• facebook
  • whatsapp
  • telegram

మౌర్యానంతర భారతదేశం

మౌర్యుల అనంతరం శుంగవంశం, కణ్వవంశాలు మౌర్య సామ్రాజ్య శిథిలాలపై రాజ్యాలు స్థాపించగా, దక్షిణా పథంలో ఆంధ్ర శాతవాహనులు, ప్రస్తుతం ఒడిశాగా పిలుస్తున్న ప్రాంతాన్ని ఛేది వంశస్థులు పాలించారు. అదేవిధంగా తమిళ ప్రాంతాన్ని చోళ, చేర, పాండ్యులు పరిపాలించారు.


శుంగ వంశం:(క్రీ.పూ.187-75): మౌర్యుల చివరి చక్రవర్తి ‘బృహద్రధుడిని’ అతడి సేనాని పుష్యమిత్ర శుంగుడు వధించి ‘శుంగ వంశాన్ని’ స్థాపించాడు. పుష్యమిత్రుడి గురించి బాణుడి ‘హర్ష చరిత్ర’ వివరిస్తుంది. ఇతడు క్రీ.పూ 187-151 వరకు పరిపాలించాడు. ఈ కాలంలో విదర్భ రాజు యక్షసేనుడిని జయించాడు. తదనంతరం గ్రీకులను ఓడించి రెండు అశ్వమేథ యాగాలు చేశాడు. వీటి గురించి ధనదేవుడి అయోధ్య శాసనం పేర్కొంటుంది. పుష్యమిత్రుడి సేనాధిపతి వసుమిత్రుడు అతడికి అన్నివిధాలా సహాయపడ్డాడు. కాళిదాసు ‘మాళవికాగ్నిమిత్రం’, గార్గి ‘సంహిత’, హాథిగుంఫా శాసనంలో ఇతడి దండయాత్రలకు సంబంధించిన సమాచారం ఉంది. ఈయన ‘భరద్వాజ గోత్రుడని’ పాణిని అష్టాధ్యాయం, కాశ్యప గోత్రానికి చెందిన ‘బైంబక’ వంశీయుడు అని మాళవికాగ్నిమిత్రం తెలియజేస్తుంది. దివ్యవదన అనే బౌద్ధ గ్రంథం పుష్యమిత్రుడు మౌర్య వంశీయుడని పేర్కొంటుంది. ‘మిత్ర’ అనే పదాన్ని బట్టి శుంగులు ‘ఇరానియన్‌’లు అని మరికొందరి వాదన.

* ఖారవేలుని హాథిగుంఫా శాసనం ప్రకారం పుష్యమిత్రుడిని ఖారవేలుడు ఓడించి పాటలీపుత్రం నుంచి జైన మత చిహ్నాలను కళింగకు తెచ్చినట్లు తెలుస్తోంది. విదర్భ రాకుమార్తెను పుష్యమిత్రుడి కుమారుడు అగ్నిమిత్రుడు వివాహమాడినట్లు ‘కాళిదాసు’ మాళవికాగ్నిమిత్రంలో ఉంది. దీన్నే ఇతివృత్తంగా చేసుకుని నాటకాన్ని రచించారు. పుష్యమిత్రుడు హిందూమతాభిమాని. జైన, బౌద్ధ మతస్థులను హింసించాడని, స్తూపాలు, విహారాలు నాశనం చేశాడని చరిత్రకారులు భావిస్తున్నారు. కానీ సాంచీ, బర్హూత్‌ బౌద్ధ స్తూపాలను వీరి కాలంలోనే అలంకరించారు. ఇతర మతాల వారిని ఇతడు హింసించాడనేది అవాస్తవమని మరికొందరు చరిత్రకారుల వాదన. బిహార్, అయోధ్య, మాళ్వా ప్రాంతాల్లో అనేక బౌద్ధవిహారాలు శుంగుల కాలంలో వర్థిల్లినట్టు ‘మహావంశం’ పేర్కొంటోంది.

* పుష్యమిత్రుడు ‘సంస్కృత’ భాషను ఆదరించాడు. మహావిభాష్యం రాసిన ‘పతంజలి’ ఇతడి ఆస్థానంలోనివాడే. మనుస్మృతి కూడా ఈయన కాలంలో ప్రారంభమైందనే వాదన ఉంది. శుంగవంశాన్ని వరుసగా పుష్యమిత్రుడు, అగ్నిమిత్రుడు, సుజ్యేష్టుడు, వసుమిత్రుడు, ఆంధ్రకుడు, పుళిందకుడు, ఘాషుడు, వజ్రమిత్రుడు, భగవంతుడు, దేవభూతి పాలించారు. శుంగరాజు భగవంతుడి కాలంలో తక్షశిల గ్రీకురాజు ఆంటియాల్సిడస్‌ రాయబారి హీలియోడోరస్‌ భిల్సా సమీపంలోని ‘బెస్‌నగర్‌’ విష్ణుదేవాలయంలో గరుడ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాడు. విష్ణువును ప్రధాన దైవంగా పూజించారు. ఓస్‌నగర్‌ (విదిశ) శిల్ప, దంతకార కేంద్రంగా పరిఢవిల్లింది. నాలుగో బౌద్ధసంగీతికి అధ్యక్షత వహించిన వసుమిత్రుడు ఈ వంశస్థుడే. చివరిరాజు దేవభూతుడిని అతని సేనాని వాసుదేవుడు వధించి కణ్వ వంశాన్ని స్థాపించాడు.


ఛేది వంశం: అశోకుడి మరణం పిదప కళింగలో ఛేది (మహామేఘవాహుని) వంశ రాజులు విజృంభించారు. వీరు మధ్యదేశం లేదా మగధ నుంచి వచ్చి స్థిరపడ్డారు. ఈ వంశంలో సుప్రసిద్ధుడైన రాజు ఖారవేలుడు. ఇతడు ‘హాథిగుంఫా’ శాసనాన్ని వేయించాడు. ప్రస్తుతం ఇది భువనేశ్వర్‌ సమీపంలోని ఉదయగిరి గుహలో ఉంది. ఈ శాసనంతో అతడి జీవిత విశేషాలు, విజయాలు అందరికీ తెలిశాయి. ఈయన తన పదహారో ఏçనే రాజయ్యాడు. గణిత, న్యాయ, పాలనా శాస్త్రాలను, యుద్ధ విద్యలను అభ్యసించి 24 ఏళ్లకే కళింగ రాజ్యానికి పట్టాభిషిక్తుడయ్యాడు. మహావిజయుడు, కళింగాధిపతి, కళింగ చక్రవర్తి అనే బిరుదులు ఈయనకు ఉన్నాయి. ఇతడు జైనమతం స్వీకరించి, పరమతసహనం పాటించాడు.

* ఇతడు శాతవాహన రాజు మొదటి శాతకర్ణిపై దండెత్తి ఓడించాడు. మూసికా, పితుండ నగరాన్ని ధ్వంసం చేశాడు. విద్యాధరుడిని ఓడించి రాష్ట్రక, భోజక, మహిషాకాది తెగలను ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. బారాబర్‌ కొండల్లోని గిరిదుర్గాన్ని ధ్వంసం చేశాడు. ఇతడు రాజగృహంపై దాడిచేయగా యువరాజు డెమిట్రియస్‌ మధురకు పారిపోయాడు. మగధ రాజు బహసతిమిత్రుడిని గంగానదీ తీరంలో ఓడించాడు. పాండ్య, అంగ, మగధ రాజ్యాలను ఓడించి పూర్వం కళింగ నుంచి తీసుకెళ్లిన జైన ప్రతిమలను తిరిగి తెచ్చాడు. ప్రజాసంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టాడు. జైనుల కోసం ఉదయగిరి కొండల్లో గుహాలయాలు తొలిపించాడు. కుమారగిరి మీద జైన పరిషత్తును సమావేశపరచి జైనమత గ్రంథాలను క్రోడీకరించాడు. ఇతడికి ‘భిక్షురాజు’ అనే పేరు కూడా ఉంది. ఖారవేలుడి తర్వాత ఛేది వంశం ప్రసక్తి ఎక్కడా కనిపించదు.


శాతవాహనులు: దక్షిణ భారతదేశాన్ని పాలించిన వంశాల్లో ఆంధ్ర శాతవాహనులు ప్రముఖులు. మౌర్య సామ్రాజ్య పతనానంతరం శ్రీముఖుడు శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహనుల్లో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గొప్పవాడు. క్రీ.పూ.235 -218 వరకు శాతవాహనులు పరిపాలించారు. వీరి పరిపాలన మౌర్యుల పాలనను పోలి ఉంటుంది.


   కణ్వ వంశం

కణ్వ వంశ స్థాపకుడు వాసుదేవుడు. ఇతడి తరువాత భూమిమిత్ర, నారాయణ, సుశర్మ పాలించారు. ఈ పాలకులు సుమారు 45 ఏళ్లు పరిపాలించారు. చివరి కణ్వ వంశ రాజు సుశర్మను ఆంధ్ర శాతవాహన రాజు పులోమావి ఓడించాడు. వీరు మగధను ఆక్రమించారని కానీ వెంటనే తిరిగి కోల్పోయారని చరిత్రకారులు చెబుతున్నారు. గుప్తుల యుగం ఆరంభం వరకు మగధ చరిత్ర గురించి స్పష్టమైన ఆధారాలు లేవు.


విదేశీ రాజ్యాలు

మౌర్యుల అనంతరం ఉత్తర, వాయవ్య భారతదేశంలో ప్రధానంగా ఇండో-గ్రీకులు, పార్థియన్లు, శకులు, కుషాణులు తమ రాజ్యాలను స్థాపించి పరిపాలన కొనసాగించారు.


ఇండో - గ్రీకులు(క్రీ.పూ.250-50): వీరిని బాక్ట్రియన్‌ గ్రీకులు అని కూడా అంటారు. భారతదేశానికి వాయవ్యంగా హిందూకుష్‌ - ఆక్సాస్‌ - హీరట్‌ల మధ్య ప్రాంతాన్ని ‘బాక్ట్రియా’గా పిలుస్తారు. వీరు భారతదేశంపై దాడి చేసే సమయానికి చివరి మౌర్య రాజులు పరిపాలన సాగిస్తున్నారు. స్కిథియన్‌ తెగలవారు గ్రీకులను తరమడంతో వారు భారతదేశంపై దండెత్తి అధికారం చేపట్టారు. క్రీ.పూ. 2వ శతాబ్దంలో డెమిట్రియస్‌ దండెత్తాడు. ఈయన సాకేతపురం (అయోధ్య), పాంచాల (రోహిల్‌ఖండ్‌), మధుర, మధ్యమిక (రాజస్థాన్‌-చిత్తోర్‌), పాటలీపుత్రం ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. ఇతడు సాధించిన విజయాలు అలెగ్జాండర్‌ విజయాల కంటే గొప్పవని స్ట్రాబో పేర్కొన్నాడు. ఈయన వెండి, రాగి నాణేలు జారీ చేశాడు. తాను కిరీటాన్ని ధరిస్తూ, సింహం చర్మాన్ని పట్టుకున్నట్లు నాణేలు చిత్రీకరించాడు. అంతేకాకుండా నాణేలపై గ్రీకు దేవుడు ‘జ్యూస్‌’ చిత్రాన్ని ముద్రించాడు. ఇండో - గ్రీకుల్లో సుప్రసిద్ధుడు మీనాండర్‌ (క్రీ.పూ.165-145). ఇతడిని ‘మిళిందుడు’ అని కూడా పిలుస్తారు. పంజాబ్‌లోని సకలి (సియాల్‌కోట్‌) రాజధానిగా చేసుకుని గంగామైదానం మీద దండయాత్ర చేశాడు. ఇతడు బౌద్ధ పండితుడు నాగసేనుడిని అనేక ప్రశ్నలు అడిగి సమాధానాలు తెలుసుకునేవాడు. నాగసేనుడినే ‘నాగార్జునుడు’ అని కూడా అంటారు. వీరి మధ్య జరిగిన వాదప్రతివాదనలను ‘మిళిందపన్హా’ అనే బౌద్ధ గ్రంథంలో పేర్కొన్నారు. డెమిట్రియస్‌ కుమార్తె అగతోక్లియాను వివాహం చేసుకోవడంతో గాంధార నుంచి మధుర వరకు ఉన్న గ్రీకు రాజ్యానికి అధిపతయ్యాడు. ఈయన చక్రం గుర్తు ఉన్న ఇత్తడి నాణేలు విడుదల చేశాడు. మీనాండర్‌ మరణానంతరం స్ట్రాటో-1 సింహాసనం అధిష్ఠించాడు. ఇతడు మైనర్‌ అవడంతో తల్లి అగతోక్లియా ప్రతినిధిగా ఉండి పాలించింది. వీరి వంశంలో చివరి పాలకుడు హిలియోకల్స్‌. భారతదేశంలో మొట్టమొదట బంగారు నాణేలు విడుదల చేసింది ఇండో-గ్రీకులే. వీరి కాలంలోనే గ్రీకు శిల్పకళ బాగా అభివృద్ధి చెందగా, అది కుషాణుల కాలంలో గ్రీకు శిల్పకళ కలయికతో గాంధార శిల్పకళగా ఆవిర్భవించింది. కాలగమనంలో వీరి సామ్రాజ్యంలోని భూభాగాలు శకులు, పార్థియన్లు, కుషాణుల వశమయ్యాయి.


శకులు (క్రీ.పూ.165 - క్రీ.శ.388): గ్రీకుల తరువాత ఎక్కువ కాలం అధిక భూభాగాన్ని పరిపాలించినవారు శకులు. వీరి గురించి మొదటి ప్రస్తావన ఎఖెమినిడ్‌ చక్రవర్తి డేరియస్‌ - ఖి శాసనంలో ఉంది. హెరిటోడస్‌ ప్రకారం జెర్జెస్‌ సైన్యంలో శకసైన్యం ఉండేది. నేడు సీస్తాన్‌గా పిలిచే ప్రాంతంలో శకులుండేవారు. పురాణ, జైన గ్రంథాల్లో శకుల ప్రస్తావన ఉంది. భారతదేశం, ఆఫ్గానిస్థాన్‌లో అయిదు శాఖలకు చెందిన శకులు విస్తరించారు. ఒకశాఖ ఆఫ్గానిస్థాన్, మరోశాఖ పంజాబ్, మూడోశాఖ మధుర, నాలుగో శాఖ పశ్చిమ భారతదేశం, అయిదో శాఖ దక్కన్‌ పీఠభూమి ప్రాంతం. పంజాబ్‌లో స్థిరపడ్డ శకుల రాజధాని తక్షశిల. క్రీ.పూ.58 ప్రాంతంలో విక్రమాదిత్యుడు శకులతో పోరాడి ఉజ్జయిని నుంచి వారిని తరిమేశాడు. దీంతో ‘విక్రమశకం’ పేరుతో నూతన శకాన్ని ఆరంభించాడు. భారతదేశంలో ముఖ్య శకరాజు మావుజ్‌ (యోగ). ఇతడు ‘రాజాధిరాజ’ బిరుదుతో రాజ్యాన్ని పాలించాడు. మధుర వరకు తన అధికారాన్ని విస్తరించాడు. ఇతడి తరువాత ఏజెన్, ఎజిలెన్, ఏజెన్‌-2లు పాలించారు. శకుల్లో మరో ప్రధాన రాజు మొదటి రుద్రదాముడు (క్రీ.శ.130-150). ఇతడు సింధూ, గుజరాత్, కొంకణ్, నర్మదా లోయ, మాళ్వా, కథియావార్‌ ప్రాంతాల్లోని ఎక్కువ భాగాన్ని పరిపాలించాడు. కథియావార్‌లో సుదర్శన తటాకాన్ని బాగుచేసి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడ్డాడు. సంస్కృతంలో సుదీర్ఘమైన మొదటి శాసనం వేయించాడు. అంతవరకు మనదేశంలో లభించిన శాసనాలన్నీ ప్రాకృతంలో ఉండేవి.  శకులు రాజ్యాన్ని రాష్ట్రాలుగా విభజించి మహాక్షాత్రప అనే అధిపతి పాలనలో ఉండేవారు. వీరి కింద క్షాత్రపు అనే పాలకులుండేవారు. వీరు ఇండో-గ్రీకులను అనుకరిస్తూ నాణేలను ముద్రించారు. మహాక్షాత్రపులు, క్షాత్రపులు చిన్నచిన్న రాజ్యాలను నెలకొల్పగా, వీటిని శాత్రపి అని పిలిచేవారు. ఈ శాత్రపిలు తక్షశిల, మధుర, మహారాష్ట్ర మాళవల్లో ఉండేవి. తక్షశిల క్షాత్రపుల్లో లియాక కువలక, మహాధనపటిక చెప్పకోదగ్గవారు. మహాధనపటిక బుద్ధుడి ధాతువును తెచ్చి స్తూపం నిర్మించాడు. మధుర శాత్రపిని పాలించిన వారిలో ముఖ్యులు హగమష, మగన, రంజువుల, పోదస, శివఘోష. మహారాష్ట్ర క్షాత్రపులు క్షహరాట వంశీయులు. వీరిలో భూమక, సహపాణ అగ్రగణ్యులు. భూమక నాణేలపై ఖరోష్ఠి, బ్రాహ్మీలిపులు ఉన్నాయి. నహపాణుడు శాతవాహనుల నుంచి మహారాష్ట్రను జయించాడు. కానీ గౌతమీపుత్ర శాతకర్ణి తిరిగి వాటిని జయించాడు. ఉజ్జయిని క్షాత్రపులు కర్థమక వంశానికి చెందినవారు. యశమతిక ఈ వంశంలో తొలి రాజు కాగా రుద్రదాముడు గొప్పవాడు. ఇతడి అనంతరం, ‘దమఘసద’ పాలించాడు. అరఖోసియా (గాంధార) రాజు పార్థియన్‌ గండోఫెర్నిస్‌  శకుల పాలనను అంతమొందించాడు.


పార్థియన్లు (పహ్లవులు): ఇరాన్‌కు చెందిన వీరిలో ప్రసిద్ధమైన రాజు గండోఫెర్నిస్‌ (పరిపాలన కాలం క్రీ.శ. 20 - 50) క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి సెయింట్‌ థామస్‌ ఇతని పాలనా కాలంలోనే వచ్చాడు. వీరు వాయవ్య భారతంలో అతికొద్ది ప్రాంతాన్ని మాత్రమే పాలించారు. తక్త్‌-ఇ-బాహీ శాసనం ప్రకారం గండోఫెర్నిస్‌ గాంధారాను పాలించాడు. ఇతడు వెండి, రాగి మిశ్రమ లోహాలతో తయారుచేసిన నాణేలను ముద్రించాడు. నాణేలపై కిరీటధారిగా, గుర్రంపై కూర్చునట్లుగా, శివుడి బొమ్మను ముద్రించాడు. శక-పహ్లవులు ఒకరే అనే వాదనా ఉంది. వీరిలో వోనోనెస్‌ అనే శాఖ దక్షిణ ఆఫ్గానిస్థాన్‌ను పాలించేవారు. ఇది చిన్నచిన్న శాఖలుగా విడిపోవడంతో వారిలో ‘యూచీ’ తెగకు చెందిన కుషాణ రాజు ‘కుజలఖాడ్‌ పైసిస్‌’ వారి రాజ్యాన్ని ఆక్రమించారు. దీంతో కుషాణుల పాలన ప్రారంభమైంది.

Posted Date : 16-02-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

కానిస్టేబుల్స్‌ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు