'భౌమన్ గుళిక', రక్తకేశ నాళికలతో ఏర్పడిన వల లాంటి 'రక్త కేశనాళికా గుచ్ఛం' రెండింటినీ కలిపి మాల్ఫీజియన్ దేహం అంటారు. రక్తకేశనాళికా గుచ్ఛం అభివాహి ధమనిక నుంచి ఏర్పడుతుంది. దాని నుంచి అపవాహి ధమనిగా వెలువడుతుంది.
* అభివాహి ధమనిక వ్యాసం, అపవాహి ధమనిక వ్యాసం కంటే ఎక్కువగా ఉండటం వల్ల రక్తకేశ నాళికా పీడనం పెరిగి, దానిలోని పదార్థాలు వడపోతకు గురవుతాయి.
* భౌమన్ గుళిక గోడల్లోని కణాలు ఉపకళా కణజాలంతో ఏర్పడతాయి. వీటిని 'పొడోసైట్లు' అంటారు. పదార్థాల వడపోతకు వీలు కలిగించేలా పోడోసైట్ కణాల మధ్య సూక్ష్మ రంధ్రాలు ఉంటాయి.
* వృక్క నాళిక చివరి భాగమైన దూరస్థ సంవళిత నాళం సంగ్రహణ నాళంలోకి తెరుచుకుంటుంది. సంగ్రహణ నాళాలు పిరమిడ్లు, కెలిసెస్‌లుగా ఏర్పడి చివరికి ద్రోణిలోకి, ద్రోణి మూత్రనాళంలోకి తెరుచుకుంటాయి.
* వృక్క నాళికలోని అన్ని భాగాలు అపవాహి ధమనిక నుంచి ఏర్పడిన రక్తకేశ నాళికల వల ద్వారా కప్పి ఉంటాయి.
* నాళిక బాహ్య రక్తకేశ నాళికలన్నీ కలిసి 'వృక్క సిర'గా ఏర్పడతాయి.
* మూత్రం ఏర్పడే విధానంలో 4 దశలు ఉంటాయి.
     గుచ్ఛ గాలనం, వరణాత్మక పునఃశోషణం, నాళికా స్రావం, అధిక గాఢత ఉండే మూత్రం ఏర్పడటం.
 

గుచ్ఛగాలనం
* రక్తం అభివాహి ధమనిక నుంచి రక్తకేశ నాళికా గుచ్ఛంలోకి ప్రవహిస్తుంది. అభివాహి ధమనిక కలిగించే పీడనం వల్ల రక్తకేశ నాళిక గుచ్ఛంలో రక్తం వడపోతకుగురై, వ్యర్థ పదార్థ అణువులు, పోషక పదార్థ అణువులు, నీరు భౌమన్ గుళికను చేరతాయి. దీన్నే గుచ్ఛగాలనం అంటారు. దీని ద్వారా ఏర్పడిన మూత్రాన్ని ప్రాథమిక మూత్రం అంటారు. ఇందులో రక్తకణాలు ఉండవు.
 

వరణాత్మక పునఃశోషణం
* ప్రాథమిక మూత్రంలో ఉండే గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం, సోడియం క్లోరైడ్లు, 75% నీరు సమీప సంవళిత నాళంలో పునఃశోషితమవుతాయి. దీన్నే వరణాత్మక పునఃశోషణం అంటారు.
 

నాళికా స్రావం
* సమీపస్థ సంవళిత నాళంలో పునఃశోషణ తర్వాత మూత్రం హెన్లీశిక్యం ద్వారా దూరస్థ సంవళిత నాళంలోకి చేరుతుంది.
* రక్తంలో ఉండే యూరియా, యూరికామ్లం, క్రియాటినిన్, సోడియం, పొటాషియం అయాన్లు దూరస్థ సంవళిత నాళంలోకి స్రవించబడతాయి. దీన్నే నాళికా స్రావం అంటారు. ఇవి మూత్రం గాఢత pHను నియంత్రిస్తాయి.
 

అధిక గాఢత గల మూత్రం ఏర్పడటం
* హెన్లీశిక్యం ప్రాంతంలో ఉన్న మూత్రం నుంచి 10% నీరు ద్రవాభిసరణం ద్వారా దాన్ని ఆవరించి ఉన్న కణజాలంలోకి శోషితమవుతుంది. తర్వాత సంగ్రహణ నాళంలో వాసోప్రెస్సిన్ అనే హార్మోన్ సమక్షంలో నీటి పునఃశోషణ పొందుతుంది. గాఢతలో గరిష్ఠ స్థాయికి చేరిన ఈ ద్రవమే మూత్రం. ఇది రక్తం కంటే అధిక గాఢతతో ఉంటుంది.
 

వాసోప్రెస్సిన్:
* హార్మోన్ మూత్ర విసర్జనను అదుపులో ఉంచడం, ద్రవాభిసరణ క్రమతను క్రమబద్దీకరించడంలో ముఖ్యపాత్ర వహిస్తుంది. దీని లోపం వల్ల డయాబెటిస్ ఇనిసిపిడిస్/ అతి మూత్ర వ్యాధి వస్తుంది.
 

మూత్రనాళాలు:
* ఇవి సంగ్రహణ నాళం నుంచి పెరిస్టాలిసిస్ కదలిక ద్వారా మూత్రాన్ని మూత్రాశయంలోకి పంపుతాయి. ఇవి మూత్రపిండం నొక్కు/హైలస్ నుంచి బయలుదేరతాయి.
 

మూత్రాశయం:
* ఇది పలుచని గోడలున్న బేరి పండు ఆకృతిలో ఉండే సంచి లాంటి నిర్మాణం. ఇది దాదాపు 700 - 800 మి.లీ. మూత్రాన్ని తాత్కాలికంగా నిల్వ చేస్తుంది.
* మూత్ర పిండాల ద్వారా నిమిషానికి వడగట్టే రక్తం 120 మి.లీ.
ఒక రోజులో తయారయ్యే ప్రాథమిక మూత్రం 175 లీ. రక్తంలోకి తిరిగి పునఃశోషణం చెందేది 173.4 లీ. - 173.3 లీ. మూత్ర రూపంలో విసర్జించేది 1.6 లీ. - 1.8 లీ.
* మూత్రంలో 96% నీరు, 2.5% కర్బన పదార్థాలు, 1.5% అకర్బన పదార్థం ఉంటాయి. మూత్రం pH - 6.0 (ఆమ్ల స్వభావం).
* మూత్రాశయంలోకి 300 - 400 మి.లీ. మూత్రం చేరినప్పుడు మెదడు సంకేతాల మేరకు మూత్రాశయ కండరాలు సంకోచ సడలికలు చెందడం వల్ల మూత్రం ప్రసేకం ద్వారా విసర్జితమవుతుంది.
* మూత్రం లేత పసుపు రంగులో ఉండటానికి కారణం రక్తంలో హిమోగ్లోబిన్ విచ్ఛిన్నమైనప్పుడు ఏర్పడే యారోక్రోమ్ అనే పదార్థం.
* మూత్ర విసర్జన చిన్న పిల్లల్లో ఒక అనియంత్రిత చర్య, పెద్దల్లో ఇది ఒక నియంత్రిత చర్య.
పిండిపదార్థాలు అధికంగా తీసుకున్నవారి మూత్రంలో ఎక్కువగా ఉండేది చక్కెర.
మాంసకృత్తులు ఎక్కువగా తీసుకున్నవారి మూత్రంలో ఎక్కువగా ఉండేది యూరియా.
* మూత్రపిండాలు పనిచేయకపోవడాన్ని ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ (ESRD) అంటారు.
* మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు, వ్యర్థ పదార్థాలు నిండిపోతాయి. ఈ దశను యూరేమియా అంటారు.
* మూత్రపిండాలు పనిచేయని వారిలో డయాలసిస్ యంత్రం ద్వారా రక్తాన్ని వడగడతారు. కృత్రిమంగా రక్తాన్ని వడగట్టే ప్రక్రియను హీమోడయాలసిస్ అంటారు.
* ఈ ప్రక్రియలో రక్తాన్ని ఒక ముఖ్యమైన ధమని ద్వారా డయాలైజర్ యంత్రంలోకి పంపి రక్తస్కంధనాన్ని నిరోధించే హెపారిన్ లాంటి కారకాలను కలుపుతారు.
* డయాలసిస్ యంత్రంలో గదులు 'సెల్లోఫేన్' అనే పదార్థంతో తయారవుతాయి.
* ప్రతిసారీ డయాలసిస్‌కు 3 - 6 గంటల సమయం తీసుకుంటుంది.
* 1943లో కృత్రిమ మూత్రపిండాన్ని విలియం జె. కాఫ్ (డచ్) తయారుచేశారు.
* చార్లెస్ హాఫ్‌నగేల్ (వాషింగ్టన్) 1954లో సమరూప కవలలకు మొదట మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను చేశారు.
* మన దేశంలో మొదటిసారి 1971, డిసెంబర్ 1న క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్‌లో మూత్రపిండ మార్పిడి ఆపరేషన్ జరిగింది.
 

మూత్రపిండ మార్పిడి
* మూత్రపిండాలు పనిచేయని వారికి దీర్ఘకాలిక పరిష్కారం చూపే ప్రక్రియను మూత్రపిండ మార్పిడి అంటారు. మూత్రపిండాలు పనిచేయని వారికి వారి దగ్గర బంధువు నుంచి బాగా పనిచేస్తున్న మూత్రపిండాన్ని వేరుచేసి అమరుస్తారు.
 

ఇతర అనుబంధ విసర్జకావయవాలు
ఊపిరితిత్తులు:
* శ్వాసక్రియలో ఏర్పడే CO2, నీటి ఆవిరి లాంటి వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతాయి.

చర్మం:
* శరీరంలో అధికంగా ఉన్న నీటిని, అతి తక్కువ మోతాదులో లవణాలను గ్రహించి 'స్వేద గ్రంథులు' చెమట రూపంలో విసర్జిస్తాయి. చర్మంలోని సెబేషియస్ గ్రంథులు 'సెబం' అనే పదార్థాన్ని స్రవిస్తాయి. దీనిలో సెబం, మైనం, స్టిరాల్స్, కర్బన పదార్థాలు, ఫాటీ ఆమ్లాలు ఉంటాయి.
 

కాలేయం:
* ఎర్రరక్త కణాల్లోని హిమోగ్లోబిన్‌ను విచ్ఛిన్నం చేసి బైలిరూబిన్, బైలివర్డిన్, యూరోక్రోమ్ అనే పైత్యరస వర్ణకాలను ఉత్పన్నం చేస్తుంది. ఈ పైత్యరస వ్యర్థాలు మూత్రం ద్వారా విసర్జితమవుతాయి. కాలేయం యూరియా తయారీలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
 

పెద్దపేగు:
అధికంగా ఉన్న కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ల లవణాలు ఉపకళ కణజాలంతో వేరుపరిచి మలంతోపాటు బయటకు విసర్జితమవుతాయి.
* మూత్రాన్ని విసర్జించే ప్రక్రియను మిక్టురిషన్ అంటారు.
* మొదట విసర్జకాంగాలు ప్లాటిహెల్మింథిస్ జీవుల్లో ఏర్పడ్డాయి.

Posted Date : 17-10-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎస్‌ఐ : మెయిన్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు