• facebook
  • whatsapp
  • telegram

కార్బోహైడ్రేట్లు

      కార్బన్, నీటి సంయోగ పదార్థాలు కార్బోహైడ్రేట్‌లు. వీటి సాధారణ ఫార్ములా CX(H2O)Y. రుచి ఆధారంగా కార్బోహైడ్రేట్‌లను చక్కెరలు, చక్కెరలుకానివి (Non Sugars) అని రెండు రకాలుగా విభజించవచ్చు. చక్కెరలు రుచికి తియ్యగా ఉంటాయి. ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, సుక్రోజ్ మొదలైనవి. చక్కెరలన్నింటిలోకి ఫ్రక్టోజ్‌కు అధిక తియ్యదనం ఉంటుంది. పండిన పండ్లు ఎక్కువ తీపిగా ఉండటానికి ఇదే కారణం.

   చక్కెర కంటే శాకరీన్ అనే పదార్థం 600 రెట్లు తియ్యగా ఉంటుంది. అయితే ఇది చక్కెరలా శరీరానికి శక్తిని ఇవ్వకపోగా ఆరోగ్యానికి హాని చేస్తుంది.
      చక్కెరలుకాని కార్బోహైడ్రేట్‌లకు రుచి ఉండదు. ఉదా: సెల్యులోజ్, పిండిపదార్థం (స్టార్చి). జల విశ్లేషణం చెందే స్వభావం ఆధారంగా కార్బోహైడ్రేట్‌లను కింది మూడు రకాలుగా విభజిస్తారు.
     ఎ) మోనోశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది ఇంకా చిన్న కార్బోహైడ్రేట్‌లను ఏర్పరచవు. ఉదా: గ్లూకోజ్, ఫ్రక్టోజ్, మానోజ్ మొదలైనవి.
     బి) డైశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది రెండు మోనో శాకరైడ్‌లను ఏర్పరుస్తాయి. ఉదా. సుక్రోజ్, లాక్టోజ్, మాల్టోజ్ మొదలైనవి.
     సి) పాలిశాకరైడ్‌లు: ఇవి జల విశ్లేషణం చెంది అత్యధిక సంఖ్యలో మోనో శాకరైడ్‌లను ఏర్పరుస్తాయి. ఉదా. సెల్యులోజ్, పిండిపదార్థం మొదలైనవి.

చక్కెర పరిశ్రమ
         చెరకు నుంచి తయారయ్యే చక్కెర రూపం సుక్రోజ్. దీనిని సాధారణంగా టేబుల్ షుగర్ లేదా చక్కెర అని వ్యవహరిస్తాం. చెరకు గడలను క్రషింగ్ చేసినప్పుడు చెరకు రసం వస్తుంది. ఇలా ఏర్పడిన చెరకు పిప్పిని 'బగాసే' అంటారు. దీనిని కాగితం తయారీలో, విద్యుత్ ఉత్పత్తికి ఇంధనంగా ఉపయోగిస్తారు.
     చెరకు రసంలో ఆమ్లత్వం ఉంటుంది. దీనిని తొలగించ డానికి సున్నం Ca(OH)2 కలుపుతారు.
ఈ ప్రక్రియను డిఫకేషన్ అంటారు. ఆ తర్వాత ద్రావణంలో ఎక్కువైన సున్నాన్ని తొలగించడానికి దానిలోకి దివీ2 వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను కార్బొనేషన్ అంటారు. ఇంకా మిగిలిన సున్నం అవశేషాలను తొలగించడానికి CO2 వాయువును పంపుతారు. ఈ ప్రక్రియను సల్ఫిటేషన్ అంటారు. డిఫకేషన్, కార్బొనేషన్, సల్ఫిలేటషన్‌ల వల్ల ఏర్పడిన అవక్షేపాలను ప్రెస్‌మడ్ అని పిలుస్తారు. ఇది ఎరువుగా ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఏర్పడిన పారదర్శక రసాన్ని బాష్పీకరణ యంత్రాల్లో ఇగిర్చినప్పుడు చక్కెర స్ఫటికాలు ఏర్పడతాయి. 

ఆల్కహాల్ పరిశ్రమ
         
ఇథైల్ ఆల్కహాల్‌ను సాధారణంగా ఆల్కహాల్ అని వ్యవహరిస్తారు. మధుపానంలో మత్తును కలిగించేది ఇదే. అందుకే దీనిని 'స్పిరిట్ ఆఫ్ వైన్' అంటారు. చెరకు రసం నుంచి చక్కెర వేరుచేయగా మిగిలిన చిక్కని జేగురురంగు మాతృ ద్రావణాన్ని మొలాసిస్ అంటారు. దీనిలో 50 శాతం చక్కెర ఉంటుంది. మొలాసిస్‌కు ఈస్ట్‌ను కలిపి కిణ్వప్రక్రియ జరిపినప్పుడు ఇథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది.
       మొలాసిస్‌ను నీటితో విలీనంచేసి సజల సల్ఫ్యూరిక్ ఆమ్లం కలిపి pH నాలుగు ఉండేలా చేస్తారు. ఈ దశలో ఈస్ట్‌ను కలుపుతారు. ఈస్ట్‌కు ఆహారంగా అమోనియం సల్ఫేట్, అమోనియం పాస్ఫేట్ కలుపుతారు. ఈ ద్రావణాన్ని కలియబెట్టి 30ºC నది వద్ద 2-3 రోజులు ఉంచినప్పుడు కిణ్వప్రక్రియ జరుగుతుంది. ఈస్ట్‌లో ఇన్వర్టేజ్, జైమేజ్ అనే ఎంజైమ్‌లు ఉంటాయి. ఇన్వర్టేజ్ ఎంజైమ్ చక్కెరను గ్లూకోజ్, ఫ్రక్టోజ్‌లుగా జల విశ్లేషణం చేస్తుంది.

      ఈ దశలో ఏర్పడిన 15 శాతం ఆల్కహాల్‌ను 'వాష్' అని పిలుస్తారు. దీనిని అంశిక స్వేదనం చేసినప్పుడు 96% ఆల్కహాల్ ఏర్పడుతుంది. దీనిని రెక్టిఫైడ్ స్పిరిట్ లేదా పారిశ్రామిక ఆల్కహాల్ అంటారు. దీనికి కాల్చిన సున్నం CaO కలిపి మిగిలిన నీటిని తొలగిస్తే 100 శాతం ఆల్కహాల్ ఏర్పడుతుంది. దీనిని అబ్సల్యూట్ ఆల్కహాల్ అంటారు. శుద్ధ ఆల్కహాల్‌ను తాగడానికి వినియోగించకుండా ఉండేందుకు దానిలో మిథైల్ ఆల్కహాల్ లేదా పిరిడీన్ కలుపుతారు. దీనిని అసహజ స్పిరిట్ (Denatured Spirit) అంటారు. కల్తీ సారాయిలో మిథైల్ ఆల్కహాల్ కలిసుండటం వల్ల కంటిచూపు పోయి మరణం సంభవిస్తుంది. కల్తీ కల్లులో క్లోరాల్ హైడ్రేట్ లేదా డైజిపామ్ కలిపి ఉంటుంది.  

 

ముడిపదార్థం     

తయారయ్యే మద్యం

ఆల్కహాల్ శాతం

    బార్లీ       బీరు

   3 - 6%

   ఆపిల్     సైడర్    

    2 - 6%

   ద్రాక్ష

    బ్రాంది

      40 - 45%

 మొలాసిస్      రమ్

  45 - 55%

    మాల్ట్

  

      విస్కీ

  35 - 40%

   మొక్కజొన్న

      జిన్

  40 - 45%




 

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌