• facebook
  • whatsapp
  • telegram

పరమాణు నిర్మాణం

      పదార్థం పరమాణువుల, అణువుల సమ్మిళితం అని మొదట చెప్పిన భారతీయ తత్త్వవేత్త కణాదుడు. పరమాణు సిద్ధాంతాన్ని మొదట ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జాన్ డాల్టన్ (1808). ఈ సిద్ధాంతం ప్రకారం వేర్వేరు మూలకాల పరమాణువుల కలయిక వల్ల ఏర్పడే కొత్త కణాలను సంయోగ పరమాణువులు అంటారు. పరమాణు సిద్ధాంతం ప్రకారం రసాయన చర్యలో పాల్గొనే సూక్ష్మకణం పరమాణువు. పరమాణువుకు ఉండే మూడు ముఖ్యమైన ప్రాథమిక కణాలు- ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్.

ఎలక్ట్రాన్ ఆవిష్కరణ
¤   ఉత్సర్గ నాడీ ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త విలియం క్రూక్స్ (1878).
¤   కాథోడ్ కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త జె.జె.థామ్స (1897).
¤   కాథోడ్ కిరణాలను రుణ కిరణాలు అంటారు.
¤   రుణ కిరణాలు జనించడానికి కావాల్సిన అనుకూల పరిస్థితులు-
       ఎ)  10,000 వోల్టుల విద్యుత్         బి) 0.01 మి.మీ. పీడనం
¤   రుణ కిరణాలు కాథోడ్ కిరణ ప్రయోగంలో జింక్‌సల్ఫైడ్ తెరపై పడినప్పుడు వాటిని గుర్తించారు.
¤   రుణ కిరణాలు ప్రయాణం చేసే మార్గం సరళరేఖ.
¤   రుణ కిరణాలు విద్యుత్ క్షేత్రంలో ఆనోడ్ వైపు వంగుతాయి.
¤   రుణ కిరణాలు అయస్కాంత క్షేత్రంలో ఉత్తర ధృవం వైపు వంగుతాయి.
¤   రుణ కిరణాల్లో ముఖ్యంగా ఉండే మూలకణాలు ఎలక్ట్రాన్లు.
¤   ఎలక్ట్రాన్‌ను కనుగొన్న శాస్త్రవేత్త జె.జె.థాంసన్.
¤   రుణ కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టిన శాస్త్రవేత్త జి.జె.స్టోనీ.
¤   ఎలక్ట్రాన్‌కు ఉండే ఆవేశం 1.602 × 10 -19 కూలుంబులు.
¤   ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి: 9.0 × 10 -28 గ్రాములు.

ప్రోటాన్ ఆవిష్కరణ
¤  ధన కిరణాల ప్రయోగం జరిపిన శాస్త్రవేత్త గోల్డ్‌స్టీన్.
¤  ఈ కిరణాలను కెనాల్ కిరణాలు అనీ అంటారు.
¤  ధన కిరణాలు వెలువడటానికి అనుకూల పరిస్థితులు-
        ఎ)  10,000 వోల్టుల విద్యుత్తు               బి)   0.01 మి.మీ. పీడనం.
¤  ఈ కిరణాలు విద్యుత్ క్షేత్రంలో రుణ ధృవం ఎలక్ట్రోడ్ వైపు వంగుతాయి.
¤  ఈ కిరణాలు అయస్కాంత క్షేత్రంలో దక్షిణధృవం వైపు ఆకర్షితమవుతాయి.
¤  ధన కిరణాల్లో అతి సూక్ష్మమైన కణాన్ని ప్రోటాన్ అంటారు.
¤   ప్రోటాన్ ఆవేశం: 1.602 × 10-19 కూలుంబులు.
¤   ప్రోటాన్ ద్రవ్యరాశి విలువ: 1.672 × 10-24 గ్రాములు.
¤  ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు ఉంటుంది.

న్యూట్రాన్ ఆవిష్కరణ
¤  న్యూట్రాన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త: జేమ్స్ చాడ్విక్ (1932).
¤  బెరీలియంపై ఆల్ఫాకణాల తాడనం జరిపినప్పుడు కనుక్కున్న ప్రాథమిక కణం న్యూట్రాన్.
¤  న్యూట్రాన్ ఆవేశం విలువ సున్నా లేదా తటస్థం.
¤  న్యూట్రాన్ ద్రవ్యరాశి విలువ: 1.675 × 10-24 గ్రాములు.
¤  ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‌లలో ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నది న్యూట్రాన్.
¤  విద్యుత్ క్షేత్రంలో విచలనం లేకుండా చలించే కణం న్యూట్రాన్.

పరమాణు కేంద్రకం ఆవిష్కరణ
¤  ఆల్ఫాకిరణ విక్షేపణ ప్రయోగం జరిపిన శాస్త్రవేత్త ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ (1911).
¤  ఆల్ఫాకణం అంటే హీలియం పరమాణువు కేంద్రకం.
¤  ఆల్ఫా కణానికి 2 యూనిట్ల ధనావేశం, 4 యూనిట్ల ద్రవ్యరాశి ఉంటుంది.
¤  రూథర్‌ఫర్డ్ ఉపయోగించిన బంగారు రేకు మందం: 0.00004 సెం.మీ.
¤  బంగారు రేకు ప్రయోగం మనకు తెలిపిన 3 విషయాలు: 1) పరమాణువులో అధిక భాగం ఖాళీస్థలం;
2) పరమాణువులో ధనావేశం అంతా దాని మధ్యలో ఉన్న కేంద్రకంలో ఉంటుంది;
3)  పరమాణువుతో పోలిస్తే కేంద్రకం పరిమాణం చాలా చిన్నది.
¤   ఈ ప్రయోగం ఆధారంగా నిర్ణయించిన పరమాణు కేంద్రకం వ్యాసార్థం: 10-13 సెం.మీ.

పరమాణు సంఖ్య - ద్రవ్యరాశి సంఖ్య
¤   పరమాణువు కేంద్రకంలో ఉండే ప్రోటాన్‌ల సంఖ్యను పరమాణు సంఖ్య ( Z ) అంటారు.
¤  పరమాణువు కేంద్రకంలోని ప్రోటాన్‌లు, న్యూట్రాన్‌ల మొత్తం సంఖ్యను పరమాణు ద్రవ్యరాశిసంఖ్య (A) అంటారు.
¤   పరమాణువు ద్రవ్యరాశి సంఖ్య A, పరమాణు సంఖ్య Z అయినప్పుడు ఆ పరమాణువులోని న్యూట్రాన్‌ల సంఖ్యకు ఫార్ములా: A - Z.

థామ్సన్ నమూనా
¤  పరమాణువుకు మొట్టమొదటి నమూనాను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త జె.జె.థామ్సన్ (1903).
¤  థామ్సన్ నమూనాను పుచ్చకాయ నమూనా అని కూడా అంటారు.
¤  ఈ నమూనాలో పరమాణువులోని ధనావేశాన్ని పుచ్చకాయలోని గుజ్జుతో పోల్చారు.
¤  ఈ నమూనాలో పరమాణువులోని రుణావేశాన్ని పుచ్చ కాయలోని గింజలతో పోల్చారు.
¤  థాంసన్ నమూనాలో ముఖ్యమైన లోపం ఏమిటంటే ఇది విద్యుదయస్కాంత సిద్ధాంతానికి వ్యతిరేకం.

రూథర్‌ఫర్డ్ నమూనా
¤  రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాను కేంద్రక నమూనా లేదా గ్రహమండల నమూనా లేదా సూర్య కుటుంబ నమూనా అంటారు.
¤   దీని ప్రకారం పరమాణువు కేంద్రకంలో ఉండే కణాలను న్యూక్లియాన్లు అంటారు.
¤   న్యూక్లియాన్లు అంటే : ప్రోటాన్లు, న్యూట్రాన్లు.
¤   పరమాణు పరిమాణాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఆంగ్‌స్ట్రామ్ (10-8 సెం.మీ.).
¤   పరమాణు కేంద్రకం పరిమాణాలను కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఫెర్మి (10-13 సెం.మీ.)
¤   పరమాణువు సగటు పరిమాణం దాని కేంద్రకం పరిమాణంతో పోల్చినప్పుడు 105 రెట్లు పెద్దది.
¤  రూథర్‌ఫర్డ్ నమూనా ప్రకారం పరమాణువులోని కేంద్రకం, దాని చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల మధ్య ఉండే బలాలు-  
     1) కేంద్రకం ఆకర్షణ           2)  ఎలక్ట్రాన్‌ల అపకేంద్ర బలం.
¤   రూథర్‌ఫర్డ్ నమూనాలో ముఖ్యమైన లోపాలు:
     1) పరమాణు స్థిరత్వం వివరించలేకపోవడం.      2) పరమాణువుల రేఖావర్గ పటాలను వివరించలేకపోవడం.

క్వాంటం సిద్ధాంతం
¤   దీనిని ప్రతిపాదించిన శాస్త్రవేత్త మాక్స్‌ప్లాంక్ (1900).
¤   విద్యుదయస్కాంత వికిరణంలో కాంతి శోషణం, ఉద్గారాలను వివరించగలిగిన సిద్ధాంతం క్వాంటం సిద్ధాంతం.
¤   ఈ సిద్ధాంతంలో కాంతి వికిరణాలు చిన్న ప్యాకెట్ల రూపంలో ఉంటాయి. వాటిని క్వాంటా అంటారు.
¤  ప్లాంక్ సమీకరణం E = hv (ఇక్కడ E = వికిరణ శక్తి; h = ప్లాంక్ స్థిరాంకం; v = వికిరణ పౌనఃపున్యం)
¤   ప్లాంక్ స్థిరాంకం విలువ ఎర్గ్‌లలో:  h =  6.625 × 1027
¤   ప్లాంక్ స్థిరాంకం విలువ జౌల్‌లలో: h = 6.625 × 1034
¤   క్వాంటం సిద్ధాంతం కృష్ణ వస్తువు వికిరణాలను విజయవంతంగా వివరించింది.

బోర్స్ పరమాణు నమూనా
¤  బోర్ పరమాణు నమూనాను ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ఆధారంగా ప్రతిపాదించారు.
¤  పరమాణువు కేంద్రకం చుట్టూ నిర్దిష్టమార్గంలో ఎలక్ట్రాన్‌లు తిరిగే వాటిని కక్ష్యలు లేదా కర్పరాలు అంటారు.
¤  ప్రతి కక్ష్యకు నియమిత శక్తి ఉన్నందువల్ల వాటిని శక్తిస్థాయులు అంటారు.
¤  ఒక కక్ష్యలో తిరుగుతున్నంతసేపు ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించలేదు లేదా కోల్పోదు కాబట్టి ఆ కక్ష్యలను స్థిర కక్ష్యలు అంటారు.
¤  బోర్ నమూనా ప్రకారం కక్ష్య సంఖ్య పెరిగే కొద్దీ కక్ష్య సైజు పెరుగుతుంది. పై కక్ష్య నుంచి ఎలక్ట్రాన్ కింది కక్ష్యలోకి దూకినప్పుడు ఉద్గారం అయ్యే శక్తి: 
      ...E = E2 - E1 = hv. ఇక్కడ E2 = పై కక్ష్య శక్తి విలువ, E1= కింది కక్ష్య శక్తి విలువ, h = ప్లాంక్ స్థిరాంకం, 
v = ఉద్గార వికిరణ పౌనఃపున్యం
¤  స్థిర కక్ష్యలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్యవేగం h/2¶ కు పూర్ణాంకంగా ఉంటుంది.
¤  స్థిర కక్ష్యలలో తిరిగే ఎలక్ట్రాన్ కోణీయ ద్రవ్య వేగం (mvr) విలువ nh/2¶ కు సమానం.
¤  1922లో నీల్స్ బోర్ (డెన్మార్క్) కు నోబెల్ బహుమతి లభించింది.

బోర్ నమూనా గొప్పదనం: ఇది హైడ్రోజన్ పరమాణు వర్గపటంతోపాటు He+, Li2+, Be3+ అయాన్‌ల వర్గ పటాలను కూడా వివరించింది.
లోపాలు: బోర్ నమూనా వివరించలేకపోయిన వర్గపటాలు He, Li, Be, B,  etc., పరమాణువులకు చెందినవి.
¤  ఈ నమూనా వివరించలేనిది జీమన్ ఫలితం.
¤  అయస్కాంత క్షేత్రంలో వర్గపటరేఖలు చిన్న చిన్న సూక్ష్మ రేఖలుగా విడిపోవడాన్ని జీమన్ ఫలితం అంటారు.
¤  విద్యుత్ క్షేత్రంలో వర్గపటరేఖల సూక్ష్మ విభజనను స్టాల్క్ ఫలితం అంటారు.
¤  బోర్ నమూనా ఇంకా వివరించలేని విషయాలు:
            1) కోణీయ ద్రవ్య వేగం క్వాంటీకరణం చెందడం         2) రసాయన బంధాలు ఏర్పడటం.

సోమర్ ఫీల్డ్ నమూనా
¤  ఈ నమూనాను పరమాణువు చెందిన సూక్ష్మవర్గపటాలను వివరించడానికి ప్రవేశపెట్టారు.
¤  పరమాణు నమూనాల్లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలను ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త సోమర్ ఫీల్డ్.
¤  ఈ నమూనా ప్రకారం పరమాణువులోని మొత్తం కక్ష్యల సంఖ్య 'n' అయితే వాటిలో ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యల సంఖ్య  (n-1)
¤  సోమర్ ఫీల్డ్ నమూనా జీమన్ ఫలితాన్ని వివరించలేకపోయింది.

ఎలక్ట్రాన్ కక్ష్య - ఆర్బిటాల్ 
¤  పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ తిరిగే వృత్తాకార మార్గాన్ని కక్ష్య అంటారు.
¤  పరమాణు కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్‌ను కనుగొనే సంభావ్యత గరిష్ఠంగా ఉండే ప్రదేశం ఆర్బిటాల్.
¤  ఒక ఆర్బిటాల్‌లో ఎలక్ట్రాన్‌ను కనుగొనే సంభావ్యత శాతం 95º/º
¤  ఆర్బిటాళ్లలో ఉన్న నాలుగు రకాలు: s, p, d, f.
¤  's' ఆర్బిటాల్ గోళాకృతిలో ఉంటుంది.
¤  s, p, d, f ఆర్బిటాళ్లలో 's' దిశ లేని ఆర్బిటాల్
¤  'p' ఆర్బిటాల్ ముద్గరం లేదా డంబెల్ ఆకృతిలో ఉంటుంది.
¤  'p' ఆర్బిటాల్‌లలోని 3 రకాలు px, py, pz.
¤  రెండు 'p' ఆర్బిటాళ్ల మధ్య ఉండే కోణం విలువ 90º.
¤  px, py, pz ఆర్బిటాళ్లు వరుసగా x, y, z అక్షాలపై విస్తరించి ఉంటాయి.
¤  'd' ఆర్బిటాల్ ఆకృతి ద్విముద్గరం లేదా డబుల్ డంబెల్.
¤  'f' ఆర్బిటాళ్లకు సంక్లిష్ట ఆకృతులు ఉంటాయి.

క్వాంటం సంఖ్యలు
¤  పరమాణువులోని ఎలక్ట్రాన్ స్థితి, స్థానాన్ని తెలియజేసేవి క్వాంటం సంఖ్యలు.
¤  పరమాణువులోని ఎలక్ట్రాన్ పూర్తి స్థితి, స్థానాన్ని తెలియజేయడానికి కావలసిన క్వాంటం సంఖ్యలు n, l, m, s. 
¤  ప్రధాన క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త నీల్స్‌బోర్.
¤  ప్రధాన క్వాంటం సంఖ్య ఎలక్ట్రాన్ ఉండే కక్ష్యసైజు, శక్తి విలువలను సూచిస్తుంది.
¤  ఎజిముతల్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించింది సోమర్ ఫీల్డ్.
¤  ఎజిముతల్ క్వాంటం సంఖ్య (l) సూచించేది పరమాణువులో ఎలక్ట్రాన్ ఉండే ఉప కక్ష్య.
¤  ఈ క్వాంటం సంఖ్య ఆర్బిటాల్ ఆకృతిని తెలుపుతుంది.
¤  అయస్కాంత క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్త లాండే.
¤  ఈ క్వాంటం సంఖ్య సూచించేది పరమాణువులో ఎలక్ట్రాన్ ఉండే ఆర్బిటాల్.
¤  ఎజిముతల్ క్వాంటం సంఖ్య తెలియజేసేది ఆర్బిటాల్ లోని ఎలక్ట్రాన్ ద్విగ్విన్యాసం.
¤  స్పిన్ క్వాంటం సంఖ్యను ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఉలెన్‌బెక్, గౌడ్ ష్మీట్.
¤  ఆర్బిటాల్‌లోని ఎలక్ట్రాన్ ఆత్మ భ్రమణాన్ని సూచించేది స్పిన్‌క్వాంటం సంఖ్య.
¤  స్పిన్‌క్వాంటంసంఖ్య కలిగి ఉండే విలువలు + ½, - ½.

ఆర్బిటాళ్లలో ఎలక్ట్రాన్‌ల అమరిక 
¤ ఒక కక్ష్య సంఖ్య 'n' అయినప్పుడు ఆ కక్ష్యలోని ఎలక్ట్రాన్‌ల సంఖ్య 2n2. ఉదాహరణకు 1, 2, 3, 4 కక్ష్యల్లో వరుసగా 2, 8, 18, 32 లక్ట్రానులు ఉంటాయి.
¤  ఒక కక్ష్య సంఖ్య 'n' అయినప్పుడు ఆ కక్ష్యలోని ఉపస్థాయిల సంఖ్య n. ఉదాహరణకు 1, 2, 3, 4 కక్ష్యల్లో వరుసగా 1, 2, 3, 4 ఉపస్థాయిలు ఉంటాయి.
¤ ఒక కక్ష్య సంఖ్య 'n' అయినప్పుడు ఆ కక్ష్యలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్య n2. ఉదాహరణకు 1, 2, 3, 4 కక్ష్యల్లో వరుసగా 1, 4, 9, 16 ఆర్బిటాళ్లు ఉంటాయి.
¤  ఒక ఉపస్థాయిలో ఉండే ఆర్బిటాళ్ల సంఖ్యకు ఫార్ములా: (2l +1) ఉదాహరణకు s, p, d, f ఉపస్థాయిలలో వరుసగా 1, 3, 5, 7 ఆర్బిటాళ్లు ఉంటాయి.
¤  ఒక ఉపస్థాయిలో ఉండే ఎలక్ట్రాన్‌ల సంఖ్యకు ఫార్ములా: 2 (2l+1) ఉదాహరణకు s, p, d, f ఉప స్థాయిలలో వరుసగా 2, 6, 10, 14 ఎలక్ట్రాన్‌లు అమరి ఉంటాయి.

చాలాకాలం నుంచి పదార్థ నిర్మాణం, మౌలిక కణాల గురించి రకరకాల ప్రతిపాదనలు, సిద్ధాంతాలు వెలువడ్డాయి. భారతదేశంలో వేదకాలంలోనే కణాదుడు అనే మహర్షి పదార్థం అతి సూక్ష్మ కణాలైన అణు, పరమాణువుల సమ్మిళితమని ప్రతిపాదించాడు.
* తర్వాత డెమోక్రటిస్ అనే గ్రీకు తత్వవేత్త పదార్థం అతి సూక్ష్మమైన పరమాణువులను (Atoms) కలిగి ఉంటుందని ప్రతిపాదించాడు. గ్రీకు భాషలో Atom అంటే విభజించేందుకు వీలు కానిది అని అర్థం.
* జాన్ డాల్టన్ అనే శాస్త్రజ్ఞుడు క్రీ.శ.1808లో డాల్టన్ పరమాణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.


ముఖ్యాంశాలు
i) పదార్థంలో పరమాణువులనే కణాలు ఉంటాయి. ఇవి విభజించేందుకు వీలుకాని సూక్ష్మాతి సూక్ష్మమైనవి.
ii) ఒక మూలకానికి చెందిన పరమాణువులన్నీ ఒకే రకంగా ఉంటాయి. అన్ని ధర్మాల్లోనూ ఒకేరకంగా ప్రవర్తిస్తాయి.
ii) వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువులన్నీ భిన్నరీతుల్లో ధర్మాలను ప్రవర్తిస్తాయి.
iv) ఒకే మూలకానికి చెందిన పరమాణువులు లేదా వేర్వేరు మూలకాలకు చెందిన పరమాణువులు కలిసి కొత్త రకమైన కణాలను ఇస్తాయి. వీటినే సమ్మేళన లేదా సంయోగ పరమాణువులు అంటారు.
v) పదార్థపు కణాల్లో కేవలం పరమాణువులు మాత్రమే రసాయనిక చర్యల్లో పాల్గొంటాయి.
* 20వ శతాబ్దంలోని పరిశోధనల ఫలితాలు పరమాణువును విభజించడానికి వీలవుతుందని వెల్లడించాయి. పరమాణువులో ఎన్నో మౌలిక కణాలున్నాయని కనుక్కున్నప్పటికీ, ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అతి ముఖ్యమైన మౌలిక కణాలని నిర్ధారించారు.
* పరమాణు నిర్మాణాన్ని, పరమాణువులోని మౌలిక కణాలకు సంబంధించిన విషయాలు ఇంగ్లండ్‌కు చెందిన విలియం క్రూక్స్ 1878లో జరిపిన ఉత్సర్గనాళిక ప్రయోగాల కారణంగా వెలుగులోకి వచ్చాయి.
* విద్యుత్ ఉత్సర్గనాళిక స్థూపాకారపు గాజు గొట్టంలా ఉండి రెండు చివర్లలో లోహపు విద్యుత్ ద్వారాలను, పక్కగొట్టాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఒకటి ధనవిద్యుద్వారం (Positive electrode లేదా Anode)గా, రెండోది రుణవిద్యుత్ ద్వారం (Negative elctrode లేదా Cathode)గా పని చేస్తుంది. ఈ విద్యుత్ ద్వారాలను అధిక వోల్టేజి విద్యుత్ జనకానికి (సుమారు 10,000 వోల్టులు) కలుపుతారు. ఉత్సర్గనాళికలో గాలి ఉన్నంత వరకూ ఎలాంటి మార్పు సంభవించలేదు. కాని పక్కగొట్టం నుంచి విద్యుత్ ఉత్సర్గనాళికలోని గాలిని తీసేసి పీడనాన్ని 0.001 మి.మీ.కి తగ్గించినప్పుడు ఉత్సర్గళినాక మొత్తం ఆకుపచ్చని వెలుగు కనిపిస్తుంది. ఉత్సర్గనాళికలోని మార్పులను గమనించడానికి ధన విద్యుత్ ద్వారానికి ముందు జింక్ సల్ఫైడ్ తెరను అమర్చాలి.


          


* ప్రథమంగా 1897లో జె.జె. థామ్సన్ అనే శాస్త్రవేత్త విద్యుత్ ఉత్సర్గనాళికలో ప్రకాశవంతమైన కిరణాలు రుణవిద్యుత్ ద్వారం నుంచి (Cathode) ధనవిద్యుత్ ద్వారం (Anode) వరకు ప్రయాణించడం కనుక్కుని, ఆ కిరణాలను రుణ ధృవ కిరణాలు (Cathode rays) అని నామకరణం చేశాడు. ఉత్సర్గనాళికలో ప్రయోగ పరిశీలనల ద్వారా రుణ ధృవ కిరణాల ధర్మాలు థామ్సన్ వివరించాడు.
రుణధృవ కిరణాల ధర్మాలు
i) రుణధృవ కిరణాలు రుజుమార్గం (సరళరేఖా మార్గం)లో ప్రయాణిస్తాయి.
ii) రుణధృవ కిరణాలను విద్యుత్‌క్షేత్రం ద్వారా పంపినప్పుడు అవి విద్యుత్ క్షేత్రపు ఆనోడ్ వైపుగా దిశను మార్చి చలిస్తాయి.
iii) రుణధృవ కిరణాలను అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినప్పుడు, దాని ప్రభావం వల్ల దిశను మార్చి ప్రయాణిస్తాయి.
iv) రుణధృవ కిరణాలు ప్రయాణించే దిశలో ఏదైనా వస్తువు ఉంచినట్లయితే, దాని నీడను గమనించవచ్చు.
v) రుణధృవ కిరణాలు యాంత్రిక చలనాన్ని కలగజేస్తాయి.
vi) రుణావేశ కణాల సముదాయమే రుణధృవ కిరణాలు.
vii) రుణ ధృవ కిరణ కణాల ఆవేశానికి, వాటి ద్రవ్యరాశికి (e/m) ఉన్న నిష్పత్తి ఒకేలా ఉంటుంది.
viii) తర్వాత జి.జె. స్టోనీ అనే శాస్త్రజ్ఞుడు ఈ కణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టాడు. ఈ కణం ఆవేశం
-1.602 × 10-19 కూలుంబులుగా, ద్రవ్యరాశిని 9.0 × 10-28 గ్రాములుగా నిర్ణయించారు.
* మార్పు చేసిన కాథోడ్ కిరణనాళికలో విద్యుత్ ఉత్సర్గాన్ని పంపడం ద్వారా ధనావేశంతో ఉన్న (కణాలను) కిరణాలను గోల్డ్‌స్టెయిన్ అనే శాస్త్రవేత్త గుర్తించారు. ఉత్సర్గనాళిక ప్రయోగాల్లో రంధ్రాలున్న రుణధృవ ద్వారాన్ని ఉపయోగించాడు. ఈ కిరణాలు ఆనోడ్ వైపు నుంచి కాథోడ్ దిశగా చలించడం వల్ల వీటిని ఆనోడ్ కిరణాలు (ధనధృవ కిరణాలు) లేదా కేనాల్ కిరణాలు అని పిలుస్తారు. ధనధృవ కిరణాల అతిసూక్ష్మమైన కణాన్ని 'ప్రోటాన్' అంటారు.

 

ధనధృవ (ఆనోడ్) కిరణాల ధర్మాలు
i) ఆనోడ్ కిరణాలు రుజుమార్గంలో ధనధృవం నుంచి రుణధృవం వైపుగా చలిస్తాయి.
ii) ఆనోడ్ కిరణాలను విద్యుత్ క్షేత్రం ద్వారా పంపినప్పుడు విద్యుత్‌క్షేత్రపు రుణధృవం వైపు ఆకర్షితమవుతాయి. దీని ఆధారంగా ఆనోడ్ కిరణ కణాలకు ధనావేశం ఉంటుందని గ్రహించవచ్చు.
iii) ఆనోడ్ కిరణాలను అయస్కాంత క్షేత్రం ద్వారా పంపినప్పుడు, అవి కాథోడ్ కిరణాల విశ్లేషణ దిశకు వ్యతిరేక దిశలో విక్షేపణ చెందుతాయి.
iv) ప్రోటాన్ ఆవేశం +1.602 × 10-19 కూలుంబులు.
v) ప్రోటాన్ ద్రవ్యరాశి ఎలక్ట్రానుల ద్రవ్యరాశి కంటే 1837 రెట్లు ఎక్కువగా ఉంటుందని ప్రయోగాల వల్ల తెలిసింది. దీని విలువ 1.67 ×10-24 గ్రా.
vi) ధనధృవ కిరణాలు, రుణధృవ కిరణాలు పరస్పరం ఎదురెదురు దిశల్లో పయనిస్తాయి.
vii) ప్రోటాన్‌ల ప్రవర్తన అయస్కాంత లేదా విద్యుత్ క్షేత్రంలో ఎలక్ట్రాన్ లేదా కాథోడ్ కిరణాల ప్రవర్తనకు వ్యతిరేకంగా ఉంటుంది.


      

* హైడ్రోజన్ వాయువు నుంచి ఏర్పడిన అతిచిన్న, తేలికైన ధనావేశ అయాన్‌ను ప్రోటాన్ అంటారు. 1919లో ఈ ధనావేశిత కణాల లక్షణాలను కనుక్కున్న తర్వాత విద్యుత్‌పరంగా తటస్థంగా ఉండే కణాలు పరమాణువులో అనుఘటకంగా ఉండాల్సిన ఆవశ్యకతను గుర్తించారు. జేమ్స్ చాడ్విక్ 1932లో ఈ కణాలను ఆవిష్కరించాడు. పలుచటి బెరీలియం రేకును α  - కణాలతో తాడనం చేయగా, ప్రోటాన్ కంటే కొంచెం ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న తటస్థ కణాలు ఉద్గారమయ్యాయి. ఈ కణాలనే న్యూట్రాన్‌లని పిలిచాడు.


* పరమాణువులో ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్‌ల అమరికను పరమాణు నమూనా అంటారు. దీని గురించి జె.జె. థామ్సన్, రూథర్‌ఫర్డ్, నీల్స్‌బోర్, సోమర్‌ఫెల్డ్ శాస్త్రవేత్తలు కృషిచేశారు.
                                                  
                                                  
థామ్సన్ పరమాణు నమూనా (ప్లమ్‌పుడింగ్ నమూనా)
1898లో జె.జె.థామ్సన్ ఒక పరమాణు నమూనాను ప్రతిపాదించాడు. ఫ్రూట్‌బన్‌లో ఉండే ఎరుపు, ఆకుపచ్చ పండ్ల ముక్కల అమరికలా కనిపించడం వల్ల ఈ నమూనాని 'ప్లమ్‌పుడింగ్' నమూనాగా పిలుస్తారు. ఈ నమూనా ప్రకారం
i) పరమాణువు ధనావేశంతో నిండి ఉన్న ఒక గోళంగా ఉంటుంది. దీనిలో అక్కడక్కడా ఎలక్ట్రానులు పొదిగి ఉంటాయి.
ii) పరమాణు ద్రవ్యరాశి ఆ పరమాణువు మొత్తంలో ఒకేరీతిగా పంపిణీ అయి ఉంటుంది.
iii) మొత్తం ధనావేశం, రుణావేశం సమానంగా ఉండటం వల్ల పరమాణువు విద్యుత్‌పరంగా తటస్థంగా ఉంటుంది.
iv) థామ్సన్ నమూనాను పుచ్చకాయతో పోలుస్తాం. పుచ్చకాయలోని ఎర్రటి భాగంలా పరమాణువు అంతటా ధనావేశం. పుచ్చకాయలోని విస్తరించి ఉంటుంది. పుచ్చకాయలోని గింజల్లా ఎలక్ట్రాన్‌లు పొదిగి ఉంటాయి.
v) కాని ఈ అమరికను, శాస్త్రవేత్తలెవ్వరూ ఆమోదించలేదు. ఎలక్ట్రానులు, ప్రోటానులు పరస్పరం వ్యతిరేఖ ఆవేశాలను కలిగి ఉండటం వల్ల రెండింటినీ కలిపి ఉంచడం సాధ్యం కాని పని. ఇవి ఆకర్షణ బలాలకులోనవుతాయి. రెండు కణాలను వేర్వేరుగా రక్షణ కవచంతో ఉంచితే పై అమరిక వీలుకాదు.
* థామ్సన్ నమూనాను అతడి శిష్యుల్లో ఒకరైన రూథర్‌ఫర్డ్ పునఃసమీక్షించాడు. రూథర్‌ఫర్డ్ చేసిన 
α  - కణ విక్షేపణ ప్రయోగాలు థామ్సన్ నమూనాకు వ్యతిరేకమైన ఫలితాలను ఇచ్చాయి.

రూథర్‌ఫర్డ్ α - కణ విక్షేపణ ప్రయోగం
       ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ 1909లో (αα - ray scattering) ఆల్ఫాకిరణ విక్షేపణ ప్రయోగాలు నిర్వహించారు. (α) ఆల్ఫాకణం అనేది రెండు ప్రోటాన్‌లు, రెండు న్యూట్రాన్‌లు కలిపి ఉన్న కణం. α - కణంతో ఎలక్ట్రానులు ఉండవు. అందుకే దీన్ని రెండు ప్రమాణాలున్న ధనావేశం కలిగిన కణంగా పిలుస్తారు.
ii) α కణాల ఉద్గారిణి నుంచి వచ్చే α  కణాలకి నిర్దిష్టమైన శక్తి ఉంటుంది. ఉద్గారిణి నుంచి వచ్చే α కిరణాలను నేరుగా పల్చటి బంగారురేకుపై పడేలాచేశారు.
iii) పలుచటి బంగారురేకును ఒక శోధకం (detector) మధ్యలో ఉంచారు. ఈ శోధకానికి α  కణం తాకగానే చిన్న మెరుపు వస్తుంది. 
α  కణాల ఉద్గారిణి, బంగారురేకు, శోధకాల మొత్తం అమరికను ఒక గాలిలేని గది (Vaccum Chamber)లో ఉంచారు.
iv) α  - కిరణాలను పలుచటి బంగారురేకుపై పడేలా చేసినప్పుడు చాలావరకు ఆల్ఫాకణాలు పరమాణువులో నుంచి నేరుగా చొచ్చుకుపోయాయి. కొన్ని కణాలు కొంత విచలనాన్ని పొందాయి. కొన్ని కణాలు మాత్రం ఎక్కువ కోణాలతో విక్షేపణం చెందాయి. అతికొద్ది సంఖ్యలో కణాలు మాత్రం వచ్చిన దారివెంటే పరావర్తనం చెందాయి.
v) ప్రతి 20,000 కణాల్లో ఒక α  - కణం విక్షేపణం చెందడాన్ని గమనించారు. ఈ విక్షేపణాన్ని α  - కణాలు, బంగారు రేకులోని ప్రోటానుల మధ్య ఉన్న వికర్షణ బలాల ఫలితంగా నిర్ధారించారు.
vi) ప్రతి పరమాణువులోనూ ధనావేశాన్ని సంతరించుకున్న కేంద్రకం, పరమాణువు మధ్య భాగంలో ఉంటుందని ప్రతిపాదించారు. దీన్ని పరమాణు కేంద్రకం లేదా కేంద్రకంగా వ్యవహరిస్తారు.
vii) పరమాణు కేంద్రక వ్యాసార్ధం సుమారు 10-15 మీ. ఉంటుందని కనుక్కున్నారు.
viii) రూథర్‌ఫర్డ్ పరమాణు నమూనాను గ్రహమండల నమూనా లేదా రూథర్‌ఫర్డ్ గ్రహమండల నమూనాగా వ్యవహరిస్తారు.


రూథర్‌ఫర్డ్ పరమాణు కేంద్రక నమూనాలోని కొన్ని ముఖ్య ప్రతిపాదనలు
i) పరమాణువు ఘనపరిమాణంలో చాలావరకు ఖాళీగా ఉంటుంది.
ii) ధనావేశపూరిత కణాలు, భారాన్ని కలిగివున్న ఇతర కణాలన్నీ పరమాణువులోని మధ్యభాగంలో కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ మధ్య భాగాన్ని కేంద్రకం (Nucleus) అని అంటారు.
iii) కేంద్రకపు పరిమాణం పరమాణువుల పరిమాణం కంటే చాలా తక్కువ. కేంద్రకపు పరిమాణం 10-15 మీ. లేదా ఫెర్మీ అయితే, పరమాణువుల పరిమాణాన్ని 10-8 సెం.మీ. లేదా ఆంగ్‌స్ట్రామ్‌గా వ్యవహరిస్తారు.
iv) పరమాణువులోని ఎలక్ట్రాన్‌లన్నీ కేంద్రకం చుట్టూ అత్యధిక వేగంతో సంచరిస్తాయి. ఇలా సంచరించడం వల్ల అవి ప్రోటాన్, ఎలక్ట్రాన్‌ల మధ్య ఉద్భవించే విద్యుదాకర్షణ బలాలను తట్టుకుంటాయి.
v) పరమాణువులో రెండు రకాల బలాలు పనిచేస్తాయి.

Posted Date : 04-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

స్టడీ మెటీరియల్ : గ్రూప్ - డి

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌