• facebook
  • whatsapp
  • telegram

ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


 1989లో నేషనల్‌ ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.  దీని ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారి సమగ్రాభివృద్ధిని సాధించాలని సంకల్పించారు. 


 2001లో ఈ కార్పొరేషన్‌ను విభజించి ఎస్సీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్, ఎస్టీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లను వేర్వేరుగా ఏర్పాటు చేశారు.


కార్పొరేషన్‌ - విధులు: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలు కోసం నిధులు కేటాయించడం. యువతకు సాంకేతిక శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పన.


 విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఆర్థిక సహకారాన్ని అందించడం. సంబంధిత వర్గాల వారికి సూక్ష్మరుణ సదుపాయం కల్పించడం.


 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం.


జాతీయ షెడ్యూల్డ్‌ కులాలఆర్థికాభివృద్ధి సంస్థ


ప్రభుత్వ కంపెనీల చట్టం, 1956లో సెక్షన్‌ 25 ప్రకారం ‘జాతీయ షెడ్యూల్డ్‌ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ’ను స్థాపించారు. ఇది ఎస్సీ వర్గాల సమగ్రాభివృద్ధికి కృషి చేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది.


స్టాండప్‌ ఇండియా: ప్రధాని నరేంద్రమోదీ 2016 ఏప్రిల్‌ 5న ‘స్టాండప్‌ ఇండియా’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.  ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడం దీని ఉద్దేశం. 


 దీని ప్రకారం వ్యవసాయేతర రంగంలో నూతన పరిశ్రమలను స్థాపించడానికి రూ.10 లక్షల నుంచి కోటి రూపాయల వరకు రుణం అందిస్తారు. 


 ఈ రుణాన్ని 7 సంవత్సరాల్లో తిరిగి చెల్లించాలి. 


 స్మాల్‌ ఇండస్ట్రీస్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SIDBI) పరిశ్రమలకు రూ.10,000 కోట్లతో రీఫైనాన్స్‌ చేస్తుంది. 


షెడ్యూల్డ్‌ కులాల ఉపప్రణాళిక (SC-Sub plan): ఎస్సీ వర్గాల వారిని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రోత్సహించేందుకు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నించింది. అయితే 1979లో (SC-Sub plan) నిర్దిష్ట రూపం ఇచ్చారు.


అల్పసంఖ్యాక వర్గాలు (Minorities):


 మనదేశంలో మతపరమైన మైనార్టీలను నిర్ధారించేందుకు దేశాన్ని యూనిట్‌గా తీసుకుంటున్నారు. 


 జాతీయ మైనార్టీ కమిషన్‌ చట్టం (1992 ) సెక్షన్‌ 2(C) అనుసరించి 5 మతవర్గాలను మైనార్టీలుగా పరిగణించారు. 


అవి: 1. ముస్లిం     2. క్రైస్తవ    3. బౌద్ధ  4. సిక్కు     5. పార్శీ


 2014లో జైనమతానికి మైనార్టీ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టం చేసింది.


మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ: మైనార్టీ వర్గాల సమగ్రాభివృద్ధిని సాధించే లక్ష్యంతో మనదేశంలో 2006, జనవరి 29న ‘‘మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ’’ను ఏర్పాటు చేశారు. 


 ఇది మైనార్టీ వర్గాల సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆర్థిక రంగాల ప్రగతి కోసం కృషి చేస్తుంది.మౌలానా ఆజాద్‌ ఫౌండేషన్‌: దీన్ని 1989, జులై 6న న్యూదిల్లీలో ఏర్పాటు చేశారు. 


 మైనార్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం పనిచేస్తుంది. ఇది స్వచ్ఛంద సామాజిక సేవా సంస్థ.


USTTAD:  2015, మే 14న ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ USTTAD ను ప్రారంభించారు. 


( USTTAD అంటే Upgrading the Skill & Training in Traditional Arts/ crafts for Development. 


 దీని ద్వారా మైనార్టీ వర్గాలకు చెందిన సంప్రదాయ కళలు, హస్తకళలు, ఇతర కళలను పరిరక్షించేందుకు కృషి జరుగుతుంది. ఇందుకు అవసరమయ్యే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది.


కేంద్ర వక్ఫ్‌ మండలి: ఇస్లాం మతానికి చెందిన మతధార్మిక సంస్థ. దీన్ని 1964 డిసెంబరులో ఏర్పాటు చేశారు.  ఇది మనదేశంలో వక్ఫ్‌ పాలనకు సంబంధించిన అంశాల్లో సలహాలను ఇస్తుంది. దీనిలో 20 మంది సభ్యులు ఉంటారు. 


 ఇది వక్ఫ్‌ ఆస్తుల అభివృద్ధికి కృషి చేస్తుంది. నేషనల్‌ వక్ఫ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (NAWADCO) ను 2014, జనవరి 29న ఏర్పాటు చేశారు.


DBT స్కాలర్‌షిప్‌ పథకం: ప్రత్యక్ష లాభ బదిలీ (Direct Benefit Transfer) పథకం ద్వారా మైనార్టీ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేస్తున్నారు. 


 పోస్టుమెట్రిక్‌ స్కాలర్‌షిప్, మెరిట్‌- కమ్‌- మీన్స్‌ స్కాలర్‌షిప్, మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఫెలోషిప్‌ పథకాల కింద నేరుగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోకి స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని బదిలీ చేస్తున్నారు.


ముస్లిం మైనార్టీల అభివృద్ధికి- 15 సూత్రాల పథకం: రాజేంద్రసింగ్‌ సచార్‌ కమిటీ సిఫార్సుల మేరకు డా. మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింల సమగ్రాభివృద్ధి కోసం 15 సూత్రాల పథకాన్ని 2006, సెప్టెంబరు 10న ప్రకటించింది. అవి:


1. మైనార్టీ వర్గాలు నివసించే ప్రదేశంలో అంగన్‌వాడీ కేంద్రాల ఏర్పాటు.


2. మదర్సాలను ఆధునికీకరించి మెరుగ్గా నిర్వహించడం,


3. ప్రతిభావంతులైన మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు.


4. మౌలానా ఆజాద్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ ద్వారా విద్యారంగంలో మౌలిక సదుపాయాలకు కృషి.


5. ముస్లిం విద్యార్థులు ఎక్కువ ప్రవేశం పొందే విద్యాలయాల్లో ఉర్దూ ఉపాధ్యాయుల నియామకం.


6. జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ పట్టణ అభివృద్ధి పథకం కింద మౌలిక సదుపాయాల కల్పన.


7. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అమలవుతున్న ఉపాధిహామీ పథకాల్లో 15 శాతం నిధులు, వనరులను కేటాయించడం.


8. చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు రుణ సదుపాయాలు కల్పించడం.


9. సాంకేతిక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం.


10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఎంపిక కోసం పోటీ పరీక్షార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం.


11. మైనార్టీలు నివసించే ప్రాంతాల్లో బాలికల విద్య కోసం కస్తూర్భా గాంధీ విద్యాలయాల ఏర్పాటు.


12. మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనే ప్రాంతాల్లో సమర్థులైన ప్రభుత్వ అధికారులను నియమించి, వారికి తగిన ప్రోత్సాహకాలు అందించడం.


13. ఇందిరా ఆవాస్‌ యోజన పథకం ద్వారా గృహ సదుపాయాల కల్పన.


14. మత కల్లోలాల బాధితులకు తగిన నష్టపరిహారాన్ని అందజేసి, పునరావాసం కల్పించడం.


15. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన వారిని ప్రత్యేక న్యాయస్థానాల ద్వారా విచారించి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించి, అమలు చేయడం.


జియో పార్శీ పథకం: మనదేశంలో మైనార్టీ వర్గమైన పార్శీల జనాభా భారీగా క్షీణిస్తుండటంతో 2013, సెప్టెంబరు 23న మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వశాఖ జియో పార్శీ పథకాన్ని చేపట్టింది. దీని ద్వారా పార్శీల జనాభా సంఖ్యను పెంచేందుకు కృషి జరుగుతుంది.


జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌


 దేశంలో వెనుకబడిన వర్గాల సమగ్రాభివృద్ధి కోసం జాతీయ బీసీ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను 1992లో ఏర్పాటు చేశారు.  ఈ సంస్థ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.


 వ్యవసాయం, చిన్నతరహా కుటీర పరిశ్రమలు, సంప్రదాయ వృత్తులు, సేవారంగం, సాంకేతిక రంగాల్లో  (OBC) వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించడం దీని లక్ష్యం.


 1993లో జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌ను చట్టబద్ధ సంస్థగా ఏర్పాటు చేశారు.


 2018లో 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ‘‘జాతీయ వెనకబడిన వర్గాల కమిషన్‌’’కు రాజ్యాంగబద్ధతను కల్పించారు.


జాతీయ మైనార్టీ ఆర్థికాభివృద్ధి సంస్థ 


 గోపాల్‌సింగ్‌ కమిటీ సిఫార్సుల మేరకు ‘‘జాతీయ మైనార్టీల ఆర్థికాభివృద్ధి సంస్థ’’ను 1994లో ఏర్పాటు చేశారు. 


 ప్రారంభంలో ఈ సంస్థ సామాజిక, న్యాయ, సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైంది.  2005లో ఈ సంస్థను మైనార్టీల వ్యవహారాల మంత్రిత్వశాఖకు బదిలీ చేశారు.


ఆశయాలు: మైనార్టీల ఉన్నత విద్యను ప్రోత్సహించడం. వారికి ఉపాధి అవకాశాలు, ఆర్థిక సహకారాన్ని కల్పించడం,


 వివిధ రకాల చేతివృత్తులు, చిన్న తరహా, కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన రుణ సదుపాయాలను కల్పించడం.


గిరిజన సహకార మార్కెటింగ్‌ అభివృద్ధి సమాఖ్య


 గిరిజన వర్గాల (ఎస్టీ) ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు 1987లో ‘‘ట్రైబల్‌ కోఆపరేటివ్‌ మార్కెటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (TRIFED)'' ను దిల్లీలో స్థాపించారు. ఇది మనదేశంలో అతిపెద్ద సహకార సంస్థ.


 గిరిజనులు సేకరిస్తున్న సూక్ష్మ అటవీ ఉత్పత్తులను దళారుల ప్రమేయం లేకుండా సరైన ధరలకు విక్రయించడానికి ఇది సహకరిస్తుంది.


షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక(ST-Sub plan) 


 షెడ్యూల్డ్‌ తెగల ఉపప్రణాళిక(ST sub plan ) ను 5వ పంచవర్ష ప్రణాళికా కాలం 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రారంభించింది.  గిరిజనుల సమగ్రాభివృద్ధిని సాధించడం దీని లక్ష్యం. 


 ఇందులోని అంశాలు: కనీసం 10,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో 50% కంటే ఎక్కువ గిరిజనులు ఉన్న 259  MADA  ప్రాంతాల గుర్తింపు. 


(MADA అంటే  Modified Area Development Agency)  50% కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న ప్రాంతాల్లో సమగ్ర గిరిజనాభివృద్ధి ఏజెన్సీల (ITDA)స్థాపన.


రచయిత

బంగారు సత్యనారాయణ 

విషయ నిపుణులు 

Posted Date : 14-11-2023

 

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ఎస్‌ఐ : ప్రిలిమ్స్

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు