• facebook
  • whatsapp
  • telegram

కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌

  భారతదేశంలో కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (CAG) ప్రజాధనానికి కాపలాదారుడిగా; కేంద్ర, రాష్ట్రస్థాయిలో దేశ ఆర్థిక వ్యవస్థకు రక్షకుడిగా వ్యవహరిస్తారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘం, యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మాదిరి కాగ్‌ ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం లాంటివారు. 

    1753లో ఆంగ్లేయులు ‘ది ఇండియన్‌ ఆడిట్‌ అండ్‌ అకౌంట్‌ డిపార్ట్‌మెంట్‌’ను ప్రారంభించారు. 1858లో విక్టోరియా మహారాణి ప్రకటన ద్వారా మనదేశంలో మొదటిసారిగా అకౌంటెంట్‌ జనరల్‌ పదవిని ఏర్పాటుచేశారు. 1919 నాటి మాంటేగ్‌ ఛెమ్స్‌ఫర్డ్‌ సంస్కరణల చట్టం ద్వారా బ్రిటిష్‌ ప్రభుత్వం ‘కాగ్‌’కు చట్టబద్ధత కల్పించింది.

    1949, మే 30న డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ రాజ్యాంగ పరిషత్‌లో ప్రసంగిస్తూ కాగ్‌ పదవి గురించి కింది విధంగా పేర్కొన్నారు.

    ‘పార్లమెంటు ఆమోదించే వ్యయాలు పరిధిని దాటుతున్నాయా, మార్పు చేర్పులేమైనా చోటుచేసుకున్నాయా అనే విషయాన్ని పరిశీలించే కాగ్‌ భారత రాజ్యాంగంలోనే అత్యంత ముఖ్యమైన అధికారి. ఆ అధికారి నిర్వహించే విధులు న్యాయాధికారి విధుల కంటే ముఖ్యమైనవి’.

    రాజ్యాంగ రూపకల్పన సమయంలో ‘ఆడిటర్‌ జనరల్‌’ పదవిని మాత్రమే పేర్కొన్నారు. టి.టి కృష్ణమాచారి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని అనుసరించి ‘కంప్ట్రోలర్‌’ పదాన్ని చేర్చారు.

రాజ్యాంగంలో ..

    భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్‌ 148 నుంచి 151 మధ్య కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ పదవి గురించి వివరించారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన ప్రారంభంలో ఈ పదవిని Comptroller accountant and auditor general (CAAG)గా వ్యవహరించేవారు. 1976లో accounts  విభాగాన్ని దీని నుంచి వేరుచేశారు.

ఆర్టికల్‌ 148: సాధారణంగా Indian Audit and accounts servies (IAAS)లో పదేళ్లకుపైగా అనుభవం ఉండి ప్రభుత్వ కార్యకలాపాల్లో నిష్ణాతుడైన వ్యక్తిని కాగ్‌గా నియమిస్తారు.

ఆర్టికల్‌ 148(1): రాష్ట్రపతి స్వయంగా సంతకం చేసిన, అధికార ముద్ర గల అధిపత్రం ద్వారా కాగ్‌ను నియమిస్తారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలోనే ఇతడిని తొలగించాలి.

ఆర్టికల్‌ 148(2): కాగ్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్రపతి లేదా రాష్ట్రపతి నియమించిన అధికారి సమక్షంలో 3వ షెడ్యూల్‌లో పేర్కొన్న విధంగా ప్రమాణం చేస్తారు.

    ‘‘శాసనం ద్వారా ఏర్పడిన భారత రాజ్యాంగం పట్ల యదార్థ శ్రద్ధానిష్ఠలను కలిగి ఉంటాను, దేశ సార్వభౌమత్వాన్ని, అఖండతను సమర్థిస్తాను, భావరాగ ద్వేషాలకు అతీతంగా బాధ్యతలు నిర్వహిస్తాను, రాజ్యాంగాన్ని, చట్టాలను నిలబెడతాను’’ అని ప్రమాణం చేస్తారు.

    రాజ్యాంగబద్ధ సంస్థల అధికారుల్లో కాగ్‌ మాత్రమే ఈ విధంగా ప్రమాణం చేస్తారు.
ఆర్టికల్‌ 148(3): కాగ్‌ సర్వీసు నిబంధనలు, జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానమైన వేతనాన్ని పొందుతారు. వీరి పదవీకాలం 6 సంవత్సరాలు లేదా 65 ఏళ్ల వయసు వరకు.

ఆర్టికల్‌ 148(4): కాగ్‌గా పనిచేసిన వ్యక్తి పదవీ విరమణ అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి పదవీ చేపట్టరాదు.

ఆర్టికల్‌ 148(5): రాష్ట్రపతి కాగ్‌ను సంప్రదించిన తర్వాతే Indian audit and accounts department లోని ఉద్యోగుల నియామక నిబంధనలను రూపొందిస్తారు.

ఆర్టికల్‌ 148(6): కాగ్‌కు సంబంధించిన నిర్వహణ ఖర్చులు, జీతభత్యాలు, పెన్షన్‌ లాంటివి భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

ఆర్టికల్‌ 149: పార్లమెంటు నిర్ణయించిన అధికార విధులను కాగ్‌ నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన చట్టాన్ని భారత పార్లమెంటు 1971లో రూపొందించింది.

ఆర్టికల్‌ 150: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జమాఖర్చులు కాగ్‌ సలహాపై రాష్ట్రపతి నిర్ణయించిన నమూనాలో ఉండాలి.

ఆర్టికల్‌ 151: కాగ్‌ వార్షిక నివేదికను జాతీయస్థాయిలో రాష్ట్రపతికి, రాష్ట్రాల్లో సంబంధిత రాష్ట్ర గవర్నర్లకు సమర్పిస్తారు.

ఇప్పటివరకు కాగ్‌గా వ్యవహరించినవారు  
 

            కాగ్‌        పదవీకాలం
నరహరిరావు  1948 - 1954
ఎ.కె.చందా    1954 - 1960
ఎ.కె.రాయ్‌  1960 - 1966
ఎస్‌.రంగనాథన్‌ 1966 - 1972
ఎ.భక్షి  1972 - 1978
జి.ప్రకాష్‌    1978 - 1984
టి.ఎస్‌.చతుర్వేది    1984 - 1990
సి.జి.సోమయ్య  1990 - 1996
వి.కె.షుంగ్లూ  1996 - 2002
వి.ఎన్‌.కౌల్‌  2002 - 2008
వినోద్‌రాయ్‌      2008 - 2013
శశికాంత్‌ శర్మ 2013 - 2017
రాజీవ్ మ‌హ‌ర్షి 2017 - 2020
జి.సి. ముర్ము 2020  ప్ర‌స్తుతం

                

 భారత రాజ్యాంగం సృష్టించిన అత్యంత శక్తిమంతమైన పదవి కాగ్‌’.  - డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌

‘కాగ్‌ ప్రభుత్వానికి బాధ్యత వహించదు కానీ తన నివేదికల్లో ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ కాగ్‌కు ఉంది’. - జవహర్‌లాల్‌ నెహ్రూ

‘కాగ్‌కు తన ఆఫీసు సిబ్బందిపై ఎలాంటి పరిపాలనాపరమైన నియంత్రణ ఉండదు. అందుకే కాగ్‌ను very much alone wolfeగా పేర్కొనవచ్చు’. -సర్‌ఫ్రాంక్‌ ట్రైబ్‌
అధికారాలు - విధులు

* భారత సంఘటిత నిధి, రాష్ట్రాల సంఘటిత నిధి, విధానసభ కలిగిన కేంద్రపాలిత ప్రాంతాల జమా ఖర్చులను ఆడిట్‌ చేయడం.

*  ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వ్యాపారం, ఉత్పత్తి, లాభనష్టాల లెక్కలను తనిఖీ చేయడం.

*  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఆర్థిక సాయం పొందుతున్న అన్ని అధికార సంస్థలు, ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్ల వ్యయాల తీరును పరిశీలించడం.

*  కేంద్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సంబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌లను రాష్ట్రపతికి సమర్పిస్తారు. రాష్ట్రపతి వాటిని పార్లమెంటుకు అందజేస్తారు.

*  రాష్ట్ర ప్రభుత్వ జమా ఖర్చులకు సబంధించిన ఆడిట్‌ రిపోర్ట్‌లను కాగ్‌ గవర్నర్‌కు సమర్పిస్తే, గవర్నర్‌ వాటిని రాష్ట్ర శాసనసభకు అందజేస్తారు.

*  రుణాలు, క్షీణోపాంత నిధులు, డిపాజిట్లు, అడ్వాన్సులు, చెల్లింపుల వర్తకం లాంటి వ్యవహారాలకు సంబంధించిన కేంద్ర, రాష్ట్ర లావాదేవీలను ఆడిట్‌ చేస్తారు.

* కాగ్‌ రాష్ట్రపతికి సమర్పించే ఆడిట్‌ నివేదికలు 3 రకాలు 

       1) వినియోగ ఖాతాల నివేదిక
       2) ఆర్థిక ఖాతాల నివేదిక
       3) ప్రభుత్వ అధీన సంస్థల నివేదిక
*  రాబడులు, విక్రయం, నిల్వలు లాంటి వ్యవహారాల కంటే వ్యయానికి సంబంధించిన ఆడిట్‌లో కాగ్‌కు ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది.

*  ప్రభుత్వ వ్యయంలో వివేకం, శ్రద్ధ, మిత వ్యయం లాంటి మంచి లక్షణాలు; వ్యర్థం, దుబారా లాంటి చెడు లక్షణాల గురించి కాగ్‌ వ్యాఖ్యానిస్తారు.

*  భారత రాజ్యాంగంలో కాగ్‌ను కంప్ట్రోలర్, ఆడిటర్‌ జనరల్‌గా పరిగణించినప్పటికీ ఆచరణలో కేవలం ఆడిటర్‌ జనరల్‌గానే వ్యవహరిస్తున్నారు.

*  బ్రిటన్‌లో కాగ్‌ కంప్ట్రోలర్‌గా, ఆడిటర్‌ జనరల్‌గా ఉంటారు. ఆయన అనుమతితోనే ప్రభుత్వ ఖజానా నుంచి కార్యనిర్వాహకవర్గం నగదును డ్రా చేస్తుంది. 

* మనదేశంలో ఉన్న సుమారు 1400 కార్పొరేషన్ల ఖాతాలను కాగ్‌ తనిఖీ చేస్తుంది.

*  కాగ్‌ నివేదికను కొందరు ‘శవపంచనామా’గా పేర్కొంటారు.

*  కాగ్‌ సమర్పించిన నివేదికలను ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ రంగ సంస్థల సంఘం సమీక్షిస్తాయి. ప్రభుత్వ ఖాతాల సంఘానికి కాగ్‌ను తత్వవేత్తగా, స్నేహితుడిగా, మార్గదర్శకుడిగా వ్యవహరిస్తారు.

ఇతర ముఖ్యాంశాలు

*  భారతదేశంలోని స్థానిక స్వపరిపాలనా సంస్థలను కూడా కాగ్‌ పరిధిలోకి తీసుకురావాలని కాగ్‌ అధికారిగా వ్యవహరించిన వినోద్‌రాయ్‌ సూచించారు. ఈయన ఐక్యరాజ్య సమితి ఎక్స్‌టర్నల్‌ ఆడిటర్స్‌ ప్యానల్‌ ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌