• facebook
  • whatsapp
  • telegram

నూతన సాంకేతిక పరిజ్ఞానం

క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 

 ఇంటర్నెట్‌ను ఉపయోగించి కంప్యూటర్‌ ద్వారా నెట్‌వర్కింగ్, సాఫ్ట్‌వేర్, అనలిటిక్స్, సర్వర్లు, స్టోరేజ్‌ లాంటి సేవలు అందించడం లేదా ఆ సేవల పంపిణీని క్లౌడ్‌ లేదా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ అంటారు. దీన్నే వివిధ వనరుల మధ్య భాగస్వామ్య సేవలుగా పేర్కొంటారు. 


వినియోగదారులకు వారి ప్రమేయం లేకుండానే కంప్యూటర్‌ ఆధారిత సేవలు అందించడం క్లౌడ్‌ కంప్యూటింగ్‌ ముఖ్య ఉద్దేశం.


ఈ వ్యవస్థ ద్వారా ఆయా సేవల నిర్వహణకు అయ్యే ఖర్చు, సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.


 ఈ సేవలు అందించే సంస్థలను ‘క్లౌడ్‌ ప్రొవైడర్స్‌’ అంటారు. వీటి వల్ల వివిధ కంపెనీలు వారి సొంత డేటా సెంటర్ల నిర్వహణకు బదులు నామమాత్రపు అద్దె చెల్లించి క్లౌడ్‌ సేవలను వినియోగించుకుంటున్నాయి. 


5జీ సాంకేతికత 


 మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో మొదటి తరమైన 1జీ సాంకేతికత 1980 లో ఆరంభమైంది. ఎనలాగ్‌ రేడియో సిగ్నల్స్‌ ద్వారా ఇది పనిచేసేది. కేవలం వాయిస్‌ కాల్స్‌కు మాత్రమే ఇది ఉపయోగపడింది.


 2జీ సాంకేతికత 1990 దశకంలో డిజిటల్‌ రేడియో సిగ్నల్‌ ఆధారంగా డేటా ట్రాన్స్‌మిషన్, వాయిస్‌ కాల్స్‌ను అందించింది.

 2000 దశకంలో 3జీ సాంకేతికత 


ఆరంభమైంది. ఇది డిజిటల్‌ టెక్నాలజీని మరింత నవీనపరుస్తూ, డిజిటలైజ్డ్‌ వాయిస్, వీడియో కాల్స్, కాన్ఫరెన్స్‌ కాల్‌ వ్యవస్థకు ఉపయోగపడింది.


2009లో వచ్చిన 4జీ సాంకేతికత 3దీ వర్చువల్‌ రియాలిటీ కలిగి, మెరుగైన సేవలను అందిస్తోంది.


 5జీ సాంకేతికత మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థలో అయిదో తరానికి చెందింది. ఇది అత్యంత అధునాతన సాంకేతికత. భారతదేశంలో 2023 చివరి త్రైమాసికంలో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ఇవి మొదట 8 నగరాల్లో ప్రారంభమై, తర్వాత దేశమంతా విస్తరించనున్నాయి.


 5జీ సేవలు సెన్సార్‌ను కలిగి ఉండటం వల్ల వ్యవసాయం, తయారీ - సేవల రంగానికి అవసరమైన సమాచారాన్ని అత్యంత కచ్చితత్వంతో, వేగంగా అందిస్తాయి. రవాణా మౌలిక సదుపాయాలు సమర్థవంతంగా పనిచేసేలా ఇవి ఉపయోగపడతాయి.


 కొత్త తరం సాంకేతికత అయిన ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌కి 5జీ సేవలు మరింత ఊతం ఇస్తాయి.


 డ్రైవర్‌ రహిత వాహనాలు, టెలీ సర్జరీ, రియల్‌ టైం డేటా ఎనలిటిక్స్‌కి 5జీ సాంకేతికత ఉపయోగకరం.


 భారతదేశంలో 5జీ వినియోగంపై తీసుకోవాల్సిన చర్యల కోసం ప్రభుత్వం 2016 లో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. 5జీ నెట్‌వర్క్‌ అమలుతో భారతదేశ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందని కమిటీ పేర్కొంది. ఈ సేవల కారణంగా 2035 నాటికి భారతదేశానికి ఒక ట్రిలియన్‌ డాలర్ల ఆదాయం సమకూరుతుందని ఇది అంచనా వేసింది.

డ్రోన్‌ సాంకేతికత 


మానవ రహిత ఆకాశయాన వాహక నౌకలను (అన్‌ మాన్డ్‌ ఏరియల్‌ వెహికిల్‌ - యూఏవీ) డ్రోన్లుగా పిలుస్తారు. ఇవి సాధారణంగా స్వయం ప్రతిపత్తిగా లేదా రిమోట్‌ కంట్రోల్‌ ఆధారంగా పనిచేసే వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఇవి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేస్తాయి.


 భారతదేశంలో డ్రోన్‌ వ్యవస్థను డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) పర్యవేక్షిస్తుంది. డ్రోన్‌ నియమాలు -2021 ఆధారంగా వీటిని నిర్వహిస్తారు.


వర్గీకరణ: డ్రోన్లను వాటి బరువు ఆధారంగా అయిదు రకాలుగా వర్గీకరించారు. అవి: 


1. నానో డ్రోన్లు: ఇవి సాధారణంగా 250 గ్రాముల కంటే తక్కువ బరువును కలిగి ఉంటాయి. 


2. మైక్రో డ్రోన్లు: 250 గ్రాముల నుంచి రెండు కేజీల బరువు కలిగి ఉంటాయి. 


3. స్మాల్‌ (చిన్న) డ్రోన్లు: 2 నుంచి 25 కేజీల బరువును కలిగి ఉంటాయి. 


4. మీడియం (మధ్యస్థ) డ్రోన్లు: 25 నుంచి 150 కేజీల బరువును కలిగి ఉంటాయి. 


5. లార్జ్‌ (భార) డ్రోన్లు: 150 కేజీల కంటే ఎక్కువ బరువును కలిగి ఉంటాయి. 

భారతదేశంలో డ్రోన్లను మొదటిసారిగా సాయుధ దళాల వినియోగం కోసం రూపొందించారు. ఉదా: రుస్తుం-2, నిశాంత్‌ యూఏవీ, లక్ష్య, కంకజ మొదలైనవి. 


అనువర్తనాలు 


రక్షణ రంగం: ఉగ్ర దాడుల సమయంలో డ్రోన్లను జాతి భద్రత కోసం ఉపయోగించవచ్చు. వీటి ద్వారా శత్రు దాడులను దూర ప్రాంతాల నుంచే తిప్పి కొట్టొచ్చు. నిఘా వ్యవహారాల్లో వీటిని వాడతారు.


ఆరోగ్య రంగం: వివిధ రకాల మందులు, వ్యాక్సిన్ల పంపిణీలో డ్రోన్లను వివిధ దేశాలు అత్యంత సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాయి. డ్రోన్ల సాయంతో వ్యాక్సిన్ల పంపిణీ చేసుకునేలా సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వ శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి లభించింది.


వ్యవసాయ రంగం: సూక్ష్మ పోషకాలు, కీటక నాశినులు, ఎరువుల పంపిణీలో డ్రోన్లను వాడుతున్నారు. మృత్తికల స్వభావాన్ని అంచనా వేయడానికి కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. 


నీటిపారుదల సదుపాయాలను డ్రోన్ల ద్వారా సమీక్షిస్తున్నారు. 


ఖనిజ రంగం: వివిధ రకాలైన సహజ వనరులు ఖనిజాలను గుర్తించడానికి డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 


ప్రకృతి వైపరీత్యాలు: ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ, ఆపత్కాల సమయంలో కావాల్సిన ఆహారం, మందుల పంపిణీకి ప్రపంచ దేశాలు విరివిగా డ్రోన్లను ఉపయోగిస్తున్నాయి.


అటవీ సంపద రక్షణ: కొన్ని ప్రాంతాల్లో అడవులను కార్చిచ్చు నుంచి కాపాడేందుకు, వన్యప్రాణి సంరక్షణ కోసం వీటిని ఉపయోగిస్తున్నారు.  


సవాళ్లు

వీటిని సుదూర ప్రాంతాల నుంచి ఉపయోగించే ఆస్కారం ఉండటంతో శత్రువులు, అసాంఘిక శక్తులు వీటిని వాడి, దేశ భద్రతకు ముప్పు కలిగించొచ్చు.


 స్మగ్లింగ్, ఆయుధాల రవాణా, బాంబుల పంపిణీకి వీటిని ఉపయోగించే ప్రమాదం ఉంది.


 శత్రు దేశాలు గూఢచర్యం కోసం వీటిని వినియోగించొచ్చు.


క్లౌడ్‌ కంప్యూటింగ్‌ 


సేవలు - వర్గీకరణ


పంపిణీ ఆధారిత వర్గీకరణ: పంపిణీ ఆదారంగా క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 


1. పబ్లిక్‌ క్లౌడ్‌: వీటిని థర్డ్‌ పార్టీ క్లౌడ్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా పిలుస్తారు. ఇందులో హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మిగతా మౌలిక సదుపాయాలను క్లౌడ్‌ ప్రొవైడర్‌ కల్పిస్తే, వినియోగదారుడు వెబ్‌ బ్రౌజర్‌ ఉపయోగించి సేవలు పొందుతాడు. 


2. ప్రైవేట్‌ క్లౌడ్‌: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సదుపాయాలు ఒక కంపెనీ లేదా వ్యాపార సంస్థ ఆధ్వర్యంలో ఉంటే దాన్ని ప్రైవేట్‌ క్లౌడ్‌గా పేర్కొంటారు.


3. హైబ్రిడ్‌ క్లౌడ్‌: ఇందులో పబ్లిక్, ప్రైవేట్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థలు రెండూ కలిసి క్లౌడ్‌ని పంచుకుంటాయి. అంతేకాకుండా డేటా, అప్లికేషన్స్‌ను కూడా సంయుక్తంగా ఉపయోగించుకుంటాయి.  


మౌలిక సదుపాయాల ఆధారంగా వర్గీకరణ: క్లౌడ్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థ అందించే మౌలిక సదుపాయాల ఆధారంగా ఈ సేవలను మూడు రకాలుగా వర్గీకరించారు. అవి: 

1.1. -Infrastructure as a Service (IaaS):  క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సర్వీసెస్‌ పంపిణీలో ఇది అత్యంత ప్రాథమిక సేవలను అందిస్తుంది. క్లౌడ్‌ ప్రొవైడర్ల నుంచి ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సదుపాయాలైన నెట్‌వర్క్స్, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ మొదలైనవన్నీ నామమాత్రపు రుసుముతో అందిస్తారు. 

2. Platform as a Service (PaaS): 


ఇందులో యూజర్ల సౌలభ్యం కోసం వారికి కావాల్సిన ఫ్లాట్‌ఫామ్స్, మొబైల్‌ యాప్స్, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్లకు అవసరమైన సర్వర్లు, డేటాబేస్‌లను సమకూరుస్తారు. 

3. Software as a service (SaaS): 


ఈ వ్యవస్థలో సబ్‌స్క్రిప్షన్‌ ఆధారంగా సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్స్‌ను యూజర్లకు అందిస్తారు. వీటి నిర్వహణను క్లౌడ్‌ ప్రొవైడరే చేస్తుంది. యూజర్లు ఇంటర్నెట్‌ ఉపయోగించుకుని వెబ్‌ బ్రౌజర్‌ ఆధారంగా పర్సనల్‌ కంప్యూటర్, టాబ్లెట్‌ ఫోన్లలో ఈ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకోవచ్చు.


బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ 

 ఇందులో డిజిటల్‌ డేటాబేస్‌లో ఉన్న సమాచారాన్ని బ్లాక్‌ల రూపంలో నిక్షిప్తం చేసి, దాన్ని గొలుసుల మాదిరిగా ఉండే చెయిన్‌ టెక్నాలజీతో అనుసంధానిస్తారు. దీన్నే బ్లాక్‌చైన్‌ సాంకేతికత అంటారు.


 ఈ నెట్‌వర్కింగ్‌ వ్యవస్థ అత్యంత భద్రమైంది. దీని ఆధారంగానే క్రిప్టో కరెన్సీ పని చేస్తుంది.


 ఈ సాంకేతికత ద్వారా ట్రాన్సాక్షన్లు అత్యంత భద్రంగా, వేగంగా ఒకరి నుంచి మరొకరికి చేరతాయి. ఇందులో ఉండే  కోడ్‌లు ప్రతి ట్రాన్సాక్షన్‌ను వైవిధ్యభరితంగా నిక్షిప్తం చేస్తాయి. 


 ఈ సాంకేతికతను దేశ పౌరులకు కావాల్సిన సమాచారాన్ని నిల్వ చేసేందుకు ఉపయోగించటం వల్ల దీన్ని ‘పబ్లిక్‌ లెడ్జర్‌’గా కూడా పిలుస్తారు.

 ఒక ట్రాన్సాక్షన్‌ పూర్తవగానే అది బ్లాక్‌చైన్‌ వ్యవస్థలోని పర్మినెంట్‌ డేటాబేస్‌లో బ్లాక్‌గా నిక్షిప్తం అవుతుంది. మరో ట్రాన్సాక్షన్‌ చేసినప్పుడు అది ముందు ఉన్న బ్లాక్‌కి అనుసంధానం అవుతుంది. ఈ విధంగా బ్లాక్‌లు ఒకదానికికొకటి గొలుసుల్లా అనుసంధానమవుతాయి. 


అనువర్తనాలు: ఈ సాంకేతికత ద్వారా ఆన్‌లైన్‌ మోసాలను నిలువరించొచ్చు.


 దీని సాయంతో చేసే కార్యక్రమాలన్నీ అత్యంత పారదర్శకంగా ఉంటాయి. 


 దీనిద్వారా వ్యాపార లావాదేవీలను మరింత సమర్థవంతంగా, వేగంగా నిర్వహించొచ్చు. 


 ఇందులోని బ్లాక్‌లను హ్యాక్‌ చేయడం అసాధ్యమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 


 ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్‌ను బ్లాక్‌ల రూపంలో రికార్డ్‌ చేయటం వల్ల ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ అత్యంత మెరుగ్గా నిర్వహించవచ్చు.


 బ్లాక్‌చైన్‌ అనుసంధానం ద్వారా ఎలక్షన్లలో అత్యంత భద్రతతో కూడిన ఓటింగ్‌ నిర్వహణ సాధ్యమవుతుంది 


సవాళ్లు: దీ ఈ సాంకేతికత ఆరంభ దశలో ఉండటం వల్ల దీని వినియోగం అత్యంత ఖర్చుతో కూడుకుని ఉంటుంది.


 బ్లాక్‌చైన్‌ వ్యవస్థ పని చేయడానికి అత్యంత ఎక్కువ మొత్తంలో విద్యుత్‌ అవసరం. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది అనువైంది కాదని పరిశీలకుల అభిప్రాయం.


 దీన్ని ప్రభుత్వ వ్యవస్థలో వినియోగించినప్పుడు అత్యంత చాకచక్యమైన రిస్క్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థ ఉండటం అత్యవసరం. 

 ఈ కృత్రిమ వ్యవస్థను వినియోగించడం వల్ల సంస్థల్లో ఉండే సృజనాత్మకత ఆలోచనా విధానం, వివిధ పాలనా వ్యవస్థల మధ్య సమతౌల్యం లోపించొచ్చు.


 


 


 


 


 

Posted Date : 08-08-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీస్ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌