• facebook
  • whatsapp
  • telegram

 కేంద్ర ఎన్నికల సంఘం

భారత ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా పరిగణించే ఎన్నికలను ప్రభుత్వ జోక్యం లేకుండా స్వేచ్ఛగా నిర్వహించేందుకు రాజ్యాంగ నిర్మాతలు స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఇది పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి సంబంధించిన ఎన్నికలను నిష్పక్షపాతంగా, విశ్వసనీయతతో నిర్వహిస్తుంది.
రాజ్యాంగ వివరణ: భారత రాజ్యాంగంలోని XVవ భాగంలో ఆర్టికల్‌ 324 నుంచి 329 మధ్య కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, అధికారాలు, విధులను వివరించారు. మనదేశంలో 1950, జనవరి 25 నుంచి కేంద్ర ఎన్నికల సంఘం అమల్లోకి వచ్చింది. న్యూదిల్లీలోని ‘నిర్వాచన్‌ సదన్‌’ దీని ప్రధాన కార్యాలయం.

 జాతీయ ఓటర్ల దినోత్సవం 
కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడి 2011, జనవరి 25 నాటికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఓటర్ల దినోత్సవాన్ని ప్రారంభించారు. యువత ఓటర్ల జాబితాలో చేరడాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో దీన్ని నిర్వహిస్తున్నారు. 'Proud to be Voter - Ready to Vote '  అనేది ఓటర్ల దినోత్సవ నినాదం.

ఓటర్ల ప్రతిజ్ఞ: ‘భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో, దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను, స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని... కుల, మత, జాతి, వర్గ, భాష లాంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని’ ప్రతిజ్ఞ చేస్తున్నాం.

 ఏకసభ్య - బహుళ సభ్య ఎన్నికల సంఘం
 1950, జనవరి 25 నుంచి 1989, అక్టోబరు 15 వరకు కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్‌తో ఏకసభ్య ఎన్నికల సంఘంగా కొనసాగింది. రాజీవ్‌ గాంధీ ప్రభుత్వం 1989, అక్టోబరు 16న కేంద్ర ఎన్నికల సంఘాన్ని ‘బహుళ సభ్య ఎన్నికల సంఘం’గా మార్చింది. దీనిలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు ఇద్దరు ఇతర ఎన్నికల కమిషనర్లు కూడా ఉంటారు. 1990 జనవరిలో విశ్వనాథ్‌ ప్రతాప్‌సింగ్‌ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘాన్ని తిరిగి ఏకసభ్య ఎన్నికల సంఘంగా మార్చగా పి.వి.నరసింహారావు ప్రభుత్వం 1993, అక్టోబరు 1న బహుళ సభ్య ఎన్నికల సంఘంగా మార్చింది.
ఆర్టికల్‌ 325: ఎన్నికల నిర్వహణ విషయంలో ఓటర్ల జాబితాను తయారుచేసేటప్పుడు పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాల్లో ఎలాంటి భేదాలు లేకుండా ఒకే జాబితాను రూపొందించాలి.
ఆర్టికల్‌ 326: లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలకు జరిగే ఎన్నికలన్నీ సార్వజనీన వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై జరుగుతాయి. 1950, జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు వయోజన ఓటుహక్కు వయోపరిమితి 21 సంవత్సరాలు. దీన్ని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 61వ రాజ్యాంగ సవరణ చట్టం - 1988 ద్వారా 18 సంవత్సరాలకు తగ్గించింది. ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.
ఆర్టికల్‌ 327: రాజ్యాంగ నియమాలకు లోబడి పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన ఎన్నికల నియమ నిబంధనలను పార్లమెంటు రూపొందిస్తుంది.
ఆర్టికల్‌ 328: శాసనసభలకు సంబంధించిన ఎన్నికల చట్టాలను పార్లమెంటు రూపొందించనప్పుడు రాష్ట్ర శాసనసభలు రూపొందించుకోవచ్చు.
ఆర్టికల్‌ 329: ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోకూడదు. ప్రాదేశిక నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన శాసనాల రాజ్యాంగ బద్ధత, వివిధ నియోజకవర్గాల సీట్ల కేటాయింపును న్యాయస్థానంలో సవాలు చేయకూడదు.

 డిపాజిట్‌ కోల్పోవడం
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థులు రూ.15000ను డిపాజిట్‌గా జమచేయాలి. లోక్‌సభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.25000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12500; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.10,000; ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5000ను డిపాజిట్‌గా జమచేయాలి. ఎన్నికల్లో పోలై చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6వ వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్‌ను చెల్లిస్తారు. అంతకంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి డిపాజిట్‌ తిరిగి ఇవ్వరు. దీన్నే ‘డిపాజిట్‌ కోల్పోవడం’ అంటారు.

వ్యయ పరిమితి: అభ్యర్థుల ఎన్నికల వ్యయపరిమితిని లోక్‌సభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.70 లక్షలు, చిన్న రాష్ట్రాల్లో రూ.54 లక్షలుగా; రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో పెద్ద రాష్ట్రాల్లో రూ.28 లక్షలు, ఈశాన్య రాష్ట్రాల్లో రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఈ ఎన్నికల వ్యయపరిమితికి 2014, ఫిబ్రవరి 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

తొలగింపు: ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధానంలో అంటే పార్లమెంటు 2/3వ వంతు ప్రత్యేక మెజార్టీ ద్వారా మాత్రమే తొలగిస్తారు. ఇతర ఎన్నికల కమిషనర్లను ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సిఫారసు మేరకు రాష్ట్రపతి తొలగిస్తారు.

 అధికారాలు, విధులు
* ఆర్టికల్‌ 324 ప్రకారం ఏర్పడిన కేంద్ర ఎన్నికల సంఘం పరిపాలనా, సలహారూపకమైన, అర్ధన్యాయ సంబంధమైన అధికారాలు, విధులను కలిగి ఉంటుంది.
*  కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను రూపొందిస్తుంది, సవరణ చేస్తుంది.
* పార్లమెంటు రూపొందించిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కమిషన్‌ చట్టం ప్రకారం దేశంలోని లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల భౌగోళిక పరిధిని నిర్ణయించడం.
* వివిధ రాజకీయ పార్టీలను గుర్తించి, వాటికి ఎన్నికల గుర్తులను కేటాయించడం. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడం, ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ, పరిశీలన, పోలింగ్‌ తేదీలను నిర్ణయించడం.
* ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన ఎన్నికల నియమావళిని రూపొందించి, అమలుచేయడం.
* పార్లమెంటు, రాష్ట్ర శాసనసభ్యుల అనర్హతకు సంబంధించి రాష్ట్రపతి, గవర్నర్లకు సూచనలు, సలహాలు ఇవ్వడం.
* వివిధ రాజకీయ పార్టీల మధ్య వచ్చే వివాదాలను విచారించి, పార్టీల వాదనలు విని పరిష్కరించడం.

 అభ్యర్థులను ఓటర్లు బలపరచడం
* రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 50 మంది బలపరచాలి.
* ఉపరాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని ఎలక్టోరల్‌ కాలేజిలోని కనీసం 20 మంది సభ్యులు ప్రతిపాదించి, మరో 20 మంది బలపరచాలి.
* జాతీయ లేదా రాష్ట్ర పార్టీల తరఫున టికెట్‌ పొందిన వ్యక్తి లోక్‌సభ లేదా శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయడానికి నామినేషన్‌ దాఖలు చేయాలంటే కనీసం ఒక ఓటరు బలపరచాలి.
* స్వతంత్ర లేదా గుర్తింపు లేని పార్టీ తరఫున లోక్‌సభ లేదా శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రానికి సంబంధిత నియోజకవర్గంలోని కనీసం పది మంది ఓటర్ల మద్దతు ఉండాలి.
* లోక్‌సభకు పోటీ చేయాలంటే దేశంలోని ఏదో ఒక లోక్‌సభ నియోజకవర్గంలో; రాష్ట్ర శాసనసభకు పోటీచేసే అభ్యర్థి రాష్ట్రంలోని ఏదో ఒక నియోజకవర్గంలో ఓటరుగా నమోదై ఉండాలి.
* రాష్ట్ర శాసనసభకు గవర్నర్‌ నామినేట్‌ చేసే వ్యక్తి తప్పనిసరిగా అదే రాష్ట్రానికి చెంది ఉండాలి.

 సుప్రీంకోర్టు తీర్పులు
మక్కాల్‌ శక్తి కచ్చి Vs కేంద్ర ఎన్నికల సంఘం: ఈ కేసులో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీచేసిన తర్వాత ఎన్నికల నిర్వహణ, ఓట్ల లెక్కింపు తేదీలను నిర్ణయించే అధికారం పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వీటిని న్యాయస్థానాల్లో సవాలు చేయకూడదని సుప్రీంకోర్టు పేర్కొంది.
మహేందర్‌సింగ్‌ గిల్‌ Vs భారత ప్రభుత్వం: ఈ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన చట్టాలను పార్లమెంటు లేదా శాసనసభలు రూపొందించకపోతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన నియమ నిబంధనలను రూపొందించుకునే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుందని తెలిపింది.

 ఎన్నికల యంత్రాంగం
కేంద్ర ఎన్నికల సంఘంలో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించే సంఖ్యలో ఇతర ఎన్నికల కమిషనర్‌లు ఉంటారు. వీరిని రాష్ట్రపతి నియమిస్తారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు. జీతభత్యాలు సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానంగా ఉంటాయి. రాష్ట్ర స్థాయిలో స్వతంత్ర ఎన్నికల నిర్వహణకు ఎన్నికల అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేసుకుంటుంది. వర్గ స్థాయిలో ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా; పోలింగ్‌బూత్‌ స్థాయిలో ప్రభుత్వోద్యోగి ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తారు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌